ప్రజల వివరాలన్నీ అందులో నమోదు చేయాలి
రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశం
అధికారులు, ప్రజలకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో జనరల్ డైరీ పెట్టాలి.. అందులో రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలు(కక్షిదారులు) వివరాలన్నీ పేర్కొనాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. లాంటి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో వస్తున్న అవాంతరాలను తగ్గించేందుకు అధికారులు, ప్రజలకు హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలి.
ఈ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకు చేరేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరిదేవితోపాటు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్‌వీ.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకరిద్దరు అధికారులు కాదు.. అసలు రెవెన్యూ వ్యవస్థలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.
కోర్టులో విచారణ ముగిసినా మళ్లీ ఆదేశాలు తీసుకురావాలంటూ వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవారు కొద్దోగొప్పో భూమి కొనుగోలు చేద్దామని అనుకుంటే రిజిస్ట్రేషన్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు బాధితులకు కోర్టు ఫీజులు అదనంగా మారాయని స్పష్టం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకున్నా పిటిషనర్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద అంబర్‌పేట్ సబ్ రిజిస్ట్రార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది.
అధికారులకు మార్గదర్శకాలు
⇒ ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రజలు సంప్రదించినప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం–1908, ఇండియన్ స్టాంప్ ప్రకారం అన్ని చట్టప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయాలి. లేనిపక్షంలో తిరస్కరించాలి. ఇదే విషయాన్ని వారికి తెలియజేయాలి. తిరస్కరణ మౌఖికంగా ఉండకూడదు. లిఖితపూర్వక పత్రం ఇవ్వాలి.
⇒ ఒకవేళ రిజిస్ట్రేషన్ పత్రాలు తిరస్కరిస్తే అప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వాపసు ప్రక్రియ సరళీకృతం చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించే ముందు ప్రజలు వాపసు విధానాన్ని కూడా తెలుసుకోవాలి.
⇒ కోర్టు ఆదేశాలు లేనప్పుడు, ఉత్తర్వులు ఎత్తివేసినప్పుడు, అప్పీల్ పెండింగ్ లేనప్పుడు.. మళ్లీ దానిపై న్యాయస్థానం ఆదేశాలు కావాలని ప్రజలను ఒత్తిడి చేయకుండా సబ్ రిజిస్ట్రార్‌లకు ఉన్నతాధికారులు సర్క్యులర్లు, నోటిఫికేషన్‌లు జారీ చేయాలి. ∙తీర్పు వెల్లడించిన, కొట్టివేసిన పిటిషన్లలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రిజిస్టరింగ్ అథారిటీలు తిరస్కరించకూడదు.
⇒ ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వాచ్ రిజిస్టర్/జనరల్ డైరీ నిర్వహించాలి. ప్రజల తమ పత్రాల రిజిస్ట్రేషన్‌కు వచి్చన తేదీ, సమయాన్ని అందులో పేర్కొనాలి. వారు ఎందుకు వచ్చారో కూడా నమోదు చేయాలి. అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం, తప్పులు జరగకుండా ఇది తోడ్పడుతుంది.
⇒ కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా సబ్ రిజిస్ట్రార్, మండల్ రెవెన్యూ అధికారి ఉత్తర్వులు జారీ చేయాలి. ∙వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుల్లో న్యాయస్థానాలు ఇచి్చన మార్గదర్శకాలను రిజిస్టరింగ్ అధికారులు పాటించాలి.
ప్రజల(కక్షిదారులు)కు సూచనలు..
⇒ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్ట్రర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలు నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు.. రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని భవిష్యత్‌లో అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది.
⇒ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి. ∙ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే చట్టం ప్రకారం ఆ జాబితా నుంచి ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నేరుగా కోర్టును ఆశ్రయించకూడదు.
⇒ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమరి్పంచిన పత్రాలు ఆ చట్టంలోని నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment