వారంలోనే పాస్‌పోర్ట్‌ స్లాట్‌! | makes issue of passports faster: RPO Snehaja | Sakshi
Sakshi News home page

వారంలోనే పాస్‌పోర్ట్‌ స్లాట్‌!

Published Sat, Jan 4 2025 6:16 AM | Last Updated on Sat, Jan 4 2025 6:16 AM

makes issue of passports faster: RPO Snehaja

విలేకరుల భేటీలో వెల్లడించిన ఆర్‌పీఓ స్నేహజ 

ఆదిలాబాద్, కామారెడ్డిలో రిజిస్ట్రేషన్ చేసుకొన్నమరుసటిరోజే స్లాట్‌.. 

మహిళల ఇంటిపేరు మార్పునకు అడ్రస్‌ ప్రూఫ్‌ చాలు

సాక్షి, హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకొన్న తర్వాత వారం రోజులలోపే స్లాట్‌ లభించేలా చర్యలు చేపట్టామని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి (ఆర్‌పీఓ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ చే సుకొన్న మరుసటి రోజే స్లాట్‌ లభిస్తోందని చెప్పా రు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కోవిడ్‌ అనంతరం పాస్‌పోర్ట్‌ స్లాట్లకు భారీగా డిమాండ్‌ పెరిగింది. 

దీంతో స్లాట్‌ కోసం 30 నుంచి 40 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం దీనిని గరిష్టంగా 8 పని దినాలకు తగ్గించాం. 2025లో వారం రోజుల్లోనే స్లాట్‌ దొరికేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’అని వివరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన పాస్‌పోర్ట్‌ ఎన్వలప్‌ కవర్‌ను ఆమె ఆవిష్కరించారు.  

ఆదిలాబాద్, కామారెడ్డిలో మరుసటి రోజే స్లాట్‌.. 
ప్రస్తుతం  రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాలు (పీఎస్‌కే), 14  పోస్టాఫీస్‌  పాస్‌పోర్ట్‌  సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ఉన్నాయని స్నేహజ తెలిపారు. పీఓపీఎస్‌కేల్లోనూ వారం రోజుల్లోనే అపాయింట్‌మెంట్‌ దొరుకుతోందని చెప్పారు. ఆదిలాబాద్,  కామారెడ్డి  కేంద్రాల్లో   రిజిస్ట్రేషన్‌  చేసుకున్న మరుసటి రోజే స్లాట్‌ లభిస్తోందని వెల్లడించారు.   పాస్‌పోర్ట్‌   కోసం  దరఖాస్తు చేసిన తర్వాత   పోలీసు వెరిఫికేషన్‌కు పట్టే సమయాన్ని మినహాయించి తత్కాల్‌ పాస్‌పోర్టును ఒకటి నుంచి మూడు పని దినాలు, సాధారణ పాస్‌పోర్టును ఐదు నుంచి ఏడు పనిదినాల్లో జారీ చేస్తున్నాం’అని వివరించారు.

సందేహాల నివృత్తికి వాట్సాప్‌ నంబర్‌
దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించడానికి సికింద్రాబాద్‌లోని రీజినల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయంలో పబ్లిక్‌ డేలు నిర్వహిస్తున్నామని స్నేహజ తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అపాయింట్‌మెంట్‌ లేకుండానే నేరుగా రావచ్చని, ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ తీసుకున్నవాళ్లు సోమ, మంగళ, శుక్రవారాల్లో రావాలని సూచించారు. ఈ రెండు రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎక్స్, వాట్సాప్, ఫోన్‌కాల్స్‌ ద్వారానూ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ‘81214 01532’వాట్సాప్‌ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్‌ వ్యాన్‌ ద్వారా పాస్‌పోర్ట్‌ సేవలు అందిస్తామని తెలిపారు.  

రెండేళ్లకు మించి శిక్షపడితే పాస్‌పోర్ట్‌ ఇవ్వం..
పాస్‌పోర్ట్‌ పొందడానికి కనిష్ట, గరిష్ట వయో పరిమితులు లేవని స్నేహజ తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో ప్రతికూల అంశాలు తెలిసినా, దరఖాస్తుదారుడికి ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినా పాస్‌పోర్ట్‌ జారీ చేయబోమని చెప్పారు. అలాంటివారికి కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని పేర్కొన్నారు. సింగిల్‌ పేరెంట్‌ మైనర్ల విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి అనుమతి చాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

‘పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్న వాళ్లు ఆ దరఖాస్తుతో ఎఫ్‌ఐఆర్‌ కాపీని జత చేయక్కర్లేదు. మీ–సేవా కేంద్రం నుంచి తీసుకున్న ‘లాస్ట్‌’ సర్టీఫికెట్‌ ఇస్తే సరిపోతుంది. వివాహానంతరం ఇంటి పేరు మారిన మహిళలు తాజా అడ్రస్‌ ప్రూఫ్‌తో డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మ్యారేజ్‌ సర్టీఫికెట్‌ తప్పనిసరి కాదు’అని పేర్కొన్నారు. బ్రాంచ్‌ సెక్రటేరియేట్‌ నుంచి గత ఏడాది 1,400 సర్టీఫికెట్ల అటెస్టేషన్‌ లేదా అపోస్టల్‌ చేశామని వివరించారు.

‘పాస్‌పోర్టు’ సమస్యలు..సందేహాలా?
89777 94588 నంబర్‌కు వాట్సాప్‌ చేయండి..  
పాస్‌పోర్ట్‌ ఆఫీసర్‌ స్నేహజ సమాధానాలిస్తారు

పాస్‌పోర్టు కోసమే కాకుండా.. అది వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు.  పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్‌కే), పోస్టాఫీస్‌ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే), వెబ్‌సైట్‌ లాంటివి ఉన్నా సామాన్యుడికి ఇప్పటికీ అనేక సందేహాలు, సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలు అర్థంకాక ఇప్పటికీ పలువురు దళారులను ఆశ్రయించి  నష్టపోతున్నారు. కేవలం రీజనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసే పాస్‌పోర్టు విషయంలోనే కాదు.. 

దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రాంచ్‌ సెక్రటేరియెట్‌ అందించే అటెస్టేష¯న్‌ అండ్‌ అపోస్టల్‌ సేవల పైనా పలు సందేహాలు ఉంటున్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ముందుకు వచ్చింది ‘మీతో సాక్షి’. మీ వివరాలు, సమస్య, సందేహాన్ని 89777–94588 నంబర్‌కు టెక్ట్స్, వాయిస్‌ మెసేజ్‌ల రూపంలో వాట్సాప్‌ చేయండి. ‘మీతో సాక్షి’ వీటిని రీజనల్‌ పాస్‌పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ దృష్టికి తీసుకెళుతుంది. మీ సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యలు, సందేహాలు వెంటనే తెలియజేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement