దేవుడిపై ప్రయోగించిన కులం కార్డు ఎటు తిరుగుతోందన్న చర్చ తీవ్రరూపం దాలుస్తోంది. ఓ వైపు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కేంద్రంపై ఒత్తిడి పెంచే పనిలో హిందూ సంస్థలు నిమగ్నమైతే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హనుమంతుడి కులంపై వ్యాఖ్యలు చేసి కొత్త విషయాల్ని తెర మీదకు తెచ్చారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో.. హనుమంతుడు దళితుడు అని పేర్కొన్న యోగి ఆ వర్గం నుంచి ఓట్లు రాలుతాయని ఆశించి ఉండొచ్చు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి ఫూలే.. హనుమంతుడు మనువాడీలకు బానిస అని, రాముడి కోసం ఎంతో చేశాడని, అయినా ఆయనకు తోక ఎందుకు పెట్టారని ప్రశ్నించి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్ హనుమంతుడి కులాన్ని ధ్రువీకరిస్తూ సర్టిఫికేట్ జారీచేయాలని వారణాసి జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ నందకుమార్.. హనుమంతుడు దళితుడు కాదని గిరిజనుడని ప్రకటించి వివాదాన్ని మరో మలుపు తిప్పారు.
ఉద్రిక్తత రాజేసిన భీమ్ ఆర్మీ
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యల నేపథ్యంలో దేశంలోని హనుమంతుడి ఆలయాలన్నింటిని దళితులు స్వాధీనం చేసుకోవాలని భీమ్ ఆర్మీ పిలుపునిచ్చింది. ఆ ఆలయాలన్నింటిలో దళిత పూజారుల్ని నియమిస్తామని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ప్రకటించారు. ఈ మేరకు భీమ్ ఆర్మీ సభ్యులందరూ ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న హనుమంతుడి ఆలయాలను ఆక్రమించుకోవాలని పిలుపునిచ్చారు. భీమ్ ఆర్మీకి ఆల్ ఇండియా అంబేద్కర్ మహాసభ మద్దతు పలకడంతో ముజఫర్‌నగర్‌లో హనుమాన్ ధామ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమ్ ఆర్మీ కార్యకర్తలు గత మంగళవారమే సంకటవిమోచన హనుమాన్ ఆలయాన్ని ఆక్రమించుకొని అక్కడి పురోహితుడ్ని తొలగించి దళితుడిని పూజారిగా నియమించారు. ‘హిందూ మతానికి యోగి ఆదిత్యనాథ్ ఒక రాజ్యాంగపరమైన అధికారి. అందుకే ఆయన వ్యాఖ్యలపై మాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది’ అని కొత్త పూజారి దీపక్ గంభీర్ అంటున్నారు.
మతంతో రాజ్యాధికారం!
ఆంజనేయుడి ఆలయాలపై పెత్తనం సాధిస్తామంటూ భీమ్ ఆర్మీ చేసిన ప్రకటనను దళితుల్లోనే కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దళితుల అభివృద్ధికి పాటుపడకుండా ఇలా ఆలయాల్లో పూజారులుగా నియమిస్తే ఒరిగేదేమిటని ప్రశ్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, చైతన్యపరచడం ద్వారానే దళితుల అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే బహుజన్ డైవర్సిటీ మిషన్‌కు చెందిన హెచ్.ఎల్.దుసధ్ వాదన భిన్నంగా ఉంది. మతం అత్యంత శక్తిమంతమైనదని, దానిని చేతుల్లోకి తీసుకుంటే నైతికంగా బలం పుంజుకొని రాజ్యాధికారానికి బాటలు పడతాయని ఆయన వ్యాఖ్యానించారు.
కులానికో దేవుడుంటే లాభమా?
కులానికో దేవుడు ఉన్న ఈ రోజుల్లో తాజా వివాదం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యాదవులందరూ కృష్ణుడు తమ కులదైవం అంటారు. కుష్వాహాలు రాముడి కుమారుడైన కుశుడి సంతతి వాళ్లమని భావిస్తారు. కుర్మీలు లవుడు తమ వాడేనని అంటారు. విశ్వకర్మ తమ కులదైవమని లోహార్లు చెబుతారు. వాల్మీకీ సంతతికి చెందినవాళ్లమని పారిశుధ్ధ్య కార్మికులు చెప్పుకుంటారు. జరాసంధుడి వారసులమని కహరా కులస్తులు (పల్లకీలు మోసే వృత్తి) చెప్పుకుంటారు. ఇలా ప్రతీ వెనుకబడిన కులాల వాళ్లూ సామాజికంగా తమ హోదాలు పెంచుకోవడానికి ఫలానా దేవుళ్లకి వారసులమని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని సోషయాలజిస్టు ఎం.ఎన్. శ్రీనివాస్ ఎప్పుడో చెప్పారు.
హనుమంతుడి ముందు కుప్పిగెంతులు
Published Sun, Dec 9 2018 3:53 AM | Last Updated on Sun, Dec 9 2018 9:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment