brokers
-
రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో రైతుకు తీరని అన్యాయం జరుగుతోంది. అలా అనడం కంటే ప్రభుత్వమే రైతుకు అన్యాయం చేస్తోందని చెప్పడం కరెక్ట్. రైతుకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం.. కల్లాల్లో ధాన్యం పెట్టుకొని ధాన్యం విక్రయించడానికి ఎదురుచూసు్తన్న రైతు బలహీనతను ఆసరాగా చేసుకొని దళారులు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం అడ్డుకోకపోగా ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం మిల్లర్లు, దళారులతో కలిసి ధాన్యం రైతులకు దక్కాల్సిన సొమ్ములో నేరుగా 30% తినేస్తోంది. మిల్లర్లు–దళారుల దోపిడీని నిలువరించాల్సిన ప్రభుత్వ పెద్దలు.. ప్రచార ఆర్భాటానికి ధాన్యం సేకరణ అంశాన్ని ఉపయోగించుకుని జబ్బలు చరుచుకుంటున్నారు. దోపిడీ సాగుతున్న తీరు ఇలా..మద్దతు ధరలోనూ 30–40 శాతానికి పైగా లూటీరైతులకు చెల్లించాల్సిన కనీస మద్దతు ధరలో 30–40 శాతానికి పైగా లూటీ అవుతోంది. ఖరీఫ్ సీజన్లో 32.75 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించగా.. దాన్ని ఇటీవలే 37 లక్షల టన్నులకు పెంచారు. ఇప్పటివరకు 22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. మరో 15 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే 5.20 లక్షల టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉంది. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 2.50 లక్షల టన్నులు, ఎన్టీఆర్ జిల్లాలో లక్ష టన్నులు, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1.50 లక్షల టన్నులు సేకరించాల్సి ఉంది. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 90 శాతానికి పైగా రైతుల పేరిట దళారులే సేకరించారు. ఇప్పటివరకు తాము సేకరించామని చెబుతున్న ధాన్యానికి కనీస మద్దతు ధర ప్రకారం రైతులకు రూ.5,397 కోట్లు చెల్లించినట్టుగా చెబుతున్నారు. కానీ.. ఇందులో వివిధ రూపాల్లో రూ.1,618 కోట్లకు పైగా.. అంటే 30 శాతానికి పైగా స్వాహా అయినట్టు తెలుస్తోంది.మిల్లర్లతో కుమ్మక్కుమిల్లర్లతో కొనుగోలు కేంద్రాల సిబ్బంది కుమ్మక్కయ్యారు. ఆర్ఎస్కేలలో నిర్ధారించిన తేమ శాతానికి అమ్మించేలా మిల్లర్లను ఒప్పించాల్సింది పోయి, మిల్లర్లు నిర్ధారించిన తేమ శాతానికి అమ్ముకోవాలంటూ రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆర్ఎస్కేల్లో 17 శాతం ఉందని నిర్ధారించిన ధాన్యాన్ని మిల్లు దగ్గరకు తీసుకెళితే ధాన్యంలో ధూళి, దుమ్ము ఉందనే సాకుతో 18–20 శాతంగా నమోదు చేస్తున్నారు. దోపిడీ కోసమే ఇలా పొంతనలేని లెక్కలు చెబుతున్నారు. పొరుగు జిల్లాల నుంచి వచ్చే మిల్లర్లు సైతం 16–17 తేమ శాతం ఉన్న ధాన్యాన్ని 18–21 శాతం వరకు నిర్ధారించి మీకు నచ్చితే లోడింగ్ చేస్తాం, లేకుంటే పట్టుకెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు.దళారులు పంపిస్తే గంటలోనే అన్లోడింగ్దళారులు ప్రారంభంలో రైతులకు మద్దతు ధర 75 కేజీల బస్తాకు రూ.1,350 నుంచి రూ.1,500 మధ్య చెల్లించేవారు. ప్రస్తుతం కాస్త పెంచి రూ.1,500 నుంచి రూ.1,600 మధ్య చెల్లిస్తున్నారు. అదే ఎంటీయూ 1262, 1318 రకం ధాన్యానికైతే నేటికీ రూ.1,100 నుంచి రూ.1,300 మధ్యే చెల్లిస్తున్నారు. ఫలితంగా 75 కేజీల బస్తా దగ్గరే 125 నుంచి రూ.400 వరకు నష్టపోతున్నారు. ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు, మిల్లర్ల వేధింపులు తట్టుకోలేక చివరకు దళారులకే ధాన్యాన్ని ఇచ్చి మిల్లులకు పంపిస్తున్నారు. కాగా.. దళారులు తెచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు గంటలోనే అన్లోడ్ చేసుకుంటున్నారు. అదే రైతు నేరుగా తీసుకెళ్తే అన్‌లోడింగ్‌కు 24 నుంచి 48 గంటల సమయం పడుతోంది. మొహం చాటేస్తున్న మిల్లర్లువర్షాలతో ధాన్యంలో తేమ శాతం పెరిగిపోతోంది. ఎంత ఆరబెట్టినా మిల్లు వద్ద 25 శాతం కన్నా తక్కువ తేమ చూపడం లేదు. తేమ శాతం వంకతో మిల్లర్లు కొనేందుకు కూడా మొహం చాటేస్తున్నారు. ధాన్యం వ్యాపారులు 75 కేజీల బస్తాకు రూ.1,100.. మహా అయితే రూ.1,200కు మించి ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు దిక్కులు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ధాన్యం సొమ్ములు గంటలోనే జమ చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నప్పటికీ సాంకేతిక కారణాల సాకుతో 15 నుంచి నెల రోజుల వరకు వేచి చూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.పక్కదారి పడుతోందిలా..సాధారణంగా రైతులు కోసిన ధాన్యాన్ని 40 కేజీల చొప్పున బస్తాలలో కాటా వేస్తారు. గోనె సంచి బరువు మరో 500 గ్రాములు కలిపి 40.50 కేజీల చొప్పున కాటా వేయాలి. కానీ.. 41.50 కేజీల వరకు కాటా తూస్తున్నారు. అంటే కేవలం 40 కేజీల కిట్టీ దగ్గరే ఏకంగా కిలో చొప్పున టన్నుకు 25 కేజీలకుపైగా నష్టపోతున్నారు. అంటే కిలోకు రూ.23 చొప్పున 25 కిలోలకు రూ.575 చొప్పున ప్రతి టన్నుకూ రైతులకు నష్టం వాటిల్లుతోంది. ఇక తేమ శాతం విషయానికి వస్తే 17 శాతం వరకు తేమ ఉంటే పూర్తిస్థాయి మద్దతు ధర (క్వింటాకు రూ.2,300) చొప్పున చెల్లించాలి. కానీ.. బూతద్దం పెట్టి వెతికినా పూర్తిస్థాయి మద్దతు ధర రైతులకు దక్కడం లేదు. నిబంధనల ప్రకారం తేమ 17 శాతం ఉన్నా 75 కేజీల బస్తాకు కేజీన్నర నుంచి రెండున్నర కేజీల చొప్పున తరుగు మినహాయిస్తున్నారు. అంటే ఇక్కడ టన్నుకు 35–40 కేజీలు చొప్పున రూ.920 నష్టపోతున్నాడు. తేమ శాతం 17 దాటితే ఒక్కో శాతానికి రెండున్నర కేజీల వరకు తరుగు మినహాయిస్తున్నారు. 25 శాతం తేమ ఉంటే బస్తాకు 8–12 కేజీల చొప్పున కోత పడుతోంది. ఈ విధంగా టన్నుకు 140 కేజీల చొప్పున రూ.3,864 మేర రైతులకు నష్టం వాటిల్లుతోంది. నిబంధనల మేరకు తేమ శాతం ఉన్నా సరే టన్నుకు రూ.1,495 నష్టపోతుంటే.. తేమ శాతం గనుక 17–25 మధ్య ఉంటే టన్నుకు రూ.5,355 వరకు నష్టపోతున్నారు. అంటే టన్నుకు రూ.23 వేలు దక్కాల్సిన రైతులకు కేవలం సుమారు రూ.17 వేలు మాత్రమే దక్కుతోంది. మిగిలిన మొత్తం దళారులు, మిల్లర్లు స్వాహా చేస్తున్నారు. వారినుంచి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలు ముడుతున్నాయి.తేమ శాతంలో పొంతన లేని లెక్కలుధాన్యం కొనుగోలులో దోపిడీకి కూటమి ప్రభుత్వమే దగ్గరుండి ద్వారాలు తెరిచింది. దళారులు, మిల్లర్ల ప్రమేయం లేకుండా గడచిన ఐదేళ్లుగా అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరిగితే.. ప్రస్తుతం మిల్లర్ల కనుసన్నల్లోనే «కొనుగోళ్లు జరిగే పరిస్థితి నెలకొంది. తొలుత 25 శాతం వరకు తరుగు లేకుండానే తీసుకుంటామని తొలుత చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత మాటమార్చి 17 శాతం దాటితే ఐదు కేజీలు తరుగుతో తీసుకుంటామని ప్రకటించింది. చివరకు నిబంధనల మేరకు 17 శాతం తేమ ఉన్నా సరే పూర్తి మద్దతు ధర చెల్లించే పరిస్థితి కన్పించడం లేదు. గతంలో రైతు భరోసా కేంద్రాల్లో నిర్ధారించిన తేమ శాతమే ఫైనల్. అదే తేమ శాతానికి మద్దతు ధర లెక్కగట్టి రైతులకు జమ చేసేవారు. కానీ.. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కే)తో పాటు మిల్లుల వద్ద కూడా తేమ శాతాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ రెండుచోట్ల నిర్ధారిస్తున్న తేమ శాతానికి పొంతన లేకుండా పోతోంది.కాళ్లా వేళ్లా పడినా కొనడం లేదు ఈ రైతు పేరు గుడవర్తి వెంకట సుబ్బరాజు. బాపట్ల జిల్లా మంతెనవారిపాలేనికి చెందిన సుబ్బరాజు పదెకరాల్లో ఎంటీయూ–1262 రకం సాగు చేశారు. ఈ నెల 16న కోయగా.. ఎకరాకు 35 బస్తాల చొప్పున 350 బస్తాల దిగుబడి వచ్చింది. 8 రోజులు ఆరబెట్టి.. 24వ తేదీన రైతు సేవా కేంద్రంలో తేమ పరిశీలిస్తే 23 శాతం వచ్చింది. బాపట్ల ఉప్పరపాలెం రైసుమిల్లుకు అదే రోజున 100 బస్తాలను తోలితే 23 శాతం తేమ ఉందని 5 కేజీల తరుగుతో తీసుకున్నారు. బుధవారం మరో 200 బస్తాలు తీసుకెళ్తే 27 శాతం తేమ ఉంది. మీ ధాన్యం మాకొద్దని తెగేసి చెప్పారు. ‘తరుగు ఎంతైనా తీసుకోండి. మీకు నచ్చిన ధర ఇచ్చి ధాన్యం దింపుకోండ’ని కాళ్లావేళ్లా పడినా మిల్లు యాజమాన్యం పట్టించుకోలేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే.. మిల్లర్ ఏం చెబితే అదే ఫైనల్ అన్నారు. వాతావరణం చూస్తే గంటకోలా మారుతోంది. చేసేది లేక టార్పాలిన్లు అద్దెకు తెచ్చి మిల్లు ఎదుటే ట్రాక్టర్లో ఉన్న ధాన్యం బస్తాలపై కప్పి అక్కడే పడిగాపులు పడుతున్నాను. ఉదయం నుంచి తిండీ తిప్పల్లేవు. ఏంచేయాలో పాలుపోవడం లేద’ని సుబ్బరాజు కన్నీరుమున్నీరయ్యారు.బస్తాకు రూ.1,470కు మించి ఇవ్వడం లేదు ఈ రైతు పేరు కొండవీటి వెంకటసుబ్బారావు. కృష్ణా జిల్లా మంతెనకు చెందిన ఈయన నాలుగు ఎకరాల్లో ఎంటీయూ–2077 వరి సాగు చేసారు. బుడమేరు ముంపు వల్ల ఎకరాకు 30 బస్తాలకు మించి రాలేదు. రైతు సేవా కేంద్రానికి శాంపిల్ తీసుకెళ్లి తేమ శాతం చూడమంటే.. ‘అవసరం లేదు నేరుగా మిల్లుకు తీసుకుపొండి..అక్కడ వాళ్లు చెప్పిన తేమ శాతమే ఫైనల్’ అని కొనుగోలు కేంద్రం సిబ్బంది బదులిచ్చారు. దీంతో దాములూరులోని బాలాజీ రైస్‌మిల్లుకు 213 (ఒక్కొక్కటీ 40 కేజీల) బస్తాలు తీసుకెళితే 24 శాతం తేమ వచ్చింది. రెండో రోజు మరో 105 బస్తాలు తీసుకెళితే 26 శాతం వచ్చిందని చెప్పారు. దాదాపు 8 కేజీలు తరుగు తీసేశారు. 75 కేజీల బస్తాకు రూ.1,470 చొప్పున ఇస్తామన్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. కనీసం పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి కనిపించడం లేదు’ అని సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు.పొంతన లేని తేమ లెక్కలు ఈ రైతు పేరు గుడిపూడి అవినాశ్. ఏలూరు జిల్లా దెందులూరుకు చెందిన ఈయన ఐదెకరాల్లో ఎంటీయూ–1318 రకం సాగు చేశారు. ఎకరాకు 33 బస్తాల దిగుబడివచ్చింది. 18న కోత కోయగా.. 23న రైతు సేవా కేంద్రంలో 17 శాతం తేమ వచ్చింది. అదే రోజున మారుతి మిల్లుకు 154 బస్తాలు తరలిస్తే.. అక్కడ తేమ శాతం 19గా చూపించారు. 75 కేజీల బస్తాకు రూ.1,725 ఇవ్వాల్సి ఉండగా.. రూ.1,650 చొప్పున ఇచ్చారు. రైతు సేవాకేంద్రంలో చెబుతున్న తేమ శాతానికి మిల్లులో చెబుతున్న తేమ శాతానికి పొంతన ఉండడం లేదు. ఇదేమిటని అడిగితే మీకు నచ్చకపోతే తీసుకెళ్లిపోవచ్చని మిల్లర్ చెబుతున్నారు. -
సోయా...ఇదేం ధరయ్యా?
సాక్షి, హైదరాబాద్: సోయా రైతులను దళారులు దగా చే స్తున్నారు. వానాకాలం సీజన్లో సాగు చేసిన సోయాబీన్ పంటకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,892 కాగా, వ్యాపారులు మాత్రం రూ.3,9 80 నుంచి గరిష్టంగా రూ. 4,100 వరకు మాత్రమే కొంటున్నారు. దీంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. కొన్నిచోట్ల గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఉత్పత్తిలో నాలుగో వంతే కొనుగోలు తెలంగాణలో సోయాబీన్ కీలకమైన పంట. వరి, పత్తి, మొక్కజొన్న, కంది తర్వాత అత్యధికంగా సాగయ్యేది సోయాబీనే. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 4 లక్షల ఎకరాల్లో సోయాబీన్ సాగు చేశారు. అత్యధికంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ప్రస్తుత సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో సోయాబీన్ సాగైంది. ఈ ఏడాది 2.60 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే కేంద్ర ప్రభు త్వం మాత్రం 56,550 మెట్రిక్ టన్నులు మాత్రమే కొను గోలుకు అంగీకరించింది. ఆ నిర్ణీత పరిమాణంలో మాత్ర మే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు అంటున్నారు. అంటే మొత్తం ఉత్పత్తిలో కేవలం నాలుగోవంతే కొనుగోలు చేయడం వల్ల, మిగిలిన పంటను తిరిగి వ్యా పారులకే తెగనమ్ముకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. కాగా, మిగిలిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేలా తాము ప్రతిపాదనలు పంపిస్తామని మార్క్‌ఫెడ్ వర్గాలు వెల్లడించాయి. 13 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంతో మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగింది. నిజామాబాద్, కామారె డ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి జిల్లాలో 37 సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. అవసరాన్ని బట్టి మిగిలిన కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రైతులకు మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్‌రెడ్డి, సేకరణ విభాగం ఇన్చార్జ్ చంద్రశేఖర్ తెలిపారు. -
ఆన్లైన్ బు'కింగ్'లు
రైల్వే తత్కాల్ టికెట్లు ఓపెన్ అవగానే నిమిషాల్లో రిజర్వేషన్లు అయిపోవడం చాలామందికి అనుభవమే. కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి టీటీడీ ఆన్లైన్ టికెట్లు విడుదల చేయగానే హాట్ కేకుల్లా భక్తులు తన్నుకుపోతూంటారు. ఇదీ అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే కోవలో అన్నవరం దేవస్థానంలో పలువురు దళారీలు దందా సాగిస్తున్నారు.అన్నవరం: భక్తవరదుడైన రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి ప్రతి రోజూ వేలాదిగా భక్తులు వస్తూంటారు. పలువురు దేవస్థానం సత్రాల్లో గదులు బుక్ చేసుకుని, రాత్రి బస ఉండి.. మర్నాడు వ్రతాలు, ఇతర పూజలు చేయించుకుని వెళ్తూంటారు. పర్వదినాలు, వివాహాల సీజన్లో అయితే రత్నగిరిపై సత్రం గదులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గదులు లభ్యం కాక అనేక మంది భక్తులు కొండ దిగువన డబ్బులిచ్చుకుని ప్రైవేటు సత్రాల్లో బస చేస్తారు. అంత ఖర్చు భరించలేని వారు గత్యంతరం కొండ పైనే ఎక్కడో ఒక చోట కాలక్షేపం చేస్తూ.. ఇబ్బందులు పడుతూంటారు. ఇలా రత్నగిరిపై అవసరమైన భక్తులకు సత్రం గదులు దొరకకపోవడానికి దళారీల దందాయే కారణమవుతోంది. ఏం జరుగుతోందంటే.. అన్నవరం దేవస్థానంలో ప్రకాష్ సదన్ మినహా మిగిలిన అన్ని సత్రాల్లో 30 శాతం గదులను ఆన్లైన్లో రిజర్వ్ చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. వీటిలో రూ.200 చార్జీ చేసే సీతారామ సత్రం నుంచి రూ.1,650 అద్దె కలిగిన శివసదన్ (ఏసీ) వరకూ ఉన్నాయి. దేవస్థానంలోని అన్ని సత్రాల్లోనూ 600 గదులున్నాయి. వాటిలో ప్రకాష్ సదన్‌లోని 64 గదులు మినహా మిగిలినవి 536. వీటిలోనూ 60 గదులు మరమ్మతుల్లో ఉన్నాయి. మిగిలిన 476లో 145 గదులకు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. ఎక్కువగా పర్వదినాలు, వివాహాల సీజన్లో అధిక సంఖ్యలో భక్తులు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకుంటారు. సంబంధిత వెబ్‌సైట్‌ను అధికారులు నెల రోజులు ముందుగా అర్ధరాత్రి 12 గంటలకు ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ అయిన రెండు మూడు నిమిషాల్లోనే దేవస్థానం సత్రాల్లో ఖాళీగా ఉన్న గదులను రిజర్వ్ అయిపోతున్నాయి. ప్రధానంగా ఎక్కువ మంది దళారీలే వివిధ పేర్లతో ఆన్లైన్లో రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. దీంతో గదులు అవసరమున్న భక్తులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ ఇలా.. దేవస్థానంలో ఆన్లైన్లో గదులు రిజర్వ్ చేసుకోవడానికి గూగుల్‌లో ఏపీటెంపుల్స్.ఏపీ.జీఓవీ.ఇన్ అని ఇంగ్లిషులో టైపు చేస్తే సంబంధిత సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవస్థానాల వివరాలు కనిపిస్తాయి. ‘శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం’ మీద క్లిక్ చేస్తే వెంటనే సత్యదేవుని సన్నిధిలో అకామిడేషన్, దర్శనం తదితర ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో ‘అకామిడేషన్’ క్లిక్ చేస్తే దేవస్థానంలో వివిధ సత్రాలు, వాటిలో ఖాళీ గదుల వివరాలు కనిపిస్తాయి. వెంటనే ఏ సత్రంలో గది కావాలో క్లిక్ చేస్తే వెంటనే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆ నంబర్ అప్లోడ్ చేసిన వెంటనే సంబంధిత ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని అప్లోడ్ చేయగానే యూజర్ ఐడీ వస్తుంది. దాని ద్వారా రూము కోసం అప్లికేషన్ వస్తుంది. అందులో వివరాలు పొందుపరచాలి. ఒక ఆధార్ కార్డుతో నిర్దేశిత మొత్తం చెల్లించి, ఒక రూము మాత్రమే రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక యూజర్ ఐడీతో మరో ఆధార్ కార్డు అప్లోడ్ చేసి, మరో రూము తీసుకునే అవకాశం కూడా ఉంది. దళారీలకు అడ్డుకట్ట వేయాలి అన్నవరం దేవస్థానంలో ఆన్లైన్లో వసతి గదులు రిజర్వ్ చేసుకునే భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు దళారులు వెబ్సైట్లో రూములు ఓపెన్ అయిన వెంటనే నిమిషాల వ్యవధిలోనే రిజర్వ్ చేసుకుంటున్నారు. అటువంటి దళారీలకు అడ్డుకట్ట వేసి, అవసరమైన భక్తులకే గదులు లభ్యమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొండపల్లి అప్పారావు, భక్తుడు, అన్నవరం అంతా నిమిషాల్లోనే.. సాధారణంగా ఎవరైనా సత్రం గదుల రిజర్వేషన్ కోసం ఈ ప్రొïసీజర్ అంతా పూర్తి చేసి, రూమ్ రిజర్వ్ చేసుకోవడానికి కనీసం ఐదు నిమిషాలు పడుతుంది. అయితే సైట్ ఓపెన్ అయిన రెండు నిమిషాల్లోనే దళారీలు పలువురి ఆధార్ కార్డులు ఉపయోగించి రూములు రిజర్వ్ చేసేసుకుంటున్నారు. దీంతో మిగిలిన వారికి గదులు దొరకడం లేదు. అంతే కాదు.. ఒక్కోసారి దేవస్థానంలోని ఉద్యోగులకు కూడా ఆన్లైన్లో గదులు లభ్యం కాని పరిస్థితి. అటువంటి వారికి ఆ దళారీలు ఎర వేసి, దేవస్థానం గదులు ఇస్తూ.. వారి నుంచి అధిక మొత్తాలు గుంజుతున్నారు. వచ్చే నెల ఆరో తేదీ నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. ఆ మాసంలో ఎక్కువగా వివాహాలు జరగనున్నాయి. ఆ వివాహ ముహూర్తాలున్న తేదీల్లో ఇప్పటికే 30 శాతం గదులూ రిజర్వ్ అయిపోయాయి. అలా రిజర్వ్ చేసుకున్న వారు పెళ్లి బృందాలే అనుకుంటే పొరపాటే. దళారీలే పలువురి ఆధార్ కార్డులతో ఈ గదులు హస్తగతం చేసేసుకున్నారు. వివాహాల సీజన్లో విష్ణు సదన్ హాల్స్‌కు దగ్గరగా ఉండే హరిహర సదన్, సీతారామ, న్యూ సీసీ, ఓల్డ్ సీసీ వంటి సత్రాల్లోను గదులకు చాలా డిమాండ్ ఉంటుంది. దీనిని దళారీలు ఆన్లైన్ వేదికగా ‘క్యాష్’ చేసుకుంటున్నారు. ఏం చేయాలంటే.. దళారీలకు అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఎవరి ఆధార్‌తో గదులు రిజర్వ్ చేశారో వారి ఆధార్ కార్డు నకలు ఎవరు తెచ్చి చూపించినా రూము ఇచ్చేస్తున్నారు. దీనికి బదులు ఎవరి ఆధార్ కార్డుతో గది రిజర్వ్ చేసుకున్నారో ఆ వ్యక్తే స్వయంగా సెంట్రల్ రిజర్వేషన్ కార్యాలయానికి (సీఆర్ఓ) వచ్చి, ఆధార్ కార్డు చూపించి, గది తీసుకోవాలనే నిబంధన పెట్టాలని పలువురు సూచిస్తున్నారు. అలాగే, సత్రం గదుల రిజర్వేషన్‌కు గతంలో గది అద్దెలో 150 శాతం వసూలు చేసేవారు. ప్రస్తుతం 100 శాతం మాత్రమే వసూలు చేస్తున్నారు. అంటే సీఆర్ఓకు వచ్చి అద్దెకు తీసుకుంటే ఎంత చెల్లించాలో రిజర్వేషన్ చేయించుకున్నా అంతే మొత్తం చెల్లిస్తున్నారు. దీనిని 150 అంటే అద్దె కన్నా 50 శాతం ఎక్కువ వసూలు చేస్తే దళారీలకు కాస్త అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. -
ధాన్యం..దళారుల దోపిడీ
సాక్షి, హైదరాబాద్: వరికోతలు మొదలైనా, ఇంకా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కాలేదు. దీంతో రైతులు దళారులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో వరికోతలు పదిహేను రోజుల క్రితమే మొదలు కాగా, ఉమ్మడి కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కూడా కోతలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సమీపంలోని గ్రామాల రైతులు కోసిన పచ్చి ధాన్యాన్నే నేరుగా మిల్లులకు తీసుకొని వెళ్లి, వారిచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో రైతుల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం రైతులు దళారులనే నమ్ముకుంటున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్ధిపేట జిల్లాల్లో కూడా కోతలు షురూ అయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్‌లో 4.16 లక్షల ఎకరాల్లో వరిసాగు ఉమ్మడినిజామాబాద్ జిల్లాలో యాసంగి సీజన్లో 4.16లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. 11.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్థానిక అవసరాలకు నాణ్యమైన ధాన్యం రైస్‌మిల్లర్లు కొనుగోలు చేయగా, మిగతా 6 లక్షల మెట్రిక్ టన్నులను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే వర్ని, రుద్రూర్, మోస్రా, చందూర్, సిరికొండ, మోపాల్, ధర్పల్లి, డిచ్పల్లి, చాలా మండలాల్లో కోతలు ముమ్మరం అయ్యాయి. మిల్లర్లు, వ్యాపారులు సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌కు రూ.1,900 నుంచి రూ.2,300 వరకు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్‌లోని నాణ్యమైన ధాన్యాన్ని నల్లగొండ, మిర్యాలగూడ, ఏపీకి చెందిన మిల్లర్లు కూడా కొనుగోలు చేస్తున్నారు. పది రోజుల క్రితం క్వింటాలు ధాన్యానికి రూ. 2,500 ధర చెల్లించిన దళారులు ఇప్పుడు రూ.1,900 కే కొంటున్నారు. మిర్యాలగూడలోని 75 మిల్లులకు ధాన్యం ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా మిర్యాలగూడ రైస్ మిల్లులకు «ధాన్యం భారీగా వస్తోంది. మిర్యాలగూడలోని 87 రైస్‌మిల్లులు ఉండగా, ప్రస్తుతం 75 మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నారు. ఇటీవల మిల్లర్లు ధాన్యం కొనుగోళ్లకు ఆంక్షలు విధించగా, మంత్రి కోమటిరెడ్డి మిల్లుకు వచ్చిన ప్రతిరైతు నుంచి ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. అయితే తొలుత వ్యాపారులు మొదట క్వింటాల్‌కు రూ.2600 నుంచి రూ.2700 వరకు చెల్లించగా, ధాన్యం రాక పెరగడంతో వ్యాపారులు ధర తగ్గించారు. పెరిగిన ఎండల ధాటికి ట్రాక్టర్లతో ధాన్యం తెచ్చిన రైతుల నుంచి కొనుగోలు చేయకుండా సాయంత్రం వరకు వేచి ఉండేలా చేసి క్వింటాల్‌కు రూ.2100 నుంచి రూ.2,400 వరకు మాత్రమే ఇచ్చి కొనుగోలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సుమారు 2 లక్షల మెట్రిక్ టçన్నుల ధాన్యం కొనుగోలు చేశామ మిల్లర్లు చెబుతున్నారు. ప్రతి ఏడాది 4 నుంచి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని, ఈసారి పంట దిగుబడి ఆశించినంత రాకపోవడంతో 3లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినట్టు చెబుతున్నారు. ఏప్రిల్ ఒకటి నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు యాసంగి సీజన్‌కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహాన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7,149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 75.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేస్తే దళారుల బాధ తగ్గేదని, మిల్లర్ల ఇష్టారాజ్యానికి చెక్ పడేదని రైతులు అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ‘ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,203, ‘బి’ గ్రేడ్ కు రూ. 2,183 ధర వస్తుందని, మిల్లర్లు, దళారుల వల్ల కనీస మద్దతు ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. దళారులు తరుగు తీస్తున్నారనే ఆరోపణలున్నాయి. ధాన్యానికి డబ్బులు చెల్లించేటప్పుడు లక్ష రూపాయలకు రూ.1,000 చొప్పున కోత విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: రఘుమారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రలోభాలకు గురిచేసి డబ్బులు వసూలు చేసే దళారులు, సంస్థ సిబ్బంది మాటలు నమ్మి మోసపోవద్దని అభ్యర్థులకు సంస్థ సీఎండీ రఘుమారెడ్డి సూచించారు. జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) నియామకంలో నిర్ణిత అర్హతలు ఉండి, స్తంభాలు ఎక్కే (పోల్ క్లైంబింగ్) పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనుసరించి అత్యంత పారదర్శకంగా ఎంపిక జరుగుతుందని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్, రూల్ మాఫ్ రిజర్వేషన్స్‌ను ప్రామాణికంగా తీసుకుని అర్హులైన అభ్యర్థులకు ఈనెల 28 నుంచి వివిధ జిల్లా/సర్కిల్ కేంద్రాల్లో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, పోల్ క్లైంబింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లో పొందుపరిచామన్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఈ ఏడాది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. -
రైతు బంధు పక్కదారి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు బంధు పథకం సొమ్ము పక్కదారి పట్టింది. చనిపోయిన రైతులకు సంబంధించిన భూముల వివరాలను మార్చేసి, వేరేవారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ము పడేలా చేసి.. మొత్తం మింగేస్తున్న వైనం బయటపడింది. వ్యవసాయ శాఖ అధికారులు సూత్రధారులుగా, కొందరు దళారులు పాత్రధారులుగా మారి.. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదంట్లలో మూడేళ్లుగా ‘రైతు బంధు’ పథకం సొమ్మును దారి మళ్లించిన బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. చనిపోయారని తెలిస్తే.. ఖాతా మార్చేస్తూ.. సాధారణంగా భూములు ఎవరి పేరిట ఉంటే వారికి సంబంధించిన బ్యాంకు ఖాతాలో రైతు బంధు సొమ్మును ప్రభుత్వం జమ చేస్తుంది. కుటుంబంలో భూమి తమ పేరిట ఉన్న వ్యక్తులు చనిపోతే.. వారసులు ఆ భూమిని తమ పేరున పట్టా చేయించుకొని, రైతు బంధుకు దరఖాస్తు చేసుకుంటారు. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి చనిపోయిన వ్యక్తి స్థానంలో వారసుల పేరు, బ్యాంకు ఖాతా నంబర్‌ను లింక్ చేస్తారు. దాంతో వారి ఖాతాల్లో రైతు బంధు సొమ్ము జమ అవుతుంది. కానీ చందంపేట మండలంలో వ్యవసాయ శాఖ అధికారులు, కొందరు దళారులు కలసి అక్రమాలకు పాల్పడ్డారు. చనిపోయిన వారి భూముల వివరాలకు దళారుల బ్యాంకు ఖాతా నంబర్లను అనుసంధానం చేశారు. ఆ ఖాతాల్లో పడిన లక్షల రూపాయల సొమ్మును పంచుకున్నారు. మూడేళ్లుగా ఈ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమాల్లో కొన్ని.. ముడుదండ్ల గ్రామానికి చెందిన బొజ్జ జంగమ్మ అనే మహిళ పేరిట 4.09 ఎకరాల భూమి ఉండగా, ఆమె ఖాతాలో ఏటా రెండు పంట సీజన్లకు కలిపి రూ. 45వేల మేర రైతు బంధు సొమ్ము జమ అయ్యేది. రెండేళ్ల కింద ఆమె చనిపోయింది. అప్పటినుంచి రైతుబంధు సొమ్ము ఆగిపోయింది. కుటుంబ సభ్యులు భూమిని తమపేరిట మార్చుకోలేదు, జంగమ్మ చనిపోయిన విషయం తెలిసి ప్రభుత్వమే ఆపేసిందేమో అనుకున్నారు. కానీ అనుమానం వచ్చి పరిశీలిస్తే.. వ్యవసాయ శాఖ ఆన్లైన్ చేసిన రికార్డుల్లో బ్యాంకు ఖాతా నంబర్ మార్చేసిన విషయం బయటపడింది. ఇన్నిరోజులుగా స్టేట్‌బ్యాంకులో 39961058007 నంబర్ ఖాతాలో సొమ్ము జమ అవుతోంది. ఈ ఖాతాదారు పేరు కిషోర్నందయాదవ్గా ఉండటం గమనార్హం. గ్రామానికే చెందిన పెరికేటి రాఘవాచారి పేరిట 3.13 ఎకరాల భూమి ఉంది. ఏటా వచ్చే రూ.33 వేలు ఆయన చనిపోయాక జమ అవడం ఆగిపోయాయి. కుటుంబ సభ్యులు ఆరా తీయగా.. 2022లో, అంతకు ముందు రెండుసార్లు జక్కుల అలివేలు పేరిట ఉన్న ఖాతా (ఇండియన్ పోస్టల్ బ్యాంకు అకౌంట్ నంబర్ 052710108096)లో సొమ్ము జమైనట్టు గుర్తించారు. దీంతో వారసులు భూమిని తమపేరిట మారి్పంచుకుని, బ్యాంకు ఖాతాను లింక్ చేయించుకున్నారు. ఇదే గ్రామానికి చెందిన జక్కుల రామలింగమ్మ పేరిట రెండెకరాల భూమి ఉంది. ఏటా రూ.20వేలు ఆమెకు చెందిన గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాలో జమయ్యేవి. ఆమె చనిపోయాక అక్రమార్కులు అకౌంట్ నంబరు మార్చేశారు. జక్కుల మున్నయ్య పేరిట ఉన్న ఎస్బీఐ ఖాతా (20057909146)ను లింక్ చేసి సొమ్ము కాజేశారు. అంతేకాదు బతికే ఉన్న మరో రైతుకు సంబంధించిన రైతు బంధు సొమ్మును కూడా ఇదే ఖాతాలోకి మళ్లించి స్వాహా చేసినట్టు తేలింది. ఈ ఒక్క గ్రామం, మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరిగినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం బయటికి రాకుండా ‘బేరసారాలు’ రైతు బంధు సొమ్మును స్వాహా చేసిన వ్యవహారం లీకవడంతో లబ్ధిదారుల కుటుంబాలతో అక్రమార్కులు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. అక్రమాల విషయం బయట పెట్టకుండా ఉంటే డబ్బు ఇస్తామంటూ బేరసారాలకు దిగినట్టు స్థానికులు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులతో నేరుగా సంబంధం ఉండి.. రైతు బంధు అర్హులను గుర్తించడం, వారి బ్యాంక్ ఖాతాలను నిర్ధారించడం వంటి పనులు చేసే మండల స్థాయి వ్యవసాయ అధికారులే ఈ అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొంటున్నారు. -
జల దిగ్బంధంలో గజగజ
కుత్బుల్లాపూర్/సుభాష్‌నగర్: ఆ కాలనీ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ క్షణమొక యుగంగా గడుపుతున్నారు. చినుకు పడిందంటే ఈ కాలనీ ప్రజలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గాజుల రామారం డివిజన్లోని ఓక్షిత్ ఎన్‌క్లేవ్‌ను నాలుగు రోజులుగా జల వలయం వీడకపోవడంతో స్థానికులు నిద్రాహారాలు మాని కాలం వెళ్లదీస్తున్నారు. సమస్య ఉత్పన్నమైనప్పుడే అధికారులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారే తప్ప ఆ తర్వాత ఇటువైపు చూసిన పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వరద నీట మునిగింది. ఆదివారం వరకూ తేరుకోకపోవడంతో ఇక్కడి ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎందుకిలా..? సూరారం గ్రామాన్ని ఆనుకుని సర్వే నంబర్ 70, 71లలో 24.22 ఎకరాల్లో రామారం పెద్ద చెరువు విస్తరించి ఉంది. చెరువు ఎగువ ప్రాంతంలోని లింగా చెరువు, కొత్తచెరువు, ఎర్ర చెరువు, మానింగ్ ఒంపులలోని వర్షపు నీరు రామారం చెరువులో వచ్చి చేరుతోంది. భారీ వర్షం వచ్చినప్పుడు రామారం చెరువు ఉద్ధృతంగా ప్రవహించి పరిక చెరువులో కలుస్తోంది కట్టు కాల్వను ప్లాట్లుగా మార్చి.. వెంచర్ ప్రారంభంలో కాలనీలో ఉన్న మొత్తం ప్లాట్లు అమ్ముడుపోగా.. కొంతమంది కళ్లు కాలనీ నుంచి వెళ్తున్న 30 ఫీట్ల కట్టు కాల్వపై పడ్డాయి. దీనిని ప్లాట్లు చేసి రూ.కోట్లు గడించారు. ఏడేళ్ల క్రితం ప్లాటింగ్ చేస్తున్న సమయంలో మూడేళ్ల వరకు వర్షాలు అంతంత మాత్రమే పడడం, ఇరిగేషన్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారుల అండదండలు ఉండడంతో కట్టు కాల్వపై నిర్మాణాలు వెలిశాయి. కబ్జా బాగోతం వెలుగులోకి.. 2022లో భారీ వర్షాలు పడడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం లేక కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో కాలనీవాసులు రెండు నెలలుగా పడరాని పాట్లు పడ్డారు. ఈ విషయమై ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలన.. కట్టు కాలువ కబ్జా విషయమై గాజుల రామారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత ఏడాది మార్చి నెలలో గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్, రెవెన్యూ, హెచ్ఎండిఏ, పీసీబీ, ఫారెస్ట్, జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు పరిశీలించి వెళ్లారే తప్ప చర్యలు తీసుకోలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పరిశీలించిన అనంతరం 274 నిర్మాణాలు కట్టు కాల్వపై వెలిసినట్లు గుర్తించారు. వీటిలో 24 నిర్మాణాలను తక్షణమే తొలగించాలని మార్కింగ్ కూడా వేశారు. కానీ అంతటితోనే ఆపివేయడం గమనార్హం. ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.. ప్లాటు కొనుగోలు చేసేటప్పుడు కాలనీలో సకల సౌకర్యాలు కల్పిస్తామంటూ చెప్పారు. అసలు కట్టు కాల్వపై ప్లాట్లు చేశారనే విషయమే మాకు తెలియదు. గత ఏడాది నుంచి భారీ వర్షాలు పడటంతో కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంటోంది. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలి. – శంకరాచారి, ఓక్షిత్ ఎన్క్లేవ్ కాలనీ వాసి -
విదేశాలకు వెళ్లాలని ఆశ.. దళారులతో గోస..
జగిత్యాల: విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసాలు పెరిగిపోతున్నాయి. భారీ వేతనాలను ఆశ చూపుతూ రూ.లక్షలు వసూలు చేస్తున్న కొందరు దళారులు ఆ తర్వాత ముఖం చాటేస్తున్నారు. జిల్లాలో దాదాపు ప్రతీ గ్రామం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. అయితే కరోనా వల్ల అక్కడ ఉపాధి కోల్పోయి వేలాది మంది స్వగ్రామాలకు వచ్చారు. కొంతకాలంగా పరిస్థితులు మెరుగుపడడంతో గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో ఉపాధికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని పలువురు మోసాలకు పాల్పడుతున్నారు. మెట్పల్లి మండలం వేంపేటకు చెందిన యువకుడు న్యూజిలాండ్ వెళ్లడానికి ఢిలీలోని ఓ కన్సల్టెన్సీని సంప్రదించాడు. దాని నిర్వాహకుల సూచనతో ముందుగా రూ.3.50లక్షలు చెల్లించాడు. తర్వాత స్వగ్రామానికి వచ్చిన యువకుడు కొన్ని రోజులకు వారికి ఫోన్ చేయగా ఆ నంబర్ పని చేయలేదు. చివరకు ఢిల్లీకి వెళ్లి చూడగా అప్పటికే వారు బోర్డు తిప్పేశారు. గత్యంతరం లేక మరో రూ.లక్ష ఖర్చు చేసి కువైట్ వెళ్లాడు. రూ.లక్షల వేతనాలని ఆశ చూపుతూ.. ► గల్ఫ్ దేశాల్లో లేబర్ పనులకు రూ.20వేల నుంచి మొదలుకొని అత్యధికంగా రూ.50వేలకు మించి వేతనాలు లభించవు. ఇందుకు ఏజెంట్లు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. ► మలేసియా, సింగాపూర్, మాల్టా, ఆస్ట్రేలియా, న్యూజిలాంగ్, లిబియా, కెనడా తదితర దేశాల్లో రూ.లక్షన్నర నుంచి మొదలుకొని రూ.రెండు లక్షల వరకు వేతనాలు అందుతాయనే ప్రచారం ఉంది. వీసా కోసం బ్రోకర్లు రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ► ఆయా దేశాలకు వెళ్లడం ఖర్చుతో కూడుకున్నది అయినా రూ.లక్షల్లో వేతనాలు వస్తాయనే ఆశతో యువకులు అప్పు చేసి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. ► ఈ దేశాలకు హైదరాబాద్, చైన్నె, ఢిల్లీల్లో ఉన్న కన్సల్టెన్సీల ద్వారా స్థానిక బ్రోకర్లు పంపుతున్నారు. జిల్లాలో ఇప్పటికే వందలాది మంది ఆయా దేశాలకు వెళ్లినట్లు తెలిసింది. ఎన్నో విధాలుగా మోసాలు ► రూ.లక్షల వేతనాల కోసం ఆయా దేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వారిలో పలువురు కన్సల్టెన్సీలు, బ్రోకర్ల చేతిలో మోసాలకు గురవుతున్నారు. ► కన్సల్టెన్సీలు ముందుగానే వీసా ప్రక్రియ కోసం రూ.లక్షలు వసూలు చేసి ఆ తర్వాత పంపకుండా చేతులెత్తెస్తున్నాయి. ► మరోవైపు ఇతర దేశాలకు వెళ్లడానికి అవసరమైన విద్యార్హతలు లేని వారి కోసం బ్రోకర్లు నకిలీ సర్టిఫికెట్లను కూడా తయారు చేస్తున్నారు. ► ఇటీవల బ్రిటన్ వెళ్లడానికి ప్రయత్నించిన మెట్పల్లి యువకుడికి సంబంధింత బ్రోకర్ ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ తయారు చేశాడు. ఈ విషయాన్ని సదరు యువకుడు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బ్రోకర్‌తో పాటు అతడికి సహకరించిన మరో వ్యక్తిపై కేసు నమోదైంది. -
స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి పొందండి... ‘ఇదేం బాలేదు’
న్యూఢిల్లీ: కొన్ని బీమా బ్రోకింగ్ సంస్థలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడంపై పౌర సేవా సంస్థ ‘ప్రహర్’ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆన్లైన్లో పాలసీలను విక్రయించే కొన్ని నూతన తరం బీమా బ్రోకింగ్ కంపెనీలు.. కేవలం కొన్నేళ్ల పాటు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా రూ.కోటి మొత్తాన్ని పొందొచ్చంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో వివరించింది. (రూ. 2 వేల నోట్లు: ఆర్బీఐ కీలక ప్రకటన) గత ఆర్థిక ఫలితాల ఆధారంగా భవిష్యత్తు పనితీరును పాలసీదారులకు వెల్లడించరాదని బీమా రంగ ప్రకటనల చట్టంలోని సెక్షన్లు స్పష్టం చేస్తున్నట్టు గుర్తు చేసింది. అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకుండా సంబంధిత బీమా బ్రోకింగ్ సంస్థలను ఆదేశించాలని కేంద్ర ఆర్థిక శాఖ, బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ)ను కోరింది. (జియో మరో సంచలనం: రూ. 999కే ఫోన్, సరికొత్త ప్లాన్ కూడా) లేదంటే అలాంటి ప్రకటనలు బీమా పాలసీలను వక్రమార్గంలో విక్రయించడానికి దారితీస్తాయని, పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. పాలసీబజార్, ఇన్సూర్‌దేఖో మార్గదర్శకాలను ఉల్లంఘంచినట్టు ప్రహర్ తన లేఖలో ప్రస్తావించింది. అయితే తాము ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని సదరు సంస్థలు స్పష్టం చేశాయి. నియంత్రణ సంస్థలు ఏవైనా లోపాలను గుర్తిస్తే, వాటి ఆదేశాల మేరకు నడుచుకుంటామని ప్రకటించాయి. -
ఆర్ఎఫ్సీఎల్ కథ కంచికేనా..? బాధితులకు డబ్బులు అందుతాయా!
సాక్షి, కరీంనగర్: రామగుండం ఫెర్టిలైజర్స్ కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో కోట్లు దండుకున్న నలుగురు దళారులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఈ క్రమంలో ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు అందుతాయా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధితులతో రెండురోజులపాటు మాట్లాడి భరోసా కల్పించారు. కర్మాగారంలో శాశ్వత ఉద్యోగాల పేరుతో సుమారు రూ.45 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.12 లక్షల వరకు వసూలు చేసిన దళారులు.. బాధితుల వద్ద ఎలాంటి పత్రాలూ లేకుండా జాగ్రత్త పడ్డారు. కేవలం నోటిమాట ఆధారంగానే బాధితులు రూ.లక్షలు దళారుల చేతిలో పోశారు. దీంతో కార్మికుల్లో కొత్త ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో కొందరు “మీకు ఉద్యోగం కల్పించాం.. డబ్బులిచ్చేది లేదు..’ అని బాధితులతో గొడవకు దిగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వారం క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో దళారిపై పెట్రోల్ పోసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తాజాగా శుక్రవారం ముంజ హరీశ్ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో పోలీసులు దళారులుగా ఉన్న నలుగురుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. చదవండి: కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి? దళారులు ఎంతమంది..? ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగ నియామకంలో ఎంతమంది దళారులు, మధ్యవర్తులు ఉన్నారనే అంశం చర్చనీయాంశంగా మారింది. కొత్త కాంట్రాక్టర్ కార్మికులను తొలగించడంతో మోసపోయామని గ్రహించిన కార్మికులు ఏడు నెలలుగా పోరాటం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రమేయం ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టడంలో జాప్యం చేశారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. పర్మినెంట్ హమాలి పేరుతో నగదు దండుకున్న కార్మిక సంఘం నాయకుడిపై ఇప్పటివరకూ కేసు నమోదు కాలేదు. వీరితోపాటు మరికొందరు అధికార, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు ఉన్నారని ప్రచారం జపరుగుతోంది. ఎవరు చెల్లిస్తారు..? బాధితులకు ఇప్పుడు నగదు ఎవరు చెల్లిస్తారనే వ్యవహారంలో స్పష్టత లేకుండా పోయింది. రెండు రోజులుగా కోరుకంటి చందర్ తన క్యాంపు కార్యాలయంలో బాధితులతో సమావేశం నిర్వహించారు. ప్రధాన దళారులు అధికార పార్టీ నాయకులు కావడంతో బాధితులకు నగదు చెల్లించేలా కృషి చేస్తారో లేదో.. వేచి చూడాల్సి ఉంది. -
Hyderabad Railway Station: నాంపల్లి స్టేషన్ కాడా...
సాక్షి, హైదరాబాద్ : ఓవైపు కోవిడ్ విజృంభణ... మరోవైపు ప్రజల్లో మళ్లీ లాక్డౌన్ భయాలు... వెరసి నగరం నుంచి చాలామంది సొంతూళ్లకు బయల్దేరి వెళ్లిపోతున్నారు. ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని రైళ్లలో వెళ్లిపోయేవారికి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావడం లేదు కానీ తత్కాల్ టికెట్ల ద్వారా బుక్‌చేసుకుని వెళ్లానుకునే ప్రయాణికులకు మాత్రం ‘తత్కాల్ టికెట్ల దందా’చుక్కలు చూపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి)లో తత్కాల్ టికెట్ల దందా అడ్డూ అదుపులేకుండా సాగిపోతోంది. గతంలో తత్కాల్ టికెట్‌ను పొందేందుకు రైల్వే రిజర్వేషన్ కేంద్రానికి వచ్చిన వారికి టోకెన్లను అందజేసేది. ఈ టోకెన్ల కోసం ప్రయాణికులు రైల్వే స్టేషన్ వద్ద రాత్రంతా జాగారం చేసేవారు. అయితే ఈ టోకెన్ల విధానానికి హైదరాబాద్ రైల్వే స్టేషన్ స్వస్తి పలికింది. తత్కాల్ టికెట్ జారీ చేసే సమయానికి క్యూలో నిలబడిన వారిని తోసుకుని ఎవరెవరో ముందుకొచ్చేసి టికెట్ తీసేసుకుంటున్నారు. క్యూలో నిలబడిన వారందరికీ టికెట్ మాత్రం లభించడం లేదు. దీంతో ఎలాగైనా ప్రయాణం చేయాలనుకునేవారు తత్కాల్ టికెట్ల కోసం దళారుల్ని ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రయాణికుల అవసరాన్ని అదునుగా తీసుకున్న దళారులు రెట్టింపు ధరలతో వారి నుంచి వసూలు చేస్తున్నారు. రైల్వే ఉన్నతాధి కారులు తత్కాల్ టికెట్ల జారీపై దళారుల ప్రమేయం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడ చదవండి: ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్ వెంటిలేటర్ బెడ్స్ లేవ్.. గాంధీకి వెళ్లిపోండి! -
ఎంసీఎక్స్ ‘క్రూడ్’ తొండాట..!
న్యూఢిల్లీ/ముంబై: అమెరికా కమోడిటీ ఎక్సే్ఛంజ్(నైమెక్స్)లో క్రూడ్ మే నెల కాంట్రాక్టు ధర మైనస్ 37 డాలర్లకు పడిపోయినప్పటికీ.. మన మార్కెట్(ఎంసీఎక్స్) మాత్రం సొంత నిర్ణయాలతో ట్రేడర్లకు తీరని నష్టం మిగిల్చింది. లాంగ్ పొజిషన్లు తీసుకున్న కొంత మంది బడా బ్రోకర్లకు నష్టాలను తగ్గించేందుకు ఎంసీఎక్స్ గోల్మాల్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. వాస్తవానికి కరోనా లాక్డౌన్స్ నేపథ్యంలో ట్రేడింగ్ వేళలను కమోడిటీ ఎక్సే్ఛంజీలు సాయంత్రం 5 గంటల వరకు కుదించాయి. ఇక్కడ సోమవారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు ధర రూ.965 వద్ద ముగిసింది. అయితే, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో క్రూడ్ ధర మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది. దీనిప్రకారం చూస్తే మన మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెటిల్మెంట్ ధర క్రితం ముగింపు, మైనస్ 37.63 డాలర్ల చొప్పున రూ.2,860 కలుపుకొని సుమారు రూ.3,825 డాలర్ల వద్ద సెటిల్ చేయాల్సింది. అయితే, ఎంసీఎక్స్ మాత్రం సెటిల్మెంట్ ధరను రూ.1గా నిర్దేశించింది. మంగళవారంతో గడువు ముగిసే ఈ ఏప్రిల్ కాంట్రాక్టులో 11,522 ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. ఒక్కో పొజిషన్ 100 బ్యారెల్స్ క్రూడ్‌కు సమానం. దీని ప్రకారం 11,52,200 బ్యారెల్స్ విక్రయించిన వారికి(షార్ట్ సెల్లర్స్) రూ.3,825 చొప్పున రూ.440 కోట్లు లాంగ్పొజిషన్ తీసుకున్న ట్రేడర్ల నుంచి సెటిల్మెంట్ చేయాల్సి వచ్చేంది. కానీ ఎంసీఎక్స్ రూపాయి ధరనే నిర్ణయించడంతో క్రితం ముగింపు రూ.965 చొప్పున షార్ట్ సెల్లర్స్‌కు లాభాలు రూ.110 కోట్లకు పరిమితమయ్యాయి. లాంగ్ పొజిషన్ తీసుకున్న ట్రేడర్లు రూ.440 కోట్ల నష్లాలను కేవలం రూ.110 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకోగలిగారు. ఇలా ఇష్టానుసారం రూల్స్ మార్చేస్తే ఎలా అంటూ విమర్శలు చెలరేగడంతో సెబీ దీనిపై దృష్టిపెట్టింది. -
ట్రేడింగ్‌లో అవకతవకలు.. ఐటీ దాడులు
న్యూఢిల్లీ : ట్రేడింగ్‌లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ పలువురు షేర్ బ్రోకర్స్, ట్రేడర్స్‌పై దాడులు జరిపింది. దేశ వ్యాప్తంగా ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, ఢిల్లీ సహా 39 చోట్ల సోదాలు చేపట్టినట్లు ఐటీ శాఖ శనివారం తెలిపింది. రివర్సల్ ట్రేడ్స్ ద్వారా కృత్రిమంగా లాభం/నష్టం వచ్చేలా చేశారని వీరిపై ఆరోపణలున్నాయి. దీని ద్వారా వీరు రూ. 3500 కోట్ల వరకూ లాభాలు/నష్టాలు వచ్చేలా చేశారని ఐటీ శాఖ తెలిపింది. -
టీటీడీ వలలో పెద్ద దళారీ
సాక్షి, తిరుమల: టీటీడీ విజిలెన్స్ వలలో పెద్ద దళారీ పడ్డాడు. 46 మంది ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫార్సు లేఖలతో భక్తులకు అధికమొత్తంలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం సిఫార్సు లేఖ పై 36 సార్లు, అంబర్ పేట ఎమ్మెల్యే సిఫార్సు పై 23 సార్లు, వరంగల్ ఎమ్మెల్యే కోటాలో 17 సార్లు, ఎంపీ కోటాలో 11 సార్లు టిక్కెట్లు అమ్ముకున్నట్లు గుర్తించారు. ఏపీ మాజీ, ప్రస్తుత హోం మంత్రులనూ కూడా వదిలి పెట్టని దళారీ చారి.. వారి లేఖలపై కూడా టిక్కెట్లు పొందినట్లు తెలుస్తోంది. తిరుమలలో కల్లూరీ రాజు అనే మరో దళారీని టీటీడీ విజిలెన్స్ విభాగం అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు ప్రజాపతినిధుల సిఫార్సు లేఖలతో శ్రీవారి దర్శనానికి పంపుతుండగా విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సిఫార్సు లేఖలతో పేర్లు మార్చి పంపుతున్న అతడిని పట్టుకొని పోలీసులకు పిర్యాదు చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. -
పరాన్నజీవులు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: కొందరు జనం మీద పడి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.. ఫలానా అధికారి తనకు బాగా తెలుసునని, మాతో వస్తే మీ పని సులభంగా జరిగిపోతుందని జనాన్ని నమ్మిస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి వారి నుంచి సొమ్ములు గుంజుతున్నారు.. ఇంకొందరు.. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై పడుతున్నారు.. నిబంధనల పేరుతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.. జిల్లాలో ఇలాంటి వారు చాలా మంది హల్ చేస్తూ ప్రజలకు, ఉన్నతాధికారులకు తలనొప్పిగా మారారు. కొన్ని రాజకీయ పార్టీలు, సంఘాల పేరుజెప్పి అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ, జనాన్ని మాయచేస్తున్నారు. కొందరిని ’స్పందన’ సాక్షిగా కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. నిజానికి కొన్ని ప్రభుత్వ విభాగాలనే అలాంటి వ్యక్తులు తమ గుప్పిట్లో పెట్టుకుని నడిపిస్తున్నారంటే అతిశయోక్తికాదు. విజయనగరం జిల్లా అంటేనే మంచి తనంతో కూడిన అమాయకత్వం కలిగిన ప్రజలకు పెట్టింది పేరు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించి చేతనైన సాయం, అవసరమైన సేవ చేస్తున్న ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలానే ఉన్నాయి. జిల్లా సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుతూ, ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షిస్తూ ఆయా సంఘాలు, సంస్థల ప్రతినిధులు, సభ్యులు తమవంతు కృషిచేస్తున్నారు. అయితే, ఇలాంటి వారికి భిన్నంగా అలాంటి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీ ల ముసుగులో మరికొందరు ధనార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. వారిలో ప్రముఖులు కూడా ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. రాజకీయ పదవి లేకపోయిన, కనీసం ఆ పార్టీకి డిపాజిట్లు రాకపోయినా, ప్రజాప్రతినిధిగా ఏ పదవీ చేపట్టకపోయినా పార్టీ రాష్ట్ర పదవులు అనుభవిస్తూ అమరావతి నుంచి విజయనగరం వరకూ తనకు అందరితోనూ పరిచయాలున్నాయని చెప్పుకుంటున్న ఓ నాయకుడున్నారు. జిల్లా అధికారులు నిత్యం ఎక్కడికి వెళుతుంటారు?, ఏ సమయంలో ఏ ప్రదేశంలో ఉంటారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అనే విషయాలను తెలుసుకోవడమే అతని పని. ఇదంతా తెలుసుకుని ఏం చేస్తాడనేగా మీ అనుమానం. అధికారుల కదలికలపై అవగాహన వచ్చిన తర్వాత వారికి అతను ఫోన్ చేస్తాడు. కలవాలని చెబుతాడు. కలిసిన తర్వాత ఆ అధికారి గురించి అతను తెలుసుకున్నదానిని వివరిస్తాడు. వ్యక్తి విషయాలను బయటపెడతానని బెదిరిస్తాడు. మంచి అంశాన్ని కూడా చెడుగా ప్రచారం చేస్తానని బ్లాక్ మెయిల్‌కు దిగుతాడు. అతని చర్యలకు భయపడిపోయిన అధికారి అతనికి లొంగిపోతున్నాడు. ఆ తర్వాత అతను ఆడించినట్లుగా ఆడటం తప్ప ఆ అధికారికి మరో మార్గం ఉండదు. వారి నుంచి సమాచారం తెలుసుకుని రేపు వారు మంజూరు చేయబోయే ప్రాజెక్టులు, రుణాలకు సంబంధించిన కాంట్రాక్టర్లు, లబ్ధిదారులను ఈ నాయకుడు ముందురోజే అధికారి వద్దకు తీసుకువెళ్లి పని జరిపించాల్సిందిగా వినతిపత్రం ఇస్తారు. మర్నాడు ఆ పని జరగగానే తన వల్లనే ఆ పని జరిగిందని చెప్పి లబ్ధిదారుల నుంచి సొమ్ములు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని కలెక్టర్ ఇటీవల పసిగట్టారు. అతని దుర్భుద్ధిని గ్రహించి జాగ్రత్త పడుతున్నారు.మరో వ్యక్తి ఉన్నాడు.. అతనూ ఒక పార్టీ నేతనని, ఒక సామాజిక వర్గానికి ప్రతినిధినని చెప్పుకుంటున్నాడు. కానీ ఇంతవరకూ ఎన్నికల్లో ఏనాడూ గెలిచింది లేదు. అయినా, నిత్యం ఏదోఒక పనిజెప్పి జిల్లా అధికారుల వద్దకు వెళుతుంటాడు. సమస్యలతో ఉన్న ప్రజలను వెంటబెట్టుకుని అధికారులకు వినతిపత్రం ఇస్తుంటాడు. ఆ సమస్య పరిష్కారం అయితే తనగొప్పతనమేనని చెప్పి తానూ ఆర్థిక లబ్ధి పొందుతుంటాడు. ఈ మధ్య ఒకడుగు ముందుకువేసి వివాదాల్లో ఉన్న భూ సమస్యలను అధికారులచేత పరిష్కారం చేయించేస్తానంటూ మొదలుపెట్టాడు. అతను అనుకున్నది జరిగితే సరే లేదంటే బయటకు వచ్చి ‘ఇక్కడ ఏ సమస్య పరిష్కారం కాదు. అధికారులు పనిచేయడం లేదు’.. అంటూ ప్రచారం చేస్తుంటాడు. తద్వారా అధికారులను నైతికంగా కుంగదీసి పనులు జరిపించుకోవాలనేది అతని ఎత్తుగడ. అయితే, ఈ ప్రయత్నాలను కూడా కలెక్టర్ పసిగట్టారు. నలుగురి ముందు అతని దుర్భుద్ధిని నిలదీశారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా హెచ్చరించారు. వీరిద్దరూ కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇలాంటి వారు జిల్లాలో చాలా మంది ఉన్నారు. సమాచారహక్కు చట్టం, మానవహక్కులు, విద్యార్థి, మహిళా సంఘాల పేరుతో అధికారులు, ప్రజలను దోచుకుతినడమే పనిగాపెట్టుకున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలైతే ఇలాంటి వారిపట్ల తీవ్ర వేదనకు గురవుతున్నాయి. సెలవుల్లో తరగతులు పెడుతున్నారనో, కంప్యూటర్ ల్యాబ్‌లు లేవనో, ఆట స్థలాలు లేవనో విద్యా సంస్థలను నిలదీస్తుంటారు. ఆ సౌకర్యాలను రప్పించడం కోసమైతే పర్లేదు. కానీ కాదు. అలా నిర్వాహకులను బెదిరించి ఎంతో కొంత డబ్బు తీసుకుని సైలెంట్‌గా వచ్చేస్తారు. ఆ తర్వాత ఆ సౌకర్యాల ఊసెత్తరు. ఎవరైనా తమకు అనుకూలంగా లేకపోతే ఆ విద్యాసంస్థల ముందు ధర్నాలు, ఆందోళనలు అంటూ హడావిడిగా చేసేస్తుంటారు. ఈ గోలంతా ఎందుకని నిర్వాహకులు వారితే సయోధ్య కుదుర్చుంటున్నారు. అలాగే, సంక్షేమ హాస్టళ్లపైనా పడుతున్నారు. నిజానికి వీరంతా నిజాయితీగా పోరాటం చేస్తే హాస్టళ్లు ఎప్పుడో బాగుపడేవి. కానీ కేవలం ఆ శాఖ అధికారులు, వార్డెన్లను భయపెట్టి అందినకాడికి సొమ్ముచేసుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇష్టంలేకపోయినా కొందరు విద్యార్థులు వీరివెంట తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళనల్లో పాలుపంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. ఉపేక్షించం.. కొందరు వ్యక్తులు జిల్లా అధికారులను, ప్రజలను వేధిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది. నేను కూడా స్వయంగా చూశాను. అలాంటి వారిని ఉపేక్షించేది లేదు. అవినీతి రహిత పాలన అందించాలని సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చాలా స్పష్టంగా చెబుతున్నారు. అధికార యంత్రాంగమంతా సీఎం ఆశయాలకు అనుగుణంగానే పనిచేస్తాం. కాబట్టి ఇలాంటి బ్లాక్మెయిలర్లకు భయపడాల్సిన పనిలేదు. ప్రజలు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మా వద్దకు నేరుగా వచ్చి ‘స్పందన’ కార్యక్రమంలో చెప్పుకోవచ్చు. ఎలాంటి మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. అలాంటి వారిని నమ్మి మోసపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, కలెక్టర్, విజయనగరం జిల్లా -
సెబీ సంస్కరణల జోష్!
న్యూఢిల్లీ: దేశీయ ఈక్విటీ, క్యాపిటల్ మార్కెట్లను మరింత బలోపేతం, విస్తృతం చేసే దిశగా సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజ్ బోర్డు (సెబీ) శుక్రవారం నిర్ణయాలు తీసుకుంది. ట్రేడింగ్ చార్జీల భారాన్ని తగ్గించడం నుంచి స్టార్టప్‌ల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లను అనుమతించడం వరకు ఎన్నో కీలక నిర్ణయాలను వెలువరించింది. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌ను మరింత చౌకగా మార్చే దిశగా ఫీజులను భారీగా తగ్గించింది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కోసం కంపెనీల నుంచి తీసుకునే ఫీజులను కూడా తగ్గించింది. సెక్యూరిటీస్ మార్కెట్‌పై లావాదేవీల రుసుములు, నియంత్రణపరమైన సమర్థత కోసం అవసరమైన ఆదాయ వనరుల మధ్య సమతుల్యత కోసం ఫీజులను పెంచడం లేదా తగ్గించడాన్ని సమయానుకూలంగా సవరించనున్నట్టు సెబీ తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకునే వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాల ఆదాయం, ఖర్చుల అంచనాలను పరిగణనలోకి తీసుకుని 2019 ఏప్రిల్ 1 నుంచి ఫీజులను సవరించినట్టు వెల్లడించింది. ►బ్రోకర్లు చెల్లించే ఫీజులను 33.33 శాతం తగ్గించింది. దీని ప్రకారం కోటి రూపాయల లావాదేవీల విలువపై రూ.15 చార్జీ కాస్తా రూ.10కి తగ్గింది. ► వ్యవసాయ ఉత్పత్తుల (అగ్రి కమోడిటీలు)పై ఫీజును ఏకంగా 93.33 శాతం తగ్గించింది. రూ.కోటి విలువ లావాదేవీలపై చార్జీని రూ.15 నుంచి రూ.1 చేసింది. ► కస్టోడియన్లకు ఏటా రెన్యువల్‌కు బదులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ►స్టాక్ ఎక్సేంజ్‌లు చెల్లించే రెగ్యులేటరీ ఫీజును 80 శాతం తగ్గించింది. ప్రస్తుతం రూ.10 కోట్లపైన టర్నోవర్‌కు కోటి రూపాయలకు రూ.6 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉండగా, దీన్ని రూ.1.20కు తగ్గించింది. ► ఆఫర్ డాక్యుమెంట్ల రీఫైలింగ్‌పై ఫీజును 50 శాతం తగ్గించింది. పరిశీలన లెటర్ జారీ చేసిన నాటి నుంచి ఏడాది లోపు రీఫైలింగ్‌కు ఇది వర్తిస్తుంది. ►డిబెంచర్ హోల్డర్ల ప్రయోజనాల పరిరక్షణ దృష్ట్యా డిబెంచర్ ట్రస్టీలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు గాను, కనీస నెట్‌వర్త్‌ను రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచింది. చెల్లింపుల్లో విఫలమైతే డిబెంచర్ హోల్డర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమోడిటీ డెరివేటివ్స్‌లోకి మ్యూచువల్ ఫండ్స్... కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్‌కు మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్)ను అనుమతిస్తూ సెబీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశీయ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి అనుమతించాలన్న కమోడిటీ డెరివేటివ్స్ అడ్వైజరీ కమిటీ సూచనల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను కమోడిటీ డెరివేటివ్స్ మార్కెట్లోకి ఇప్పటికే అనుమతిస్తుండగా... డెలివరీ విధానంలో తీసుకునే గూడ్స్‌లో డీలింగ్కు కూడా అనుమతించింది. రెండో దశలో బ్యాంకులు, ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంపెనీలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను సైతం అనుమతించాలని అడ్వైజరీ కమిటీ సూచించింది. సెబీ గుర్తించిన సున్నితమైన కమోడిటీలు కాకుండా, ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ కమోడిటీల్లో ట్రేడింగ్‌కే అనుమతింనునున్నారు. ఫండ్స్ వ్యాల్యుయేషన్‌లో పారదర్శకత ఇక, మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీల విలువను నిర్ణయించడానికి సంబంధించిన నిబంధనలను సెబీ సవరించనుంది. పరిశ్రమ అంతటా ఒకే రీతిలో ఉండే విధంగా, ఐఎల్ఎఫ్ఎస్ తరహా రుణ చెల్లింపుల వైఫల్యాల నుంచి ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. యాంఫి నియమించిన వ్యాల్యుయేషన్ ఏజెన్సీలు మనీ మార్కెట్, డెట్ సెక్యూరిటీలకు వ్యాల్యుయేషన్ ఖరారు చేస్తారు. పారదర్శక విలువ విషయంలో ఏఎంసీలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యాల్యూషన్ ఏజెన్సీలు సూచించిన వ్యాల్యూషన్లకు అనుగుణంగా లేకపోతే అందుకు సంబంధించిన వివరాలను ఏఎంసీ బోర్డు, ట్రస్టీలు, ఇన్వెస్టర్లకు తెలియజేయాల్సి ఉంటుంది. కామెక్స్ టెక్నాలజీపై ఐదేళ్ల నిషేధం గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) ఇష్యూలో అవకతవకలకు పాల్పడ్డందుకు కామెక్స్ టెక్నాలజీపై ఐదేళ్లు, ఆ సంస్థకు చెందిన మాజీ డైరెక్టర్లు ఆది కూపర్, కిషోర్ హెగ్డేలపై రెండేళ్లపాటు సెబీ నిషేధం విధించింది. 2009 మే 25న 1.91 మిలియన్ల జీడీఆర్‌లను (9.99 మిలియన్ల డాలర్ల విలువ) సంస్థ జారీ చేసింది. సెబీకి జైట్లీ ప్రశంసలు దేశీయ సెక్యూరిటీస్ మార్కెట్ల అభివృద్ధికి సంబంధించి తీసుకున్న చర్యల విషయంలో సెబీ బోర్డు, సీనియర్ అధికారులు నిర్వహించిన పాత్రను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అభినందించారు. ఈ విషయాన్ని సెబీ ఓ ప్రకటనలో తెలిపింది. స్టార్టప్‌లో పెట్టుబడులిక సులువు స్టార్టప్ కంపెనీల లిస్టింగ్‌ను సెబీ సులభతరం చేసింది. నూతన తరం స్టార్టప్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి గుర్తింపు నిబంధనలను సులభతరం చేసేందుకు సెబీ బోర్డు ఆమోదం తెలిపింది. సెబీ ఆమోదించిన కార్యాచరణ ప్రకారం... డీమ్యాట్ అకౌం ట్ ఉన్న ఇన్వెస్టర్ స్టాక్ ఎక్సే్ఛంజ్ లేదా డిపాజిటరీల ద్వారా అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు, డిపాజిటరీలు ఇన్వెస్టర్లకు మూడేళ్ల కాలానికి గుర్తింపు (అక్రిడేషన్) ఇస్తాయి. అక్రిడేటెడ్ ఇన్వెస్టర్ల అర్హతకు సంబంధించి పూర్తి నిబంధనలను సెబీ తర్వాత నోటిఫై చేయనుంది. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు... వార్షికంగా రూ.50 లక్షల స్థూల ఆదాయం ఉన్న వారు, కనీస లిక్విడ్ నెట్‌వర్త్ రూ.5 కోట్లు ఉన్నవారికి అక్రిడేషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఓపెన్ ఆఫర్ నిబంధనల సడలింపు కార్పొరేట్ రుణ పునరుద్ధరణ కార్యక్రమాలకు సంబంధించి ఓపెన్ ఆఫర్ నిబంధనలను సెబీ సడలించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకే ఇది వర్తిస్తుంది. దీంతో రుణ సంక్షోభంలో చిక్కుకున్న జెట్ ఎయిర్వేస్ వంటి సంస్థలకు ఇది ఉపశమనం కల్పించనుంది. సెబీ టేకోవర్ నిబంధనల ప్రకారం.. లిస్టెడ్ కంపెనీలో నియంత్రిత వాటా లేదా 25% వాటాను తీసుకుంటే, మైనారిటీ వాటాదారులకు ఓపెన్ ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు దీన్నుంచి సెబీ మినహాయింపునిచ్చింది. జెట్ ఎయిర్వేస్కు ఎస్బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకులు రూ.8,000 కోట్ల రుణాలను ఇవ్వగా, వాటిని చెల్లించలేని పరిస్థితుల్లో వాటా కింద మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఇవి ఓపెన్ ఆఫర్ నిబంధనల మినహాయింపుపై సెబీ నుంచి స్పష్టత కోరాయి. -
దళారీ గద్దలు
బరిగెల శివకుమార్ అనే యువకుడు ఉద్యోగంపై ఆశతో ప్రశాంత్‌నగర్‌కు చెందిన వ్యక్తిని నమ్మి రూ.4 లక్షలు సమర్పించుకున్నాడు. శివకుమార్ లాంటి బాధితులు సదర వ్యక్తి ఖాతాలో ఎందరు ఉన్నారో లెక్కలేదు. అతడిని డబ్బుల కోసం నిలదీసిన బాధితులపైనే అట్రాసిటీ కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెట్టిన ఘన చరిత్ర అతడికి ఉంది. కాజీపేట రహమత్ నగర్‌కు చెందిన తేలు సారంగపాణిది మరో గాథ. అన్న కొడుకు ఇంజనీరింగ్ చదివి ఇంటి వద్ద పనీపాట లేకుండా ఉంటున్నాడు.. ఏదైనా అవకాశం ఉంటే చూడు అంటూ పరిచయం ఉన్న వ్యక్తితో బాధను పంచుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు వ్యక్తి నేరుగా విదేశాల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం పంపిస్తానంటూ రూ.7.50 లక్షలు వసూలు చేసి నట్టేట ముంచాడు. అడగబోతే మాటలతో ఎదురుదాడి చేశాడు. చేసేది లేక పోలీసులను ఆశ్రయించి సగం డబ్బులను వసూలు చేసుకోవడంలో సఫలీకృతుడైన బాధితుడిపై ఇంకా సదరు దళారీ ఎదురుదాడి ఆగకపోవడం గమనార్హం. కాజీపేట (వరంగల్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల వివిధ శాఖల్లోని ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన నోటిఫికేషన్లు కొంతమంది దళారులకు వరంగా మారుతున్నాయి. నిరుద్యోగుల అమాయకత్వం, ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలన్న ఆశ బ్రోకర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. రెగ్యులర్ ఉద్యోగాలకు ఓ రేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు మరో రేట్‌ను ఫిక్స్ చేసి మొదట పెద్ద మొత్తంలో అడ్వాన్స్‌గా వసూలు చేస్తున్నట్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లు వెత్తుతున్నాయి. ఇటీవల అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీఓ), సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేయడమేగాక రాతపరీక్ష కూడా నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసి వారికి మెడికల్ టెస్ట్‌లు, ఇతర ఈవెంట్లకు అర్హులుగా నిర్ధారించింది. రాతపరీక్ష నెగ్గి ఈ పరీక్షల కోసం వేచి చూస్తున్న వారిలో చాలామంది దళారుల బారినపడినట్లు తెలిసింది. ఎలాగూ రాత పరీక్ష నెగ్గినందున ఎన్ని డబ్బులు పెట్టయినా కొలువు సంపాదించుకుందామని ఆశపడుతున్న వారు దళారుల వలలో చిక్కుకుంటున్నారు. దళారులకు సంబంధిత శాఖలో ఒకరిద్దరు అధికారులతో పరిచయాలు ఉండడం, అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడంతో వారిని నిరుద్యోగులు నమ్ముతూ లక్షలాది రూపాయలు చెల్లించుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వైద్య, ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల్లో కూడా ఇటీవల కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇందులోనూ దళారులు రంగ ప్రవేశం చేసి నిరుద్యోగులకు వల విసిరినట్లు తెలిసింది. దీనికి తో డు ఇటీవల వివిధ శాఖల్లో జరుగుతున్న ఔట్సో ర్సింగ్ ఉద్యోగ నియామకాల వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆరోపణలున్నాయి. హైదరాబాద్‌కు చెంది న కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలు తమకున్న రాజకీయ పలుకుబడితో గుట్టుచప్పుడు కాకుండా నియామకాలు చేస్తున్నాయి. వీరు ఆయా ప్రాంతాల్లోని తమ ఏజెంట్ల ద్వారా అభ్యర్థులను నియమించి వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రైల్వేలో కొలువులపై... రెగ్యులర్ ప్రాతిపదికన రైల్వేశాఖలో భర్తీ చేయబోతున్న ఏఎల్పీ, టెక్నీషియన్, గ్రూప్–డీ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఇటీవల రాత పరీక్షలు ప్రారంభం కావడంతో ఫలితాలు అనుకూలంగా రావడం కోసం పైరవీలు చేస్తామంటూ దళారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో పోస్టుకు దాదాపు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ.2 లక్షలు లేదా రూ.3 లక్షలు తీసుకుంటున్నట్లు ప్రచారం. నియామక ప్రక్రియ పకడ్బందీగా జరుగుతున్నప్పటికీ అభ్యర్థుల అత్యాశ, దళారుల మాయమాటల కారణంగా చెల్లింపులు జరుగుతున్నాయంటున్నారు. ఔట్సోర్సింగ్, అంగన్వాడీ కొలువులకు.. వివిధ శాఖల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు లక్షలాది రూపాయలు డిమాండ్ ఉంది. ఇటీవల వివిధ శాఖల్లో ఉద్యోగాలను భర్తీచేయడానికి కొన్ని ఏజెన్సీలు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి భర్తీ చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్లుగానీ, రోస్టర్ విధానం అమలు చేయకుండా ఈ సంస్థలు రహస్యంగా భర్తీ వ్యవహారాలు నడుపుతున్నాయి. అంగన్వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి అభ్యర్థుల దరఖాస్తుల పరిశీలన పూర్తికావడంతో తమకు ప్రభుత్వ పెద్దల అండ ఉందని చెబుతూ కొందరు దళారులు అమాయకులను వంచిస్తున్నారు. టీచర్ పోస్టుకు రూ.లక్ష, ఆయా పోస్టుకు రూ.50 వేల చొప్పున ఇప్పటికే కొందరు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతపెద్ద ఎత్తున దళారులు సాగిస్తున్న ఈ అక్రమ వ్యవహారాలపై సంబంధిత శాఖల అధికారులు ఇప్పటికైనా దృష్టిసారించి అమాయకులు నష్టపోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.. నిరుద్యోగులను ఉద్యోగాల పేరుతో నమ్మించి మోసం చేసే వ్యక్తులపట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. పారదర్శకంగా ఉద్యోగాల నియామకాల ప్రక్రియ జరుగుతున్నందున దళారులను ఆశ్రయించి మోసపోవద్దు. అలాగే పోలీస్ స్టేషన్లో నిర్దిష్ట ఆధారాలతో ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేసి విచారణ జరుపుతాం. – సీహెచ్.అజయ్, సీఐ, కాజీపేట -
మెతుకు లేక.. బతుకు వలస
ఉన్న ప్రాంతంలో మెతుకు పుట్టదు.. ఎంత పనిచేసినా బతుకు మారదు. పేరుకు ఉద్యానవనం. కానీ పచ్చదనం కోల్పోయి చాలాకాలమవుతోంది. ఉద్దానం బిడ్డలు ఇప్పుడు బతుకు వెతుక్కుంటూ వేరే దేశాలకు వెళ్తున్నారు. కేవలం కూలి పనుల కోసం కుటుంబాలను వదిలి సరిహద్దులు దాటుతున్నారు. అంతదూరం వెళ్తున్నా వారి జీవితాలు మారడం లేదు. బ్రోకర్ల చేతిలో మోసపోవడం.. ప్రమాదాల్లో చిక్కుకోవడం వంటి సంఘటనలు వారి కుటుంబ సభ్యులను కలవర పెడుతున్నాయి. టెక్కలి డివిజన్ పరిధిలో ఉద్దానం ప్రాంతంగా పిలిచే ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాల్లో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. దీంతో చదువుకొని.. నిరుద్యోగులుగా ఉన్న యువకులు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపాధి కోసం వలస వెళుతూ , అక్కడ భద్రత లేని ఉద్యోగాల్లో చేరి అవస్థలు పాలవుతున్న సంఘటనలు ఇటీవల వెలుగు చూశాయి. అయినా సర్కార్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీకాకుళం / కంచిలి: ఉద్దానం ప్రాంతంలో ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. దీంతో చాలామంది నిరుద్యోగులు, యువకులు దూర ప్రాంతాలకు సైతం వెళ్లేందుకు వెనుకాడడం లేదు. ఈ అవకాశాన్నే కొంతమంది బ్రోకర్లు క్యాష్ చేసుకుంటున్నారు. గ్రామాల్లో తిరుగుతూ యువకుల్ని ఆకర్షిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ ఆశలు చూపి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇక్కడి యువత ఏదో విధంగా బయట దేశానికి వెళ్లి.. నాలుగు రూపాయలు సంపాదించాలని ఆశిస్తున్నారు. అయితే అలాంటి ప్రయాణాలు సక్రమంగా సాగడం లేదు. ఇక్కడి నుంచి పంపే బ్రోకర్లు సరైన పద్ధతిలో పంపించకపోవడం, టూరిస్టు వీసాలతో అక్కడికి పంపిన తర్వాత పట్టించుకోకపోవడంతో దేశంకాని దేశంలో ఉద్దానం వాసులు అవస్థలు పడిన సందర్భాలు కోకొల్లలుగా ఇటీవల వెలుగు చూశాయి. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి ఉపాధి అవకాశాలు కల్పించినట్లయితే ఉద్దానం యువతకు ఈ దుస్థితి ఏర్పడేది కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ ఏడాదిలో జరిగిన సంఘటనలను ఒకసారి పరిశీలిస్తే.. టెక్కలి డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన యువకులు సౌదీ అరేబియాలో ఇటీవల చిక్కుకున్నారు. అక్కడి నుంచి బాధితులు నేరుగా ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. అక్కడ వారు పడుతున్న అగచాట్లకు సంబంధించిన ఫొటోలు పంపించారు. ఒడిశా రాష్ట్రం గంజాం, జయంతిపురం గ్రామాల పరిధిలో గల యువకులతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన పది మంది బాధితులు గల్ఫ్‌లో చిక్కుకున్నారు. గత ఏడాది డిసెంబర్లో ఒడిశాలోని బరంపురం, ఇచ్ఛాపురం, టెక్కలిలో గల ఏజెంట్ల ద్వారా పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లారు. అప్పట్లో చిక్కుకున్న వారిలో శ్రీకాకుళానికి చెందిన కిలుగు రామారావు రెడ్డి (ఇచ్ఛాపురం మున్సిపాలిటీ బెల్లుపడ కాలనీ), దుంప బైరాగి (ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి), దూపాన ప్రకాష్ రెడ్డి (కంచిలి మండలం అంపురం), కల్లేపల్లి కార్తీక్ (సోంపేట మండలం తాళపధ్ర), రాజాం రామారావు (పూండి, తోటపల్లి), గొరకల హేమారావు( పూండి ముల్లారిపురం), బయా పెంటయ్య (బావనపాడు)తో పాటు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు గ్రామాలకు చెందిన మద్ది బృహస్పతి(ఒడిశా గుడ్డిపద్ర), కోళ హరికృష్ణ (ఒడిశా బొరివాడ), గణేష్ పాత్రో జంకల, శిలవలస గోపాల్, పూదరి శ్రీనివాస్, నీలమ్ రాజకుమార్, గలిపెల్లి మధు, సౌదా బత్తుల ఉమామహేశ్వరావు, ఉమాశంకర్ సాహూ, సిలవలస వాసుదేవ్, సుధామ చంద్ర సాహూ, పెదిని తారేసు, పందిరి విజయ్‌కుమార్, లోచన బెహరా, ముడిలి ప్రహ్లాద్, సిలివలస గోపాల్, దకుయా గోవింద్‌లు ఇబ్బందులు పడ్డారు. ఏజెంట్ల మాయలో... విదేశా>ల్లో ఉద్యోగం...చేతి నిండా సొమ్ము...ఐదేళ్లు పాటు విదేశాల్లో ఉంటే కోటీశ్వరులవుతారంటూ నిరుద్యోగ యువకులకు గాలం వేసే ఏజెంట్లు జిల్లాలో కోకొల్లాలు. ముఖ్యంగా ఇచ్ఛాపురం నుంచి బరంపురం వెళ్లే రహదారుల్లో పుట్టగొడుగుల్లా ఇనిస్టిట్యూట్లు వెలిశాయి. కేవలం నిరుద్యోగులకు వల విసిరి వారి వద్ద భారీగా నగదు దోచుకోవడం అలవాటు పడ్డారు. ఇచ్ఛాపురం పురపట్టణంలోనే ఐదు, కంచిలి మండలంలో రెండు ఇనిస్టిట్యూట్లున్నాయి. సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో పలు గ్రామాల్లో బ్రోకర్లు కూడా ఉండి నిరుద్యోగులకు ఎరవేస్తున్నారు. నామమాత్రం శిక్షణతో.. బ్రోకర్లు ఏర్పాటు చేస్తున్న ఇనిస్టిట్యూట్‌లో వెల్డింగ్, ఫిట్టర్ వంటి శిక్షణలు తూతూ మంత్రంగా ఇస్తూ విదేశాలకు పంపించాలంటే సుమారు 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని రత్తకన్నకు చెందిన అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ ప్రతినిధి ఉద్యోగాలిప్పిస్తానంటూ ఎంతో మంది అమాయక యువకుల నుంచి డబ్బులు వసూలు చేసి, వారికి ఉద్యోగాలిప్పించకపోవడంతో వారు పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇటీవల పలాస పట్టణానికి చెందిన ఒక బ్రోకర్ 30 మంది నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసిన వైనం బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మందస మండలంలో కూడా ఇటువంటి సమస్య బయటపడింది. ఇలా ఉద్దానం ప్రాంతంలో చాలామంది విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బ్రోకర్ల అవతారమెత్తి నిరుద్యోగులతో ఆడుకుంటున్నారు. అయినా నిరుద్యోగులు కూడా ఇవేమీ పట్టించుకోకుండా వేలాది రూపాయలు చెల్లించి విదేశీ ఉద్యోగాలపై ఆశతో బ్రోకర్ల చేతిలో డబ్బులు పెడుతూ మోసం పోవడం.. లేదా విదేశాలు వెళ్లి అక్కడ అవస్థలు పడడం జరుగుతున్నాయి. ఉద్దానం ప్రాంతం నుంచి ఏడాదికి సగటున 2వేల మంది వరకు యువకులు విదేశాలకు వలస వెళుతున్నారు. అంతేకాకుండా నిర్మాణ పనులు చేసి పొట్టనింపుకోవడానికి మన దేశంలోని తమళనాడు, బెంగళూరు, గుజరాత్, ముంబాయి తదితర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు కూడా ఈ ప్రాంతానికి చెందిన వేలాది మంది ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న వారు పనులు చేసే క్రమంలో ప్రమాదాలబారిన పడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలంటూ తీసుకెళ్లే బ్రోకర్లు, వివిధ కంపెనీలు ఇక్కడ చెప్పేదొక ఉద్యోగం అయితే .. అక్కడ బాత్రూంలు, లెట్రిన్లు శుభ్రపరిచే పనులను కూడా అప్పగించే సందర్భాలు ఉనాయి. ఆ పనిలో కూడా భద్రత లేకపోవడంతో తమ దుస్థితిని తెలియజేస్తూ అక్కడ ఇబ్బందులు పడేవాళ్లు మనసు చంపుకొని ఆ ఫొటోలను ఇక్కడికి పంపి, కాపాడమని వేడుకున్న సందర్భాలు కూడా ఇటీవల వెలుగు చూశాయి. ఇంత జరుగుతున్నా జిల్లా అధికారులు గానీ.. సర్కార్ గాని పట్టించుకోకపోవడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకహోదాతోనే పారిశ్రామికాభివృద్ధి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ వలసల రాష్ట్రం. అందులో శ్రీకాకుళం జిల్లా వలసల్లో ప్రథమస్థానంలో ఉంది. ఉద్దానం పరిస్థితి అయితే మరింత ఘోరం. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తేనే పారిశ్రామిక ప్రగతి జరిగి, ఉన్న ప్రాంతంలోనే పరిశ్రమలు ఏర్పాటు జరిగి యువతకు ఉద్యోగాలు లభిస్తాయి. చంద్రబాబు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆయన వస్తే పరిశ్రమలు వస్తాయని ఆశించిన యువత తీవ్రమైన మోసానికి గురైంది. నిరుద్యోగులు దగాపడ్డారు. –డాక్టర్. సీదిరి అప్పలరాజు, వైఎస్సార్సీపీ పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెనుకబాటు తనంతోనే వలసలు ఉద్దానం ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబాటులో ఉంది. పారిశ్రామిక అభివృద్ధి లేకపోవడం, పంటలు కూడా పూర్తిస్థాయిలో పండకపోవడంతో ఇక్కడి యువకులుతోపాటు అన్ని వయస్సుల వారు వలసలు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చంద్రబాబు అధికారంలోకి వస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఉద్యోగాలు కల్పిస్తారని ఆశించిన యువతకు నిరాశే మిగిలింది. – పిరియా సాయిరాజ్, వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త వలస బతుకులు దుర్భరం స్థానికంగా ఉద్యోగావకాశాలు లేక కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నార. తీరా అక్కడ పరిస్థితులు దుర్భరంగా ఉంటున్నాయి. నేను కూడా కుటుంబాలను పోషించాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే తలంపుతో ఇతర ప్రాంతానికి వెళ్లాను. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో తిరిగి వచ్చేసి, ఇక్కడ ఆటో నడుపుకొని జీవిస్తున్నాను. –నారద భీమారెడ్డి, నరసన్నముకుందాపురం గ్రామం, కంచిలి మండలం ఉద్యోగాల్లేక అల్లాడుతున్నాం రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగాల కల్పన చేపట్టకపోవడంతో డిగ్రీలు, పీజీలు చేసి అల్లాడుతున్నాం. మా లాంటి ఎంతో మంది యువకులు చదువుకున్నవారు సైతం స్థానికంగా ఉద్యోగాలు లేకపోవడంతో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళుతున్నాం. అక్కడ ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. –తరిపిల మురళి, పోస్టు గ్రాడ్యుయేట్, గోకర్ణపురం, కంచిలి మండలం -
మత్స్యమాఫియా
అలంపూర్ రూరల్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో పారుతున్న తుంగభద్ర, కృష్ణానదుల్లో మత్స్యసంపదను కొల్లగొడుతున్న అలవి వలలు స్థానిక మత్స్యకారుల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. మత్స్యసంపదను మధ్య దళారీలు తరలించకుండా మత్స్యశాఖ, పోలీస్ యంత్రాంగం వరుస దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్నా పెద్దగా స్పందన కనిపించడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రధానంగా అలంపూర్ గొందిమల్ల, కూడవెల్లి తదితర ప్రాంతాల్లో స్థానికేతరులు ధనార్జనే ధ్యేయంగా వైజాగ్, రాజమండ్రి, తమిళనాడు, ఏపీ వంటి ప్రాంతాల నుంచి అలవి వలలతో చేపలను వేటాడే నైపుణ్యం గల వారికి రోజువారి కూలీలు ఇస్తూ ప్రభుత్వం నిషేధించిన అలవి, పట్టు, నంజు, మ్యాట్ వంటి వలలతో చేపలను వేటాడుతూ మత్స్య సంపదను కొల్లగొడుతూ ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 20 వేల మత్స్యకారుల కుటుంబాలు జీవనోపాధి కోల్పోతున్నాయి. లైసెన్స్‌లు.. సొసైటీలు కులవృత్తి అయినంత మాత్రనా లేదా గంగపుత్రులు అయినంత మాత్రాన చేపలు వేటాడే అధికారం లేదు. ఇందుకోసం సంబంధిత మత్స్యశాఖ దగ్గర పేరు నమోదు చేసుకుని లైసెన్సులు పొందాలి. లేదా మత్స్యశాఖ సొసైటీలో కనీసం సభ్యుడై ఉన్నా చేపలను వేటాడవచ్చు. జోగుళాంబ గద్వాల జిల్లాలో 20 వేల మంది మత్స్యకారులున్నారు. రాజోళి, అలంపూర్, క్యాతూరు ఇలా మిగతా చోట సొసైటీలు కూడా ఉన్నాయి. ఒక్కో సొసైటీలో 400–600 మంది దాకా ఉన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో అయిజ నుంచి అలంపూర్ దాక 13 సొసైటీలు ఉండగా యాక్టివ్ ఉన్న సొసైటీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. గద్వాల నియోజకవర్గంలో 25 సొసైటీల్లో 38 సంఘాలు, 3,200 మంది లైసెన్స్‌దారులు ఉన్నారు. ఇక వీరి ఆర్థిక పరిస్థితిలు గమనిస్తే చాలా దయనీయంగా ఉన్నాయి. భద్రపరిచే పరికరాలేవీ..? రాష్ట్ర ప్రభుత్వం సహజసిద్ధ ఆర్థిక వనరులు పెంచే ప్రణాళికలో భాగంగా 2016–17 సంవత్సరానికి గాను రూ.వెయ్యి కోట్లు కేటాయించింది. ఇందులో రూ.900 కోట్లు నాబార్డు నుంచి రాగా కేవలం రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి చేపపిల్లను సరఫరా చేసింది. కానీ వీటిని భద్రపరిచేందుకు గాను టీవీఎస్ ఎక్సెల్ టాంటి మోపైడ్, బోట్లు, వల, ఐస్ బాక్స్ లాంటి పరికరాలు ఏవీ ఇవ్వలేదు. దీంతో పట్టిన చేపలను భద్రపరిచే పరిస్థితి లేకపవడంతో మత్స్యకారులు వాటిని మధ్యదళారీలకే అప్పగిస్తున్నారు. మధ్య దళారికే లాభాలు ఉదయం నుంచి సాయంత్రం దాక కష్టపడిన మత్స్యకారుడికి కడుపు నిండటం గగనంగా మారింది. రోజంతా కష్టపడితే 100 కిలోల చేపలు పడుతాయి. ఇందులో చేప బరువును బట్టి మార్కెట్లో ధర నిర్ణయిస్తారు. అయితే మార్కెట్లో అమ్మకంపై మెళకువలు తెలియని అసలైన మత్స్యకార్మికుడు దళారీకి చేపలు విక్రయిస్తున్నాడు. దీంతో కష్టపడిన మత్స్యకార్మికుడుకి రోజుకు సగటున రూ.150–200 వస్తే గగనం. ఇక అదే చేపలను కొనుగోలు చేసిన మధ్య దళారీ మాత్రం వాటిని హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు ఎగుమతి చేసి పెద్దఎత్తున లాభాలు పొందున్నాడు. లైసెన్సులు పొంది పేరు రిజిష్ట్రేషన్ చేయించుకున్న వారికి మత్స్యశాఖ అధికారులు మార్కెటింగ్‌పై ఎలాంటి శిక్షణ ఇవ్వకపోవడం, వారికి అవగాహన లేకపోవడంతో మధ్య దళారీలే లాభపడుతున్నారు. త్వరలో ఐఎఫ్‌డీఎస్ విధానం.. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఐఎఫ్‌డీఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీం) సమీకృత మత్స్య అభివృద్ధి పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఈ విధానం ద్వారా మత్స్యకారులకు 75 శాతం రుణ సౌకర్యం కల్పిస్తారు. అదేవిధంగా రూ.310 చెల్లించిన లైసెన్స్‌దారులకు కావాల్సిన పరికరాలు 75 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన ప్రతిపాదనలు సైతం పంపారు. అమాయకులు బలవుతున్నారు.. అలవి వలల విషయంలో అమాయకులైన స్థానిక మత్స్యకారులే బలవుతున్నారు. వీరి వెనక ఉన్న అసలైన మాఫియా మాత్రం తప్పించుకుంటున్నారు. దీనికంతా కారణం మత్స్యకారులకు మత్స్యశాఖ తగిన రుణ సౌకర్యాలు కానీ మార్కెటింగ్ స్కిల్స్, అవైర్నెస్ ప్రోగ్రాం నిర్వహించకపోవడమే. – అశోక్, ఉమ్మడి జిల్లా కార్యదర్శి, ముదిరాజ్ మహాసభ కఠిన చర్యలు తప్పవు.. ప్రభుత్వం నిషేధించిన వలల ను ఉపయోగించడం కా కుండా ఎలాంటి అనుమతి, లై సెన్స్లు లేకుండా చేపలను వే టాడుతు మత్స్యసంపదను కొల్లగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. స్థానికంగా కొందరు మా ఫియా దీని వెనక ఉండి నడిపిస్తున్నట్టు సమాచారం. తగిన ఆధారాలతో వారిని కూడా పట్టుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, ఎస్ఐ, అలంపూర్ -
మధ్యవర్తుల మీదకు కథ మళ్లింది..!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసును పక్కదోవ పట్టించేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నరసరావుపేట కేంద్రంగా నిర్వహించిన ఈ అక్రమ దందాలో పాలుపంచుకున్న రెవెన్యూ అ«ధికారులను కేసు నుంచి బయటవేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకొన్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసి, అనేక కీలక అంశాలను రాబట్టినట్లు తెలియవచ్చింది. తహసీల్దార్ కార్యాలయ అధికారి, సిబ్బంది సహాయంతోనే ఈ కిడ్నీ రాకెట్‌కు బీజం వేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే అధికారుల మధ్య సమన్వయ లోపమో లేక రాజకీయ ఒత్తిడో తెలియదుకాని అసలు మూలకారకులైన రెవెన్యూ యంత్రాంగం జోలికి వెళ్లకుండా మధ్యవర్తులను మాత్రమే నిందితులుగా చూపించేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నరసరావుపేటటౌన్ :కిడ్నీ రాకెట్ కేసులో అక్రమ పద్ధతిలో సర్టిఫికెట్లు మంజూరే చేసి అక్రమార్కులకు సహకరించిన రెవెన్యూ అధికారులపై అటు ఆ శాఖ ఉన్నతా«ధికారులు, ఇటు పోలీస్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. లేని బంధుత్వాన్ని ఉన్నట్లుగా చూపి అక్రమ పద్ధతిలో కిడ్నీ మార్పిడికి అనుమతులు పొందడం...దీనికి నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయం వెన్నుదన్నుగా నిలవడంపై రెవెన్యూ ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన విచారణ చేపట్టకపోవడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తుంది. దుర్గికి చెందిన ముడావత్ వెంకటేశ్వర్లు నాయక్ నరసరావుపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన రవికుమార్‌గా ఆధార్‌కార్డు పేరు మార్చి కిడ్నీ మార్పిడికి రెవెన్యూ శాఖ ద్వారా అనుమతులు పొందాడు. పోలీస్ విచారణలో నకిలీ ఆధార్‌కార్డు బాగోతం బయటపడటంతో ఈ వ్యవహారం ఎక్కడ తమమెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళనతో రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా ఒక వెంకటేశ్వర్లు నాయక్ సర్టిఫికెట్తో రెవెన్యూ అక్రమ సర్టిఫికెట్ల మంజూరు ఆగలేదు. విచారణలో మరో మూడు కిడ్నీ మార్పిడి సర్టిఫికెట్లు అక్రమ పద్ధతిలో జారీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో దళారులతో రెవెన్యూ అధికారులు చేతులు కలిపి అక్రమ సర్టిఫికెట్ల మంజూరుకు తెరలేపిన విషయం బహిరంగ రహస్యమే. దళారి చేతికి సర్టిఫికెట్స్‌తో బహిర్గతమైన అవినీతి.. కిడ్నీ మార్పిడికి సంబంధించి గతేడాది 9వ నెల నుంచి 11వ నెల వ్యవధిలో తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఐదు సర్టిఫికెట్లు మంజూరు చేశారు. వాటిలో కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పారిశ్రామిక వేత్త కారు డ్రైవర్ నాగమల్లేశ్వరరావు స్వయంగా సంతకం చేసి మూడు సర్టిఫికెట్లను కార్యాలయంలో పొందాడు. వెంకటేశ్వర్లు నాయక్ ఆధార్‌కార్డు మార్చిన విధంగానే మిగిలిన రెండు కిడ్నీ మార్పిడి వ్యవహారాల్లో రోగికి, దాతకు మధ్య లేని బంధుత్వాన్ని చిత్రీకరించేందుకు ఆధార్, రెసిడెన్స్ సృష్టించి అనుమతి çపత్రాలు పొందాడు. ప్రతి పనికి ఒక రేటుతో చక్కబెడుతున్న రెవెన్యూ అధికారులు ఈ వ్యవహారంలో కూడా భారీస్థాయిలో ముడుపులు తీసుకొని అక్రమ సర్టిఫికెట్లకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న నాగమల్లేశ్వరరావు ఎవరెవరికి ఎంత ముట్టజెప్పింది విచారణలో కక్కాడు. దీంతో కంగుతిన్న అవినీతి అధికారులు రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి తమపై చర్యలు లేకుండా వ్యవహారాన్ని చక్కదిద్దుకొనేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కిడ్నీ దందాలో రెవెన్యూ పాత్ర కీలకం కిడ్నీ మార్పిడి వ్యవహారంలో రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడి అడ్డదిడ్డంగా సర్టిఫికెట్లు మంజూరు చేయడంతో కిడ్నీ రాకెట్ పురుడుపోసుకుంటుంది. సర్టిఫికెట్ల ప్రారంభ దశలో అధికారులు నిజాయితీగా వ్యవహరిస్తే ఈ అక్రమానికి ఆస్కారం ఉండదనేది వాస్తవం. అయితే ఒక్క నరసరావుపేట తహసీల్దార్ కార్యాలయంలోనే ఈ సర్టిఫికెట్ల మంజూరు పత్రాలు పొందడం ఇక్కడి అధికారులకు, దళారులకు మధ్య ఉన్న సత్సంబంధాలను చాటుతుంది. చిన్నచిన్న తప్పిదాలపై ఉక్కుపాదం మోపే ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలించిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అవినీతి రెవెన్యూ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదో అంతుచిక్కడంలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరికొన్ని గంటల్లో కోర్టుకు హాజరు కిడ్నీ రాకెట్ కేసులో వెంకటేశ్వర్లు నాయక్, నాగమల్లేశ్వరరావు ఇచ్చిన సమాచారంతో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తున్న ఓ ఉద్యోగితో పాటు తెనాలిలో మరో ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. మొత్తం ఏడు కిడ్నీ మార్పిడిలకు అనుమతులు తీసుకోవడంతో పాటు దాతలకు ఇప్పించినట్లు సమాచారాన్ని సేకరించారు. అయితే కిడ్నీ మార్పిడిలో డబ్బులు చేతులు మారినందుకు దాత, తీసుకున్న వ్యక్తులను కూడా ముద్దాయిలుగా చేర్చాలా, వద్దా అన్న సందిగ్ధంలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ అధికారులను విచారించక పోవడం వెనుక రాజకీయ ఒత్తిడి దాగుందన్న అనుమానాలకు తావిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మరికొన్ని గంటల వ్యవధిలో నిందితులను కోర్టుకు హాజరుపరుస్తుండటంతో ఇప్పటిదాకా అనేక మలుపులు తిరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది. -
బ్రోకర్లకు షాక్: ఆ ఆఫీసుల్లోకి అనుమతించరు!
సాక్షి, చెన్నై(టీ.నగర్): సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఇకపై బ్రోకర్లను నిషేధిస్తూ తమిళనాడు రిజిస్ట్రార్ శాఖ సోమవారం ఉత్తర్వులిచ్చింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో బ్రోకర్ల కార్యకలాపాలు అధికంగా ఉంటూ వస్తున్నాయి. దీంతో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు పలువురు ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. దీనికి సంబంధించి మద్రాసు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలయింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పనితీరు గురించి కూడా న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలావుండగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బ్రోకర్లను రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రార్ శాఖ నిషేధం విధించింది. ఈ ఏడాది మార్చి నెల నుంచి ఈ చర్యలు అమలులోకి రానుంది. మార్చి నెల నుంచి ఆస్తులు కొనుగోలు చేసేవారు, విక్రయించేవారిని మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోకి అనుమతిస్తారని, అక్కడ బ్రోకర్లు కనిపిస్తే పోలీసుల ద్వారా కఠిన చర్యలు తీసుకుంటారని తమిళనాడు రిజిస్ట్రార్ శాఖ వెల్లడించింది. -
ఆర్డీవో కార్యాలయాల్లో షాడోలు
జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. సిబ్బంది చేయాల్సిన పనులకు షోడోలు అడ్డుపడుతున్నారు. పనికి రేట్లను ఫిక్స్ చేసి ప్రజలను దోచేస్తున్నారు. ఈ తంతు మొత్తం ఉన్నతాధికారులకు తెలిసే జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రతి ఆఫీసులో ఉన్న అవినీతి తిమింగలం నుంచి ప్రజలను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి, అమరావతి బ్యూరో: రెవెన్యూ డివిజన్ కార్యాలయాల్లో కొంత మంది ఉద్యోగులు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ప్రతి పనికి ఒకరేటు పెట్టి ప్రజలను దోచేస్తున్నారు. కార్యాలయ ఉన్నతాధికారులు సైతం వారికే వత్తాసు పలకడంతో మిగతా సిబ్బంది చేష్టలుడిగి చూడాల్సిన దుస్థితి దాపురించింది. గుంటూరు కలెక్టరేట్లో సైతం ఓ అధికారి డమ్మీగా మారినట్లు చర్చ సాగుతోంది. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారి పలుమార్లు సెలవులో వెళ్లాలని హెచ్చరించినట్లు సమాచారం. గుంటూరు ఆర్డీఓ కార్యాలయంలో.. ఈ కార్యాలయంలో ఓ డీటీ (డిప్యూటీ తహసీల్ధార్)స్థాయి అధికారి హవా నడుస్తోంది. మొత్తం ఆదాయ వనరులుగా ఉన్న సబ్జెక్టులు అతని వద్దనే ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారికి అతను చెప్పిందే వేదం. కార్యాలయంలో ఉండే సివిల్ సప్లయ్స్ కార్యాలయంలో కూడా పాలన గాడితప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్ధార్ కార్యాలయం.. ఇక్కడ వివిధ హోదాల్లో ఓ అధికారి తిష్ట వేసి, ఇష్టారాజ్యంగా ముడుపులు వసూలు చేస్తున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అడవి తక్కెళ్ల పాడులో అసైన్డ్ భూములకు దొంగపట్టాలు ఇవ్వటంలో సదరు ఉద్యోగి కీలకంగా వ్యవహరించినట్లు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. గతంలో తాను చేసిన అవినీతి బయట పడకుండా ఉండేందుకు ఈ కార్యాలయంలోనే ఉండేలా అధికార పార్టీనేతలను ఆశ్రయించి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం. తెనాలి ఆర్డీఓ ఆఫీసులో అన్నీ తానై... తెనాలి ఆర్డీఓ కార్యాలయంలో ఓ రెవెన్యూ అధికారి పెత్తనానికి అడ్డుఅదుపు లేకుండా పోయిం దని అక్కడి ఉద్యోగులే విమర్శిస్తున్నారు. కార్యాలయ అధికారిని కాదని, ప్రతి వ్యవహారంలో తలదూర్చి, పనికి రేట్లు ఫిక్స్ చేసి వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతనిపై వచ్చిన ఆరోపణలతో జిల్లాకు చెందిన ఓ మంత్రి బదిలీ సిఫారసు చేయడంతో ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలకార్యాలయాల్లో తహసీల్ధార్ రాసే రిపోర్టులకు సైతం కొర్రీలు వేసి, వాటిని ఆయనే తయారు చేసి డబ్బులు గుంజుతున్నట్లు చర్చ జరగుతోంది. డీటీలు దండుకుంటున్నారు.. నరసరావుపేట ఆర్డీఓ కార్యాలయంలో ఓ డీటీ కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. అక్కడ కార్యాలయంలో ఉన్న అధికారి, డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఎక్కడున్నారో చెప్పలేని దుస్థితి. గతంలో రెవెన్యూ ఇన్పెక్టర్గా ఆ డివిజన్‌లోనే పనిచేసిన సదరు అధికారి ప్రస్తుతం భూ వ్యవహారాల సెటిల్మెంట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. గురజాలలో గుంజుడెక్కువ.. గతంలో అధికార పార్టీ నాయకుడి వెంట తిరిగిన ఓ అధికారి ప్రస్తుతం వ్యవహారాలు చెక్కబెడుతున్నాడు. ఇతనిపై ఏసీబీ దాడులు జరిగినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉడటంతో ఉన్నతాధికారి సదరు అధికారిని పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద జిల్లాలో ఆర్డీఓ కార్యాలయాల్లో సమాంతర వ్యవస్థ నడుస్తోంది. జిల్లా కలెక్టర్ కోనశశిధర్ ఈ వ్యవహారాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తవానికి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులే అధికంగా వస్తున్నాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. -
ఫైనల్ లే అవుట్ రాలేదా? రెరాలో నమోదు తప్పనిసరి!
♦ విక్రయాలు జరిపే రియల్టీ పోర్టల్స్ కూడా రెరా పరిధిలోకే ♦ డెవలపర్లే కాదు.. బ్రోకర్లు, ఏజెంట్లూ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే ♦ రెరా అమలుతో రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ ప్రకటనల్లో జాగ్రత్త సాక్షి, హైదరాబాద్ దశాబ్దం క్రితం స్థానిక సంస్థల నుంచి ప్రాథమిక అనుమతులు తీసుకొని లే అవుట్లను చేసి కొనుగోలుదారులకు విక్రయించేసి.. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ లైన్ల వంటి ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా జారుకున్నారు డెవలపర్లు. ఫైనల్ లే అవుట్ అనుమతులనూ తీసుకోలేదు. అయితే త్వరలోనే తెలంగాణలో అమల్లోకి రానున్న రెరా నిబంధనల్లో ఫైనల్ లే అవుట్ తీసుకొని వెంచర్లను కూడా రెరా పరిధిలోకి చేర్చారు. దీంతో ఆయా లే అవుట్లలో ఇప్పుడు అభివృద్ధి పనులు జోరందుకున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను ధిక్కరిస్తే.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఏజెంట్లు రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ రాష్ట్రంలో మాత్రమే ప్లాట్ల క్రయ విక్రయాలు చేపట్టాలి. ఒకవేళ ఇతర రాష్ట్రాల్లోనూ స్థలాలను విక్రయించాలంటే సంబంధిత రాష్ట్రంలోని రెరా అథారిటీ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. రెరా వద్ద నమోదు చేయని ఫ్లాట్లను గానీ ప్లాట్లను గానీ విక్రయించడానికి వీల్లేదు. కేవలం రెరాలో నమోదు చేసుకున్న లే అవుట్లను మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు, బ్రోకర్లు రెరాలో నమోదు చేసుకోని పక్షంలో ప్రతి రోజూ రూ.10 వేల జరిమానా కట్టాల్సి ఉంటుంది. రెరా నిబంధనలను పాటించకపోతే ప్లాట్ విలువలో 5 శాతం జరిమానా, అప్పిలెట్ ట్రిబ్యునల్ ఆర్డర్లను దిక్కరిస్తే మాత్రం ప్లాట్ విలువ 10 శాతం జరిమానా, ఏడాది పాటు జైలు శిక్ష. రెండూ కూడా విధించవచ్చు. టైటిల్ గ్యారెంటీ ఇవ్వాల్సిందే.. హెచ్ఎండీఏ పరిధిలోనే కాదు డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ) పరిధిలోని లే అవుట్లను కూడా రెరా అథారిటీ వద్ద నమోదు చేసుకోవాల్సిందే. కొనుగోలుదారులకు టైటిల్ గ్యారెంటీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పైగా లే అవుట్లలో చేసే మౌలిక వసతులకు ఐదేళ్ల గ్యారెంటీ బాధ్యత కూడా డెవలపర్లదే. బ్రోచర్లో పేర్కొన్న విధంగా వెంచర్‌లోని అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేయాలి. లేకపోతే స్థల యజమానే కాదు ఏజెంటూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ‘‘అనుమతుల, పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసే ప్రభుత్వం మాత్రం డెవలపర్‌కు టైటిల్ గ్యారెంటీ ఇవ్వదు. కానీ, డెవలపర్ మాత్రం కొనుగోలుదారులకు ఇవ్వాలనడం సరైంది కాదని’’ రామ్ డెవలపర్స్ ఎండీ వనపర్తి రాము తెలిపారు. విక్రయాలు జరిపే పోర్టల్స్ రెరా పరిధిలోకే... ఆన్లైన్ ప్రాపర్టీ పోర్టల్స్ అడ్వరై్టజ్‌మెంట్ మాత్రమే చేస్తే రెరాలో నమోదు అవసరం లేదు. ఒకవేళ ఆయా పోర్టల్స్ డెవలపర్ల నుంచి కమీషన్ తీసుకొని ప్రాపర్టీలను విక్రయిస్తే మాత్రం రెరాలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. ప్రకటనల విషయంలోనూ పోర్టల్స్ ఇష్టానుసారంగా వ్యవహరించడానికి వీల్లేదు. రెరాలో నమోదు చేసుకున్న ప్రాజెక్ట్‌లు, వెంచర్లను మాత్రమే ప్రచారం చేయాల్సి ఉం టుంది. అలాగే పత్రికలు, ప్రసార మాధ్యమాలు సైతం ఆయా ప్రాపర్టీలకు రెరా నంబరుం టేనే ప్రకటనలను తీసుకోవాలి. లేనిపక్షంలో భవిష్యత్తులో కొనుగోలుదారుల నుంచి ఎదురయ్యే సవాళ్లకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ధరలు పెంచనున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లు.. రెరాలో భవన నిర్మాణ కాంట్రాక్టర్లు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రెరా అమలయ్యాక నిర్మాణ గ్యారెంటీ విషయంలో మాత్రం డెవలపర్‌కు, కాంట్రాక్టర్లకు మధ్య జరిగే ఒప్పంద పత్రంలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రస్తుతం భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, డెవలపర్ల మధ్య జరిగే ఒప్పంద పత్రంలో చ.అ. ధరలు, నిర్వహణ బాధ్యతలు తదితరాలుంటాయి. కానీ, రెరా అమలు తర్వాతి నుంచి భవన నిర్మాణ నాణ్యత విషయంలోనూ కాంట్రాక్టర్లు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని ఓ డెవలపర్ తెలిపారు. ఎందుకంటే కొనుగోలుదారులకు నిర్మాణ గ్యారెంటీ బాధ్యత వహించేది డెవలపర్లే కాబట్టి! దీంతో ఇప్పటివరకు ఏడాది లీకేజీ నిర్వహణ బాధ్యతలకు మాత్రమే పరిమితమైన ఒప్పంద పత్రం నిబంధనల్లో రెరాతో ఐదేళ్ల గ్యారెంటీ నిబంధన కూడా ఉంటుందని తెలిపారు. అయితే నిర్వహణ కాలపరిమితి పెరగడంతో నిర్మాణ ధరలనూ పెంచక తప్పని పరిస్థితి అని కాంట్రాక్టర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ సచితానంద్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం సాధారణ నిర్మాణాలకు చ.అ.కు రూ.1,200, ఏడంతస్తుల వరకైతే రూ.1,350, ఆపైన నిర్మాణాలకైతే రూ.2 వేలపైమాటే చార్జీలున్నాయి. ఇవి రెరా అమలు తర్వాతి నుంచి సుమారు చ.అ. రూ.50–100 పెరుగుతాయని పేర్కొన్నారు. రియల్టీ బ్రాండ్ అంబాసిడర్లూ జాగ్రత్త.. ఈ మధ్య కాలంలో స్థిరాస్తి సంస్థలు బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకునే సంస్కృతి పెరిగింది. అయితే గతంలో లాగా అంబాసిడర్లు కేవలం ప్రాజెక్ట్ వారీగా ఒప్పందం చేసుకుంటే సరిపోదు. రెరా అమలయ్యాక సంబంధిత ప్రాజెక్ట్ రెరాలో రిజిస్టరైందా? అనుమతి పత్రాలన్నీ సరిగా ఉన్నాయా? బ్రోచర్లో పేర్కొన్న హామీలనే ప్రకటనల్లోనూ చెబుతున్నాడా? వంటి అంశాలనూ పరిశీలించాల్సి ఉంటుంది. లేకపోతే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించే కొనుగోలుదారులకు బ్రాండ్ అంబాసిడర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు డెవలపర్లు బ్రోచర్లో లేని హామీలను సైతం బ్రాండ్ అంబాసిడర్ల చేత ప్రకటనలు చేయిస్తుంటారు. వీటికి ఆకర్షితులైన కస్టమర్లు కొనుగోళ్లు చేసేశాక.. హామీలు నెరవేర్చలేదనే కారణంగా ఫోరంను ఆశ్రయిస్తే గనక ప్రకటనల్లో నటించినందుకు గాను బ్రాండ్ అంబాసిడర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పునిచ్చే అవకాశముంది. ⇔ ఆంధ్రప్రదేశ్‌లో నాగార్జున వర్సిటీ పక్కన ఖాజా గ్రామంలో రామకృష్ణ హౌజింగ్ నిర్మిస్తున్న వెనుజియా ప్రాజెక్ట్‌కు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో డ్రీమ్ ఇండియా నిర్మిస్తున్న డ్రీమ్ రిసార్ట్‌కు అనిల్ కపూర్, సువర్ణ భూమి సంస్థకు ఎస్పీ బాల సుబ్రమణ్యం, కె విశ్వనాథ్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. -
నిర్వాసితులపై దళారుల పంజా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఒక రైతు తనకున్న 40 ఎకరాల భూమిని పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వానికి ఇచ్చాడు. ఇంతలో ఓ దళారి రంగప్రవేశం చేశాడు. సొమ్ములు ఇస్తేనే ఆ భూమికి సంబంధించిన నష్టపరిహారం అందుతుందని.. లేదంటే నీ సంగతి అంతేనంటూ భయపెట్టాడు. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఆ రైతుతో సంతకం చేయించుకున్నాడు. మూడు ఖాళీ చెక్కులు సైతం తీసుకున్నాడు. భూసేకరణ జరిపిన ఐటీడీఏ పీఓ షణ్మోహ¯ŒS నేరుగా ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేయించారు. అయినా.. దళారి ఊరుకోలేదు. తనవల్లే ఆ పని అయ్యిందని, ఎకరానికి రూ.50 వేల చొప్పున 40 ఎకరాలకు రూ.20 లక్షలు చెల్లించాలని పట్టుబట్టాడు. లేదంటే తనవద్ద ఉన్న స్టాంప్ పేపర్, బ్యాంకు చెక్కులను వినియోగించి రకరకాల కేసులు వేయిస్తానని బెదిరించాడు. దిక్కులేని పరిస్థితిలో ఆ దళారికి రైతు రూ.20 లక్షలు ముట్టజెప్పాడు. ఈ విషయం బయటపడితే తనను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తాడోననే భయంతో నోరు మెదపటం లేదు. ఇదిలావుంటే.. దర్భగూడెం గ్రామానికి చెందిన మరో రైతుకు అదే గ్రామంలో 7 ఎకరాల భూమి ఉంది. 30 ఏళ్లుగా ఆ భూమిని మరొకరు అనధికారికంగా సాగు చేసుకుంటున్నారు. అప్పట్లో ఏజెన్సీలో తలెత్తిన ఘర్షణల కారణంగా ఆ రైతు ఊరొదిలి వెళ్లిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆ భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో ఆ రైతు ఖాతాలో పరిహారం సొమ్ము జమ చేశారు. అంతకుముందే దళారులు అతని నుంచి చెక్కులు తీసుకున్నారు. అతనికి అందిన పరిహారంలో సగం సొమ్ము తీసుకున్నారు. అందులో కొంత సొమ్మును అనుభవదారుకు ఇచ్చారు. దీంతో లబోదిబోమనడం అటు రైతు, ఇటు భూమి అనుభవదారుల వంతయ్యింది. పెచ్చుమీరిన పర్సంటేజీల దందా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల నిర్వాసితులయ్యే వారి కోసం సేకరిస్తున్న భూముల విషయంలో దళారుల దందా పెచ్చుమీరింది. భూములిచ్చిన రైతులకు చెల్లించే పరిహారం వారికి అందాలంటే తాము అడిగినంత సొమ్ము ఇవ్వాల్సిందేనంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ వల్ల ముంపుబారిన పడే వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని నిర్వాసిత గిరిజనులకు భూమికి భూమి ఇచ్చేందుకు జీలుగుమిల్లి మండలం లోని దర్భగూడెం, ములగలంపల్లి, స్వర్ణవారిగూడెం, పి.అంకంపాలెం, పి.నారాయణపురం, రాచన్నగూడెం, బుట్టాయగూడెం, దొరమామిడి గ్రామాల్లో 4,035 ఎకరాల భూమిని అధికారులు సేకరించారు. భూములిచ్చిన రైతులకు పరిహారం సొమ్మును వారి ఖాతాల్లో జమ చేశారు. అప్పటికే వారినుంచి ఖాళీ చెక్కులు, స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకున్న దళారులు తాము అడిగినంత సొమ్ములు ఇవ్వకపోతే పరిహారం సొమ్ము వెనక్కి వెళ్లిపోయేలా చేస్తామని బెదిరిస్తూ వసూళ్ల పర్వానికి తెగబడుతున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. దర్భగూడెంలో 230 ఎకరాలు సేకరించగా.. ఒక చోటా నాయకుడు రైతుల నుంచి పెద్దఎత్తున వసూళ్లకు పాల్పడినట్టు సమాచారం. కేసులు తప్పవు పరిహారం అందిన రైతుల నుంచి ఎవరైనా కమీషన్ల రూపంలో సొమ్ములు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని భూసేకరణ అధికారి షణ్మోహన్ తెలిపారు. బాధితులు తనకు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు. -
రవాణా శాఖలో దళారుల దందా
⇒ వాహనదారుల్ని బ్రోకర్ల వద్దకు పంపుతున్న కార్యాలయ సిబ్బంది ⇒ నేరుగా కార్యాలయాల్లో బేర సారాలు సాగిస్తున్న వైనం నగరంపాలెం (గుంటూరు): గుంటూరు రవాణాశాఖ కార్యాలయం దళారుల కనుసన్నల్లో నడుస్తోంది. బ్రోకర్లు కిందిస్థాయి సిబ్బంది మిలాఖత్ అయి దందా నడిపిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. వాహనదారుడు కొత్త వాహనం కొన్నదగ్గర్నుండి రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్.. ఇలా అన్ని పనులకు ఒక రేటు నిర్ణయించి సొమ్ము చేసుకుంటున్నారు. సదరు అధికారులే దళారుల్ని పిలిపించి బేరసారాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అందుకు చక్కటి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటనే. పాత గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి టాక్సు చెల్లించడానికి రాగా సిబ్బంది చుక్కలు చూపించి మూడు చెరువుల నీళ్లు తాగించారు. చివరకు కొంత డబ్బు ఇవ్వాలని పీడించి వసూలు చేసి పని చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరాసరి దళారుల వద్దకే.. పాతగుంటూరుకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కారు కొనుగోలు చేశాడు. సదరు వాహనం రిజిస్ట్రేషన్ ట్యాక్సీ పేరుతో ఉండటంతో నాన్‌ట్రాన్స్‌పోర్టు వాహనంగా మార్చుకోవడానికి ఫిబ్రవరి 1న గుంటురు ఉప రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. వివరాలు ఎవరిని అడగాలో తెలియక గంటల పాటు ఇబ్బంది పడ్డాడు. చివరికి ట్యాక్సీ క్యాబ్‌లో సెక్షన్ సిబ్బందిని విచారించగా సదరు వ్యక్తులు సరాసరి దళారుల వద్దకు వెళితే పని అవుతుందని సూచించగా వాహనదారుడు అవాక్కయ్యాడు. హెల్ప్ డెస్క్ నుంచే దందా షురూ.. రవాణా శాఖ కార్యాలయం సమాచారం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ అధికారులే బ్రోకర్లను ఆశ్రయించాలని సూచిస్తున్నారు. వాహనం కొనుగోలు చేసేటప్పుడు అవగాహన లేక ఎంతో మంది ఇలా మోసపోతూనే ఉన్నారు. గట్టిగా నిలదీస్తే చేయాల్సిన పనిని ఆపి నెలల పాటు కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి అడ్డుకట్ట వేయాలని వాహనదారులు కోరుతున్నారు. ప్రతి పనీ సెప‘రేటు’.. కార్యాలయంలో ఓ దళారి తాను ఎంవీఐ డ్రైవర్‌నని పరిచయం చేసుకొని లైఫ్ టాక్స్ రూ.23 వేలతో పాటు మరో రూ.5 వేలు లంచం ఇవ్వాలని సూచించాడు. సదరు వాహనదారుడు చేసేందేంలేక అందుకు ఒప్పుకున్నాడు. వాహనాన్ని బ్రేక్ వద్దకు తీసుకెళ్లి దళారే కార్యాలయంలో గుమస్తాలతో దరఖాస్తు పత్రాలపై సంతకాలు చేయించాడు. ఇతర దళారులకు ఇదే పని నెల రోజులు పడుతుందని, తాను మూడు రోజుల్లోనే చెప్పి లైఫ్ ట్యాక్స్ కాక అదనంగా అడిగిన నగదు తీసుకున్నాడు. అప్పటి నుంచి పనిని వాయిదా వేస్తూ 24వ తేదీన ఫోన్లో సంప్రదించగా లైఫ్ టాక్స్ రూ.28 వేలు అని, మరో రూ. 5 వేలు ఇస్తే తప్ప పని జరగదని చెప్పాడని బాధితుడు వాపోయాడు. చివరికి చేసేదేంలేక ఉసూరుమంటూ నగదు చెల్లించాడు. ఇలాంటి ఘటనలు రోజుకు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. కానీ బయటకు వచ్చేవి మాత్రం కొన్నే..! -
తెలుగు రాష్ట్రాల్లో కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
-
కొత్త నోట్ల బ్లాక్ మార్కెట్
♦ తెలంగాణ, ఏపీలో దొడ్డిదారిన భారీగా చేతులు మారిన రూ. 2 వేల నోట్లు ♦ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలులో దళారుల దందా ♦ ఈ ఐదు నగరాల్లో బ్యాంక్‌ల నుంచి భారీగా నగదు జారీ చేసిన బ్యాంకర్లు ♦ హైదరాబాద్‌లో 24 మంది ఉన్నతాధికారులపై విచారణ ప్రారంభం ♦ విజయవాడ, గుంటూరు, కర్నూలులో13 మంది అధికారుల అక్రమాలు పెద్ద మొత్తంలో నగదు బయటకు రావడంపై రిజర్వు బ్యాంక్ ఆరా కమీషన్ ప్రాతిపదికన పెద్దనోట్లు అందించినట్లు ఆరోపణలు బేగంపేట్‌లో ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి భారీగా నగదు బయటకు.. సహకార బ్యాంక్‌ల నుంచి రాజకీయ ప్రముఖులకు పెద్ద ఎత్తున నగదు! రూ. 2 వేల నోట్ల సరఫరా, వినియోగంపై లెక్కలు తేల్చేపనిలో కేంద్ర ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్ గుట్టుచప్పుడు కాకుండా కొత్త నోట్ల బ్లాక్ మార్కెటింగ్ పెద్ద ఎత్తున జరుగుతోందా? అందులో ఏకంగా బ్యాంకు అధికారులే భాగస్వాములయ్యారా? కమీషన్ ప్రాతిపదికన పాత నోట్లకు కొత్త నోట్లను ఇచ్చేస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! తెలంగాణ, ఏపీల్లోని ప్రభుత్వరంగ బ్యాంకుల సీనియర్ అధికారులు కొందరు రూ. 2 వేల నోట్లను బ్లాక్‌మార్కెటింగ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇష్టానుసారంగా ఈ నోట్లను కమీషన్ ప్రాతిపదికన బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు తేలింది. రూ.1,000, 500 నోట్లను రద్దు చేసిన రెండోరోజు అంటే గురువారం నుంచి ఆదివారం దాకా భారీగా రూ.2 వేల నోట్లు పక్కదారి పట్టాయి. ప్రధాని పెద్ద నోట్ల రద్దు విషయాన్ని ప్రకటించిన రెండోరోజు 40 శాతంగా ఉన్న కమీషన్ల దందా మంగళవారం వచ్చేసరికి 25 శాతానికి తగ్గింది. రూ.2 వేలనోట్లు భారీగా చలామణిలోకి రావడం వల్లే ఇలా జరిగిందని, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఈ దందా జోరుగా సాగుతోందని నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి. దీంతో మంగళవారం నుంచి బ్యాంక్ శాఖల వద్ద నిఘా పెరిగింది. ముఖ్యంగా గురువారం నుంచి ఆదివారం దాకా భారీ ఎత్తున నగదు బయటకు తరలించినట్లు తేలిన బ్యాంక్ శాఖల సిబ్బందిని పక్కనబెట్టి ఇతర శాఖల ఉద్యోగులను సర్దుబాటు చేశారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు చెందిన 24 మంది సీనియర్ అధికారులు, విజయవాడ, గుంటూరు, కర్నూలులో 13 మంది అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు రిజర్వు బ్యాంక్ గుర్తించింది. తీగలాగితే డొంక కదిలిందిలా.. రిజర్వు బ్యాంక్ హైదరాబాద్ విభాగంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు తన సమీప బంధువు ఒకరు ఫోన్ చేసి.. తన దగ్గర ఉన్న రూ.25 లక్షల పాత నోట్లు తీసుకుని కొత్తవి రూ.20 లక్షలు ఇస్తామంటున్నారు నమ్మవచ్చా అని అడిగారు. సదరు అధికారి మాటల్లో పెట్టి తన బంధువు నుంచి ఎవరు సమకూర్చబోతున్నారు? అతనికి ఎవరు ఇస్తామన్నారు? వంటి వివరాలను సేకరించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే దిల్షుక్నగర్ సమీపంలోని సిండికేట్ బ్యాంక్‌కు చెందిన ఇద్దరు సిబ్బందిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే ఆ బ్యాంక్ నుంచి నగదు మార్పిడి పేరిట డూప్లికేట్ పత్రాలు సృష్టించి రూ.50 లక్షల దాకా బయటకు తరలించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో ఓ బ్యాంక్ చీఫ్ మేనేజర్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ ప్రభుత్వరంగ బ్యాంక్ చీఫ్ మేనేజర్ తనకు సన్నిహితుడైన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి 25 శాతం కమీషన్‌పై గత ఆదివారం రూ.2.5 కోట్లు సమకూర్చారు. ఆ నగదు విత్‌డ్రాకు ఆయన గడచిన గురు, శుక్రవారాల్లో నగదు మార్పిడికి వచ్చిన వారి పత్రాలను డూప్లికేట్ చేశారు. ఇంతపెద్దమొత్తంలో నగదు ఎందుకు విత్‌డ్రా చేశారని రిజర్వుబ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు ప్రశ్నిస్తే మొదటి రెండు రోజులు వచ్చినవారే నాలుగోరోజు వచ్చారని బుకాయించారు. సోమవారం బ్యాంక్ సెలవు దినం కావడంతో దీనిపై మగంళవారం విచారణ ప్రారంభమైంది. ఒక్క జూబ్లీహిల్స్లోనే కాదు... నెల్లూరులో ప్రభుత్వ రంగ బ్యాంక్‌కే చెందిన ఓ సీనియర్ మేనేజర్ తన బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.2 కోట్ల విలువైన వంద నోట్లను ఓ వడ్ల వ్యాపారికి విత్‌డ్రా చేసి ఇచ్చాడు. చిల్లర లేదని ఇబ్బంది పడుతూ నగదు మార్పిడికి వచ్చిన వారికి మాత్రం ఆయన రూ.2000 నోట్లు ఇచ్చాడు. వంద నోటు కావాలని గొడవ చేసినా లేవంటూ వడ్ల వ్యాపారికి మాత్రం కమీషన్‌కు ఆ నోట్లు అమ్ముకున్నట్లు ఆధారాలతో సహా ఫిర్యాదు అందింది. దీనిపైనా విచారణ ప్రారంభమైంది. విజయవాడలోనూ ఇదే తంతు విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వరంగ బ్యాంక్‌కు చెందిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాలుగు బ్యాంక్‌లకు అందించాల్సిన రూ.12.5 కోట్ల నగదులో నాలుగో వంతు తాను పంపించిన వారికి ఇవ్వాలంటూ బ్రాంచ్ మేనేజర్లను పురమాయించాడు. పాత నోట్ల మొత్తానికి 30 శాతం తక్కువగా కొత్తవాటిని సరఫరా చేశారు. ఈ నోట్లు తీసుకున్న వారు వెంటనే ఏలూరులో 40 శాతం కమీషన్‌కు పాత నోట్లు తీసుకుని పంపిణీ చేశారు. ఈ విషయం తెలిసి అధికారులు పోలీసులను అప్రమత్తం చేసే లోపే దళారులు జారుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాల్లో ఈ దందా సాగుతోంది. ‘‘రూ.1000, రూ.500 పాత పెద్ద నోట్లు ఉంటే చెప్పండి...30 శాతం తక్కువకు కొత్త రూ.2000 నోట్లు సరఫరా చేస్తాం. మీ దగ్గర లేకపోతే మీకు తెలిసిన వారి దగ్గర ఉన్నా చెప్పండి. ఎంతైనా ఫర్వాలేదు. మేం పాతవి తీసుకుని కొత్తవి ఇవ్వడానికి సిద్ధం’’ అనేక చోట్ల ఇప్పుడు ఇదే సంభాషణ. అత్యవసరంగా నగదు కావాలనుకునే వారి నుంచి 40 నుంచి 50 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు. హైదరాబాద్ బేగంపేట్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు సమకూర్చిన మొత్తంలో 80 శాతం నగదు బయటకు తరలించిన విషయం రిజర్వు బ్యాంక్ దృష్టికి వచ్చింది. దీంతో మంగళవారం ఆ బ్యాంక్‌కు బయటి నుంచి సిబ్బందిని తెప్పించి నగదు మార్పిడి, డిపాజిట్ల కార్యకలాపాల బాధ్యతలు అప్పగించారు. నగదు తరలింపుపై కన్ను హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాల నుంచి బ్యాంక్‌ల నుంచే భారీ ఎత్తున అక్రమంగా రూ.2 వేల నోట్లు బయటకు వస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ గుర్తించింది. రూ.500 నోట్లను తెలుగు రాష్ట్రాల్లో బ్యాంక్‌లకు అందజేస్తే ప్రమాదకరమని కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ సోమవారం ఉదయమే ముంబైలోని రిజర్వ్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని హెచ్చరించారు. అందువల్లే మంగళవారం ఇక్కడి బ్యాంక్‌లకు అందాల్సిన రూ.500 నోట్లను కావాలనే నిలుపుదల చేసినట్లు రిజర్వు బ్యాంక్ ఉన్నతాధికారి ఒకరు సాక్షి ప్రతినిధికి చెప్పారు. రూ.2,000 నోట్లను బహిరంగ మార్కెట్‌కు తరలించిన సీనియర్ అధికారులను గుర్తించామని, అతి త్వరలోనే వారిపై వేటు వేయడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు. ఒక్క హైదరాబాద్‌లోనే వివిధ ప్రభుత్వ రంగ బ్యాంలకు చెందిన 24 మంది ఉన్నతాధికారుల వ్యవహారశైలిపై రిజర్వుబ్యాంక్ విచారణ జరుపుతోంది. మామూలు కంటే నగదు విపరీతంగా బయటకు తరలించిన బ్రాంచ్‌లు వాటికి కారకులైన అధికారుల జాబితాను రిజర్వుబ్యాంక్ ఇప్పటికే ఆయా బ్యాంక్‌ల యాజమాన్యాలకు అందజేసింది. విజయవాడ, గుంటూరు, కర్నూలులోనూ ఇలాంటి కార్యకలాపాలకుపాల్పడిన 13 మంది సీనియర్ అధికారులపైనా కన్నేసి ఉంచాలని రిజర్వుబ్యాంక్ సదరు బ్యాంక్‌ల ఉన్నతాధికారులను ఆదేశించింది. కమీషన్లపై ఐబీ నివేదిక హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, అనంతపురంలో కమీషన్ల ప్రాతిపదికన పెద్ద ఎత్తున నగదు మార్పిడి జరుగుతోందంటూ ఇంటలిజెన్స్ బ్యూరో (ఐబీ) కేంద్ర ఆర్థిక శాఖకు నివేదించింది. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురంలో ఇది జోరుగా సాగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. బ్యాంక్ సిబ్బంది లాలూచీ కారణంగానే పాత నోట్ల బ్లాక్ మార్కెటింగ్ అధికమైందని నివేదికలో తెలిపింది. అనంతపురం జిల్లాకు పొరుగున కర్ణాటక సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి కోట్ల రూపాయల్లో రూ.2 వేల నోట్లు వచ్చి చేరుతున్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు హైదరాబాద్, విజయవాడ నుంచి వ్యాపారులు అనంతపురంలో తిష్ట వేశారని కూడా ఐబీ హెచ్చరించింది. దీంతో మంగళవారం అనంతపురం సరిహద్దులోని కర్ణాటక బ్యాంక్‌ల వద్ద పెద్దఎత్తున పోలీసులను మోహరించారు. సహకార బ్యాంక్‌ల్లో నగదు పంపిణీ బంద్ రూ.1000, రూ.500 నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించిన తర్వాత నగదు మార్పిడికి రాష్ట్రాల ఆధీనంలోని సహకార బ్యాంక్‌లకు రిజర్వు బ్యాంక్ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బ్యాంక్‌లకు చేరిన మొత్తం ఖాతాదారులు, నగదు మార్పిడి కోసం వచ్చిన వారి కంటే స్థానికంగా రాజకీయ పలుకుబడి ఉన్న వారికే చేరుతున్నాయని గ్రహించింది. దీంతో రిజర్వుబ్యాంక్ మంగళవారం నుంచి ఆ బ్యాంకుల్లో కార్యకలాపాలను నిలుపుదల చేసింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో సహకార బ్యాంక్‌ల నుంచి భారీగా డబ్బు రాజకీయ ప్రముఖులకు చేరినట్లు ఇంటలిజెన్స్ బ్యూరో గుర్తించింది. దీన్ని కొనసాగిస్తే ప్రమాదకరమని, రూ.2 వేలు, రూ.500 నోట్లు బ్లాక్‌మార్కెట్ అవుతాయని హెచ్చరించింది. దీంతో దేశవ్యాప్తంగా సహకార బ్యాంక్‌ల నుంచి నగదు కార్యకలాపాలు నిషేధిస్తున్నట్లు రిజర్వుబ్యాంక్ మంగళవారం ప్రకటించింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది కూడా వెల్లడించలేదు. ఆయా రాష్ట్రాల్లో సహకార బ్యాంక్‌లకు తరలించిన నగదు వివరాలపై విచారణ జరపాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించింది. -
అవినీతి సొమ్ము మార్చేదెలా?
అధికార పార్టీ నేతల్లో గుబులు విశాఖపట్నం: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా కోట్లు కూడబెట్టిన అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు కంటిపై కునుకు కరువైంది. ఇసుక నుంచి రేషన్‌షాపు డీలర్‌షిప్‌ల వరకు, సీసీ రోడ్ల నుంచి ఇళ్ల క్రమబద్ధీకరణ వరకు ప్రతి పనిలో కిక్‌బ్యాగ్‌లు, పర్సంటేజ్‌లు తీసుకుంటూ సంపాదించిన సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. కొందరు హవాలా మార్గంలో మార్చుకునేందుకు చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. సిండికేట్‌లో చక్రం తిప్పే ఓ ప్రజాప్రతినిధితో పాటు పోర్టు వ్యాపారాల లావాదేవీల్లో కింగ్‌మేకర్‌గా ఉన్న మరో ప్రజాప్రతినిధి ఈ తరహాలో బ్లాక్‌ను వైట్ చేసుకుంటున్నట్టు గుసగుసలు విన్పిస్తున్నారుు. గ్రామీణ జిల్లా పరిధిలోనూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు హవాలా బ్రోకర్ల ద్వారా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. గడిచిన వారం రోజుల్లో ఇలా వందల కోట్ల బ్లాక్‌మనీ వైట్‌గా మారినట్టు తెలిసింది. తొలుత ఎక్స్చేంజ్కు 20 శాతం కమిషన్ తీసుకున్న ఈ బ్రోకర్లు ప్రస్తుతం 30 నుంచి 35 శాతం వరకు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. పన్ను పరిధిలోకి రాకుండా ఉండేందుకు.. చోటామోటా నాయకులు తమకు పరిచయం ఉన్న బ్యాంకు మేనేజర్ల ద్వారా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా మార్చిన సొమ్ము పన్నుల పరిధిలోకి రాకుండా ఉండేందుకు వివిధరూపాల్లో బ్యాంకులో జమైనట్టుగా చూపించి సర్దుబాటు చేస్తున్నారు. మరోవైపు ఏడాది వరకు ఎలాంటి వడ్డీ లేకుండా వ్యాపారస్తులకు అప్పులిస్తున్నారు. తొలి రెండురోజులు జన్‌ధన్ ఖాతాల్లో జమ చేరుుంచినా ఆ డిపాజిట్లపై ఇన్‌కంటాక్స్ నిఘా పెట్టిందన్న వార్తల నేపథ్యంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారు. డిసెంబర్ 30 వరకు మార్చుకునే అవకాశం ఉండడంతో ఏదో విధంగా వైట్ చేసుకోవాలన్న తపనతో పరుగులు పెడుతున్నారు. -
బ్రోకర్ల బరితెగింపు..
– బహిరంగ మార్కెట్లో ఇళ్ల పట్టాలు – రూ.5 వేల నుంచి రూ.50 వేలిస్తే చాలు – తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ! – రెవెన్యూ పాత్రపైనా అనుమానాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు :మీకు ఇంటి స్థలం లేదా.. సొమ్ములిస్తే క్షణాల్లో మీ పేరిట ఇంటిస్థలం పట్టా వచ్చేస్తుంది. సాక్షాత్తు ప్రభుత్వం తరఫున అధికారులు గతంలోనే మీకు స్థలం కేటాయించినట్టు పట్టా పుట్టేస్తుంది. ప్రధాన సెంటర్లో ఇంటి పట్టా కావాలన్నా.. గ్రామీణ ప్రాంతంలో స్థలమైనా ఫర్వాలేదు. అయితే, మీరు కోరే స్థలాన్ని బట్టి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు సొమ్ము చెల్లిస్తే చాలు. ఈ పరిస్థితి జిల్లా వ్యాప్తంగా వేళ్లూనుకుంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఏలూరులోనూ ఈ దందా నడుస్తోంది. ఇంటిస్థల పట్టాలను సర్కారు రాజముద్ర, రెవెన్యూ శాఖ స్టాంపులతోపాటు అధికారుల సంతకాలు చేసి మరీ దొంగచాటుగా జారీ చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ స్థలాలను, గతంలో బినామీ పేర్లతో కేటాయించిన ఇంటి స్థలాల వివరాలను దళారులు సేకరించి.. వాటికి పట్టాలను సిద్ధం చేస్తున్నారు. ఏలూరులో ఇలా జిల్లా కేంద్రమైన ఏలూరులో ఇలాంటి బాగోతం శుక్రవారం వెలుగు చూసింది. నగరంలోని మార్కండేయస్వామి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న నిరజంన్సింగ్ ఠాకూర్ ఇంట్లో సోదా చేయగా రెవెన్యూ అధికారులకు డాక్యుమెంట్లు లభించాయి. ఏలూరు తహసీల్దారుగా పనిచేసిన ఏజీ చిన్నికష్ణ సంతకంతో నాలుగు ఇంటి స్థల పట్టాలు కూడా బయటపడ్డాయి. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో ఉండాల్సిన రెవెన్యూ రికార్డు ఒరిజనల్ ఫైల్ కూడా ఈ దాడుల్లో లభ్యమైంది. ఏలూరు మండలం సుంకర వారితోటలో లంకా నాగేశ్వరరావు ఇంటిపై దాడులు నిర్వహించగా నాలుగు ఖాళీ ఇంటిస్థల పట్టాలు లభించాయి. వీటిని పరిశీలించిన రెవెన్యూ అధికారులు ముక్కున వేలేసుకున్నారు. తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసి.. ఏలూరులో లభ్యమైన ఇంటి పట్టాలని పరిశీలిస్తే.. గతంలో పనిచేసిన తహసీల్దార్ల సంతకాలను ఫోర్జరీ చేసినట్టు వెల్లడైంది. సంబంధిత తహసీల్దార్ స్టాంపును, తహసీల్దార్ కార్యాలయం రాజముద్రను బ్రోకర్లు తయారు చేయించినట్టు సమాచారం. వీటికి తోడు నోటరీ అఫిడవిట్‌ను జారీ చేసేందుకు అవసరమైన న్యాయవాదులకు సంబంధించిన స్టాంపులను కూడా తయారు చేయించుకున్నారు. అసలుకు, నకిలీకి తేడా లేకుండా ఖాళీ పట్టాలను సిద్ధం చేసుకుంటున్నారు. పేదవాళ్ల అవసరాలను, నివాస స్థలాల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగే వారిని గుర్తించి వారికి పట్టాలు మంజూరు చేయిస్తామంటూ నమ్మిస్తున్నారు. అధికారులకు రూ.వేలల్లో ముట్ట చెప్పాలంటూ వారి వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత ఒక పట్టాను రాసిచ్చేస్తున్నారు. తీరా స్థలంలోకి వెళ్లాక అధికారులు అభ్యంతరం పెట్టడం, అదే స్థలంలో వేరే వారు ఉండటంతో పట్టాలు పొందిన వారు లబోదిబోమంటున్నారు. వీటిపై ఫిర్యాదు చేసేందు మీ కోసం కార్యక్రమాలకు, ఆర్డీవో కార్యాలయాలయాలకు బాధితులు వస్తున్నారు. తమకు పట్టా ఇచ్చారని, స్థలం చూపించడం లేదని బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ పట్టా అధికారికంగా జారీ చేసిందా లేక నకిలీదో ఉన్నతాధికారులే తేల్చుకోలేక దీనిపై విచారణ చేయిస్తామని చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏలూరులో నకిలీ పట్టాల బాగోతం వెలుగుచూసింది. అయితే వీటి వెనుక గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారుల హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అసై ్సన్మెంట్ పట్టా జారీ చేయాలంటే సామాన్యుడికి ఎసైన్మెంట్ పట్టా జారీ చేయాలంటే సదరు స్థలానికి పంచాయతీ అనుమతి ఉండాలి. పూర్తిస్థాయిలో పంచాయతీ లేఅవుట్ అయి ఉండాలి. స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా, ఆర్డీవో కన్వీనర్‌గా, తహసీల్దార్ మెంబర్‌గా వ్యవహరించే కమిటీ ఈ స్థలానికి ముందుగా ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జారీ చేసిన పట్టాలపై ఏ1 నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో అభ్యంతరాలు స్వీకరించాలి. ఎటువంటి అభ్యంతరాలు లేనప్పుడు మాత్రమే అసై ్సన్మెంట్ పట్టాను సంబంధిత తహసీల్దార్ జారీ చేస్తారు. కానీ ఎక్కడా ఈ విధంగా జరగడం లేదు. మరిన్ని దాడులు చేస్తాం జిల్లా వ్యాప్తంగా నకిలీ పట్టాల బాగోతంపై మరిన్ని దాడులు చేస్తాం. ఇటీవల రెవెన్యూ కార్యకలాపాలన్నీ ఆన్లైన్ చేయడం వల్ల ఈ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏలూరులో ఇటువంటి పట్టాలు కలిగి ఉన్నారని సమాచారం అందిస్తే తక్షణమే చర్యలు చేపడతాం. మరిన్ని నకిలీలను వెలుగులోకి తీసుకొస్తాం. ప్రస్తుతం లభించిన పట్టాలపై ఉన్న సంతకాలు అసలా, నకిలీవా అనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు విచారణ చేస్తున్నాం. –నంబూరి తేజ్‌భరత్, ఆర్డీవో, ఏలూరు -
కోచింగ్ సెంటర్లు, బ్రోకర్లపై నిఘా
* 11న ఎంసెట్-3కి ఏర్పాట్లు పూర్తి * పోలీస్ ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ భేటీ * బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయం * నేడూ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్న ఎంసెట్-3 పరీక్షకు ఎంసెట్ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో తెలంగాణతోపాటు పక్క రాష్ట్రాల్లోనూ కార్పొరేట్ విద్యా సంస్థలు, కోచింగ్ కేంద్రాలు, బ్రోకర్లపై ఇంటెలిజెన్స్, సీఐడీ నేతృత్వంలో పోలీసుశాఖ నిఘా పెట్టింది. ముఖ్యంగా వచ్చే మూడు రోజులు బ్రోకర్ల కదలికలను పరిశీలించాలని, నిర్ణయించింది. ఏపీలో ఏర్పాటు చేసే 25 పరీక్ష కేంద్రాలపైనా పకడ్బందీ నిఘాకు చర్యలు చేపడుతోంది. ప్రశ్నపత్రాల విషయంలో ఇప్పటికే అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసింది. గురువారం ఇక్కడి ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఎంసెట్ కమిటీ సమావేశమై నిఘా, పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంసెట్-3 చైర్మన్, జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, ఎంసెట్-3 కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ సీపీ వీవీ శ్రీనివాసరావు, సైబరాబాద్ జాయింట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, లా అండ్ ఆర్డర్ డీఐజీ కల్పనా నాయక్ తదితరులు సమావేశమయ్యారు. ఈసారి పరీక్షకు బయోమెట్రిక్ పరికరాలను పెంచాలని నిర్ణయించారు. గతంలో ప్రతి 250 మందికి ఒక బయోమెట్రిక్ పరికరం ఏర్పాటు చేయగా, ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక పరికరం ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులను తనిఖీ చేసే ప్రదేశాల్లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్లను ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుళ్లను మోహరించడంతోపాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోనున్నారు. మరోవైపు హాల్‌టికెట్ నంబర్లలో మార్పులు చేశారు. వాటిని ఏడు అంకెల నుంచి ఎనిమిది అంకెలకు పెంచారు. పరీక్ష కేంద్రాలను కూడా జంబ్లింగ్ చేశారు. పాత పరీక్ష కేంద్రాల్లో ఏ విద్యార్థీ పరీక్ష రాసే అవకాశం లేకుండా కొత్త కేంద్రాల్లోనే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులకు కార్బన్‌లెస్ జవాబుల కాపీలను అందించనున్నారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించం: ప్రొఫెసర్ పాపిరెడ్డి ఎంసెట్-3 పరీక్షకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించబోమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. అందుకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోవాలన్నారు. బయోమెట్రిక్ డేటా సేకరించాల్సి ఉన్నందువల్ల విద్యార్థులు 9 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిదన్నారు, ఉదయం 9 గంటల నుంచే వారిని పరీక్ష హాల్లోకి అనుమతిస్తామన్నారు. 96 పరీక్ష కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 56,153 మంది విద్యార్థులకు హాల్‌టికెట్లు సిద్ధం చేశామన్నారు. గురువారం సాయంత్రం వరకు 33,169 మంది హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా విద్యార్థులు శుక్రవారం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని పాపిరెడ్డి స్పష్టం చేశారు. -
కిలాడి ‘లేడీ’ కోసం పట్టు
కేకే.నగర్: ఏడుగురిని మోసం చేసిన కిలాడి పెళ్లి కూతురు పవిత్రతో పెళ్లి జరిపించాలని ఎనిమిదో పెళ్లి కొడుకు కనకరాజ్ పట్టుపట్టడంతో పోలీసులు అవాక్కయ్యారు. 43 ఏళ్ల కనకరాజ్‌కు పవిత్ర అలియాస్ మాలతితో ఉడుమలై పేటలో నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ సమయంలో పవిత్రకు ఖరీదైన పట్టుచీర, 20 సవర్ల నగలను పెళ్లి కానుకగా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవిత్రను పోలీసులు పట్టుకుని వివరాలు బట్టబయలు చేసినా కనకరాజ్ మాత్రం ఫర్వాలేదు సార్! నాకు ఆమెతో పెళ్లి అయితే చాలు అని కూల్‌గా చెప్పాడు. ఆమెను తనతో పంపమని పోలీసులను బతిమాలాడు. దీంతో పోలీసులు అతన్ని హెచ్చరించారు. ఏడుగురిని పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పారిపోయిన కిలాడి పెళ్లి కూతురు పవిత్ర ఎనిమిదవ పెళ్లికి సిద్ధం అవుతూ మొదటి భర్త కర్నన్ (38)తో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ వివాహాలకు సహకరించిన బ్రోకర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుపూర్ జిల్లా తారాపురం సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర (32) గత నెల 27 నుంచి కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పవిత్రను ఉడుమలైలో పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బ్రోకర్ల సాయంతో ఆమె ఏడుగురిని వివాహం చేసుకుని వారితో కొన్ని రోజులు గడిపి నగలు, నగదు దోచుకుని పారిపోయేదని తెలిసింది. బ్రోకర్లు పెళ్లి కొడుకుల వద్ద పవిత్రకు తల్లిదండ్రులు లేదని ఆమెను పెంచుకున్న వారికి రూ.3 లక్షలు ఇవ్వాలని చెప్పేవారు. ఎలాగైనా పెళ్లి జరిగితే చాలని భావించే యువకులు పవిత్రకు నగలు, నగదు ముట్టచెప్పేవారు. ఈమె మోసానికి మొదటి భర్త సహకరించేవాడని తెలిసింది. సేకరించిన మొత్తంలో బ్రోకర్లకు కొంత ఇచ్చేదని..దీనికి ఆశపడిన బ్రోకర్లు పెళ్లికొడుకుల కోసం గాలించేవారని తెలుస్తోంది. కొంతమంది బ్రోకర్లు పెళ్లి కొడుకుల జాతకాలకు తగినట్లు పవిత్ర జాతకాన్ని తయారు చేసి మోసానికి పాల్పడినట్లు తెలిసింది. అయితే మోసపోయిన వారు ఎవరూ ఆమెపై ఫిర్యాదులు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో పోలీసులు ఏడో భర్త సెల్వకుమార్ వద్ద చోరీ చేసిన నగలు, నగదును అతనికి ఇప్పించి పవిత్రను హెచ్చరించి వదిలేశారు. -
కిలాడి పెళ్లి కూతురు
కేకే.నగర్: పెళ్లి కూతురు కోసం వెతుకుతున్న ఏడుగురు యువకులను బ్రోకర్ల ద్వారా వివాహం చేసుకున్న కిలాడి యువతి నగలతో సహా పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతో పాటు ఆమె మొదటి భర్తను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లి పేరుతో ఎంతోమంది అమ్మాయిలను మోసం చేసి నగలతో ఉడాయించిన కిలాడి కృష్ణుల గురించి మనం చదువుతూ ఉంటాం. అయితే వారికే ఏ మాత్రం తీసిపోనంటూ నిరూపించింది పవిత్ర. పేరు మార్చుకుని బ్రోకర్ల ద్వారా ఏడుగురు యువకులను పెళ్లిచేసుకుని వారితో కొన్ని రోజులు మాత్రమే గడిపి నగలు, నగదుతో ఉడాయించింది. 8వ సారి మరో యువకుడిని వివాహం చేసుకోవడానికి సిద్ధం కాగా మొదటి భర్తతో పట్టుబడిన సంఘటన తిరుపూర్ జిల్లాలో తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే...తిరుపూర్ జిల్లా తారాపురంకు సమీపంలోని కోణప్పన్ సాలై గ్రామానికి చెందిన నటరాజ్ పశువుల వ్యాపారి. ఇతని కుమారుడు సెల్వకుమార్‌కు పెళ్లి చేయాలని పెళ్లి కూతురును వెతికే పనిలో పడ్డారు. చివరకు బ్రోకర్ ద్వారా దిండుకల్ జిల్లా పళని సమీపంలోని పొదుపట్టి గ్రామానికి చెందిన పవిత్ర (25)తో నిశ్చయం చేసి గత 2015 అక్టోబర్‌లో పెళ్లి చేశారు.ఈ క్రమంలో గత మే 27వ తేదీ తారాపురం పోలీసుస్టేషన్‌కు వచ్చిన సెల్వకుమార్ తన భార్య పవిత్ర 15 సవర్ల నగలతో కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు పవిత్రను వెతుకుతున్న సమయంలో ఆమె మొదటి భర్త కర్ణన్ (35)తో ఉడుమలై ప్రాంతంలో అజ్ఞాతంలో తల దాచుకున్నట్లు తెలిసింది. ఆమె అసలు పేరు మారియమ్మాళ్ అని, మాలతి, పవిత్ర, ఏంజలిన్ అనే పలుపేర్లతో ఏడుగురిని మోసం చేసి వివాహం చేసుకున్నానని, మొదటి భర్త కర్ణన్, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న పోలీసులు ఖంగుతిన్నారు. కొన్ని సంవత్సరాలుగా పెళ్లి కూతురు దొరకని యువకులను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని వారితో కొన్ని నెలలు కాపురం చేసి దొరికిన నగలు, డబ్బులతో ఉడాయించడం ఆమె వృత్తిగా పెట్టుకుందని విచారణలో తెలిపింది. దీంతో ఉడుమలై బస్టాండులో నిలబడి ఉన్న పవిత్ర అలియాస్ మారియమ్మాళ్‌ను ఆమె మొదటి భర్త కర్ణన్‌ను తారాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈమె తిరువూర్ జిల్లా పల్లడం అరిమాలినగర్‌కు చెందిన సెల్వరాజ్. పళని అమ్మాల్ దంపతులకు ఒకే కూతురు. మొదటి భర్త కర్ణన్‌తో తన పేరు మాలతి అని చెప్పి ఏడో భర్త సెల్వకుమార్‌తో పవిత్ర అని చెప్పి వివాహం చేసుకుంది. ఈమె పెళ్లి కొడుకుల వేటకు తారాపురం, ఉడుమలై, పళని, తిరుపూర్ ప్రాంతాలకు చెందిన పెళ్లి బ్రోకర్లు తొమ్మిదిమంది బ్రోకర్లు సహాయం చేశారు. వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
బ్లూచిప్స్ ఫలితాలే దిక్సూచి..!
ఒడిదుడుకులు కొనసాగుతాయ్.. ♦ ప్రపంచ మార్కెట్ల ట్రెండ్, డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు కూడా కీలకమే... ♦ ఈ వారం మార్కెట్ గమనంపై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: బడా కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారం మార్కెట్‌కు దిక్సూచిగా నిలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ప్రపంచ స్టాక్ మార్కెట్ల ట్రెండ్ కూడా కీలకమేనని పేర్కొన్నారు. అయితే, గురువారంనాడు డెరివేటివ్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ వారంలో మూడో త్రైమాసిక(క్యూ3) ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్న బ్లూచిప్స్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, మారుతీ సుజుకీ, వేదాంత, ఎన్టీపీసీ, ఎల్అండ్టీ తదితర దిగ్గజాలు ఉన్నాయి. మరోపక్క, రిపబ్లిక్ డే(26న) సెలవు కారణంగా ఈ వారం ట్రేడింగ్ నాలుగురోజులకే పరిమితం కానుంది. గ్లోబల్ మార్కెట్ల కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, డాలరుతో రూపాయి మారకం విలువ హెచ్చుతగ్గులు, అంతర్జాతీయంగా ముడిచమురు ధర వంటి అంశాలకు అనుగుణంగా స్వల్పకాలానికి మన మార్కెట్ల ట్రెండ్ ఉంటుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ లిమిటెడ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. ఈ నెలాఖరులోపే అత్యధిక కంపెనీల ఫలితాలు వెల్లడికానుండటంతో మార్కెట్ల దృష్టి ప్రధానంగా వీటిపైనే ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోదీ చెప్పారు. ఫలితాలను వెల్లడించే కంపెనీలకు అనుగుణంగా స్టాక్స్ ఆధారితంగా కదలికలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఫెడ్ సమీక్షపై దృష్టి...: ఇక అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ మంగళ, బుధవారాల్లో చేపట్టనున్న పాలసీ సమీక్షను కూడా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు నిశితంగా గమనించనున్నారు. గత సమీక్షలో పదేళ్ల తర్వాత తొలిసారిగా అమెరికాలో వడ్డీరేట్లను ఫెడ్ పెంచిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర కుదుపులకు గురవుతున్న నేపథ్యంలో ఫెడ్ ఈ సారి వడ్డీరేట్లను మరోవిడత పెంచకపోవచ్చని జియోజిత్ బీఎన్పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్(ఫండమెంటల్ రీసెర్చ్) వినోద్ నాయర్ చెప్పారు. గతవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ స్వల్పంగా 19 పాయింట్లు నష్టపోయి 24,436 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు నష్టంతో 7,438 వద్ద స్థిరపడింది. తిరోగమనంలో ఎఫ్‌పీఐలు.. దేశీ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) తిరోగమనం కొనసాగుతోంది. ఈ నెల ఇప్పటివరకూ స్టాక్ మార్కెట్ నుంచి నికరంగా రూ.9,963 కోట్ల పెట్టుబడులను వెనక్కితీసుకున్నారు. ప్రధానంగా అంతర్జాతీయంగా వృద్ధి మందగమన భయాలు, ముడిచమురు ధరల తీవ్ర పతనం వంటివి దీనికి కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, దేశీ డెట్ మార్కెట్(బాండ్లు)లో మాత్రం ఎఫ్‌పీఐలు ఈ నెలలో రూ.2,353 కోట్లను నికరంగా వెచ్చించడం గమనార్హం. -
మోసగాళ్ల అడ్డాగా ‘రాజధాని’
ప్రత్యేక యంత్రాంగం లేకపోవడంతో చెలరేగుతున్న నేరగాళ్లు పట్టించుకోని పాలకులు, ఉన్నతాధికారులు బలవుతున్న సామాన్యులు మాయమాటలతో కోట్లు కొల్లగొడుతున్న వైనం గుంటూరుకు చెందిన డాక్టర్ రావుకు పెనమలూరు మండలం కానూరులో నివేశన స్థలం ఉంది. దానిని విక్రయించేందుకు పత్రికల్లో ప్రకటన ఇచ్చారు. ఇద్దరు బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి స్థలం కాగితాలు తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి మరొకరికి విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు రావుకు తెలిసి నిలదీశారు. దీంతో బ్రోకర్లు కొంత డబ్బులు ఇస్తే అడ్డు తొలుగుతామంటూ బెదిరిం చారు. విధిలేని స్థితిలో బాధితుడు పోలీసు కమిషనర్‌ను కలవగా నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నగరంలోని శుభదర్శి చిట్‌ఫండ్స్ రూ.200 కోట్ల మేర డిపాజిటర్లను ముంచింది. గత ఏడాది జులైలో ‘శుభదర్శి’ మూత పడటంతో వందలాది మంది బాధితులు లబోదిబోమన్నారు. పాతికేళ్లుగా డిపాజిటర్ల నమ్మకం చూరగొన్న శుభదర్శి పెట్టుబడులను స్థిరాస్తి వ్యాపారంలోకి మళ్లించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్టు అయితే చేశారుకానీ బాధితులకు న్యాయం జరగలేదు. పటమటలంకకు చెందిన వంశీకృష్ణ మెడికల్ సీట్ల పేరిట రూ.కోట్లు కొల్లగొట్టాడు. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులకు కర్ణాటక రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి నుంచి రూ.60 లక్షల వరకు వసూలు చేశాడు. సీట్ల విషయం ఆరా తీస్తే రేపు మాపంటూ తిప్పసాగాడు. అనుమానంతో కొందరు తల్లిదండ్రులు వాకబ్ చేయగా వంశీకృష్ణ మోసం వెలుగు చూసింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విజయవాడ : రాజధాని ఆర్థిక నేరాలకు అడ్డాగా మారింది. ప్రైవేట్ చిట్స్ ఎగవేత.. తప్పుడు పత్రాలతో భూముల రిజిస్ట్రేషన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు.. కాల్‌మనీ పేరుతో వేలకు వేలు రోజువారీ వడ్డీలకు ఇస్తూ వేధించడం.. ఇలా ఎక్కడ చూసినా మోసాలే. ఆర్థిక నేరాలను అరికట్టడం పోలీసులకు సవాల్‌గా మారింది. పోలీసుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని ఆర్థిక నేరగాళ్లు చెలరేగి పోతున్నారు. అప్పులు ఇచ్చి వేధింపులకు దిగుతున్న వారిపై 20 రోజుల్లో నగర పోలీస్ కమిషనర్‌కు 750 ఫిర్యాదులు అందాయి. కాల్‌మనీ వ్యాపారులు నగరంలో ఎలా రెచ్చిపోతున్నారో దీనినిబట్టి అర్థం చేసుకోవచ్చు. చిట్స్ పేరిట మోసాలు.. ప్రైవేటు చిట్స్ నగర సంస్కృతిలో అంతర్భాగమయ్యాయి. ఏళ్ల తరబడి ఇళ్ల వద్ద చిన్నపాటి చిట్టీలతో నమ్మకం పెంచుకుంటున్నారు. ఆపై లక్షల్లో చిట్స్ వేస్తూ కోట్ల రూపాయలు ఎగవేతకు పాల్పడుతున్నారు. పైసా పైసా కూడబెట్టిన సొమ్ము చిట్స్‌లో పెట్టి అనేక మంది వీధుల పాలవుతున్నారు. ఏడాది కాలంలో వంద మందికి పైగా ప్రైవేటు చిట్స్ ఎగవేతకు పాల్పడినవారు ఉన్నారు. అనేక మంది చిరు వ్యాపారులు, ఉద్యోగులు వీరి బారిన పడి సర్వం కోల్పోయారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు.. రాజధాని కావడంతో భూముల విలువ అమాంతంగా పెరిగింది. తప్పుడు పత్రాలు సృష్టించి కోట్ల రూపాయలు కొల్లగొట్టే ముఠాలు తయారయ్యాయి. ఆపై న్యాయస్థానంలో వ్యాజ్యాలు వేస్తూ అసలు యజమానులతోనే బేరసారాలకు దిగుతున్నారు. పోలీసుల వద్దకు వచ్చినా భూములకు సంబంధించి వివాదాలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసేందుకు అవసరమైన యంత్రాంగం లేక విచారణ పేరిట సాగదీస్తున్నారు. రియల్ ఎస్టేట్ మోసాలకు అంతే లేదు. ఉద్యోగాల పేరిట మోసం.. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల పేరిట మోసగించే సంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కొందరు పోలీసు ఉద్యోగుల తాలూకు బంధువులు కూడా ఉద్యోగాల పేరిట మోసగించిన వారిలో ఉండటం విశేషం. ప్రత్యేక విభాగమేది.. పోలీసు కమిషనరేట్‌లో ఆర్థిక నేరాలను అరికట్టేందుకు నామమాత్రం వ్యవస్థ మాత్రమే ఉంది. సీసీఆర్బీ ఏసీపీ పర్యవేక్షణలో సిటీ స్పెషల్ బ్రాంచిలోని ఇద్దరు ఇన్స్పెక్టర్లు మాత్రమే ఆర్థిక నేరాల నియంత్రణ విభాగంలో అదనపు విధులు నిర్వహిస్తున్నారు. ఈ విభాగాన్ని పటిష్టం చేయాల్సిన అవసరంపై నగర పోలీసు అధికారులు అనేకమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఆర్థిక నేరాలకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుతోనే ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. గత మూడేళ్లలో నమోదైన చీటింగ్ కేసులు 2013లో కేసులు 358 2014లో కేసులు 328 2015లో కేసులు 392 -
బ్రోకర్లదే రాజ్యం
భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకం రాజధాని గ్రామాల్లో ఎకరం రూ.1.50 కోట్లు ఒకే చోట 5 ఎకరాలు దొరకడం కష్టమే మళ్లీ పుంజుకుంటున్న రియల్ వ్యాపారం విజయవాడ బ్యూరో : రాజధాని గ్రామాల్లో రియల్ బ్రోకర్లు మళ్లీ చక్రం తిప్పుతున్నారు. భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకంగా మారారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక కోర్ కేపిటల్ చుట్టుపక్కల గ్రామాల్లో మరోసారి రియల్ వ్యాపారం పుంజుకుంటోన్న దాఖలాలు కనిపిస్తున్న నేపథ్యంలో భూముల కొనుగోలు కోసం గ్రామాలకు వెళ్లిన కొనుగోలుదారులు బ్రోకర్లు లేకుండా భూములను కొనడం గగనమైంది. గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్ అవుతూ, భూములకు ధర నిర్ణయించడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. క్రయవిక్రయాల ద్వారా లక్షల్లో అందుతోన్న కమీషన్ డబ్బును నలుగురూ పంచుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ పనీపాటా లేకుండా వూరి సెంటరులో పేకాటతో కాలం వెళ్లబుచ్చే అప్పారావు రోజూ తుళ్లూరు, తాడికొండ వెళ్లి పీకల దాకా తాగి పొద్దుపోయాక ఎప్పటికో ఇల్లు చేరే పానకాలరావు వంటి సాధారణ వ్యక్తులు ప్రస్తుతం ఊరు కదలకుండా రియల్ బ్రోకర్ల అవతారమెత్తి లక్షలు సంపాదిస్తున్నారు. పడి లేచిన రియల్ వ్యాపారం రాజధానిలో రియల్ వ్యాపారం నెల రోజుల కిందటే సద్దుమణిగింది. నాలుగు నెలల కిందట ఎకరం భూమి ఖరీదు రూ.1.80 కోట్లకు చేరి, ఆ తరువాత సంక్షోభ సమయంలో రూ.80 లక్షలకు పడిపోయింది. భూముల కోసం కోట్లు వ్యయం చేసిన రియల్ వ్యాపారులు ఒక దశలో బాగా నష్టపోగా, కొంతమంది మాత్రం కొన్న భూములను మారు బేరానికి అమ్మి లాభ పడ్డారు. సీఆర్ డీఏ అనుమతులు, ఇతరత్రా నిబంధనలతో బేజారెత్తిన వ్యాపారులు ఆగస్టు నుంచి కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ప్రభుత్వం రాజధాని శంకుస్థాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి రాజధాని గ్రామాల్లో మళ్లీ రియల్ వ్యాపారం కాస్తంత పుంజుకుంది. కోర్ కేపిటల్లో ఊపు కోర్ కేపిటల్‌గా ప్రకటించిన ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చుట్టూ ఉన్న మందడం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల పరిధిలో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రియల్ వ్యాపారులు, పెట్రోలు బంకుల యజమానులు, బడాబడా వ్యాపారవేత్తలు ఎకరం నుంచి ఐదెకరాల వరకూ ఒకేచోట భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ గ్రామాల పరిధిలో ఎక్కడా ఒకే చోట రెండెకరాలకు మించి దొరకడం గగనమైంది. కేవలం అరెకరం, ముప్పాతిక, ఎకరం మేర పొలాలే అమ్మకాలకు దొరుకుతున్నాయి. ఈ వివరాలు కూడా కేవలం గ్రామాల్లో బ్రోకర్ల దగ్గరే దొరుకుతున్నాయి. గ్రామాల్లోని ఏఏ రైతులు తమ పొలాలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో వారికే తెల్సు. అటు కొన్నవారు, ఇటు అమ్మిన వారు సైతం కమీషన్లు ముట్టజెపుతుండటంతో బ్రోక ర్ల పంట పండుతోంది. రాజధాని గ్రామాల్లో మొత్తం 53,747.46 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా, ఇందులో ప్రభుత్వ భూములు 15010.03 ఎకరాలు కాగా మిగతాదంతా (38737.49) ప్రైవేటు భూములే. ఇందులో 33,733 ఎకరాల మేర పట్టా భూములున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములు పోగా మిగతా భూములు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. గతంలో కొందరు రియల్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను కూడా ల్యాండ్‌పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదే మాదిరిగా కొనుగోలు చేసిన భూములను ల్యాండ్ పూలింగ్ కింద సర్కారుకు ఇచ్చి ఆపైన చేతికందే అభివృద్ధి చేసిన భూములతో లాభం పొందవచ్చనే ఆలోచన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సరికొత్త ఊపునిస్తోంది. ఈ తరహాలో యోచిస్తున్న వ్యాపారులే ప్రస్తుతం భూముల కొనుగోలు కోసం తిరుగుతున్నారు. బడా బాబుల పేరు చెప్పి..: భూముల కొనుగోలు కోసం గ్రామాల్లో తిరిగే కొనుగోలుదారులతో బ్రోకర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రుల పేర్లతో పాటు ఇప్పటికే భూములు కొన్న ప్రముఖుల పేర్లు చెప్పి వారి పక్కనే ఉన్న భూముల విక్రయాలకు సిద్ధమవతున్నారు. మొదటి దశలో నిర్మాణం జరిగే రాజధాని ప్రాంతమిదేనంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. గ్రామానికో ఐదారుగురు బ్రోకర్లు తయారై రెవెన్యూ రికార్డులు, అందులోని భూములు, వాటి యజమానుల వివరాలను దగ్గరుంచుకుని తమదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు. -
అక్కడంతా ఆమ్యామ్యాలే!
