
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అరాచకం
రెండు నియోజకవర్గాల్లో ఇష్టానుసారం పేర్లు నమోదు
నాలుగు జిల్లాల్లో వేలాదిగా దొంగ ఓట్లను సిద్ధం చేసిన చంద్రబాబు
టీడీపీ ఎమ్మెల్యేలకు బాధ్యతలివ్వడంతో ఎక్కడికక్కడ ప్రలోభాలు
ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ దూరంగా ఉండడంతో ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు
సాక్షి, అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ అడ్డదారులను తొక్కుతోంది. సాధారణ ఎన్నికలను తలపించేలా రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ప్రలోభాలు, అడ్డగోలు వ్యవహరాలకు తెగిస్తోంది. ఉమ్మడి కష్ణా–గుంటూరు, తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. విద్యావంతులకు సంబంధించిన ఈ ఎన్నికను సైతం పూర్తి రాజకీయమయం చేసి ఆ స్థానాలను దక్కించుకునేందుకు బరితెగిస్తోంది.
నిజానికి.. ఆ రెండు సీట్లూ విద్యావంతులు, మేధావుల వేదికగా ఉన్న పీడీఎఫ్ అభ్యర్థుల సిట్టింగ్ స్థానాలు. కష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్సీగా విద్యావేత్త కేఎస్ లక్ష్మణరావు నాలుగోసారి పోటీలో ఉన్నారు. తూర్పు–పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఐ. వెంకటేశ్వరరావు పదవీకాలం ముగుస్తుండడంతో ఆయన స్థానంలో పీడీఎఫ్ తరఫున దిడ్ల వీరరాఘవరావును పోటీకి దింపారు.
ఈ పోటీకి వైఎస్సార్‌సీపీ దూరంగా ఉంటున్నట్లు ప్రకటించడంతో టీడీపీ ఇదే అదనుగా ఆ రెండు స్థానాలను అధికార బలంతో ఎలాగైనా చేజిక్కించుకునేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కేఎస్ లక్ష్మణరావుకు ప్రత్యర్థిగా గత ఎన్నికల్లో తెనాలి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడ్డ మాజీమంత్రి ఆలపాటి రాజా.. వీరరాఘవరావుకు పోటీగా కాకినాడ రూరల్ సీటు ఆశించి పొందలేకపోయిన పేరాబత్తుల రాజశేఖర్‌ను రంగంలోకి దించారు.
శిబిరాలు పెట్టి ఓట్లు చేర్పించిన టీడీపీ
ఎన్డీయే అభ్యర్థులుగా ప్రకటించిన వారి కోసం టీడీపీ నేతలు నాలుగు నెలలుగా నిబంధనలు మీరి పనిచేస్తున్నారు. మొదట నాలుగు ఉమ్మడి జిల్లాల్లోనూ వీధివిధినా శిబిరాలు పెట్టి మరీ అడ్డగోలుగా ఓటర్లను చేర్పించారు. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలకు చంద్రబాబు టార్గెట్లు పెట్టి నియోజకవర్గాల వారీగా తమకు అనుకూలంగా ఉండే ఓట్లను చేర్పించారు.
ఈ టార్గెట్లు అందుకోలేకపోయిన మంత్రులు, ఎమ్మెల్యేలపై చంద్రబాబు నేరుగా తిట్టిన సందర్భాలున్నాయి. టీడీపీ నేతలు, వారి కుటుంబాలు, స్నేహితులు, సానుభూతిపరులు.. ఇలా ఎవరిని పడితే వారిని పెద్దఎత్తున గ్రాడ్యుయేట్ ఓటర్లుగా చేర్పించారు. ఒకరి పేరుతోనే పదుల సంఖ్య ఓట్లను చేర్చి దొంగ ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు.. ఇతర గ్రాడ్యుయేట్ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు స్థానిక నేతల ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల నేతత్వంలో కులాలు, వర్గాల వారీగా ఆత్మీయ సమావేశాలు పెట్టి ప్రలోభాలకు గురిచేశారు. అలాగే, ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని, మీరు ఎవరికి ఓటు వేస్తున్నారంటూ ప్రతిరోజూ ఓటర్లకు వరుసగా ఐవీఆర్‌ఎస్ ఫోన్లు చేస్తున్నారు.
చాపకింద నీరులా ‘పీడీఎఫ్’ ప్రచారం..
మరోవైపు.. పీడీఎఫ్ అభ్యర్థులు లక్ష్మణరావు, వీరరాఘవరావు మాత్రం విద్యార్థులు, ఉద్యోగుల కోసం తాము చేసిన పోరాటాలు, వారి సమస్యలను ప్రస్తావిస్తూ చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలు, తటస్థులు, మేధావులు సైతం వీరికి మద్దతు పలుకుతున్నారు. కానీ, అధికారం అండ చూసుకుని దొంగ ఓట్లతో ఎలాగైనా గెలిచేందుకు టీడీపీ కుయుక్తులు పన్నుతోంది.
ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లు
ఈ క్రమంలో.. చాలాచోట్ల ఎన్డీయే అభ్యర్థులు చేర్పించిన దొంగ ఓట్ల బాగోతం బయటపడింది. కష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లులో ఒకే వ్యక్తి పేరుతో 14 ఓట్లు జాబితాలో దర్శనమివ్వడం విశేషం. గురజ ప్రకాష్‌రాజ్ అనే వ్యక్తి పేరు పక్కన ఇంటి పేర్లు, తండ్రి పేర్లు మార్చి ఇష్టారాజ్యంగా ఓట్లు చేర్పించేశారు.
అలాగే, తాడిగడపకు చెందిన చందు రాజారావు పేరుతో నాలుగు ఓట్లు చేర్పించారు. ఇలా ప్రతిచోటా టీడీపీ శ్రేణులు వేల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పించాయి. ఇంటి పేర్లు, అడ్రస్‌లు మార్చి ఒకే వ్యక్తి పేరుతో తప్పుడు ఓట్లు నమోదు చేయించాయి. పోలింగ్ రోజున ఆ ఓట్లను గుట్టుచప్పుడు కాకుండా వేసేందుకు నేతలు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment