గ్రూపు మహిళలతో సమావేశమైన టీఎంసీ
- సంఘాలు ఎన్నో.. పోస్టులు కొన్నే..!
- నగర పంచాయతీ ‘మెప్మా ’విభాగంలో ఖాళీలతో తిప్పలు
- పట్టించుకోని అధికారులు
జోగిపేట: జోగిపేట నగర పంచాయతీలోని మెప్మా విభాగంలో అన్ని పోస్టులు ఖాళీగా ఉండటంతో డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పట్టణంలో 20 వార్డులకు గాను సమాఖ్యలకు సంబంధించి 350 గ్రూపుల్లో 4,300 మంది సభ్యులున్నారు.
ఆయా సంఘాల్లో పొదుపులు, బ్యాంకు ఖాతాల నిర్వహణ, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు, స్వయం ఉపాధి రుణాల మంజూరు అంశాల్లో మెప్మా సిబ్బంది మహిళా సంఘాలకు సహాయం చేయాల్సి ఉంటుంది. మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి అవసరమైన సహకారం అందించి వారు స్వయం సమృద్ధి సాధించేలా చూడాలి.
జోగిపేట, అందోలును కలిపి మూడేళ్ల క్రితం నగర పంచాయతీగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మెప్మా సిబ్బందిని ఏర్పాటు చేయలేదు. 500 గ్రూపుల ఇళ్లకు ఒక కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉండాలి. పట్టణంలో కనీసం ముగ్గురికిపైగా సీఓలు ఉండాలి. ఒక టౌన్ మిషన్ కోఆర్డినేటర్, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీ వలంటీర్లు ఉండాలి.
టీఎంసీ(టౌన్ మిషన్ కోఆర్డినేటర్)లు ప్రభుత్వ పథకాలపై మహిళలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి. మెప్మా సోషల్ వెల్ఫేర్‌పై తెలియజేయాలి. కమ్యూనిటీ ఆర్గనైజర్లు వారి పరిధిలోని మహిళా గ్రూపులతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు సలహాలు, సూచలను చేయాలి. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ది కూడా ముఖ్యమైన బాధ్యతనే.
సంబంధిత శాఖ అధికారులకు ఎప్పటికప్పుడు గ్రూపుల వివరాలను తెలియజేయాలి. టీడబ్ల్యూడీ వలంటర్ గ్రూపులోని వికలాంగులుగా ఉన్న సభ్యులకు ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలను తెలియజేయాలి. ఈ బాధ్యతలను నిర్వర్తించాల్సిన సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తోంది. బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపుల్లో సభ్యులకు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్లు మంజూరు చేశారు.
అన్నింటికీ ఒక్కడే
మహిళా సంఘాలను ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో చూస్తోంది. డ్వాక్రా గ్రూపు మహిళలకు రుణాలను బ్యాంకుల ద్వారా అందజేస్తోంది. అలాంటి విభాగానికి పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం జోగిపేట నగర పంచాయతీలో కమ్యూనిటీ ఆర్గనైజర్ ఒక్కరే పని చేస్తున్నారు.
ఆయన ఇన్‌చార్జి టీఎంసీ, సీఓ, డాటా ఎంట్రీ ఆపరేటర్, టీడబ్ల్యూడీగా వ్యవహరిస్తున్నారు. 4,300 మంది మహిళా సభ్యులకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. మూడేళ్లయినా ప్రభుత్వం ముగ్గురు అధికారులను నియమించకపోవడం విచారకరం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డ్వాక్రా గ్రూపు మహిళలు కోరుతున్నారు.
సిబ్బంది తక్కువ
నగర పంచాయతీలో గ్రూపులు ఎక్కువగా ఉన్నాయి. ఇన్‌చార్జి టీఎంసీ ఒక్కరే అన్ని బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రూపుల మహిళలు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో రుణాలు. సలహాలు, సూచనలు అందడం లేదు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు మహిళలకు తెలియజేసే బాధ్యత సిబ్బందిదే. పూర్తి స్తాయి సిబ్బందిని నియమించాలి. - కళావతి, గ్రూపు లీడర్
ఖాళీలు వాస్తవమే
జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడినప్పటి నుంచి మెప్మా విభాగంలో అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. టీఎంసీ, సీఓ టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సీఓగా ఉన్న నేను కొన్ని సంవత్సరాలుగా ఇన్‌చార్జి టీఎంసీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. సిబ్బంది లేకున్నా అన్ని రకాల విధులను నిర్వహిస్తున్నా. - భిక్షపతి, మెప్మా ఇన్‌చార్జి టీఎంసీ
ఖాళీలను భర్తీ చేయాలి
నగర పంచాయతీలో మెప్మా విభాగంలో ఉన్న టీఎంసీ, సీఓ, టీడబ్ల్యూడీ, డాటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఖాళీల కారణంగా గ్రూపుల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కరే అన్ని బాధ్యతలను చూడాల్సి వస్తోంది. నాలుగు వేలకుపైగా మహిళలున్నారు. ప్రభుత్వం మెప్మా సిబ్బందిని నియమించి సమస్యను పరిష్కరించాలి. - ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్‌పర్సన్