న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించిన దగ్గర్నుంచి కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కొంతకాలంగా సగటున ప్రతిరోజూ దాదాపుగా 10 వేల కేసులు నమోదు కావడంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3 లక్షలు దాటిపోయి ప్రపంచ జాబితాలో భారత్ నాలుగో స్థానానికి చేరుకుంది. అమెరికా, బ్రెజిల్, రష్యా తర్వాత స్థానంలో భారత్ ఉంది. 24 గంటల్లో 11,458 కేసులు నమోదయ్యాయి.
కరోనా వైరస్ బట్టబయలయ్యాక ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో మొత్తంగా కేసుల సంఖ్య 3,08,993కి చేరుకుంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల నుంచే అత్యధిక కేసులు రావడం ఆయా రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఇక మరణాల సంఖ్య చూస్తే ఒకే రోజు 386 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 8,884కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. అయితే రికవరీ రేటు భారీగా ఉండడం భారత్‌కు అత్యంత ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 49.9 శాతం మంది కోవిడ్ రోగులు కోలుకున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
హాట్ స్పాట్స్ ఇవే...
దేశంలో నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా అయిదు నగరాల నుంచే వస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, చెన్నై, థానే, అహ్మదాబాద్ నగరాలు కోవిడ్ హాట్‌స్పాట్‌లుగా మారాయి. ఈ నగరాలు సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నాయనే అంచనాలు ఆందోళనను మరింత పెంచుతున్నాయి.
► కోవిడ్ హాట్‌స్పాట్ నగరాల్లో ముంబై ముందుస్థానంలో ఉంది. 55,451 కేసులతో ముంబై నగరం స్వీడన్, నెదర్లాండ్స్, ఈజిప్టు, యూఏఈ వంటి దేశాలనే దాటేసింది.
► దేశ రాజధాని ఢిల్లీలో శనివారం నాటికి కోవిడ్–19 కేసులు 36,824కి చేరుకున్నాయి. మృతుల సంఖ్య 1,214గా నమోదైంది.
► దక్షిణ భారత్‌లోని చెన్నైలో కరోనా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 70 శాతం చెన్నై నుంచే వస్తున్నాయి. శనివారం నాటికి చెన్నైలో 27 వేల కేసులు ఉంటే, తమిళనాడులో కేసుల సంఖ్య 40,698కి చేరుకుంది.
► మహారాష్ట్రలోని థానే కోవిడ్–19కి కొత్త హాట్‌స్పాట్‌గా మారింది. ఈ పట్టణంలో ఏకంగా 16 వేల కేసులు నమోదైతే 400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు
► గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటివరకు 16 వేలకు పైగా కేసులు అహ్మదాబాద్‌లోనే నమోదయ్యాయి.
► మహారాష్ట్రలోనే మరో నగరం పుణేలో 11 వేల కేసులు నమోదయ్యాయి. దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా పేరున్న ఇండోర్ కూడా కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. ఇండోర్‌లో 4వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మధ్యప్రదేశ్‌లో మొత్తం కేసుల సంఖ్య 10 వేలు దాటేసింది.
10 రోజుల్లోనే లక్ష..
భారత్‌లో 100 కేసుల నుంచి మొదటి లక్ష కేసులు నమోదు కావడానికి 64 రోజులు పట్టింది. ఆ తర్వాత మరో 15 రోజుల్లో కేసులు రెండు లక్షలు దాటాయి. అప్పట్నుంచి కేవలం 10 రోజుల్లోనే భారత్‌లో కేసుల సంఖ్య 3 లక్షలు దాటడం కరోనా వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే కేసులు రెట్టింపు కావడానికి పట్టే సమయం కాస్త ఎక్కువ కావడం కొంతలో కొంత ఊరటని స్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పటివరకు 15.4 రోజుల్లో కేసులు రెట్టింపైతే ఇప్పుడది 17.4 రోజులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment