Jogipeta
-
సిక్ ఇండస్ట్రీ!.. ‘రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదు’.. ఈ ఒక్క మాట..
‘రిస్క్ తీసుకోకపోతే గ్రోత్ ఉండదు’ కవితారాజేశ్కు ఆమె భర్త చెప్పిన మాట. ఆ స్ఫూర్తితోనే రిస్క్ తీసుకున్నారామె. ఒక రిస్క్ తర్వాత మరొక రిస్క్. రిస్క్ అంటే... ‘ప్రమాదం వెంట పరుగెత్తడం కాదు.. ప్రయోగాలతో కలిసి ప్రయాణం చేయడం’ ఇది ఆమె చెబుతున్న కొత్త నిర్వచనం. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ బాధ్యతల్లో ఆమెది తనదైన ప్రత్యేక శైలి. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఆమెది రంగులలోకం. సక్సెస్‌కి కలర్ ఉండదు... అన్ని రంగుల కలయికే సక్సెస్. కెమికల్ కలర్స్ నుంచి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వరకు సాగిన ఆమె సక్సెస్ఫుల్ జర్నీ. ‘‘మాది మెదక్ జిల్లా జోగిపేట. నేను పుట్టింది పెరిగింది హైదరాబాద్‌లోనే. ఐఐఎమ్‌సీ నుంచి బీకామ్ ఆనర్స్ చేశాను. ఎల్ఎల్బీ కూడా చేశాను. ఉద్యోగం, లా ప్రాక్టీస్ కంటే పెద్దగా ఏదైనా చేయాలని ఉండేది. లైఫ్ హాయిగా గడిపేయాలనుకుంటే ఏదీ సాధించలేం. రిస్క్ అని భయపడుతూ ఉంటే జీవితం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అందులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా ప్రిపేర్ కావాలి. గెలిచి తీరడమే మన లక్ష్యం అయి ఉండాలి. ఇక రెండో ఆప్షన్ కోసం పక్కకు చూడకూడదు. మనవంతుగా పని చేస్తూ ఉంటే గెలుపు మనదై తీరుతుంది. కొన్నిసార్లు గెలుపు ఆలస్యం కావచ్చేమో కానీ గెలుపు రాకుండా ఉండదని నా నమ్మకం. మా నాన్న వయసు రీత్యా... ఆయన నడిపిస్తున్న పెయింట్స్ ఇండస్ట్రీ అప్పటికే ఇబ్బందుల్లో ఉంది. మొదలు పెట్టడమే సిక్ ఇండస్ట్రీతో ఎలా అనే ఆందోళన ఉన్నప్పటికీ సాహసం చేశాను. మా హజ్బెండ్, అత్తగారు కూడా ప్రోత్సహించారు. లాభమైనా, నష్టమైనా అంతా కుటుంబంలోనే కాబట్టి మొదలు పెట్టమనే భరోసా ఇచ్చారు నాన్న. అలా ఓం సాయి ఆంధ్రా పెయింట్స్‌ని టేకోవర్ చేశాను. ఏడాదికే లాభాల్లోకి వచ్చింది పరిశ్రమ. లాభాల్లోకి వచ్చిన వెంటనే రిలాక్స్ అయితే పరిశ్రమను విస్తరణ ఆగిపోతుంది. మాకు లెర్నింగ్ పీరియడ్ మూడేళ్లపాటు సాగింది. బాలానగర్‌లో ఎనిమిది వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొదలైంది నా రంగుల ప్రస్థానం. ఇప్పుడది పదివేల చదరపు అడుగుల పరిశ్రమ. ఎలీప్ ఇండస్ట్రియల్ పార్కులో గోల్డ్సీల్ గుర్తింపుతో నడుస్తోంది. ఐఎస్బీ గోల్డ్‌మ్యాన్ సాచె ప్రోగ్రామ్, ఎలీప్తో ప్రయాణం నన్ను బాగా తీర్చిదిద్దాయి. ఇవాంకతో భేటీ గోల్డ్ మ్యాన్ సాచ్ టెన్ థౌజండ్స్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2019కి హాజరయ్యే అవకాశం వచ్చిన ఏకైక భారతీయ మహిళను. గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ 2017 హైదరాబాద్‌లో జరిగింది. ఇవాంక ట్రంప్ కూడా వచ్చారు. ఆ సమావేశానికి ఆహ్వానం వచ్చిందంటే కారణం పరిశ్రమను విజయవంతంగా నడిపించడమే. ఒక విజయాన్ని మనం సాధిస్తే... మరికొన్ని విజయాలు వాటంతట అవే వచ్చి తోడు నిలుస్తాయి. మహిళలకు నేను చెప్పేది ఒక్కటే... ‘మాకు తెలియదు’ అనుకోవద్దు. టెక్నాలజీ తెలియదు కాబట్టి, మేము ఇందులో సక్సెస్ కాలేము... అని భయపడే వాళ్లెందరో. ఇండస్ట్రీని నడిపించడానికి టెక్నాలజీ వచ్చి తీరాలనేమీ లేదు, టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకోవచ్చు. కాలానుగుణంగా మారడానికి కొత్త అవసరాలకు తగినట్లు మనల్ని, మన పరిశ్రమను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటే చాలు. రసాయన రంగులతో మొదలైన నా పరిశ్రమ ఇప్పుడు డెకరేటివ్, ఇండస్ట్రియల్, స్పెషలైజ్డ్ పెయింట్స్‌తోపాటు ఎకో ఫ్రెండ్లీ టాయ్ పెయింట్స్ తయారీకి చేరింది. కొత్తగా ఏది ప్రవేశపెట్టాలన్నా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో పరిశోధనలు చేస్తాం. నాకు ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉండితీరాల్సిన అవసరం లేదు. అందుకు తగిన నిపుణులున్నారు. పని పంపకం ఒకప్పుడు పనులన్నీ నా భుజాల మీదనే మోసేదాన్ని. ఆరోగ్యం పాడైన తర్వాత వర్క్ డెలిగేషన్ నేర్చుకున్నాను. ఇంజనీరింగ్, ఎంబీఏ, డిఫెన్స్ మేనేజ్మెంట్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీగా నా లెక్చర్స్‌లో ‘మనం ఎదగాలి, మనతోపాటు పక్కవారిని ఎదగనివ్వాలి. ఆ ఎదుగుదల ఆర్థికంగానూ, ఆ వ్యక్తి ఇండిపెండెంట్‌గా నిలబడగలిగేటట్లు కూడా ఉండాలి. ఒకరి ఎదుగుదలకు మనం తోడ్పడితే వారి నుంచి వెలువడే కృతజ్ఞతలే మనల్ని నిలబెడతాయి’ అని చెబుతుంటాను. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఐమా) కౌన్సిల్ మెంబర్ని, ఇండో– పసిఫిక్ స్టడీస్‌కి కౌన్సిల్ మెంబర్ని కూడా. ఇన్ని బాధ్యతలలో అత్యంత చాలెంజింగ్ జాబ్ మా స్టీల్ మైన్స్ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ బాధ్యతలే’’ అన్నారామె నవ్వుతూ. పురాతన వస్తువుల సేకరణను ఇష్టపడే కవితారాజేశ్ ఇంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ తయారు చేసిన ఫ్యాన్ ఇప్పటికీ తిరుగుతోంది. మేనేజ్మెంట్ ఓ నైపుణ్యం మూడు వేలకు పైగా సభ్యులున్న హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎమ్ఎ) ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వర్తించడం నాకు అత్యంత సంతృప్తినిచ్చింది. పాస్ట్ ప్రెసిడెంట్స్ నన్ను బాగా ప్రోత్సహించారు. 58 ఏళ్ల ఈ అసోసియేషన్‌కి ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించిన మూడో మహిళను. మహిళల్లో బెస్ట్ అనిపించుకోవాలనే టార్గెట్ పెట్టుకోలేదు నేను. ఇప్పటి వరకు పని చేసిన అందరు ప్రెసిడెంట్లలోనూ బెస్ట్‌గా నిలవాలనే లక్ష్యంతో పని చేశాను. ఆఫీస్‌ని ఆల్ ఉమెన్ ఆఫీస్‌గా మార్చాను. దేశవిదేశాల ఎంబసీలు, కాన్సులేట్లతో పని చేశాం. స్టూడెంట్స్ ఎక్సేంజ్ ప్రోగ్రామ్ కోసం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ని కెనడా ఎంబసీతో అనుసంధానం చేయడం వంటివి చాలా చేశాం. సోషల్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్‌లలో ప్రభుత్వ పాఠశాలలో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ తవ్వించడం వంటివెన్నో... కోవిడ్ సమయంలో కూడా వందకు పైగా కార్యక్రమాలు నిర్వహించాం. కమిటీ సభ్యులందరినీ ఇన్వాల్వ్ చేస్తూ పోవడంతోనే ప్రెసిడెంట్‌గా నేను విజయవంతమయ్యాను. – కవితా రాజేశ్, ప్రొప్రయిటర్ ఓం సాయి ఆంధ్రా పెయింట్స్, హైదరాబాద్ – వాకా మంజులారెడ్డి ఫొటో : మోర్ల అనిల్ కుమార్ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే మెహందీ డిజైన్లు వేసుకుంటూ రైఫిల్ షూటర్‌గా ఎదిగిన బనారస్ అమ్మాయి -
జోగిపేట: ఫొటోకు పోజు కోసం.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు
సాక్షి, జోగిపేట (ఆందోల్): ఓ వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్ కోసం వచ్చిది. ఆమెకు వ్యాక్సిన్ వేసిన వైద్య సిబ్బంది.. ఫొటోలకు ఫోజు ఇస్తూ మరోసారి వ్యాక్సిన్ వేసేశారు.. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన జరిగింది. అందరికీ వ్యాక్సినేషన్లో భాగంగా ఆదివారం జోగిపేట రిక్షాకాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. వైద్య సిబ్బంది ఈ కాలనీకి చెందిన సాబేరా బేగం (63)కు ముందే వ్యాక్సి న్ ఇచ్చారు. చదవండి: ఉడుతకి వైద్యం చేశారని.. అప్పటినుంచి అక్కడే ఉండిపోయింది కాసేపటికే మున్సిపల్ సిబ్బంది అక్కడికి చేరుకొని వ్యాక్సినేషన్ ఫొటో కావాలని అడిగారు. వ్యాక్సిన్ కోసం వచ్చిన వారందరినీ వరుసగా నిలబెట్టారు. అయితే సదరు వైద్య సిబ్బంది సాబేరా బేగం చేతికి సిరంజి పెట్టి ఫొటోకు పోజు ఇచ్చారు. అలాగే రెండో సారి వ్యాక్సిన్ వేశారు. తనకు మళ్లీ ఇంజక్షన్ చేశారేమిటంటూ సాబేరా బేగం ఆందోళన చెందడంతో.. జోగిపేట ఆస్పత్రికి తరలించి అబ్జర్వేషన్లో పెట్టారు. ఘటనపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చదవండి: ఏమైందో ఏమో.. బయటకెళ్లిన ఇద్దరు యువతులు తిరిగి రాలేదు.. -
విషాదం: దొరక్క దొరికిన ఆస్పత్రి బెడ్.. అంతలోనే
జోగిపేట (అందోల్): బెడ్స్ కోసం పదులకొద్దీ ఆస్పత్రులు తిరిగారు. చివరకు ఎలాగో దొరికిందనుకుని బెడ్‌పై చేర్చినంతనే శ్వాస ఆగి కన్నుమూసిన వైద్యుడి విషాదమిది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీనగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్‌పల్లి గ్రామంలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యంపై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్‌కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్ దొరకలేదు. చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్ దొరగ్గానే వెంటనే చేర్చారు. అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్ కిష్టయ్య జోగిపేట లైన్స్‌క్లబ్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా రోజుల వ్యవధిలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతదేహానికి స్వగ్రామమైన బిజిలీపూర్‌లో కరోనా నిబంధనల మేరకు శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కడచూపునకు కూడా నోచుకోకపోవడంపై బంధువులు, స్నేహితులు బాధను వ్యక్తం చేస్తున్నారు. చదవండి: అందరికీ ఉచితంగా టీకా.. సీఎం కేసీఆర్ చదవండి: వేరే రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మరణాలు తక్కువే -
ఉద్యోగమే నా చావుకు కారణం
జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలో ఓ గ్రామపంచాయతీ కార్యదర్శి బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పుల్కల్ మండలం ఇసోజిపేటకు చెందిన ఎం.జగన్నాథ్ మిన్పూర్ గ్రామ పంచాయతీ జూనియర్ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో అనేక ఒత్తిడులు, అవమానాలు భరించలేక ‘నా చావుకు నా ఉద్యోగమే కారణం’అంటూ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ‘నేను పనిచేస్తున్న గ్రామానికి చెందిన నాయకులు పలువురికి మద్యం తాగించి నాతో గొడవకు ఉసిగొల్పుతున్నారు. వాళ్ల చిల్లర రాజకీయాలు భరించలేకపోయాను. గ్రామ ఇన్చార్జి సర్పంచ్, 7వ వార్డు సభ్యుడు తమకు సహకరించలేదని, చాలా వేధింపులకు గురి చేశారు. మార్చి 3న ఉద్యోగానికి రాజీనామా చేస్తూ అధికారులకు లేఖ ఇచ్చాను. తోటి ఉద్యోగులు, అధికారులు నచ్చచెప్పడం.. అలాగే ఉద్యోగం చేయకుండా ఇంటి దగ్గరే ఉంటే అమ్మానాన్నలకు బాధ కలుగుతుందని భావించి మళ్లీ విధుల్లో చేరాను. అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి’అని సూసైడ్ నోట్లో పేర్కొన్నా డు. ‘ఏపీవో నన్ను కుక్కలా తిప్పుకున్నారే కానీ, ఫిబ్రవరి 22 నుంచి 27వ తేదీ వరకు చేయించిన పనులకు పేమెంట్స్ ఇవ్వలేదు. నర్సరీ పనులకు, బ్యాగ్ ఫిల్లింగ్, పోల్స్ ఫిట్టింగ్, నర్సరీలోని లేబర్‌కు, ఆడిటింగ్‌లకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. నా చావుతోనైనా సమస్యలు పరిష్కరించాలి. నాకు బతకాలని ఉన్నా, ఇలా బతకడం నావల్ల కావడం లేదు’అంటూ సూసైడ్ నోట్ ముగించాడు. అధైర్యపడొద్దు... పంచాయతీ కార్యదర్శులు అధైర్యపడవద్దు. సమస్యలుంటే ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుందాం. గ్రామా ల్లో రాజకీయంగా ఇబ్బందులుంటే అధి కారుల దృష్టికి తీసుకెళ్లాలి. జగన్నాథ్ ఆత్మహత్య చాలా బాధాకరం. –ఎస్.రమేశ్, జిల్లా కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు -
కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మెదక్ జిల్లా జోగిపేట, సిరిసిల్ల రాజన్న జిల్లా వేములవాడను నూతన రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటితో రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 74కు చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత కూడా స్థానికులు, ప్రజాప్రతినిధుల నుంచి వచి్చన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని డివిజన్లు, మండలాలకు లైన్‌క్లియర్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా చౌట్కూరు మండలం ప్రతిపాదిత జోగిపేట రెవెన్యూ డివిజన్లో నాలుగు మండలాలను ప్రభుత్వం చేర్చింది. ప్రస్తుతం సంగారెడ్డి డివిజన్లో కొనసాగుతున్న అందోల్, పుల్కల్, వట్పల్లి మండలాలతోపాటు కొత్తగా చౌట్కూరు మండలాన్ని ఏర్పాటు చేసింది. పుల్కల్ మండలం నుంచి కొన్ని గ్రామాలను తొలగించి చౌట్కూరు మండలంలో కలిపింది. దీంతో రాష్ట్రంలో మండలాల సంఖ్య 586కు చేరింది. వేములవాడ డివిజన్ ఇలా.. ప్రస్తుతం సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ఉన్న 6 మండలాలతో వేములవాడ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో వేములవాడ, వేములవాడ (గ్రామీణ), చందూర్తి, బోయినపల్లి, కోనరావుపేట, రుద్రండి మండలాలున్నాయి. ఇదిలావుండగా డివిజన్లు, మండలం ఏర్పాటుపై ప్రజల నుంచి సూచనలు, సలహాలు, అభ్యంతరాలను స్వీకరించేందుకు 30 రోజుల గడువు ఇస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జారీ చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు. -
చైన్ స్నాచింగ్ ఇరానీ గ్యాంగ్ పనే..
సాక్షి, జోగిపేట : జోగిపేట పట్టణంలో వరుస చైన్ స్నాచింగ్‌లతో బెంబేలెత్తించిన బీదర్ దొంగలను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వరుసగా మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళ్తున్న సంఘటనలు జరుగుతుండడంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. అనుమానంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోని తీసుకొని విచారించగా పట్టణంలో జరిగిన దొంగతనాలను తామే చేశామని, తమతో పాటు మహేష్, మమ్ములు ఉన్నారని ఒప్పుకున్నారు. బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్‌గా పోలీసులు నిర్దారణకు వచ్చారు. పట్టణంలో ఇప్పటి వరకు జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో సుమారుగా 35 తులాల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. దొంగతనాన్ని అంగీకరించిన ఇద్దరు దొంగలు బంగారం తమ వద్ద లేదని, అమ్ముకొని ఖర్చు చేశామని చెప్పినట్లు సమాచారం. నిందితుల వద్ద ఉన్న బైకు, రూ.3 వేలు మాత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. దొంగల వద్ద నుంచి రికవరీ చేసేందుకు పోలీసులు అష్టకష్టాలు పడ్డా లాభం లేకుండా పోయింది. అయితే మరో ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుంచి రికవరీ చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. చైన్ స్నాచింగ్ దొంగలు దొరకడంతో స్థానికంగా మహిళలు ఊపిరి పీల్చుకున్నారు. ఇది కచ్చితంగా ఇరానీ గ్యాంగ్ పనే.. జోగిపేటలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జోగిపేట సీఐ తిరుపతిరాజు తెలిపారు. సోమవారం సీఐ కార్యాలయంలో ఎస్ఐలు వెంకటరాజాగౌడ్, ప్రభాకర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ దొంగతనాలకు పాల్పడింది బీదర్‌లోని ఇరానీ గ్యాంగ్ సభ్యులేనని విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి సీఐ వివరిస్తూ.. జోగిపేటలో ఆదివారం హనుమాన్ చౌరస్తాలో ఎస్ఐ వాహనాలను తనిఖీ చేస్తుండగా బీదర్‌కు చెందిన జాఫర్ అలీ, సత్తాజ్ అలీ అనే ఇద్దరు వ్యక్తులు బైకుపై అనుమానస్పదంగా కనిపించారని తెలిపారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా జోగిపేట, జహీరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, తాండూర్, బాల్కిలలో ఇప్పటి వరకు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. జనవరిలో జోగిపేట క్లాక్‌టవర్ వద్ద మూడున్నర తులాలు, వడ్డెర బస్తీ వద్ద మూడు తులాలు, మేలో వాసవీనగర్‌లో తొమ్మిదిన్నర తులాల బంగారు గొలుసులు, అదే నెలలో నారాయణఖేడ్‌లో రెండు తులాల బంగారు గొలుసులు దొంగిలించినట్లుగా ఒప్పుకొని దొంగతనం చేసిన ప్రదేశాలను సైతం చూపించారని సీఐ వివరించారు. వట్పల్లి బ్యాంకు వద్ద గత నెల ప్రస్తుతం దొరికిన జాఫర్‌తో పాటు బీదర్‌కు చెందిన నవాబ్లు బ్యాంకు వచ్చిన వ్యక్తికి మాయమాటలు చెప్పి తప్పుదోవ పట్టించి రూ.15 వేలు ఎత్తుకెళ్లారని తెలిపారు. పరారీలో ఉన్న మమ్ము, మహేష్ అలియాస్ సోనియాలను కూడా పట్టుకుంటామని సీఐ పేర్కొన్నారు. ఈ కేసులో జోగిపేట, వట్పల్లి ఎస్ఐలు కష్టపడ్డారని, వీరితో పాటు కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్లు రశీద్, ఏసయ్యలు కూడా దొంగలను పట్టుకోవడానికి కృషి చేశారని తెలిపారు. వీరికి అవార్డు ఇచ్చేందుకు ఉన్నత అధికారులకు లెటర్ రాసినట్లు సీఐ తెలిపారు. -
పేకాట లొల్లి.. మంటలతోనే ఎస్ఐ గదిలోకి..
జోగిపేట(అందోల్) : పోలీస్‌స్టేషన్‌లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం.. ఎస్ఐ చాకచక్యంగా మంటలను ఆర్పి అతడిని కాపాడిన ఘటన జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. పేకాటలో తన వద్ద నుంచి రూ.1500 డబ్బులు తీసుకున్నాడని, ఆ డబ్బులను నర్సింహులు నుంచి తిరిగి ఇప్పించాలని మేకల పవన్ (30)అనే వ్యక్తి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంలో పోలీసులు వారిద్దరిని పిలిపించి సర్దిచెప్పి పంపించారు. దీనికి సంతృప్తి చెందని పవన్ అనంతరం ఎస్ఐ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లాడు. ఇంటికి వచ్చిన పవన్‌ను ఇక్కడికెందుకు వచ్చావని ఎస్ఐ మందలించగా తనకు న్యాయం కావాలని మొండిగా మాట్లాడడంతో కానిస్టేబుల్‌ను పిలిపించి అతడిని అక్కడి నుంచి పంపించేశాడు. పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కి.. అనంతరం స్థానికంగా ఉన్న ఒక పెట్రోల్ పంపుకు వెళ్లి బాటిల్లో పెట్రోల్ కావాలని అడుగగా పోయమని నిరాకరించడంతో మార్గమధ్యలో కలిసిన అనిల్ అనే వ్యక్తి బండి ఆపి వేరే పెట్రోల్ పంపుకువెళ్లి పెట్రోల్ తీసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే లిఫ్ట్ ఇచ్చిన అనిల్‌ను బాగా కొట్టడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెట్రోల్ డబ్బాతో స్టేషన్‌కు చేరుకున్నపవన్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. మండుతున్న మంటలతోనే ఎస్ఐ ఉన్న గదిలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎక్కడ తమను పట్టుకుంటాడేమోనని పోలీలు మొదట ఆందోళన చెందారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ అతడిపై నీళ్లు చల్లి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే ముఖం శరీరం బాగా కాలిపోయింది. వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. పోలీసులు అప్రమత్తంగా లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగేది. ఇప్పటి వరకు మూడు సార్లు ఆత్మహత్యాయత్నాని పవన్ పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నం కేసు నమోదు.. పోలీసుస్టేషన్‌కు వచ్చి వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినందుకు మేకల పవన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు. అతడు ఇంట్లో భార్యను బాగా కొట్టినట్లు ఫిర్యాదు వచ్చిందని తెలిపారు. తన వద్ద నుంచి రూ.1500 నర్సిహుంలు అనే వ్యక్తి తీసుకున్నట్లు స్టేషన్‌కు వచ్చాడని, అతడిని పిలిచి విచారించామని తెలిపారు. స్టేషన్లోకి మంటలతో రావడంతో తాము ఆర్పివేసి ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్సలు పొందుతున్నట్లు తెలిపారు. -
శివుని దర్శనం చేసుకొని తిరిగి వెళుతూ ఒకరి మృతి
జోగిపేట(అందోల్): మహాశివరాత్రి సందర్భంగా రాంసానిపల్లి గ్రామంలోని శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అందోల్ మండలం కన్సాన్పల్లి గ్రామానికి చెందిన వని పోచయ్య (60) మరణించాడు. మంగళవారం సాయంత్రం పోచయ్య తన మోపెడ్ వాహనంపై (టీఎస్ 15ఈఏ 3901) రాంసానిపల్లి నుంచి కన్సాన్పల్లి గ్రామానికి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జోగిపేట వైపు వెళుతున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో రోడ్డు మీద పడడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మృతుడికి ఒక కొడుకు, భార్య ఉన్నారు. ముదిరాజ్ కులానికి చెందిన పోచయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోచయ్యకు భక్తి ఎక్కువ కావడంతో దేవాలయంలో జరిగిన భజనలో పాల్గొన్నట్లు గ్రామస్తులు తెలిపారు. మృతదేహాన్ని పోలీసులు జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
కల్వర్ట్ కింద గుర్తు తెలియని మృతదేహం లభ్యం
చిలప్‌చెడ్(నర్సాపూర్): చిలప్‌చెడ్ గ్రామ శివారులోని కల్వర్ట్ కింద సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు నర్సాపూర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం చిలప్‌చెడ్ శివారులోని జోగిపేట్ – నర్సాపూర్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న కల్వర్టు కింద మృతదేహం లభ్యమైందని, ముందుగా పశువులు కాసే వారు దాన్ని గుర్తించారన్నారు. మృతదేహాన్ని సంచిలో కట్టి అక్కడ పడేశారన్నారు. మృతదేహం వద్ద దుర్గంధం ఎక్కువగా రావడంతో బుధవారం ఉదయం వెలికి తీసి వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభిస్తామన్నారు. -
అమరజీవి విగ్రహం ధ్వంసం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజుల్లో రెండోసారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్నాయి. అలాగే విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, అలాగే భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. -
అతిసార కేసులు లేవు
► వ్యక్తిగత పరిశుభ్రత లోపమే అస్వస్థతకు కారణం ► జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ జోగిపేట(అందోలు): అతిసార కేసులు లేవని జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ చెప్పారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 65 మంది అతిసారంతో చికిత్స పొందుతున్నట్లు వచ్చిన ఓ దినపత్రిక(సాక్షికాదు)లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యశాఖ అధికారులు స్పందించారు. ఆదివారం ఆసుపత్రిని సందర్శించారు. జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరిశీలించారు. రోగులు ఎక్కడెక్కడి నుంచి వచ్చారని సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణను ప్రశ్నించారు. అక్కడ ఇద్దరు... ఇక్కడ ఒకరు అంటూ 9 మందిని చూపించారు. 65 మంది ఎక్కడ ఉన్నారని సూపరింటెండెంట్‌ను ప్రశ్నించారు. ఒక్కో సెలైన్ బాటిల్ ఎక్కించుకొని వెళ్లిపోతున్నారని డాక్టర్ చెప్పడంతో అడిషనల్ డీఎంహెచ్ఓ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకే గ్రామానికి చెందినవారు ఎంత మంది ఉన్నారని ఆరా తీశారు. 24 గ్రామాలకు చెందినవారు ఒకరిద్దరు చొప్పున ఉన్నారని డాక్టర్ అధికారికి వివరించారు. అనంతరం జిల్లా అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ శశాంక్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇందులో అతిసారం కేసులు ఏమీ లేవన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత లోపించడంతో అస్వస్థతకు గురవుతున్నారని స్పష్టం చేశారు. అతిసారం అదుపులోకి తెచ్చేందుకు అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. తాలెల్మ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నృపేన్ చక్రవర్తి, హెచ్ఈఓ విజయ్‌కుమార్, సిబ్బంది నర్సింలు, శంకర్లు ఆయన వెంట ఉన్నారు. -
రెండేళ్ల క్రితం నిర్మించుకున్న మరుగుదొడ్లకూ బిల్లులు
► ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత జోగిపేట: మున్సిపాలిటీల్లో రెండేళ్ల క్రితం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నవారికీ బిల్లులు చెల్లిస్తామని ఎస్ఎంసీ మెప్మా రాష్ట్ర అధికారి డాక్టర్ సుజాత తెలిపారు. సోమవారం జోగిపేట నగర పంచాయతీ ఆధ్వర్యంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కళాకారుల బృందంచే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సుజాత పాల్గొన్నారు. కార్యక్రమానికి చైర్పర్సన్ కవిత సురేందర్‌గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుజాత మాట్లాడుతూ.. నగర పంచాయతీ పరిధిలో దాదాపు 400 వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాల్సి ఉందని, 10 రోజుల్లో వాటి నిర్మించుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు మరుగుదొడ్లు నిర్మిస్తున్నా.. లబ్ధిదారులు సమైఖ్య గ్రూపుల్లో రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు రుణాలు తీసుకొని గుంతలు, పైపులు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం నగర పంచాయతీ చైర్పర్సన్ కవిత మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నారు. మెప్మా డీఎంసీ ఇందిర మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్, మెప్మా ఏఓ ఆదిలక్ష్మి, కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, సునీల్‌కుమార్, గాజుల నవీన్‌కుమార్, శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శన మరుగుదొడ్ల నిర్మాణాలపై నగర పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళాబృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కళాకారులు ఎన్.దుర్గేశ్, డి.రమేశ్, ఎస్.మల్లేశ్, ఎ.వినేశ్, బి.నవీన్, ఎ.సునీల్ తమ ఆటపాటలతో అలరించారు. -
అనుమతులు లేని ఆస్పత్రులపై చర్యలు
జోగిపేట: జిల్లాలో అనుమతులు లేకుండా కొనసాగే ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేయడమే కాకుండా సీజ్ చేస్తామని డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రీదేవి హెచ్చరించారు. సోమవారం జోగిపేటలోని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేసిన అనంతరం విలేరులతో ఆమె మాట్లాడారు. జిల్లాలో 230 ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయని, మరికొన్ని అనుమతులు లేకుండా కొనసాగుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. వాటిపై విచారణ జరిపి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆస్పత్రిలో తప్పనిసరిగా ట్రీట్మెంట్, పరీక్షలకు తీసుకున్న రేట్ల పట్టికను పేషెంట్లు కూర్చునే స్థలంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా డాక్టర్లు అందుబాటులో ఉండే వివరాలను కూడా అందులో పేర్కొనాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కొనసాగే ట్రీట్మెంట్ వివరాలపై ప్రతినెలా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని ప్రైవేట్ డాక్టర్లతో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. డెలివరీకి వచ్చే పేషెంట్లకు అనవసరంగా ఆపరేషన్లు చేస్తున్నారని సీఎం కేసీఆర్ స్వయంగా తెలిపారని, దీనిపై ప్రత్యేక నిఘా వేశామని తెలిపారు. ఎంటీపీ కోసం ప్రత్యేకంగా అనుమతి పొందాల్సి ఉంటుందని, అవసరమైతే తప్ప ఎంటీపీ చేయకూడదన్నారు. పీహెచ్‌సీలల్లో కూడా డెలివరీలు అవుతున్నాయని, తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీహెచ్‌సీలల్లో డెలివరీలపై దృష్టి సారించానన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలవరీలు అయితే ప్రభుత్వం రూ.14 వేలు ప్రకటించిందని, ఆడ పిల్ల పుడితే మరో రూ.1000తో పాటు రూ.2వేల విలువ చేసే హెల్త్‌కిట్ కూడా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇప్పటికే జహీరాబాద్, సంగారెడ్డి , నారాయణఖేడ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటన్న ఆస్పత్రులను తనిఖీ చేసినట్టు చెప్పారు. -
ఒక్కో కుటుంబానికి ఐదెకరాలు కేటాయించాలి
జోగిపేట: వెనకబడిన కుమ్మరులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఒక్కో కు టుంబానికి ఐదెకరాల వ్యవసాయ భూమిని కేటాయించాలని జిల్లా కుమ్మరుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఆది వారం అందోలు గెస్ట్‌హౌస్ వద్ద జరిగిన కుమ్మరుల సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి పాపయ్య అధ్యక్షత వహించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బీసీ బీ గ్రూపు నుంచి బీసీ ఏ గ్రూపులో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. కుమ్మరుల అభివృద్ధికి వంద కోట్లు కేటాయించాలంటూ పలు డిమాండ్లు చేశారు. గ్రామకమిటీల ఏర్పాటు అందోలు మండల కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాపయ్య, ప్రధానకార్యదర్శిగా రాములు, కోశాధికారిగా యాద య్య, ఉపాధ్యక్షుడిగా నర్సింలు, రవీం దర్, సహాయ కార్యదర్శులు, కిష్టయ్య, శివకుమార్, రాములు, ప్రచార కార్యదర్శిగా యాదయ్య, గాలయ్య, సలహాదారులుగా సుధాకర్, రాములు, చంద్రశేఖర్, అంజనేయులు, గౌరవ అధ్యక్షుడిగా బాలయ్యను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు,నాయకులు ఈశ్వర్‌తో పాటు అందోలు, హత్నూర, పుల్కల్, వట్పల్లి మండలాల కుమ్మరులు పాల్గొన్నారు. -
గంటల తరబడి నిరీక్షణ
∙జోగిపేటలో తెరుచుకోని ఏటీఎంలు ∙బ్యాంకుల్లో భారీ క్యూలైన్లు ∙ఆంధ్రాబ్యాంకు గేటుకు తాళం ∙విత్‌డ్రా ఓచర్లను పంపిణీ చేసిన కానిస్టేబుల్ జోగిపేట : మూడు రోజులు పాటు బ్యాంకులన్నీ మూసి ఉండటంతో ఖాతాదారులు, ప్రజలు ఒక్కసారిగా బ్యాంకుల వద్ద ఎగబడ్డారు. ఉదయం బ్యాంకు తెరుచుకోక ముందే 9 గంటల వరకు క్యూలో నిలబడ్డారు. ఎస్బీహెచ్, ఆంధ్రాబ్యాంకుల వద్ద ప్రజలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. వారంతా మెయిన్ రోడ్డు వరకు క్యూలో నిలబడ్డారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆంధ్రాబ్యాంకులోకి ఒకేసారి ప్రజలు రావడంతో పోలీసులు అదుపు చేశారు. గేట్‌కు తాళం వేశారు. 10 మంది చొప్పున లోపలికి వదిలారు. కొందరు నగదును తమ ఖాతాల్లో వేసుకున్నారు. మరికొందరు డబ్బు డ్రా చేసుకున్నారు. కొందరు రద్దయిన నోట్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. వృద్ధులు, బాలికలు ఇబ్బందులు పడుతూ డబ్బు డ్రా చేసుకుంటున్నారు. మంజూరైన రుణాన్ని ఒకేసారి ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు ముందుకు రాకపోవడంతో సెల్ప్‌హెల్ప్ గ్రూపుల మహిళలూ అవస్థలు పడ్డారు. ఎస్బీహెచ్ వద్దకు ఒకేసారి ప్రజలు రావడంతో మేనేజర్ మారుతికుమారే స్వయంగా వారిని అదుపు చేయాల్సి వచ్చింది. అందరికీ డబ్బులు ఇస్తామని, సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా బ్యాంకులు తెరచి ఉంటాయని అన్నారు. మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు క్యూలో చాలా సేపు నిలబడాల్సి రావడంతో ఇబ్బంది పడ్డారు. ఆసరా పథకం పింఛన్లు తీసుకోవడానికి వచ్చిన మహిళలు కిందే కూర్చున్నారు. రూ.ఆరు వేలు మాత్రమే.. మూడు రోజుల వరకు ఎస్బీహెచ్లో రూ.10 వేల వరకు డబ్బు పంపిణీ చేశారు. మంగళవారం మాత్రం ఒక్కరికి రూ.6 వేలు మాత్రమే చెల్లించబడునని పోస్టర్లను అతికించారు. దీంతో ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారు. సగం రోజు సెలవుపెట్టి వచ్చినా ప్రభుత్వం నిర్ణయించిన విధంగా రూ.10 వేలు చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగదు అందుబాటులో లేకపోవడంతోనే రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నట్లు మేనేజర్ మారుతికుమార్ నచ్చజెప్పారు. అత్యవసరమైన వారికి డబ్బులను సమకూర్చేందుకు మేనేజర్ సహకరిస్తున్నట్లు సమాచారం. ఎస్బీఐలో చాలా రోజులుగా రూ.2,500, రూ.4 వేలు మాత్రమే ఖాతాదారులకు చెల్లిస్తున్నారు. మూడు రోజుల తర్వాత నగదు జోగిపేటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. పెద్దనోట్లు రద్దయిన తర్వాత పోలీసు శాఖ కీలకంగా వ్యవహరిస్తోందనే చెప్పొచ్చు. వందల సంఖ్యలో ప్రజలు డబ్బుల కోసం బ్యాంకుల వద్దకు చేరుకొని గొడవ చేస్తేంటే పోలీసులు వారిని అదుపు చేస్తున్నారు. గత నెల రోజులుగా జోగిపేట పోలీసులు చేస్తున్న కృషిని బ్యాంకుల మేనేజర్లు అభినందిస్తున్నారు. ఆంధ్రాబ్యాంకు వద్ద రద్దీ ఎక్కువ కావడంతో బ్యాంకు మెయిన్ గేట్‌ను మూసేసి కొందరినే పంపిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన పని పోలీసులే చేస్తున్నారు. డబ్బు డ్రా చేసుకునేందుకు అవసరమైన ఓచర్లను కానిస్టేబుల్లే క్యూలో నిలబడ్డ వారికి ముందుగానే పంపిణీ చేస్తున్నారు. వారు తమకు ఎంత అవసరం ఉందో రాసిపెట్టుకుంటే తొందరగా పని పూర్తయ్యేందుకు వీలుంటుందని సహకరిస్తున్నారు. -
సింగూరులో సందడే..సందడి
ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి మూడు గేట్ల ద్వారా మంజీరలోకి నీరు జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో వరదనీరు భారీగా చేరుతుండడంతో ఆ నీటి తాకిడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు మంజీర నదిలోకి మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రాజెక్టుకు తరలివచ్చారు. కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో సింగూరుకు తరలివస్తున్నారు. అన్ని దారులు సింగూరు వైపే మళ్లుతున్నాయి. ఆదివారం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్‌తో పాటు పుల్కల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు కి.మీ దూరం నుండే పర్యాటకులు బారులు తీరి కనిపించారు. ప్రాజెక్టు పైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ప్రత్యేకంగా చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొందరు గోల చేయడంతో వారిని ఆపడం పోలీసుల వశం కాకపోవడంతో చివరికి వదిలిపెట్టారు. సెల్ఫీల జోరు ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు నీళ్లు కనిపించేలా ఫోటోలు దిగడంలో పోటీలు పడడం కనిపించింది. సెల్ఫీలకైతే అంతే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి వీక్షిస్తున్నారు. పార్కు నిండా పర్యాటకులే.. ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న చిల్ర్డన్స్‌పార్కు పర్యాటకులతో నిండిపోయింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చిన వారంతా వెంట క్యారేజ్‌లు తెచ్చుకుంటున్నారు. పార్కులో కూర్చొని భోజనాలు చేసారు. -
పరిస్థితి అదుపులో ఉంది
కంట్రోల్ రూంకు 21 విజ్ఞప్తులు మూడు చోట్ల రోడ్ల దిగ్బంధం, సహాయక చర్యలు సింగూరు నుంచి 90 వేల క్యూసెక్కుల నీరు విడుదల అందోలు, అన్నాసాగర్ చెరువుల పరిశీలించిన కలెక్టర్ జోగిపేట: జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నా పరిస్థితులు అదుపులో ఉన్నాయని కలెక్టర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం అందోలు, అన్నాసాగర్ చెరువులను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంనకు 21 విజ్ఞప్తులు వచ్చాయన్నారు. మూడు చోట్ల రోడ్లు దిగ్బంధం అయ్యాయని, సహాయక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. సింగూరు ప్రాజెక్టులోకి 10 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో ఉండగా 90వేల క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లో ఉందన్నారు. మంజీరలోని అన్ని గేట్లను ఎత్తివేసారని, సింగూరులో 7 గేట్లు వదిలేసినట్లు చెప్పారు. చెరువులు పొంగి పొర్లుతున్న చోట కాపాలాగా రెవెన్యూ సిబ్బందితో పాటు పోలీసులు కూడా ఉండాలని ఆదేశించారు. మంజీర పరీవాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, నది వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని తహసీలుదారును ఆదేశించారు. అన్నాసాగర్ చెరువు పొంగడం వల్ల ఇళ్లకు ఏమైనా నష్టం ఉందా అని తహసీల్దారును ప్రశ్నించారు. అందోలు తహసీల్దారు నాగేశ్వరరావు, ఆర్ఐ సతీష్, వీఆర్ఓ రాంచంద్రారావుతో పాటు పలువురు కలెక్టర్ వెంట ఉన్నారు. రాయికోడ్‌లో బ్రిడ్జిపై ఉన్న లారీని చూసి ఈ ప్రాంతానికి వెళ్లే రహదారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
గాంధీ పార్కు పట్టించుకోరా?
నిలిచిన వర్షపు నీరు పట్టించుకోని నగర పంచాయతీ పాలకవర్గం జోగిపేట: జోగిపేటలో ఉన్నది గాంధీ పార్కు ఒక్కటే. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ పార్కు నిరాదరణకు గురవుతుంది. కేవలం 15వ అగస్టు, 26 జనవరిలలో మాత్రమే గేట్లు తెరచి పతాకావిష్కరణ చేసి మళ్లీ మూసేస్తారు. పార్కులో శుభ్రత విషయంలో పట్టించుకునే పరిస్థితి లేదు. పార్కులోకి వెళుతుండగా ఎదురుగా గాంధీ విగ్రహన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు నీరు నిలవడంతో కనీసం నిలబడే పరిస్థితిలేదు. ఖాళీ ప్రదేశంలో కూడా వర్షపు నీరు నిండిపోయింది. చెట్లు వంగిపోయాయి. జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఈ పార్కు అభివృద్ధి కోసం పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పార్కులను అభివృద్ధి చేపసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు, పాలకవర్గాలు సరైన శ్రద్ధ కనబరచడం లేదన్న విమర్శలున్నాయి. పార్కులో నీడనిచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. పరిశుభ్రంగా లేకపోవడంతో దుర్గంధం వస్తుంది. సంవత్సరంలో రెండు సార్లు మాత్రమే పార్క్‌ను తెరవడంతో ఆదరణ కోల్పోతుంది. పార్కులో బెంచీలు, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసి ప్రతి రోజు తెరచుకుంటే బాగుంటుందని స్థానికులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్కు నిర్వాహణకు నగర పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేస్తే బాగుంటుది. పార్కులో వేల చదరపు అడుగుల ఖాళీ స్థలం ఉంది. జోగిపేట నగర పంచాయతీ పాలకవర్గం పార్కు అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీ పార్కును అభివృద్ధి చేయాలి జోగిపేటలోని గాంధీ పార్కును అన్ని విధాలా అభివృద్ధి చేయాలి. పట్టణంలో ఇదే ముఖ్యమైన పార్కు,. పార్కులో అన్ని వసతులు కల్పించాలి. విద్యుత్‌లైట్లు ఏర్పాటు చేయాలి. మధ్యాహ్నం వేళలో పార్కులో కూర్చునే విధంగా సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. నగర పంచాయతీ నుంచి నిధులను విడుదల చేయాలి. చాలా సంవత్సరాలుగా పార్కు నిరాదరణకు గురవుతుంది. - రామకృష్ణ, జోగిపేట చర్యలు తీసుకుంటాం గాంధీ పార్కులో చేరిన వర్షపునీటిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. గాంధీ పార్కు అభివృద్ధికి సంబంధించి పాలకవర్గం దృష్టికి తీసుకువస్తాం. పార్కులో పారిశుద్ధ్య సమస్య లేకుండా చూస్తాం. ప్రతిరోజు సిబ్బందితో శుభ్రం చేయిస్తాం. గాంధీ పార్కులో ఇతర సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి పాలకవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - రాజ్‌భరత్, ఏఈ నగర పంచాయతీ జోగిపేట -
జోగిపేట బంద్ ప్రశాంతం
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణంపై నిరసన అందోలు నుంచి జోగిపేట వరకు భారీ ర్యాలీ నిర్మాణాన్ని అడ్డుకోవాలని కమిషనర్‌కు వినతి విద్యాసంస్థలు, దుకాణాల బంద్ జోగిపేట: అందోలు, జోగిపేట పట్టణాల్లో మంగళవారం బంద్ ప్రశాంతంగా జరిగింది. అందోలులోని 1141 సర్వే నంబరులో వివేకానంద స్ఫూర్తి కేంద్రం వద్ద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నిర్మించవద్దంటూ వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, స్ఫూర్తి కేంద్రం సభ్యులు ఇచ్చిన పిలుపు మేరకు బంద్ నిర్వహించారు. అందోలు నుంచి జోగిపేట వరకు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా జోగిపేట వచ్చి ప్రధాన రహదారుల మీద ఉన్న దుకాణాలను, వాణిజ్య సంస్థలను, వైన్‌షాపులను బంద్ చేయించారు. కాషాయ జెండాలతో ఊరేగింపు నిర్వహించి జై శ్రీరాం, జైజై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. విద్యాసంస్థలను ముందు సమాచారం ఇచ్చి బంద్ చేయించారు. మధ్యాహ్నం వరకు వాణిజ్య సంస్థలన్నీ బంద్ పాటించాయి. హిందువులంటే నిర్లక్ష్యమా? వివేకానంద స్ఫూర్తి కేంద్రానికి కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును నిర్మించాలనుకోవడం సరికాదని జిల్లా వీహెచ్‌పీ నాయకుడు సుభాష్ అన్నారు. మండలంలో చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు. గతంలో స్ఫూర్తి కేంద్రానికి మూడున్నర ఎకరాలు కేటాయించాలంటూ ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే క్యాంపు కార్యాలయాన్ని ఇక్కడే నిర్మిస్తున్నారన్నారు. హిందువులంటే ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్నాయకులు, వివేకానంద స్ఫూర్తి కేంద్రం సభ్యులు పాల్గొన్నారు నిర్మాణాన్ని నిలిపివేయాలి అందోలులోని వివేకానంద స్ఫూర్తి కేంద్రం వద్ద ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును నిర్మించవద్దని కౌన్సిలర్ గాజుల నవీన్ నేతృత్వంలోని బృందం జోగిపేట నగర పంచాయతీ కమిషనర్ యాస్మిన్‌భాష ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తాను పరిశీలిస్తానని ఆమె వారికి హామీ ఇచ్చారు. -
జూనియర్ కాలేజీలో నిఘానేత్రం
సీసీ కెమెరాల ఏర్పాటు.. ర్యాగింగ్‌కు బ్రేక్ జోగిపేట: కళాశాలల్లో విద్యార్థుల హాజర శాతం పెంచేందుకు బోధనలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు విద్యార్థుల క్రమ శిక్షణను పర్యవేక్షించేందుకు, ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కళాశాలల్లో అసాంఘిక కార్యకలాపాలను నిరోదించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు బయోమెట్రికట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపే ట జూనియర్ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు. అటు ఉద్యోగుల్లో.. ఇటు విద్యార్థుల్లో జవాబుదారీ తనాన్ని తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యాపకులు, విద్యార్థులు అంటున్నారు. పారదర్శకతకు అవకాశం బయోమెట్రిక్ హాజరు విధానంతో పాటు కళాశాలలో నిర్వహణ పారదర్శకంగా మారింది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వస్తున్నారు. గతంలోలాగా హజరు నమోదులో ఎలాంటి అవకతవలకు అవకాశం ఉండదు. సరైన హాజరు శాతం ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు చెల్లిస్తారు. సీసీ కెమెరాలతో కళాశాల పరిసరాల చిత్రాలు ఆన్లైన్ రికార్డు అవుతుండంతో అందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. కళాశాల ఆవరణలో ర్యాగింగ్ నిరోధానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ప్రిన్సిపాల్ సైతం తన గదిలో నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో సులువుగా తెలుసుకోవచ్చు. ప్రయోజనాలు విద్యార్థులు ఉదయం కళాశాలకు రాగానే నిర్ణీత సమయంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలి ముద్రలు నమోదు చేసుకుంటూ తరగతులకు వెళుతున్నారు. కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కళాశాల బయట నిరీక్షించకుండా, ఎక్కడ తాము చేసే కార్యకలాపాలు కెమెరాలో చిక్కుతాయేమోనని భయపడి గదుల్లోకి పరుగులు తీస్తున్నారు. ఈ విధానం బాగుంది కళాశాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం వల్ల ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవాటైంది. గత రెండు మాసాల నుంచి బాగా మార్పు వచ్చింది. - గోవింద్రాం, ప్రిన్సిపాల్, జోగిపేట -
విజ్ఞానంపై నిర్లక్ష్యం
శిథిలావస్థలో గ్రంథాలయం గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువు మూడేళ్లుగా ఇన్చార్జి అధికారే.. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా పట్టించుకోని పాలకులు జోగిపేట: నిజాం నిరంకుశ పాలనలో గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువైంది.. ఎందరినో చైతన్యవంతులను చేసింది. మరిఎందరికో దిక్సూచిగా నిలిచిన జోగిపేటలోని గ్రంథాలయంపై పాలకుల ఆదరణ కరువైంది. నాందేడ్ -అకోలా జాతీయ రహదారికి కనుచూపు మేరలో ఉన్న అందోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. విజ్ఞానాన్ని సంపాదించి పెట్టే బాండాగారమైనా పట్టించుకున్న పాపాన పోలేదు. 1971వ సంవత్సరంలో జోగిపేటలోని పోస్టాఫీసు పక్కన నిర్మించారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనన్న పరిస్థితుల్లో ఉంది. వర్షం కురుసినప్పుడల్లా గోడలు పూర్తిగా తడిసి పోతున్నాయి. భవనం పై భాగంలో కూడా గోడలు కూలిపోతున్నాయి. చూడడానికే భవనం భయమేసే విధంగా తయారయ్యింది. ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో పాఠకులు సైతం గ్రంథాలయానికి వచ్చేందుకు జంకుతున్నారు. గ్రంథాలయంలో 18,900 వివిధ రకాల పుస్తకాలున్నాయి. ప్రతి రోజూ 11 దినపత్రికలు వస్తాయి. భవనం చుట్టూ పిచ్చి మొక్కలే.. గ్రంథాలయం చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. సుమారు 4 ఫీట్ల ఎత్తులో ఈ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాములు కూడా సంచరిస్తూ ఉన్నాయి. పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారయ్యింది. నగర పంచాయతీ సిబ్బంది కూడా శుభ్రపరిచేందుకు ఆసక్తి చూపడంలేదు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా... గ్రంథాలయ భవనం రోడ్డుకు కొద్ది దూరంలో ఉండడంతో రాత్రి వేళ అటువైపుగా ఎవరూ వెళ్లరు. దీంతో భవనం వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు. పట్టించుకోని పాలకులు అందోలు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలెవ్వరూ ఇప్పటి వరకు గ్రంథాలయంవైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం పుస్తకాలు, దినపత్రిలకు నిధులను కేటాయిస్తున్నా భవనం మరమ్మతులకు మాత్రం ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదు. ఏడాదికి వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఆ తర్వాత పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలకు ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ది నిధుల కింద లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులోంచి కొంత మేర నిధులను కేటాయించి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు బాబూమోమాన్ ఆ దిశగా చర్యలు తీసుకొని పాఠకుల మెప్పు పొందాలని పలువురు కోరుతున్నారు. హమీ మరచిన జిల్లా చైర్మన్ జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టిన తర్వాత జోగిపేట గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ తోపాజి అనంతకిషన్ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హమీ ఇచ్చారు. హమీ ఇచ్చి సుమారు 4 ఏళ్లు కావస్తుంది. ప్రహరీని కూడా నిర్మిస్తానని అప్పట్లో ఆయన అన్నారు. కాని నేటికీ అమలు కాలేదు. మూడేళ్లుగా ఇన్చార్జి అధికారి జోగిపేట గ్రంథాలయ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో మూడు సంవత్సరాలుగా ఇన్చార్జి అధికారే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2013 నుంచి రాజ్‌కుమార్ అనే అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అటెండర్ కూడా గత సంవత్సరమే రిటైర్డ్ కావడంతో నెలకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి ఒక వ్యక్తిని నియమించారు. ఇన్చార్జి అధికారి ప్రతి బుధ, ఆదివారాల్లో మాత్రమే విధులను జోగిపేటలో నిర్వహిస్తారు. డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి జోగిపేటలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. స్థానికంగా పీజీ వరకు కళాశాలలు ఉండడంతో విద్యార్థులకు అవసరమైన సమాచారం లైబ్రరీలో లభించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్ హబ్‌గా మారిన జోగిపేటలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పోటీ ప్రపంచానికి తగ్గట్లు సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. - ఉలువల శ్రీనివాస్, జోగిపేట నూతన భవనం నిర్మించండి 45 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలి. గ్రంథాలయం వద్ద జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి. ఎమ్మెల్యే తన అభివృద్ధి నిధులను కేటాయించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. - ఎండీ ఫైజల్ అహ్మద్, జోగిపేట -
అన్నింటికీ ఒక్కడే
సంఘాలు ఎన్నో.. పోస్టులు కొన్నే..! నగర పంచాయతీ ‘మెప్మా ’విభాగంలో ఖాళీలతో తిప్పలు పట్టించుకోని అధికారులు జోగిపేట: జోగిపేట నగర పంచాయతీలోని మెప్మా విభాగంలో అన్ని పోస్టులు ఖాళీగా ఉండటంతో డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో 20 వార్డులకు గాను సమాఖ్యలకు సంబంధించి 350 గ్రూపుల్లో 4,300 మంది సభ్యులున్నారు. ఆయా సంఘాల్లో పొదుపులు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు, స్వయం ఉపాధి రుణాల మంజూరు అంశాల్లో మెప్మా సిబ్బంది మహిళా సంఘాలకు సహాయం చేయాల్సి ఉంటుంది. మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహకారం అందించి వారు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలి. జోగిపేట, అందోలును కలిపి మూడేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మెప్మా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. 500 గ్రూపుల ఇళ్లకు ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉండాలి. పట్టణంలో కనీసం ముగ్గురికిపైగా సీఓలు ఉండాలి. ఒక టౌన్ మిషన్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీ వలంటీర్లు ఉండాలి. టీఎంసీ(టౌన్ మిషన్ కోఆర్డినేటర్)లు ప్రభుత్వ పథకాలపై మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. మెప్మా సోషల్ వెల్ఫేర్పై తెలియజేయాలి. కమ్యూనిటీ ఆర్గనైజర్లు వారి పరిధిలోని మహిళా గ్రూపులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచలను చేయాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ది కూడా ముఖ్యమైన బాధ్యతనే. సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు గ్రూపుల వివరాలను తెలియజేయాలి. టీడబ్ల్యూడీ వలంటర్ గ్రూపులోని వికలాంగులుగా ఉన్న సభ్యులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలను తెలియజేయాలి. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తోంది. బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపుల్లో సభ్యులకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేశారు. అన్నింటికీ ఒక్కడే మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తోంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను బ్యాంకుల ద్వారా అందజేస్తోంది. అలాంటి విభాగానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జోగిపేట నగర పంచాయతీలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఒక్కరే పని చేస్తున్నారు. ఆయన ఇన్చార్జి టీఎంసీ, సీఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీగా వ్యవహరిస్తున్నారు. 4,300 మంది మహిళా సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మూడేళ్లయినా ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూపు మహిళలు కోరుతున్నారు. సిబ్బంది తక్కువ నగర పంచాయతీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇన్చార్జి టీఎంసీ ఒక్కరే అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రూపుల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో రుణాలు. సలహాలు, సూచనలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు మహిళలకు తెలియజేసే బాధ్యత సిబ్బందిదే. పూర్తి స్తాయి సిబ్బందిని నియమించాలి. - కళావతి, గ్రూపు లీడర్ ఖాళీలు వాస్తవమే జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి మెప్మా విభాగంలో అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. టీఎంసీ, సీఓ టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఓగా ఉన్న నేను కొన్ని సంవత్సరాలుగా ఇన్చార్జి టీఎంసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సిబ్బంది లేకున్నా అన్ని రకాల విధులను నిర్వహిస్తున్నా. - భిక్షపతి, మెప్మా ఇన్చార్జి టీఎంసీ ఖాళీలను భర్తీ చేయాలి నగర పంచాయతీలో మెప్మా విభాగంలో ఉన్న టీఎంసీ, సీఓ, టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీల కారణంగా గ్రూపుల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కరే అన్ని బాధ్యతలను చూడాల్సి వస్తోంది. నాలుగు వేలకుపైగా మహిళలున్నారు. ప్రభుత్వం మెప్మా సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలి. - ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్పర్సన్ -
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా తయారుకావాలి
సైన్స్ ఉపాధ్యాయులు చొరవ చూపాలి భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌పాషా జోగిపేట: విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించి వారిని బాల శాస్ర్తవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత సైన్స్ ఉపాధ్యాయులదేనని భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ రాష్ర్ట కోఆర్డినేటర్ డాక్టర్ చాంద్‌పాషా అన్నారు. 24వ భారత బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్‌పై శనివారం స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో జోగిపేట డివిజన్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టులను రూపొందించేలా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థుళను తీర్చిదిద్దాలన్నారు. సైన్స్ కాంగ్రెస్ ఉద్దేశాలను, శాస్త్రీయ పద్ధతి ద్వారా ప్రాజెక్టులు నిర్ణీత ఉప అంశాలపై ఎలా రూపొందించాలన్న విషయాన్ని ఆయన ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో రాష్ర్ట, జిల్లాస్థాయి సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొని ప్రదర్శించాలని ఆయన సూచించారు. సుస్థిర అభివృద్ధి విజ్ఞాన శాస్ర్తం, సాంకేతికత, వినూత్న ఆవిష్కరణ-దివ్యాంగులకు పిల్లలకు సౌలభ్యం అన్న అంశంపై విశదీకరించారు. డిప్యూటీ ఈఓ పోమ్యానాయక్ మాట్లాడుతూ.. సైన్స్ కాంగ్రెస్‌పై ఉపాధ్యాయులు అవగతం చేసుకొని విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలన్నారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించాలన్నారు. ప్రభుత్వ లక్ష్యాలని అధిగమించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సాంబశివరెడ్డి, ఎంఈఓ కృష్ణ, జిల్లా కోఆర్డినేటర్ హెచ్ విజయ్‌కుమార్, అకాడమిక్ కోఆర్డినేటర్ పి.అనిల్‌కుమార్, సిరి ఎన్జీఓ ఆర్గనైజర్ శ్రీనివాస్, పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం సతీష్‌కుమార్, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి నరోత్తం పాల్గొన్నారు. -
నిలిచిన ‘మీ సేవ’లు
జిల్లాలో కేంద్రాల మూసివేత సాంకేతిక సమస్యలే కారణం ఆందోళనలో వినియోగదారులు అడ్మిషన్లకు చివరి తేదీ కావడంతో విద్యార్థుల హైరానా.. జోగిపేట: సాంకేతిక కారణాలతో జిల్లాలో మీ సేవలు శనివారం ఉదయం నుంచి నిలిచిపోయాయి. మీ సేవ కేంద్రాలలో టీఎస్ ఆన్లైన్ లాగిన్ కాకపోవడంతో ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం నుంచే మీ సేవ కేంద్రాల వద్ద వారంతా వేచి ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఓకే అవుతుందని నిర్వాహకులు చెప్పినా సాయంత్రం 5.30 వరకు కూడా ఓకే కాలేదు. వినియోగదారులు కేంద్రాల వద్దనే పడిగాపులుకాశారు. ముఖ్యంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాలలో అడ్మిషన్లు పొందేందుకు శనివారమే చివరి తేదీ కావడంతో విద్యార్థులు ఉదయమే మీ సేవ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. సమయం గడిచిపోతున్న కొద్దీ వారిలో ఆందోళన వ్యక్తం అయ్యింది. కొన్ని కేంద్రాలలో విద్యార్థులు నిర్వాహకులతో గొడవలకు దిగారు. పనిచేయకుంటే ఎందుకు పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 280 కేంద్రాలలో సేవలు పనిచేయలేదు. రాష్ర్ట వ్యాప్తంగా ఇదే సమస్య ఉన్నట్లు టీఎస్ ఆన్లైన్ జిల్లా మేనేజర్ ప్రదీప్ తెలిపారు. డాటా బేస్ సమస్య కారణంగా పనిచేయలేకపోయాయన్నారు. సమస్యను తొలగించేందుకు ప్రయత్రాలు జరుగుతున్నాయన్నారు. అనుకోకుండా సాంకేతిక పరమైన సమస్య వచ్చిందని, వినియోగదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. 5 ఏళ్లలో ఇంత పెద్ద సమస్య రాలేదని, సర్వర్ డౌన్ కారణంగా అడపాదడపా ఇబ్బందులు వచ్చినా మొత్తానికి సేవలు నిలిపివేసే సమస్య రాలేదని నిర్వాహకులు తెలిపారు. -
సేవలు అధికం.. ఫలితం మితం
సెకండ్ ఏఎన్ఎంల పరిస్థితి అధ్వానం ఉపకేంద్రాల్లో కుంటుపడుతున్న వైద్యసేవలు 32 రోజులుగా సమ్మె చేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు జోగిపేట: ఆరోగ్య శాఖలో వైద్య సేవలను మెరుగు పరిచేందుకు నియమితులైన సెకండ్ ఏఎన్ఎంలకు ఉద్యోగ భద్రత కరువైంది. 9 సంవత్సరాల క్రితం ఎన్ఆర్హెచ్ఎం స్కీం కింద నియమితులైన సెకండ్ ఏఎన్ఎంలు రెగ్యులర్ వాళ్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనాలు, ఇతర సదుపాయాలు లేక వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోందని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన చెందుతున్నారు. ఆవాస కేంద్రాల ద్వారా సేవలిందించాల్సిన వీరే గదులకు అద్దె చెల్లించాలి. రవాణా, భోజన సదుపాయం. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. ప్రసూతి సెలవులు కూడా వీరికి ఇవ్వడం లేదు. మొదటి ఏఎన్ఎంలు లేని చోట సెకండ్ ఏఎన్ఎంలే ఇద్దరి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఒక రోజు సెలవు తీసుకున్నా వేతనంలో కోత పడాల్సిందే. ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని కేంద్రాల్లో పని చేస్తున్నా తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని సెకండ్ ఏఎన్ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. వీరు నిర్వహించే విధులు మాతాశిశు సంరక్షణ, అన్ని రకాల వ్యాధి నిరోధకశక్తి టీకాలు, బీసీజీ, ఓఓపీవీ, పెంటావాలెంట్, మిజిల్స్, విటమిన్ ఏ, టీటీ ఇవ్వడం, మహిళ గర్భవతి అయినప్పటి నుంచి డెలవరీ అయ్యే వరకు సేవలు అందించడం, గర్భవతుల పేర్ల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి డెలివరీ కోసం గర్భిణులను చేర్చడం, టీబీగ్రస్తుల ఇంటికి వెళ్లి మందులు పంపిణీ చేయడం, బీపీ, షుగర్ టెస్టులు చేయడం, 104, 108 సేవలు, డీపీఎల్ క్యాంపుల్లో సేవలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, బుధవారం, శనివారం వ్యాక్సిన్లు ఇవ్వడం వంటి సేవలను అందిస్తున్నారు. సర్వీసును క్రమబద్ధీకరించాలి సెకండ్ ఏఎన్ఎంలుగా పని చేస్తున్న మా ధీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసువాలి. మా సర్వీసు క్రమబద్ధీకరించాలి. రాత్రి, పగలు పని చేస్తున్నాం. ఊరూరా తిరుగతూ పిల్లలకు టీకాలు ఇస్తున్నాం. ఖర్చలను తామే భరించాల్సి వస్తుంది. మాకిచ్చే రూ.10 వేల జీతంలో ఖర్చులు పోను మిగిలిన దానిలో జీవనం సాగించడం కష్టతరంగా మారుతోంది. - అనసూయ, సెకండ్ ఏఎన్ఎం కనీస వేతనం అందించాలి సెకండ్ ఏఎన్ఎం పోస్టులను రెగ్యులరైజ్ చేయాలి. పదో పీఆర్సీ ప్రకారం వేతనం రూ.21,300 ఇవ్వాలి. విధి నిర్వహణలో సెకండ్ ఏఎన్ఎంలు అకాల మరణం చెందితే రూ.10 లక్షల పరిహారం చెల్లించాలి. ప్రభుత్వం మాకు కనీసం రవాణా చార్జీలు కూడా చెల్లించడం లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలి. అన్ని రకరాల సదుపాయాలు అందించాలి. - వనిత, సెకండ్ ఏఎన్ఎం పీఎఫ్ సదుపాయం కల్పించాలి మొదటి ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న సెకండ్ ఏఎన్ఎంల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. వారికి ఎలాంటి సదుపాయాలు కల్పించడం లేదు. హెచ్ఆర్ఏ, టీఏ సదుపాయాలు కల్పించాలి. 32 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. - మొగులయ్య, సీఐటీయూ డివిజన్ కార్యదర్శి -
స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం
జోగిపేట: బ్రిటిష్ పాకులకు వ్యతిరేకంగా పోరాడి భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి సమరయోధుల కృషి మరవలేనిదని ఎంపీపీ అధ్యక్షురాలు సీహెచ్ విజయలక్ష్మి, నగర పంచాయతీ చైర్పర్సన్ ఎస్.కవిత, జెడ్పీటీసీ శ్యామమ్మ అన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక సమరయోధులు అల్లె చిన్నమల్లయ్య, జీ.లింగమయ్య గౌడ్, అరిగె ఆశయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం కోసం పోరాడిన వారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటాలన్నారు. కార్యక్రమంలో తహాసీల్దార్ నాగేశ్వరరావు, సీఐలు వెంకటయ్య, శ్రీనివాస్, ఎస్ఐలు శ్రీధర్, లక్ష్మినారాయణ, పట్టాభిరామ్, జైలర్ అచ్చయ్య, మాజీ ఎంపీపీ రామాగౌడ్, ఏడీఏ శ్రీలత, ఏఓ విజయరత్న, ఉప తహసీల్దార్ కిష్టయ్య, ఆర్ఐలు సతీష్, నహీం పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వేళ.. మృత్యుహేల
కిచ్చన్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం నలుగురు దుర్మరణం.. 10 మందికి తీవ్ర గాయాలు క్షతగాత్రులను సంగారెడ్డి, హైదరాబాద్‌కు తరలింపు మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారే జోగిపేట: రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన అందోలు మండలం కిచ్చన్నపల్లి గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతులంతా మహారాష్ట్రకు చెందిన వారు. వివరాలిలా ఉన్నాయి. నాందేడ్ జిల్లా ముఖేడ్ తాలూకా దొన్గెడ్, వాడీ, షీకాద, సోన్‌పేట గ్రామాలకు చెందిన రెండు కుటుంబాలు సోమవారం సాయంత్రం చిత్తూరు జిల్లాలోని తిరుమలకు క్రూసర్ వాహనంలో బయలుదేరారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన లక్ష్మిబాయికి గత సంవత్సరం ఏఎన్ఎంగా ఉద్యోగం రావడంతో పాటు దిలీప్, ఉజ్వలల కొడుకు తల వెంట్రుకలు తీయాలన్న మొక్కును తీర్చుకునేందుకే వీరు తీర్థయాత్రలకు బయలుదేరినట్లు సమాచారం. కిచ్చన్నపల్లి గ్రామ బస్జేజీ సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి నాందేడ్ అకోలా జాతీయ రహదారి పక్కనే ఉన్న పెద్ద మర్రిచెట్టును ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పులియాబాయి (55) భార్య భర్తలైన సంజయ్ రాథోడ్ (35), లక్ష్మిబాయి (30 ) అక్కడికక్కడే మృతి చెందారు. పులియాబాయి వెనుక సీటులో నుంచి ముందు సీటులోకి వచ్చి సీట్లమధ్య ఇరుక్కుపోయి మరణించింది. ముందు సీటులో కూర్చున్న సంజయ్రాథోడ్కు తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందాడు. క్రూసర్ వాహనం డ్రైవర్ నర్సింగ్ (40)ను జోగిపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సంగారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సంఘటనలో సుమీత్, కవితల కాళ్లు విరిగిపోగా, మాషన్, అక్షర, స్వప్న, విద్య, దిలీప్ రాథోడ్ల తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఉజ్వల అనే మహిళ చెంపకు గాయం అయ్యింది. ప్రదీప్‌నాయక్, దిలీప్ రాథోడ్, మహేదేవ్లకు కూడా గాయాలు కావడంతో వారిని సంగారెడ్డి, హైదరాబాద్ ఆసుపత్రులకు అంబులెన్స్‌లో తరలించారు. ఈ ప్రమాదంలో ఆటో పల్టీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పెద్దాపూర్ గ్రామానికి చెందిన కిష్టాగౌడ్కు గాయాలు కాగా, డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. సంఘటన స్థలాన్ని సీఐ వెంకటయ్య, ఎస్ఐ శ్రీధర్, పోలీసు సిబ్బందితో సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. ఉజ్వల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ టి.శ్రీధర్ తెలిపారు. -
ప్లాస్టిక్ కంచెలు కాపాడేనా?
జోగిపేట: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను రక్షించేందుకు గట్టి చర్యలు తీసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. మొక్కల సంరక్షణకు ముళ్లకంచెను ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం ఈజీఎస్ ద్వారా డబ్బు కేటాయిస్తామని ప్రకటించారు. నగర పంచాయతీలో నాటిన మొక్కల రక్షణకు మాత్రం ప్లాస్టిక్ ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. అవి ఎంత వరకు మొక్కలను కాపాడతాయనే విషయంపై అధికారులు, సిబ్బంది పెదవి విరుస్తున్నారు. ఇనుప ట్రీగార్డుల్లోనే మొక్కలను రక్షించడం కష్టమైన సమయంలో ప్లాస్టిక్ ట్రీగార్డులను పంపిణీ చేయడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం నగర పంచాయతీలో నాటిన మొక్కలకు ఐదు, ఆరు ప్లాస్టిక్ ట్రీగార్డులను ఏర్పాటు చేయనున్నారు. మేకలు, ఇతర పశువులు గట్టిగా లాగితే ఆ ట్రీగార్డులు ఊడి బయటకు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. చిన్న మంట తగిలినా అది దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. ప్రభుత్వం ఇనుప ట్రీగార్డులనే పంపిణీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. నగర పంచాయతీ పరిధిలో నాటిన మొక్కలను కాపాడేందుకు 500 వరకు ప్లాస్టిక్ కంచెలనే ప్రభుత్వం పంపిణీ చేసింది. వాటిని ఇంకా ఏర్పాటు చేయలేదు. కార్యాలయంలో భద్రంగా ఉంచారు. ప్రతి మొక్కను కాపాడాలని ప్రభుత్వం ఒక వైపు ప్రకటిస్తుండగా... ఇలాంటి కంచెలు ఎంత వరకు ఆ మొక్కలను కాపాడతాయని పలువురు అంటున్నారు. -
కాలం చెల్లిన బిస్కెట్లు
జోగిపేట: కాలం చెల్లిన బిస్కెట్లను విక్రయిస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. పార్లే కంపెనీకి చెందిన హైడ్ అండ్ సీక్ అనే బిస్కట్ (33 గ్రాములు)లను పట్టణంలో విక్రయిస్తున్నారు. ఈ బిస్కెట్లను జనవరి 20, 2016లో తయారు చేశారు. బిస్కెట్ ప్యాకెట్‌పై ఎక్స్పైరీ తేదీ ఆరు మాసాలు అని ఉంది. అయినా స్థానిక డీలర్లు యథావిధిగా బిస్కెట్ ప్యాకెట్లను పట్టణంలోని కిరాణం, బేకరీ, జనరల్ స్టోర్స్, మెడికల్షాప్లకు విక్రయిస్తున్నారు. దుకాణ యజమానులు కూడా వాటిని చూసుకోకుండానే విక్రయాలు జరుపుతున్నారు. శనివారం మండల అభివృద్ధి కార్యాలయ ఉద్యోగి రామకృష్ణారెడ్డి బిస్కెట్ల కోసం పట్టణమంతా తిరిగారు. అందరి దగ్గర ఉన్నా కాలం చెల్లిన బిస్కెట్లే ఉన్నాయి. దీంతో విషయం వెలుగుచూసింది. -
శ్రావణం.. పండుగలమయం
దేవతలకు ప్రీతికరం.. సిరిసంపదలకు ఆలవాలం అమ్మవార్ల అనుగ్రహానికి అనువైన కాలం ప్రతి రోజూ శుభప్రదమే శ్రావణంలో ముఖ్య పండుగల తేదీలు నాగుల పంచమి 7 మంగళ గౌరీ వ్రతం 9 వరలక్ష్మీవ్రతం 12 రక్షాబంధన్ 18 శ్రీ కృష్ణాష్టమి 25 జోగిపేట: మహాశక్తిదాయిని, సౌభాగ్య సంతాన ఫలాలనిచ్చే వరప్రదాయిని శ్రీ మహాలక్ష్మి మాత. గుమ్మం ముందు ముగ్గు.. పూజాపీఠం వద్ద దీపం.. పెరట్లో గోమహాలక్ష్మి.. తులసికోట.. గడపకు పసుపు.. నుదుటున కుంకుమతో కళకళలాడే ఇంతులున్న ఇంట ఆ అమ్మవారు కొలువై ఉంటారట. శ్రీమహావిష్ణువు హృదయవాసినిగా భాసిల్లే ఆ అమృత స్వరూపిణికి కొలువై ఉన్న ఇల్లు ఎల్లవేళలా సిరిసంపదలు సుమంగళీ భాగ్యంతో అలరారుతుంది. అంతటి కరుణామూర్తిని పూజించేందుకు.. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అనువైన మాసం శ్రావణం. ఈ మాసం దేవికే కాదు..శివుడికి కూడా ప్రీతికరమైనదే. ఆధ్యాత్మిక మాసం శ్రావణంలో ప్రతి రోజు ప్రత్యేకమే...శుభప్రదమే. ఒక్కోరోజు ఒక్కో దేవునికి పూజలు పాడ్యమి బ్రహ్మదేవుడు విదియ శ్రీయఃపతి తదియ పార్వతీదేవి చవితి వినాయకుడు పంచమి శశి షష్టి నాగదేవతలు సప్తమి సూర్యుడు అష్టమి దుర్గాదేవి నవమి మాతృదేవతలు దశమి ధర్మరాజు ఏకాదశి మహర్షులు ద్వాదశి శ్రీమహావిష్ణువు త్రయోదశి అనంగుడు చతుర్దశి పరమశివుడు పూర్ణిమ పితృదేవతలు పండగల మాసమే... శ్రావణమాసం వ్రతాలు, పూజలు, ఉపవాసాలతో పాటు ఎటు చూసినా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంటుంది. మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా చెబుతారు. నాగుల పంచమి సర్పదోషాలు తొలగిపోవడానికి శ్రావణ శుద్ధ పంచమి (ఆగస్టు7)రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్టలో పాలుపోసి ప్రత్యేక పూజలు చేస్తారు.వెండితో నాగ ప్రతిమలు చేసి పుట్టల్లో వదులుతారు. మహిళలు ఉపవాసం ఉండి పుట్టలో పాలుపోస్తారు. మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది. నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలని, మంచి సంతానం కలగాలని కోరుతూ నూతన వధువులు ఈ మాసంలో ప్రతి మంగళవారం మంగళగౌరి వ్రతం చేస్తారు.(ఆగస్టు9)అన్యోన్య దాంపత్యం, సంతానం, కలగాలని వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహంన జరిగిన మొదటి ఐదేళ్లూ ఈ మాసంలో ప్రతి మంగళవారం చేపడతారు. వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం (ఆగస్టు12)రోజున వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్ధిల్లాలని కోరుతూ ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. రాఖీపూర్ణిమ సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్లు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ రోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. సోదర, సోదరీమణుల బంధానికి ప్రతీకంగా నిలచిన రక్షాబంధన్(ఆగస్టు18)ను జరుపుకుంటారు. శ్రీకృష్ణాష్టమి శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన రోజు. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం. శ్రావణ బహుళ అష్టమి రోజున (ఆగస్టు 25) న శ్రీకృష్ణుడి జన్మదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కృష్ణుడిని ఊయలలో వేసి ఉత్సవాలను నిర్వహిస్తారు. -
50 పడకలు.. 74 మంది రోగులు!
ఆసుపత్రి నిండా అతిసార బాధితులే ఒకే బెడ్‌పై ఇద్దరికి చికిత్సలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోగులు పట్టించుకోని అధికారులు జోగిపేట: జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోజు రోజుకు అతిసార బాధితుల సంఖ్య పెరుగుతోంది. గురువారం 47 మంది ఉంటే.. శుక్రవారం నాటికి 74 మందికి పెరిగిపోయారు. ఆసుపత్రి 50 పడకలది కాగా... రోగులు మాత్రం 74 మంది వచ్చి చేరారు. చికిత్సలు అందించడంలో ఆసుపత్రి సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ప్రతి రోగికి తప్పనిసరిగా గ్లూకోజ్ బాటిల్ పెట్టాల్సి ఉండటంతో సిబ్బంది సరిపోవడం లేదు. అందోలు, పుల్కల్, కౌడిపల్లి మండలాలకు చెందిన అతిసార బాధితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. కౌడిపల్లి మండలానికి చెందిన వారే సగానికిపైగా ఉన్నారు. ఆ గ్రామానికి చెందిన చిన్నారులు సైతం అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందోలు మండలానికి సంబంధించి జోగిపేట, అన్నాసాగర్ ప్రాంతానికి చెందిన వారు అతిసార బాధపడుతున్నారు. జిల్లాలో అతిసార అదుపులో ఉందని జిల్లా వైద్యశాఖ అధికారులు ఒకవైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు వందల సంఖ్యలో రోగులు పెరుగుతున్నారు. జోగిపేట ఆసుపత్రిలో డెలివరీ అయిన మహిళల కోసం కేటాయించిన గదుల్లో సైతం అతిసార బాధితులకు చికిత్సలు అందిస్తున్నారు. బాలింతను గదిలో నుంచి వరండాలోకి తరలించారు. అతిసార పేషెంట్ల మధ్య పసిబిడ్డలకు అనారోగ్యం చేస్తుందనే బయటకు షిఫ్ట్ చేసామని సిబ్బంది చెప్పారు. అతిసార బాధితులే ఉండటంతో ఇతర జబ్బుల వారు ఆసుపత్రికి వచ్చినా ఇన్ పేషెంట్లుగా చేరేందుకు నిరాకరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోగులకు ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అందుబాటులో మందులు అతిసార బాధితులకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఎంత మంది వచ్చినా సిబ్బంది వెంటనే స్పందించి చికిత్సలు చేస్తున్నారు. కౌడిపల్లి, అందోలు మండలాల నుంచే ఎక్కువ రోగులు వస్తున్నారు. గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడంతోనే ఇలాంటి జబ్బులు వస్తాయి. తాగునీటిని వేడి చేసుకోవాలి. తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. - డాక్టర్ సత్యనారాయణ, జోగిపేట ఆసుపత్రి -
జిల్లాలో అదుపులోనే అతిసార
అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో మందులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి జిల్లా వైద్యశాఖ అధికారి అమర్‌సింగ్ నాయక్ జోగిపేట: జిల్లాలో అతిసార అదుపులోనే ఉందని జిల్లా వైద్యశాఖ అధికారి అమర్ సింగ్ నాయక్ తెలిపారు. జోగిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసారతో చికిత్సపొందుతున్న రోగులను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వి లేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం వంద మంది అతిసారతో ఆసుపత్రుల్లో చికిత్స లు పొందుతున్నారన్నారు నలుగురి పరిస్థితి బాగా లేకపోవడంతో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు రావన్నారు. భో జనం చేసేటప్పుడు, మల, మూత్ర విసర్జనలకు వెళ్లినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోవాలన్నారు. నీటి కాలుష్యం వ ల్లనే అతిసార వ్యాధికి గురవుతున్నారన్నారు. 15 రోజులకొకసారి గ్రామాల్లో తాగునీటి ట్యా ంకులను శుభ్రం చేయాలని, క్లోరినేషన్ చేయాలని తెలిపారు. నీటిని ప్రతిరోజు వేడి చేసుకొని చల్లారిన తర్వాత సేవించడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడన్నారు. డాక్టర్లు నృపేన్ చక్రవర్తి, భవానీ, స్వప్న ఆయన వెంట ఉన్నారు. -
మాసానిపల్లి.. ఫేస్‘బుక్’
‘మల్లిక..మల్లిక ’ అనే పేరుతో అకౌంట్ అక్రమ సంబంధాలు అంటగడుతూ పోస్టింగ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు, యువకులు స్థానికంగా ఉండే యువతిపై అనుమానాలు గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదైనా పట్టించుకోని పోలీసులు జోగిపేట: ఫేస్బుక్లో నకిలీ అకౌంట్ తెరిచి.. గ్రామస్తుల ఫొటోలతో పాటు అసభ్యకర మాటలు పోస్టు చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన విషయమై ఈ ఏడాది మే నెలలోనే ఎఫ్ఐఆర్ నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో మాసానిపల్లికి చెందిన మహిళలు, యువకులు ఆదివారం మరోసారి జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. ‘మల్లిక.. మల్లిక’ పేరుతో... ‘మల్లిక.. మల్లిక’ అన్న పేరుతో ఫేస్బుక్ అకౌంట్ తెరిచి, చేతి వేళ్లను ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. మాసానిపల్లికి చెందిన సుమారు 20 మందికి పైగా యువకులు, యువతుల ఫొటోలు వాట్సాప్, ఫేస్బుక్ నుంచి డౌన్లోడ్ చేసి వాటితో ఫేస్బుక్ ద్వారా అసభ్యకర పదాలు పోస్టు చేస్తున్నారు. అంతేకాదు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్లో మేసేజ్ చూసిన కౌడిపల్లి మండలానికి చెందిన వ్యక్తి.. తన భార్యపై అనుమానంతో పుట్టింటికి పంపించివేసినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆలస్యంగా గుర్తించిన గ్రామస్తులు.. విషయంపై ఆరా తీయగా స్థానికంగా ఉండే ఓ యువతి(22 ఏళ్లు)కి సంబంధించిన ఫేస్బుక్ ఐడీతో మేసేజ్‌లు వెళ్తున్నట్టు గమనించారు. బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో స్థానిక సీఐ, ఎస్సై విచారణ బాధ్యతలు తీసుకున్నారు. విషయం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ సంవత్సరం మే నెలలోనే సదరు యువతిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. పనిచేయని ఆదేశాలు ఫేస్బుక్ మెసేజ్‌లు తొలగించాలని సదరు యువతిని పోలీసులు ఆదేశించారు. ఆమె తొలగించకపోవడంతో బాధితులు నిందితురాలిని నిలదీశారు. దీంతో ఆమె, ఇతర బంధువులు.. తమపై దాడికి ప్రయత్నించారంటూ ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చెందిన 30 మంది మహిళలు, యువకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తప్పు చేసి తమపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫోన్లో ఉన్న బూతు పోస్టింగ్‌లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని జోగిపేట ఎస్సై టి.శ్రీధర్‌ను కోరారు. విచారణ చేస్తాం: - టి.శ్రీధర్, ఎస్సై మాసానిపల్లి గ్రామానికి చెందిన యువకులు, యువతుల పేర ఫేక్ ఫేస్బుక్ అకౌంట్లో బూతు మెసేజ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. గ్రామానికి చెందిన నిందితురాలిని విచారించాం. ఆమె తనకు సంబంధం లేదని చెబుతోంది. రాజు అనే వ్యక్తి పోస్టింగ్‌లు చేస్తున్నాడంటోంది. పూర్తిస్థాయిలో ఇంకా విచారణ చేయాల్సి ఉంది. -
ఆటోను ఢీకొట్టిన ప్రైవేట్ టూరిస్టు బస్సు
జోగిపేట: అందోలు గురుకుల పాఠశాల వద్ద రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటోను కర్ణాటక రాష్ట్రానికి చెందిన కేఏ 25డీ 3930 నంబరు గల టూరిస్టు బస్సు ఢీకొనడంతో అందులో కూర్చున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. జోగిపేట వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న టూరిస్టు సుల్తా¯ŒSపూర్‌కు వెళుతున్న ఆటోను వెనకవైపు నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆటోను ఢీకొనగా ఆటో బోల్తాపడింది. బస్సు అదుపుతప్పి రోడ్డు కిందకు వెళ్లిపోయింది. ఆటోలో ఉన్న ఉప్పరిగూడెంకు చెందిన యాదమ్మ అనే వృద్ధురాలి తలకు గాయం కాగా యాదగిరి అనే వ్యక్తి నడుముకు గాయమైంది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వారికి చికిత్సలు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
నగరపంచాయతీలో పారిశుద్ధ్య లోపం
రోడ్డు మీదకు చేరిన మురికి నీరు కదలని అధికార యంత్రాంగం జోగిపేట : జోగిపేట నగర పంచాయతీని పట్టించుకునే వారేలేకపోవడంతో ప్రతి వార్డులో ఏదో రకమైన సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులకు ఇతర పనులను అప్పగించడం వల్ల కాలనీల్లో ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పట్టణంలో ఏ వార్డు చూసినా చెత్తే దర్శనమిస్తుంది. అసలే వర్షాకాలం కావడంతో చెత్త ఎక్కడపడితే అక్కడే పేరుకుపోయి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ఆస్పత్రిలో డయేరియాతో బాధపడుతున్న కేసుల్లో జోగిపేట, అందోలు ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారు. జోగిపేటలో 20 వార్డులు ఉన్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అన్ని వార్డుల్లో సమస్యలు తాండవిస్తున్నాయి. ఎమ్మెల్యే సమస్యలను పట్టించుకోకపోవడానికి కారణం నగర పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం అధికారంలో ఉండడమే కారణమని చెప్పవచ్చు. కదలని అధికార యంత్రాంగం పట్టణంలోని వాసవీనగర్ ప్రధాన రహదారిపై చెత్త పేరుకుపోయింది. వర్షం కురియడంతో చెత్తంతా రోడ్డుమీదకు వచ్చి చేరి దుర్గంధం వ్యాప్తిస్తోంది. వాసవీనగర్‌లో కూడా పారిశుద్ధ్య సమస్యలున్నాయి. మురికికాల్వలు సక్రమంగా లేకపోవడంతో కొద్దిపాటి నీటికే రోడ్డుపైకి మురికినీరు చేరుతోంది. 15వ వార్డులో చెత్తకుండీ చుట్టూ చెత్త ఉండడంతో వర్షం కురియడంతో ఆ రోడ్డు గుండా నడిచే పరిస్థితే లేదు. చుట్టుపక్కల వారు పగలు కూడా ఇళ్లకు తలుపులు పెట్టుకునే పరిస్థితి నెలకొంది. 17వ వార్డులోని పెద్దమఠం వెనక భాగంలో కాలనీ వాసులు రోడ్డుమీదే చెత్త వేయడంతో దుర్వాసన వస్తోంది. 19 వార్డు పరిధిలోని ఆక్స్ఫర్డ్ పాఠశాల సమీపంలోని వీధిలో వర్షం కురిస్తే చాలు వారంరోజుల పాటు ఆ రహదారి గుండా రాకపోకలు బంద్. వీధులు తిరగని కమీషనర్లే... నగర పంచాయతీ ఏర్పడి మూడేళ్లవుతోంది. ఇప్పటి వరకు 5 మంది కమిషనర్లు వచ్చి బదిలీ అయ్యారు. ఒకరు విధుల నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. వీరిలో ఎవరు కూడా వీధుల్లో తిరిగిన వారు లేరు.. ఏ వార్డు ఎక్కడుందో తెలియని పరిస్థితుల్లో పనిచేసి బదిలీ అయ్యారు. ఇటీవలే కమిషనర్ సస్పెన్షన్ కావడంతో జిల్లా అధికారికి అదనపు బాధ్యతలను అప్పగించారు. ] కొత్త కమిషనర్తోనైనా సమస్యలు తీరేనా ఇటీవల విధుల నిర్లక్ష్యంతో సస్పెన్షన్‌కు గురైన రవీందర్రావు స్థానంలో జిల్లా ఆర్వీఎం పీఓగా పనిచేస్తున్న యాస్మిన్ బాషాకు జోగిపేట నగర పంచాయతీ ఇన్చార్జి బాధ్యతలను అప్పగిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో వారం క్రితం బాధ్యతలు చేపట్టారు. సమస్యలను ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించే అధికారిగా పేరున్న ఆమె హయాంలోనైనా సమస్యలు తీరుతాయన్న ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. -
జోగిపేట.. ఉద్యమాల కోట
♦ ప్రథమాంధ్ర మహాసభకు పుట్టినిల్లు ♦ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహాసభలు ♦ గ్రంథాలయ ఉద్యమమూ ఇక్కడి నుంచే... ♦ తెలంగాణలోనే అతిపెద్ద లోహరథం జోగిపేట : నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ప్రథమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట. జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. నిజాం కాలంలో తెలంగాణ విమోచన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయం. నిజాం పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించి స్వాతంత్య్రం సాధించాలన్న ఆకాంక్షను పెంపొందించేందుకు 1828లో తెలంగాణ ఆంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు స్థాపించారు. 1930, మార్చి 3,4,5 తేదీలలో స్థానిక దేవాలయంలో ప్రథమాంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ సమావేశానికి సురవరం ప్రతాపరెడ్డితో పాటు మహామహులెందరో హాజరై ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేశారు. అంతే కాకుండా నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతన ప్రథమాంధ్ర మహిళా మహాసభ కూడా జోగిపేటలోనే నిర్వహించడం గమనార్హం. గ్రంథాలయ ఉద్యమం కూడా... నిజాం నిరంకుశాన్ని ప్రజలకు వివరించేందుకు అప్పటి విమోచన ఉద్యమ నాయకులు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. అయితే నిజాం నవాబు గ్రంథాలయాలను కొనసాగించవద్దని గస్తీనిషాన్ శాసనాన్ని జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా 1922లో మొట్టమొదటి సారిగా జోగిపేటలో శ్రీ జోగినాథ ఆలయాన్ని నిర్మించారు. స్థానిక స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. జోగినాథ్ గంజ్ .... రైతులు పండించిన ధాన్యాలను జోగిపేటలోని మార్కెట్లో విక్రయించేవారు. వేలాది మంది రైతులతో మార్కెట్ కిక్కిరిసి పోయేది. ఆ మార్కెట్‌కు జోగినాథ్ గంజ్‌గా నామకరణం చేశారు. జోగిపేటలో 1941లో వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేసారు. స్థానికంగా శ్రీ జోగినాథ ఆలయం ప్రాచుర్యం పొందడంతో జోగినాథ గంజ్‌గా నామకరణం చేసినట్లుగా సమాచారం. ముఖద్వారం నుంచే గ్రామంలోకి... జోగిపేటలోని ముఖ ద్వారం (గౌని) గుండానే గ్రామంలోకి ప్రవేశిస్తారు. నలువైపులా అప్పట్లో నిర్మించిన నాలుగు ప్రవేశ ద్వారాలలో ఇదొకటి. స్థానికంగా నిర్వహించే రథోత్సవం ఈ ముఖ ద్వారం నుంచే ప్రారంభమవుతుంది. ఈ ముఖద్వారం పై నుంచే రథానికి శిఖరాలను ఏర్పాటు చేస్తారు. పట్టణ ప్రముఖులు అందోలు నియోజకవర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత బస్వమాణయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత శేరి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత డాకూరి గాలయ్య 18 ఏళ్లపాటు జోగిపేట సర్పంచ్‌గా పనిచేసి మన్ననలను పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆవిర్భావ దినోత్సవ సంబరాలను కూడా 2013లో జోగిపేటలోనే నిర్వహించుకోవడం యాదృచ్చికమే. టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగిపేటకు ఆ పేరెలా వచ్చిందంటే.. అందోలు రాజధానిగా పరిపాలన సాగించిన శౌర్యవంశరెడ్డి రాజులైన రామినేయుని వంశంలోని నాల్గో తరం రాజు అల్లామరెడ్డికి సంతానం కలగలేదు. దాంతో రామజోగి అనే సాధువు సలహా ప్రకారం వైక్రాంతగిరి పైన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాలని సూచించడంతో అల్లమారెడ్డికి సంతానం కల్గింది. తనకు సలహ ఇచ్చిన రామజోగికి కృతజ్ఞతగా వైక్రాంతగిరి (జోగిపేట గుట్ట) కింద క్రీ.శ 1547లో ఓ గ్రామాన్ని నిర్మించి దానికి రామ జోగిపేటగా నామకరణం చేశారట. ఇది కాలక్రమంలో జోగిపేటగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. దీంతో పాటు వైక్రాంత గిరిపై ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలను తొలగించి తమ ఇష్టదైవమైన శివ లింగాన్ని ప్రతిష్ఠించి జైన జోగుల బస్తీని వీరశైవ బస్తీగా పేరు మార్చారట, అయితే కాల క్రమేనా జోగుల బస్తీ జోగిపేటగా రూపుదిద్దుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. పూర్వీకులు గతంలో నాలుగు ప్రవేశ ద్వారాలను నిర్మించారు. వీటితో పాటు వందల సంఖ్యలో బురుజులు కూడా నిర్మించారు. చారిత్రాత్మకం క్లాక్‌టవర్... గ్రామానికి నాలుగు వైపుల ఉన్న ద్వారాలకు మధ్యలో క్రీ.శ. 18వ శతాబ్దంలో అసఫ్ జాహీల పాలనలో గడియారపు గోపురాన్ని నిర్మించారు. గ్రామంలో మధ్యలో ఉండడంతో కాలక్రమేన క్లాక్‌టవర్‌గా ప్రజలు నామకరణం చేసుకున్నారు. క్లాక్‌టవర్‌కు చుట్టూ ఉన్న గడియారాలు నిరంతరం నడిచేవని, గడియారం గట్టిగా మోగడంతోనే నిద్రలేచేవారని, క్లాక్‌టవర్‌కు ఉన్న గడియారంతోనే ప్రజలంతా తమ దైనందిన కార్యక్రమాలు చేసుకునేవారిని తెలుస్తుంది. కొంత కాలం నుంచి ప్రస్తుతం ఆ గడియారాలు పనిచేయకుండా నిలిచిపోయాయి. తిరిగి వాటికి మరమ్మతులు చేయించేందుకు ప్రస్తుత నగర పంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. క్లాక్‌టవర్ మధ్యలో తెల్లటి పాలరాతి మహాత్మాగాంధీ విగ్రహన్ని కూడా అప్పట్లో ప్రతిస్ఠించారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ క్లాక్‌టవర్ నేటికి చెక్కు చెదరలేదు. అతిపెద్ద లోహరథం సుమారు 400 ఏళ్ల క్రితం స్థానిక గుట్టపై జోడు లింగాలు వెలిశాయి. ప్రస్తుతం శ్రీ జోగినాథ ఆలయంగా విరజిల్లుతోంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో జాతరను ఉగాది పండగకు ముందు నిర్వహిస్తారు. దానిలో భాగంగా రథంను ఊరేగిస్తారు. ఇందుకుగాను 52 ఫీట్ల ఎత్తుతో లోహ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 12 ఏళ్ల క్రితం 32 టన్నుల ఇనుముతో తయారు చేయించిన రథానికి 5 అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తులో ఒక్కొక్క దేవతా మూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసారు. గణపతి, దుర్గామాత, నందీశ్వరుడు, నాగసర్పం, జోగినాథ దేవతామూర్తుల విగ్రహాలు రథంపై ఏర్పాటు చేశారు. ఈ రథం తెలంగాణలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాం నిజాం కాలంలో వారి నిరంకుశపాలనకు చరమగీతం పాడేందుకు అందరం కలిసి పోరాడాం. జోగిపేటలో మొట్టమొదటి ప్రథమాంధ్ర మహాసభను జయప్రదం చేసేందుకు తామంతా శ్రమించాం. తమ పోరాటంలో భాగంగా నిజాం నవాబులు ఎన్నో సార్లు తమను జైళ్లో పెట్టించినసందర్భాలున్నాయి. గ్రంథాలయాల ఏర్పాటును వ్యతిరేకించినా జోగిపేటలోని క్లాక్‌టవర్ పక్కనే ఏర్పాటు చేశాం. పోరాట సమయంలో వారు చిత్ర హింసలకు గురి చేసారు. - అరిగె ఆశయ్య, స్వాతంత్య్రసమరయోధులు జోగిపేట గర్వపడుతున్నాను ఎంతో చరిత్ర కలిగిన జోగిపేట నగర పంచాయతీకి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు గర్వపడుతున్నాను. ప్రథమాంధ్ర మహసభతో పాటు తొలి మహిళా సభకు కూడా ఇక్కడే జరిగింది. చారిత్రాత్మకమైన కట్టడాలను రక్షించేందుకు తనవంతుగా కృషి చేస్తా. క్లాక్‌టవర్‌కు ఉన్న గడియారాలను మరమ్మతు చేయించాలన్న ఆలోచన ఉంది. - ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్పర్సన్ జోగిపేట -
యువకుడి దారుణ హత్య
జోగిపేట: జోగిపేట పట్టణంలో యువకుడి హత్య సంచలనం రేపింది. పడుకున్న చోటే మెడపై అతి కిరాతకంగా నరికిన సంఘటన శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాలు ఇలా... పట్టణంలోని 13వ వార్డు పరిధిలో నర్రా ఆంజనేయులు (30) అనే యువకుడు భార్య, ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. హమాలీ పని చేసుకుంటూనే కొంత భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గురువారం పట్టణానికి చెందిన పరిచయస్తుల పెళ్లికి వెళ్లి వచ్చినట్టు సమాచారం. ఆ తరువాత పశువులకు మేతను వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రాత్రి ఇంటి ముందు పడుకుని ఉన్నాడు. తెల్లారే సరికి రక్తపు మడుగులో విగజ జీవిగా ఉన్న భర్తను చూసి అతని భార్య అనిత బిగ్గరగా కేకలు వేసింది. స్థానికులంతా సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్‌లు సంఘటన స్థలానికి చేరుకొని సమాచారాన్ని సేకరించారు. వేకువ జామున తన భర్త బాగానే ఉన్నాడని భార్య చెబుతున్నట్టు తెలిసింది. ఆ తరువాతే ఈ దారుణం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గుర్తు తెలియని దుండగులు బలమైన ఆయుధంతో మెడపై బలంగా నరికినట్టు పోలీసులు చెబుతున్నారు. ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుందని వారు ఆరా తీస్తున్నారు. ఆంజనేయులు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వీధుల్లో తిరిగిన జాగిలం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన డాగ్ స్క్వాడ్ బృందం ఘటన స్థలం వద్ద తనిఖీలు చేపట్టింది. ముందుగా ఘటన స్థలం వద్దకు తీసుకువెళ్లిన తర్వాత జాగిలం వీధుల్లో నుంచి సాయిబాబా ఆలయం వరకు మధ్యలో ఇద్దరి ఇళ్ల వద్ద కొద్దిసేపు ఆగిందని, తర్వాత కల్లు దుకాణం వద్దకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. హత్య కేసును ఛేదిస్తాం: సీఐ నాగయ్య జోగిపేట పట్టణంలో సంచలనం సృష్టించిన ఆంజనేయులు హత్య కేసును తొందరలోనే ఛేదిస్తామని జోగిపేట సీఐ నాగయ్య తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరికి మించి వ్యక్తులు పాల్గొని ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను తప్పనిసరిగా పట్టుకుంటామన్నారు. జాగిలాలు తిరిగిన ప్రాంతాలపై నిఘా వేసి ఉంచినట్టు తెలిపారు. -
30 వేల క్వింటాళ్ల పత్తి బుగ్గి
జోగిపేట : హాట్ బాక్స్ నుంచి వచ్చిన మెరుగుల కారణంగా మంటలు చెలరేగి సుమారు 30 వేల క్వింటాళ్ల పత్తి అగ్నికి ఆహుతైంది. దీంతో సుమారు రూ. 10 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఈ సంఘటన ఆందోల్ మండలంలని ఎర్రారం శివారులో గల వైభవ్ ముర్గ ఆర్గో టెక్ ఇండస్ట్రీస్ జిన్నింగ్ మిల్లో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు చేసిన సుమారుగా 30 వేల క్వింటాళ్ల పత్తిని జిన్నింగ్ చేయడానికి వైభవ్ ముర్గ ఆర్గోటెక్ ఇండస్ట్రీస్ ఆవరణలో ఉంచారు. సోమవారం జిన్నింగ్ నడుస్తున్న క్రమంలో హట్ బాక్స్‌లో అనుకోకుండా వచ్చిన మెరుగులు (చిన్న చిన్న రాళ్లు వచ్చినట్లయితే) రావడంతో మంటలు పత్తికి వ్యాపించాయి. దీంతో దట్టమైన పొగ, మంటలు రావడంతో అక్కడ ఏమి జరుగుతుందోనని కూలీలు అంతుపట్టక ప్రాణాలను అరచేత పట్టుకుని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అయితే జిన్నింగ్‌లోకి పత్తిని నింపుతున్న రెండు ట్రాక్టర్లు, ఓ జేసీబీ మంటల్లో అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్‌లు సిబ్బందితో సంఘట నా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ సమయంలో మంటలను ఆరే ్పందుకు జిన్నింగ్ మిల్లో గల బోరు ద్వారా నీటిని జిమ్ముతూ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాన్ని సిబ్బంది చేశారు. అయితే జోగిపేట ఫైర్ ఇంజన్ సకాలంలో చేరుకున్నా అరగంటలోపే నీరు పూర్తి కావడంతో నర్సాపూర్, సంగారెడ్డి, మెదక్, నారాయణఖేడ్ ఫైర్ స్టేషన్లకు సమాచారాన్ని అందించారు. ఇతర ప్రాంతాలకు చెందిన ఫైర్ ఇంజన్లు కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. సిబ్బంది ప్లాస్టిక్ బకెట్లు, బిందెలతో మంటలను ఆర్పారు. సంఘటన స్థలంలో ఎంపీ బీబీ పాటిల్ నారాయణఖేడ్ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జిన్నింగ్ మిల్లులో ఎగసి పడుతున్న మంటలను చూసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యల కోసం అధికారులతో ఫోన్లో మాట్లాడి అప్రమత్తం చేశారు. అనంతరం మిల్లు పార్టనర్ అయిన రంగనాథన్‌తో జరిగిన సంఘటనపై ఎంపీ ఆరా తీశారు. హట్ బాక్స్‌లో పత్తి వెంట చిన్న చిన్న రాళ్లు వచ్చినప్పుడు చిన్న చిన్న మెరుగులు వచ్చి మంటలు వ్యాపించడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ఆయన ఎంపీకి వివరించారు. కంపెనీలో 170 మంది వరకు కూలీలు పనిచేస్తుంటారని, అందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఆందోళన చెందవద్దు సీసీఐకి పత్తిని విక్రయించి డబ్బులు రాని రైతు లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వా రి డబ్బులు ఎక్కడా పోవని ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆయన సంఘటనా స్థలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సంఘటనపై తాను కలెక్టర్‌తో మాట్లాడానని, ఎవరికీ నష్టం జరగకుండా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకు ని న్యాయం చేస్తానని తెలిపారు. ఆయన వెంట నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావు షెట్కార్, టీఆర్ఎస్ నాయకులు బిడెకన్నె హన్మంతు, అందోలు ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి వెంకటేశం, స్థానిక నాయకులు ఆగమయ్య, శ్రీనివాస్ గౌడ్లు ఆయన వెంట ఉన్నారు. -
పడిపోతున్న ఉష్ణోగ్రతలు
బెంబేలెత్తిపోతున్న ప్రజలు మెదక్/జోగిపేట : రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో మెతుకు సీమ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శుక్రవారం మెదక్‌లో 10 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు శనివారం 9 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుండే చలి గాలులు మొదలయ్యాయి. చలిని తట్టుకోలేక సాయంత్రం 6గంటలకే ఇళ్లముఖం పట్టడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. మరోవైపు చలిగాలులతో చిన్నారులు, వయస్సు మళ్లిన వా రు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాస సంబంధమైన వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం తగ్గక పోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. స్వెట్టర్లు, మంకీ క్యాప్‌లు లేనిదే బయటకు రావాలంటే జనాలు జంకుతున్నారు. అదేవిధంగా జోగిపేటలో శుక్రవారం రోజు న 9.5 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో శనివారం 6.30 గంట లైనా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారా యి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా చలి మంటలు వేసుకుని వేడిని కాపుకోవడం కనిపించింది. ముఖం నిండా కట్టుకుని, షట్టర్లు వేసుకుని చలి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసుకునాన్నారు. చలి తీవ్రత పెరగడంతో స్వెట్టర్లు, గ్లౌజ్‌లకు గిరాకీ బాగా పెరిగింది. -
నాగిరెడ్డి మనోడే
జోగిపేట: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గం పరిధిలోని పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన వెంకమోళ్ల నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వి.నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నాగిరెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శిగా వి.నాగిరెడ్డి పనిచేస్తున్నారు. వాస్తవానికి ఆయన 2015 ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఎన్నికల కమిషనర్‌గా నియమితులు కావాలంటే తప్పనిసరిగా పదవీ విరమణ చేయాలన్న నిబంధన ఉండడంతో నాగిరెడ్డిఅందుకు కూడా సిద్ధమయ్యారు. విద్యాభ్యాసం నాగిరెడ్డి స్వగ్రామమైన పెద్దారెడ్డిపేటలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు జోగిపేట ఉన్నత పాఠశాల, ప్రభుత్వ నెహ్రూ మెమోరియల్ కళాశాలలో అభ్యసించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విద్యాలయంలో ఏజీ బీఎస్సీ పూర్తి చేశారు. బెంగుళూరులోని కళాశాలలో ఎమ్మెస్సీలో చేరారు. అనంతరం సివిల్స్ రాసి 1979-80లో ఐఎఫ్ఎస్ కర్ణాటక కేడర్‌కు ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం మంగళగిరి డీఎఫ్ఓగా పనిచేశారు. అలా ఏడాదిన్నర డీఎఫ్ఓగా పనిచేసిన ఆయన, అనంతరం రెండో ప్రయత్నంగా ఐపీఎస్ కేడర్‌కు ఎంపికయ్యారు. అయితే ఎలాగైనా ఐఎఎస్ కావాలనుకున్న నాగిరెడ్డి 1984లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. నిర్వహించిన పదవులు 1982లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. 1984లో సివిల్స్‌లో ఐఏఎస్‌గా ఎంపిక 1984లో కొత్తగూడెం, పెనుగొండ సబ్‌కలెక్టర్‌గా 1988-89లో పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా, 1989-91లో రంగారెడ్డి జిల్లా డీఆర్డీఏ పీడీగా, 1991-92లో హార్టికల్చర్ రాష్ట్ర డెరైక్టర్‌గా 1992-95లో విజయనగరం జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 1995లో కమర్షియల్ టాక్స్ డిప్యూటీ కమిషనర్‌గా, 96-97లో అగ్రికల్చర్ అండ్ కో ఆపరేటివ్ జాయింట్ సెక్రటరీగా, 1997-98లో కడప కలెక్టర్‌గా 1999-2000లో ఏపీ రాష్ట్ర మార్కెటింగ్ ఎండీగా, 1999లో పంచాయతీ రాజ్ కమిషనర్‌గా, సహకార శాఖ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. 2004లో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గిరిజన, సంక్షేమ, పర్యాటక శాఖలకు అధికారిగా వ్యవహరించారు. సీఎంగా కిరణ్‌కుమార్ రెడ్డి హయాంలోనూ పంచాయతీరాజ్, వ్యవసాయశాఖల ప్రధాన కార్యదర్శిగా, ఎన్జీరంగా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. -
పశుపోషణలో
జోగిపేట: పశు సంపద వల్ల రైతులకు అనేక లాభాలున్నాయి. అయితే వీటికి వచ్చే సీజనల్ వ్యాధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవని పశువైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అంటు వ్యాధుల బారి నుంచి పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్సలు చేయించాలని జోగిపేట పశువైద్య శాఖ ఏడీ శ్రీనివాసరావు, సెల్: 8374255444 తెలి పారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీరు తాగడం, వ్యాధి కారక పురుగులున్న మేతను మేయడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు. గొంతు వాపు వ్యాధి... ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. కలుషితమైన నీరు, మేతను తీసుకోవడం వల్ల పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటు వ్యాధి కావడం వల్ల ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు రావడంతో పాటు ఊసులు తోడుతుంటాయి. నివారణ... వర్షాకాలం ప్రారంభ సమయమైన జూన్, జూలైలో పశువులు విధిగా గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి బారిన పడిన పశువులను కట్టేసే దొడ్డిని క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. వ్యాధి ఇతర పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించి తగిన మందులు వాడాలి. గాలికుంటు వ్యాధి... ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లి పాల ద్వారా దూడలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారుతుంది. దీని నివారణకు నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. వ్యాధుల బారిన పడిన పశువులను మందతో తీసుకెళ్లకుండా విడిగా ఉంచి చికిత్సలు చేయించాలి. ఆరోగ్యంగా ఉన్న పశువుల లక్షణాలు ఆరోగ్యంగా ఉన్న పశువులు తోక, చెవులను ఎప్పుడూ ఆడిస్తూ నెమరు వేస్తూ చురుగ్గా ఉంటాయి. పాల ఉత్పత్తిలో మార్పు ఉండదు. పేడ ఆకు పచ్చగా ఉంటుంది. అనారోగ్యం బారిన పడ్డ పశువుల లక్షణాలు వ్యాధుల బారిన పడిన పశువుల మూత్రం వరిగడ్డి రంగులో ఉంటుంది. నెమరు వేయదు. జ్వరం ఉంటుంది. చర్మం మొద్దుబారి వెంట్రుకలు పైకిలేస్తాయి. కళ్ల నుంచి నీరు కారుతుంటుంది. చెవులు కిందకు జారి అలసిపోయినట్లుగా కనిపిస్తాయి. -
అక్షరం నేర్పని సాక్షరం
జోగిపేట: సాక్షర భారత్ పథకానికి 2010లో శ్రీకారం చుట్టారు. మండలంలోని 21 గ్రామాలకు గాను కోఆర్డినేటర్లను నియమించి, సంపూర్ణ అక్షరాస్యతకు కృషి చేయాలని బాధ్యతలను అప్పగించారు. దీనికోసం గ్రామ కో ఆర్డినేటర్లకు ప్రభుత్వం నుంచి నెలకు రూ.2వేల వేతనం అందుతోంది. వీరందరినీ సమన్వయపరచడానికి మండల కో ఆర్డినేటర్‌ను నియమించి రూ.5వేల వేతనం చెల్లిస్తోంది. వీరంతా కలిసి నిరక్షరాస్యులైన మహిళలు, పురుషులకు ఉదయం, సాయంత్రం వేళలో చదవడం, రాయడం నేర్పించాలి. కానీ ‘అసలు సెంటర్లు తెరుచుకుంటే కదా.. అక్షరాలు నేర్పేది’ అని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి సరిగ్గా నడుస్తున్నాయో.. లేదో..? అనే విషయాన్ని మండల కో ఆర్డినేటర్లు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసీఓలు తనిఖీకి వచ్చినప్పుడు పంచాయతీ రిజిస్టర్లో సంతకం పెట్టాలి. కానీ వీరు ఇవేమీ ఖాతరు చేయడం లేదు. ఇది వీసీఓలకు అలుసుగా మారింది. పలు గ్రామాల్లో కనీసం సాక్షర భారత్ కేంద్రం బోర్డు కూడా ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. గత ఏడాది నవంబర్ మాసంలో ప్రార ంభమైన నాలుగో దశ ఈ సంవత్సరం మే నెలతో ముగిసింది. ప్రస్తుతం ఐదో దశ కొనసాగుతోంది. గ్రామ కోఆర్డినేటర్లకు నెల నెల సమావేశాలు నిర్వహించి ఎంత మంది వయోజనులు వస్తున్నారో తెలుసుకుని మండల కో ఆర్డినేటర్లు బోధనకు సంబంధించిన శిక్షణ ఇవ్వాలి. కేంద్రాల్లో కనిపించని మెటీరియల్... మండలంలోని ఆయా గ్రామాల్లో గల సాక్షర భారత్ కేంద్రాల్లో ప్రభుత్వం సరఫరా చేసిన మెటీరియల్ పక్కదారి పట్టినట్లు ఆరోపణలున్నాయి. కుర్చీలు, క్యారం బోర్డులు, చెస్, కైలాసం, కార్పేట్లు ఇతర ఆట వస్తువులు చాలా కేంద్రాల్లో కనిపించడంలేదు. అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కేంద్రాల్లో దినపత్రికల జాడ లేకుండా పోయింది. వీటికి మాత్రం నెలనెలా బిల్లు చెల్లిస్తున్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సెంటర్లు కొనసాగేలా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
మాకు తెలియకుండా డబ్బెలా ఇస్తారు?
జోగిపేట : ‘మాకు తెలియకుండా ఆలయాలకు, మసీదులకు రూ.93 వేలు ఎలా పంపిణీ చేస్తారు?, మీ ఇష్టానుసారంగా ఇచ్చిన డబ్బులకు మేము ఆమోదం తెలుపం, ఇలా చేస్తే మిమ్మల్ని సరెండర్ చేయాల్సి వస్తుంది’ అని కమిషనర్ విజయలక్ష్మిపై పలువురు కౌన్సెలర్లు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఆ నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ సభ్యులకు తెలిపారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి చైర్పర్సన్ కవిత అధ్యక్షత వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబులు నగరపంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్ల పనులను సీడీఆర్ ప్రాజెక్టుకుఅప్పగించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే టీడీపీకి చెందిన కౌన్సిలర్ శ్రీకాంత్, టీఆర్ఎస్కు చెందిన లక్ష్మణ్‌లు ఇందుకు వ్యతిరేకించారు. అయితే 18 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక ఇవ్వకపోవడంతో సభ్యులు కమిషనర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు నివేదికను కమిషనర్ విజయలక్ష్మి తయారు చేసి చదివి వినిపించినా సభ్యులు సంతృప్తి చెందలేదు. ఒక్కోక్క వార్డులో సుమారుగా రూ.8 లక్షల పనులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయించాలని కౌన్సిలర్లు కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు. అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్లు, బీఆర్ జీఎఫ్ కింద రూ.19.64 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని, 13 ఫైనాన్స్ కింద రూ.53 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తైబజారు వేలం పాటను ఈనెల 23న నిర్వహించాలని, బకాయిలున్న వారిని వేలం పాటలో అనుమతించకూడదని కౌన్సిలర్ గోపి, సునీల్‌కుమార్‌లు సూచించారు. కూరగాయల మార్కెట్‌ను నెల రోజుల్లోగా నగర పంచాయతీకి అప్పగించాలని కలెక్టర్, పంచాయతీరాజ్ ఈఈలకు లేఖ రాయాలని కౌన్సిలర్ ప్రదీప్‌గౌడ్ కమిషనర్‌కు తెలిపారు. గాంధీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలను పెంచాలని వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు నవీన్, లక్ష్మణ్‌లు కోరారు. కౌన్సిలర్లుకు తెలియకుండా అనుమతులివ్వొద్దు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఆయా వార్డుల కౌన్సిలర్లకు చెప్పకుండా అనుమతులు ఇవ్వరాదని కౌన్సిలర్లు లక్ష్మణ్, మోహన్‌లాల్ జాదవ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే సమావేశంలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహరాజు సమాధానమిస్తూ నగర పంచాయతీ యాక్టులో అలాంటి నిబంధన ఏదీలేదని తెలిపారు. మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నీ అంశాలను మీరే మాట్లాడితే ఎలా? తమకు కూడా అవకాశం ఇవ్వాలని మహిళా కౌన్సిలర్ తోట్ల మమత కోరారు. ఒక్క సమస్యపైనే సభను సాగదీస్తే ఎలా ముందుకు వెళతామని ఆమె ప్రశ్నించారు. 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మాట్లాడుతూ తమ వార్డులో తాగునీటి పైపు ఏర్పాటుపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. -
జోగిపేట నగర పంచాయతీ టెండర్ల రద్దు
జోగిపేట: జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2.63 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లోనే టెండర్లను నిర్వహించారు. ఎన్నికల ముందు నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడంతో టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ.50 లక్షలు నూతన భవన నిర్మాణానికి, మిగతా రెండు కోట్లు జోగిపేట, అందోలులోని సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల నిమిత్తం వినియోగించుకునేందుకు అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. నగర పంచాయతీ అధికారులు రూ.2.63 కోట్లకు సంబంధించి 36 పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా టెండర్లు నిర్వహించాలని ఆదేశించింది. ఫిబ్రవరిలో టెండర్ల తేదీని కూడా ఖరారు చేశారు. పనులను చేపట్టేందుకు సీడీఆర్ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్లను దక్కించుకుంది. పనులను ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో పనులను ప్రారంభించలేదు. ఇటీవల నగర పంచాయతీకి కొత్త పాలక వర్గం ఏర్పడింది. రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నగర పంచాయతీకి సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసి తిరిగి చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పి.బాబూమోహన్ మున్సిపల్ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వెంటనే రూ.2.63 కోట్ల పనులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ప్రస్తుతం నగర పంచాయతీ ఖాతాలో ఉన్నాయి. నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయమై కొత్త పాలకవర్గం సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కో వార్డులో రూ.8, 9 లక్షల చొప్పున కేటాయించి పనులు చేపట్టాలని చెర్మైన్‌తో పాటు వార్డు కౌన్సిలర్లు అనధికార సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ కావడం..నగర పంచాయతీ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో నిధుల వినియోగ విషయంలో స్పష్టత రావడంలేదు. గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ద్వారానే పనులు చేపట్టేలా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు నగర పంచాయతీ పాలకవర్గం భావిస్తున్నట్లు తెలిసింది. -
ఒకే రోజు మూడు పరీక్షలా!
జోగిపేట, న్యూస్‌లైన్: ఒకే రోజు మూడు ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్ష నిర్వహిస్తూ అధికారులు నిరుద్యోగుల ఆశలకు గండి కొట్టారు. దీంతో నిరుద్యోగులు రెండు ఉద్యోగ అర్హత పరీక్షలకు గైర్హాజరు కాక తప్పడంలేదు. మూడింటిలో ఏదో ఒక దానికే హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం సంబంధిత అధికారులకు విన్నవించినా వారు స్పందించకపోవడంతో నిరుద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జూనియర్ ఇంజినీర్, పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ నెల 25 పరీక్ష జరుగనుంది. అదే అటవీ శాఖ ఆధ్వర్యంలో సెక్షన్ ఆఫీసర్ల ఉద్యోగానికి కూడా అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ మూడు ఉద్యోగాలకు ఇంచుమించుగా డిగ్రీ, ఇంజినీరింగ్, సైన్స్ గ్రూపు విద్యార్థులు అర్హులు. అటవీ శాఖ పరీక్షను వాయిదా వేయాలని అధికారులను కోరినా వారు పట్టించుకోలేదు. పోస్టల్ అసిస్టెంట్ పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. 25వ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగం.. అటవీ శాఖలో సెక్షన్ అధికారి ఉద్యోగానికి బీఎస్సీ సైన్స్ గ్రూపు, ఇంజినీరింగ్‌లో మెకానికల్, సివిల్, కెమికల్ డిగ్రీ చదివిన వారు అర్హులు. ఈ ఉద్యోగానికి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగం.. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగానికి ఇంజినీరింగ్ చదివిన వారు అర్హులు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నష్టపోనున్న నిరుద్యోగులు పోస్టల్ ఉద్యోగానికి ఏదేని డిగ్రీ చదివిన వారు అర్హులు. అదేవిధంగా ఇంజనీరింగ్, అటవీ శాఖ ఉద్యోగానికి ఇంజనీరింగ్, బీఎస్సీ చదివిన వారు అర్హులు. మూడింటిలో ప్రతి రెండు ఉద్యోగాలకు ఇంజినీరింగ్‌తో పాటు ఏదేని డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. దాదాపుగా మూడు ఉద్యోగాలకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకుంటారు. కేంద్ర ప్రభుత్వం ముందుగానే తేదీలను ప్రకటించింది. అటవీశాఖ ముందుగా నిర్ణయించిన తేదీలను వాయిదా వేసి ఈనెల 25న పరీక్ష నిర్వహిస్తోంది. దీంతో నిరుద్యోగులు జేఎన్టీయూ అధికారులను పరీక్ష వాయిదా వేయాలని వేడుకుంటున్నారు. అయినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో అభ్యర్థులు మూడింటిలో ఏదేని ఒక పరీక్షనే రాయాల్సి ఉంటుంది. మూడింటిలో ఏదో ఒకటి రాకపోతుందా అనే యోచనలో ఉన్న అభ్యర్థుల ఆశలు ఆవిరయ్యాయి. ఈ తేదీలను ముందు చూపుతో నిర్ణయించకపోవడం వల్ల అర్హులైన నిరుద్యోగులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. -
జోగిపేట నగర పంచాయతీ పీఠం దక్కేదెవరికో!
జోగిపేట,న్యూస్‌లైన్ : జోగిపేట నగర పంచాయతీ చైర్పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులను గెలుచుకోగా, టీఆర్ఎస్ 4, టీడీపీ 2, బీజేపీ ఒక అభ్యర్థి గెలుపొందారు. చైర్పర్సన్ రేసులో మాత్రం ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కవిత సురేందర్ గౌడ్, శోభా నారాయణ గౌడ్, ప్రవీణ రామాగౌడ్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ధైర్యంగా తనకు చైర్పర్సన్ పదవి కావాలంటూ అడగలేకపోతున్నారు. మొదటినుంచి కవిత సురేందర్ గౌడ్ చైర్పర్సన్ తానే నంటూ ప్రచారం చేసుకున్నా, పార్టీలో తానే సీనియర్‌నని తనకే అవకాశం ఇవ్వాలని డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్.నారాయణ గౌడ్ తన భార్య కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీపీ రామాగౌడ్ కూడా చైర్పర్సన్ పదవిని ఆశించి తన భార్యను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. ఆయన కూడా తన సన్నిహితులతో ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న శోభ, ప్రవీణ తోటికోడళ్లు కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేట నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువ రావడంతో దామోదర రాజనర్సింహ స్థానిక నాయకులపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నాయకుల అసమర్థత కారణంగానే స్థానికంగా పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత మున్సిపల్ ఎన్నికల నూతన పాలకవర్గాల ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. ఈ ముగ్గురితో పాటు పట్టణానికి చెందిన మరో మహిళ అభ్యర్థి కూడా చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్నారు. దామోదర మదిలో ఎవరో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయాన్ని ఊహించడం కష్టమని చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎవరిని చైర్‌పర్సన్‌గా ఎన్నిక చేస్తే బాగుంటుందనే విషయంపై ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చైర్పర్సన్ అభ్యర్థి పేరును ఎప్పటిలాగే సీల్డ్ కవర్లో పంపుతారా? లేక ముందుగానే ప్రకటిస్తారో తెలియడంలేదు. ఏది ఏమైనప్పటికీ దామోదర నిర్ణయించిన అభ్యర్థే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రయత్నాలు జోగిపేట పట్టణంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థి చైర్పర్సన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చైర్పర్సన్ ఎన్నికకు సరిపోను వార్డు సభ్యులు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల వార్డు సభ్యులు ఎంత వరకు సహకరిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. -
దామోదరను దెబ్బతీసిన అందోల్, పుల్కల్
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ ఓటమిని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్ మండలాలే దోహదపడ్డాయి. 12వ రౌండ్ వరకు రేగోడ్, అల్లాదుర్గం, రాయికోడ్ మండలాల ఓట్లతో లీడ్ల్ ఉన్న రాజనర్సింహకు 13వ రౌండ్ నుంచి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఈ రౌండ్ నుంచి అందోల్, పుల్కల్, టేక్మాల్, మునిపల్లి మండల ఓట్లు వచ్చాయి. అందోల్‌లో 3747 ఓట్లు, పుల్కల్ మండలంలో 2750 ఓట్లు మొత్తం 6497 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. మునిపల్లి, టేక్మాల్ మండలాల్లో కాంగ్రెస్‌కు స్పల్ప మెజార్టీ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండడంతో చివరి రౌండ్లో 3208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జోగిపేట నగర పంచాయతీలోనే టీఆర్ఎస్కు 2410 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఓట్లే రాజనర్సింహ విజయాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అల్లాదుర్గం, రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో కనీసం 20వ వేల ఓట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ భావించింది. అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. గత ఎన్నికల్లో అందోల్, పుల్కల్ మండలాల్లో బాబూమోహన్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు మండలాల్లోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగా రావడంపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మునిపల్లి, టేక్మాల్, పుల్కల్, రాయికోడ్ మండలాల్లో స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్కు కూడా అల్లాదుర్గంలో జెడ్పీటీసీ సభ్యుడికి వచ్చిన మెజార్టీ రాలేదని సమాచారం. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వగ్రామాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థికి తక్కువగా ఓట్లు వచ్చాయి. -
జోగిపేట నగర పంచాయతీకి తొలి మహిళా చైర్మన్ ఎవరో!
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేట నగర పంచాయతీకి మొదటి సారి జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు మొట్ట మొదటి చైర్మన్ (మహిళ) అవుతారో సోమవారం చేపట్టనున్న ఓట్ల లెక్కింపులో తేలనుంది. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ పదవిని బీసీ మహిళకు రిజర్వు చేశారు. దీంతో 20 వార్డులకు గాను 107 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 40 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. వీరిలో 1,4,5,8,9.10,13,14,16,19 వార్డులను మహిళలకు కేటాయించారు. అయితే జనరల్ స్థానాల్లో కూడా మహిళలను పోటీలోకి దింపారు. ఈ ఎన్నికల్లో మొత్తం 16,047 ఓట్లకుగాను 13,031 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 6556 మంది పురుషులు, 6475 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా మొత్తం 81.21 శాతం ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున 20, టీఆర్ఎస్ తరఫున 19, టీడీపీ తరఫున 17 మంది, సీపీఎం తరఫున ఒకరు, బీజేపీ తరఫున ఐదుగురు పోటీలో ఉన్నారు. 50 శాతానికి పైగా అభ్యర్థులు యువకులే ఉండడం విశేషం. ైచె ర్మన్ పదవికి టీఆర్ఎస్, కాంగ్రెస్‌లో పోటీ ఉన్నాయి. ఇరు పార్టీలు కూడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలు మారిన అభ్యర్థులు నగర పంచాయతీ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికలకు వచ్చే సరికి పార్టీలు మారి పోయారు. ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది. చైర్మన్ ఎన్నికలో వారు ఎవరికి సహకరిస్తారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. టీడీపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ తరఫున పోటీ చేసిన వారు కాంగ్రెస్, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఒకరిద్దరు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇందులో మరి కొందరు బహిరంగంగా తాము పోటీ చేసిన పార్టీకి కాకుండా వేరే పార్టీకి మద్దతు తెలిపారు. చైర్మన్ రేసులో.. జోగిపేట నగర పంచాయతీ చైర్మన్ రేసులో కాంగ్రెస్ తరఫున సురేందర్‌గౌడ్, హెచ్.నారాయణ గౌడ్, హెచ్.రామాగౌడ్, డాకూరి జోగినాథ్ సతీమణులు, టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన పట్లూరి రజని శివప్రకాశ్ చైర్మన్ పదవి రేసులో ఉన్నారు. మాజీ వార్డు సభ్యుడు ప్రవీణ్‌కుమార్ కూడా చైర్మన్ పదవిని ఆశిస్తూ టీడీపీ తరఫున భార్యతో పాటు ఆయన కూడా 10,11 వార్డుల్లో పోటీ చేశారు. అయితే ఆయన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతుఇచ్చారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సి ఉంది. నేడు సంగారెడ్డిలో ఓట్ల లెక్కింపు జోగిపేట నగర పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సంగారెడ్డిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలోని మొదటి అంతస్తులో ఎన్నికల లెక్కింపును నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయం 7 గంటల వరకు కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఏజెంట్ పాస్‌లను ఇది వరకే అభ్యర్థులకు జారీ చేసినట్లు కమిషనర్ జి.విజయలక్ష్మి తెలిపారు. -
రైతు చైతన్య యాత్రలేవీ?
జోగిపేట, న్యూస్‌లైన్: ఈ ఏడాది రబీ పంట కాలం దాదాపు ముగిసింది. ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయశాఖ చేపట్టాల్సిన రైతు చైతన్య యాత్రలు ఇప్పటి వరకూ ప్రారంభం కాలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఖరీఫ్ సీజన్‌కు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలను ముందుగా గుర్తించాల్సిన యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే వి మర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నమొన్నటి వ రకు ఎన్నికల్లో నిమగ్నమైన యంత్రాంగం శాఖాపరమైన కార్యక్రమాలను పక్కన బెట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేది అనుమానమేనని సం బంధిత అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ముం దు రైతు చైతన్య యాత్రలు నిర్వహించాలని ఉ న్నతాధికారుల నుంచి ఆయా డివిజన్ మ ండల అధికారులకు సమాచారం వచ్చింది. అయితే ఈలోగా ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. అధికారులకు అందని ఆదేశాలు వ్యవసాయ అనుబంధ శాఖలపై రైతులకు అవగాహన కల్పించి సమాయత్తం చేయడానికి జి ల్లా యంత్రాంగం ఏటా ఏప్రిల్ చివరి వారం ను ంచి మే మొదటి వారం వరకు రైతు చైతన్య యా త్రలు నిర్వహిస్తూ వచ్చేది. ఖరీఫ్‌లో సూచనలకు గాను క్షేత్ర స్థాయిలో గ్రామాలకు వెళ్లి అన్నదాతలకు అవసరమైన అంశాలపై అవగాహన కల్పిం చి వారిలో చైతన్యం తీసుకురావాలన్నది ఈ యాత్రల ఉద్దేశం. గత ఏడాది విత్తనాలు, ఎరువుల కోసం రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రో జుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు, తొక్కిసలాటలు జరిగిన సందర్భాలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి వరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు ఇప్పటికీ ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రైతు చైతన్య యా త్రల నిర్వహణపై అనుమానాలు తలెత్తుతున్నా యి. గత సంవత్సరం ఏప్రిల్ 22 నుంచి మే 9 వరకు రైతు చైతన్య యాత్రలను నిర్వహించారు. యాత్రల ఉద్దేశo రైతు చైతన్య యాత్రల్లో భాగంగా వ్యవసాయ శాఖ ద్వారా అనుబంధ శాఖల్లో అమలు చే స్తున్న కార్యక్రమాలు, భూసార పరీక్షలు, శ్రీవరి సాగు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందు లు కొనుగోలులో జాగ్రత్తలు, విత్తన శుద్ధి తది తర కార్యక్రమాలపై రైతులను చైతన్య పరచాల్సి ఉంటుంది. పశుసంవర్థక శాఖ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, మత్య్స, సాగునీటి, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మార్కెటింగ్, ట్రాన్స్‌కో, బ్యాంకు లు, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు రైతు చైతన్య యాత్రల్లో పాల్గొని అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాలను వివరిస్తారు. ఆయా శాఖల అధికారులు వివిధ అంశాలపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా రైతులను పంటల సాగు గురించి చైతన్య పరుస్తారు. పంట రుణాలు, ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఇస్తున్న రాయితీ ఎరువులు, విత్తనాలపై అవగాహన కల్పిస్తారు. రైతులు వ్యవసాయ శాఖ ద్వారా అధునాతన పరిజ్ఞానం అందించే పొలంబడి, విత్తనోత్పత్తి, వర్మీకంపోస్టు, భూసార పరీక్షల గురించి వివరిస్తారు. దీంతో రైతులు ఆధునిక మెలకువలు నేర్చుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. -
e-పంచాయతీలు
ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు గ్రామపంచాయతీలను ఈ- పంచాయతీలుగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తద్వారా గ్రామపంచాయతీ ద్వారా అందే అన్ని సేవలు ఆన్లైన్ ద్వారా అందనున్నాయి. పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం జిల్లాలో 474 క్లస్టర్లకు కంప్యూటర్లు మంజూరుచేసింది. - పంచాయతీల కంప్యూటరీకరణ క్లస్టర్లకు కంప్యూటర్లు - రెండు కంప్యూటర్లకు ఒక ఆపరేటర్ - 15 రోజుల్లో ప్రజల్లోకి ఆన్లైన్ సేవలు జోగిపేట, న్యూస్‌లైన్: కాలం మారుతోంది. పాలనలో సంస్కరణలు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా గ్రామపంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. ఇక సేవలన్నీ ఆన్‌లైన్‌గా అందనున్నాయి. గ్రామాల్లో పాలనను మెరుగు పర్చేందుకు ఈ పంచాయతీ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. జిల్లాలో 514 క్లస్టర్లకు 474 క్లస్టర్లకు ఇప్పటి వరకు కంప్యూటర్లను ఏర్పాటు చేసినట్లు అధికార వర్గాల సమాచారం. మండలంలో డాకూర్, అన్నాసాగర్, చింతకుంట, అక్సాన్‌పల్లి, అల్మాయిపేట, కొడెకల్, కన్సాన్పల్లి, రాంసానిపల్లి, నేరడిగుంట, పోతిరెడ్డిపల్లి క్లస్టర్లకు కంప్యూటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా గ్రామ పంచాయతీల్లో చేపట్టే ప్రతి పనిని ఆన్లైన్లో పొందుపర్చి ప్రజలకు అందుబాటులో ఉంటాయి. మంజూరైన కంప్యూటర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అమర్చే పనులను కర్వే టెక్నికల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్టుకు ప్రభుత్వం అప్పగించింది. గ్రామ పంచాయతీల్లో సిస్టమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో 15 రోజుల్లో సేవలు అందుబాటులోకి రానున్నాయి. రెండు క్లస్టర్లకు కలిపి ఒక్కరిని ఆపరేటర్‌గా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రయోజనాలు - గ్రామ పంచాయితీలను ఈ పంచాయతీలుగా మార్చడం వల్ల పాలనకు పారదర్శకత చేకూరుతుంది. - పంచాయితీ కార్యాలయం నుంచి చేపట్టే ప్రతి పనిని కంప్యూటర్లో పొందుపరచి ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. - జనన మరణ ధ్రువీకరణ పత్రాలు చేతి రాతతో కాకుండా కంప్యూటర్ ద్వారా జారీ చేస్తారు. - గ్రామ పంచాయతీ నుంచి జారీ చేసే ప్రతీ సర్టిఫికెట్ వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. - గ్రామ పంచాయతీ వచ్చే ఆదాయ, వ్యయాలు సైతం ఆన్లైన్లోనే ఉంచుతారు. - గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థిర, చర ఆస్తుల వివరాలు కూడా ఆన్లైన్లోనే ఉంచుతారు. -
10 లక్షల ఎకరాలకు సాగు నీరు
నారాయణఖేడ్/జహీరాబాద్/జోగిపేట, న్యూస్‌లైన్: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో 10 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జహీరాబాద్, నారాయణఖేడ్, జోగిపేటలలో జరిగినబహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. నారాయణఖేడ్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖేడ్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. సింగూరు ప్రాజెక్టు నీరు కాల్వల ద్వారా వ్యవసాయ భూములకు అందాల్సి ఉందన్నారు. నల్లవాగు డైవర్షన్‌తో మరో ఐదు వేల ఎకరాలకు సాగు నీటిని అందించవచ్చన్నారు. ఖేడ్ నియోజకవర్గంలో ఫ్యాక్షనిజం మాయం కావాలన్నారు. రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారు. రైతులు వ్యవసాయం కోసం వాడుకునే యంత్రాలకు రవాణా పన్ను రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఇక పని లేదన్నారు. ఈసారి ఖేడ్‌లో టీఆర్ఎస్ జెండాను ఎగురవేయాలని కోరారు. జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బీబీ పాటిల్, ఖేడ్ అసెంబ్లీ అభ్యర్థి ఎం.భూపాల్‌రెడ్డిలను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జహీరాబాద్‌లో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. సింగూరు, నారింజ ప్రాజెక్టుల నీటిని జహీరాబాద్ ప్రాంత వ్యవసాయ రంగానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. జహీరాబాద్‌కు పక్కనే ఉన్న సింగూరుతో పాటు సాగుకు ఏ మాత్రం ఉపయోగపడకుండా ఉన్న నారింజ ప్రాజెక్టు నీటిని, స్థానికంగా ఉన్న బడంపేట, ఏడాకులపల్లి, జీర్లపల్లి ప్రాంతాల్లోని చిన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా నియోజకవర్గంలో లక్ష ఎకరాల వ్యవసాయ భూమిని సాగులోకి తీసుకురావచ్చన్నారు. దీంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమవుతుందన్నారు. జహీ రాబాద్ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఎండీ ఫరీదుద్దీన్‌కు కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసిందని, పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యతనివ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడి తమ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతం బాగా వెనుకబడి ఉందన్నారు. దీనిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జహీరాబాద్ నియోజకవర్గంలో 5వేల ఇళ్లను పేదలకు కట్టించి ఇస్తామన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి భీంరావు బసంత్‌రావు పాటిల్, అసెంబ్లీ స్థానం నుంచి కె.మాణిక్రావులను కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు. జోగిపేటలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని అన్నారు. జోగిపేట ప్రజలు కూడా బస్సు మిస్సు కావద్దని, అధికార పార్టీలో ఉంటేనే లాభపడతామని, లేకుంటే నష్టపోతామని అన్నారు. మన తలరాత మనమే రాసుకుందామని సూచించారు. జోగిపేటను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. తాను మొదట్లో బాబూమోహన్‌ను అందోల్ నియోజకవర్గంలో పోటీ చేయించినప్పుడు. ఇక్కడేమి గెలుస్తారంటూ చాలా మంది వెటకారం చేశారని, అయినా అందరం కలిసి గెలిపించుకుని రూ.100 కోట్ల అభివృద్ధి చేశామన్నారు. రైతులకు రుణ మాఫీ, పక్కాఇళ్ల నిర్మాణం వంటి పథకాలను పకడ్బంధీగా అమలు చేస్తామన్నారు. అందోల్ అసెంబ్లీ అభ్యర్థి పి.బాబూమోహన్, ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ను కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలని కోరారు. దామోదర ఊసెత్తని కేసీఆర్ మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ ప్రతిరోజూ ప్రచారంలో కేసీఆర్‌పై దుమ్మెత్తి పోస్తున్నా.. కేసీఆర్ మాత్రం పల్లెత్తుమాట అనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏ పార్టీని కానీ, అభ్యర్థులను కానీ విమర్శించకుండా తన ప్రసంగాన్ని ముగించారు. -
అందోల్ టీఆర్ఎస్లో అయోమయం
జోగిపేట, న్యూస్‌లైన్: ఎన్నికలు దగ్గర పడుతున్నా అందోల్ టీఆర్ఎస్లో మాత్రం విభేదాలు కొలిక్కి రావడం లేదు. తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్లోకి చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి బాబూమోహన్ ఒక వర్గం వారినే ప్రోత్సహిస్తున్నారని చాలాకాలంగా పార్టీ జెండాలు మోస్తున్న వారిని పట్టించుకోవడంలేదని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అందోల్ నియోజకవర్గానికి సంబంధించిన పంచాయతీపై కేసీఆర్, హరీష్‌రావుకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ నాయకుడు స్వయంగా వచ్చి ఇరువురితో చర్చలు జరిపినా అదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని అందోల్, పుల్కల్, అల్లాదుర్గం మండలాలకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ఇటీవల జోగిపేటలో సమావేశం నిర్వహించి బాబూమోహన్, మాజీ ఎంపీ మాణిక్రెడ్డిలను ఆహ్వనించారు. సమావేశంలో పార్టీలో మొదటి నుంచి ఉంటున్న నాయకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బాబూమోహన్ తాను టీడీపీ నుంచి ప్రత్యేకమైన పరిస్థితుల్లో టీఆర్ఎస్లో చేరానని, తనతోపాటే మిగతా టీడీపీ కార్యకర్తలంతా వచ్చారని, ఇంకా టీడీపీ ఎక్కడుందని, మనమంతా ఒక్క తల్లిబిడ్డలమేనంటూ కలుపుగోలుగా మాట్లాడారు. దీంతో విభేదాలు తొలగిపోయాయని అందరూ భావించారు. అయితే రెండు రోజుల క్రితం జోగిపేటకు వచ్చిన జహీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌తో కొంత మంది పాత టీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. సమస్యలు తొలగేదాకా జోగిపేటలో ప్రచారం చేపట్టవద్దని ఒక వర్గం బాబూమోహన్ వర్గీయులకు అల్టిమేటం ఇచ్చినట్లు తెలిసింది. 5 రోజుల క్రితం అందోల్ టీఆర్ఎస్కు చెందిన యువకులు గ్రామాల్లో ద్విచక్ర వాహనాల ర్యాలీని నిర్వహించి జోగిపేట మీదుగా వెళ్లారు. దీంతో పట్టణానికి చెందిన యువజన విభాగం టీఆర్ఎస్ నాయకులు తమకు చెప్పకుండా ఎలా ర్యాలీ నిర్వహిస్తారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఎన్నికల ప్రచారానికి ఇంకా కేవలం 5 రోజులే ఉన్నా పట్టణంలో ఊపు కనిపించడంలేదు. స్థానికంగా టీఆర్ఎస్ నాయకులు మాత్రమే పట్టణంలో ప్రచారం నిర్వహిస్తూ కనిపించారు. -
అందోల్ నుంచే పోటీ
జోగిపేట, న్యూస్‌లైన్: రెండు, మూడు మాసాలుగా కొనసాగుతున్న ప్రతిష్టంబ నకు తెరపడింది. కేసీఆర్‌కు సన్నిహితుడైన బాబూమోహన్ బుధవారం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో టీఆర్ఎస్ తరఫున అందోల్ సీటు ఆయనకేనంటూ ప్రచారం హోరెత్తుతోంది. మరోవైపు టీఆర్ఎస్ అధినేత కూడా అందోలు సీటు బాబూమోహన్‌కే ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న విడుదల చేయనున్న తొలివిడత అభ్యర్థుల జాబితాలోనే బాబూమోహన్ పేరు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగానే జోగిపేటలో నిర్వహించిన తెలంగాణ విజయోత్సవ సభలో కేసీఆర్ జోగిపేట అభ్యర్థిని ప్రకటించలేదని తెలుస్తోంది. తొలుత విజయోత్సవ సభలోనే గులాబీకండువా కప్పుకునేందుకు బాబూమోహన్ ఉత్సాహం చూపారనీ, అయితే స్థానికంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కేసీఆర్ అందుకు ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందువల్లే బాబూమోహన్ బుధవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ భవన్లో పార్టీలో చేరారని సమాచారం. -
1న జోగిపేటలో తెలంగాణ విజయోత్సవ సభ
జోగిపేట, న్యూస్‌లైన్: జోగిపేటలో ఏప్రిల్ 1న నిర్వహించే సభకు తెలంగాణ విజయోత్సవ సభగా నామకరణం చేసినట్లు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్.సత్యనారాయణ ప్రకటించారు. శనివారం అందోల్ మండలం డాకూర్‌లో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 1న జోగిపేటలో లక్షమందితో 15 ఎకరాల స్థలంలో సభ నిర్వహించబోతున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న ఈ సభకు ఎంతో ప్రాధాన్యత ఉందని, జిల్లాలో ఇప్పటి వరకు ఎక్కడా నిర్వహించని రీతిలో చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా ఈ సభ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సభకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరీష్‌రావు తదితరులు హజరుకానున్నారని తెలిపారు. కళా బృందాలతో ధూంధాం సాయిచంద్ కళాబృందంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సత్యనారాయణ తెలిపారు. ప్రముఖ కవి దేశపతి శ్రీనివాస్‌లతో పాటు ముఖ్య కళాకారులు హాజరు కానున్నారని, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. సభకు వచ్చే కార్యకర్తలు, అభిమానుల కోసం ప్రత్యేకంగా మాసానిపల్లి చౌరస్తాలో పులిహోర పాకెట్లు, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నట్లు సత్యనారాయణ వివరించారు. 5 లక్షల వాటర్ ప్యాకెట్లు, 80 క్వింటాళ్ల పులిహోరను సిద్ధం చేయిస్తున్నట్లు తెలిపారు. జోగిపేట నుంచే దిశానిర్దేశం ఈ సభ నుంచి భవిష్యత్తులో జిల్లా ఎ లా ఉండాలో కేసీఆర్ దిశా నిర్దేశం చే యనున్నారని ఆర్ . సత్య నారా య ణ తెలిపారు. సభకు పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చి విజయవంతం చేయాలని కో రారు. జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి బీబీ పాటిల్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, జిల్లా టీఆర్ఎస్ నాయకుడు సినీ నిర్మాత శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీగా పోటీ చేయాలని ఉంది: బాబూ మోహన్
వచ్చే ఎన్నికలలో లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ప్రముఖ నటుడు,మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్‌ను బాబు మోహన్ కలిశారు. అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ... కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. తనను గతంలో ఎమ్మెల్యేగా చేసింది కేసీఆరే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే నెల మొదటి వారంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నది వెల్లడించేందుకు బాబూ మోహన్ నిరాకరించారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మంత్రి బాబూ మోహన్ ఈ నెల 23న ప్రకటించిన విషయం విదితమే. ఆందోల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలను ఇవ్వకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాబూ మోహన్ గతంలో వివరించిన సంగతి తెలిసిందే. -
టీడీపీకి బాబూమోహన్ రాజీనామా
బీ-ఫారాలు ఇవ్వలేదని మనస్తాపం జోగిపేట, న్యూస్‌లైన్: టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మంత్రి పి.బాబూమోహన్ ప్రకటించారు. మెదక్ జిల్లా ఆందోల్‌లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆందోల్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలను ఇవ్వకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా, రాజీనామా ప్రకటించిన తర్వాత బాబూమోహన్ క న్నీటి పర్యంతమయ్యారు. -
బాబూమోహన్ ఇంటింటా ప్రచారం
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ఇంటింటా ప్రచారం చేశారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీల్లో తిరుగుతూ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక 5, 6, 7, 8, 9 వార్డుల్లోని ప్రజలను కలసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు, తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేయాలని బాబూమోహన్ అభ్యర్థించారు. కార్యక్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులు సావిత్రి, జంగం మహేష్, సదాశివుడు, ఫర్హానా బేగం, భవానీ, టీడీపీ నాయకులు డీ వీరభద్రారావు, దుర్వాసులు, రత్నం గౌడ్, మాణిక్యం గౌడ్, టీడీపీ టేక్మాల్ మండల అధ్యక్షుడు యూసూఫ్, నాయకులు గోపాల్, భూమమ్మ పాల్గొన్నారు. -
అందోల్‌లో ఏం జరుగుతోంది?
జోగిపేట, న్యూస్‌లైన్: ‘‘అసలు అందోల్ ఏం జరుగుతోంది...ఎందుకని పార్టీ తరఫున స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు ఎవరూ రావడం లేదు..ఇంతకీ అందోల్‌లో మనం ఉన్నామా...ఉన్నామని భ్రమపడుతున్నామా’’ టీడీపీ నేతలకు వచ్చిన అనుమానమిది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇంతకీ ఏం జరుగుతుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే తముళ్లు మాత్రం ‘‘మా తప్పేమీ లేదు..అంతా మీరే చేశారు’’ అంటూ నేతల మొహంమీదే చెప్పేస్తున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి పి.బాబూమోహన్ వల్లే పార్టీ పరిస్థితి ఇలా తయారైందని విన్నవిస్తున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు తెలపగా, ఆయన బాబూమోహన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సపాన్‌దేవ్ సమీక్ష అందోల్ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసేందుకు పార్టీ అధిష్టానం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సపాన్దేవ్ను ఆదేశించింది. దీంతో శనివారం ఆయన నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు ముఖ్యులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. అందోల్, పుల్కల్ మండలాల అధ్యక్షులు మినహా అన్ని మండలాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని బాబూమోహన్‌పై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు టీడీపీ జిల్లా ఇన్చార్జిగా ఉన్న మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావుసైతం పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులకు ఫోన్‌చేసి మరీ ఆదివారం పార్టీ మీకే ‘బీ’ ఫారం ఇస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే అందోలు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలపై ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో సమీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందోల్ ముఖ్యనేతలతోపాటు జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి మదన్మోహన్కు సైతం పార్టీ అగ్రనేతలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..బాబూమోహన్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్నది తేలనుంది. -
సింగూరు ఎత్తిపోతలలో మరో మాయ!
జోగిపేట, న్యూస్‌లైన్: ‘సింగూరు ఎత్తిపోతల’పై మరో మాయ జరుగుతోంది. కాల్వల తవ్వకాలు, నిర్మాణంలో మాస్టర్ ప్లాన్‌ను పక్కన పెట్టి పాత కాల్వల గుండా, పంట పొలాల మీద నుంచి అడ్డుగోలుగా నీళ్లు పారిస్తున్నారు. నీళ్లును ఆందోల్ పెద్ద చెరువుకు తరలించాలనే ఏకైక లక్ష్యంతో అధికారులు, కాంట్రాక్టర్లు తాత్కాలిక కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు పారించే కార్యక్రమాన్ని ‘మమ’ అనిపించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వారం రోజుల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన సింగూరు జలాల ట్రయల్న్ ్రవికటించి పంట పొలాల మీదకు నీళ్లు మళ్లిన విషయం తెలిసిందే. మూడు గేట్లను అడుగు లోతుకు లేపి నీళ్లు వదలటంతో ఆ వేగానికి తట్టుకోలేక అసంపూర్తిగా కట్టిన కాల్వలు ఎక్కడికక్కడా తెగిపోయాయి. పాలకుల ఆతృతను రైతులు, ప్రతిపక్షాలు విమర్శించారు. పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అటు పాలకులు, ఇటు అధికారులు, కాంట్రాక్టర్లు మూడు రోజులుగా కాల్వల వెంట తిరిగి వాటి నాణ్యత పరిశీలించారు. కాల్వ గుండా నీళ్లు పారించడం సాధ్యం కాదని నిర్ధారించుకున్న తరువాత ప్రాజెక్టు కాల్వ మాస్టర్ ప్లాన్‌ను పక్కన పడేశారు. డాకూర్, మాసానిపల్లి గ్రామాల మధ్యన ఉన్న కట్టుకాలువను తవ్వేశారు. ఇవి నిజాం కాలం నాటి కట్టు కాల్వలు. రైతుల పొలాల్లోంచి మట్టి తోడి గట్టుపోసి తాత్కాలికంగా కొత్త కాల్వలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి నీటి వేగాన్ని పూర్తిగా తగ్గించి కొద్దికొద్దిగా కాల్వలకు నీళ్లు వదిలారు. ఈ ప్రయత్నం కూడా వికటించింది. ఆందోల్ చెరువకు వెళ్లాల్సిన నీళ్లు డాకూర్ చెరువులోకి వెళ్లాయి. ఓ రాత్రంతా నీళ్లు చెరువులోకి పారాయి. నిజాం కాలం నాటి కట్టుకాల్వను తవ్వేయడాన్ని మాసానిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికాారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో భయపడిన నీటిపారుదల శాఖ అధికారులు అఘమేఘాల మీద డాకూరు చెరువుకు వెళ్లే కాల్వను మూసి వేశారు. చెరవు నిండగానే తవ్విన కాలువను పూడ్చివేస్తామనే షరతు మీద తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వేసి దాని ద్వారా మాసానిపల్లికి చెందిన కాల్వల మీదుగా అందోల్ చెరువులోకి నీరును పారించారు. వాస్తవానికి 3 రోజుల్లోనే ఆందోల్ చెరువు నిండి అలుగు పోస్తుందని వేదిక మీద నుంచి డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆందోల్ మండలంలో మూడు చెరువులు, పొల్కల్ మండలంలో 5 చెరువు నింపుతామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం గేట్లను కొద్దిగా మాత్రమే తెరిచి పోట్టారు. తాత్వాలికంగా కట్టిన కాల్వలకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా నీటి ప్రవాహం సాగేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న ప్రవాహ వేగాన్ని పట్టి చూస్తే పెద్ద చెరువు నిండటానికి కనీసం 10 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. మిగిలిన చెరువులు ఎప్పడు నింపుతారో..! ఇంకెన్ని తిప్పలు పెడతారో అధికారులకే తెలియాలి. -
సాకారం కాబోతోన్న స్వప్నం
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సింగూరు జలాలను సాగుకు అందించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ‘సింగూరు’ ట్ర యల్న్న్రు డిప్యూటీ సీఎం ప్రారంభించనుండడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు సాగునీటికి ఇబ్బందులుండవనీ, సింగూరు జలాలలో ప్రాంతం సస్యశ్యామలం అవడం ఖాయమంటున్నారు. పోరాటాలతో దక్కిన ‘సింగూరు’ సింగూరు జలాలను సాగుకు మళ్లించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. మాజీ మంత్రి సి.రాజనర్సింహ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిరాహారదీక్షలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింగూరుపై ఎత్తిపోతల పథకాలను చేపడతామని హమీలిచ్చి నిర్లక్ష్యం చేసింది. అయితే 2003 సంవత్సరంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ నాయకత్వంలో రైతులు జోగిపేటలోని తహశీల్దారు కార్యాలయం ఎదుట 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేద్యానికి సింగూరు జలాలందిస్తామని వైఎస్ హమీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2005 సంవత్సరంలోనే సింగూరు జలాలను 40 వేల ఎకరాలకు అందించేందుకు గాను రూ. 89.98 కోట్ల నిధులు మంజూరు చేసింది. సింగూరు కాలువ పనులను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సింగూరులోనే ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల కాల్వల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఖరీఫ్ సీజన్లో అందోల్ పెద్ద చెరువులోకి నీరును అందించాలన్న పట్టుదలతో డిప్యూటీ సీఎం పనులను వేగవంతం చేయించారు. సింగూరు ఎడమ కాల్వ ద్వారా ఇటిక్యాల, డాకూర్, మాసానిపల్లి శివార్లలోని కాల్వల ద్వారా నీటిని అందోల్ పెద్ద చెరువులోకి తరలించే కార్యక్రమంలో భా గంగా ఈనెల 13న సింగూరు ప్రాజెక్టు వద్ద ట్రయల్న్ ్రకార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితోపాటు జిల్లా యంత్రాంగం, భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్నారు. రైతుల్లో ఆనందం అందోల్ చెరువులోకి సింగూరు నీరు వస్తుందని తెలుసుకున్న స్థానిక రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు వస్తే తమ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని వారంటున్నారు. సింగూరు నీటితో పుల్కల్, అందోల్ మండలాల్లోని పొలాలకు నీరందే అవకాశం ఉంది. -
కస్తూర్బాధలు!
జోగిపేట, న్యూస్‌లైన్: ఆర్థిక, ఇతరత్రా కారణాల వల్ల చదువు ఆపేసిన బాలికలను మళ్లీ బడిబాట పట్టించేందుకు గాను ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల ఆశయం నీరుగారుతోంది. పాఠశాలలను ఆర్భాటంగా ప్రారంభించినా ఇందులో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. చిత్తశుద్ధి కొరవడడంతో లక్ష్యం మరగున పడినట్టు కన్పిస్తోంది. జోగిపేట పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 115 మంది విద్యార్థినులు చదువుతున్నారు. ఇంత మంది విద్యార్థినుల కోసం ఒకే షెడ్డు ఉంది. అందులోనే ఫర్నిచర్, విద్యార్థినుల పెట్టెలు ఉండగా అక్కడే బోధనా తరగతులు, భోజనం, నిద్రించడానికి కూడా అదే షెడ్డు దిక్కు. వంట మాత్రం పక్కనేగల చిన్న గదిలో చేస్తుంటారు. ఇలా వారు అసౌకర్యాల మధ్య చదువులను సాగిస్తున్నారు. వర్షం వచ్చినా, ఎండ కొట్టినా అందులో ఉండలేని పరిస్థితి. ఇక్కడ సొంత భవనం లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. -
అర్ధరాత్రి వేళ మర్వెల్లిలో అగ్ని ప్రమాదం
జోగిపేట/అల్లాదుర్గం రూరల్: పెద్దాపూర్ గ్రామానికి చెందిన బుడిగజంగం పెంటయ్య ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం మర్వెల్లి గ్రామానికి వచ్చాడు. యాచక వృత్తితో పాటు, గ్రామంలో కథలు చెప్పి సంసారాన్ని లాగుతున్నాడు. సంగమేశ్వర్ అనే గ్రామ పెద్దమనిషి దానంగా ఇచ్చిన 60 గజాల స్థలంలో గుడిసె వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. గురువారం రాత్రి పెంటయ్య తన మామ పోచయ్యను తీసుకొని అదే గ్రామానికి చెందిన మల్లేశంగౌడ్ ఇంటి వద్ద కథ చెప్పేందుకు వెళ్లాడు. కథ మధ్యలో ఉండగానే ఊరు చివర నుంచి మంటలు ఎగసి పడుతుండటంతో తన గుడిసె మంటల్లో కాలిపోతుందనే ఆనుమానంతో పెంటయ్య గ్రాామస్థులతో కలిసి పరుగె త్తుకుంటూ వెళ్లి చూశారు. అప్పటికే గుడిసెను మంటలు చుట్టుముట్టాయి. ఆ మంటల్లో తన భార్య లక్ష్మి(35), అత్త చంద్రమ్మ(50), కూతరు పోచమ్మ(7), కుమారుడు(1) ఆహుతి అవుతుండడంతో నెత్తీనోరు బాదుకుంటూ గుడిసెలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మంటలు తీవ్రస్థాయిలో ఎగసి పడటంతో సాధ్యం కాలేదు. అప్పటికే చట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు బిందెలు, బకెట్లతో నీళ్లు తెచ్చి చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. గుడిసె పూర్తిగా కాలిపోయింది. దాంతో అందులో నిద్రిస్తున్న నలుగురు కూడా సజీవ దహనమైపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని ధైర్యం చేసినా మంటలు వెళ్లనీయలేదని ప్రత్యక్ష సాక్షులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రోజూ మా ఇళ్ల ముందు ఆడుకునే చిన్నారులు కళ్ల ముందే తగలబడిపోయారని వారు రోదిస్తూ తెలిపారు. మాంసం ముద్దలుగా శవాలు గుడిసెకు నిప్పంటుకోవడంతో గాఢనిద్రలో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు మంటల్లో కాలిపోయి మాంసం ముద్దలుగా మారారు. బిడ్డా ఏమైపోయారంటూ చిన్నారుల తండ్రి పెంటయ్య ఆర్తనాదాలు గ్రామస్తుల కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తమ పిల్లలను చూడండి ఎలా అయిపోయారో.. మాకు దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సంఘటన స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించించింది. సీఐ రాజేందర్ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. స్థలం కోసమే గుడిసె తగలబెట్టారు... ఇది ప్రమాదమా? లేక విద్రోహ చర్యా? అనే దానిపై పోలీసుల్లో సందిగ్ధత ఉంది. బాధితుడు పెంటయ్య మాత్రం తన గుడిసెను తగలబెట్టారనే చెప్తున్నాడు. అతని మాటల్లోనే... ‘నేను నివాసం ఉంటున్న స్థలంపై మంగళవారం ఇదే గ్రామానికి చెందిన మేతి ఆదాం అనే వ్యక్తితో వివాదం జరిగింది. గ్రామ పటేల్ సంగమేశ్వర్ వద్ద ఈ స్థలం కొన్నానని, కొంత అడ్వాన్సు కూడా ఇచ్చానని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని మేతి ఆదాం గొడవపడ్డాడు. ఇదే విషయాన్ని పటేల్ సంగమేశ్వర్ వద్దకు వెళ్లి చెప్పా... దాంతో ఆయన వచ్చి ఆదాంకు సంబంధించి ఇంటి స్థలాన్ని చూపించి రాళ్లను పాతించి, నేను నివాసం ఉంటున్న స్థలంలోనే నన్ను ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆదాం మళ్లీ వచ్చి స్థలం నాది వెళ్లిపోవాలని, లేనట్లయితే ఏం చేయాలో అది చేస్తానంటూ బెదిరించాడు. ఆదాం చెప్పినట్టుగానే నా గుడిసెను తగలబెట్టి ఉండవచ్చు’ అని పెంటయ్య పోలీసులకు, తహశీల్దారుకు వాంగ్మూలం ఇచ్చారు. విచారణ జరిపిస్తాం: డీఎస్పీ ఎస్.గోద్రూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే విషయమై సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ ఎస్. గోద్రూ తెలిపారు. శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను స్థానిక ఎస్ఐ నరేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ బి.సైదానాయక్ ఉన్నారు. కాగా మృతదేహాలకు జోగిపేట వైద్యాధికారి నందిత, సిబ్బంది సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. -
‘రాజనర్సింహా’ఎప్పటికయ్యేనో?
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన ‘రాజనర్సింహ ఎత్తిపోతల పథకం’ పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 2006లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణం, భూసేకరణలకు గాను ప్రభుత్వం రూ.89.98 కోట్లను మంజూరు చేసింది. అయితే నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం తప్పనిసరి అని భావించి 2009లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2010-11లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వంతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ప్రధాన కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించారు.అప్పటి నుంచి ప్రస్తుతం పనులు కొనసా..గుతునే ఉన్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని పలుసార్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదు. ఈ పథకానికి డిప్యూటీ సీఎం తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి రాజనర్సింహ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు నెలకొనడం వల్లే నిధుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పంప్‌హౌస్, కెనాల్, డెలివరీ స్లంప్, ఎలక్ట్రిక్, ప్యానెల్ గదులు, నిర్మాణాలకు సంబంధించి ఫినిషింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను రూ.12 కోట్లతో చేపడుతున్నారు. డిప్యూటీ సీఎంకు ప్రతిష్టాత్మకం సింగూరు జలాలను సేద్యానికి అందించే విషయంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ సాధ్యపడలేదు. ఇప్పటికే నీరందిస్తామని పలుసార్లు డిప్యూటీ సీఎం ప్రకటనలు చేశారు. అయినా అందించ లేకపోయారు. పనులను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు, కాంట్రాక్టర్లపై డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు గాను ప్రాజె క్టు నుంచి 2టీఎంసీల నీటిని సేద్యానికి అందించాల్సి ఉంది. అయితే ఈ నీటిని కాల్వల నిర్మాణం ద్వారా అందిస్తారు. పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం జరగలేదు. -
అమృతం కాదు.. విషం
జోగిపేట, న్యూస్‌లైన్: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేది నుంచి చిన్నారుల కోసం ‘బాలామృతం’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా చిన్నారులకు నెల రోజులు పాటు సరిపోయేలా అనుబంధ పౌష్టికాహరంతో కూడిన ప్యాకెట్‌ను ఒక్కొక్కరికి ఒక్క ప్యాకెట్ చొప్పున అందజేయాలి. ప్రతి రోజు 100 గ్రాముల చొప్పున 7-36 నెలల పిల్లలకు అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రాజెక్టు పరిధిలో 7 వేల మంది చిన్నారులను గుర్తించి రెండు, మూడు రోజుల క్రితం అంగన్వాడీ కేంద్రాలకు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే జోగిపేటకు చెందిన రెండు కేంద్రాల్లో శుక్ర, శనివారాల్లో ఈ ప్యాకెట్లను పంపిణీ చేయగా, అందులో నుంచి తెల్లటి పురుగులు బయటపడడంతో ప్యాకెట్లు తీసుకున్న వారు తిరిగి తీసుకువచ్చి అంగన్వాడీ కేంద్రాల్లో ఇచ్చేశారు. సర్కార్ పంపిణీ చేసిన ప్యాకెట్లోని పొడి తాగిన స్థానిన ఎస్సీ కాలనీలోని చిన్నారి వాంతులు చేసుకుంది. మరో కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త తన బిడ్డకు ఈ పొడిని కలిపి తాగించిన వెంటనే ఆ చిన్నారి వాంతులు చేసుకున్నట్లు సమాచారం. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం వారిని అనారోగ్యానికి గురి చేస్తుండడంతో వాటిని పిల్లలకు పంపిణీ చేసేందుకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడుతున్నారు. మరోవైపు ‘బాలామృతం’ ప్యాకెట్లలో పురుగులు వస్తున్న విషయం తెలుసుకున్న తల్లులు ఈ ప్యాకెట్లు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. -
పాలిటెక్నిక్ కళాశాలలోపుట్టెడు సమస్యలు
జోగిపేట, న్యూస్‌లైన్: స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో కనీస వసతులు కరువయ్యాయి. సొంత భవనం లేకపోవడంతో డిగ్రీ కళాశాల భవనంలో తాత్కాలిక పద్ధతిన కొనసాగుతోంది. గదులు, అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. టాయిలెట్స్ లేక విద్యార్థినులు అవస్థలు పడుతున్నారు. ల్యాబ్‌లు లేక ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇలా అనేక సమస్యలతో విద్యార్థులు విద్యాభ్యాసాన్ని సాగిస్తున్నారు. 2011 సంవత్సరంలో జోగిపేటకు పాలిటెక్నిక్ కళాశాల మంజూరైంది. సొంత భవనం లేకపోవడంతో ప్రస్తుతం ఆ కళాశాలను స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మూడు గ్రూపులు కొనసాగుతున్నాయి. ఎలక్ట్రానిక్, మెకానికల్, ఈసీఈలో మొత్తం 435 మంది విద్యార్థులున్నారు. కళాశాల ఏర్పాటై రెండేళ్లు పూర్తి కావస్తున్నా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సొంత భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన స్థలాన్ని అందోల్ శివారులో గుర్తించినా నిధులు మంజూరు కాలేదు. పాలిటెక్నిక్ కళాశాలలో కనీసం కరెంటు సౌకర్యం కూడా లేకపోవడం శోచనీయం. సాంకేతిక విద్యకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో సమాచారాన్ని ప్రభుత్వం అందించే క్రమంలో కంప్యూటర్ను కూడా వినియోగించుకోలేని దుస్థితి. అందోల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ సంబంధిత శాఖనే చూస్తున్నా నిధులు మంజూరు కాకపోవడం గమనార్హం. మూడు కోర్సులను నిర్వహించేందుకు తొమ్మి ది తరగతి గదులు అవసరం ఉన్నా ప్రస్తుతం ఏడు గదులే ఉన్నాయి. కొత్త భవనం అందుబాటులోకి రాగానే మరో మూడు గదులు కేటాయిస్తామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ హమీ ఇచ్చినట్టు సమాచారం. ప్రాక్టికల్స్‌కు మాసాబ్‌ట్యాంకు, జహీరాబాద్ వెళ్లాల్సిందే.. స్థానిక కళాశాలలో ల్యాబ్‌కు సంబంధించి ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రాక్టికల్స్ కోసం వంద కిలో మీటర్ల దూరంలోని జహీరాబాద్‌కు విద్యార్థులను పంపుతున్నారు. 10 నుంచి 15 రోజులపాటు అక్కడే ఉండి ఏడాదికి సంబంధించిన ప్రాకిక్టల్స్ను పూర్తి చేసుకొని వస్తున్నారు. జహీరాబాద్‌లో ఈసీఈ కోర్సు లేకపోవడంతో ఆ కోర్సుకు సంబంధించిన విద్యార్థులు మాసాబ్‌ట్యాంక్‌కు వెళ్లాల్సి వస్తుంది. పోస్టులన్నీ ఖాళీనే... పాలిటెక్నిక్ కళాశాలలో దాదాపు పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రిన్సిపాల్, లైబ్రరీయన్, పీడీ, సీనియర్ అసిస్టెంట్-2, జూనియర్ అసిస్టెంట్-2, ఎలక్ట్రికల్ ప్రధానశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ ప్రధానశాఖాధికారి ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. కేవలం నలుగురు రెగ్యులర్, పదిమంది పార్ట్‌టైం లెక్చరర్లు మాత్రమే పనిచేస్తున్నారు. -
పిల్లలపై పోసి, తానూ కిరోసిన్ పోసుకుని..
జోగిపేట, న్యూస్‌లైన్: కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకుని, తన పిల్లలపై కూడా పోసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో వివాహిత తీవ్రంగా గాయపడగా, ఆమె బిడ్డలిద్దరూ స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం జోగిపేటలో జరిగింది. ఎస్ఐ ముఖీద్పాష, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సదాశివ పేటకు చెందిన పద్మావతి(26), స్థానిక స్థానిక గౌని ఏరియాలో నివాసం ఉంటున్న సంతోష్‌ను 7 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మణికంఠ (6), కారుణ్య (4)లు సంతానం. కొన్నాళ్ల పాటు సజావుగా సాగిన వీరి సంసారంలో ఇటీవల కలతలు తలెత్తాయి. ఈ కారణంగానే దంపతులు తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలతో మనస్థాపం చెందిన పద్మావతి ఆదివారం సాయంత్రం తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని తన చిన్నారులపై కూడా పోసింది. అనంతరం ఆమె నిప్పుపెట్టుకుంది. అయితే చిన్నారులిద్దరూ దూరంగా వెళ్లడంతో వారిపై నిప్పుపడలేదు. తల్లి మంటల్లో కాలిపోతుండడం చూసిన చిన్నారులు ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా పద్మావతి వారిని పక్కకు తోసివేసింది. అయినప్పటికీ చిన్నారులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన ఇరుగుపొరుగు వారు వెంటనే మంటలను ఆర్పివేసినప్పటికీ పద్మావతి తీవ్రంగా గాయపడింది. దీంతో వారు ఆమెను ఆటోలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీకి తరలించారు. అంతకుముందు స్థానిక ఆస్పత్రిలో స్థానిక మున్సిఫ్ మెజిస్ట్రేట్ రమాకాంత్ తీవ్రంగా గాయపడ్డ పద్మావతి వాగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా, తమ బిడ్డ ఆత్మహత్యాయత్నానికి ఆమె భర్త వేధింపులే కారణమని పద్మావతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. -
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
జోగిపేట, న్యూస్‌లైన్: అందోలు మండలం రాంసానిపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు డీఏపీ ఎరువుల కోసం రోడ్డెక్కారు. ఇద్దరి రైతులకు ఒక బ్యాగు చొప్పున ఎరువులు కేటాయిస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించి శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. జోగిపేటలోని వ్యవసాయ మార్కె ట్ కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చేవాహనాలు ముర్షత్ దర్గా వరకు, జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు వరకు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బైఠాయించారు. సుమారుగా 45 నిమిషాల సేపు రాస్తారోకో జరిగింది. ఇదిలా ఉండగా విషయం తెలుసుకుని ఏఓ విజయరత్న ఆందోళన చేపడుతున్న రైతుల వద్దకు వచ్చి నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తున్నామని, ఎక్కువ పంపిణీ చేయడం తన పరిధిలో లేదని తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఒక్క బస్తాను ఇద్దరు రైతులు ఎలా తీసుకుంటారని, ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని గ్రామ నాయకులు ఆగమయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌లు విజయరత్నను ప్రశ్నించారు. తన వద్ద ఫోన్ నంబరు లేకపోవడంతో చెప్పలేకపోయానన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉందని, త్వరలో అందరికీ ఎరువులు అందేలా చూస్తానని ఏఓ చెప్పడంతో రైతులు శాంతించారు.