
కౌంటర్ దాఖలు చేయాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ వరకు ప్రభుత్వం చేపడుతున్న మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై వైఖరి చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూడు వారాలు సమయం కావాలని ప్రతివాదుల తరఫు న్యాయవాది కోరడంతో సమ్మతిస్తూ విచారణ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. సర్కార్ దాఖలు చేసే కౌంటర్‌పై ఆలోగా పిటిషనర్ రిజాయిండర్ కూడా వేయాలని స్పష్టం చేసింది.
ఎంజీబీఎస్ నుంచి శంషాబాద్ వరకు మెట్రో రైలు విస్తరణ పనులను ఆపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు మహమ్మద్ రహీంఖాన్ ఈ పిల్ దాఖలు చేశారు. మెట్రో విస్తరణతో పరిసర ప్రాంతాల్లోని చరిత్రాత్మక కట్టడాలపై ప్రభావం పడుతుందని, చార్మినార్, ఫలక్‌నుమా, దారుల్‌షిఫా లాంటి కట్టడాలకు ప్రమాదం వాటిల్లనుందన్నారు.
చరిత్రాత్మక కట్టడాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, దీనిపై పురావస్తు శాఖ, పర్యావరణ, ఆయారంగ నిపుణులతో అధ్యయనం చేయించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఏసీజే జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుక యారా ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని సర్కార్ తరఫు న్యాయవాది కోరడంతో అనుమతించిన ధర్మాసనం విచారణ వాయిదా వేసింది.