ముంబై: నాలుగేళ్ల క్రితం వన్డే వరల్డ్ కప్‌కు ముందు భారత జట్టు నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్ విషయంలో పెద్ద సమస్యను ఎదుర్కొంది. ఇప్పుడు కూడా కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాల నుంచి కోలుకోకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది.
మిడిలార్డర్‌లో కీలకమైన ఈ స్థానం విషయంలో నెలకొన్న అనిశ్చితి వాస్తవమేనని స్వయంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంగీకరించాడు. అయితే ప్రపంచకప్‌కు ముందు ఆసియా కప్ సమయానికి అంతా సర్దుకుంటుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘భారత జట్టులో నాలుగో స్థానం విషయంలో చాలా కాలంగా సమస్య ఉంది.
యువరాజ్ రిటైరయ్యాక ఎవరూ అక్కడ నిలదొక్కుకోలేకపోయారు. అయితే గత కొంత కాలంగా ఆ స్థానంలో ఆడుతున్న శ్రేయస్ మంచి ప్రదర్శన ఇచ్చాడు. అతని గణాంకాలూ బాగున్నాయి. అయితే అతను గాయపడటంతో వేర్వేరు ఆటగాళ్లతో ప్రయత్నించాల్సి వచ్చింది.
కీలక స్థానంలో ఆడే ఆటగాడు గాయపడినప్పుడు మళ్లీ కొత్తగా ప్రయత్నించాల్సి వస్తుంది. నేను కెప్టెన్ కాక ముందు కూడా ఇలాంటి పరిస్థితిని చూశాను’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. జట్టులో ఎవరి స్థానానికీ హామీ ఉండదని... గాయాల నుంచి కోలుకొని వచ్చిన తర్వాత కూడా ఆటగాళ్లు సత్తా చాటాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు.
‘రాహుల్, శ్రేయస్ నాలుగు నెలలుగా క్రికెట్ ఆడలేదు. గాయాలు, శస్త్రచికిత్సలు కొనసాగాయి. కోలుకొని వచ్చిన తర్వాత ఎవరికైనా అంత సులువు కాదు. అయితే మీ కోసం స్థానం సిద్ధంగా ఉందని ఎవరికీ చెప్పలేం. చోటు దక్కించుకునేందుకు అందరూ పోటీ పడాల్సిందే. త్వరలో జరిగే సెలక్షన్ కమిటీ సమావేశం కూర్పు విషయంలో చర్చిస్తాం’ అని కెప్టెన్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment