జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట నగర పంచాయతీకి మొదటి సారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు మొట్ట మొదటి చైర్మన్ (మహిళ) అవుతారో సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో 20 వార్డులకు గాను 107 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,4,5,8,9.10,13,14,16,19 వార్డులను మహిళలకు కేటాయించారు.
అయితే జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలోకి దింపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,047 ఓట్లకుగాను 13,031 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6556 మంది పురుషులు, 6475 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 81.21 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 20, టీఆర్‌ఎస్ తరఫున 19, టీడీపీ తరఫున 17 మంది, సీపీఎం తరఫున ఒకరు, బీజేపీ తరఫున ఐదుగురు పోటీలో ఉన్నారు. 50 శాతానికి పైగా అభ్యర్థులు యువకులే ఉండడం విశేషం. ైచె ర్మన్ పదవికి టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లో పోటీ ఉన్నాయి. ఇరు పార్టీలు కూడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
పార్టీలు మారిన అభ్యర్థులు
నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పార్టీలు మారి పోయారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. చైర్మన్ ఎన్నికలో వారు ఎవరికి సహకరిస్తారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మరి కొందరు బహిరంగంగా తాము పోటీ చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపారు.
చైర్మన్ రేసులో..
జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ రేసులో కాంగ్రెస్ తరఫున సురేందర్‌గౌడ్, హెచ్.నారాయణ గౌడ్, హెచ్.రామాగౌడ్, డాకూరి జోగినాథ్ సతీమణులు, టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన పట్లూరి రజని శివప్రకాశ్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. మాజీ వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్ కూడా చైర్మన్ పదవిని ఆశిస్తూ టీడీపీ తరఫున భార్యతో పాటు ఆయన కూడా 10,11 వార్డుల్లో పోటీ చేశారు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది.
నేడు సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపు
జోగిపేట నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలోని మొదటి అంతస్తులో ఎన్నికల లెక్కింపును నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏజెంట్ పాస్‌లను ఇది వరకే అభ్యర్థులకు జారీ చేసినట్లు కమిషనర్ జి.విజయలక్ష్మి తెలిపారు.
జోగిపేట నగర పంచాయతీకి తొలి మహిళా చైర్మన్ ఎవరో!
Published Sun, May 11 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM
Advertisement