సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం పాత డీఆర్‌డీఏ కార్యాలయ ఆవరణలోని జిల్లా సమాఖ్య భవనంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ పరిధిలోని 31 వార్డుల ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్‌కు మూడు చొప్పున మూడు రౌండ్లలో 31 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 10 గంటల లోపు పూర్తవుతాయి. కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సాయిలు పరిశీలించారు.
మరోవైపు ఇద్దరు సీఐలతో పాటు నలుగురు ఎస్‌ఐలు, 8 మంది ఎఎస్‌ఐలతో పాటు 21 మంది పోలీసు సిబ్దంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు.
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
Published Sun, May 11 2014 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement