sailu
-
శవానికి కుల బహిష్కరణ
దుబ్బాకరూరల్: తమ సామాజిక వర్గానికి చెందిన ఓ వృద్ధుడు చనిపోయి నా, ఆ గ్రామానికి చెందిన కులస్తులెవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. భూ గొడవల నేపథ్యంలో వారంతా దూరంగా ఉండగా, గ్రామస్తులు అంత్యక్రియలు జరిపించారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం బొప్పాపూర్‌కు చెందిన బండమీది సాయిలు మాదిగ (71) మంగళవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మాకు క్షమాపణ చెబితేనే అంత్యక్రియల్లో పాల్గొంటామని కులస్తులు తేల్చి చెప్పారు. భూమి విషయమై కొన్నేళ్లుగా గొడవలు: సాయిలు ఇంటి ముందు కొంత ఖాళీ స్థలం, నాలుగు గుంటల సాగు భూమి ఉంది. ఈ భూమి విషయమై కొన్నేళ్ల నుంచి సాయిలుకు, తన సామాజికవర్గానికి చెందిన వారితో గొడవలు జరుగుతున్నాయి. అదే కులానికి చెందిన మరో వ్యక్తికి భూమి ఇవ్వాలని కులస్తులు పంచాయితీ పెట్టి సాయిలుకు చెప్పారు. దానికి సాయిలు ససేమిరా అన్నాడు. కులం మాట ఎందుకు వినడం లేదని మూడేళ్ల కింద బహిష్కరణ చేయడంతోపాటు రూ.20వేలు జరిమానా విధించారు. మళ్లీ వారం రోజుల కిందట సాయిలు కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడినా.. వారి ఇంటికి వెళ్లినా రూ.5వేలు జరిమనా విధిస్తామని కులపెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే సాయిలు చనిపోయాడు. రెండురోజులుగా కులస్తులు రాకపోవడంతో గ్రామస్తులంతా కలిసి బుధవారం అంత్యక్రియలు జరిపించారు. సాయిలుకు కుమారులు లేకపోవడంతో చిన్న కూతురు తలకొరివి పెట్టింది. -
భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు.. ఇంతలోనే విషాదం!
మెదక్: ఎక్కిళ్లు ఓ ట్రాక్టర్ డ్రైవర్‌ను బలితీసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఖానాపూర్(కె)లో చోటుచేసుకుంది. గ్రామనికి చెందిన నర్వ సాయిలు(39) పంచాయతీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి భోజనం చేశాక అకస్మాత్తుగా ఎక్కిళ్లు మొదలయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. ఈలోగా సాయిలు మృతిచెందాడు. ఎక్కిళ్లు రావడంతో గుండెపోటుకు గురైనట్టు 108 సిబ్బంది తెలిపారు. ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఇవి చదవండి: శరణ్యా ఎక్కడమ్మా..? అంటూ తల్లి వేదన.. 'పొదల్లో పడేశా.. చెరువులో వేశానంటూ భర్త సమాధానం..! Follow the Sakshi TV channel on WhatsApp: -
గోడకూలి ఒకరు.. అది చూసి మరొకరు
నవీపేట: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం జన్నెపల్లిలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావుకు చెందిన గెస్ట్‌హౌస్‌లో శుక్రవారం ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. హన్మంత్‌రావు తన అత్తగారి ఊరైన జన్నెపల్లిలో 22 ఏళ్ల క్రితం వ్యవసాయభూమిని కొనుగోలు చేసి, అందులో రెండంతస్తుల గెస్ట్‌హౌస్ నిర్మించారు. ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలప్పుడు ఎమ్మెల్యే తొమ్మిది రోజులు ఇక్కడే ఉండి దుర్గామాత ఆలయంలో పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వచ్ఛివెళ్తుంటారు. కాగా, తాజాగా చేపట్టిన గెస్ట్‌హౌస్ ఆధునీకరణ పనుల కోసం శుక్రవారం కాంట్రాక్టర్‌తోపాటు నిజామాబాద్ నుంచి ఐదుగురు కూలీలు వచ్చారు. మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో ముగ్గురు కూలీలు భోజనానికి వెళ్లగా, కొండపల్లి రాజు(28), అతడి మిత్రుడు రెండో అంతస్తులోని గోడను తొలగించి, కిందపడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గోడతోపాటు కొండపల్లి రాజు కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దృశ్యాన్ని కళ్లారా చూసిన మరో కూలీ ఒక్కసారిగా రెండో అంతస్తులోనే వాంతులు చేసుకుని కుప్పకూలాడు. పెద్దశబ్దం దరావడంతో మిగతా కూలీలు పైకి వచ్చి అతడి ఛాతీపై నొక్కి రక్షించేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందిన వెంటనే ఎస్ఐ రాజారెడ్డి గెస్ట్‌హౌస్‌కు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజు తండ్రి శంకర్ రిటైర్డ్ సీఆర్పీఎఫ్ ఉద్యోగి. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన వీరి కుటుంబం కొన్నేళ్ల కిందట నిజామాబాద్‌లోని వినాయక్‌నగర్‌లో స్థిరపడింది. రాజుకు పెళ్లయిన సోదరి ఉంది.గుండెపోటుతో మృతి చెందిన మరోకూలీ పేరు చంపాల్వాడి సాయిలు(29). భార్యతో విడిపోయిన సాయిలు నిజామాబాద్‌లో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన వీరి కుటుంబం ఏళ్లక్రితం వలస వచ్ఛింది. -
ఒక కొమ్మకు పూచిన అనుబంధం
పుట్టినింటి ప్రేమ బంధం ఎన్నేళ్లయినా దారం పోగులతో మరింత పదిలంగా అల్లుకుంటూనే ఉంటుంది. అన్నా.. చెల్లి.. అక్కా.. తమ్ముడు.. ఆండగా ఉండే ఆప్యాయతలను మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ మది నిండా సంతోషాలను నింపుతూనే ఉంటుంది. రక్షగా నేనున్నానంటూ జీవితమంతా భరోసాను చూపుతూనే ఉంటుంది. ఒక కొమ్మకు పూచిన పూలను కలిపే దారమైన రాఖీ తోబుట్టువుల ప్రేమను లోకాన చల్లని పున్నమి వెలుగులుగా పంచుతూనే ఉంటుంది. ‘‘బాగున్నావా అన్నా!’’ అంటూ ఆప్యాయతల మధ్య పుట్టినింటి గడపకు వచ్చి యోగక్షేమాలను కనుక్కునేలా చేసే రాఖీ పండగ అంటే అన్నకు అమితమైన ఆనందం. ‘అంతా సంతోషమేనా చెల్లీ’ అనే అన్న పలకరింపుతో గుండె బరువును దింపేసే రాఖీ అంటే తోబుట్టువుకు సంబరమే. హంగూ ఆర్బాటాలకు చోటు లేని, ధనిక–పేద తేడా చూపని రాఖీ తమ జీవితాల్లో నింపే ఆనందం గురించి కొందరు తోబుట్టువులు పండగపూట పంచుకున్న అనుభవాలు ఇవి. కేరింగ్.. షేరింగ్ హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాం. పీజీ వరకు చదువుకున్న. గవర్నమెంట్ టీచర్ అవ్వాలని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. నాకు తోడబుట్టిన అన్నదమ్ములు లేరు. మా చిన్నమ్మ కొడుకు గోపాల్ నాకు తోడబుట్టినవాడికంటే ఎక్కువ. ఏ చిన్న అవసరమైనా ‘అక్కా’ అంటూ ముందుంటాడు. తోడబుట్టిన అన్నదమ్ములు లేరనే లోటు ఎప్పుడూ అనిపించలేదు. చిన్ననాటి నుంచి ఇద్దరం కలిసే పెరిగాం. స్కూల్, కాలేజీ ప్రతి చిన్న విషయం తమ్ముడితో షేర్ చేసుకోకుండా ఏ రోజూ లేదు. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా రాఖీ కట్టడం మిస్ అవలేదు. – విజయలక్ష్మి జీవితానికి మంచి దారి ఇప్పుడు నేను బీటెక్ చేస్తున్నానంటే అక్క ఇచ్చిన సజెషన్సే. చదువులో ఎప్పుడూ సాయంగా ఉంటుంది. టెన్త్, ఇంటర్, ఆ తర్వాత బీటెక్ చేసే విషయంలోనూ అక్క గైడెన్స్ ఉంది. నాకు అవసరమైనది అమ్మనాన్నలకు చెప్పి మరీ ఒప్పిస్తుంది. నేనే విషయంలోనైనా నిర్ణయం తీసుకోవడంలో ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తే చాలు వెంటనే పసిగట్టేస్తుంది. ట్యూషన్స్ చెప్పి, పార్ట్ టైమ్ వర్క్స్ చేస్తుంటుంది. చదువే జీవితాలను మార్చుతుంది అని ఎప్పుడూ చెబుతుంది. ఏదైనా అవసరం ఉంటుందని, నాకే డబ్బులు ఇస్తుంటుంది. – గోపాల్ నా బాధ్యత మా అమ్మ, నాయినలు కూలీనాలీ చేసుకుని బతుకుతుండిరి. నేను ఏడో తరగతి దాగా చదివిన. నలుగురు అక్కచెల్లెళ్ల తోడ నేను ఒక్కణ్ణే. ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు ముందుగల్లనే అయిపోయినయి. అమ్మ, నాయిన చనిపోతే చెల్లెలి బాధ్యత∙నాదే అనుకున్న. మంచిగ చదువుకుని మా ఇంటికి వెలుగైంది. ఇప్పుడు నా ఇద్దరు పిల్లల చదువుల సంగతి మా చెల్లెనే చూసుకుంటోంది. నా చెల్లెలిని చూస్తే గర్వంగా, సంతోషంగా ఉంటుంది. – సాయిలు మా అన్న త్యాగం గొప్పది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేటలో ఉంటున్నాం. మా అమ్మనాన్నలు చనిపోతే అన్నీ తానై చూసుకున్నాడు మా అన్న. కూలి పనులకు వెళుతూ నన్ను చదివించాడు. ఇవ్వాళ నేను ఉన్నత చదువు చదవడానికి కారణం మా అన్నయ్యే. ఎం.ఎ. బీఈడీ చేశాను. ఇప్పుడు విద్యాశాఖలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా పనిచేస్తున్నాను. అన్నయ్య చేతుల మీదుగానే పెళ్లి జరిగింది. ఈ రోజు నేను ఆనందంగా ఉన్నానంటే మా అన్ననే కారణం. నా కోసం అన్న చేసిన త్యాగం చాలా గొప్పది. – సరోజ కలిస్తే పండగే! రాఖీ పండగ నాడు మా అన్న మా ఇంటికైనా రావాలి. లేదంటే నేనే మా అన్న ఇంటికి వెళ్లాలి. అన్న ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తాడు. నేను ఇండ్లళ్ల పనులు చేస్త. నా పెళ్లయి పదిహేనేళ్లయినా ఏ ఒక్కసంవత్సరమూ రాఖీ కట్టుకోకుండా ఉన్నది లేదు. ఒకసారి అన్నకు ఆరోగ్యం బాగోలేకుండే. ఎంత తల్లడిల్లిననో. ఎంత మంది దేవుళ్లకు మొక్కుకున్ననో. అన్న ఉంటే ఎంతో ధైర్యంగా అనిపిస్తది. మేం, మా అన్నపిల్లలు, మా పిల్లలు కలిస్తే చాలు ఆ రోజు మా ఇంట్ల పండగే. ఇక రాఖీ పండగ అయితే చాలు, ఆరోజు అందరం కలిసి సినిమాకు కూడా పోయేవాళ్లం. రాఖీ పండగ నాడు మాత్రం మా అన్న నాకు చీర తేకుండా రాడు. – సుమలత ఒకరికొకరం రక్ష మా సుమలత మనసు మంచిది. తన చేత్తో ఏది తీసుకున్నా నాకు మంచి జరుగుతుందని చిన్నప్పటి నుంచి నాకు నమ్మకం. మేం సదువుకున్నది లేదు. కానీ, ఒకరి కష్టంలో ఒకరం తోడుంటం. మాది రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్‌ల పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నం. ఊరి నుంచి దూరంగా వచ్చి బతుకుతున్నవాళ్లం, మాకు మేమే రక్షగా ఉండాలనుకుంటాం. – సురేష్ మా మామయ్యకు మా అమ్మ రాఖీ కడుతుంది. నేను మా తమ్ముడు అజయ్‌కి రాఖీ కడతాను. పొద్దున్నే నేనూ, తమ్ముడు కొత్తబట్టలు వేసుకుంటాం. అమ్మ స్వీట్ చేస్తుంది. నాకు చాక్లెట్స్ ఇష్టం. అమ్మనడిగితే తిడుతుంది. కానీ, రాఖీ పండగ రోజు మాత్రం పెద్ద చాక్లెట్ కొని తమ్ముడితో నాకు ఇప్పిస్తుంది. ఒకటే చాక్లెట్ కదా అందుకని సగం చాక్లెట్‌ను తమ్ముడికి ఇస్తాను. ఈ పండగ చాలా బాగుంటుంది. – లాస్య ఎంత పని ఉన్నా ముందుంటాడు మాది తెలంగాణలోని చేవెళ్ల. ఆశావర్కర్‌గా పనిచేస్తున్నాను. రాఖీ పండగ వచ్చిందంటే చాలు మా తమ్ముడు ఇంటికి రాకుండా ఉండడు. ముగ్గురు అక్కచెల్లెళ్లం, ముగ్గురు అన్నదమ్ములం. మా శేఖర్ చిన్నవాడు. అందుకే మా కందరికీ వాడంటే కొడుకులెక్క. నాకు ముగ్గురు బిడ్డలు. అందరి బాగోగులు తెలుసుకుంటూ, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఎంత పని ఉన్నా ‘అక్కా’ అని వచ్చేస్తడు. – అమృత రాఖీ కడితేనే ఆ ఏడాది అంతా మంచి అమ్మనాన్నలు పనికిపోతే అక్కనే నన్ను ఎక్కువ చూసుకుంది. అమ్మలెక్కనే నా బాగోగులు చూసుకుంది. హైదరాబాద్ బాలానగర్‌లోని ఓ హాస్పిటల్లో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తా. మా అందరి పెళ్ళిళ్లు అయి ఎవరి కుటుంబాలు వారివి అయినా వారానికి ఒకసారైనా కలుసుకుంటం. రాఖీ పండగ వస్తే మాత్రం ఎక్కడున్నా అక్కల దగ్గరవాలిపోతా. వారి చేత రాఖీ కట్టించుకుంటేనే ఆ సంవత్సరం అంతా నాకు మంచిగ ఉంటుందని నమ్మకం. – శేఖర్ -
ఒలింపియన్ అంకితపై శైలు సంచలన విజయం
సాక్షి, విజయవాడ: సౌత్‌జోన్ జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి శైలు నూర్‌బాషా సంచలనం సృష్టించింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 11–8, 11–7, 12–14, 6–11, 11–8, 11–9తో అంకిత దాస్ (పీఎస్‌పీబీ)పై గెలిచింది. బెంగాల్‌కు చెందిన అంకిత 2012 లండన్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. అయితే శైలు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. సుతీర్థతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో శైలు 5–11, 7–11, 4–11, 8–11తో పరాజయం పాలైంది. ఆర్బీఐ తరఫున పోటీపడిన తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ క్వార్టర్ ఫైనల్లో... ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తరఫున ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు స్నేహిత్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. -
ట్రాక్టర్ బోల్తా..డ్రైవర్ మృతి
వెల్గటూరు: జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రం కంకరక్రేషర్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ మృతిచెందాడు. మృతుడు స్థానికంగా నివాసముంటున్న దండుగుల సాయిలుగా గుర్తించారు. సాయిలు మృతితో సంఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. -
సందేహాలెన్నో!?
సాక్షి, కామారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సాయిలు మృతి సంఘటనపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు హత్యగా పేర్కొంటుండగా.. అధికారులేమో ప్రమాదమంటున్నారు. సాయిలు మృతి ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం సంఘటన స్థలానికి వెళ్లి మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడి పలు వివరాలు సేకరించింది. అసలేం జరిగింది.. పిట్లం మండలం కారేగాం గ్రామ శివారులోని కాకివాగు సమీపంలో రోడ్డుపై గురువారం ఉదయం సాయిలు మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. సాయిలు తలకు గాయమై ఉండడంతో ఎవరో హత్య చేశారని కుటుంబ సభ్యులు అనుమానించారు. సంఘటన స్థలంలో ట్రాక్టర్ తిరిగిన ఆనవాళ్లు, సమీపంలో ఇసుక కనిపించడంతో సాయిలును ఇసుక మాఫియా హతమార్చిందని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సాయిలు బంధువులతో పాటు గ్రామస్తులు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన ఎర్ర అంబయ్య అనే ట్రాక్టర్ డ్రైవర్‌ను నిలదీయగా.. తన ట్రాక్టర్ ఢీకొట్టడం వల్లే సాయిలు చనిపోయాడని పేర్కొన్నాడు. దీంతో గ్రామస్తులు అంబయ్యను చితకబాదారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మృతుడి బంధువులను సముదాయించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, ఆర్డీవో రాజేశ్వర్, డీఎస్పీ నర్సింహారావు తదితరులు శుక్రవారం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కామారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సాయిలుది హత్య కాదని, ప్రమాదవశాత్తూ చనిపోయాడని ప్రకటించారు. పొంతనేదీ? సాయిలు వీఆర్ఏ కాదని, సాయిలు చిన్నాయన నారాయణ వీఆర్ఏగా పనిచేస్తున్నాడని అది కూడా మార్తాండ గ్రామంలోనని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. అయితే గ్రామాల్లో వంతులవారీ పద్ధతిన వీఆర్ఏలు పనిచేసే ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీ ప్రకారం నారాయణ పేరుపై సాయిలు వీఆర్ఏగా పనిచేస్తున్నాడని, చనిపోయిన రోజు కూడా పిట్లంలో రెవెన్యూ రికార్డులు రాయడానికి సాయిలు వెళ్లాడని అతడి భార్య సాయవ్వ, తండ్రి శివయ్య పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి కూడా నైట్ డ్యూటీ కోసం పిట్లం వెళ్తున్నానని చెప్పి వెళ్లాడంటున్నారు. ఇటుక లోడ్ దింపి వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్.. రోడ్డుపై పడి ఉన్న సాయిలును గమనించలేదని, దీంతో అతడి తలకు టైర్ తగిలి మరణించాడని విలేకరుల సమావేశంలో ఎస్పీ తెలిపారు. రోడ్డున వెళ్తున్న సాయిలు చొక్కా జేబుకు వీఆర్ఏ బిల్ల(గుర్తింపు బిల్ల) కనిపించడంతో అడ్డుకుంటాడని భావించి ఇసుక తరలిస్తున్నవాళ్లే ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాకి వాగు ఇసుక రీచ్ కాదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాయిలు చనిపోయిన తరువాత వచ్చిన రెండో ట్రాక్ట ర్ ఇసుక లోడ్‌తో ఉందని అధికారులే చెబుతుండడం అనుమానాలకు తావిస్తోంది. కాకివాగు ఇసుక రీచ్ కానపుడు రాత్రి వేళలో ఇసుకలోడుతో ట్రాక్టర్ ఎందుకు వెళ్తోందనేది ప్రశ్నార్థకంగా మారింది. రోడ్డున పడ్డ కుటుంబం... సాయిలుకు పెద్దగా వ్యవసాయ భూమి లేదు. వంశపారంపర్యంగా వస్తున్న గ్రామ సేవకుడి (వీఆర్ఏ) ఉద్యోగం చేస్తూ తల్లిదండ్రులతో పాటు భార్య, ముగ్గురు పిల్లలను పోశించేవాడు. ఆరు నెలల క్రితమే పెద్ద కూతురు వివాహం జరిపించడానికి గ్రామస్తులు తెలిపారు. సాయిలు మరణంతో భార్య, ఒక కూతురు, ఒక కుమారుడితోపాటు వృద్ధులైన తల్లిదండ్రులు దిక్కులేనివారయ్యారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కారేగాం ఘటనపై పీసీసీ చీఫ్ ఆరా కారేగాంలో వీఆర్ఏ సాయిలు మరణంపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరా తీశారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారామ్‌కు ఫోన్ చేసి సంఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని పేర్కొనడంతో ఆయన శుక్రవారం గ్రామానికి వెళ్లి మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది బాన్సువాడ డివిజన్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారాం ఆరోపించారు. శుక్రవారం కారేగాం గ్రామానికి వెళ్లి సాయిలు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక దందా నడుస్తోందన్నారు. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రకృతిని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆధారాలతో సహా అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమైందన్నారు. సాయిలు కుటుంబానికి రూ. 30 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
సాయిలు రెవెన్యూ ఉద్యోగి కాదు
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కారేగాం శివారులో బుధవారం రాత్రి మరణించిన బోయిని సాయిలు రెవెన్యూ ఉద్యోగి (వీఆర్ఏ) కాదని కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ శ్వేత స్పష్టం చేశా రు. ఆయనను ఎవరూ హత్య చేయలేదని, రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని వివరించారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్లో వారు విలేకరులతో మాట్లాడారు. సాయిలు బుధవారం రాత్రి రోడ్డుపై పడుకుని ఉన్నాడని, ఆ సమయం లో ఇటుకలోడు దింపి ట్రాక్టర్లో తిరిగి వస్తున్న డ్రైవర్ ఎర్ర అంబయ్య అతనిపై నుంచి వాహనాన్ని నడపడంతో మరణిం చాడన్నారు. వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి ట్రాక్టర్‌తో పారిపోయాడని వివరించారు. అదే దారిగుండా ఇసుక లోడుతో వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ సలీం, యజమాని మైస య్య, కూలీలు గంగాధర్, శ్రీను, సాయి, విజయ తదితరులు సాయిలు తలకు గాయమై చనిపోయినట్టు గమనించి ట్రాక్టర్‌ను వెనక్కు తిప్పుకుని వెళ్లారనన్నారు. కాగా సాయిలు వీఆర్ఏ కాదని, సాయిలు బాబాయి నారాయణ మార్తాండ గ్రామానికి వీఆర్ఏగా ఉన్నారన్నారు. కాకివాగు ఇసుక రీచ్ కాదన్నారు. రాళ్లతో కూడిన వాగని, దొడ్డు ఇసుక ఉంటుందన్నారు. సాయిలు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని ఆయన భార్య సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశారన్నారు. సాయిలును ఇసుక మాఫియా హత్య చేసినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. సాయిలు ఇంటి వద్ద గొడవపడి, మద్యం మత్తులో నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై పడిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిం దని ఎస్పీ శ్వేత వివరించారు. నిందితుడు అంబయ్య లొంగిపోయాడన్నారు. -
నిజామాబాద్ జిల్లాలో దారుణం
నిజామాబాద్: జిల్లాలో శనివారం దారుణం వెలుగు చూసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో దంపతులపై ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన జిల్లాలోని వర్ని మండం జాకోరాలో శుక్రవారం అర్ధ రాత్రి చోటుచేసుకుంది. భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలతో భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంచపు నాగయ్య(48), సాయవ్వ(40) దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాయవ్వ అదే గ్రామానికి చెందిన సాయిలుతో వివాహేతర సంబంధం నెరుపుతోంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి సాయవ్వ ఇంటికి వచ్చిన సాయిలు ఆమెను కోరిక తీర్చమని బలవంతపెట్టాడు. 20 రోజుల క్రితమే సాయవ్వ కుమారుడి వివాహం జరిగడంతో.. ఇంట్లో కోడలు ఉంది.. నా ఆరోగ్యం బాలేదని ఆమె అతన్ని అడ్డుకుంది. అయినా, వినకుండా ఆమెను బలవంతం చేయబోయాడు. ఇది గమనించిన ఆమె భర్త నాగయ్య, సాయిలును అడ్డుకొని ఇంట్లో నుంచి గెంటేశాడు. అనంతరం దంపతులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన సాయిలు గొడ్డలితో ఇద్దరిపై దాడి చేశాడు. దీంతో సాయవ్వ అక్కడికక్కడే మృతి చెందగా.. నాగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
అనాథాశ్రమం నుంచి ఇద్దరు బాలురు అదృశ్యం
రంగారెడ్డి మేడ్చల్ మండలం గౌడవెల్లి గ్రామంలో ఉన్న అనాథ బాలల ఆశ్రమం కృషిహోంలో ఉండే ఇద్దరు బాలురు కనిపించకుండాపోయారు. అనాథ గృహంలో ఆశ్రయం పొందుతున్న ఎన్.సాయిలు(13), మహేష్(10) అనే బాలురు బుధవారం ఉదయం టిఫిన్ చేసిన అనంతరం నుంచి కనిపించకుండా పోయారు. దీంతో నిర్వాహకులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవటంతో రాత్రి పోలీసులను ఆశ్రయించారు. కృషిహోం ట్యూటర్ ఎండీ సుమేర్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
వడ దెబ్బకు వ్యవసాయ కూలి మృతి
వడదెబ్బ తగిలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గంధమల్ల చిన్నసాయిలు(49) అనే వ్యవసాయంతో పాటు కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అలాగే గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులకు కూడా వెళ్లుతున్నారు. రోజువారిలాగే శుక్రవారం గ్రామంలో కూలీ పనులు చేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నీళ్లు తాగారు. నీళ్లు తాగిన వెంటనే అవస్థకు గురై అక్కడిక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య ఎల్లమ్మ, ఒక కుమారుడు ఉన్నారు. -
ఇందిరమ్మ బిల్లు రాలేదని వ్యక్తి ఆత్మహత్య
పాపన్నపేట : ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కొత్తపల్లి గ్రామ శివారులో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ విఠల్ కథనం మేరకు.. మండలంలోని యూసుఫ్‌పేటకు చెందిన సాయిలు (42)కు గతేడాది ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. దీంతో ఉన్న గుడిసెను కూలగొట్టి అప్పులు చేసి బేస్మెంట్ వరకు ఇంటిని నిర్మించాడు. కానీ.. నేటి వరకు ఆ బిల్లులు రాలేదు. ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు పూట గడవని పరిస్థితితో ఆందోళనకు గురైన సాయిలు.. మూడు రోజలుగా భోజనం చేయడం లేదు. గురువారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతక సాగారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కొత్తపల్లి గ్రామ శివారులో గల సాంబయ్య వ్యవసాయ బావి వద్ద సాయిలుకు చెందిన దుస్తులు శుక్రవారం కనిపించాయి. గాలించగా అతడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ విఠల్ వివరించారు. -
శైలు ప్రేమలో...
గ్రామీణ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా రూపొందుతున్న చిత్రం ‘శైలు’. కిరణ్, షాలు చౌరాసియా జంటగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీ విఘ్నేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మరపట్ల కళాధర్ చక్రవర్తి, జగత్ విఖ్యా బండి నిర్మించారు. సందీప్ దర్శకుడు. ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని ఆర్యన్ రాజేశ్ ఆవిష్కరించారు. ఆర్యన్ రాజేశ్ మాట్లాడుతూ ‘‘పాటలు, ట్రైలర్ చాలా బాగున్నాయి’’ అని అన్నారు. ‘‘ఈ మధ్య కామెడీ సినిమాలు బాగా తగ్గిపోయాయి. ఆ లోటును ఈ సినిమా భర్తీ చేస్తుంది. ప్రతి ఒక్కరినీ అలరించేలా ఈ సినిమాను రూపొందించాం’’ అని దర్శకుడు చెప్పారు. ఈ కార్యక్రమంలో దర్శకులు శ్రీవాస్, ఇ.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘శైలు’ జంట అల్లరి
‘ఎద చుట్టేసి.. కనికట్టేసి.. ననుపట్టేసిందో జాబిల్లి’ అంటూ శైలు చిత్ర హీరో కిరణ్, హీరోయిన్ షాలూపై యుగళగీతాన్ని చిత్రీకరించారు. కొవ్వూరు మండలంలోని దొమ్మేరు సావరం, దొమ్మేరు పరిసరాల్లో పంట పొలాల్లో శైలు చిత్ర షూటింగ్ శనివారం సందడిగా సాగింది. దర్శకుడు గారపాటి సందీప్ పర్యవేక్షణ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కొరియోగ్రాఫర్ బ్రదర్ ఆనంద్ నృత్య దర్శకత్వంలో హీరోహీరోరుున్లు స్టెప్పులేసి అల్లరి చేశారు. కెమెరామెన్‌గా మహీ చేర్ల, రచయితగా వాసు దొడ్డిపట్ల, నిర్మాత మరపట్ల కళాధర్ చక్రవర్తి వ్యవహరిస్తున్నారు. - కొవ్వూరు రూరల్ -
వేధింపులతో ఎస్సారెస్పీ ఈఈ ఆత్మహత్య
కరీంనగర్ క్రైం: ఉన్నతాధికారుల వేధింపులు భరించలేక ఎస్పారెస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన చక్రాల సాయిలు(53) కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్‌లోని ఎస్సారెస్పీ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా వీరి కుటుంబం హైదరాబాద్‌లోని హబ్సిగూడలో నివాసముంటున్నారు. విధుల కోసం సుల్తానాబాద్ కార్యాలయానికి వచ్చినప్పుడు కరీంనగర్లో ఉండేందుకు మంకమ్మతోటలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి నేరుగా మంకమ్మతోటలోని గదికి వచ్చిన సారుులు ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందించారు. ఉన్నతాధికారి ఒకరు వేధింపులకు గురి చేస్తున్నాడని సాయిలు తమతో చెప్పుకుని బాధపడ్డాడని భార్య పేర్కొంటోంది. -
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలోని జిల్లా సమాఖ్య భవనంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ పరిధిలోని 31 వార్డుల ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్‌కు మూడు చొప్పున మూడు రౌండ్లలో 31 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 10 గంటల లోపు పూర్తవుతాయి. కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సాయిలు పరిశీలించారు. మరోవైపు ఇద్దరు సీఐలతో పాటు నలుగురు ఎస్ఐలు, 8 మంది ఎఎస్ఐలతో పాటు 21 మంది పోలీసు సిబ్దంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.