భారత ‘దిగ్గజ’ క్రికెటర్లు యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా తీరుపై పారాలింపిక్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. లెజెండ్స్ నుంచి ఇలాంటి అమానుషమైన, చెత్త ప్రవర్తనను ఊహించలేదంటూ ఘాటుగా విమర్శించింది.
క్రికెట్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథాన్ని వ్యాప్తి చేయాల్సింది పోయి.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికింది. అనుచితంగా వ్యవహరించిన కారణంగా వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ విజేతగా భారత్
విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్‌ను నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఇండియా చాంపియన్స్ జట్టుకు యువరాజ్ సింగ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, సురేశ్ రైనా తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఇక ఈ టీ20 టోర్నీలో భారత్- పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్‌కు చేరగా.. యువీ సేన గెలుపొందింది. వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 అరంగేట్ర టైటిల్ కైవసం చేసుకుంది.
ఈ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్ క్రికెట్‌లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.
అనుచిత ప్రవర్తన
ఈ వీడియో వైరల్‌కాగా పారాలింపిక్ ఇండియా కమిటీ తీవ్రంగా స్పందించింది. ‘‘ఏమాత్రం సున్నితత్వం లేని అనుచిత ప్రవర్తన ఇది. క్రికెట్ స్టార్ సెలబ్రిటీలుగా సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా మీ ప్రవర్తన ఉండాలి.
కానీ ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇలా గంతులు వేయడం బాధ్యతారాహిత్యం. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? దివ్యాంగుల పట్ల వివక్ష చూపడమే ఇది. ఇలాంటి చర్యలకు పాల్పడ్డందుకు వెంటనే క్షమాపణలు చెప్పండి’’ అని పారాలింపిక్ ఇండియా కమిటీ చురకలు అంటించింది.
ప్రముఖ పారా అథ్లెట్, బ్యాడ్మింటన్ స్టార్ మానసి జోషీ సైతం యువరాజ్, భజ్జీ, రైనా తీరును తప్పుబట్టారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరూ కూడా తమపై వస్తున్న విమర్శలకు ఇంతవరకు స్పందించలేదు. అయితే, విమర్శల నేపథ్యంలో యువీ ఈ వీడియోను డిలీట్ చేయడం గమనార్హం.
చదవండి: T20I Captain: టీమిండియా టీ20 కెప్టెన్‌గా వాళ్లిద్దరి మధ్యే పోటీ
Comments
Please login to add a commentAdd a comment