fourth place
-
WC 2023: నాలుగో స్థానంపై అనిశ్చితి ఉంది: రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు
ముంబై: నాలుగేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ విషయంలో పెద్ద సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. మిడిలార్డర్లో కీలకమైన ఈ స్థానం విషయంలో నెలకొన్న అనిశ్చితి వాస్తవమేనని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్ సమయానికి అంతా సర్దుకుంటుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టులో నాలుగో స్థానం విషయంలో చాలా కాలంగా సమస్య ఉంది. యువరాజ్ రిటైరయ్యాక ఎవరూ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. అయితే గత కొంత కాలంగా ఆ స్థానంలో ఆడుతున్న శ్రేయస్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతని గణాంకాలూ బాగున్నాయి. అయితే అతను గాయపడటంతో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయత్నించాల్సి వచ్చింది. కీలక స్థానంలో ఆడే ఆటగాడు గాయపడినప్పుడు మళ్లీ కొత్తగా ప్రయత్నించాల్సి వస్తుంది. నేను కెప్టెన్ కాక ముందు కూడా ఇలాంటి పరిస్థితిని చూశాను’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జట్టులో ఎవరి స్థానానికీ హామీ ఉండదని... గాయాల నుంచి కోలుకొని వచ్చిన తర్వాత కూడా ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు. ‘రాహుల్, శ్రేయస్ నాలుగు నెలలుగా క్రికెట్ ఆడలేదు. గాయాలు, శస్త్రచికిత్సలు కొనసాగాయి. కోలుకొని వచ్చిన తర్వాత ఎవరికైనా అంత సులువు కాదు. అయితే మీ కోసం స్థానం సిద్ధంగా ఉందని ఎవరికీ చెప్పలేం. చోటు దక్కించుకునేందుకు అందరూ పోటీ పడాల్సిందే. త్వరలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశం కూర్పు విషయంలో చర్చిస్తాం’ అని కెప్టెన్ అన్నాడు. -
తెలంగాణ నంబర్4
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారులకు భద్రత, రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కార్యకలాపాలు తెలంగాణలో ఊపందుకున్నాయి. రెరాలో ప్రాజెక్ట్‌ల నమోదులో దేశంలోనే తెలంగాణ నాల్గో స్థానంలో నిలిచింది. టీఎస్ రెరాలో 4,002 రియల్టీ ప్రాజెక్ట్‌లు, 2,017 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రెరాలో 2,248 ప్రాజెక్ట్‌లు, 151 మంది మధ్యవర్తులు నమోదయ్యా రు. దేశవ్యాప్తంగా 74,088 ప్రాజెక్ట్‌లు, 58,790 మంది ఏజెంట్లు రెరాలో నమోదయ్యారు. అత్యధికంగా మహారాష్ట్ర రెరాలో 33,154 ప్రాజెక్ట్‌లు 11,231 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. గుజరాత్లో 9,689 ప్రాజెక్ట్‌లు, 2,695 మంది మధ్యవర్తులు, మధ్యప్రదేశ్‌లో 4,016 ప్రాజెక్ట్‌లు 935 మంది ఏజెంట్లు రిజిస్టరయ్యారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్, రాజస్తాన్, కర్ణాటక రెరాలో వెయ్యికి పైగా ప్రా జెక్ట్లు రిజిస్టరయ్యాయి. అత్యల్పంగా ఎన్సీఆర్ రెరాలో 34, పాండిచ్చేరి రెరాలో 194, ఉత్తరాఖండ్‌లో 332 ప్రాజెక్ట్‌లు నమోదయ్యాయి. శాశ్వత అథారిటీ లేదు.. తెలంగాణ, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే శాశ్వత రెరా అథారిటీ లేదు. ఇప్పటికీ ఆయా రాష్ట్రాల్లో ఇంటెర్మ్ రెరా అథారిటీనే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే రెరాను ఏర్పాటు చేయని రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. -
భారత్ సైన్యం ప్రపంచంలోనే నాలుగో శక్తివంతమైంది
న్యూఢిల్లీ: కమ్యూనిస్టు చైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిని కలిగి ఉండగా, భారత్ ఈ విషయంలో నాలుగో స్థానంలో ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొత్తం 100 పాయింట్లకు చైనా 82 పాయింట్లతో సూచికలో అగ్ర స్థానంలో నిలిచిందని పేర్కొంది. అమెరికా మిలటరీ బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ, 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తర్వాత 69 పాయింట్లతో రష్యా మూడో స్థానంలో, 61 పాయింట్లతో భారత్ నాలుగో స్థానంలో ఉన్నాయి. ఈ పట్టికలో యూకే 43 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచినట్లు మిలటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ ఆదివారం ఈ వివరాలను విడుదల చేసింది. మిలటరీ బడ్జెట్, యాక్టివ్, ఇన్ యాక్టివ్ సైనికుల సంఖ్య, త్రివిధ దళాలు, అణు సామర్థ్యం, సరాసరి వేతనాలు, ఆయుధ సామగ్రి వంటి వివరాలను పరిగణనలోకి తీసుకుని ‘అల్టిమేట్ మిలటరీ స్ట్రెన్త్ ఇండెక్స్’ను రూపొందించినట్లు తెలిపింది. ప్రపంచంలోనే భారీ మిలటరీ బడ్జెట్‌ను కలిగిన అమెరికా ఏడాదికి 732 బిలియన్ డాలర్లను వెచ్చిస్తుండగా చైనా 261 బిలియన్ డాలర్లు, భారత్ 71 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నాయి. -
నాదల్ @ 1000
పారిస్: స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తన అసమాన కెరీర్లో మరో మైలురాయిని దాటాడు. పారిస్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా... 1000వ విజయాన్ని నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై గెలుపొందాడు. తద్వారా ఓపెన్ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్ (1,274), రోజర్ ఫెడరర్ (1,242), ఇవాన్ లెండిల్ (1,068) ఉన్నారు. 2002 ఏప్రిల్ 29న 16 ఏళ్ల వయసులో రమోన్ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో.... తన విజయాల వేటను ఆరంభించిన నాదల్æ... 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్ సెమీఫైనల్లో ఇవాన్ డొడిగ్ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్లో 500వ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా 20వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన నాదల్... పురుషుల విభాగంలో ఫెడరర్ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్ రికార్డు (20)ను సమం చేశాడు. క్వార్టర్స్‌లో బోపన్న జంట పారిస్ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నమెంట్లో భారత ప్లేయర్ రోహన్ బోపన్న– ఒలివర్ మరాచ్ (ఆస్ట్రియా) జంట క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్ విభాగంలో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–ఒలివర్ ద్వయం 3–6, 6–4, 10–8తో తొమ్మిదో సీడ్ ఫాబ్రిస్ మార్టిన్ (ఫ్రాన్స్)–జీన్ జులియన్ రోజెర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. ‘వేయి మ్యాచ్‌లు గెలిచానంటే నాకు వయసు మీద పడినట్లే లెక్క. నా కెరీర్లో నేను సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. అలాగే ఈ మైలురాయిని కూడా. గాయాల రూపంలో అనేక ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌పై ఉన్న అంకిత భావం నన్ను ముందుకు సాగేలా చేసింది. అందుకే ఇంత కాలం బాగా ఆడగలిగాను. ఇప్పుడు అదే నాకు 1000వ విజయాన్ని అందించింది’ – నాదల్ -
నాలుగో స్థానంలో హరికృష్ణ
చెన్నై: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్ విభాగంలో భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత తొమ్మిది పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఏడో గేమ్‌లో హరికృష్ణ 66 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ తొమ్మిదో గేమ్‌లో 69 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో బ్లిట్జ్ విభాగం గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. బ్లిట్జ్ గేమ్‌లు ముగిశాక ఓవరాల్ పాయింట్ల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రస్తుతం ర్యాపిడ్ విభాగంలో సో వెస్లీ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. -
3 కేసులు...3 లక్షలు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించిన దగ్గర్నుంచి కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొంతకాలంగా సగటున ప్రతిరోజూ దాదాపుగా 10 వేల కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలు దాటిపోయి ప్రపంచ జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్ ఉంది. 24 గంటల్లో 11,458 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బట్టబయలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 3,08,993కి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల నుంచే అత్యధిక కేసులు రావడం ఆయా రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఇక మరణాల సంఖ్య చూస్తే ఒకే రోజు 386 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8,884కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. అయితే రికవరీ రేటు భారీగా ఉండడం భారత్‌కు అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 49.9 శాతం మంది కోవిడ్ రోగులు కోలుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హాట్ స్పాట్స్ ఇవే... దేశంలో నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా అయిదు నగరాల నుంచే వస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, థానే, అహ్మదాబాద్ నగరాలు కోవిడ్ హాట్స్పాట్లుగా మారాయి. ఈ నగరాలు సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నాయనే అంచనాలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ► కోవిడ్ హాట్‌స్పాట్ నగరాల్లో ముంబై ముందుస్థానంలో ఉంది. 55,451 కేసులతో ముంబై నగరం స్వీడన్, నెదర్లాండ్స్, ఈజిప్టు, యూఏఈ వంటి దేశాలనే దాటేసింది. ► దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాటికి కోవిడ్–19 కేసులు 36,824కి చేరుకున్నాయి. మృతుల సంఖ్య 1,214గా నమోదైంది. ► దక్షిణ భారత్‌లోని చెన్నైలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం చెన్నై నుంచే వస్తున్నాయి. శనివారం నాటికి చెన్నైలో 27 వేల కేసులు ఉంటే, తమిళనాడులో కేసుల సంఖ్య 40,698కి చేరుకుంది. ► మహారాష్ట్రలోని థానే కోవిడ్–19కి కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. ఈ పట్టణంలో ఏకంగా 16 వేల కేసులు నమోదైతే 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ► గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు అహ్మదాబాద్‌లోనే నమోదయ్యాయి. ► మహారాష్ట్రలోనే మరో నగరం పుణేలో 11 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా పేరున్న ఇండోర్ కూడా కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. ఇండోర్‌లో 4వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 10 వేలు దాటేసింది. 10 రోజుల్లోనే లక్ష.. భారత్‌లో 100 కేసుల నుంచి మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో కేసులు రెండు లక్షలు దాటాయి. అప్పట్నుంచి కేవలం 10 రోజుల్లోనే భారత్‌లో కేసుల సంఖ్య 3 లక్షలు దాటడం కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం కాస్త ఎక్కువ కావడం కొంతలో కొంత ఊరటని స్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటివరకు 15.4 రోజుల్లో కేసులు రెట్టింపైతే ఇప్పుడది 17.4 రోజులకు చేరుకుంది. -
ఆ మూడు తరవాతే ఇండియా!
దావోస్: అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో విశ్వాసం కనిష్ట స్థాయికి చేరింది. అయినా కానీ, అంతర్జాతీయంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ వారికి నాలుగో ప్రాధాన్య దేశంగా ఉన్నట్టు పీడబ్ల్యూసీ సంస్థ సీఈవోలపై నిర్వహించిన సర్వే స్పష్టం చేసింది. భారత్‌లో తమ వ్యాపార వృద్ధికి అనుకూల పరిస్థితులున్నట్టు అంతర్జాతీయంగా నిర్వహించిన ఈ సర్వేలో 9 శాతం మంది సీఈవోలు చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో భాగంగా ఈ నివేదికను పీడబ్ల్యూసీ విడుదల చేసింది. తమ ఆదాయ వృద్ధి అవకాశాల పట్ల భారత సీఈవోలు ఎంతో ఆశావహంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. చైనాలో 45 శాతం మంది సీఈవోలు ఈ రకమైన విశ్వాసంతో ముందుండగా, ఆ తర్వాత భారత సీఈవోల్లోనే అత్యధిక విశ్వాసం వ్యక్తమైంది. 40 శాతం భారత సీఈవోలు వృద్ధి అవకాశాల పట్ల నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 36 శాతం, కెనడాలో 27 శాతం, బ్రిటన్‌లో 26 శాతం, జర్మనీలో 20 శాతం సీఈవోల్లో ఇదే విశ్వాసం వ్యక్తమైంది. అంతర్జాతీయంగా చూస్తే... తమ కంపెనీ అవకాశాల పట్ల సానుకూలత వ్యక్తం చేసిన వారు కొద్ది మందే. 27 శాతం సీఈవోలు మాత్రమే ఈ ఏడాది ఆదాయ వృద్ధి అవకాశాలపై నమ్మకంతో ఉన్నారు. 2009 తర్వాత అంతర్జాతీయంగా సీఈవోల్లో విశ్వాసం ఇంత కనిష్ట స్థాయికి చేరడం మళ్లీ ఇదే. గతేడాది ఇది 35 శాతంగా ఉంది. నిరాశావాదం తారస్థాయిలో.. అంతర్జాతీయ వృద్ధి పట్ల సీఈవోల్లో నిరాశావాదం రికార్డు స్థాయికి చేరిందని పీడబ్ల్యూసీ సర్వే పేర్కొంది. అంతర్జాతీయ జీడీపీ వృద్ధి రేటు తగ్గుతుందని సగానికి పైగా సీఈవోలు చెప్పడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. వ్యాల్యుబుల్ 500 ఇనీషియేటివ్‌లో డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా వైకల్యం ఉన్న వారికి ఉపాధి కల్పించే విషయంలో గూగుల్, యాక్సెంచర్, బోయింగ్, కోకకోలా తదితర కంపెనీలతోపాటు భారత్ నుంచి డాక్టర్ రెడ్డీస్, మహీంద్రా, సరోవర్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ముందుకొచ్చాయి. 24 దేశాల నుంచి మొత్తం 241 కంపెనీలు ‘వాల్యుబుల్ 500 ఇనీషియేటివ్’ కార్యక్రమంలో చేరాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెలు 9.9 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని, వీటి ఆదాయం 3.8 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉందని డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల మంది ప్రజలు ఎంతో కొంత వైకల్యాన్ని ఎదుర్కొంటున్నట్లు గుర్తు చేసింది. పారదర్శక వాణిజ్యాన్నే భారత్ కోరుకుంటోంది: గోయల్ పారదర్శకమైన, సమతుల్యమైన వాణిజ్య భాగస్వామ్యాల కోసం భారత్ కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో స్పష్టం చేశారు. హిందూ మహాసముద్ర తీర ప్రాంత దేశాల్లో వృద్ధికి ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సహకారం మరింత విస్తృతం కావాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (ఆర్సీఈపీ) ప్రస్తుత రూపంలో ఉన్నది భారత్‌కు ఆమోదనీయం కాదన్నారు. ఈ ప్రాంతంలో చైనా, ఇతర దేశాలతో భారత్ వాణిజ్య లోటును కలిగి ఉందని, ఈ అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని చెప్పారాయన. -
ఆహా ఆన్లైన్ భోజనం..
సాక్షి, హైదరాబాద్: మెట్రో నగరవాసులు ఒక్క క్లిక్‌తో ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసేస్తున్నారు. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థలకు రోజురోజుకూ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయి. మెట్రో నగరాల్లో ఆ సంస్థల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో దేశంలో బెంగళూరు తొలి స్థానంలో ఉంది. తర్వాతి 3 స్థానాల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఉన్నాయి. ట్రాక్సాన్ అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఈ విష యాలు వెల్లడయ్యాయి. బెంగళూరులో నిత్యం సుమారు 95 వేల ఆన్లైన్ ఆర్డర్లు వెల్లువెత్తుతున్నాయని పేర్కొంది. ఢిల్లీలో రోజుకు 87 వేలు.. ముంబైలో 62 వేల ఆర్డర్లు అందుతున్నాయని తెలిపింది. నాలుగో స్థానంలో నిలిచిన హైదరాబాద్‌లో నిత్యం 54 వేల ఆర్డర్లు ఫుడ్ డెలివరీ సంస్థలకు అందుతున్నాయని పేర్కొంది. దేశంలో సుమారు వెయ్యి వరకు ఫుడ్ డెలివరీ సంస్థలుండగా.. ఇందులో వంద వరకు హైద రాబాద్‌లో కార్యకలాపాలు సాగిస్తుండటం విశేషం. స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా వంటి సంస్థలు ఫుడ్ లవర్స్‌కు నచ్చిన ఆహార పదార్థాలను నిమిషాల్లో అందిస్తున్నాయి. ఈ సంస్థల డెలివరీ బాయ్స్ కోసమే ప్రత్యేకంగా పలు రెస్టా రెంట్లు, హోటళ్లు టేక్అవే కౌంటర్లను ఏర్పాటు చేస్తుండటం విశేషం. ఇక ఈ ఫుడ్ సర్వీసు రంగంలో సేవలందిస్తోన్న పలు ఫుడ్ టెక్నాలజీ అంకుర సంస్థల సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతూనే ఉండటం విశేషం. ఫుడ్ డెలివరీతో లాభం ఇలా.. ఫుడ్ డెలివరీ సంస్థలు రూ.350 విలువ గల ఆహార పదార్థాలు మొదలు ఆపై విలువ చేసే ఆర్డర్లను వినియోగదారుల ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నాయి. ఇందులో రెస్టారెంట్లు ఆర్డర్ చేసే ఆహారం విలువను బట్టి ఈ సంస్థలకు 10 నుంచి 20% కమీషన్ అందిస్తున్నట్లు సమాచారం. మరో 5% వినియోగదారుల నుంచి లభ్యమవుతోందట. దీంతో వీటి వ్యాపారం రోజురోజుకూ పెరుగుతూనే ఉందన్నది మార్కెట్ వర్గాల అంచనా. ఈ అంకుర సంస్థల్లో వేలాది మంది యువతకు పార్ట్టైమ్తోపాటు ఫుల్‌టైమ్ కొలువులు దక్కుతుండటం విశేషం. బెంగళూరులో 2016లో రోజుకు సరాసరిన వచ్చే ఆర్డర్ల సంఖ్య 53 వేలుగా ఉండగా.. అది 2020 జనవరి నాటికి 95 వేలకు చేరుకుందని ట్రాక్సాన్ తన అధ్యయనంలో పేర్కొంది. రోజుకు సరాసరిన వచ్చిన ఆర్డర్ల సంఖ్య.. ర్యాంకు నగరం 2016లో 2020లో 1 బెంగళూరు 53,000 95,000 2 ఢిల్లీ 36,000 87,000 3 ముంబై 24,000 62,000 4 హైదరాబాద్ 20,000 54,000 -
2050 నాటికిమలేరియాకు చెక్
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించడానికి మరో 30 సంవత్సరాలు పడుతుందని లాన్సెట్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న సగం దేశాలు మలేరియా నుంచి విముక్తి పొందాయని మిగిలిన దేశాల్లో 2050 నాటికి ఈ వ్యాధిని అరికట్టవచ్చునని ఆ నివేదిక తెలిపింది. 2017లో మలేరియా కేసుల్లో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌కు చెందినవే కావడం ఆందోళన పుట్టిస్తోంది. నివేదిక ఎలా ? ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలనకు పరిశోధనలు చేస్తున్న నిపుణులు, బయోమెడికల్ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, ఆరోగ్య నిపుణులు మొత్తం 40 మంది అభిప్రాయాలను తీసుకున్నారు. వివిధ దేశాల ప్రభుత్వాలు వ్యాధి నిర్మూలనకు అమలు చేస్తున్న వ్యూహాలు, కేటాయిస్తున్న నిధులు వంటివి క్రోడీకరించి, విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. నివేదిక ఏం చెప్పిందంటే ► 2017లో ప్రపంచంలో 21.9 కోట్ల మలేరియా కేసులు వెలుగులోకి వస్తే, అందులో కోటి కేసులు భారత్‌లో నమోదయ్యాయి. అందులోనూ 71 శాతం తమిళనాడులో నమోదయ్యాయి. ► భారత్‌కు చెందిన పట్టణాల్లో మలేరియా వ్యాధికారక దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ► భారత్‌లో పట్టణీకరణ కారణంగా నిర్మాణాలు జరిగే ప్రాంతాలు, చెరువులు, కాల్వలు వంటి చోట్ల దోమలు బాగా వృద్ధి చెంది మలేరియా వ్యాపిస్తోంది. ► భారత్‌లో ఆరోగ్యానికి ప్రజలు తమ జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల కూడా మొండి వ్యాధులు దూరం కావడం లేదు. ► 2000 సంవత్సరం తర్వాత మలేరియా వ్యాధి మరణాలు 60 నుంచి 36 శాతానికి తగ్గిపోయాయి. ► నిధుల కొరత కారణంగ్లా ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికాకు చెందిన 55 దేశాల్లో మలేరియా విజృంభిస్తోంది. ► ఇప్పటికీ ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 50 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ► 2017లో మొత్తం మరణాల్లో 85శాతం 25 దేశాల్లోనే నమోదయ్యాయి. ► పేదరికం కారణంగా మలేరియా నిర్మూలనకు నిధులు కేటాయించలేక ఆఫ్రికా దేశాల్లో ఇంకా మరణాలు సంభవిస్తున్నాయి. ► ప్రాంతాలవారీగా, దేశాల వారీగా, అంతర్జాతీయంగా పటిష్టమైన చర్యల్ని తీసుకుంటేనే ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించగలం ► ప్రపంచ దేశాలన్నీ ప్రతీ ఏడాది 200 కోట్ల అమెరికా డాలర్ల నిధులు కేటాయిస్తేనే మలేరియా నిర్మూలన సాధ్యమవుతుంది. ► ప్రస్తుత ఆవిష్కరణలను బట్టి 2050 నాటికి ఈ వ్యాధి ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాల్లో తప్ప మిగిలిన చోట్ల ఎక్కడా కనిపించదు. -
కిలాడి నంబర్ 4
బాలీవుడ్ కిలాడి (అక్షయ్‌ని ముంబైలో అలానే అంటారు) అక్షయ్ కుమార్ ఫోర్బ్స్ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచారు. అమెరికన్ బిజినెస్ మ్యాగజీన్ ఫోర్బ్స్ 2019 ఏడాదికిగాను అత్యధిక సంపాదన ఉన్న నటుల జాబితాను ప్రకటించింది. గత ఏడాది జూన్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకు నటుల సంపాదనను వివిధ కొలమానాల ఆధారంగా చేసుకుని ఈ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 65 మిలియన్ డాలర్ల (దాదాపు 460 కోట్ల రూపాయలు) సంపాదనతో ఈ జాబితాలో అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచారు. హాలీవుడ్ స్టార్ యాక్టర్ డ్వేన్ జాన్సన్ 89.4 మిలియన్ డాలర్ల సంపాదనతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 76.4 మిలియన్ డాలర్లతో క్రిస్ హెమ్స్‌వర్త్ రెండో స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో రాబర్ట్ డౌనీ జూనియర్, జాకీ చాన్, బ్రాడ్లీ కూపర్, ఆడమ్ సాండ్లర్, క్రిస్ ఇవాన్స్, పాల్ రూడ్, విల్ స్మిత్‌లు వరుస క్రమంలో చోటు సంపాదించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది ఈ జాబితాలో తొలి స్థానంలో నిలిచిన జార్జి క్లూనే ఈసారి చోటు సంపాదించుకోలేకపోయారు. మరోవైపు 2015 తర్వాత బ్రాడ్లీ కపూర్ ఈ జాబితాలో తిరిగి స్థానం సంపాదించుకోవడం విశేషం. -
అత్యుత్తమ అధ్యక్షుడు ఒబామా
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామానే ఉత్తమ అధ్యక్షుడు అని అధిక శాతం మంది అమెరికన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షులపై ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన సర్వేలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగో స్థానంలో నిలిచారు. రెండు పర్యాయాలు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ ఒబామాను 44 శాతం మంది అమెరికన్లు బెస్ట్ ప్రెసిడెంట్‌గా పేర్కొన్నారు. 33 శాతంతో రెండో స్థానంలో బిల్ క్లింటన్, 32 శాతంతో మూడో స్థానంలో రొనాల్డ్ రీగన్ నిలిచారు. కనీసం సగం పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకోని ట్రంప్ మాత్రం కేవలం 19 శాతం ఓట్లతో నాలుగో స్థానంతో సరిపుచ్చుకున్నారు. 2011లో ఒబామా తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు నిర్వహించిన సర్వేలో 20 శాతం ఓట్లతో ఆయన మొదటి స్థానంలో నిలిచారు. 2018 జూన్ 5 నుంచి 12 మధ్య తమ జీవిత కాలంలో తాము చూసిన అధ్యక్షులపై 2,002 మంది వయోజనుల అభిప్రాయాలు సేకరించారు. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్ ఆధారంగా విశ్లేషణ చేశారు. ఫస్ట్ చాయిస్లో 31 శాతం, సెకండ్ చాయిస్లో 13 శాతంతో మొత్తం 44 శాతం ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. ట్రంప్ తమకు ఫస్ట్ చాయిస్ అని 10 శాతం మంది చెప్పగా, 9 శాతం మంది సెకండ్ చాయిస్ అని పేర్కొన్నారు. -
బ్రిటన్‌లో 4వ అతి పెద్ద ఇన్వెస్టర్... భారత్
మూడో స్థానం నుంచి మరో స్థానం కిందికి లండన్: బ్రిటన్‌లో భారీగా ఇన్వెస్ట్ చేసిన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి తగ్గింది. ఇప్పటిదాకా మూడో అతి పెద్ద ఇన్వెస్టరుగా ఉండేది. తాజాగా విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం బ్రిటన్‌లో 577 ప్రాజెక్టుల్లో పెట్టుబడులతో అమెరికా టాప్ స్థానంలో ఉండగా, 160 ప్రాజెక్టులతో చైనా (హాంకాంగ్ సహా) రెండో స్థానంలో నిల్చింది. 131 ప్రాజెక్టులతో ఫ్రాన్స్ మూడో స్థానానికి ఎగబాకింది. 127 ప్రాజెక్టులతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో కలిసి భారత్ నాలుగో స్థానంలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్య విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2016–17లో 127 కొత్త ప్రాజెక్టులతో భారత్.. బ్రిటన్‌లో 7,645 ఉద్యోగాలను కాపాడటంతో పాటు అదనంగా 3,999 కొత్త ఉద్యోగాలు కల్పించింది. -
దేశవ్యాప్త ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్‌కు నాలుగో స్థానం
కాజీపేట అర్బన్ : దేశవ్యాప్త నిట్ల ర్యాంకింగ్‌లో వరంగల్ నిట్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్జవదేకర్ సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. 1959లో అక్టోబర్ 10న అప్పటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నె్రçహూ ప్రారంభించిన ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో మొట్టమొదటిది వరంగల్ ఆర్ఈసీ. సాంకేతిక విద్యకు కేంద్రంగా మారిన ఆర్ఈసీ 2002లో జాతీ యస్థాయిలో గుర్తింపు పొంది జాతీయ సాంకేతిక విద్యా సంస్థ (నిట్)గా రూపాంతరం చెందింది. ప్రస్తుతం నూతన ఆవిష్కరణలు, క్యాంపస్ ఇంటర్వూలు, అత్యుత్తమ విద్యకు కేంద్రంగా నిలుస్తోంది. వరంగల్ నిట్‌లో çసుమారు మూడు వేలకు పైగా రెసిడెన్షియల్ విద్యార్థులతో పాటు 269మంది పీహెచ్డీ రీసెర్చ్ స్కాలర్లు విద్యనభ్యసిస్తున్నారు. అత్యుత్తమ విద్యతో క్యాంపస్ సెలక్షన్స్‌లో మొదటి స్థానంలో నిలుస్తోంది. నిట్‌కు చెందిన ఓ విద్యార్థి ఇటీవల నెలకు రూ.80 లక్షల జీతంతో ఎంపిక కావడం విశేషం. నంబర్‌వన్ స్థానానికి కృషి చేస్తాం : వైఎన్.రెడ్డి, నిట్ రిజిస్ట్రార్ దేశవ్యాప్తంగా 31 నిట్‌లలో వరంగల్ నిట్ నాల్గవ స్థానంలో నిలవడం ఆనందంగా ఉంది. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి కృషి చేస్తాం. -
ప్రపంచంలో ఇస్రోది నాలుగో స్థానం
డిప్యూటీ మేనేజర్ వీఆర్‌కేఎస్ వరప్రసాద్ బాలాజీచెరువు (కాకినాడ) : అంతరిక్ష పరిశోధనకు సంబంధించి ఇస్రో ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని ఆ సంస్థ డిప్యూటీ మేనేజర్ వీఆర్‌కేఎస్ వరప్రసాద్ తెలిపారు. కాకినాడ ఆదిత్య అకాడమీకి శుక్రవారం వచ్చిన ఆయన ‘సాక్షి’తో ముచ్చటించారు. సాక్షి : ఇప్పటివరకూ ఇస్రో ఎన్ని పరిశోధనలు చేసింది? వరప్రసాద్ : ఇప్పటివరకూ 36 రాకెట్లను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టగా వాటిలో 34 విజయవంతమయ్యాయి. సాక్షి : కొత్తగా ప్రాజెక్టుల గురించి.. వరప్రసాద్ : ఈ నెల 26న పీఎస్ఎల్వీ–35 ద్వారా ఫారిన్ శాటిలైట్ రిమోట్ సిస్టమ్‌ను అంతరిక్షంలో ప్రవేశపెట్టనున్నాము. సాక్షి : అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త పద్ధతులు ఏమైనా అవలంబిస్తున్నారా? వరప్రసాద్ : పర్యావరణానికి ముప్పు కలగకుండా, జీవరాశులకు నష్టం వాటిల్లకుండా సమాజంలో సాంకేతికతను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సాక్షి : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ముఖ్య ఉద్దేశ్యమా? వరప్రసాద్ : శాంతి ప్రయోజనాల కోసమే ప్రయోగాలన్నది ఐక్యరాజ్య సమితి ముఖ్య ఉద్దేశ్యం. దానికోసం 1967 అక్టోబర్ 10న ఒప్పందం జరిగింది. సాక్షి : అంతరిక్ష వారోత్సవాల ఉద్దేశ్యమేమిటి? వరప్రసాద్ : నేటికీ చాలామందికి అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే ఉపగ్రహాల పనితీరు, వాటి ఉపయోగాల గురించి తెలీదు. సామాన్య మానవుడికి సహితం అర్థమయ్యే రీతిలో అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు వీడియోలు ప్రదర్శిస్తాం. వీటికి జిల్లాలవారీగా విద్యాసంస్థలను ఎంచుకుని ఆ ప్రాంత ప్రజలను, విద్యార్థులను చైతన్యవంతం చేస్తాము. -
పింఛన్ల పంపిణీలో జిల్లా నాలుగో స్థానం
ప్రత్తిపాడు : రాష్ట్రంలో వృద్ధాప్య, వితంతు, వికలాంగ తదితర పింఛన్లను పంపిణీలో తూర్పు గోదావరి జిల్లా నాలుగో స్థానంలో ఉందని డీఆర్డీఏ ఏపీడీ ఎన్.సోమేశ్వరరావు తెలిపారు. కృష్ణా, చిత్తూరు, కర్నూలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. ప్రత్తిపాడు ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలో జరిగిన పింఛన్ల పంపిణీ పై గురువారం పరిశీలన జరిపారు. స్మార్ట్ సర్వే మూలంగా ప్రతి నెలా ఐదో తేదీ నాటికి పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తున్నామన్నారు. బయోమెట్రిక్ విఫలమైన లబ్ధిదారులు మీసేవా కేంద్రంలో బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని సోమేశ్వరరావు సూచించారు. -
ప్రయోగం ముగిసిందా!
నాలుగో స్థానంలో యువీతో పాటు ప్రత్యామ్నాయ బ్యాట్స్‌మెన్ ఉంటే బాగుంటుందంటూ రైనాకు కెప్టెన్ ప్రమోషన్ ఇచ్చాడు. సాధారణంగా తాను తీసుకునే నిర్ణయాలను దీర్ఘ కాలం పాటు కొనసాగించే ధోని ఇంత తొందరగా ఎందుకు మనసు మార్చుకున్నాడు... ప్రయోగాన్ని ఒక్క సిరీస్‌కే ఎందుకు పరిమితం చేశాడు. రైనా అక్కడ పనికి రాడని కెప్టెన్‌కు అప్పుడే అర్థమైందా..! గతంలో ఒకసారి... కెరీర్ ఆరంభంలో రైనా 13 వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడాడు. ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు సహా 476 పరుగులు చేశాడు. దాంతో మరింత ముందుగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని కూడా ఆశించినా... అప్పటికే కోహ్లి చెలరేగి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దాంతో దిగువ స్థానంలో సెటిల్ కావాల్సి వచ్చింది. చివర్లో కొన్ని మెరుపులకంటే సెంచరీలు చేస్తేనే పేరు వస్తుందని రైనా గట్టి నమ్మకం. పెద్ద సంఖ్యలో (ప్రస్తుతం 182) వన్డేలు ఆడినా మూడే సెంచరీలు ఉండటం పట్ల అతను స్వయంగా తనపై తానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత ముందు ఆడాలనే మనసులో మాట గతేడాది బయట పెట్టాడు. ఆకట్టుకోలేదు... ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రైనా నాలుగు ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 39, 17, 16, 28 పరుగులు చేశాడు. తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నా దానిని అతను ఉపయోగించుకోలేకపోయాడు. అన్నింటికి మించి అతను అవుటైన తీరు రైనా సామర్థ్యంపై సందేహాలు రేకెత్తిస్తోంది. మ్యాచ్ కీలక దశలో, నిలదొక్కుకున్నాక అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. స్లాగ్ ఓవర్లలో తనకు అలవాటైన తరహాలో బ్యాట్ ఝళిపించబోయి వెనుదిరిగాడు. శైలి అదే... సాధారణంగా రైనాది దూకుడు శైలి. భారత్ సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా ఉన్నా... పోషించిన పాత్ర పరిధి చిన్నది. చివర్లో వచ్చి ధాటిగా ఆడుతూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు జత చేసి నాటౌట్‌గా నిలవడం తప్ప అతను క్రీజ్‌లో ఎక్కువ సేపు గడిపింది లేదు. అతని బెస్ట్ ఇన్నింగ్స్‌ను తీసుకుంటే ఉన్న కొద్ది సేపట్లోనే మెరుపులు మెరిపించినవే ఎక్కువగా కనిపిస్తాయి. టి20ల్లో ఉత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ ఎడమ చేతివాటం క్రికెటర్... వన్డేల్లో పొట్టి ఫార్మాట్ తరహాలోనే ఆడుతున్నాడు. ఆ స్థానం ప్రత్యేకం.... వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేవలం తాను పరుగులు చేయడం కాదు సహచరులతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. యువరాజ్ తన కెరీర్లో ఇలాంటివి చాలా సార్లు చేశాడు. టి20ల తరహాలో సిక్సర్లు బాదడమే కాదు... అవసరమైతే ఒక్కో పరుగు జోడిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం అతనిలో ఉంది. షార్ట్ పిచ్ తరహా బంతులు ఎదురైతే దాని పని పట్టాలన్నట్లు రైనా మొండిగా ఆడి అవుటైతే...అది కాదంటే మరో బంతిని చూసుకోవచ్చు అనే తరహాలో జాగ్రత్తగా ఆడటం యువీ నైజం. అన్నింటికి మించి నిలదొక్కుకున్న ఆటగాడు మధ్యలో కాడి పడేయకుండా జట్టును విజయం వరకు తీసుకెళ్లడం అనేది ముఖ్యం. ఇప్పుడేమిటి.... ఈ లక్షణాలన్నీ రైనాతో పోలిస్తే యువరాజ్లో మెరుగ్గా ఉన్నాయి. ధోని దీనిని తొందరగానే గుర్తించాడో, లేక రైనానే నా వల్ల కాదంటూ వెనకడుగు వేశాడో కానీ వరల్డ్‌కప్ సన్నాహాలు అంటూ ధోని బహిరంగంగా ప్రకటించిన తొలి ప్రయోగం మాత్రం విఫలమైంది. వరల్డ్ కప్ వైపు సాగాలంటే యువీ ఎంత కీలకమో కెప్టెన్‌కు బాగా తెలుసు. అందుకే అనవసరపు సందేహాలు సృష్టించకుండా ఉండేందుకు ఒక్క సిరీస్ ముగియగానే అతనికి అచ్చొచ్చిన స్థానాన్ని అప్పగించాడు. అయితే ఇప్పుడు ఒకే సారి యువరాజ్, రైనా విఫలం అవుతుండటం మాత్రం కలవరపెట్టేదే. అప్పుడు మరో కొత్త ఆటగాడిని ఈ స్థానంలో పరీక్షించేందుకు ధోని సాహసిస్తాడా అనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఈ సాహసం చేయకపోవచ్చు.