
ఆరోగ్యశ్రీని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు
మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంజీవని వంటి ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్య సేవ) పథకాన్ని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వైద్య సేవ ట్రస్ట్‌లో బీమా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎఫ్‌పీ)ని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు రూ.2.5 లక్షల కవరేజీతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
రాష్ట్రాన్ని రెండు జోన్‌లుగా విభజించి బీమాకు టెండర్‌లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందకు వస్తున్నాయి. ఈ కుటుంబాలను సగంగా విభజించి శ్రీసత్యసాయి నుంచి గుంటూరు వరకూ ఒక జోన్, ఎన్టీఆర్ నుంచి శ్రీకాకుళం వరకూ మరో జోన్ కింద పరిగణించనున్నారని తెలిసింది.
ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేతికొచ్చాక సూపర్ సిక్స్‌ల తరహాలోనే బీమా హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని కుటుంబాలకే రూ.2.5 లక్షల మేర బీమా కల్పించనుంది.
బీమా.. ఒక విఫలయత్నం
దేశంలోనే మొదటిసారిగా రూ.25 లక్షల వరకూ కవరేజీతో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసింది. అప్పటి వరకూ రూ.5 లక్షల వరకూ ఉన్న కవరేజీని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకాకుండా 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో 1,059 ప్రొసీజర్‌లతో మొక్కుబడిగా అమలైన పథకాన్ని ఏకంగా 3,257 ప్రొసీజర్‌లతో బలోపేతం చేశారు.
తెల్లరేషన్ కార్డుదారులతో పాటు, రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధిలోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీమా విధానం విఫలమై తిరిగి ఏపీ తరహా ట్రస్ట్ విధానంలోకి మారారు. ఇప్పటికే పలు చోట్ల విఫలమైన ఒక విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తెచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment