క్షమాపణ చెబితేనే అంత్యక్రియల్లో పాల్గొంటామని స్పష్టీకరణ
దుబ్బాకరూరల్: తమ సామాజిక వర్గానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయి నా, ఆ గ్రామానికి చెందిన కులస్తులెవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. భూ గొడవల నేపథ్యంలో వారంతా దూరంగా ఉండగా, గ్రామస్తులు అంత్యక్రియలు జరిపించారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట భూంపల్లి మండలం బొప్పాపూర్‌కు చెందిన బండమీది సాయిలు మాదిగ (71) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు క్షమాపణ చెబితేనే అంత్యక్రియల్లో పాల్గొంటామని కులస్తులు తేల్చి చెప్పారు.
భూమి విషయమై కొన్నేళ్లుగా గొడవలు: సాయిలు ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం, నాలుగు గుంటల సాగు భూమి ఉంది. ఈ భూమి విషయమై కొన్నేళ్ల నుంచి సాయిలుకు, తన సామాజికవర్గానికి చెందిన వారితో గొడవలు జరుగుతున్నాయి. అదే కులానికి చెందిన మరో వ్యక్తికి భూమి ఇవ్వాలని కులస్తులు పంచాయితీ పెట్టి సాయిలుకు చెప్పారు. దానికి సాయిలు ససేమిరా అన్నాడు. కులం మాట ఎందుకు వినడం లేదని మూడేళ్ల కింద బహిష్కరణ చేయడంతోపాటు రూ.20వేలు జరిమానా విధించారు.
మళ్లీ వారం రోజుల కిందట సాయిలు కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. వారి ఇంటికి వెళ్లినా రూ.5వేలు జరిమనా విధిస్తామని కులపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే సాయిలు చనిపోయాడు. రెండురోజులుగా కులస్తులు రాకపోవడంతో గ్రామస్తులంతా కలిసి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. సాయిలుకు కుమారులు లేకపోవడంతో చిన్న కూతురు తలకొరివి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment