
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం చరి త్రాత్మకమైన కులగణన పూర్తి చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. కులగణనను శాస్త్రీయంగా పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభు త్వాన్ని అభినందించాల్సింది పోయి... ప్రతిపక్షాలు దిగజారుడుతనంతో విమర్శలు కొనసాగించడం బాధాకరం.
జనాభాలో సగంపైగా ఉన్న బీసీలకు సమ న్యాయం జరగాలనే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... తొలుత తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిపై ముందడుగు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 నవంబర్‌లో కామారెడ్డి బహిరంగ సభలోకాంగ్రెస్ ‘బీసీ డిక్లరేషన్’ (BC Declaration) ప్రకటించింది. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో కులగణన చేపడుతామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన అంశాన్ని చేపట్టి పూర్తి చేసింది.
రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉందని నిర్ధారణ కావడంతో బీసీలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపుల్ల లేస్తున్నాయి. గతంలో బీఆర్‌ఎస్ చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను కేసీఆర్ సర్కార్ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందంటే, తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా శాసనం చేసేందుకు అనేక చట్టపరమైన ప్రక్రియలుంటాయి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో కాలయాపన జరగకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రక టించినట్టు బీఆర్‌ఎస్, బీజేపీలు కూడా 42 శాతం బీసీలకు టికెట్లిస్తాయా అని ప్రశ్నిస్తే ఆ పార్టీలు సరైన రీతిలో స్పందించకుండా అసలు విషయాన్ని దారి మళ్లిస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించింది బీఆర్‌ఎస్. ఇప్పుడు అది నిరాధార ఆరోపణలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJ)P)దేశంలో జనగణన చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. తక్షణమే జనగణన నిర్వహించి, అందులో భాగంగా కులగణన కూడా చేపట్టి జనాభా ప్రాతిపదికన సంబంధిత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నా ఎన్‌డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనుశాస్త్ర ధర్మాన్ని అనుసరిస్తూ, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌నే అవమా నిస్తున్న బీజేపీ నుండి సామాజిక న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది. బీజేపీవారు దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ కోరుతుంటే వారి కులాలను ప్రస్తావించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ముస్లింలను బీసీ సామాజికవర్గంలో ఎలా చేరుస్తారనీ, వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనీ బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలలో వెనుకబడిన వారు లేరా? బీజేపీ వారి మోడల్‌గా చెప్పుకునే గుజరాత్‌లో ఓబీసీ ముస్లింలుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదా? తెలంగాణ ప్రభుత్వం కులగణన నివేదిక అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఈ అంశాన్ని స్వాగతిస్తుంటే, ఆ పార్టీలో మరికొందరు కులగణన తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించడడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం.
బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను విఫలం చేయడానికి ప్రతి పక్షాలు పన్నుతున్న కుట్రలను వెనుకబడిన తరగతుల ప్రజలు గమనించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పించ గలరా? ఇందుకోసం బీఆర్‌ఎస్ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి.
2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ... ఎన్నికల సమయానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజ య్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఓసీ వర్గీయుడైన కిషన్‌రెడ్డిని నియమించింది. తెలంగాణకు ముఖ్య మంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అందలమెక్కారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక న్యాయం పాటిస్తూ కాంగ్రెస్... బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీ లకు కాంగ్రెస్సే అభయహస్తం ఇవ్వగలదని కుల గణనతో మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాలు కీలకమైన విషయాలను పక్కదారి పట్టిస్తే రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గం సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం.
-బి. మహేశ్ కుమార్ గౌడ్
వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు
Comments
Please login to add a commentAdd a comment