cast
-
శవానికి కుల బహిష్కరణ
దుబ్బాకరూరల్: తమ సామాజిక వర్గానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయి నా, ఆ గ్రామానికి చెందిన కులస్తులెవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. భూ గొడవల నేపథ్యంలో వారంతా దూరంగా ఉండగా, గ్రామస్తులు అంత్యక్రియలు జరిపించారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్‌కు చెందిన బండమీది సాయిలు మాదిగ (71) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు క్షమాపణ చెబితేనే అంత్యక్రియల్లో పాల్గొంటామని కులస్తులు తేల్చి చెప్పారు. భూమి విషయమై కొన్నేళ్లుగా గొడవలు: సాయిలు ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం, నాలుగు గుంటల సాగు భూమి ఉంది. ఈ భూమి విషయమై కొన్నేళ్ల నుంచి సాయిలుకు, తన సామాజికవర్గానికి చెందిన వారితో గొడవలు జరుగుతున్నాయి. అదే కులానికి చెందిన మరో వ్యక్తికి భూమి ఇవ్వాలని కులస్తులు పంచాయితీ పెట్టి సాయిలుకు చెప్పారు. దానికి సాయిలు ససేమిరా అన్నాడు. కులం మాట ఎందుకు వినడం లేదని మూడేళ్ల కింద బహిష్కరణ చేయడంతోపాటు రూ.20వేలు జరిమానా విధించారు. మళ్లీ వారం రోజుల కిందట సాయిలు కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. వారి ఇంటికి వెళ్లినా రూ.5వేలు జరిమనా విధిస్తామని కులపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే సాయిలు చనిపోయాడు. రెండురోజులుగా కులస్తులు రాకపోవడంతో గ్రామస్తులంతా కలిసి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. సాయిలుకు కుమారులు లేకపోవడంతో చిన్న కూతురు తలకొరివి పెట్టింది. -
Lok Sabha Polls 2024: ఓటేసిన బాలీవుడ్ సెలబ్రిటీలు (ఫోటోలు)
-
బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
సాక్షి, అమరావతి : బడుగు, బలహీనవర్గాలంటే ఎంతటి ద్వేషమో టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా చాటుకున్నారు. తాను అధికారంలో ఉండగా బీసీలు న్యాయమూర్తులు కాకుండా అడ్డుకున్న ఘనుడీయన. అత్యంత అవినీతిపరుడైన తన సామాజికవర్గానికి చెందిన ఏబీ వెంకటేశ్వర రావు వంటి అధికారులను అడ్డం పెట్టుకుని కేంద్ర భద్రతా చట్టాన్ని ఉల్లంఘిస్తూ మరీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిన బరితెగింపు చరిత్ర కూడా ఆయనదే. ప్రస్తుతం ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి తప్పదని తేటతెల్లం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు.అందుకే ఏకంగా అధికార వ్యవస్థను బ్లాక్ మెయిల్ చేయడం మొదలెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ అధికారులే లక్ష్యంగా కుట్రలకు తెగించారు. దాంతో పాటు రెడ్డి సామాజికవర్గం అధికారులపైనా కుట్రపూరితంగా దు్రష్పచారం చేస్తున్నారు. ఆ సామాజికవర్గాల అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చంద్రబాబు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పక్కా పన్నాగాన్ని అమలు చేస్తున్నారు. తద్వారా ఎన్నికల్లో తమ అక్రమాలకు అడ్డు లేకుండా చేసుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం.అందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాల అధికారులపై కొంతకాలంగా పెద్ద ఎత్తున దు్రష్పచారం చేస్తున్నారు. అవాస్తవాలు, అసత్య ఆరోపణలతో ఎన్నికల కమిషన్ (ఈసీ)కు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. బీజేపీతో జట్టు కట్టిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, తన వదిన దగ్గుబాటి పురందేశ్వరిని కూడా చంద్రబాబు తన పన్నాగంలో భాగస్వామిని చేసి, ఉమ్మడి కుట్రకు తెరతీశారు. టీడీపీ ఇచి్చన స్క్రిప్ట్ మేరకు పురందేశ్వరి కూడా అవే అసత్య ఆరోపణలతో ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు.చంద్రబాబు ఏ సామాజికవర్గాల అధికారులపై అసత్య ఆరోపణలు చేశారో.. సరిగ్గా ఆ అధికారులపైనే పురందేశ్వరి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆ సామాజికవర్గాలకు చెందిన అధికారుల నిబద్ధత, సమర్థతపై అపవాదులు వేస్తున్నారు. అనంతరం ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఆ బడుగు, బలహీనవర్గాలు, రెడ్డి సామాజికవర్గ అధికారులను హఠాత్తుగా బదిలీ చేయిస్తున్నారు. ఆ అధికారులను ఆత్మన్యూనతకు గురి చేసి వేధిస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలే సమిధలు చంద్రబాబు, పురందేశ్వరి ఈసీకి పదే పదే చేసిన ఫిర్యాదుల్లో పేర్కొన్న పేర్లలో 70% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనార్టీల అధికారులే. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అధికారులు 20% ఉన్నారు. టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ ఇప్పటివరకు బదిలీ చేసిన, చార్జ్ మెమోలు జారీ చేసినవారిలో ఏకంగా 90% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాలకు చెందినవారే ఉన్నారు. చంద్రబాబు కుట్రకు తలొగ్గి ఈసీ ఇప్పటివరకు 29 మంది అధికారులను బదిలీ చేసింది.వారిలో 14 మంది అంటే దాదాపు 50% బడుగు, బలహీనవర్గాలు, ముస్లిం మైనారీ్టలకు చెందిన అధికారులే. ఇక రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు 11 మందిని బదిలీ చేసింది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన మరో ముగ్గురికి చార్జ్ మెమోలు జారీ చేసింది. అంటే మొత్తం 14మందిపై చర్యలు తీసుకుంది. అంటే టీడీపీ కుట్రలతో బదిలీ అయినవారిలో ఎస్సీ, ఎస్టీ, మైనారీ్ట, రెడ్డి సామాజికవర్గాలకు చెందిన అధికారులే 90% ఉండటం విభ్రాంతి కలిగిస్తున్న వాస్తవం. బ్రాహ్మణ, బలిజ, క్షత్రియ సామాజికవర్గాలకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు.చంద్రబాబు ఒత్తిడితో ఈసీ బదిలీ చేసిన అధికారుల జాబితా ఇలా ఉంది.. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు ∙పి. రాజా బాబు (కలెక్టర్, కృష్ణా జిల్లా) ∙పీఎస్ గిరీషా (కలెక్టర్, అన్నమయ్య జిల్లా) ∙కల్పనా కుమారి (పీవో, సీతంపేట ఐటీడీయే, పార్వతీపురం మన్యం జిల్లా) ∙జి. పాలరాజు (ఐజీ, గుంటూరు) ∙కేకేఎన్ అన్బురాజన్ (ఎస్పీ, అనంతపురం జిల్లా) ∙పి. జాషువా (ఎస్పీ, చిత్తూరు జిల్లా) ∙పి.శరత్ బాబు (సీఐ, మాచర్ల) ∙వంగా శ్రీహరి (ఎస్సై, వెల్దుర్తి) ఎస్టీ సామాజికవర్గానికి చెందినవారు ∙జి. లక్ష్మీశా (కలెక్టర్, తిరుపతి జిల్లా) ∙ఇ. మారుతి (ఎస్సై, సదుం, చిత్తూరు జిల్లా) బీసీ సామాజికవర్గానికి చెందినవారు ∙టి. కాంతి రాణా (పోలీస్ కమిషనర్, విజయవాడ) ∙సీహెచ్. అంజు యాదవ్ (సీఐ, శ్రీకాళహస్తి) ∙చిన మల్లయ్య (సీఐ, కారంపూడి) ముస్లిం మైనారీ్టలు ∙మహబూబ్ బాషా (డీఎస్పీ, రాయచోటి)రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు ∙కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి (డీజీపీ) ∙ఆర్.ఎన్. అమ్మిరెడ్డి (డీఐజీ, అనంతపురం) ∙ఎం. గౌతమి (కలెక్టర్, అనంతపురం జిల్లా) ∙కె. తిరుమలేశ్వరరెడ్డి (ఎస్పీ, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా) ∙పి. పరమేశ్వర్‌రెడ్డి (ఎస్పీ, ప్రకాశం జిల్లా) ∙వై. రవిశంకర్‌రెడ్డి (ఎస్పీ, పల్నాడు జిల్లా) ∙రిశాంత్‌రెడ్డి (ఎస్పీ, ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక విభాగం) ∙వీర రాఘవరెడ్డి (డీఎస్పీ, అనంతపురం) ∙సి. మహేశ్వర్‌రెడ్డి (సీఐ, పలమనేరు, చిత్తూరు జిల్లా) ∙పి.జగన్మోహన్రెడ్డి (సీఐ, తిరుమల) ∙జి. అమర్నాథ్రెడ్డి (సీఐ, తిరుమల) ఈసీ చార్జ్‌మెమో జారీ చేసిన అధికారులు ∙కె. రఘువీరారెడ్డి (ఎస్పీ, నంద్యాల) ∙ఎన్. రవీంద్రనాథ్‌రెడ్డి (డీఎస్పీ, నంద్యాల) ∙కె. రాజారెడ్డి (సీఐ, నంద్యాల టూటౌన్) బదిలీ అయిన ఇతర ఓసీ సామాజికవర్గాల వారు ∙పీఎస్ఆర్ ఆంజనేయులు (డీజీ, ఇంటెలిజెన్స్) (బ్రాహ్మణ) ∙ఆర్. వినోద్ (ఎస్సై, తిరుమల) (క్షత్రియ) ∙ బీవీ శ్రీనివాసులు (ఎస్సై, తిరుమల), (బలిజ) -
సామాజిక విప్లవానికి నాంది కులగణన
గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ, శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాల న్నింటినీ కూడితే సులువుగా 300 దాటు తుంది! ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతోంది. సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి ఉంటుంది. మన దేశంలో 5 వేలకు మించి కులాలున్నాయని అంచనా. కులాలతోనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర ఏర్పడుతోంది. వీటిని అర్థం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామా జిక విప్లవానికి కులగణన నాంది పలుకుతుంది. ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి 1న ప్రధాని మొరార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమిషన్’ను నియమించారు. స్వల్ప కాలం బిహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బిందేశ్వరీ ప్రసాద్ మండల్‌ను చైర్మన్‌గా నియమించడంతో దానికి ‘మండల్ కమిషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన తరువాత 1980 డిసెంబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బీపీ మండల్ తన నివేదికను సమ ర్పిస్తూ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు. ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమిషన్ ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించమనలేదు. బ్రిటిష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బీసీల జనాభా 54 శాతం ఉంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబీసీ రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని వీపీ సింగ్ మండల్ కమిషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచ బోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయ కుడైన వీపీ సింగ్‌కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్టీ రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్థిగా రంగంలో దిగి, బయటి నుండి బీజేపీ ఇచ్చిన మద్దతుతో ఆయన ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు. అప్పట్లో బీజేపీకి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఓబీసీలకు రిజర్వే షన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసీలు పార్టీకి దూరం అయి పోతారని ఆ పార్టీ భయపడింది. అప్పటి బీజేపీ అధ్యక్షులు ఎల్కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి రెండు లక్ష్యాలు న్నాయి. మొదటిది; మండల్ కమిషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవ డానికి ఏకంగా వీపీ సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్–కమండల్’ అని పిలిచేవారు. బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. రెండేళ్ల తరువాత 1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించ రాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించా లనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. బ్రిటిష్ పాలకులు భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల, మత స్వభావాలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరముందని గుర్తించారు. 1881లో తొలి సారిగా జనగణన నిర్వహించారు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ నాయకత్వాన ఏర్పడిన కమిషన్ దేశంలో కులగణన నిర్వహించింది. అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. కానీ, కులగణన జరగలేదు. స్వతంత్ర భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు దక్కుతుంది. దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. బిహార్‌లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో 7 వందలకు పైగా కులాలున్నట్టు అంచనా. ఆ లెక్కన ఏపీ కులగణన ప్రాజెక్టు బిహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. రెండేళ్ళ క్రితం బిహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టీ మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానం కాదని 2021 జులై 20న పార్లమెంటులో ఒక విస్పష్ట ప్రకటన చేశారు. బీజేపీది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు, కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళ నాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ లో ‘బీసీ సమ్మేళనం’లో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళీ వచ్చి ‘మాదిగ సమ్మేళనం’లో పాల్గొన్నారు. కానీ, విధాన పరంగా వారు కులగణనకు వ్యతిరేకం. నిజానికి సామాజిక న్యాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. ఇప్పుడు కుల గణన ‘ఇండియా కూటమి’కి కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ ‘జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్’, ‘జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ’ (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. ఏపీలో తలపెట్టనున్న కులగణన విజయవంతం కావడం రాజకీయంగా వైసీపీ కన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. - డానీ వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు -
ఓబీసీ సర్టిఫికెట్ దుమారం: శరద్ పవార్ కౌంటర్
Sharad Pawar నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన వ్యక్తి అంటూ ఒక సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శరద్‌పవార్ స్పందించారు. కులాన్ని దాచుకోవాల్సిన అవసరం తనకు లేదని, కులాన్ని అడ్డం పెట్టుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని మంగళవారం ప్రకటించారు. తన కులం ఏంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాను ఏనాడూ కులం ఆధారంగా రాజకీయాలు చేయలేదు.. చేయను కూడా అని పవార్ ప్రకటించారు. కానీ సమాజంలోని సమస్యలను పరిష్కారం తాను చేయాల్సింది చేస్తానని పవార్ వెల్లడించారు. ఓబీసీ సామాజికవర్గం పట్ల తనకు పూర్తి గౌరవం ఉందని, అయితే తాను పుట్టిన కులాన్ని దాచిపెట్టడం తనకు ఇష్టం ఉండదన్నారు. అయితే మరాఠా కమ్యూనిటీ కోటాపై మాట్లాడుతూ, రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పరిధిలోని దన్నారు. మరాఠాలకు రిజర్వేషన్లపై యువత సెంటిమెంట్ చాలా తీవ్రంగా ఉందని కానీ ఈ విషయంలో నిర్ణయాధికారం మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. ఎన్సీపీ ఎంపీ, పవార్ కుమార్తె సుప్రియా సూలే ఇది నకిలీదని ఇప్పటికే దీన్ని కొట్టిపారేశారు. శరద్ పవార్ 10వ తరగతి చదువుతున్నప్పుడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు ఉండేవా ప్రజలు ఆలోచించాలని ఆమె కోరారు. ఇది ఫేక్ సర్టిఫికెట్ అని శరద్ పవార్ మద్దతుదారు వికాస్ పసల్కర్ గట్టిగా వాదించారు. అసలు శరద్ పవార్ అలాంటి సర్టిఫికెట్ ఏదీ తీసుకోలేదని ఆయన పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర అని మండిపడ్డారు. నాగ్ పూర్ కేంద్రంగా ఇలా జరుగుతోందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఇటీవల రాష్ట్రమంతటా తీవ్ర హింసకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మరాఠా సంఘం పెద్దఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం వివాదానికి దారి తీసింది. -
యూదుల వివాహాలు ఎలా జరుగుతాయి? ఏడు అడుగులు దేనికి చిహ్నం?
యూదు సంస్కృతిలో వివాహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. జీవితంలో వివాహమనేది తప్పనిసరిగా జరగాలని యూదులు భావిస్తారు. ఇతర మతాలలోని మాదిరిగానే వివాహాన్ని పవిత్ర బంధంతో కూడిన ఒప్పందంగా పరిగణిస్తారు. 18, 19వ శతాబ్దాల మధ్య కాలంలో యూదుల మతం, సంస్కృతి పరిఢవిల్లింది. వివాహ ఆచారాలు కూడా ఏర్పడ్డాయి. జుడాయిజంలో వివాహం అనేది ఒక పవిత్ర ఒప్పందం. దీనికి శుభ సమయం అంటూ ఉండదు. సాధారణంగా వివాహాలను ఆదివారం నిర్వహిస్తుంటారు. సన్నిహితుల సమక్షంలో వధువు- వరుడు తమ వివాహానికి సమ్మతి తెలియజేస్తారు. జీవితాంతం ఒకరికి ఒకరుగా కలిసి జీవిస్తామని వాగ్దానం చేస్తారు. యూదుల సంస్కృతిలో వివాహాన్ని కిద్దుషిన్ అంటారు. వివాహ వేడుకకు ముందు యూదులు ఉంగరాన్ని ధరించే వేడుకను నిర్వహిస్తారు. దీనిని హిందూ, ఇతర మతాలలో నిశ్చితార్థం అని అంటారు. యూదులలో వివాహానికి ముందు వధూవరులు కలుసుకునే సంప్రదాయాన్ని ‘యోమ్ కిప్పూర్ విడ్డూయ్’ అని అంటారు. దీనిలో అబ్బాయి, అమ్మాయి కలుసుకుంటారు. ఒప్పుకోలు ప్రార్థనలో పాల్గొంటారు. గత జీవితంలోని అన్ని తప్పులకు క్షమించాలని పరస్పరం వేడుకుంటారు. ఒకరికొకరు నమ్మకంగా మెలుగుతామని ప్రమాణం చేస్తారు. యూదుల వివాహాల్లో చుప్పా(వివాహ వేదిక)కు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. చుప్పాలో వధూవరులు ఏడు ప్రదక్షిణలు చేస్తారు. అలాగే ఆచారం ప్రకారం జరిగే తంతు ఉంటుంది. వధూవరులు ఏడు అడుగులు వేయడం అనేదాన్ని పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. వధూవరులు ఉంగరాలు మార్చుకుంటారు. వరుడు.. వధువు కుడి చూపుడు వేలుకు ఉంగరాన్ని అలంకరిస్తాడు. తరువాత వధూవరులు అందరి సమక్షంలో తాము జీవితాంతం కలసి ఉంటామని ప్రమాణం చేస్తారు. అలాగే వధూవరుల వివాహ ఒప్పందాన్ని ఆహ్వానితుల సమక్షంలో చదువుతారు. వేడుక ముగింపులో వరుడు ఒక గాజు గ్లానుసు పగలగొట్టి, దానిని తన కుడి పాదంతో చూర్ణం చేస్తాడు. ఈ సమయంలో అతిథులు ‘మజెల్ తోవ్’ అని అరుస్తారు. ఇది ఇది హీబ్రూలో శుభాకాంక్షలు తెలియజేయడాన్ని సూచిస్తుంది. దీని తరువాత వరునికి ఒక చిన్న కప్పులో వైన్ అందిస్తారు. ఇదేవిధంగా వధువు కూడా వైన్ తాగుతుంది. వారం రోజుల తర్వాత అతిథులు, బంధువులు కలిసి వధూవరులకు ఘనమైన విందు ఇస్తారు. ఈ సందర్భంగా ఒక ప్రత్యేకమైన సంప్రదాయ నృత్యం కూడా చేస్తారు. ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో విషాదం -
సామాజిక సంబంధాలు బలపడేలా జగనన్న కాలనీలు
మాకు గతంలో వేరుగా కాలనీలు ఉండేవి. అప్పుడు అవమానంగా భావించేవాళ్లం. కానీ ఇక్కడ అలా కాదు. మాకు ఇచ్చిన ఇళ్ల పట్టాల ఆధారంగా నెంబర్ల ప్రకారం డ్రా తీశారు. అందులో మాకు ఏ ప్లాటు వస్తే అదే కేటాయించారు. కులాలు, మతాల ప్రస్తావన లేకుండా అందరికీ కలిపి ఇళ్లు ఇచ్చారు. దీనివల్ల మాకు సంతోషంగా ఉంది. ఎస్సీలమనే పేరుతో దూరంగా పెట్టే విధానం తొలగించడం సంతోషం.. :::జగనన్న కాలనీలోని ఓ మహిళా లబ్ధిదారు దేశంలో దాదాపుగా పల్లెటూళ్లలో దళితులుండే కాలనీలన్నీ ఊరికి ఓ చివరలో ఉంటాయి. అయితే వివిధ స్కీమ్‌ల పేరిట.. ఎస్సీల కోసం ఊరి బయటే ఇళ్ల నిర్మాణాలు చేపడుతుంటాయి ప్రభుత్వాలు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో అలా కాదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణం.. సామాజిక సంబంధాల్లో మార్పునకు మార్గాన్ని ఏర్పరుస్తోంది. ఇటీవల కాకినాడ సామర్లకోటలో స్వయంగా సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభమైన జగనన్న కాలనీలను ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ పరిశీలించి ఒక కథనం ఇచ్చింది. సామర్లకోట కాలనీలో 2020లో ఇళ్ల పట్టాలు కేటాయించగా, ప్రస్తుతం సుమారు 60 శాతం మంది తమ ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. దాదాపుగా 90 కుటుంబాలు అక్కడే నివాసం కూడా ఉంటున్నాయి కూడా. అయితే.. ఇళ్ల కేటాయింపులో కులాల ప్రస్తావన లేకుండా అన్ని కులాల వారికి ఒకే చోట కేటాయించారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, కాపు, కమ్మ కులస్థులు కూడా పక్క పక్కనే ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుని నివాసాలు కూడా ఉంటున్నారు. తనకు పెళ్లయిన 17 ఏళ్లకు సొంత ఇంటి కల తీరిందని, ఇన్నాళ్లుగా ఎస్సీ కాలనీల్లోనే అద్దె ఇళ్లల్లో ఉండేవారమని ఆయన బీబీసీకి తెలిపారు. ప్రభుత్వం స్థలం ఇచ్చినప్పటికీ ఇంటి నిర్మాణం కోసం తాము సొంతంగా రూ. 13 లక్షల వరకూ వెచ్చించామని సమర్పణ రాజు అన్నారు. జగనన్న కాలనీలు మాత్రం వేరు.. పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఇళ్ల పంపిణీలో కులాల ప్రస్తావన లేకుండా చాలాకాలంగానే అమలు చేస్తున్నారు. వాంబే, రాజీవ్ గృహకల్ప వంటి పథకాల్లో సైతం అన్ని కులాల వారికీ కలిపి ఇళ్లను కేటాయించారు. కానీ, గ్రామాల్లో పరిస్థితుల దృష్ట్యా.. అలాంటి పనులు చేయట్లేదు. కానీ, జగనన్న కాలనీలు మాత్రం వేరు పరిస్థితులకు వేదికైంది. కులాల బేధాలు లేకుండా అందరూ కలిసి ఉండేలా కాలనీ ఇవ్వడం చాలా సంతోషం కలిగిస్తోందని పలువురు అంటున్నారు. పెళ్లయిన పాతికేళ్ల తర్వాత.. ఇన్నాళ్లకు మాకు ఓ ఇల్లు వచ్చింది. కులాల గురించి పట్టించుకోలేదు. ఇల్లు లేదని దరఖాస్తు పెట్టుకుంటే అన్ని కులాల వారితో సమానంగా మాకు కూడా స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. మా ఎదురుగా కమ్మవారున్నారు. మా పక్కన తూర్పు కాపులున్నారు. అంతా కలిసే ఉంటున్నాం" అని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం పెద తాడేపల్లి జగనన్నకాలనీకి చెందిన గుండుగోలు అరుణ అంటున్నారు. గతంలో ఎస్సీలు, ఇతర కులాల మధ్య కుల పరమైన విబేధాలు వివాదాలుగా మారిన చోట్ల కూడా ఇప్పుడు అందరికీ కలిపి కాలనీలు నిర్మాణం జరుగుతున్నాయి. జగనన్న ప్రభుత్వ ఉద్దేశం.. నిరుపేదలకు ఇళ్లు అందించడం. ఆ ఒక్క అర్హతతోనే లబ్ధిదారుల ఎంపిక, ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయి కూడా. ఎస్సీలు, ఇతర కులాలన్నీ కలిపి ఒకే కాలనీలో నివాసం ఉండడం వల్ల కులపరమైన వ్యత్యాసాలు కొంత వరకూ తగ్గుతాయనే అభిప్రాయం మేధావుల తరఫు నుంచి కూడా వ్యక్తం అవుతోంది. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కులవివక్ష వ్యతిరేక బిల్లు తిరస్కరణ
గత నెలలో కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించబడ్డ కులవివక్ష వ్యతిరేక బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ గెవిన్ న్యూసమ్ తిరస్కరించారు. ఇప్పటికే రాష్ట్రంలో కుల వివక్షను నిషేధిస్తూ చట్టాలున్నాయని ఇటువంటి సమయంలో మళ్లీ కులవివక్ష బిల్లు అవసరం లేదన్నారు. ఆ కారణంతోనే అసెంబ్లీలో ఆమోదించబడ్డ కులవివక్ష వ్యతిరేక బిల్లును తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. పౌరులు ఎవరు? ఎక్కడ నివసిస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే అంశాన్ని పక్కనపెట్టి కాలిఫోర్నియాలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేందుకు అర్హులని విశ్వసిస్తామని అని గెవిన్ పేర్కొన్నారు. ‘లింగం, జాతి, రంగు, మతం, జాతీయత పలు ఇతర అంశాల ఆధారంగా ఉండే అన్ని రకాల వివక్షను కాలిపోర్నియా ఇప్పటికే నిషేధించింది. కుల ఆధారిత వివక్షపై కూడా ఈ క్యాటగిరీల కింద నిషేధం ఉన్నది. కాబట్టి ఈ బిల్లు అవసరం లేదు’ అని అందులో స్పష్టం చేశారు. బిల్లును తిరస్కరిస్తూ గవర్నర్ న్యూసమ్ తీసుకొన్న నిర్ణయాన్ని ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ స్వాగతించింది. గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. కాలిఫోర్నియాలోని అట్టడుగు వర్గాల ప్రజల్ని వివక్షతు నుంచే కాపాడేందుకు వీలుగా ఈ బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ 50-3 మెజార్టీతో ఆమోద ముద్ర పడింది. కాగా, గవర్నర్ న్యూసమ్ ఈ బిల్లును తిరస్కరించడంతో వీగిపోయింది. -
చేతులతో మలం ఎత్తుతూ.. ఏటా ఎంతమంది మరణిస్తున్నారంటే..?
చేతులతో మలం ఎత్తే పనులు(Manual Scavenging)పై 10 ఏళ్ల క్రితమే నిషేధం విధించినప్పటికీ నేటికీ ఈ పనులను చాలామంది చేస్తూనే ఉన్నారు. మురుగు కాలువలు, సెప్టిక్‌ట్యాంకులు క్లీన్ చేసే నేపధ్యంలో ప్రతీయేటా చాలామంది కార్మికులు మృత్యువాత పడుతున్నారు. గడచిన ఐదేళ్లలో దేశంలో మ్తొతం 339 మంది కార్మికులు మృతిచెందారు. మురుగు కాలువలు శుభ్రంచేసే సమయంలో నేఫ్టీ డివైజెస్ ఉపయోగిస్తూ, పనులలోకి దిగాలనే అంశంపై చట్టం చేసినప్పటికీ, ఇటువంటి మరణాలు ఆగడం లేదు. మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనం ఇదే.. 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చేతులతో మాలాన్ని ఎత్తే పనులపై ఎంప్లాయిమెంట్ ప్రొహిబిషన్ అండ్ రిహాబిలిటేషన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇందులో దాని నిర్వచనాన్ని కూడా తెలియజేసింది. ఆ నిర్వచనం ప్రకారం ‘మాన్యువల్ స్కావెంజింగ్ పని చేయడానికి, మురికిని తీసి, శుభ్రం చేయడానికి, బహిరంగ కాలువలు లేదా గుంతలను శుభ్రం చేయడానికి, మానవ విసర్జనను సేకరించడానికి స్థానిక అధికారాన్ని పొందిన వ్యక్తిని ‘మాన్యువల్ స్కావెంజర్’ అని అంటారు. ఈ వ్యాధుల బారిన పడుతూ.. భారతదేశంలోని దశాబ్దాల నాటి కుల వ్యవస్థ కారణంగా ఇటువంటి పనులను కుల వ్యవస్థలోని అట్టడుగున ఉన్న వర్గాలవారే చేస్తూ వస్తున్నారు. మానవ మలమూత్రాలను చేతితో శుభ్రం చేయడం, వాటిని దూరంగా ఎక్కడికైనా విసిరేయడం వల్ల ఇలాంటి క్లీనింగ్ కార్మికులు కలరా, హెపటైటిస్, టీబీ, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గత ఐదేళ్లలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తూ 339 మంది మరణించారు. 2022లో 66 మంది, 2023లో 9 మంది మృత్యువాత పడ్డారని ప్రభుత్వం చెబుతోంది. చట్టంలో ఏముంది? మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని నిర్మూలించేందుకు 1993లో భారతదేశంలో మొదటిసారిగా చట్టాన్ని ఆమోదించారు. 2013లో మరోసారి దీనికి సవరణ చేశారు. మొదటిసారిగా రూపొందించిన చట్టంలో డ్రై లెట్రిన్లలో పనిచేయడాన్ని నిషేధించారు. 2013లో తీసుకొచ్చిన చట్టంలో మాన్యువల్ స్కావెంజింగ్ నిర్వచనాన్ని తెలియజేశారు. సెప్టిక్ ట్యాంక్‌లను మాన్యువల్‌గా శుభ్రపరచడంతో పాటు రైల్వే ట్రాక్‌లను శుభ్రపరచడం కూడా ఈ చట్టంలో చేర్చారు. రూ.10 లక్షల నష్టపరిహారం 2014, మార్చి 27న మాన్యువల్ స్కావెంజింగ్ సమస్యపై సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించింది. మురుగునీటి క్లీనర్ల సమస్యను కూడా ఈ చట్టంలో చేర్చింది. ఎందుకంటే మురుగునీటి క్లీనర్లు ఎటువంటి భద్రతా పరికరాలు లేకుండా మురుగు కాలువలను శుభ్రపరిచేటప్పుడు మానవ విసర్జనను కూడా వారు శుభ్రం చేయాల్సివస్తుంది. మురుగు కాలువలను శుభ్రం చేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు నిబంధన విధించింది. అయితే ఈ విధమైన నష్టపరిహారం, పునరావాసం కోసం ఎన్నో ఏళ్లుగా బాధిత కుటుంబాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిరావడం శోచనీయం. ఇది కూడా చదవండి: 76 శాతం థర్మల్ ప్లాంట్ల నుంచే -
బిహార్‌లో ‘కులగణన’.. తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు
పాట్నా: బిహార్‌లో కులాలవారీగా జనాభా గణన శనివారం ప్రారంభమైంది. ఈ లెక్కింపుని చరిత్రాత్మకమైనదిగా ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ అభివర్ణించారు. సమాజంలోని బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఈ ప్రక్రియతో శాస్త్రీయమైన డేటా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కులాల వారీగా జనగణన ప్రారంభమైన సందర్భంగా తేజస్వి యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ మహాఘటబంధన్‌లో అన్ని పార్టీలు కులజనగణనకు అనుకూలంగా ఉన్నాయని కేవలం బీజేపీ మాత్రమే విమర్శిస్తోందన్నారు. ‘‘రాష్ట్రంలో ఒక చరిత్రాత్మక ప్రక్రియ మొదలైంది. మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ భారీ కసరత్తుకి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన శాస్త్రీయమైన సమాచారం అందుబాటులోకి వచ్చి అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతాయి’’ అని చెప్పారు. బీజేపీ నిరుపేదల వ్యతిరేక పార్టీ కాబట్టి ఈ తరహా ప్రక్రియలకు మద్దతునివ్వదని విమర్శించారు. ఇదీ చదవండి: 4 ‘ఐ’లపైనే దృష్టి: మోదీ -
దళితులు శూద్రులే... విడగొట్టారంతే!
మానవ చరిత్రలో ఒక్క భారతదేశంలోనే అత్యంత హేయమైన అంటరానితనం వేళ్లూనుకొని ఉంది. దాదాపు అన్ని మతాలూ మనుషుల మధ్య ప్రేమను ప్రోదిచేసి, ఇహపరమైన జీవితాన్ని సమానత్వం, సౌభాతృత్వం వంటి గొప్ప ఆదర్శాలతో ఆనందమయం చేసుకోవడానికి మార్గాలు చూపించినవే. కానీ హిందు మతం మాత్రం అంటరానితనం ప్రాతిపదికన భారతీయ సమాజంలో అసమానతలకు బీజం వేసి కొనసాగేలా ఆంక్షలు విధించడం.. విడ్డూరమేకాదు అమానవీయం కూడా. ఒకప్పుడు శూద్రుల్లో భాగంగా ఉన్న దళితులను వారి నుంచి వేరుచేసిన వైనం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దళితులు చారిత్రక శూద్రులు. ఆర్యులకంటే ముందు క్రీ.పూ. 3000 నాటికే వ్యవ సాయ–పట్టణ నాగరికతను అభివృద్ధి చేసు కున్న హరప్పా ప్రజా సమూహంలో వారూ భాగంగా ఉన్నారు. కానీ ఇంత ఆధునిక రాజ్యాంగం కలిగిన ప్రజాస్వామ్య వ్యవస్థలో బతుకు తున్నప్పటికీ, ద్విజులతో పాటు శూద్రులు కూడా వారిని అంటరాని వారుగా చూస్తున్నారు. మనకు గొప్ప ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ఒక దళితుడనే ఎరుక భారతీయుల్లో కనిపిం చడం లేదు. అంబేడ్కర్ తనను తాను విముక్తి గావించుకొని, కులము, అంటరానితనం లేని ‘భారతదేశం అనే ఆలోచన’కు రూపమిచ్చాడు. అయితే ఇది సాకారం కావాలంటే, తమ సాటి ఉత్పాదక శూద్రులైన దళితులు తమ నుంచి ఎలా వెలికి గురయ్యారనే సంగతిని శూద్రులు అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఈ విభజన సృష్టించడం ద్వారా ద్విజులు.. తమ ఇరువురిపైనా ఎంత పటిష్టమైన నియంత్రణ కలిగి ఉన్నారో కూడా అర్థం చేసుకోవాలి. దళితులను శూద్రుల నుంచి వేరుచేసి వారికి ప్రతికూల ఆధ్యా త్మిక భావజాలాన్ని ఆపాదించింది బ్రాహ్మణవాదం. అది ఇప్పటికీ కొనసాగుతున్న ఒక మూఢ నమ్మకం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత మొత్తం జనాభాలో శూద్రులు 52 శాతం ఉన్నారు. దళితులు 16.6 శాతం ఉన్నారు. బ్రాహ్మణులు, బనియాలు, కాయస్థులు, ఖత్రీలు, వంటి వారందరూ కలిసి దాదాపు 5 శాతం మాత్రమే ఉన్నా. తమకన్నా అధిక సంఖ్యలో ఉన్న దళితులను వీరు ఆధునిక అంటరాని బానిసలను చేశారు. 2011 జనగణన ప్రకారం మొత్తం జనాభాలో హిందువులు 79.8 శాతం ఉన్నారు. శూద్రులు/ఓబీసీలు, ద్విజులు కచ్చితంగా ఎంతమంది ఉన్నారన్న సంగతి భవిష్యత్తులో కులాలవారీ జనాభా గణన చేసినప్పుడే తెలుస్తుంది. ప్రస్తుతం అనుకుంటున్న సంఖ్యలు గాలిలో రాతల లాంటివే. చర్రితను పరిశీలించినప్పుడు, కుల విభేదాలు భారత అభివృద్ధిపై చాలా ప్రతికూల ప్రభావం కలిగి ఉన్నాయనేది స్పష్టమవుతుంది. క్రీ.పూ. 1500 ప్రాంతంలో బ్రాహ్మ ణుల ఆధ్యాత్మిక గ్రంథంగా రుగ్వేదాన్ని రాయడంతో అసలు సమస్య ప్రారంభమైంది. ఆహార అనుత్పాదక వర్గాలవారు హరప్పా నాగరికత నిర్మాతలను శాశ్వతంగా తమ బానిసలుగా చేసుకున్నారు. వారు మొదట్లో ఈ బానిసలను అంటదగిన, అంటరానివారుగా; ఆ తర్వాత అనేక కులాలుగా విభజించారు. అంటరానితనం అనే సామాజిక జాడ్యం రుగ్వేదకాలంలో లేనే లేదనిపిస్తుంది. ఎక్కడా దాని ప్రస్తావన కనిపించదు. నాలుగు వర్ణాల్లో చిట్టచివరిదైన శూద్ర వర్ణం వారు మిగిలిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి అన్ని రకాల సేవలూ అందిస్తూ సేవించాలి. దీన్నిబట్టి అంటరానివారుగా భావిస్తున్న పంచములు మొదట్లో శూద్రులలో భాగంగా ఉండేవారని అర్థమవుతుంది. జంతు చర్మాలు, వాటితో తయారు చేసిన వస్తువులు అపవిత్రమైనవి (అంటరానివి)గా బ్రాహ్మ ణవాదం ప్రçకటించిన తర్వాతే తోళ్లతో సంబంధం ఉన్న శూద్రు లందరినీ అంటరానివారుగా పరిగణించారని అనిపిస్తుంది. వేద కాలపు ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ అయినప్పటికీ తోళ్ల పరిశ్రమ కూడా వారి ఆర్థిక జీవనంలో ఒక భాగమే అని చెప్పవచ్చు. వేదకాలపు పశుపోషణ ఆర్థిక వ్యవస్థను పోలిన ప్రస్తుత ఆదివాసీ వ్యవస్థలను పరిశీలిస్తే అందుకు సంబంధించిన సాక్ష్యాలు లభిస్తాయి. దట్టమైన అరణ్యాల్లో ఉన్న మనకాలపు ఆదివాసీ సమాజాల్లో కూడా వృత్తుల ప్రత్యేకీకరణ కనిపిస్తుంది. అక్కడా వేటాడటం, చర్మా లను సేకరించడం, ఆ చర్మాల నుంచి రకరకాల తాళ్లు, బ్యాగులు, ఇతర వ్యవసాయ పనిముట్లు తయారు చేయడం కనిపిస్తుంది. కానీ ఆ ఆదివాసీ సమాజాల్లో ఈ తోళ్లతో సంబంధం ఉన్న పనివారిని అంట రానివారుగా పరిగణించకపోవడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజాల అభివృద్ధి క్రమంలో అతి సహజంగా కనిపించే దృశ్యం ఇది. కానీ భారత దేశంలో బ్రాహ్మణవాదం మానవుల్లో బానిసత్వం కన్నా ఘోరమైన అంటరానితనం అనే కొత్త సూత్రాన్ని ప్రవేశపెట్టింది. అంటరానితనానికి గీటురాయి తోలు ఆధునిక భారతం అంతటా తోళ్ల పరిశ్రమ మొత్తం దళితుల పరి శ్రమగా ఉంది. ఇందులో పనిచేసేవారందరూ దళితులే. గ్రామీణ భారతావనిలో తోలు పని.. శూద్రులు, దళితులకు మధ్య అంటరాని తనానికి గీటురాయిగా ఉంది. అయితే ఇస్లాం రాకతో అందులోకి మారినవారు కుల పరమైన గుర్తింపు లేకుండానే తోలు పరిశ్రమలో భాగమయ్యారనుకోండి. ఇతర వెనుకబడిన తరగతులవారు, ద్విజులు ఎవరూ తోలు పరిశ్రమలో పనిచేయడం లేదు. అయితే ఏ దశలో తోలుపని అంటరానిదానిగా మారిందనేది స్పష్టంగా తెలియదు. శూద్రుల ఆచార వ్యవహారాల్లో కొత్తగా కులాల ప్రాతిపదికన బ్రాహ్మణ కర్మకాండలను బ్రాహ్మణవాదం ప్రవేశ పెట్టింది. తోలు అపవిత్రం, దానికి సంబంధించిన పని కలుషిత మైనదని ఈవాదం వారి బుర్రల్లో చొప్పించింది. ఫలితంగా అంటరాని తనం పాదుకుంది. కర్మకాండలు మూఢనమ్మకాలుగా మారి పోయాయి. ఇందుకు వేలాది సంవత్సరాల కాలం పట్టింది. అందుకే బ్రాహ్మణవాదం ఒక మతం కాదు. అది ఒక మూఢ నమ్మకం. పరంపరగా వస్తున్న బ్రాహ్మణ వాదం ఆధారంగా పనిచేసే ఆర్ఎస్ఎస్/బీజేపీ శ్రేణులకు అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఎజెండా లేదు. దళిత, శూద్ర తత్వవేత్తలు కలిసి కూర్చొని భారత చర్రితను జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అంటరానివారు, అంటదగినవారి మధ్య ఉండే సంబంధం శాశ్వత మానవ సంబంధం కాదు. ఈ అమానవీయ సంబంధాన్ని నాశనం చేయడానికి నడుం బిగిస్తే తప్పనిసరిగా ఈ భూమిపై నుంచి అది మాయమవుతుంది. బ్రాహ్మణ వాద సాహిత్యానికి చెందిన వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాల్లో అంటరానితనానికి ఎటువంటి పరిష్కారం లేదు. అసలు సమస్యను సృష్టించిందే ఈ సాహిత్యం కాబట్టి పరిష్కార మార్గాలు అందులో ఎందుకుంటాయి? ఇవ్వాళ ఆర్ఎస్ఎస్, బీజేపీలు బ్రాహ్మణ వాద గ్రంథాలన్నీ శూద్రులు, దళితుల అసలైన సంస్కృతిని నిక్షిప్తం చేశాయని, వాటిని అనుసరించాలని, వాళ్లంతా తమవారేనని.. తమ రాజకీయ ప్రాపగాండాలో భాగంగా ప్రచారం చేస్తున్నాయి. నిజానికి భారత దేశంలో తప్ప, ప్రపంచంలోని ఏ మత గ్రంథం కూడా ప్రజ లను కులాలుగా విభజించి అమానవీయమైన అంటరానితనాన్ని ప్రబోధించలేదు. తోలుపై రాయడాన్ని ఎందుకు నిరాకరించినట్లు? భారతదేశంలో తోలుతో సంబంధం ఉన్న వారందరినీ అంటరాని వారిగా చిత్రించిన బ్రాహ్మణీయ వ్యవస్థ, చివరికి తోళ్లను రాత సాధనంగానూ ఉపయోగించడానికి నిరాకరించింది. తోలుకు అపవ్రి తతను ఆపాదించిన బ్రాహ్మణవాదులు తొందరగా పాడైపోయే తాళ పత్రాలపై రాసేవారు. దీంతో మన ప్రాచీన జీవనానికి సంబంధించిన ఎంతో సమాచారాన్ని కోల్పోయాం. ప్రాచీన ప్రపంచంలో మొదటగా బైబిల్ని లిఖించింది సాపుచేసిన చర్మం మీదే. అలాగే గ్రీకు తత్వ వేత్తలు, ఈజిప్టు వాసులూ తోలుపైనే రాశారు. కన్ఫ్యూసియస్ వంటి చైనా తత్వవేత్తలు కూడా చర్మంపైనే తమ రచనలు చేశారు. టావో మతం చర్మంపై రాసిన రచనల ఆధారంగానే ఉనికిలోకి వచ్చింది. సమకాలీన ప్రాచీన ప్రపంచంలో భారతీయులు తప్ప వేరే ఎవరూ తాళపత్రాలను రాతకోసం ఉపయోగించలేదు. పోనీ దేశంలో తోలు పరిశ్రమలో ఉన్నవారన్నా చర్మంపై రాశారా అంటే అదీ లేదు. ఇందుకు కూడా నిందించవలసింది బ్రాహ్మణ వాదు లనే. ఎందుకంటే దళితులు, శూద్రుల చదువుపై నిషేధం విధించింది వారే గనుక. మానవుల మధ్య అసమానత్వాన్ని సృష్టించడానికి దైవత్వ భావాలను సాధనాలుగా ఉపయోగించడం వల్ల ప్రజల్లో ఉత్పాదకతా సామర్థ్యం దెబ్బతింటుంది. సరిగ్గా భారత దేశంలో జరి గిందీ ఇదే. ఈ బ్రాహ్మణీయ భావజాలం వల్ల కేవలం దళితులే కాదు శూద్రులు కూడా తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఉత్పాదక శక్తులు బాగా బలహీనమయ్యాయి. ఇతర శక్తులు భారతదేశంలో జోక్యం చేసుకుని ఉండకపోతే ఇండియా మరింతగా వెనకబడిపోయి ఉండేది. విశ్లేషకులు ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
BIG STORY : రాతియుగం నాటి కులం కంపు వదులుకోని అర్భకులు
-
ఉపేంద్రపై యంగ్ హీరో సెటైర్లు.. ఫ్యాన్స్ ఆగ్రహం
బెంగళూరు: కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను టార్గెట్ చేసి యంగ్ హీరో చేతన్ చేసిన వ్యాఖ్యలు శాండల్‌వుడ్‌లో ప్రకంపనలు రేపుతున్నాయి. ఈ మధ్యే ‘నన్ను సీఎంను చేస్తారా?’ అని ప్రజలకు ట్విట్టర్ ద్వారా ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేసిన ఉప్పీ.. కులరాజకీయలపై ప్రజాకీయ పార్టీ అభిప్రాయం వెల్లడిస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఉపేంద్ర స్టాండ్‌పై సెటైర్లు వేస్తూ యువ నటుడు చేతన్ అహింసా ఓ వీడియోను రిలీజ్ చేయడం దుమారం రేపుతోంది. ‘‘మా సెలబ్రిటీలలో కొంతమంది కులం, వివక్ష గురించి చర్చించకుండా ఉండడం వల్ల సమస్యలు శాశ్వత్వంగా పరిష్కారం అవుతాయని అనుకుంటున్నారు. ఇది నవ్వులాట కాదా? ఒక రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే పరిష్కారించడమే. అలాగే కుల వివక్ష ఈ సొసైటీలో ఒక జబ్బులాంటిది. తన వ్యాఖ్యల ద్వారా ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో, ఎంతగా పరిణితి చెందాడో అర్థం చేసుకోవచ్చు’’ అంటూ చేతన్ వీడియోలో పరోక్షంగా ఉపేంద్రపై సెటైర్లు వేశాడు. దీంతో ఉప్పీ ఫ్యాన్స్ చేతన్‌పై మండిపడుతున్నారు. చేతన్‌కు అంత అర్హత లేదని విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో చేతన్, అంబేద్కర్ ప్రస్తావన తీసుకురావడాన్ని మరో స్టార్ హీరో దర్శన్ తప్పుబడుతూ ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, కులరాజకీయాల గురించి మాట్లాడుతూ.. చివర్లో వాటికి తన పార్టీ దూరమని ఉప్పీ ఆ వీడియోలో తెలిపాడు. ಜಾತಿ / caste (1/2) pic.twitter.com/nHnTnF3Qyc — Chetan Kumar / ಚೇತನ್ (@ChetanAhimsa) May 27, 2021 కాగా, విదేశాల్లో చదువుకుని వచ్చిన 38 ఏళ్ల చేతన్.. డజన్‌కి పైగా సినిమాల్లో నటించాడు. నటుడిగానే కాకుండా తన సహాయక కార్యక్రమాలతో కన్నడనాట మంచి పేరు సంపాదించుకున్నాడు. 2010లో మేఘ అనే అమ్మాయిని పెండ్లి చేసుకున్న చేతన్.. తన వివాహానికి వచ్చిన అతిథులకు రాజ్యాంగ ప్రతులను రిటర్న్ గిఫ్ట్‌గా అందించి వార్తల్లో నిలిచాడు. -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
నటిని అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్
ముంబై : ఇప్పుడంతా టెక్నాలజీ యుగం. ఏం మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. లేదంటే ఈజీగా దొరకిపోతారు. ఫలితంగా సోషల్ మీడియా మీతో ఓ ఆటాడేసుకోవడం మాత్రం ఖాయం. టెలివిజన్ నటి మున్మున్ దత్తాకు కూడా సరిగ్గా ఇలాంటి చేదు అనుభమే ఎదురైంది. యూట్యూబ్‌లో చేసిన ఓ వీడియో ఆమెను ముప్పుతిప్పలు పెట్టింది. మున్మున్ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున ట్రెండ్ చేయడంతో ఆఖరికి ఆమె క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇటీవలె మేకప్ టిప్స్‌పై యూట్యూబ్‌లో వీడియో చేసిన మున్మున్ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. నేను భంగీ (దళిత కులానికి చెందిన వ్యక్తి)లా కనిపించాలనుకోవడం లేదు. ఎంతో అందంగా కనిపించాలనుకుంటున్నా అంటూ వీడియోలో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో అగ్గిని రాజేశాయి. ఓ కులాన్ని తక్కువ చేసి మాట్లాడిందన్న కారణంతో మున్మున్పై నెటిజన్లు ఫైర్ అయ్యారు. #ArrestMunmunDuttaఅంటూ హ్యాష్‌ట్యాగ్‌ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేశారు. దీంతో తన తప్పు తెలుసుకున్న నటి మున్మున్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశం కాదని, భాషపై అంతగా అవగాహన లేకపోవడంతో, అందుకే ఈ తప్పు జరిగిందని వివరణ ఇచ్చింది. తను చెప్పిన భావాన్ని అర్థం చేసుకోకుండా కేవలం ఓ పదాన్ని మాత్రమే టార్గెట్ చేసి తనను దూషించడం సబబు కాదని పేర్కొంటూ ట్విట్టర్లోఘో పోస్టును రిలీజ్ చేసింది. इस घटिया मानसिकता पर @moonstar4u की जातिवादी टिप्पणी करने पर sc-st एक्ट के तहत मुकदमा दर्ज होना चाहिए।@BhimArmyChief pic.twitter.com/T2RQulNBA1 — Kanishk Singh (@kanishkbhimarmy) May 10, 2021 చదవండి : 'కూతురిని బోల్డ్ సీన్లలో చూసి.. 'ఓ మై గాడ్' అని షాకవుతాడు' ఆర్థిక ఇబ్బందులున్నాయి.. అందుకే తప్పడం లేదు: శృతి హాసన్ -
నాది పేదల కులం
సోనెభద్ర: దేశంలోని నిరుపేద ప్రజలందరిది ఏ కులమో అదే తన కులమని ప్రధాని మోదీ తెలిపారు. నిఘా వ్యవస్థలను బలహీన పరిచే దుష్ట కూటమి సంకీర్ణ ప్రభుత్వాలకు అధికారం ఇవ్వరాదని ఆయన కోరారు. శనివారం ప్రధాని ఉత్తరప్రదేశ్‌లోని సోనెభద్ర, ఘాజీపూర్‌లలో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ కులస్తుడంటూ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేయడంపై ఈ సందర్భంగా మోదీ స్పందించారు. ‘వారంతా కొత్తగా నా కులం విషయం తెరపైకి తెచ్చారు. పేదలందరిదీ ఏ కులమో, మోదీది కూడా అదే కులమని వారికి చెప్పాలనుకుంటున్నా’అని అంటూ పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను వివరించారు. దుష్ట కూటమితో దేశం బలహీనం గతంలో సమాజ్‌వాదీ పార్టీతో కూడిన సంకీర్ణం హయాంలో నిఘా వ్యవస్థలు నష్టపోయాయన్న ప్రధాని..‘దుష్టకూటమి ప్రభుత్వ హయాంలో దేశ భద్రత ప్రమాదంలో పడింది. నిఘా వ్యవస్థలు బలహీనపడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వాల తప్పిదాలను సరిదిద్దే చర్యల్లో భాగంగా బీజేపీ నేతృత్వంలోని వాజ్‌పేయి ప్రభుత్వం 1998లో సరిగ్గా ఇదే రోజు పోఖ్రాన్లో విజయవంతంగా అణు పరీక్ష జరిపింది’అని గుర్తు చేశారు. కాంగ్రెస్ సారథ్యంలోని మన్మోహన్ సర్కారును బలహీన, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఈ ప్రభుత్వం వల్ల దేశానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇలాంటి దుష్టకూటమి ప్రభుత్వాలకు మద్దతు పలకవద్దని ఆయన ప్రజలను కోరారు. వారంతా కలిసి గతంలో ఉత్తరప్రదేశ్‌ను ధ్వంసం చేశారు. ఇప్పుడు తమను తాము నాశనం కాకుండా కాపాడుకునేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏకమయ్యాయి’అని అన్నారు. తమ ప్రభుత్వం హయాంలో వైమానిక బలగాలు సరిహద్దులు దాటి బాలాకోట్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు జరిపాయని తెలిపారు. కాంగ్రెస్‌ది అహంకారం కాంగ్రెస్ హయాంలో 1984లో సిక్కుల ఊచకోతపై ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా ‘అప్పుడు అలా జరిగింది, అయితే ఏంటి?’ అనడంపై ప్రధాని స్పందిస్తూ...‘ఈ వ్యాఖ్యలు ఆ పార్టీ వైఖరిని, మనస్తత్వాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఎన్ని కుంభకోణాలు జరిగినా వారిలో పశ్చాత్తాపం లేదు. కాంగ్రెస్ నిర్లక్ష్య ధోరణికి ఇదే నిదర్శనం’ అని మండిపడ్డారు. దళిత మహిళకు కాంగ్రెస్ ‘అన్యాయం’ రాజస్తాన్‌లో దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విషయం బయటకు పొక్కకుండా అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం తొక్కిపెడుతోందని ప్రధాని ఆరోపించారు. ఏప్రిల్ 26వ తేదీన ఈ ఘటన జరిగిందంటూ 30వ తేదీన బాధితురాలి భర్త ఫిర్యాదు చేసినప్పటికీ తీరిగ్గా మే 7వ తేదీన పోలీసులు కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికలు జరుగుతున్నందునే ఇంత జాప్యం చేశారని విమర్శించారు. అధికారంలోకి వస్తే న్యాయ్ పథకం అమలు చేస్తామంటూ కాంగ్రెస్ చెప్పుకుంటుండగా..అక్కడి ఆ పార్టీ ప్రభుత్వం మాత్రం దళిత మహిళకు అన్యాయం చేసిందని ఆరోపించారు. -
నిరాదరణ
కర్నూలు(అర్బన్): బీసీ కార్పొరేషన్ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత తదితర కారణాల వల్ల ఆదరణ పథకం జిల్లాలో అభాసుపాలైంది. బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారికి 90 శాతం సబ్సిడీపై ఆధునిక పనిముట్లు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వేలాది మంది చేతి వృత్తిదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేశారు. నిర్ణీత గడువులోనే దరఖాస్తు చేసుకున్నా.. వారు కోరుకున్న పనిముట్లను సకాలంలో అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. దరఖాస్తుదారులు 70 వేలకు పైనే ... చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వడ్డెర, కుమ్మరి, కమ్మరి, విశ్వబ్రాహ్మణ, మేదర, మత్స్యకారులు, టైలర్లు, యాదవ, కురువ తదితర కులాలకు చెందిన 70 వేల మందికి పైగా ఆదరణ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం విడతల వారీగా వివిధ రకాల పనిముట్లను నెలకు కొన్ని ప్రకారం జిల్లా కేంద్రాలకు పంపింది. మొట్టమొదట కుట్టు, ఎంబ్రాయిడరీ మిషన్లను ఎక్కువగా సరఫరా చేసింది. జిల్లా కేంద్రానికి చేరుకున్న ఈ పనిముట్లను నియోజకవర్గ కేంద్రాల్లోని గోడౌన్లకు చేర్చే విషయంలో కొంత జాప్యం చోటు చేసుకుంది. ఇదే తరుణంలో జిల్లా, డివిజన్ కేంద్రాల్లో భారీగా ఖర్చు చేసి మేళాలు నిర్వహించారు. వీటిలో పంపిణీ చేస్తామని లబ్ధిదారులను రప్పించుకుని కొందరికి మాత్రమే ఇచ్చారు. మిగిలిన వారికి నియోజకవర్గ కేంద్రాల్లో అందజేస్తామని చెప్పి పంపారు. వచ్చింది 37,676 పనిముట్లు మాత్రమే ... 70 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. పది శాతం లబ్ధిదారుని వాటా చెల్లించిన 59,934 మందికి వివిధ రకాల పనిముట్లను అందించాలని జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయికి ఇండెంట్ పంపించారు. అయితే, ఉన్నతాధికారులు 37,676 పనిముట్లను మాత్రమే పంపించారు. ఇంకా 22,258 మందికి సరఫరా చేయాల్సి ఉంది. సరఫరా అయిన వాటిలోనూ అధిక శాతం కుట్టుమిషన్లు, పాల క్యాన్లు, సైకిళ్లు, కార్పెంటరీ పనిముట్లు, చేపల వలలు, సన్నాయి వాయిద్యాలు, సెలూన్ షాపులకు కుర్చీలు ఉన్నాయి. వచ్చిన వాటిలో ఇప్పటివరకు 29,905 పనిముట్లను మాత్రమే లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 7,701 గోడౌన్లలోనే మగ్గుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పంపిణీ చేసేందుకు అవకాశం ఉన్నా..అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం అందజేసేందుకు ఎన్నికల కోడ్ అడ్డొస్తోంది. కోడ్ ముగిసిన అనంతరమైనా పంపిణీ చేస్తారా, లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే ఆదరణ లబ్ధిదారులకు అందించాల్సిన పనిముట్లు గోడౌన్లలో ఉన్న మాట వాస్తవమే. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా అందించలేక పోతున్నాం. పాల క్యాన్లు, సైకిళ్లు, కుట్టుమిషన్లు వంటి ఏడు వేలకు పైగా పనిముట్లు గోడౌన్లలోనే ఉన్నాయి. ఉన్నతాధికారుల నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారులకు అందజేస్తాం. ఈ నేపథ్యంలోనే పనిముట్ల వివరాలను పరిశీలించేందుకు బీసీ కార్పొరేషన్ అదనపు డైరెక్టర్ మల్లికార్జున జిల్లాకు వస్తున్నారు. ఆయా గోడౌన్లలోని రికార్డులను ఆయన పరిశీలించనున్నారు. – ఐడీ శిరీష, బీసీ కార్పొరేషన్ ఈడీ -
వీరి కుటుంబానికి కులం... మతం లేవు..!
తిరుపత్తూర్‌లో ప్రముఖ న్యాయవాది ఆమె. దేశంలో కుల, మత భేదాలు లేకుండా అందరికీ సమ న్యాయం చేయాలనే పట్టుదల కలిగిన మహిళ. దీనిపై ఆమె పోరాటం దేశానికి మార్గదర్శకం చేసింది. ఆదేంటో చూడాలంటే తమిళనాడులోని వేలూరు జిల్లా తిరుపత్తూర్... ఆనంత కృష్ణన్, మణిమొళి దంపతులకు పెద్ద కుమార్తె ఆమె. పోలీసులచే చిత్రహింసలకు గురై, వారికి వ్యతిరేకంగా పోరాడి జైల్లోనే ప్రాణాలు విడిచిన స్నేహలతకు గుర్తుగా ఆమెకు స్నేహ అని పేరు పెట్టారు. ఆమె తన ఇంటిపేరుగా తల్లి పేరులోని మొదటి అక్షరం ఎం, తండ్రి పేరులోని మొదటి అక్షరం ఏ రెండు కలిపి ఎంఎ.స్నేహ అయ్యింది. పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేటప్పుడు మొదటిసారి నీది ఏ క్యాస్ట్? అని అడిగారు. నాకు కులం లేదని మా తల్లిదండ్రులు చెప్పారు అని చెప్పిందామె. పోనీ మతం అయినా చెప్పమన్నారు. ‘మాకు కులం, మతం లేవని చెప్పారు మా తల్లిదండ్రులు’ అని సమాధానం ఇచ్చిందామె. అలా మొదలైన స్నేహ జీవితంలో పాఠశాల, కళాశాల వరకు ఎక్కడా కులం, మతం అనే ఆప్షన్ లేదు. ఆమె సోదరీమణులు ముంతాజ్, జెన్నిఫర్ కూడా అలాగే కులం, మతం అనే ఆప్షన్ లేకుండా విద్యాభ్యాసం ముగించారు. కుల, మతభేదాలు లేకుండానే పార్తిపరాజాతో ఆమెకు వివాహం జరిగింది. ఆమె పిల్లలు నజ్రీన్, ఆతిల జరీన్, ఆరీఫా జోసిలకు కూడా కులమతాలు అంటకుండా పెంచుతున్నారు. కులం, మతం అంటూ కొట్టుకునే ఈ సమాజానికి స్నేహ దంపతులు మార్గదర్శకులుగా నిలిచారు. కులాలు, మతాలతో కొట్టుకునే ఈ సమాజానికి భిన్నంగా అవేవీ వారికి లేవని నిరూపించుకునే ప్రయత్నంలో వారు తమకు కులం, మతం లేవనే ప్రభుత్వ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే అధికారులు పలుమార్లు వారిని నిరాశపరిచారు. వారు ఫలానా మతం, ఫలానా కులం అంటూ సర్టిఫికెట్ ఇచ్చే ప్రభుత్వాలు, అధికారులు, వారు ఏ కులానికీ, మతానికీ చెందిన వారు కాదనే సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వరనే న్యాయపోరాటం ప్రారంభించారు స్నేహ దంపతులు. అలా అలుపెరగకుండా వారు చేసిన పోరాటానికి న్యాయం జరిగింది. ఆర్డీవో ఆదేశాల మేరకు తిరుపత్తూర్ తహసీల్దారు సత్యమూర్తి స్నేహ కుటుంబం ఏ కులానికీ, మతానికి చెందినవారు కాదంటూ సర్టిఫికెట్ అందచేయటం కొసమెరుపు. అలా స్నేహ దంపతులు తాము ఏ కులానికో, మతానికో చెందినవారం కాదని, తమది మానవజాతి అంటూ ప్రభుత్వ పత్రం పొందిన మొదటి కుటుంబంగా రికార్డులకెక్కారు. – సంజయ్ గుండ్ల, ప్రత్యేక ప్రతినిధిసాక్షి టీవీ, చెన్నై బ్యూరో -
సహకరించని గ్రామస్తులు.. తల్లి శవాన్ని సైకిల్‌పై
భువనేశ్వర్ : ఒడిశాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ మృతి చెందితే ఆ గ్రామానికి చెందిన ఏ ఒక్కరు దగ్గరకు రాలేదు. కారణం ఆమె తక్కువ కులానికి చెందిన మహిళ కావడమే. చివరకు ఆమె కుమారుడు ఒక్కడే సైకిల్‌పై తన తల్లి శవాన్ని తీసుకెళ్లి అడవిలో ఖననం చేశాడు. ఈ హృదయవిదారకర ఘటన ఒడిశాలోని కర్పాబహాల్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన జాంకి సిన్హానియా(45), తన కుమారుడు సరోజ్(17)తో కలిసి నివాసం ఉంటుంది. ఆమె భర్త గత కొద్ది రోజుల క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలీ పని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల మంచి నీళ్ల కోసం బావి వద్దకు వెళ్లి అదుపు తప్పి అందులో పడి మృతి చెందారు. తన తల్లి అంత్యక్రియలకు సహకరించాలని సరోజ్ గ్రామస్తులను కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఒక్కడే తల్లి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి గ్రామానికి దాదాపు 6కిలో మీటర్ల దూరంలో ఉన్న అడవిలో ఖననం చేశాడు. అంత్యక్రియలకు సహకరించాలని గ్రామస్తులను వేడుకున్నప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని సరోజ్ తెలిపారు. తక్కువ కులానికి చెందిన వాళ్లమని గ్రామస్తులంతా తమను దూరం పెట్టారని వాపోయారు. -
కులాల వారీ టికెట్లు సరికాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కులాల ప్రాతిపదికన అభ్యర్థులను పోటీకి నిలబెట్టి రాష్ట్ర నాయకత్వం తీరును సీపీఎం కేంద్ర కమిటీ తీవ్రస్థాయిలో తప్పుబట్టింది. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ప్రయోగం పేరిట కులం, సామాజిక అంశాలకు తప్ప మరే అంశానికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యతనివ్వకపోవడం పార్టీ మౌలిక విధానాలకు పూర్తి భిన్నంగా ఉందని ధ్వజమెత్తింది. ఇది పార్టీ వర్గ సమస్యకు ఇచ్చే ప్రాధాన్యాన్ని మరుగునపరిచినట్టు అయ్యిందని తన నివేదికలో పేర్కొంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీపీఎం–బీఎల్ఎఫ్ కూటమి 107 స్థానాల్లో పోటీచేసి, ఒక్క సీటునూ గెలుచుకోలేకపోగా, అత్యధిక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆ పార్టీ కేంద్ర కమిటీ సమావేశాల్లోనే రాష్ట్ర పార్టీ తీరును తప్పు బట్టగా.. తాజాగా సీపీఎం అత్యున్నత నిర్ణాయక మండలి కేంద్ర కమిటీ నివేదికలో కూడా రాష్ట్ర నాయకత్వ తీరును ఎండగట్టింది. ఈ ఎన్నికల్లో సీపీఎం 26, బీఎల్ఎఫ్ 81 సీట్లలో కూటమిగా పోటీచేసి కేవలం 0.43 శాతం ఓట్లే సాధించడాన్ని కూడా ప్రస్తావించింది. కులాలు, సామాజికవర్గాల ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయడంతో కులాల ఆధారంగానే ఈ కూటమి ఏర్పడిందనే భావన కలిగేందుకు ఆస్కారం ఏర్పడిందని పేర్కొంది. వెనుకబడిన తరగతులకు చెందిన వ్యక్తిని సీఎం అభ్యర్థిని చేస్తామని కూటమి ప్రకటించడాన్ని తప్పుబట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లోని కమిటీలు ఫలితాలను సమీక్షించి నివేదికను జాతీయ నాయకత్వానికి పంపించాక, పార్టీ చూపిన ప్రదర్శనపై సమగ్ర సమీక్షను నిర్వహించనున్నట్టు సీపీఎం కేంద్ర కమిటీ స్పష్టంచేసింది. బీజేపీ ఓటమే ప్రధాన లక్ష్యం.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని రాష్ట్రశాఖలకు కేంద్రకమిటీ సూచించింది. మొత్తం 15 పేజీల సీసీ రిపోర్ట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న పరిణామాలు, రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు తదితర అంశాలను ప్రస్తావించింది. -
ఓటేయని వారు 1,96,124 : వరంగల్ అర్బన్
సాక్షి, హన్మకొండ అర్బన్: పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. ఎవరికెన్ని ఓట్లు పోలై ఉంటాయని అభ్యర్థులు, వారి అనుచరులు లెక్కలు వేసుకుంటుండగా, జిల్లా ఎన్నికల అధికారులు పోలింగ్ శాతం ఏ మేరకు పెరిగిందని లెక్కలు వేసుకుంటున్నారు. మొత్తంగా చర్చంతా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేసి వెళ్లిన వారి గురించే జరుగుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కలిపి 1,96,124 మంది అంటే.. సుమారు 30 శాతం మంది ఓటర్లు పోలింగ్ కేంద్రం ముఖం చూడలేదు. తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఓటర్ లిస్ట్ మార్క్డ్ జాబితా ప్రకారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో 6,78,036 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,81,912 మంది ఓటర్లు(71.40 శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయినా పెరిగింది.. జిల్లాలో 2014 సాధారణ ఎన్నికల సమయంలో మొత్తం 6,78,090 మంది ఓటర్లు ఉండగా వారిలో 4,67,335 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. దీంతో జిల్లాలో 68.43 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం 2018 ఎన్నికల్లో మాత్రం 71.40 శాతం ఓట్లు పోల్ కావడంతో గతంకన్నా 2.97 శాతం పెరిగినట్లయ్యింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఈ సారి పశ్చిమలో 1.46 శాతం పెరిగింది. వర్ధన్నపేట నియోజకవర్గంలో అత్యధికంగా 5.56 శాతం పోలింగ్ పెరిగింది. ఇక వరంగల్ తూర్పులో మాత్రం ఊహించని విధంగా పోలింగ్ గతంకన్నా 1.96 శాతం తగ్గింది. మరో విశేషం ఏమిటంటే జిల్లాలో 2014 ఓటర్ల జాబితాలో కన్నా ప్రస్తుతం ఓటర్ల జాబితాలో 54 మంది తక్కువగా ఉన్నారు. వరంగల్ పశ్చిమలో అత్యధికంగా 1,00,471 మంది ఓటు వేయలేదు. ఇక్కడ 41.71 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. వరంగల్ తూర్పులో 58,169 మంది పోలింగ్‌కు రాలేదు. ఇక్కడ 27.47 శాతం మంది ఓటర్లు ఓటుకు దూరంగా ఉన్నారు. వర్ధన్నపేటలో 37,484 మంది ఓటేయలేదు. ఇక్కడ 16.63 శాతం మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోలేదు. మొత్తంగా ఓటర్ల జాబితాలో 2 శాతం వరకు మరణించిన వారివి, మరికొందరివి రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు మినహా మిగతావారు ఓటేయలేదని అధికారులు భావిస్తున్నారు. -
హనుమంతుడి ముందు కుప్పిగెంతులు
దేవుడిపై ప్రయోగించిన కులం కార్డు ఎటు తిరుగుతోందన్న చర్చ తీవ్రరూపం దాలుస్తోంది. ఓ వైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో హిందూ సంస్థలు నిమగ్నమైతే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడి కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త విషయాల్ని తెర మీదకు తెచ్చారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో.. హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న యోగి ఆ వర్గం నుంచి ఓట్లు రాలుతాయని ఆశించి ఉండొచ్చు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే.. హనుమంతుడు మనువాడీలకు బానిస అని, రాముడి కోసం ఎంతో చేశాడని, అయినా ఆయనకు తోక ఎందుకు పెట్టారని ప్రశ్నించి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్లో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు. ఉద్రిక్తత రాజేసిన భీమ్ ఆర్మీ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని హనుమంతుడి ఆలయాలన్నింటిని దళితులు స్వాధీనం చేసుకోవాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఆ ఆలయాలన్నింటిలో దళిత పూజారుల్ని నియమిస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు భీమ్ ఆర్మీ సభ్యులందరూ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ఆలయాలను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీకి ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ మద్దతు పలకడంతో ముజఫర్‌నగర్‌లో హనుమాన్ ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ కార్యకర్తలు గత మంగళవారమే సంకటవిమోచన హనుమాన్ ఆలయాన్ని ఆక్రమించుకొని అక్కడి పురోహితుడ్ని తొలగించి దళితుడిని పూజారిగా నియమించారు. ‘హిందూ మతానికి యోగి ఆదిత్యనాథ్ ఒక రాజ్యాంగపరమైన అధికారి. అందుకే ఆయన వ్యాఖ్యలపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది’ అని కొత్త పూజారి దీపక్ గంభీర్ అంటున్నారు. మతంతో రాజ్యాధికారం! ఆంజనేయుడి ఆలయాలపై పెత్తనం సాధిస్తామంటూ భీమ్ ఆర్మీ చేసిన ప్రకటనను దళితుల్లోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడకుండా ఇలా ఆలయాల్లో పూజారులుగా నియమిస్తే ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, చైతన్యపరచడం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బహుజన్ డైవర్సిటీ మిషన్‌కు చెందిన హెచ్.ఎల్.దుసధ్ వాదన భిన్నంగా ఉంది. మతం అత్యంత శక్తిమంతమైనదని, దానిని చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బలం పుంజుకొని రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు. కులానికో దేవుడుంటే లాభమా? కులానికో దేవుడు ఉన్న ఈ రోజుల్లో తాజా వివాదం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాదవులందరూ కృష్ణుడు తమ కులదైవం అంటారు. కుష్వాహాలు రాముడి కుమారుడైన కుశుడి సంతతి వాళ్లమని భావిస్తారు. కుర్మీలు లవుడు తమ వాడేనని అంటారు. విశ్వకర్మ తమ కులదైవమని లోహార్లు చెబుతారు. వాల్మీకీ సంతతికి చెందినవాళ్లమని పారిశుధ్ధ్య కార్మికులు చెప్పుకుంటారు. జరాసంధుడి వారసులమని కహరా కులస్తులు (పల్లకీలు మోసే వృత్తి) చెప్పుకుంటారు. ఇలా ప్రతీ వెనుకబడిన కులాల వాళ్లూ సామాజికంగా తమ హోదాలు పెంచుకోవడానికి ఫలానా దేవుళ్లకి వారసులమని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని సోషయాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు. -
పాలకులను మేల్కొల్పిన ప్రసంగం
♦ కొత్తకోణం బ్రిటిష్ పాలన వల్ల దేశం ఎన్నో నష్టాలను ఎదుర్కొని ఉన్నప్పటికీ, కుల వ్యవస్థను కదిలించడంలో బ్రిటిష్ పాలన పాత్రను కాదనలేం. కులం మూలాలను పెకిలించిన తొలి రాజకీయోపన్యాసంతో బ్రిటన్ హక్కుల నేత విలియం విల్బర్ఫోర్స్ 205 సంవత్సరాల క్రితం అందించిన కుల వ్యతిరేక చైతన్యం బ్రిటిష్ పాలకులకు కూడా మేలుకొలుపు అయింది. ఈ ప్రసంగం తదనంతరం భార త్లో ఎన్నో సంస్కరణలకు పునాది వేసింది.. అప్పటికే ఎదిగివస్తున్న భారతదేశ యువతరానికి మార్గ నిర్దేశం చేసింది. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయన తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్పటికీ, ఇప్పటికీ అనుసరణీయమే. ‘‘భారతదేశంలోని కుల వ్యవస్థ మనిషి వ్యక్తిగత ఎదుగుదలకు అవరోధంగా ఉంది. స్వేచ్ఛా సమాజంలో ఒక వ్యక్తి ఎంతటి పేద రికం నుంచైనా బయటపడగలడు. నిరంతర శ్రమ, ప్రయత్నం ద్వారా ఎలాంటి శిఖరాలనైనా అధిరో హించగలడు. కుల వ్యవస్థ అలాంటి అవకాశాలను అడ్డుకుంటోంది. దానితో ఏ కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులంలోనే, శాశ్వతంగా ఉండిపోతున్నాడు. ఇది కుల వ్యవస్థ అభివృద్ధి నిరోధక స్వభావాన్ని బయటపెడు తున్నది’’ అని రెండు శతాబ్దాల క్రితం 1813 జూన్ 22న బ్రిటిష్ పార్లమెంటులో విలియం విల్బర్ఫోర్స్ సునిశిత పరిశీలనానంతరం చేసిన వ్యాఖ్య ఇది. దాదాపు 205 ఏళ్ల క్రితం భారత కుల వ్యవస్థపై విల్ బర్ఫోర్స్ మూడు గంటలు అనర్గళంగా మాట్లా డారు. ఈ ఉపన్యాసం రాతప్రతి 109 పేజీలుంది. వర్ణ వివక్ష కన్నా కుల వివక్ష, కుల అసమానతలు చాలా క్రూరమైనవని విల్బర్ఫోర్స్ ఈ ఉపన్యా సంలో వ్యాఖ్యానించారు. ‘జాతి వివక్ష నుంచి మనిషి బయటపడవచ్చు. కుల వ్యవస్థ సంకెళ్ళను తెంచుకో వడం సాధ్యం కాదు,’ అని ఆయన తేల్చి చెప్పారు. విల్బర్ఫోర్స్ సుదీర్ఘకాలం బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ సభ్యుడిగా ఉండడం మాత్రమే కాకుండా, బానిస వ్యవస్థ నిర్మూలన కు నిరంతరం కృషి చేశారు. బ్రిటన్‌లోని కింగ్స్టన్ అపాన్ హల్లో ఆయన 1759 ఆగస్ట్ 24న జన్మించారు. పార్లమెంటులో స్వతంత్రుడి గానే వ్యవహరించారు. ఇండియాలో ఆర్థిక, వ్యాపార కార్యకలాపాలు సైతం కులం గుర్తింపు మీదే ఆధార పడి సాగుతుంటాయని, గ్రామాల్లో అప్పులు ఇచ్చే పద్ధతిని కూడా కులం ప్రభావితం చేస్తుందని ఆయన వివరించారు. అప్పటికే బ్రాహ్మణాధిపత్య భావ జాలం ఎంతగా విస్తరించిందో కూడా ఆయన ఉప న్యాసం పరిశీలిస్తే అర్థమవుతుంది. ‘బ్రాహ్మణు డికి అప్పిస్తే అతను చెల్లించే వడ్డీ ఒక శాతం మాత్రమే. అదే క్షత్రియుడైతే 2 శాతంతో సరిపెట్టుకో వచ్చు. శూద్రులకు 3 శాతం వడ్డీగా నిర్ణయిస్తారు,’ అని చెపుతూ ఆర్థిక దోపిడీకీ, కులానికీ ఉన్న సంబంధాన్ని తేటతెల్లం చేశారు. ఈరోజు మనం మాట్లాడుకుం టున్న శిక్షల అమల్లో సైతం కులం వాసనలను ఆయన తూర్పారబట్టారు. ఆధిపత్య కులాలు నేరాలు చేస్తే తక్కువ శిక్షలు, శూద్రులు నేరాలు చేస్తే కఠిన శిక్షలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ ఆర్మీలో పనిచేసే సైనికులు కూడా తమ కులాన్ని బట్టి వేషధారణను వదులుకోవాలని గత జూలైలో (1812) ఇచ్చిన ఆదేశాన్ని ఎవ్వరూ పాటిం చలేదని, చివరకు అలాంటి ఆదేశాలను వెనక్కి తీసు కోవాల్సి వచ్చిందని కూడా విలియం గుర్తుచేశారు. ఇండియాలో కుల వ్యవస్థను వ్యతిరేకించే సాంప్రదా యాలు బౌద్ధం, సిక్కు మతాల్లో కనిపిస్తున్నాయని ఆయన పేర్కొ న్నారు. ‘‘అక్కడ భర్త మరణిస్తే సతి పేరుతో స్త్రీలను మంటల్లో కాల్చి చంపే దురాచారం అమలులో ఉంది. ఆడ పిల్లలను పురిటిలోనే చంపేస్తు న్నారు. భర్త మరణిస్తే మళ్లీ పెళ్లికి అవకాశం లేదు,’’ అంటూ ఎన్నో విషయాలు వివరించారు. మానవ త్వాన్ని ప్రేమించే ఎవరైనా ఇలాంటి క్రూరమైన విధా నాన్ని సహించకూడదనీ, పార్లమెంటు సభ్యులుగా అందరూ ఈ విధానాన్ని అరికట్టాలని ప్రసంగం చివర్లో ఆయన అభ్యర్థించారు. కులం మూలాలు పెకిలించిన ఉపన్యాసం! నిజానికి కులం మూలాలను పెకిలించిన తొలి రాజకీ యోపన్యాసం ఇదే. హక్కుల నేత విల్బర్ఫోర్స్ చేసిన ప్రసంగం తదనంతరం భారత్‌లో ఎన్నో సంస్కరణలకు పునాది వేసింది. విల్బర్ఫోర్స్ కేంబ్రిడ్జి సెయింట్ జాన్స్ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1780లో తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టి 1825 వరకు కామన్స్ సభకు ఎన్నిక వుతూ వచ్చారు. బ్రిటన్ దాదాపు పదహారవ శతాబ్దం నుంచే బానిస వ్యాపారాన్ని మొదలు పెట్టింది. అయితే 1780 నుంచి బ్రిటన్‌లో బానిసల వ్యాపారం, ఉత్పత్తిలో సైతం బానిసల వినియోగంపై ఉద్యమం మొదలైంది. జేమ్స్ రామ్సే అనే రచయిత మూడు సంవత్సరాలు బానిసలతో గడిపి ‘‘ఆఫ్రికన్ స్లేవ్స్ ఇన్ ద బ్రిటిష్ సుగర్ కాలనీస్’’ అనే పుస్తకం రాశారు. ఇది 1784లో అచ్చయింది. మూడేళ్ల తర్వాత విల్బర్ఫోర్స్ దీన్ని చదివారు. దీనితో ఉత్తేజితుడై బానిస వ్యాపారాన్ని విమర్శించడంతో పాటు బానిస వ్యవస్థనే నిర్మూలించాలనే కృత నిశ్చ యానికి వచ్చారు. మొదటిసారి 1787 మే 22న బానిస వ్యవస్థ నిర్మూలనకు ఓ సొసైటీ ఏర్పాటైంది. విల్బర్ఫోర్స్ అందులో సభ్యునిగా చేరలేదుగాని ఆ సొసైటీతో సన్నిహితంగా పనిచేయడం మొదలు పెట్టారు. 1791లో ఆయన దీనిలో సభ్యుడిగా చేరి బానిసత్వ నిర్మూలనలో కీలక పాత్ర పోషించారు. ప్రజల్లో బానిస వ్యవస్థపై అవగాహన కల్పించడానికి ఆ సొసైటీతో పాటు విల్బర్ఫోర్స్ విశేష కృషి చేశారు. చివరికి 1833 జూలై 26న బానిస వ్యవస్థ నిర్మూలన చట్టాల్ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదిం చింది. స్వతంత్ర ఎంపీగా ఉంటూనే ప్రభుత్వాలను మెప్పించడంలో ఆయన అనుసరించిన విధానం ప్రత్యేకమైంది. అందువల్లనే చట్టం కూడా సాధ్యమైం దనిపిస్తుంది. విల్బర్ఫోర్స్ మరణించిన నెల తర్వాత బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ చట్టం రూపుదిద్దుకున్న వెంటనే దాదాపు 80 వేల మంది బానిసలు విముక్తి పొందారు. అలాంటి మానవతా హృదయం కలిగిన విలియం విల్బర్ఫోర్స్ సహజం గానే కుల వ్యవస్థపై స్పందించారు. కుల వ్యవస్థ భార తదేశ పురోగమనాన్ని అడ్డుకుంటోందని, దాన్ని పరిష్కరించాలని బ్రిటిష్ పార్లమెంటును కోరారు. విల్బర్ఫోర్స్ మార్గంలో రాజా రామ్మోహన్ రాయ్, ఫూలే, అంబేడ్కర్ బ్రిటిష్ మేధావులు, పాశ్చాత్య విద్య అందించిన చైతన్యం వల్ల భారతదే శంలో పునర్జీవన ఉద్యమం మొదలైంది. హిందూ మతం, కుల దురాచారాలను తొలగించాలనే లక్ష్యంతో ఎంతో మంది కృషి చేశారు. అందులో హిందూ మతాన్ని సంస్కరించాలని ప్రయత్నించిన వారు కూడా ఉన్నారు. లేదు కుల నిర్మూలనే అస మానతలకు సరైన సమాధానమనే అభిప్రాయాన్ని బలంగా వినిపించిన వారూ ఉన్నారు. రాజారామ్మోహన్రాయ్ మొదటి ఆలోచనకు ప్రతినిధి అయితే, జ్యోతీబా çఫూలే, అంబే డ్కర్ రెండో ఆచరణకు ఆద్యులు. రాజారామ్మోహన్రాయ్ హిందూమతాన్ని సంస్కరించాలనే ఉద్దేశంతో తన లక్ష్యాలకు అను గుణంగా 1829లో రాజా రామ్మోహన్ రాయ్ ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది బ్రహ్మసమాజంగా మారింది. కుల వ్యవస్థలో ఉన్న సంకుచితత్వం వల్ల ప్రజల్లో ఐక్యత దెబ్బతింటుందని రాజారామ్మోహన్ రాయ్ భావించారు. అయితే ఆయన నిరసించిన దురాచారాలన్నీ కూడా ఎక్కు వగా బ్రాహ్మణుల్లో ఉండేవి. ఈ ఉద్యమం వల్ల మొట్టమొదట అ«ధికంగా ప్రయోజనం పొందింది బ్రాహ్మణ, ఇతర ఆధిపత్య కులాలు మాత్రమే. అయితే అది కూడా సమాజంలో ఒక చలనాన్ని తీసు కొచ్చింది. ఆ తర్వాత హెన్నివిలియన్, రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ్ చంద్ర సేన్, ఈశ్వరచంద్ర విద్యా సాగర్, రామకృష్ణ పరమ హంస, వివేకానంద, దయానంద సరస్వతి, పండిత రమాబాయి పాశ్చాత్య విద్య ప్రభావంతో సంస్క రణ మార్గంలోకి వెళ్ళారు. ఇదే సమయంలో 1835లో ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ విద్య ఉన్నత కులా లతో పాటు, శూద్ర, అంటరాని కులాలలో చైత న్యాన్ని తీసుకొచ్చిందన్నది వాస్తవం. ఒక వైపు ఇంగ్లిష్ విద్యను తిరస్కరించిన ఆధిపత్యకులాలు, రెండోవైపు దానినే తిరిగి తమ ఆధిపత్య ప్రదర్శనకు ఆయుధంగా వాడుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మ ణుల తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్ప టికీ, ఇప్పటికీ అనుసరణీయమే. ఇంగ్లిష్ విద్యను అభ్యసించి, బ్రిటిష్‌వారి తర్వాత అధిక స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు. బ్రిటిష్ ప్రభుత్వంలో బ్రాహ్మణుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం వల్ల తొలిసారిగా 1902లో కొల్హాపూర్ సంస్థానాధీశుడు సాహూ మహారాజ్ మిగతా కులా లకు రిజర్వేషన్లు ప్రకటించారు. దేశచరిత్రలోనే ఇది తొలి రిజర్వేషన్ విధానమని చెపుతారు. ఇంగ్లిష్ చదువులే చైతన్యానికి కరదీపికలు! కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడిన జ్యోతీభాపూలేను కూడా ఇంగ్లిష్ విద్యనే ప్రభావితం చేసింది. ఆయన సామాజిక న్యాయం కోసం జరిపిన పోరాటానికి ప్రేరణగా నిలిచిన ఇంగ్లిష్ పుస్తకం ‘రైట్స్ ఆఫ్ మాన్’. అది రాసింది థామస్ పేన్. బాబాసాహెబ్ అంబేడ్కర్ అమెరికాలోని కొలం బియా విశ్వవిద్యాలయంలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివిన చదువుతో భారత ప్రజా స్వామ్య వ్యవస్థకు రూపకల్పన చేశారు. ముఖ్యంగా భారతదేశ సామాజిక అసమానతలను పాశ్చాత్య తాత్వికత ప్రభావం వల్ల ఎంతో మంది నిరసించ గలిగారు. అప్పటికే ప్రపంచంలో వస్తున్న మార్పులు వీళ్ళందరినీ ప్రభావితం చేశాయి. కొంతమంది ఇంకా సంకుచిత స్వభావాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. సత్యాన్ని సత్యంగా, న్యాయాన్ని న్యాయంగా చూడటానికి నిరాకరిస్తున్నారు. పరాయి దేశం వారి మాటలు మనమెందుకు వినాలని వాదిం చేవారూ ఉన్నారు. మానవ ప్రగతిని, చైతన్యాన్ని సరి హద్దులు ఏనాడూ నియంత్రించలేవు. భౌగోళిక విభ జన రేఖలు కేవలం పరిపాలన కోసమే కానీ, చైత న్యాన్ని, మంచిని నియంత్రించడానికి కాదు. అందు వల్ల విలియం విల్బర్ఫోర్స్ 200 ఏళ్ళ క్రితం అందిం చిన కుల వ్యతిరేక చైతన్యం బ్రిటిష్ పాలకు లకు కూడా మేలుకొలుపు అయింది. అప్పటికే ఎదిగి వస్తున్న భారతదేశ యువతరానికి కూడా మార్గ నిర్దేశం చేసింది. అందువల్ల కుల వ్యవస్థకు వ్యతి రేకంగా జరుగుతున్న పోరాటంలో విలియం విల్బర్ ఫోర్స్ వేసిన తొలి అడుగులు భారతీయ సమాజానికి అప్పటికీ, ఇప్పటికీ అనుసరణీయమే. (విల్బర్ఫోర్స్ ప్రసంగించి రేపటితో 205 ఏళ్లు పూర్తయిన సందర్భంగా) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
ఛాతిపై కులం పేరు.. రాహుల్ ఆవేదన
న్యూఢిల్లీ : పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాయడం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విటర్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఇది బీజేపీ ప్రభుత్వ జాత్యహంకార వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం యువకుల చాతీపై ఎస్సీ, ఎస్టీ అని రాసి రాజ్యాంగంపై దాడి చేసిందన్నారు. ఇది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన ఆలోచననే అని ఆయన ఆరోపించారు. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 200 మంది అభ్యర్థులకు జిల్లా మెడికల్ బోర్డు శనివారం వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా అభ్యర్థుల ఛాతీపై ఎస్సీ, ఎస్టీ, జనరల్, ఓబీసీ అని స్కెచ్ పెన్‌తో రాశారు.ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అధికారులు వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ విషయమై ధార్ ఎస్పీ వీరేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. డీఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. వేర్వేరు కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కావాల్సిన శారీరక ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నందున అభ్యర్థుల ఛాతీపై కులం పేరు రాసినట్లు వైద్య సిబ్బంది పోలీసులకు చెప్పారన్నారు. ఏదేమైనా ఇది తీవ్రమైన వ్యవహారమనీ వ్యాఖ్యానించారు. BJP सरकार के जातिवादी रवैये ने देश की छाती पर छूरा मारा है। MP के युवाओं के सीने पर SC/ST लिखकर देश के संविधान पर हमला किया है। ये BJP/RSS की सोच है। यही सोच कभी दलितों के गले में हांडी टंगवाती थी, शरीर में झाडू बंधवाती थी, मंदिर में घुसने नहीं देती थी। हम इस सोच को हराएँगे। pic.twitter.com/ycqt1nEp0E — Rahul Gandhi (@RahulGandhi) 30 April 2018 -
కుల ధ్రువీకరణ పత్రంపై విచారణ
కర్నూలు(అగ్రికల్చర్): బోగస్ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం చేస్తున్నారనే ఆరోపణలపై శనివారం డీఎల్ఎస్సీ కమిటీ విచారణ జరిపింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో వాచ్‌మెన్‌గా పనిచేసే సవారన్న .. ఒరిజినల్ కులం బుడగజంగం కాగా లింగదారికోయ ఎస్టీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందినట్లు జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం, జిల్లా గిరిజన ఐక్యవేదిక నేతలు.. కమిటీ చైర్మన్ అయిన జేసీకి వివరించారు. సవారన్న స్వంత తమ్ముడు ఉరుకుందయ్య బుడగ జంగం కులం బీసీ–ఏ సర్టిపికెట్‌తో సర్వజన వైద్యశాలలో వార్డుబాయ్‌గా పనిచేస్తున్నారని వివరించారు. దీంతో జేసీ.. సవారన్న నియామకానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలని పెద్దాసుపత్రి సూపరింటెండెటును ఆదేశించారు. కాగా లింగమూర్తి అనే వ్యక్తి దాసరి (బీసీ) కులానికి చెందినవారు అయితే మాలదాసరి ఎస్సీ సర్టిఫికెట్తో ఉద్యోగం పొందనట్లు వచ్చిన ఆరోపణలపైన కమిటీ విచారణ జరిపింది. విచారణలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు ఆర్డీఓ హుసేన్‌సాహెబ్, సి.సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనమ్మ, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుమద్దిలేటి, కార్యదర్శి రాముడుఉసాధ్యక్షుడు మద్దయ్య, గిరిజన ఐక్యవేదిక అధ్యక్షుడు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.