చెన్నై: సెయింట్ లూయిస్ ర్యాపిడ్, బ్లిట్జ్ అంతర్జాతీయ ఆన్‌లైన్ చెస్ టోర్నమెంట్‌లో ర్యాపిడ్ విభాగంలో భారత రెండో ర్యాంకర్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచాడు. పది మంది మేటి గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో హరికృష్ణ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత తొమ్మిది పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. ఏడో గేమ్‌లో హరికృష్ణ 66 ఎత్తుల్లో జెఫ్రీ జియాంగ్ (అమెరికా)పై గెలుపొందాడు. హికారు నకముర (అమెరికా)తో జరిగిన ఎనిమిదో గేమ్‌ను 56 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్న హరికృష్ణ తొమ్మిదో గేమ్‌లో 69 ఎత్తుల్లో సో వెస్లీ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో బ్లిట్జ్ విభాగం గేమ్‌లు జరగాల్సి ఉన్నాయి. బ్లిట్జ్ గేమ్‌లు ముగిశాక ఓవరాల్ పాయింట్ల ఆధారంగా విజేతలను ప్రకటిస్తారు. ప్రస్తుతం ర్యాపిడ్ విభాగంలో సో వెస్లీ 13 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment