ప్రయోగం ముగిసిందా!
నాలుగో స్థానంలో యువీతో పాటు ప్రత్యామ్నాయ బ్యాట్స్‌మెన్ ఉంటే బాగుంటుందంటూ రైనాకు కెప్టెన్ ప్రమోషన్ ఇచ్చాడు. సాధారణంగా తాను తీసుకునే నిర్ణయాలను దీర్ఘ కాలం పాటు కొనసాగించే ధోని ఇంత తొందరగా ఎందుకు మనసు మార్చుకున్నాడు... ప్రయోగాన్ని ఒక్క సిరీస్‌కే ఎందుకు పరిమితం చేశాడు. రైనా అక్కడ పనికి రాడని కెప్టెన్‌కు అప్పుడే అర్థమైందా..!
గతంలో ఒకసారి...
కెరీర్ ఆరంభంలో రైనా 13 వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడాడు. ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు సహా 476 పరుగులు చేశాడు. దాంతో మరింత ముందుగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాలని కూడా ఆశించినా... అప్పటికే కోహ్లి చెలరేగి తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. దాంతో దిగువ స్థానంలో సెటిల్ కావాల్సి వచ్చింది. చివర్లో కొన్ని మెరుపులకంటే సెంచరీలు చేస్తేనే పేరు వస్తుందని రైనా గట్టి నమ్మకం. పెద్ద సంఖ్యలో (ప్రస్తుతం 182) వన్డేలు ఆడినా మూడే సెంచరీలు ఉండటం పట్ల అతను స్వయంగా తనపై తానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరింత ముందు ఆడాలనే మనసులో మాట గతేడాది బయట పెట్టాడు.
ఆకట్టుకోలేదు...
ఆస్ట్రేలియాతో సిరీస్‌లో రైనా నాలుగు ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 39, 17, 16, 28 పరుగులు చేశాడు. తగినన్ని ఓవర్లు అందుబాటులో ఉన్నా దానిని అతను ఉపయోగించుకోలేకపోయాడు. అన్నింటికి మించి అతను అవుటైన తీరు రైనా సామర్థ్యంపై సందేహాలు రేకెత్తిస్తోంది. మ్యాచ్ కీలక దశలో, నిలదొక్కుకున్నాక అనవసరపు షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. స్లాగ్ ఓవర్లలో తనకు అలవాటైన తరహాలో బ్యాట్ ఝళిపించబోయి వెనుదిరిగాడు.
శైలి అదే...
సాధారణంగా రైనాది దూకుడు శైలి. భారత్ సాధించిన అనేక విజయాల్లో అతను భాగంగా ఉన్నా... పోషించిన పాత్ర పరిధి చిన్నది. చివర్లో వచ్చి ధాటిగా ఆడుతూ తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు జత చేసి నాటౌట్‌గా నిలవడం తప్ప అతను క్రీజ్‌లో ఎక్కువ సేపు గడిపింది లేదు. అతని బెస్ట్ ఇన్నింగ్స్‌ను తీసుకుంటే ఉన్న కొద్ది సేపట్లోనే మెరుపులు మెరిపించినవే ఎక్కువగా కనిపిస్తాయి. టి20ల్లో ఉత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ఈ ఎడమ చేతివాటం క్రికెటర్... వన్డేల్లో పొట్టి ఫార్మాట్ తరహాలోనే ఆడుతున్నాడు.
ఆ స్థానం ప్రత్యేకం....
వన్డేల్లో నాలుగో స్థానంలో ఆడే ఆటగాడు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. కేవలం తాను పరుగులు చేయడం కాదు సహచరులతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించడం ముఖ్యం. యువరాజ్ తన కెరీర్‌లో ఇలాంటివి చాలా సార్లు చేశాడు. టి20ల తరహాలో సిక్సర్లు బాదడమే కాదు... అవసరమైతే ఒక్కో పరుగు జోడిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం అతనిలో ఉంది. షార్ట్ పిచ్ తరహా బంతులు ఎదురైతే దాని పని పట్టాలన్నట్లు రైనా మొండిగా ఆడి అవుటైతే...అది కాదంటే మరో బంతిని చూసుకోవచ్చు అనే తరహాలో జాగ్రత్తగా ఆడటం యువీ నైజం. అన్నింటికి మించి నిలదొక్కుకున్న ఆటగాడు మధ్యలో కాడి పడేయకుండా జట్టును విజయం వరకు తీసుకెళ్లడం అనేది ముఖ్యం.
ఇప్పుడేమిటి....
ఈ లక్షణాలన్నీ రైనాతో పోలిస్తే యువరాజ్‌లో మెరుగ్గా ఉన్నాయి. ధోని దీనిని తొందరగానే గుర్తించాడో, లేక రైనానే నా వల్ల కాదంటూ వెనకడుగు వేశాడో కానీ వరల్డ్‌కప్ సన్నాహాలు అంటూ ధోని బహిరంగంగా ప్రకటించిన తొలి ప్రయోగం మాత్రం విఫలమైంది. వరల్డ్ కప్ వైపు సాగాలంటే యువీ ఎంత కీలకమో కెప్టెన్‌కు బాగా తెలుసు. అందుకే అనవసరపు సందేహాలు సృష్టించకుండా ఉండేందుకు ఒక్క సిరీస్ ముగియగానే అతనికి అచ్చొచ్చిన స్థానాన్ని అప్పగించాడు. అయితే ఇప్పుడు ఒకే సారి యువరాజ్, రైనా విఫలం అవుతుండటం మాత్రం కలవరపెట్టేదే. అప్పుడు మరో కొత్త ఆటగాడిని ఈ స్థానంలో పరీక్షించేందుకు ధోని సాహసిస్తాడా అనేది ఆసక్తికరం. దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఈ సాహసం చేయకపోవచ్చు.