
సాక్షి, అమరావతి: ఆర్థికంగా కాస్త ఆసరా ఇచ్చి అండగా నిలిస్తే మహిళలు అద్భుతాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా నమ్మిన వైఎస్ జగన్ ప్రభుత్వం అడుగడుగునా వారిని ప్రోత్సహిస్తూనే ఉంది. స్వయం సహాయక సంఘాల మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు అందించి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే దిశగా సహకరిస్తోంది. జగనన్న మహిళామార్టులు, ఆహా క్యాంటీన్లు, అర్బన్ మార్కెట్‌లు విజయవంతం కావడంతో పట్టణాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల కోసం పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) మరో ముందడుగు వేసింది.
ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాల్లో, పర్యావరణ హితమైన సూక్ష్మ పరిశ్రమల స్థాపనకు కార్యాచరణ చేపట్టింది. ఈ అంశంపై గత నెలలో పట్టణ సమాఖ్యలకు చెందిన టీఎల్‌ఎఫ్ రిసోర్స్ పర్సన్లు, సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, కోశా«దికారులతో మెప్మా మిషన్ డైరెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందులో దాదాపు 165 సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదించారు. ఒక్కో పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున రూ.2.50 లక్షల సాయం అందించాలని నిర్ణయించారు. యూనిట్ల ఏర్పాటు, నిర్వహణపై ఆయా రంగాల నిపుణులతో వచ్చే నెలలో మహిళలకు శిక్షణ ఇస్తారు.
గత నాలుగున్నరేళ్లుగా మెప్మా పట్టణ పొదుపు సంఘాల మహిళలను వ్యాపార యూనిట్ల ఏర్పాటు దిశగా ప్రోత్సహిస్తోంది. ఇప్పటివరకు 11 మహిళా మార్టులు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో 140కి పైగా ఆహా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 110 యూఎల్బీల్లో ప్రతినెలా అర్బన్ మార్కెట్‌లు సైతం ఏర్పాటు చేసి, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు. ఇవన్నీ విజయవంతం కావడంతో మెప్మా పర్యావరణ హిత సూక్ష్మ పరిశ్రమలను పట్టణ మహిళా ప్రగతి యూనిట్ల పేరిట ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళల ఆసక్తి
మహిళల ఆధ్వర్యంలో స్థాపించే సూక్ష్మ పరిశ్రమలకు అవసరమైన మూలధనం సేకరణ, పరిశ్రమ స్థాపన, నిర్వహణ, మార్కెటింగ్ వంటి అంశాలపై వచ్చే నెలలో నిపుణులతో శిక్షణనివ్వాలని మెప్మా నిర్ణయించింది. రాష్ట్రంలోని 120 యూఎల్బీల నుంచి 32 రకాల యూనిట్ల ఏర్పాటుకు మహిళలు ఆసక్తి చూపారు. ఇలా వచ్చిన ఆసక్తుల్లో మొత్తం 165 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందులో ఇద్దరు సభ్యుల నుంచి 35 మంది సభ్యుల వరకు నిర్వహించే పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో వాడిపోయిన పూల నుంచి అగర్‌బత్తీల తయారీ, పేపర్ కప్పులు, ప్లేట్లు తయారీ, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, జ్యూట్ బ్యాగ్‌ల మేకింగ్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అరటినార ఉత్పత్తులు, మిల్లెట్స్‌తో నూడుల్స్ తయారీ, డ్రై వెజిటబుల్ ఫ్లేక్స్ తయారీ వంటివి ఉన్నాయి.
అద్దె భారం లేకుండా చర్యలు
మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా మెప్మా కృషి చేస్తోంది. సాధారణంగా పట్టణాల్లో చిన్న వ్యాపారం పెట్టాలన్నా గదుల అద్దె అధికంగా ఉంటుంది. మెప్మా ఏర్పాటు చేసే మహిళా ప్రగతి యూనిట్లను మున్సిపల్ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనివల్ల భవనాల అద్దె భారం, అడ్వాన్స్ చెల్లింపులు పెద్దగా ఉండవు. ఇది మహిళలకు ఊరటనిస్తుంది. ఒక్కో యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం తరఫున గరిష్టంగా రూ.2.50 లక్షలు ఆర్థిక సాయం అందిస్తాం. – వి.విజయలక్ష్మి, మెప్మా మిషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment