
2023లో రాష్ట్రంలో 25.47 కోట్ల మంది పర్యటన
2023 ఏడాది గణాంకాలను వెల్లడించిన కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ
సాక్షి, అమరావతి: దేశీయ పర్యాటకులను ఆకర్షిస్తున్న టాప్ పది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నాలుగో స్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్ణాటక, ఐదో స్థానంలో రాజస్థాన్ ఉన్నాయి. 2022తో పోలిస్తే 2023లో ఆంధ్రప్రదేశ్లో దేశీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. దీని ప్రకారం.. 2022లో 19.27 కోట్ల మంది రాష్ట్రంలో పర్యటించగా 2023లో 25.47 కోట్ల మంది పర్యటించారు.
అంటే.. 2022 కన్నా 2023లో 6.2 కోట్ల మంది పెరిగారు. ఇక 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లోనే 86.11 శాతం మంది ఉండగా మిగతా రాష్ట్రాల్లో కేవలం 13.89 శాతమే ఉన్నట్లు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అలాగే, 2022తో పోలిస్తే 2023లో దేశీయ పర్యాటకుల సంఖ్య 77.86 కోట్లు పెరిగారు. 2022లో ఈ సంఖ్య 173.10 కోట్లుండగా 2023లో 250.96కి పెరిగింది. అలాగే, 2023లో దేశీయ పర్యాటకులను ఆకర్షించిన టాప్ పది రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ
బెంగాల్, మధ్యప్రదేశ్, బిహార్ కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment