The counting of votes
-
ఉప విజేతలెవరో?
► అన్నాడీఎంకే, డీఎంకేల పోటా పోటీ ► పుదుచ్చేరిలో కాంగ్రెస్, అన్నాడీఎంకే ఢీ ► నేడే ఓట్ల లెక్కింపు సాయంత్రానికి ఫలితాలు తమిళనాడులో మూడు, పుదుచ్చేరిలో ఒక స్థానంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగనుంది. అంతా సజావుగా సాగితే మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజేతలు ఎవరో సాయంత్రానికి తేలిపోనుంది. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ మొత్తం 234 స్థానాలు ఉండగా, ఈ ఏడాది మేలో ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో 232 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిగింది. నగదు, చీరలు, పంచెలు, మద్యం బాటిళ్లు సరఫరా చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టినట్లు ఆరోపణలు రావడంతో తంజావూరు, కరూరు జిల్లా అరవకురిచ్చి స్థానాల్లో ఎన్నికలను కోర్టు రద్దు చేసింది. మధురై జిల్లా తిరుప్పరగున్రం నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే శీనివేల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ స్థానాల్లో అన్నాడీఎంకే, డీఎంకే, పీఎంకే, బీజేపీ, డీఎండీకేలు తమ అభ్యర్థులను బరిలోకి దించారుు. ఉప ఎన్నికల్లో భాగంగా గత నెల 26 నుంచి ఈ నెల 2 వరకూ అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. ఈనెల 3న నామినేషన్ల పరిశీలన, 5వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు ఉపసంహరణ, అదే రోజు ఉప ఎన్నికల రంగంలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. తంజావూరు స్థానం నుండి 14 మంది, అవరకురిచ్చీ నుంచి 39 మంది, తిరుప్పరగున్రం నుంచి 28 మంది, పుదుచ్చేరి రాష్ట్రం నెల్లితోప్పు నుంచి 8 మంది బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ నెల 19వ తేదీన పోలింగ్ పూర్తి కాగా, 22న ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేశారు. అన్ని నియోజకవర్గాల్లోనూ అన్నాడీఎంకే, డీఎంకే అభ్యర్థులే ప్రధాన ప్రత్యర్థులుగా పోటీపడ్డారు. అరవకురిచ్చీలో డీఎంకే అభ్యర్థి కేసీ.పళనిస్వామి, అన్నాడీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ, తంజావూరులో అన్నాడీఎంకే అభ్యర్థి రంగస్వామి, డీఎంకే అభ్యర్థి డాక్టర్ అంజగం భూపతి, తిరుప్పరగున్రంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఏకే.బోస్, డీఎంకే అభ్యర్థి డాక్టర్ శరవణన్ పోటీ చేశారు. అలాగే, పుదుచ్చేరి నెల్లితోప్పులో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఓం శక్తిశేఖర్, పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. ఈ నెల 19న నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో 22వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. తంజావూరులో 69.41, అరవకురిచ్చీలో 82.15, తిరుప్పరగున్రంలో 71, నెల్లితోప్పులో 86 శాతం ఓట్లు పోలయ్యాయి. -
ఎదురులేని కారు
తొలి రౌండ్లలో తడబాటు చివరలో ఆకాశమే హద్దు హన్మకొండ : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కారుకు ఎదురులేకుండా పోయింది. ప్రత్యర్థి పార్టీల కళ్లలో దుమ్ముకొడుతూ విజయపథంలో దూసుకుపోయింది. తొలిరౌండ్లో సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు పోటీ ఇచ్చాయి. కానీ ఒక్కో రౌండు లెక్కింపు పూర్తవుతున్న కొద్దీ టీఆర్ఎస్ ప్రభంజనానికి హద్దు లేకుండా పోయింది. ఐదో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు స్వతంత్ర, కాంగ్రెస్ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 1 నుంచి ఎనిమిది రౌండ్లలో ప్రతీ రౌండ్‌కు ఆరు డివిజన్ల ఫలిలాలు వెల్లడించారు. తొమ్మిది, పది రౌండ్లలో మూడు డివిజన్లు, పదకొండు, పన్నెండు రౌండ్లలో రెండు డివిజన్ల వంతున ఫలితాలు వెల్లడించారు. మొత్తం పన్నెండు రౌండ్ల పాటు లెక్కించగా టీఆర్ఎస్ పార్టీ ఐదు రౌండ్లలో ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకుండా క్లీన్ స్వీప్ చేసింది. 2, 9, 10, 11, 12 రౌండ్లలో లెక్కించిన 14 డివిజన్లు టీఆర్ఎస్ వశమయ్యాయి. ఏనుమాముల మార్కెట్లో చేపట్టిన ఓట్ల లెక్కింపులో 5, 7 రౌండ్లలో టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఎదురైంది. ఈ రౌండు ఆరు డివిజన్ల వంతున లెక్కించగా టీఆర్ఎస్ పార్టీ ప్రతీ రౌండ్లో సగం డివిజన్లలో ఓటమి పాలైంది. ఐదో రౌండ్లో కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు చెరో స్థానంలో విజయం సాధించారు. ఏడో రౌండ్ జరిగిన లెక్కింపులో ఇద్దరు స్వతంత్రులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు. మూడో రౌండ్ నుంచి ఎనిమిదో రౌండ్ వరకు ప్రధాన రాజకీయ పార్టీలను ఆశ్చర్యపరిచేలా స్వతంత్ర అభ్యర్థులు క్రమం తప్పకుండా విజయం సాధిస్తూ వచ్చారు. ఐదు, ఏడు రౌండ్లలో ఇద్దరు వంతున విజయం సాధించగా 3, 4, 5 రౌండ్లలో ఒక్కొక్కరు వంతున విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే తొలి రౌండ్లో సీపీఎం విజయం సాధించి సంచలనం సృష్టించింది. అనూహ్యమైన ఫలితాలు వస్తాయేమోననే సంకేతాలు పంపింది. కానీ సీపీఎం సంచలనం మొదటి రౌండ్‌కే పరిమితమైంది. మిగిలిన పదకొండు రౌండ్లలో ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. వర్థన్నపేట పరిధిలో 12 డివిజన్లలో ఆరింటిలో టీఆర్ఎస్ ఓడిపోయింది. -
ఎక్కడ.. ఎవరికి
మెజారిటీపై ఎమ్మెల్యేల లెక్కలు గెలుపు ధీమాతో ప్రతిపక్ష నేతలు పెరిగిన పోలింగ్‌తో ఎవరికి లాభమో.. వరంగల్ : వరంగల్ పార్లమెంట్ స్థానం ఉప ఎన్నిక ఫలితం మంగళవారం తేలనుంది. ఓట్ల లెక్కింపు కొన్ని గంటల్లో మొదలుకానుంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నిక కావడంతో ఈ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గెలుపోటములు, ఓటింగ్ శాతం తీరు ఎలా ఉంటుందనే విషయంపై రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సాధారణ ఎన్నికలప్పుడు వచ్చిన మెజారిటీ వస్తుందా.. లేదా అనే అంశంపై ఎమ్మెల్యేలు లెక్కలు వేసుకుంటున్నారు. ఉప ఎన్నికలో వచ్చే తీర్పుతో ప్రస్తుత ఎమ్మెల్యేల పరిపాలన తీరు తెలిసిపోతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుంది. కానీ, వరంగల్ ఉప ఎన్నికలో మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరగడం.. ఏ రాజకీయ పార్టీకి బలం చేకూరుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. అరుుతే, ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తామని, సాధారణ ఎన్నికల్లో కంటే మెజారిటీ తగ్గినా స్పష్టమైన ఆధిక్యత ఉంటుందని అధికార టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లో తమకు ఆధిక్యం వస్తుందని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌లోనూ గెలుపు ఆశలు కనిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికల్లో కంటే తమకు పరిస్థితులు మెరుగయ్యాయని హస్తం పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు ఓటింగ్ మారిందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని, ప్రజలు తమకే మద్దతు తెలిపారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సాధారణ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుతం భూపాలపల్లి, పరకాలలో తమకు ఓట్లు పెరిగాయని చెబుతున్నారు. ఇక, వరంగల్ ఉప ఎన్నికలో మొదటిసారి పోటీ చేసిన వైఎస్సార్సీపీ ఓటింగ్ తీరుపై ఆశాభావంతో ఉంది. ఓటర్లు తమ పార్టీకి మద్దతు తెలిపారని భావిస్తోంది. ఎన్డీయే నేతలు సైతం ఉప ఎన్నిక ఫలితంపై ఆశావాహ ధృక్పథంతో ఉన్నారు. గతంలో కంటే తమకు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, ఉప ఎన్నిక ఫలితంతో ఇది స్పష్టమవుతుందని బీజేపీ నేతలు అంటున్నారు. పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో తమ పార్టీకి బలం పెరిగిందని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వామపక్ష కూటమి సైతం ఓటింగ్ శాతంపై ధీమాతో ఉంది. ప్రజల్లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత.. ఓటింగ్ శాతంలో తమకు కలిసి వస్తుందని భావిస్తోంది. రాజకీయ పార్టీల అంచనాలు ఇలా ఉండగా.. తుది ఫలితాలు ఎలా ఉంటాయనేది అందరిలో ఆసక్తి కలిగిస్తోంది. గత ఎన్నికలో ఓట్లు ఇలా... 2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ సెగ్మెంట్ లో 12,69,008 ఓట్లు పోలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరికి 6,95,918 (54.83 శాతం) ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యకు 3,02,981 (23.87 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ తరఫున పోటీ చేసిన రామగల్ల పరమేశ్వర్‌కు 2,06,200 (16.24 శాతం) ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. -
కొనసా..గుతున్న లెక్కింపు
మందకొడిగా ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్ బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు తొలి రౌండ్ ఫలితం వెల్లడి 1.30 గంట వరకు నాలుగు రౌండ్లు పూర్తి స్వతంత్రుల ప్రభావం నామమాత్రమే తుది ఫలితం నేటి మధ్యాహ్నానికి వెల్లడి! నల్లగొండ : నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ చాలా మందకొడిగా సాగుతోంది. నల్లగొండలోని నాగార్జున జూని యర్ కళాశాలలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రా రంభం కాగా, రాత్రి 11 గంటలు ముగిసే సమయానికి వెల్లడైంది కేవలం రెండు రౌండ్ల ఫలితాలే. ఈ రెండు రౌండ్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ముందంజలో ఉన్నారు. రాజేశ్వర్‌రెడ్డికి రెండు రౌండ్లలో కలిపి 7,418 ఓట్లు రాగా, ఆయన సమీప ప్ర త్యర్థి, బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహనరావుకు 5,761 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీ న్మార్ మల్లన్నకు 1,875 ఓట్లు, వామపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డికి 1,875 ఓట్లు లభిం చాయి. 1,815 ఓట్లు చెల్లనివి ఉన్నాయి. స్వతంత్రులకు నామమాత్రంగానే ఓట్లు లభించినా, చెల్లిన ఓట్లలో నా లుగు శాతం అంటే ప్రతి 100 మందిలో ఒకరికి అభ్యర్థు లు ఎవరూ నచ్చక నోటాకు ఓట్లు పడ్డాయి. ఇంకా 18 రౌండ్ల ఫలితాలు వెల్లడి కావాల్సి ఉండగా, తుది ఫలి తం గురువారం మధ్యాహ్నానికి వచ్చే అవకాశాలున్నా యి. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజేత తేలని పక్షంలో ఈ ఫలితం మరింత ఆలస్యం కానుంది. కట్టలు కట్టడానికే చాలా సమయం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో గణనీయంగా ఓట్లు పోలయ్యాయి. మొత్తం 2.81 లక్షల ఓట్లకు 1.53 లక్షల ఓట్లు నమోదయ్యాయి. వీటి లె క్కింపు కోసం అధికారులు చేసిన ఏర్పాట్ల కారణంగా లెక్కింపు ప్రక్రియలో తీవ్ర జాప్యం అవుతోంది. లక్షన్నరకు పైగా ఓట్లు లెక్కించేందుకు కేవలం 20 టేబుళ్లే ఏ ర్పాటు చేయడంతో ఆలస్యంగా అవుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానానికి 1.10 ల క్షలే పోల్‌కాగా, అక్కడ 28 టేబుళ్లు ఏర్పాటు చేసి ఓట్లు లెక్కించారు. కానీ, ఇక్కడ 40 వేల ఓట్లు అదనంగా పో లైతే, 8 టేబుళ్లు తగ్గించి ఏర్పాట్లు చేయడం గమనార్హం. దీంతో లక్షన్నర ఓట్లను కట్టలు కట్టేందుకే దాదాపు 10 గంటల సమయం పట్టింది. ఉదయం 8 గంటలకు ప్రా రంభమైన కట్టలు కట్టే కార్యక్రమం సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది. ఆ తర్వాత ఆరున్నర గంటలకు తొలి రౌండ్ ప్రారంభం కాగా, లెక్కింపు పూర్తయ్యే సరికి ఎనిమిది గంటలైంది. ఒక్కో టేబుల్‌కు 500 ఓట్ల చొ ప్పున రౌండ్‌కు 10,000 ఓట్లను లెక్కించారు. కానీ, అన్నీ లెక్కలు చేసుకుని తొలి రౌండ్ ఫలితాన్ని ప్రకటిం చేసరికి రాత్రి తొమ్మిది గంటలైంది. అంటే కౌంటింగ్ ప్ర క్రియ ప్రారంభమైన తర్వాత కట్టలు కట్టడం పూర్తయి తొలి రౌండ్ ఫలితం ప్రకటించేందుకు 13 గంటల స మయం పట్టిందన్నమాట. దీనికితోడు తొలిరౌండ్ పూ ర్తయిన తర్వాత కౌంటింగ్ సిబ్బంది షిఫ్ట్ మార్చడంతో రెండో రౌండ్ కౌంటింగ్ ప్రారంభం కావడానికి మరో గంట సమయం పట్టింది. షిఫ్ట్ మారిన సిబ్బందికి మళ్లీ సూచనలు చెప్పి రెండో రౌండ్ ప్రారంభించాల్సి వచ్చింది. చెల్లని ఓట్లు పది శాతం పట్టభద్రులకు ఎమ్మెల్సీ ఓటు హక్కు వినియోగంలో ఉ న్న చైతన్యం అంతంతమాత్రమేనని తేలింది. పోలైన ఓట్లలో దాదాపు 10 శాతం ఓట్లు చెల్లలేదంటే పట్టభద్రు లు ఓటు హక్కు ఎలా వినియోగించుకున్నారో అర్థం చే సుకోవచ్చు. ప్రాధాన్యతా క్రమంలో కేవలం 1, 2, 3 నంబర్లు మాత్రమే వేయాల్సి ఉండగా, టిక్కులు పె ట్టడం, ఒకే అభ్యర్థికి రెండు ప్రాధాన్యతలు ఇవ్వడం, నంబర్ వేసి మళ్లీ టిక్ పెట్టడం, నోటాకు పెట్టి మళ్లీ అ భ్యర్థికి టిక్‌పెట్టడం లాంటి కారణాలతో ఓట్లు చెల్లకుం డా పోయాయి. తొలిదశలో వెల్లడైన ఫలితాలను పరి శీలిస్తే ప్రతిపక్షం ఓట్లు బలంగా చీలినట్టు అర్థమవుతోం ది. అందరూ భావిస్తున్న విధంగానే బీజేపీ అభ్యర్థి రా మ్మోహనరావు రెండో స్థానంలో ఉండగా, కాంగ్రెస్, వా మపక్షాల అభ్యర్థులు కూడా గణనీయంగానే ఓట్లు తెచ్చుకున్నారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలింది. దీనికి తోడు అధికార టీఆర్ఎస్ హవా కూడా కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజే శ్వర్‌రెడ్డి తొలి రౌండ్ నుంచి మెజారిటీలోనే ఉన్నారు. ఇంకా 18 రౌండ్లు మిగిలి ఉండడంతో ఇంకా ఏదైనా జరుగుతుందేమో అనే అంచనాలున్నా టీఆర్ఎస్ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. పటిష్ట బందోబస్తు.. ఎన్నికల కౌంటింగ్ కోసం సీఆర్పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన ఓ కంపెనీ పోలీసులతోపాటు స్థానిక పోలీసు యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు కార్యక్రమంలో పాలుపంచుకుంది. ఎస్పీ, ఓఎస్డీ, డీఎస్పీతో పాటు దాదాపు 400 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. -
నేడే భవితవ్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠ వీడనుంది. ఓట్ల లెక్కింపు బుధవారం జరగనుంది. తుది ఫలితాలు బుధవారం అర్ధరాత్రి వరకు వెల్లడికావచ్చని అధికారులు చెబుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితాలు తేలకుంటే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 22న జరిగింది. మూడు జిల్లాల్లో కలిపి 2,81,138 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,53,220 మంది ఓటు హ క్కును వినిగియోంచుకున్నారు. ఈ ఎన్నికను బీ జేపీ, టీఆర్ఎస్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించినందున ప్రాధాన్యత ఓటు క్రమంలో లెక్కింపు నిర్వహిస్తారు. ముందుగా 50 చొప్పున బ్యాలెట్ పత్రాలను కట్టలుగా కట్టి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో లెక్కించనున్నారు. బ్యాలెట్ బాక్సుల్లోంచి ఓట్లను తీసి కట్టలుగా కట్టేందుకు కనీసం 10 గంటల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఎన్నిల తుది ఫలితాలు వెల్లడయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. వాళ్లో 400.. వీళ్లో 300.. కౌంటింగ్ కోసం మొత్తం 20 టే బుళ్లను ఏ ర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌కు రౌండ్‌కు 500 ఓట్లను లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్లో 1000 ఓట్లను లెక్కిస్తారన్నమాట. ఈ లెక్కన పోలైన ఓట్లన్నీ ప్రథమ ప్రాధాన్యత ఓటు లె క్కించేందుకు 16 రౌండ్లు అవసరం అవుతాయి. ఎన్నికల కౌంటింగ్ కోసం పెద్ద ఎత్తున సిబ్బం దిని వినియోగించుకుంటున్నారు. ప్రతి టేబుల్‌కు ఒకరు చొప్పున సూపర్వైజర్, ముగ్గురు సహాయకులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నారు. మొత్తం 20 టేబుళ్లకు 100 మంది ఒక్క షిఫ్టులో పనిచేస్తారు. స్ట్రాంగ్‌రూంల నుంచి బ్యాలెట్ బాక్సులు తెచ్చే సిబ్బంది, డ్రమ్ము ఇన్చార్జీలు, ఇతర సహాయకులు కలిసి రెండు షిఫ్టుల్లో కలిసి 400 మంది సిబ్బందిని వినియోగించుకోనున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కించాల్సి వస్తే 24 గంటల తర్వాత పని చేసేందుకు సిబ్బందిని నియమించుకున్నారు. కౌంటింగ్ కేంద్రానికి భద్రత కోసం సీఆర్పీఎఫ్ బెటాలియన్‌తోపాటు 300 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. మూడు జిల్లాల్లో కలిపి 1,53,220 ఓట్లు పోలయ్యాయి. మొదట చెల్లని ఓట్లు, నోటా ఓట్లు లెక్కిస్తారు. వీటిని కౌంటింగ్ నుంచి తొలగిస్తారు. మిగిలిన ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. ఈ ఎన్నికలలో గెలుపొందాలంటే.. చెల్లిన ఓట్లలో 50 శాతం కన్నా ఒక ఓటు అదనంగా రావాల్సి ఉంటుంది. చెల్లని ఓట్లు, నోటా ఓట్లు తేలిన తర్వాతే ఓ అభ్యర్థి విజేతగా నిలవాలంటే ఎన్ని ఓట్లు రావాలనేది తేలనుంది. విజేత తేలకపోతే.. ప్రథమ ప్రాధాన్యత ఓటుతో విజేత నిర్ధారణ కాని పక్షంలో రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత.. ఇలా విజేత తేలేంత వరకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లను లెక్కిస్తారు. ప్రథమ ప్రాధాన్యత ఓటుతో విజేత నిర్ణయం కాకపోతే.. కౌంటింగ్‌లో 22 మందిలో అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిని ఎలిమినేట్(తొలగిస్తూపోతారు) చేస్తారు. ఇలా తొలగించిన అభ్యర్థికి పోలైన ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికి వచ్చిందనేది లెక్కిస్తారు. ఇలా లెక్కించిన వాటిని మిగిలిన అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యతలో వచ్చిన ఓట్లకు కలుపుతారు. 22వ అభ్యర్థిని తొలగించిన ఓట్ల ఆధారంగా విజేత తేలకపోతే.. 21వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఓట్లు.. అప్పటికీ తేలకపోతే 20వ స్థానంలో ప్రథమ ప్రాధాన్యత ఓట్లు వచ్చిన అభ్యర్థి.. అప్పటికీ కాకపోతే 19వ స్థానంలో ఉన్న అభ్యర్థి.. ఇలా అవసరం మేరకు మొదటి స్థానంలో వచ్చిన అభ్యర్థి వరకు లెక్కిస్తారు. అప్పటికి కూడా విజేత తేలని పక్షంలో 22వ స్థానం సాధించిన అభ్యర్థికి వచ్చిన ప్రథమ ప్రాధాన్య ఓట్లలో తృతీయ ప్రాధాన్యత ఓట్లు పంచుతారు. అలా విజేత తేలేంతవరకు ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించి సరిపడినన్ని ఓట్లు తొలుత సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. -
టిక్..టిక్..టిక్..
మొత్తం పోలైన ఓట్లు 1,11,766, బరిలో ఉన్న అభ్యర్థులు 31 మంది, ఏర్పాటు చేసిన టేబుళ్లు 28, కౌంటింగ్ ఉ: 8 గంటల నుంచి, స్థలం: చాదర్‌ఘాట్ విక్టరీ ప్లేగ్రౌండ్ సాక్షి, సిటీబ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 22న నిర్వహించిన సంగతి తెలిసిందే. బుధవారం వెలువడనున్న ఈ ఫలితాల కోసం అభ్యర్థులు, రాజకీయ పార్టీలతో పాటు నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా అధికార టీఆర్ఎస్ భావిస్తుండగా... ప్రభుత్వ తీరుపై ప్రజల వ్యతిరేకత కు ఫలితాలు దర్పణంగా నిలుస్తాయని ప్రతిపక్షాలు.. ముఖ్యంగా బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. తమ విజయం ఖాయమని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతుండగా... తమకే అనుకూలమని బీజేపీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాదాపు తొమ్మిది నెలలకు జరిగిన ఈ ఎన్నికలు ప్రభుత్వ తీరుపై ప్రజల అభిప్రాయానికి అద్దం పడతాయని అధిక శాతం భావిస్తున్నారు. మొత్తం 1,11,766 మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని బ్యాలెట్లలో నిక్షిప్తం చేశారు. లె క్కింపు ఆలస్యమైనా...బుధవారం రాత్రిలోగా ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మొత్తం 435 పోలింగ్ కేంద్రాలకు చెందిన బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నారు. బరిలో 31 మంది అభ్యర్థులు ఉన్నారు. 32వ అంశంగా నోటా ఓటుంది. లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తున్నట్టు నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లే గ్రౌండ్లో ఓట్ల లెక్కింపు నేపథ్యంలో బుధవా రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మద్యం అమ్మకాలపై నిషేధం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు సందర్భంగా సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్ల పరిధిలో మద్యం అమ్మకాలపై నిషేధం విధించారు. వైన్‌షాప్‌లు, కల్లు కాంపౌండ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు బుధవారం సాయంత్రం ఆరు గంటల వరకు బంద్ చేయాలని జంట పోలీసు కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. -
రేపు ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్
నల్లగొండ : వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. డీఆర్వోలు బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య క్లోజ్డ్ వాహనాల్లో నల్లగొండకు తీసుకొచ్చి ఎన్జీ కాలేజీలో భద్రపరిచారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది. ఓట్ల లెక్కింపునకు 20 టేబుళ్లు ఏర్పాటు చేయనున్నారు. 18 నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. మూడు జిల్లాలో 400 పోలింగ్ కేంద్రాలు కాగా, ఒక్కోటేబుల్పై 20 పో లింగ్ బాక్సులను పెట్టనున్నారు. బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్లన్ని ట్రేలో వేసి, 50 ఓట్లకు ఒక బండిల్ చొప్పున కట్టనున్నారు. వాటిన్నింటినీ అన్ని డ్రమ్ముల్లో కలిపేసి మళ్లీ ఒక్కో టేబుల్‌కు 500 ఓట్లు చొప్పున పంపిణీ చేసి లెక్కింపు ప్రారంభిస్తారు. మొత్తం 1,53,548 మంది ఓటు హక్కు వినియోగించుకున్న నేపథ్యంలో 18 రౌండ్లకు వస్తాయి. ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు మూడు జిల్లాలకు చెందిన ఆర్డీఓలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. ప్రతి రెండు టేబుళ్లకు ఒక సూపర్వైజర్, కౌంటింగ్ సూపర్వైజర్లుగా తహసీల్దారు లేదా ఎంపీడీఓ, కౌంటింగ్ అసిస్టెంట్లుగా డిప్యూటీ తహసీల్దారు, సహాయ గణాంక అధికారి, ఒక్కో టేబుల్‌కు ఒక్కో సూక్ష్మ పరిశీలనుకుడిని నియమించారు. పట్ట‘భద్దకస్తులు’ శాసన మండలి ఎన్నిక లకు ఓటర్లు అంతగా ఆసక్తి చూపలేదు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లు భారీగానే పెరిగారు. మూడు జిల్లాల్లో మొత్తం ఓటర్లు 2,81,138 మంది ఉన్నారు. వీరిలో 1,53,548 మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిగిలిన 1,27,590 మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. లక్ష పైచిలుకు ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారంటే ఈ ప్రభావం అభ్యర్థుల జయాపజయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
బూత్‌లవారీ కౌంటింగ్ రద్దుపై మీరేమంటారు?: సుప్రీం
కేంద్రానికి నోటీసులు నాలుగు వారాల్లో సమాధానం చెప్పండి న్యూఢిల్లీ: ఎన్నికల్లో బూత్‌లవారీగా ఓట్ల లెక్కింపును రద్దు చేయాలన్న ఎన్నికల కమిషన్ (ఈసీ)విజ్ఞప్తిపై కేంద్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా తమ నిర్ణయమేంటో తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సోమవారం ఆదేశించింది. ప్రస్తుత నిబంధనలను సవరించకుండా ఈ చర్య చేపట్టవచ్చో లేదో చెప్పాలంటూ ఈసీకి సూచించింది. ఎన్నికల్లో గెలిచినవారు.. తమకు తక్కువ ఓట్లువచ్చిన ప్రాంతంపై కక్షసాధింపునకు దిగడానికి ఈ బూత్‌ల వారీ లెక్కింపు ఆస్కారమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కేంద్రం ఈ అంశంపై ఐదేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని, దీన్ని న్యాయ కమిషన్‌కు ఎందుకు రిఫర్ చేసిందని ప్రశ్నించింది. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం తన విధిని సక్రమంగా నిర్వర్తించగలదు. కానీ ఈ అంశంలో లా కమిషన్ ఏం చేస్తుందని.. వారి అభిప్రాయం అడిగారు. ఐదేళ్లుగా ఈ అంశాన్ని ఇలా నాన్చడంలో మీ ఉద్దేశం ఏమిటి’ అని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పంజాబ్‌కు చెందిన అడ్వొకేట్ వేసిన ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. -
చివరికైనా తీరు మారేనా..?
లెక్కింపు ప్రక్రియపై యంత్రాంగం నిర్లక్ష్యం అసలు సమయంలో చేతులెత్తేస్తున్న అధికారులు పోలీసుల ఆంక్షలతో తప్పని ఇబ్బందులు హన్మకొండ, న్యూస్‌లైన్ : ఒక వైపు ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఏర్పాట్లలో అధికార యంత్రాంగం వైఫల్యం.. ఇది చాలదన్నట్లు పోలీసుల ఆంక్షలు.. ఈనెల 12, 13 తేదీల్లో జరిగిన మునిసిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా అభ్యర్థులతోపాటు ఏజెంట్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులెదుర్కొన్నారు. ఈ రెండు రోజుల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని శుక్రవారం నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకైనా పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాటు కౌంటింగ్ కేంద్రంలో ఉదయం 8 గంటలకు జిల్లాలోని 12 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అధికారులు అనుకున్నట్టుగా అంతా సవ్యంగా ఉండి లెక్కింపు చేపడితే మధ్యాహ్నం 12 గంటల వరకే ఫలితాలు బయట పడతాయి. మొదటి 8 రౌండ్ల వరకే కొన్ని సెగ్మెంట్లలో గెలిచేదెవరనే విషయమై స్పష్టత రానుంది. మొత్తం 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. లెక్కింపు ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే రెండు దఫాలుగా శిక్షణ నిచ్చారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించి.. తర్వాత అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను బయటకు తీసి, సీళ్లు విప్పతారు. నిర్లక్ష్యం వీడేనా..! ఎన్నికల నిర్వహణ ఎలా ఉన్నా.. అసలు సమయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం బయటపడుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఏర్పాట్ల విషయంలో చివరకు చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే మునిసిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కౌంటింగ్ సిబ్బందికి కనీసం తాగునీరు ఏర్పాటు చేయకపోవడంపై ఉన్నతాధికారులతోనే వాగ్వాదానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు కూర్చోవడానికి కనీసం కుర్చీలు కూడా లేవు. భోజన ఏర్పాట్లల్లో సైతం అదే నిర్లక్ష్యం చోటుచేసుకుంది. పోలీసుల ఓవరాక్షన్ సరేసరి. కౌంటింగ్ సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లను సైతం లోనికి పంపించేందుకు ఆటంకాలు కల్పించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సార్వత్రిక ఎన్నికల చివరి ఘట్టం ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలుకానుంది. ఏనుమాముల మార్కెట్లో నిర్వహించే ఓట్ల లెక్కింపు నిమిత్తం ఇప్పటికే ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియా, ఉన్నతాధికారులు లోనికి వెళ్లాల్సిన గేట్లను ప్రకటించారు. దీంతో వీరికి ఇబ్బందులు తప్పేలా లేవు. ఒక దారి నుంచి వెళ్లాల్సిన వారు మరో దారి నుంచి వెళితే.. వారంతా మార్కెట్ చుట్టూ తిరగాల్సిందే. పోలీసులు తనిఖీలు నిర్వహించి, పాస్‌లు, గుర్తింపు కార్డులను పదేపదే పరిశీలించి లోనికి పంపిం స్తుంటంతో ఈసారి దారి తప్పితే గమ్యం వెతుక్కొవాల్సిన పరిస్థితి ఎదురుకానుంది. సిబ్బందికి తిప్పలు తప్పేనా.. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించడం వల్ల ఫలితాలు త్వరగానే వచ్చే అవకాశాలున్నా.. ఆయా సెగ్మెంట్ల ఆర్ఓలు ప్రకటించే వరకూ అధికారికంగా ఫలితం వెలువడదు. ఒక్కో టేబుట్ నుంచి రౌండ్ల వారీగా ఫలితాల సేకరణ ఇబ్బందిగా మారుతోంది. ప్రతీ టేబుల్ వద్ద ఒక్కో ఉద్యోగిని ఫలితం చెప్పేందుకే ఏర్పాటు చేయాలని ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది విన్నవించారు. దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వసతులపై దృష్టి పెట్టాలి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో జిల్లాలోని అన్ని సెగ్మెంట్ల నుంచి ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అనుచరులు భారీగా కౌంటింగ్ కేంద్రం వద్దకు తరలివస్తారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్న కారణంగా తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి. ఇప్పటికే రెండు పర్యాయాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రం లోపలకు వచ్చి బయటకు వెళ్లాలన్నా.. మళ్లీ లోపలకు రావాలన్నా కష్టమే. యంత్రాంగం కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన వసతులు కల్పిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే ఆస్కారం ఉండదు. -
కౌంటింగ్‌కు కేటీఆర్ దూరం
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే కె.తారకరామారావు శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపునకు దూరంగా ఉంటున్నారు. 2009లో ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగగా.. ఆయన కౌంటింగ్‌కు దూరంగానే ఉన్నారు. 2010 ఉప ఎన్నికల్లో మాత్రం కౌంటింగ్‌కు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి జరుగుతున్న ఎన్నికల్లో గెలుపు తనదే అన్న ధీమాతో కేటీఆర్ కౌంటింగ్‌కు దూరంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలను పర్యవేక్షించే బాధ్యత కేటీఆర్ తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన ఓట్ల లెక్కింపునకు రావడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. -
కారు జోరు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రాదేశిక పోరులో కారు జోరు కొనసాగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. జిల్లాలో 52 జెడ్పీటీసీ స్థానాలకు 38 స్థానాలు కైవసం చేసుకుని జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేస్తోంది. 27 మంది జెడ్పీటీసీల మద్దతు ఉంటే జెడ్పీ చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. కానీ టీఆర్ఎస్కు సాధారణ మెజారిటీ కంటే 11 జెడ్పీటీసీలు అధికంగా వచ్చాయి. తెలంగాణ సాధన కోసం ఆ పార్టీ చేసిన పోరాటానికి జిల్లావాసులు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అవసరమైన భారీ మెజారిటీ వచ్చింది. టీడీపీకి కంచుకోటగా పేరున్న జిల్లా పరిషత్‌ను తొలిసారిగా టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఆ పార్టీ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లువెత్తుతున్నాయి. బోథ్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల పరిధిలోని మొత్తం జెడ్పీటీసీ స్థానాలను టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. బోథ్‌లో ఏడు, మంచిర్యాలలో మూడు, చెన్నూర్‌లో నాలుగు జెడ్పీటీసీ స్థానాలను గులాబీ అభ్యర్థులు విజయం సాధించారు. నామమాత్ర స్థానాల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో నామమాత్ర స్థానాలకు పరిమితమైంది. కేవలం పది జెడ్పీటీసీ స్థానాలను మాత్రమే ఆ పార్టీ గెలుచుకోగలిగింది. పలు నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఖాతాను కూడా తెరువలేదు. తెలంగాణపై చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతమన్న టీడీపికి రెండు జెడ్పీటీసీ స్థానాలే వచ్చాయి. భైంసా జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి, దహెగాంలో బీఎస్పీ అభ్యర్థి జెడ్పీటీసీలు గెలుపొందారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతిచ్చిన బీజేపీకి జిల్లాలో ఒక్క జెడ్పీటీసీ స్థానం కూడా దక్కలేదు. ఎంఐఎం, సీపీఐ, సీపీఎంలు ఖాతా తెరువలేదు. మండల పరిషత్లపైనా గులాబీ జెండా.. అత్యధిక మండల పరిషత్లపైనా టీఆర్ఎస్ జెండాను ఎగురవేసింది. జిల్లాలో మొత్తం 636 ఎంపీటీసీ స్థానాలుండగా, మూడు ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 633 స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరుగగా, టీఆర్ఎస్ 292 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. మండలాల వారీగా పరిశీలిస్తే.. 52 మండల పరిషత్‌లకు 20 మండల పరిషత్‌ల చైర్పర్సన్ పీఠాలను దక్కించుకునేందుకు టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. 27 చోట్ల హంగ్ ఫలితాలు వచ్చినా 20కి పైగా మండలాల్లో టీఆర్ఎస్సే అధిక్యం సాధించింది. 165 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగలిగిన కాంగ్రెస్‌కు నాలుగు మండల పరిషత్‌లలో మాత్రమే స్పష్టమైన మెజారిటీ దక్కింది. భైంసాలో మాత్రం స్వతంత్రులే ఎక్కువగా ఎంపీటీసీలుగా గెలుపొందారు. కేవలం 63 ఎంపీటీసీ స్థానాలను గెలుచుకున్న టీడీపీ ఏ ఒక్క మండల పరిషత్‌లో కూడా స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీకి 24 ఎంపీటీసీలు, ఎంఐఎంకు రెండు, బీఎస్పీకి 28, సీపీఐకి ఏడు చొప్పున ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. 55 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. అర్ధరాత్రి వరకు కొనసాగిన ఓట్ల లెక్కింపు జిల్లాలో స్థానిక సంస్థ ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో జరిగాయి. మొదటి విడత ఏప్రిల్ 6న 21 మండలాల్లో పోలింగ్ జరుగగా, రెండో విడత 31 మండలాల్లో అదేనెల 11న జరిగింది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ జరుగడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమైంది. మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన లెక్కింపు.. అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగింది. ముందుగా బ్యాలెట్ పేపర్లను ఒక చోట పోసి రెండు బ్యాలెట్లను వేర్వేరుగా డబ్బాల్లో వేశారు. ఆ తర్వాత 25 బ్యాలెట్లకు ఒక కట్టగా కట్టి ఓట్లను లెక్కించారు. జిల్లాలో ఐదు రెవెన్యూ డివిజన్లలో ఈ లెక్కింపు జరిగింది. ఆదిలాబాద్ డివిజన్లోని పది మండలాల ఓట్లను జిల్లా కేంద్రంలోని కొలాం ఆశ్రమ పాఠశాలలో లెక్కించారు. నిర్మల్ డివిజన్లోని 13 మండలాల లెక్కింపు నిర్మల్ డిగ్రీ కళాశాలలో జరిగింది. ఉట్నూర్ డివిజన్లోని ఎనిమిది మండలాల ఓట్లు ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌లో, ఆసిఫాబాద్ డివిజన్లోని తొమ్మిది మండలాల ఓట్లు ఐటీడీఏ బాలికల హాస్టల్లో, మంచిర్యాల డివిజన్లోని 12 మండలాల ఓట్ల లెక్కింపు లక్సెట్టిపేట్లోని సాంఘీక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో జరిగింది. క్యాంపునకు టీఆర్ఎస్ జెడ్పీటీసీలు.. జిల్లా పరిషత్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీఆర్ఎస్కు స్పష్టమైన మెజారిటీ వచ్చినప్పటికీ ఆ పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు నడుపుతున్నారు. చైర్పర్సన్ పీఠానికి ఆ పార్టీలో పోటీ నెలకొంది. మంచిర్యాల ప్రాంతానికి చెందిన ఓ జెడ్పీటీసీ, నిర్మల్ ప్రాంతానికి చెందిన మరో జెడ్పీటీసీలు చైర్పర్సన్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే సుమారు 31 మంది టీఆర్ఎస్ జెడ్పీటీసీలు మంగళవారం క్యాంపునకు తరలివెళ్లారు. వారిలో పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకే జెడ్పీ చైర్మన్ ఎన్నికవుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
నేతలు అ‘టెన్షన్’
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఎన్నికల ఫలితాలు సమీపిస్తుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతల్లో ఒకటే ఆందోళన నెలకొంది. సోమవారం మున్సి‘పోల్’ ఫలితాలు వెలువడనుండడంతో వారిలో మళ్లీ టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ 30న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో సుమారు 10 రోజుల పాటు నాయకులు విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా వెలువడనున్న ఫలితాలు వారిలో గుబులు రేపుతున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు కామారెడ్డి, బోధన్, ఆర్మూరు మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు సోమవారం జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ కళాశాల ఆవరణలో జరగనుంది. ఈనెల 13న జిల్లాలోని 36 జడ్పీటీసీ, 583 ఎంపీటీసీ స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. 16వ తేదీన జిల్లాలోని రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల లెక్కింపు ఉంది. ఇలా వరుస ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు, సీనియర్లలో ఉత్కం ఠ మొదలైంది. మున్సిపల్, జడ్పీ పీఠాలపై పార్టీల గురి... ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజకీయ పదవులకు ఎట్టకేలకు మోక్షం కలగనుంది. త్వరలోనే కొత్త ప్రజాప్రతినిధులు కొలువు దీరనున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు వివిధ పార్టీల నుంచి పోటీచేసిన నేతల భవిష్యత్ తేలనుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అగ్రనేతలు ఫలితాల విశ్లేషణలో తలమునకలై ఉన్నారు. సుమారుగా మూడున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న మండల, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో పాగా వేయడమే ప్రధాన పార్టీల నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు ఈసారి మున్సిపల్, ‘స్థానిక’ ఎన్నికల్లో తలపడగా, కాంగ్రెస్, టీఆర్ఎస్లు మాత్రమే మేయర్, చైర్మన్, ఎంపీపీ, జడ్పీ చైర్మన్ పదవులను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుడండం విశేషం. జిల్లా కేంద్రంలో పార్టీల అగ్రనేతల మకాం మార్చి 5న ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ వెంటనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే నెల 10న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మూడున్నరేళ్ల తర్వాత మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా, సార్వత్రిక ఎన్నికలు కూడా ముగిశాయి. మొత్తానికి మరో ఐదేళ్ల వరకు ఎన్నికల ఊసెత్తే అవకాశం లేకుండా ఎన్నికల పరంపర సాగింది. పీఠాలు సాధించి పట్టునిలుపుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. సోమవారం నగర, పురపాలక, మంగళవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల ఎన్నికల ఫలితాలు వెలువడనుండగా, క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల సీనియర్ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహరచనలో నిమగ్నమయ్యారు. ఫలితాలు వెలువడటమే తడవు, మెజార్టీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను తమ తమ శిబిరాలకు తరలించేందుకు ఇప్పటికే పక్కా వ్యూహం రూపొందించారు. జిల్లాలో జరిగిన వరుస ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే కాగా, తమ తమ ఇమేజ్‌తో ముడిపడిన ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే టెన్షన్ మాత్రం అగ్రనేతలను వీడటం లేదు. -
పుర ఫలితం నేడే
సాక్షి, ఖమ్మం: పుర పోరులో విజేతలెవరు.. పరాజితులెవరో మరి కొద్ది గంటల్లో బయటపడనుంది. సుమారు నెల పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో ఈ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటరు తీర్పుతో గంటల వ్యవధిలోనే చైర్మన్ పీఠం కూడా ఎవరికి దక్కనుందో తేలనుంది. సోమవారం ఈ ఓట్ల లెక్కింపునకు సంబంధించి కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో మొత్తం 97 వార్డుల్లో 523 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సగటున 75.6 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 1,35,235 ఓట్లకు గాను 1,02,309 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కొత్తగూడెంలో 33 వార్డులకు 190 మంది, ఇల్లెందులో 24 వార్డులకు 173 మంది, మధిరిలో 20 వార్డులకు 86 మంది, సత్తుపల్లిలో 20 వార్డులకు 74మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఎవరికివారు తమదే విజయం అని ధీమాగా ఉన్నారు. ఈ ఓట్ల లెక్కింపునకు కొత్తగూడెం, ఇల్లెందు, సత్తుపల్లి, మధిరలో 125 మంది సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. ఓట్ల లెక్కింపు కోసం కొత్తగూడెంలో ఆరు టేబుళ్లు, ఇల్లెందులో నాలుగు టేబుళ్లు, మధిరలో ఐదు, సత్తుపల్లిలో నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ప్రతి చోట నాలుగు లేదా ఐదు రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. మధ్యాహ్నం 12 గంటల్లోపు అన్ని చోట్లా కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది. నువ్వా..నేనా..? కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీల్లో చైర్మన్ పీఠం కోసం ప్రధాన పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ నాలుగు చోట్ల చైర్మన్ అభ్యర్థులుగా వార్డుల్లో బరిలో ఉన్న వారిపైనే ఉత్కంఠ నెలకొంది. వీరు ఇక్కడ విజయం సాధిస్తేనే చైర్మన్ రేసులో ఉంటారు. కొత్తగూడెం మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ వైఎస్సార్సీపీ, సీపీఐ కూటముల మధ్య పోటీ నెలకొంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా బీసీ మహిళకే రిజర్వు అయింది. ఇక్కడ చైర్పర్సన్ పీఠం కోసం కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీ పోటీ పడతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా 14వ వార్డులో బరిలో ఉన్న మడత రమ, వైఎస్సార్సీపీ నుంచి ఎండీ షంషాద్, టీడీపీ నుంచి 20వ వార్డులో బరిలో ఉన్న మడుగు వెంకటలక్ష్మి, 13వ వార్డు బరిలో ఉన్న చెరుపల్లి రాధిక పీఠం కోసం పోటీ పడుతున్నారు. బీసీ మహిళకు రిజర్వు అయిన సత్తుపల్లి నగర పంచాయతీపై జెండా ఎగుర వేసేందుకు వైఎస్సార్సీపీ, టీడీపీ పోటీ పడుతున్నాయి. వైఎస్సార్సీపీ నుంచి చైర్పర్సన్ అభ్యర్థిగా తోట సుజలరాణి, టీడీపీ నుంచి కందిమళ్ల నాగేశ్వరమ్మ బరిలో ఉన్నారు. మధిర నగర పంచాయతీ చైర్మన్ పీఠం ఎస్సీ మహిళకు రిజర్వు అయింది. ఇక్కడ చైర్పర్సన్ అభ్యర్థులుగా వైఎస్సార్సీపీ నుంచి 11వ వార్డు అభ్యర్థి మెండెం పుష్పలతను ఆపార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి 18వ వార్డు బరిలో ఉన్న సూదులగుంట వాణి, టీడీపీ నుంచి ఎర్రగుంట లక్ష్మీ రేసులో ఉన్నారు. ఇలా ప్రధాన పార్టీలు చైర్మన్ పీఠంపై కన్నేయడంతో .. అందరి చూపూ రేసులో ఉన్న ఈ అభ్యర్థుల వార్డులపైనే ఉంది. క్యాంపు రాజకీయాలకు మంతనాలు.. పుర, పరిషత్ ఫలితాలు వెంటవెంటనే వెలువడుతుండడంతో క్యాంపు రాజకీయాలకు ఆయా పార్టీల నేతలు, చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు. పుర ఫలితం వెలువడిన వెంటనే సాయంత్రం నుంచే తమ పార్టీల అభ్యర్థులను క్యాంపులకు తరలించాలని పార్టీ నేతలు యోచిస్తుండగా..ఈ ఖర్చు అంతా పెట్టుకోవడానికి చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థు రెడీ అంటున్నారు. అలాగే ఫలితాలు బేరీజు వేసుకొని ఒకటి రెండు వార్డులు తక్కువయితే స్వతంత్రులు ఎవరు గెలుస్తారని లెక్కలు వేస్తున్నారు. ఇలా గెలిచే అవకాశం ఉన్నవారితో ఇప్పటికే చైర్మన్ అభ్యర్థులుగా ఉన్నవారు మంతనాలు సాగించారు. వారు విజయం సాధిస్తే వెంటనే క్యాంపులకు తరలించాలని, ఆలస్యమైతే ఇతర పార్టీలు ఎగురేసుకెళ్తాయని చైర్మన్ అభ్యర్థులు ముందే మేల్కొన్నారు. ఇక పరిషత్ ఫలితాలకు సంబంధించి మండల స్థాయిలో మండల పరిషత్ చైర్మన్‌ను కైవసం చేసకోవడం ఒక ఎత్తయితే.. జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడం ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే జెడ్పీ చైర్మన్ అభ్యర్థులు క్యాంపు రాజకీయాల కోసం రూ.లక్షలు వెచ్చించడానికి కూడా వెనకాడడం లేదు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల కమిషన్ పేర్కొనడంతో.. ఇన్ని రోజులు క్యాంపు రాజకీయాలు తట్టుకోవడం ఎలా..? అని జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. -
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మున్సిపాలిటీలకు ఎన్నికలు మార్చి 30న జరిగాయి. ఆరు మున్సిపాలిటీల్లో 189 వార్డులు ఉండగా, ఆదిలాబాద్‌లోని 34వ వార్డు, భైంసాలోని మూడో వార్డు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 187 వార్డులకు ఎన్నికలు జరగ్గా, ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటల నుంచి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక్కో మున్సిపాలిటీలో ఒక్కో వార్డుకు పోటీ చేస్తున్న అభ్యర్థులవారీగా ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆరు మున్సిపాలిటీల ఈవీఎంలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో భద్రపర్చారు. వీటికి నిరంతరం ఉన్నతాధికారుల పర్యవేక్షణ, భారీ భద్రత సిబ్బంది మధ్య స్ట్రాంగ్ గదుల్లో పెట్టారు. వాయిదా పడుతూ వస్తున్న పుర ఫలితాలు దాదాపు 40 రోజుల తర్వాత వెలువడనుండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఆరు మున్సిపాలిటీలకు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేశారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లను లెక్కించేందుకు 58 టేబుళ్లు వేశారు. ఒక్కో టేబుల్‌కు ముగ్గురు అధికారుల చొప్పున నియమించారు. 40 మంది సిబ్బందిని రిజర్వులో ఉంచారు. వీటితో కలిపి మొత్తం కౌంటింగ్ సిబ్బంది 300 మందిని నియమించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదివారం కౌంటింగ్ కేంద్రాల వద్ద సిబ్బంది, అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. కంప్యూటర్లు, స్ట్రాంగ్ రూంలో సౌకర్యాలు, వార్డులవారీగా ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తుతోపాటు 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. అభ్యర్థుల్లో ఆందోళన నలబై రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న మున్సిపల్ బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కౌన్సిలర్ అభ్యర్థుల కలలు నేటితో సాకారం అవుతాయా? బెడిసి కొడతాయా? అనేది సోమవారం ఓటరు తీర్పుతో తేటతెల్లంకానుంది. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 2వ తేదీన వెలువడాలి. కానీ, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాయిదా పడింది. ఇదిలా ఉండగా, ఆరు మున్సిపాలిటీల్లో భైంసా మున్సిపాలిటీ ఫలితాలు ఉదయం 10 గంటల వరకు వెలువడే అవకాశాలున్నట్లు అధికారులు పేర్కొంటు న్నారు. -
ఇటు నుంచి ఇటే!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మున్సిపల్ చైర్మన్ పీఠాలపై కన్నేసిన పార్టీలు గెలుపు గుర్రాలను బుట్టలో వేసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే గెలిచిన కౌన్సిలర్లను క్యాం పులకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నాయి. కొన్ని పార్టీలు నేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచే కౌన్సిలర్లుగా గెలిచిన వారిని క్యాంపునకు తరలించాలని నిర్ణయించి నట్లు సమాచారం. అవసరమైతే అభ్యర్థులను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకురాకుండానే క్యాంపునకు తరలించేందుకు మరికొన్ని పార్టీలు ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఆరు మున్సిపాలిటీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అన్ని పార్టీల అభ్యర్థు లు హోరాహోరీగా తలపడ్డారు. పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడమే కాకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం పంపిణీ చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరగాలి. కానీ ఫలితాలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఈనెల 12కు వాయిదా పడింది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు రోజు రావడంతో ఫలితాలపై అభ్యర్థులతోపాటు, రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారమయ్యాకే చైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల సంఘం ఆదివారం ప్రకటించింది. దీంతో చైర్మన్ ఎన్నిక నోటిఫికేషన్ వెలువడి.. చైర్మన్ ఎన్నిక రోజు వరకు ఈ క్యాంపులు కొనసాగే అవకాశాలున్నాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలిస్తే.. భైంసా మున్సిపాలిటీలో మొత్తం 23 వార్డులున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలతోపాటు అక్కడ బలంగా ఉన్న ఎంఐఎం కూడా పూర్తి స్థానాల్లో పోటీ చేయలేదు. దీంతో ఈ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడే అవకాశాలున్నాయి. చైర్మన్ స్థానం దక్కించుకోవాలంటే కనీసం 13 స్థానాలను కైవసం చేసుకోవాలి. కాగా ఈ బల్దియాలో ఎంఐఎం కీలకం కాబోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మల్ మున్సిపాలిటీలో 36 వార్డులున్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ దీటుగా బీఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఐకేరెడ్డి తన అనుచరులను దాదాపు అన్ని వార్డుల్లో పోటీలో నిలిపారు. ప్రధాన పార్టీలకు దీటుగా, బీఏస్పీ కూడా క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చైర్మన్ పదవి ఎవరికి వరిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. బెల్లంపల్లి బల్దియా రాజకీయాలు కొంత భిన్నంగా ఉన్నాయి. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్ల్లో చీలిక వచ్చింది. ఈ రెండు పార్టీలు రెండు వర్గాలుగా విడిపోయాయి. చిలుముల శంకర్ అనుచరులు, మాజీ చైర్మన్ సూరిబాబు అనుచరులు వేర్వేరుగా క్యాంపులను నిర్వహించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీఆర్ఎస్లో నియోజకవర్గ మాజీ ఇన్చార్జి ప్రవీణ్, పట్టణాధ్యక్షులు సురేష్‌ల మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. సీపీఐ కూడా కొన్ని స్థానాల్లో పోటీ చేసింది. కాగజ్‌నగర్‌లో 28 స్థానాలున్నాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ వంటి ప్రధాన పార్టీలకు దీటుగా కోనేరు కోనప్ప తన అనుచరులను బీఎస్పీ తరుపున బరిలో దింపారు. ఇక్కడ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక రసకందాయంలో పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచిర్యాలలో మున్సిపాలిటీ పోరు హోరాహోరీగా సాగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేశారు. బీజేపీ, టీడీపీలు కొన్ని స్థానాల్లో పోటీకి పరిమితమైంది. ఇటీవల కాంగ్రెస్ మంచిర్యాలలో సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపుల వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నేతలు ప్రకటించడం చర్చనీయంశంగా మారింది. అలాగే టీఆర్ఎస్ కూడా క్యాంపు నిర్వహించే అవకాశాలున్నాయి. జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మున్సిపాలిటీ విషయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులతో ఆదివారం డీసీసీ అధ్యక్షులు సీఆర్ఆర్ ఇంట్లో సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఇప్పటికే సమావేశం జరిగింది. -
‘పుర’ ఫలితాలు నేడే
సాక్షి, రంగారెడ్డి జిల్లా: టిక్.. టిక్.. టిక్.. గడియారం చప్పుడు రాజకీయ పార్టీల నేతల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మరికొద్ది సేపట్లో పురపాలక సంఘాల ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం, పోలింగ్ పనుల్లో బిజీగా గడిపిన నేతల భవితవ్యం కొన్ని గంటల్లో తేలనుంది. సోమవారం ఉదయం 8గంటలకు పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. గత మార్చి 30న జిల్లాలోని వికారాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రాదేశిక, సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఫలితాల తాలూకు ప్రభావం ఉంటుందని భావించిన పలువురు నేతలు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా వాయిదా పడ్డాయి. ఇప్పుడు అన్ని ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగియడంతో ఫలితాలను తేల్చేందుకు ఎన్నికల సంఘం ఉపక్రమించింది. ఇందులో భాగంగా సోమవారం పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు ప్రకటించనుండగా.. మంగళవారం ప్రాదేశిక స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తేలనున్న 663 మంది భవిష్యత్తు ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీల పరిధిలో 119 కౌన్సిలర్ స్థానాలకుగాను వివిధ పార్టీలకు చెందిన 663 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. శక్తియుక్తులన్నీ కూడగట్టి జోరుగా ప్రచారం నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పలు ఫీట్లు చేశారు. ఓటింగ్ సమయం వరకు గెలుపు కోసం కృషి చేసిన వీరంతా నెలకుపైబడి ఫలితాల కోసం అంచనాలు వేసి తమ బలమెలా ఉందనే కోణంలో రకరకాల సర్వేలు నిర్వహించారు. మొత్తంగా సోమవారం అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనే అంశం మధ్యాహ్నం వరకు స్పష్టం కానుండడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లెక్కింపు ఇక్కడే.. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు మార్చి 30న పోలింగ్ జరిగింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పురపాలక ఎన్నికల ఫలితాలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ సోమవారం చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇబ్రహీంపట్నం, బడంగ్పేట్, పెద్ద అంబర్పేట్ నగర పంచాయతీలకు సంబంధించి నాదర్గుల్లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అదేవిధంగా వికారాబాద్ మున్నిపల్ ఎన్నికల కౌంటింగ్ వికారాబాద్‌లోని ఎస్ఏపీ కాలేజీలో, తాండూరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు తాండూరు టీఆర్సీలో నిర్వహిస్తున్నారు. -
నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం పాత డీఆర్డీఏ కార్యాలయ ఆవరణలోని జిల్లా సమాఖ్య భవనంలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ పరిధిలోని 31 వార్డుల ఓట్ల లెక్కింపునకు పది టేబుళ్లను ఏర్పాటు చేశారు. టేబుల్‌కు మూడు చొప్పున మూడు రౌండ్లలో 31 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై 10 గంటల లోపు పూర్తవుతాయి. కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ సాయిలు పరిశీలించారు. మరోవైపు ఇద్దరు సీఐలతో పాటు నలుగురు ఎస్ఐలు, 8 మంది ఎఎస్ఐలతో పాటు 21 మంది పోలీసు సిబ్దంది కౌంటింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. -
జోగిపేట నగర పంచాయతీకి తొలి మహిళా చైర్మన్ ఎవరో!
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట నగర పంచాయతీకి మొదటి సారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు మొట్ట మొదటి చైర్మన్ (మహిళ) అవుతారో సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో 20 వార్డులకు గాను 107 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,4,5,8,9.10,13,14,16,19 వార్డులను మహిళలకు కేటాయించారు. అయితే జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలోకి దింపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,047 ఓట్లకుగాను 13,031 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6556 మంది పురుషులు, 6475 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 81.21 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 20, టీఆర్ఎస్ తరఫున 19, టీడీపీ తరఫున 17 మంది, సీపీఎం తరఫున ఒకరు, బీజేపీ తరఫున ఐదుగురు పోటీలో ఉన్నారు. 50 శాతానికి పైగా అభ్యర్థులు యువకులే ఉండడం విశేషం. ైచె ర్మన్ పదవికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పోటీ ఉన్నాయి. ఇరు పార్టీలు కూడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలు మారిన అభ్యర్థులు నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పార్టీలు మారి పోయారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. చైర్మన్ ఎన్నికలో వారు ఎవరికి సహకరిస్తారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మరి కొందరు బహిరంగంగా తాము పోటీ చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపారు. చైర్మన్ రేసులో.. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ రేసులో కాంగ్రెస్ తరఫున సురేందర్‌గౌడ్, హెచ్.నారాయణ గౌడ్, హెచ్.రామాగౌడ్, డాకూరి జోగినాథ్ సతీమణులు, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్లూరి రజని శివప్రకాశ్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. మాజీ వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్ కూడా చైర్మన్ పదవిని ఆశిస్తూ టీడీపీ తరఫున భార్యతో పాటు ఆయన కూడా 10,11 వార్డుల్లో పోటీ చేశారు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. నేడు సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపు జోగిపేట నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలోని మొదటి అంతస్తులో ఎన్నికల లెక్కింపును నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏజెంట్ పాస్‌లను ఇది వరకే అభ్యర్థులకు జారీ చేసినట్లు కమిషనర్ జి.విజయలక్ష్మి తెలిపారు. -
టెన్షన్.. టెన్షన్
సాక్షి, ఒంగోలు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సోమవారం... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మంగళవారం... ఆ తర్వాత 16వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఇలా వరుసగా, ఎన్నికల ఫలితాల వెల్లడి క్రమంలో రాజకీయ శ్రేణుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. జిల్లావ్యాప్తంగా ఊరూరా రాజకీయ చర్చలే నడుస్తున్నాయి. ఏపార్టీ గెలుస్తోంది.. ఏఅభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తోందనే విషయంపై చిన్నా,పెద్దా లెక్కలు కడుతున్నారు. ఎమ్మెల్యే, ఎంపీలుగా ఎవరు గెలవనున్నారో తేలేముందు .. మున్సిపల్, ప్రాదేశిక స్థానాలు ఏపార్టీ పరం కానున్నాయోననే విషయంపై అందరి దృష్టిపడింది. ఈ రెండింటి ఫలితాలను బట్టి సార్వత్రిక అంచనాలు కొలిక్కిరానున్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆరు మున్సిపాలిటీల ఓట్లలెక్కింపు.. జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్, కందుకూరు మున్సిపాలిటీల ఎన్నికలు కోర్టు వ్యాజ్యాల నేపథ్యంలో వాయిదా పడగా, మార్కాపురం, చీరాల మున్సిపాలిటీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు, కనిగిరి నగర పంచాయతీలకు మార్చి నెల 30వ తేదీన పోలింగ్ జరిగింది. అన్నిచోట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొనగా.. చీరాల, గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థులూ గట్టిపోటీనే ఇచ్చారు. అయితే, అన్నిచోట్లా సామాజికవర్గ ఓటింగ్, మహిళలు, యువత అధికంగా వైఎస్ఆర్ సీపీకే మొగ్గు చూపినట్లు రాజకీయ పరిశీలకులు ఇప్పటికే అంచనా వేశారు. పట్టణాల్లో టీడీపీ ప్రాభవం పూర్తిగా తగ్గిపోగా.. ఓటర్లలో విశ్వసనీయతను ఆపార్టీ సంపాదించుకోలేకపోయిందనే విశ్లేషణలు వినిపించాయి. జెడ్పీచైర్మన్గిరీ ఎవరి పరం.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జిల్లాలో రెండు దశలుగా జరిగాయి. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 790 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ 8, టీడీపీ 7, స్వతంత్రులు 6 చోట్ల ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. దీంతో 769 ఎంపీటీసీ, 56 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ పదవి రిజర్వేషన్ ఓసీ జనరల్ కాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమపార్టీ తరఫున జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా బీసీ సామాజికవర్గ నేతకు కేటాయించారు. ఆమేరకు నూకసాని బాలాజీని వైఎస్ఆర్ సీపీ ప్రకటించింది. టీడీపీ నుంచి మన్నె రవీంద్ర, ఈదర హరిబాబును ప్రకటించారు. మంగళవారం తేలే ఫలితాల్లో వీరి భవితవ్యంతో పాటు మండల పరిషత్ అధ్యక్షులెవరనేది వెల్లడికానుంది. అటు మున్సిపల్, ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు 16న జరిగే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాతకాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. గెలుపు ధీమాపై ఎవరికి వారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. రాజకీయ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. -
కౌన్ బనేగా మేయర్!
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరపాలక సంస్థతోపాటు కామారెడ్డి, ఆర్మూ ర్, బోధన్ మున్సిపాలిటీలలోని 141 డివిజన్లు, వార్డులకు మార్చి 30 న ఎన్నికలు జరిగాయి. సోమవా రం ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ క్రమంలో ఎవరెవరికి, ఎక్కడెక్కడ ఆధిక్యం వస్తుందో ప్రధాన పార్టీలు ఓ అం చనాకు రాలేకపోతున్నాయి. అయినా, కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీల ను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు వ్యూహం రూ పొందిస్తున్నాయి. నిజామాబాద్ మేయ ర్ పీఠంపై కన్నేసిన కాంగ్రెస్ పార్టీ నా మినేషన్ల ఘట్టం ముగియగానే కాపర్తి సుజాతను అభ్యర్థిగా ప్రకటించింది. పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ నగర మే యర్ పీఠాన్ని ప్రతిష్టాత్మకంగా భావిం చి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇద్దరు మే యర్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి దక్కించుకునేందుకు ఐదుగురు కాంగ్రెస్ మహా మహులు తమ సతీమణులను బరిలో దింపి పావులు కదుపుతున్నారు. ఫలి తాలు వెలువడటమే ఆలస్యం, కౌన్సిల ర్లను క్యాంపులకు తరలించేందుకు సి ద్ధంగా ఉన్నారు. కామారెడ్డి, బోధన్ నుంచి ముగ్గురేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ ఒక్కొక్కరినే చైర్మన్ అభ్యర్థులుగా ప్రకటించింది. అందరికీ సవాలే నిజామాబాద్ నగర మేయర్ పదవి ప్ర ధాన పార్టీలకు సవాల్‌గా మారిం ది. ఇక్కడ 50 డివిజన్లలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, ఎంఐఎం, సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ నుంచి పీసీసీ మాజీ చీఫ్ డి.శ్రీనివాస్, అప్పటి టీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు బస్వ లక్ష్మీనర్సయ్య, ఎమ్మెల్యే యెండల లక్ష్మీ నారాయణ, వైఎస్ఆర్ సీపీ నుంచి అంతిరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితర నేతలు ప్రచారం నిర్వహించారు. మేయర్ పదవికి టీఆర్ఎస్ నుంచి మాజీ కార్పొరేటర్ సుధాం లక్ష్మి, విశాలినీరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. మెజార్టీపై స్పష్టత లేని టీడీపీ, బీజేపీ మేయర్ అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, సోమవారం జరిగే ఓట్ల లెక్కింపు అనంతరం కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి స్విఫ్ట్ కారు ఆఫర్ ఇచ్చి క్యాంపునకు తరలించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడా అంతే అర్మూర్ మున్సిపాలిటీలో 23 వార్డులుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ అన్ని స్థానాలకు పోటీ చేశాయి. చైర్పర్సన్ పదవి కోసం ఈ రెండు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. మెరుగైన ఫలితాలు వస్తాయనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఐదుగురు పోటీ పడుతుండటం టీఆర్ఎస్కు అవకాశంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. మున్సిపల్ మాజీ చైర్మన్ త్రివేణి గంగాధర్ సతీమణి పుష్పలత, ఏబీ శ్రీనివాస్ అలియాస్ చిన్నా సతీమణి ఏబీ శ్రీదేవి, కంచెట్టి లక్ష్మి, మాజీ వైస్ చైర్పర్సన్ పీసీ ఉషారాణి, కాందేశ్ సంగీత మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. టీఆర్ఎస్ విషయానికి వస్తే స్వాతీసింగ్ బబ్లూ ఒక్కరి పేరే వినిపిస్తోంది. తమ పార్టీ నుంచి గెలిచినవారితోపాటు, ఇతర పార్టీల విజేతలు, స్వతంత్రులను జత చేసుకొని, కాంగ్రెస్ అసంతృప్తివాదులతో కలిసి క్యాంపునకు తరలే ప్రయత్నంలో టీఆర్ఎస్ ఉంది. టీడీపీ, బీజేపీ మొత్తం స్థానాలలో పోటీలో కారణంగా చైర్ పర్సన్ పదవిపై ఆ రెండు పార్టీలకు ఆశలు లేనట్టే. క్యాంపు రాజకీయాలకు సిద్ధం జనరల్ మహిళకు కేటాయించిన కామారెడ్డి మున్సిపాలిటీలో 33 వార్డులుండగా, హోరాహోరీ పోరులో ఏ పార్టీకీ ఆధిక్యం లభిస్తుందన్న స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం పోటాపోటీ క్యాంపు రాజకీయాలకు పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. కామారెడ్డిలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆయా పార్టీల అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. చైర్పర్సన్ పదవికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. మాజీ వైస్ చైర్పర్సన్ కారంగుల శకుంతలారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఆర్.శోభాగౌడ్, పిప్పిరి సుష్మ, చాట్ల లక్ష్మి బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ రాష్ర్ట కార్యదర్శి కొమ్ముల తిరుమల్‌రెడ్డి సతీమణి సుజాత చైర్పర్సన్ రేసులో ఉన్నారు. ఆశల పల్లకీలో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇలాకా బోధన్ మున్సిపాలిటీని జనరల్‌కు కేటాయించారు.35 వార్డులలో ప్రధా న పార్టీలు అభ్యర్థులను బరిలోకి దింపాయి. మొత్తం 337 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్‌కు ఆధిక్యం లభిస్తే ఇక్కడ చైర్మన్ కావాలని ముగ్గురు నేతలు కలలు కంటున్నారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆబిద్అలీ, పట్టణాధ్యక్షుడు కేవీ సత్యం, మాజీ కౌన్సి లర్ గుణప్రసాద్ చైర్మన్ కావాలని ఆశపడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి జేఏసీ నాయకుడు శివరాజ్ చైర్మన్‌గిరీపై కన్నేశారు. టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆరేడు స్థా నాలలోనే పోటీకి పరిమితం కావడంతో చైర్మన్ పదవి వైపు చూడటం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలను కొనసాగిస్తే, ఆయా పార్టీల నుంచి చైర్మన్ పీఠం ఎక్కాలనుకున్న నేతలు, క్యాంపుల కు కీలకంగా మారాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కుర్చీ’పై పార్టీల గురి
మునిసిపాలిటీ, నగర పంచాయతీ చైర్పర్సన్ల ఎంపికపై లాబీయింగ్ గెలిచే అవకాశాలున్న స్వతంత్రులతో బేరసారాలు నర్సంపేట మినహా.. ఎక్కడా పోటీ ఇవ్వని టీడీపీ హన్మకొండ, న్యూస్‌లైన్ : పుర పోరు ముగిసి.. ఓట్ల లెక్కింపు సమయం దగ్గర పడుతుండటంతో చైర్పర్సన్ ఎంపికపై పార్టీల నేతలు దృష్టి పెట్టారు. ఇందుకోసం ఇప్పటి నుంచే లాబీయింగ్ మొదలైంది. జిల్లాలోని జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లి నగర పంచాయతీల్లో మార్చి 30న ఎన్నికలు జరిగాయి. ప్రచార సమయంలోనే ప్రధాన పార్టీలన్నీ తమ తరఫున చైర్పర్సన్, చైర్మన్‌గిరి అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. జనగామ చైర్పర్సన్ జనరల్ మహిళకు రిజర్వు కాగా, మహబూబాబాద్ ఎస్టీ మహిళకు కేటాయించారు. భూపాలపల్లి నగర పంచాయతీ స్థానం ఎస్సీ జనరల్‌కు, పరకాల ఎస్సీ జనరల్, నర్సంపేట బీసీ జనరల్‌కు రిజర్వు అయింది. రెండు మునిసిపాలిటీలు, మూడు నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్యనే జరిగింది. ఈ రెండు పార్టీలే ఆయా వార్డుల్లో అభ్యర్థులను రంగంలోకి దింపారు. టీడీపీ మాత్రం నర్సంపేట మినహా.. ఒక్కచోట కూడా చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. చాలా వార్డుల్లో అభ్యర్థులనే పోటీకి దింపలేదు. దీంతో పురపాలకాల్లో జెండా ఎగురవేసే అవకాశం టీడీపీకి అసలే లేదు. స్వతంత్రుల మద్దతు అనివార్యం.. జనగామ చైర్పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి వెన్నం శ్రీలతను టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ప్రకటించారు. ఇక్కడి 16వ వార్డు నుంచి శ్రీలత ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఈసారి ఎలాగైనా ఆమెను చైర్‌పర్సన్‌గా చేసేందుకు పొన్నాల స్వతంత్రులు, ఇతర పార్టీల నుంచి పోటీ చేసిన వారి మద్దతు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వారితో మంతనాలు జరుపుతున్నారు. పూర్తిస్థాయి మద్దతు వచ్చే అవకాశం లేకపోవడంతో.. స్వతంత్రులు, ఇతర పార్టీల మద్దతు అనివార్యంగా మారింది. టీఆర్ఎస్కు పరిస్థితి ఇలానే ఉంది. 7వ వార్డు నుంచి పోటీ చేసిన గాడిపెల్లి ప్రేమలతారెడ్డిని టీఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించింది. గట్టిపోటీనే ఉంది. ఈ పార్టీకి చైర్పర్సన్ పీఠం దక్కాలంటే స్వతంత్రుల మద్దతు తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది. ‘మానుకోట’లో మద్దతు లాభించేనా..? మహబూబాబాద్‌లో చైర్పర్సన్ పీఠం కోసమే టీఆర్ఎస్.. సీపీఐతో దోస్తీ చేసింది. కాంగ్రెస్ పార్టీ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ పెట్టింది. ఇక్కడ కాంగ్రెస్ తరఫున భూక్యా ఉమా మురళీనాయక్, టీఆర్ఎస్ నుంచి అనితా నెహ్రూనాయక్‌ను ప్రకటించారు. అయితే ఇక్కడ ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయి మెజార్టీ రాకుండా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీపీఐ, టీడీపీ మూడేసి స్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. ఈ ఆరింటా వారు గెలిచే అవకాశాలున్నాయని తెలుస్తోంది. సీపీఐ, టీడీపీలు ఇక్కడ టీఆర్ఎస్కు మద్దతునిచ్చే అవకాశం ఉంది. అయితే స్వతంత్రులు కూడా కొన్నిస్థానాల్లో గట్టిపోటీనివ్వడంతో.. వారి మద్దతు కోసం మంతనాలు జరుపుతున్నారు. పరకాలలో పోటాపోటీ పరకాలలో చైర్మన్ పీఠానికి పోటాపోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి బొచ్చు వినయ్, దుబాసి వెంకటస్వామి, క రుణశ్రీ, కరుణ పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి బొ చ్చు కృష్ణారావు, మడికొండ సంపత్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ పార్టీలు మాత్రం ఇంకా ఎవరికీ చైర్మ న్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయలేదు. ఆశావహులు మాత్రం తమకే పీఠమంటూ అధినేతల వద్దకు క్యూ కడుతున్నారు. ఆశలు ఫలించేనా..? నర్సంపేట నగర పంచాయతీకి కూడా ఆశావహులు తీవ్రంగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఒక్కచోట మాత్రం టీడీపీ చైర్మన్ పీఠంపై కొంత ఆశ పెట్టుకుంది. ఆ పార్టీ నుంచి వేవుుల బొందయ్యుగౌడ్, పెండెం ఆనంద్, కాంగ్రెస్ నుంచి పాలారుు శ్రీనివాస్, పాలెల్లి రాంచంద్రయ్యు, రుద్ర ఓంప్రకాశ్, నాగెల్లి వెంకటనారాయుణగౌడ్, టీఆర్ఎస్ నుంచి కావుగోని శ్రీనివాస్, గోనెల రవీందర్, నారుుని నర్సయ్యు, గుంటి కిషన్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక్కడ ఆశావహులు తమకు మద్దతివ్వాలంటూ గెలిచే అభ్యర్థులను ఇప్పటి నుంచే వేడుకుంటున్నారు. భూపాలపల్లి ఎవరికో..? భూపాలపల్లి చైర్మన్ పీఠం కోసం టీఆర్ఎస్లో పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్.. సీపీఐతో జత కట్టింది. అయితే టీఆర్ఎస్ హోరాహోరీ పోటీనివ్వడంతో.. చైర్మన్ పీఠంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్ నుంచి చల్లూరి సమ్మయ్య తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సమ్మయ్యను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించింది. టీఆర్ఎస్ నుంచి బి.రవి, జోగు సమ్మయ్య, కొక్కరి చిన్న రాజయ్య తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీ ఖర్చులిస్తాం.. చైర్మన్ పీఠం కోసం కన్నేసిన వారంతా ఇప్పుడు కౌన్సిలర్లుగా గెలిచే వారితో బేరసారాలకు దిగుతున్నారు. పార్టీలను పక్కనపెట్టి.. తమకు మద్దతునివ్వాలంటూ వారిని మెప్పించుకునేందుకు పాట్లు పడుతున్నారు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చులన్నీ తిరిగి ఇస్తామని, నిధుల్లో ప్రాధాన్యం ఇస్తామంటూ బుజ్జగిస్తున్నారు. స్థానికంగా పార్టీల విషయాలను పక్కన పెట్టుకుందామని, చైర్మన్ పీఠం కోసం కలిసిపోదామంటూ బతిమిలాడుతున్నారు. -
విధుల పంచాయితీ
వివాదంగా మారిన ఉద్యోగుల కాపలా {స్టాంగ్‌రూంల వద్ద సెక్యూరిటీ గార్డు బాధ్యతలపై విమర్శలు జెడ్పీ సీఈఓ ఆదేశాలపై సర్వత్రా నిరసన విధుల్లో చేరిన సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మహిళా ఉద్యోగులకు ఊరటనిచ్చిన మినహాయింపు జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : స్థానిక ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లను కాపలా పెట్టడం వివా దంగా మారింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లాలోని ములుగు, పరకాల, మహబూబాబాద్, వరంగల్, నర్సంపేట, జనగామ రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆరు స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చారు. వీటి భద్రత బాధ్యతలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియను సుప్రీం కోర్టు వాయిదా వేయడంతో స్ట్రాంగ్ రూంల వద్ద రాష్ట్ర ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. సుప్రీం ఆదేశాల ప్రకారం వచ్చే నెల ఏడో తేదీ తర్వాతే లెక్కింపు చేపట్టాలి. తుది విడత పోలింగ్ జరిగిన రోజు నుంచి లెక్కేస్తే... సుమారు 30 రోజుల వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చిన బ్యాలెట్ బాక్సులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సీఈసీ నిర్ణయం తీసుకుంది. స్ట్రాంగ్ రూంలు జిల్లా కేంద్రంలో ఉంటే కలెక్టర్ గానీ... జేసీ గానీ, రెవెన్యూ డివిజన్లలో ఉంటే ఆయా డివిజన్లకు చెందిన ఆర్డీఓలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పరిశీలించాలని ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ పేపర్లు చెదలు, చీడపురుగులతో పాడవకుండా పరిశీలించేందుకు ఆర్డీఓలతోపాటు ఆయా మండలాలకు చెందిన ఆర్ఓలు, ఏఆర్ఓలు... పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో వారంలో ఒక రోజు స్ట్రాంగ్ రూముల్లో ఉన్న బ్యాలెట్ బాక్స్‌లను పరిశీలించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎస్ఈసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉంది. ఈ క్రమంలో జిల్లాలో పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లకు స్ట్రాంగ్ రూంల వద్ద కాపలా ఉండాలని సీఈఓ ఆంజనేయులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతిరోజూ ముగ్గురు చొప్పున సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు మూడు షిప్టులుగా ఎనిమిది గంటలపాటు విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీ చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అరుుతే ఈ విధుల నుంచి మహిళా ఉద్యోగులను మినహాయించడం వారికి ఊరటనిస్తోంది. ఇది సరికాదు... ఎన్నికల్లో భాగంగా బ్యాలెట్ బాక్సులను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టినప్పటికీ... పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం సరికాదని తెలంగాణ పంచాయతీరాజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బేహర శ్రీకాంత్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే... ఇక్కడ పీఆర్‌కు చెందిన ఉద్యోగులకు కూడా డ్యూటీలు వేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పీఆర్ ఉద్యోగులు ఇప్పటి వరకు ఎన్నడూ స్ట్రాంగ్ రూంల వద్ద విధులు నిర్వర్తించలేదని... జెడ్పీ సీఈఓ నిర్ణయంతో వారు ఆందోళనలకు గురవుతున్నారన్నారు. స్ట్రాంగ్‌రూంల వద్ద పీఆర్ ఉద్యోగులను కాపలా పెట్టడం పోలీసులను అవమానించినట్లేనని పేర్కొన్నారు. ఇలాంటి వివాదాస్పదమైన నిర్ణయంపై సీఈఓ పునరాలోచించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రెండు దశల్లో ప్రాదేశిక ఎన్నికలు
ఒంగోలు, న్యూస్‌లైన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అంగీకరించింది. తొలుత నిర్ణయించిన ప్రకారం ఎన్నికలను ఏప్రిల్ 6న ఒకేదశలో నిర్వహించి 8వ తేదీ ఓట్ల లెక్కింపు చేపట్టాల్సి ఉంది. అయితే పలు విభాగాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో రాష్ర్ట ఎన్నికల కమిషన్ సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో రెండు దశల్లో ఎన్నికల నిర్వహణకు న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. దీంతో శనివారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజా షెడ్యూల్ విడుదల చేసింది. దాని ప్రకారం జిల్లాలో ఏప్రిల్ 6న 28 మండలాలకు, ఏప్రిల్ 11న 28 మండలాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగే మండలాలు: చీరాల, వేటపాలెం, పర్చూరు, కారంచేడు, చినగంజాం, మార్టూరు, ఇంకొల్లు, యద్దనపూడి, అద్దంకి, కొరిశపాడు, బల్లికురవ, సంతమాగులూరు, జే.పంగులూరు, యర్రగొండపాలెం, దోర్నాల, పెద్దారవీడు, పుల్లలచెరువు, త్రిపురాంతకం, మార్కాపురం, కొనకనమిట్ల, తర్లుపాడు, పొదిలి, గిద్దలూరు, అర్థవీడు, బేస్తవారిపేట, కంభం, రాచర్ల, కొమరోలు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరిగే మండలాలు: ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులుప్పలపాడు, మద్దిపాడు, కొండపి, టంగుటూరు, సింగరాయకొండ, పొన్నలూరు, జరుగుమల్లి, మర్రిపూడి, కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, వలేటివారిపాలెం, ఉలవపాడు, కనిగిరి, సీఎస్‌పురం, హెచ్‌ఎంపాడు, పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల, దర్శి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు.సార్వత్రిక ఎన్నికలపై స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం పడుతుందనే భావనతో తాత్కాలికంగా కౌంటింగ్ విషయాన్ని వాయిదా వేశారు. త్వరలోనే కౌంటింగ్ తేదీని ప్రకటిస్తామంటూ ఎస్ఈసీ ప్రకటించింది. -
నెల పైగా నిరీక్షణక్షణం
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ : ఎవరైనా గుప్పెట మూసి.. ‘లోన ఏముందో చెప్పుకో చూద్దాం?’ అంటేనే ఒకింత ఉత్కంఠ మొదలవుతుంది. మూసిన ఆ గుప్పెట్లో ఉన్నది ఏమైనా.. దాని సైజు ‘గుప్పెడు మించదు’ అన్న ఆధారం మనకున్నా.. ‘ఫలానాదే ఉంది’ అని బల్లగుద్ది చెప్పలేం. అలాంటిది.. ఎన్నికల బరిలో దిగి, గెలుపు కోసం ప్రచారాన్ని హోరెత్తించి, శక్తియుక్తులన్నింటినీ ధారబోసి, సామదానభేద దండోపాయాలను ప్రయోగించి, కరెన్సీ నోట్లను.. కరపత్రాలకన్నా ధారాళంగా పంచి, మద్యాన్ని మినరల్ వాటర్ కన్నా ఉదారంగా పోయించి, ఓటరు దేవుళ్లను పోలింగ్ బూత్‌ల వరకూ నడిపించిన అభ్యర్థులు.. వారిచ్చింది వరమో, శాపమో తెలుసుకునేందుకు నెలకు పైగా ఆగాల్సి వస్తే ఇంకెంత ఉత్కంఠ నెలకొంటుంది? ఈసారి జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల బరిలో నిలిచిన 2,947 మంది అభ్యర్థులకు ఆ పరిస్థితి అనివార్యమైంది. ప్రాదేశిక ఎన్నికలు ఏప్రిల్‌లోనే జరగబోతున్నా.. వాటి ఫలితాలను మే నెలలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే వెల్లడించాలని సుప్రీంకోర్టు స్పష్టీకరించింది. కోర్టు నెల పైగా నిరీక్షణక్షణం ఉత్తర్వులను ప్రధాన పార్టీలు స్వాగతిస్తున్నా.. ప్రాదేశిక అభ్యర్థులు మాత్రం ‘అమ్మో! గుండెలు ఉగ్గబట్టుకుని నెల పైగా ఎదురు చూడాలా? ఎలారా దేవుడా?’ అని వాపోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు దేశమంతటా జరుగుతాయి కాబట్టి పోలింగ్‌ను మూడు విడతలుగా నిర్వహిస్తారు. చివరి విడత పోలింగ్ పూర్తయ్యాకే మొత్తం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అప్పుడు కూడా అభ్యర్థులకు 15 రోజులకు మించి ఎదురు చూడాల్సిన అగత్యం ఉండదు. అయితే ఈసారి రాష్ర్టంలో జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికల్లో అభ్యర్థులు అంతకు రెట్టింపు కాలం నిరీక్షించక తప్పడం లేదు. ఏప్రిల్ 6, 11 తేదీల్లో ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ పూర్తి కాగానే రెండు రోజుల్లో ఫలితాలు వెల్లడవుతాయని, మెజారిటీ ఎంపీటీసీ స్థానాల్లో గెలుపు తమ వారినే వరిస్తుందని, ఆనక మండల అధ్యక్ష పీఠాలపై కూర్చోవాలని ఆశలు పెంచుకున్న వారు న్యాయస్థానం ఆదేశంతో దీర్ఘంగా నిట్టూరుస్తున్నారు. అలాగే జెడ్పీటీసీ బరిలో ఉన్నవారికి, జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం తమదేనన్న ధీమాతో ఉన్నవారికి కూడా నరాలు తెగే ఉత్కంఠ తప్పదు. కాగా ఫలితాలు వాయిదా పడడంతో వాటి ప్రభావం సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామంపై పడదని రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. వారి నిరీక్షణ మరింత సుదీర్ఘం..! ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సార్వత్రిక ఎన్నికల తర్వాతేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన క్రమంలో.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాతే వెలువరించాలని హైకోర్టులో వేసిన పిటిషన్ ఏప్రిల్ ఒకటిన విచారణకు రానుంది. నిర్ణయాన్ని అదే రోజు వెలువరిస్తామని హైకోర్టు స్పష్టం చేయటంతో ఆ ఎన్నికల బరిలో నిలిచినవారిలోనూ ఆందోళన మొదలైంది. ఈ నెల 30న పోలింగ్, ఏప్రిల్ రెండున ఓట్ల లెక్కింపు జరిగాక.. రెండు, మూడు రోజుల్లో చైర్మన్ లేదా మేయర్ ఎన్నికలు జరిగి ఆ పీఠాలపై కొలువు దీరగలమని ఆశపడ్డ వారు కూడా ‘నలభై రోజుల వరకూ నిరీక్షించాలా?’ అని అసహనానికి గురవుతున్నారు. జిల్లాలో మున్సిపల్ బరిలో తలపడుతున్న 806 మంది అభ్యర్థులు హైకోర్టు ఏమి తీర్పు చెపుతుందోనని బితుకుబితుకుమంటున్నారు. -
రెండు గంటల్లో కౌంటింగ్ పూర్తవ్వాలి
ఏలూరు, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియను రెండు గంటల్లో పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి జిల్లాలోని మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీవోలతో ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫెరెన్ ్సలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ రెండో తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు. సమస్మాత్మక, అతి సమస్మాత్మకమైనవిగా గుర్తించిన 204 పోలింగ్ బూత్‌ల్లో వెబ్కెమెరాలను ఈ నెల 27 నాటికి ఏర్పాటు చేస్తామమన్నారు. ఓటర్లందరికీ ఈ నెల 27లోగా ఫొటో గుర్తింపు స్లిప్‌లను ఇంటింటికి తిరిగి అందజేయాలని, మునిసిపల్ కార్యాలయాల్లో వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముగ్గురికి షోకాజ్ నోటీసులు ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లను ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వాటిని బ్యాలెట్ బాక్సుల్లో భద్రపర్చి స్ట్రాంగ్‌రూమ్‌కు తరలించాలన్న ఆదేశాల అమలులో నిర్లక్ష్యంపై కొవ్వూరు ఆర్డీవో గోవిందరావు, నిడదవోలు, కొవ్వూరు మున్సిపల్ కమిషనర్లకు షోకాజ్ నోటిసులు జారీ చేసి, ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పించాలని డీఆర్వో ప్రభాకర్‌రావును కలెక్టర్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్లను ఉద్యోగులకు ఇచ్చి వాటిని అక్కడే వినియోగించుకోకుండా ఉద్యోగులు ఇళ్లకు తీసుకు వెళ్లడంపై కొవ్వూరు ఆర్డీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఆర్వో కె ప్రభాకర్‌రావు, నిక్నెట్ అధికారి గంగాధరరావు పాల్గొన్నారు.