- ఇద్దరు ప్రధాన అధికారుల హవా.. - ఫైలు కదలాలంటే చేయి తడపాల్సిందే! - బ్రోకర్ల అండతో యథేచ్ఛగా అవినీతి దందా - ఆర్టీఏ కార్యాలయం ఎదుటేబ్రోకర్ ఆఫీసులు.. - రోజుకు సుమారు 500 ఫైళ్ల లావాదేవీలు - నెలకు రూ.2 కోట్లకు పైగా అక్రమార్జన సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘అనంత’ ఆర్టీఏ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. వెహికల్ రిజిస్ట్రేషన్...లెసైన్స్...పనేదైనా బ్రోకర్‌ను సంప్రదించాల్సిందే! బ్రోకర్‌తో సంబంధం లేకుండా ‘పని’కావాలని మొండిపట్టు పడితే ఆ పని ఎప్పటికి అవుతుందో తెలీదు. అధికారులు కూడా బ్రోకర్ల అండతోనే ఫైళ్ల క్లియరెన్స్... లావాదేవీలు సాగిస్తున్నారు. దీంతో ఇక్కడ ఏ పని కావాలన్నా ప్రభుత్వానికి నికరంగా చెల్లించాల్సిన మొత్తాని కంటే అదనంగా 2-4రెట్లు సమర్పించుకోవాల్సిందే. ఇద్దరు అధికారుల హవా! ఆర్టీఏ కార్యాలయంలో వాహనాల రిజిస్ట్రేషన్, లెసైన్స్‌ల జారీ ముగ్గురు ప్రధాన అధికారుల చేతుల మీద సాగుతోంది. వీరిలో ఇద్దరు ఇక్కడి లావాదేవీలు గుప్పిట్లో పెట్టుకున్నారు. వీరిద్దరి కింద దాదాపు 50 మంది బ్రోకర్లు ఉన్నారు. కార్యాలయం గేటు బయటే వీరి ఆఫీసులు ఉన్నాయి. జీపు, కారు, టాటాఏఎస్, మ్యాజిక్ లాంటి నాలుగుచక్రాల వాహనాల రిజిస్ట్రేషన్‌కు నిబంధనల ప్రకారం 650 రూపాయలు చలానా ఖర్చు అవుతోంది. నెంబర్ ప్లేటుకు మరో 600 రూపాయలవుతుంది. అయితే బ్రోకర్లు 2,500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చును చెల్లిస్తారు. తక్కిన డబ్బును మూటగడతారు. ఇలా ఒక్కో బ్రోకర్ రోజుకు దాదాపు రూ.10-13వేల దాకా ఆర్జిస్తున్నట్లు తెలిసింది. అంటే! ఇక్కడున్న 50 మంది బ్రోకర్లు రోజువారి ఆదాయం 5లక్షలపైమాటే! ఈ మొత్తం సొమ్ము సాయంత్రం అయ్యేసరికి ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు అధికారులకు ఇస్తారు. ఈ ఇద్దరు ఎవరు ఎన్ని ఫైళ్లు తీసుకొచ్చారు? ఎవరి వాటా ఎంతా అనేది తేల్చుతారు? వారు కింది నుంచి పై స్థాయి వరకూ ‘వడ్డి’ంపులు చేస్తారని కార్యాలయంలోని ఉద్యోగులే గుసగుసలాడుతున్నారు. ఇంగ్లీషుతోనే అసలు సమస్య! వాహనదారులు, డ్రైవర్లు పూర్తి చేయాల్సిన దరఖాస్తులన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. వీటిని పూరించడం చాలామందికి తెలీదు. దీంతో బ్రోకర్లను సంప్రదిస్తారు. వీరు వచ్చిందేతడవుగా బ్రోక్లర్లు ‘మీకెందుకు తిప్పలు, మీరు వెళితే లేనిపోని సాకులు చూపి ఆలస్యం చేస్తారు. పైగా నాలుగైదు రోజులకు బాడుగలు పోతాయి. మాకివ్వండి మేం చేస్తాం’ అని ఆందోళన రేపుతారు. దీంతో వాహనదారులు బ్రోకర్లు సరెండర్ అవుతారు. వారు అడిగినంత డబ్బులు చెల్లిస్తున్నారు. బ్రోకర్లను సంప్రదించకుండా నేరుగా ఫైలు అధికారి వద్దకు వెళితే అడ్డంకులు తప్పవు! దానిపై రాతను పసిగట్టి పక్కనపడేస్తారు. మరీ ఇబ్బంది పడితే మొహమాటం లేకుండా ఆ ఇద్దరి వద్ద ఉన్న అసిస్టెంట్లు రేటు చెప్పేస్తారు. వారు చెప్పినంత కచ్చితంగా ఇవ్వాల్సిందే! లేదంటే ‘గ్రీన్‌ఇంక్’ పెన్ పేపర్‌పై కదలదు. అదే బ్రోకర్ల ద్వారా వచ్చినవి అయితే నిమిషాల్లో పని చేస్తారు. ఇలా బ్రోకర్ల ద్వారా కార్యాలయంలో రోజుకు దాదాపు 500 ఫైళ్లు నడుస్తున్నట్లు సమాచారం. ఎల్ఎల్ఆర్కూ వసూళ్లే!! లెసెన్స్‌ల కోసం వెళ్లే డ్రైవర్లు ముందుగా ఎల్ఎల్ఆర్ తీసుకోవాలి. ఎల్‌ఎల్‌ఆర్‌కు 120 రూపాయలు ఖర్చవుతుంది. అయితే ఇక్కడ మాత్రం అదనంగా 300-500 రూపాయలు చెల్లించాలి. వాహన పరీక్ష (డ్రైవర్ల టెస్ట్)కు వెళితే అక్కడ మరో మూడు వందల రూపాయలు అదనంగా ఇచ్చుకోవాలి. పని పూర్తయిన తర్వాత తీరా లెసైన్స్ చేతికి రావాలంటే అక్కడా చేయి తడపాల్సిందే!! ఈ విధంగా కార్యాలయంలో ఫైలు కదిలే ప్రతీ టేబుల్ వద్ద ముడుపులు తప్పనిసరిగా చెల్లించుకోవల్సిన పరిస్థితి. కార్యాలయంలోని పరిస్థితిని ఆరా తీస్తే వాహనదారులు, లెసైన్స్ దారులంతా ‘ముడుపులు’ ఇవ్వకపోతే పని కాదని... ఇది ఆర్టీఏ కార్యాలయంలో సర్వసాధారణమైపోయిందని చెబుతున్నారు. దీనిపై ‘సాక్షి’ వాయిస్ అడిగితే వాహనాలు ఉన్నోళ్లం మేం ఆరోపిస్తే... మళ్లీ మా పని అవుతుందా? సార్! అని నిరాకరిస్తున్నారు. అన్నిశాఖల ప్రక్షాళనపై దృష్టి సారించిన కలెక్టర్ కోన శశిధర్ ఆర్టీఏ కార్యాలయం వైపు కూడా దృష్టి సారించాలని ‘మాముళ్ల’ భారం తగ్గించాలని కోరుతున్నారు. -
సదరంగం
ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో బతుకు వెళ్లదీద్దామనుకున్న వికలాంగులతో బ్రోకర్లు ఆటలాడుతున్నారు. ధ్రువీకరణ పత్రం కోసం వికలాంగులు ఆశ్రయిస్తుంటే వారు దండిగా సొమ్ము వసూలు చేస్తూ ఫోర్జరీ సంతకాలు చేస్తూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. వికలాంగులు వాటిని తీసుకుని సదరం సర్టిఫికెట్ కోసం వెళ్లేసరికి అవి నకిలీవని వైద్యులు గుర్తిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ మంజూరుకు తిరస్కరిస్తున్నారు. విజయనగరం ఆరోగ్యం: కేంద్రాస్పత్రిలో మరోసారి నకిలీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు వెలుగు చూశా యి. గతంలో ఇచ్చిన మాన్యువల్ వికలాంగ ధ్రువీకరణపత్రాన్ని పట్టుకుని ఓ మహిళ సదరం సర్టిఫికెట్ కోసం మంగళవారం కేంద్రాస్పత్రిలోని కంటి విభా గానికి వచ్చింది.ఆ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన కంటి వైద్యుడు డాక్టర్ త్రినాథ్‌రావు ఆ సర్టిఫికెట్‌ను నకిలీదిగా గుర్తించారు. ధ్రువీకరణ పత్రంపై సంబంధిత విభాగానికి చెందిన వైద్యుడుతో పాటు మరో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంతకం చేయాలి. వీరిద్దరి సంతకాలు అయిన తర్వాత సూపరింటెండెంట్సంతకం పెడతారు. అప్పుడు వికలాంగులకు అందజేస్తారు.అయితే కంటి వైద్యుని వద్దకు మహిళ తెచ్చిన ధ్రువీకరణ పత్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంతకం లేదు. మిగతా రెండు సంతకాలు కూడా అనుమానా స్పదంగా ఉన్నాయని కంటి వైద్యుడు తెలిపారు. ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలడంతో సదరం సర్టిఫికెట్‌ను నిలిపివేసినట్టు కంటి వైద్యుడు త్రినాథ్‌రావు తెలిపారు. ఇది రెండోసంఘటన కేంద్రాస్పత్రిలో గతంలో కూడా వికలాంగుల నకిలీ సర్టిఫికెట్స్ వెలుగుచూశాయి. ఏడాదిక్రితం నలుగురు వికలాంగులు సదరం సర్టిఫికెట్స్ కోసం కేంద్రాస్పత్రి ఎముకల విభాగానికి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వచ్చారు. అయితే వాటిని పరిశీలించిన ఎముకల వైద్యుడు సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించి ఆ పత్రాలను తీసుకుని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. వైద్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తున్న బ్రోకర్లు కేంద్రాస్పత్రికి సమీపంలో ఉన్న ఓ దుకాణాన్ని అడ్డాగా చేసుకుని బ్రోకర్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ధ్రువీకరణ పత్రాలను కలర్ జిరాక్సు తీసి దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల సంతకాల దగ్గర నుంచి స్టాంపుల వరకు అన్నీ బ్రోకర్ల వద్ద ఉన్నాయి. దీంతో వైద్యుని వద్దకు వెళ్లకుండానే బ్రోకర్లే దందాను కొనసాగిస్తున్నారు. అయితే ప్రభుత్వం పింఛను వస్తుందనే ఆశతో బ్రోకర్ ఇచ్చింది ఒరిజనల్ సర్టిఫికెటో, నకిలీదో తెలియక వికలాంగులు మోసపోతున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం వచ్చినప్పుడు బ్రోకర్ ఇచ్చింది నకిలీ సర్టిఫికెట్ అని తెలిసి లబోదిబోమంటున్నారు. బ్రో కర్ల దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది వికలాంగులు నష్టపోయే ఆస్కారం ఉంది. -
భూముల కొనుగోలులో బ్రోకర్ల హవా
జీలుగుమిల్లి : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూముల కొనుగోలును చేపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని జీలుగుమిల్లి మండలంలో కొందరు బ్రోకర్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇప్పిస్తామంటూ గిరిజనేతర రైతులను మాయ చేస్తున్నారు. లక్షకు 20 శాతం కమీషన్‌గా ఇవ్వాలంటూ బేరసారాలు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు పోగొట్టుకున్న రైతులకు ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా భూములు ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో జీలుగుమిల్లి మండలంలో రైతుల వద్ద నుంచి వారి ఇష్టపూర్వకంగా అధికారులు భూములు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 1,600 ఎకరాల భూమిని సేకరించారు. దీనిని కొందరు బ్రోకర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో మీ భూమిని చూపించి అధిక మొత్తం చెల్లించేలా చేస్తామని ఇందుకు 20 శాతం కమీషన్ ఇవ్వాలంటూ రైతులను ఆకర్షిస్తున్నారు. గిరిజనులకు, గిరిజనేతరులకు ఇక్కడ దశాబ్దాలుగా భూముల విషయంలో వైరం ఉంది. దీంతో గిరిజనేతరుల భూములపై కన్నేసిన బ్రోకర్లు వారికి రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో ఎకరానికి రూ.8 లక్షల వరకు వస్తుండడంతో రైతులు ఆశపడి బ్రోకర్ల మాయలో పడుతున్నారు. ఇదే అదనుగా బ్రోకర్లు రైతుల వద్ద నుంచి ముందుగా అడ్వాన్స్ సైతం తీసుకుంటుండడం గమనార్హం. బ్రోకర్లు స్థానిక అధికారులు, అధికార పార్టీల నేతలతో ఒప్పందాలు కుదుర్చుకుని వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు సమాచారం. స్థానిక ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని తమ పనులు చేరుుంచుకుంటున్నట్టు తెలిసింది. రెండు వేల ఎకరాల సేకరణ : మండలంలోని పది గ్రామాల్లో ఇప్పటికే భూములను అధికారులు సేకరించారు. మరో రెండు గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాల భూములను సేకరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ భూముల సేకరణలో రెవెన్యూ అధికారులు కూడా పైరవీలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నారుు. ఆర్ఆర్ ప్యాకేజీ, భూముల కొనుగోలులో ఎటువంటి బ్రోకర్లు లేకుండా, అక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
దళారుల మహాపెత్తనం
- జీవీఎంసీలో బ్రోకర్ల హడావుడి - ఉద్యోగులతో సమానంగా చెలామని - అధికారులతో తెరచాటు ఒప్పందాలు - అవినీతి చక్రం తిప్పుతున్న కొందరు విశాఖపట్నం సిటీః వారు జీవీఎంసీ ఉద్యోగులు కాదు. కానీ ఉద్యోగులొచ్చే సమాయానికి ముందే వస్తుంటారు. ఏదైనా పనిపై వచ్చిన వారు ఆఫీసర్ రాలేదా అంటే వచ్చేస్తారంటూనే వారితో మాట కలుపుతారు. సర్ వచ్చిన వెంటనే ఎవరెవరు వచ్చారో ఆఫీసర్ అడక్కుండానే ముందే చిట్టా విప్పేస్తారు. మామూలుగా అయిపోయే పని అయితే వెంటనే సంతకం పెట్టగానే రండి మీ ఫైల్ అయిపోయిందంటూ ఫోన్ చేసి మరీ రప్పించుకుని ఎంతోకొంత తీసుకుంటారు. ఇదే అలవాటు చేసుకుని ఇప్పుడు కొందరు దళారీలుగా జీవీఎంసీలో పాతుకుపోయారు. తమకొచ్చే చేతి వాటం నుంచే అధికారులకు ‘సహాయ’పడుతుంటారు. దీంతో ఆఫీసర్ కూడా ఏ పనికైనా ఆయన్నే(దళారీ) పిలుస్తుండడంతో అంతా ఆ దళారీ చేతుల్లోనే నడుస్తుందనే భావన ఏర్పడుతోంది. ఇది మహానగర పాలక సంస్థలో అవినీతికి బాట వేస్తోంది. జీవీఎంసీలోని పట్టణ ప్రణాళిక, ఫైర్, ఇంజనీరింగ్, ప్రజారోగ్య శాఖల్లో దళారీ వ్యవస్థ ఉంది. ప్రజారోగ్య శాఖ జోన్-3 కార్యాలయంలో ఓ హెల్త్ అసిస్టెంట్‌కు సహాయకునిగా కార్యాలయంలో తిష్ట వేసిన దళారీ సంగతి పసిగట్టి కమిషనర్ప్రవీణ్కుమార్కు కొందరు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కమిషనర్ నేరుగా తనిఖీ చేసి ఆ దళారీ ఎవరని అడిగే సరికి కంగుతిన్న సదరు ఉద్యోగి జీవీఎంసీ ఉద్యోగేనని జవాబిచ్చాడు. అతన్ని రెండు వారాల క్రితమే సస్పెండ్ చేశారు. ఫైర్ శాఖలో బుధవారం రాత్రి ఏసీబీ దాడి చేసిన సంఘటనలోనూ ఓ దళారీ పట్టుబడ్డాడు. ఫైర్ శాఖలో ఏసీబీకి చిక్కిన లందా తారక రామకృష్ణ గత కొన్నేళ్లుగా దళారీ అవతారం ఎత్తి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ సోదాల్లో బయటపడింది. గురువారం తెల్లవారు జాము వరకూ ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించినట్టు తెలిసింది. అక్రమాస్తులు ఎంత మేర సంపాదించాడో కోర్టుకు నివేదిక అందజేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. వేపగుంట కేంద్రంగా ఉన్న జోన్-6 కార్యాలయంలోనూ దళారులదే రాజ్యం. గత కొన్నేళ్లుగా టౌన్‌ప్లానింగ్‌లో తిష్టవేసిన కొందరు దళారీలదే ఇప్పటికీ ఆడింది ఆట..పాడింది పాట అన్న చందంగా వ్యవహారం సాగుతోంది. ఇక్కడ పాతుకుపోయిన ఛైన్మన్ల నుంచే భారీగా వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరంతా కార్యాలయంలో వసూళ్లకు పాల్పడరు కాబట్టి ఎక్కడ నిర్మాణం ఉంటే అక్కడికి వెళ్తున్నారు. వసూళ్లకు పాల్పడి కొంత అధికారులకు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అనధికారిక నిర్మాణానికి గజాల లెక్కన వీరే వసూళ్లు చేసి ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ అధికారులకు ముట్టుజెప్పుతారనే ఆరోపణలున్నాయి. పట్టణ ప్రణాళిక విభాగంలో అర్హత ఉన్న బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు 20 మంది లోపే ఉన్నారు.వీరిలో కొందరు రెవెన్యూ సర్వేలకి, మరి కొందరు పుష్కర విధులకు నియమించారు. దీంతో 10 మందిలోపే బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. 100 మంది ఉండాల్సిన మహానగరంలో 0 మంది ఉండడంతో కొందరు దళారులు నకిలీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్లుగా అవతారమెత్తారు. భవనం ఎలా నిర్మిస్తున్నారో వీరికి అనవసరం. అడిగినంతా ఇస్తున్నారో లేదో చూసుకుంటారు.నచ్చినంతా ఇవ్వకపోతే అనధికారిక నిర్మాణం అంటూ వాట్స్ అప్‌లో ఫోటోలను కమిషనర్ ప్రవీణ్‌కుమార్‌కు పెట్టేస్తున్నారు. వెంటనే ఆ భవనాన్ని కొట్టేయమంటూ ఆదేశాలిస్తుండడంతో వీరి ఆగడాలకు అడ్డూఅదపూ లేకుండా పోతోందని పలువురు భవన యజమానులతో బాటు టౌన్‌ప్లానింగ్ ఉద్యోగులు సైతం ఆవేదన చెందుతున్నారు. -
పేదల బియ్యం.. దళారులకు వరం
జిల్లా నుంచి వేల క్వింటాళ్లు అక్రమంగా తరలింపు కాకినాడ పోర్టు ద్వారా ఇతర రాష్ట్రాలకు సరఫరా నిఘా ఉన్నా ఆగని అక్రమార్కులు విజిలెన్స్ దాడుల్లో దొరికేది స్వల్పమే.. ! విజయవాడ : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడితప్పింది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా గత నెల 1 నుంచి ఈ నెల 15వ తేదీ మధ్య అక్రమంగా తరలిస్తున్న 1,204 క్వింటాళ్ల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున డీలర్ల నుంచి కొనుగోలుచేస్తున్నారు. వాటిని పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందలాది క్వింటాళ్లను పోగుచేసి కాకినాడ పోర్టు నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు. డీలర్లకు పెట్టుబడి పెడుతున్న ‘దొంగ’ వ్యాపారులు పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు కొందరు దొంగ వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ముందుగానే రేషన్ డీలర్లకు పెట్టుబడి పెడుతున్నారు. విజయవాడ నగరంలో ఇటువంటి వ్యాపారులు పది మంది వరకూ ఉన్నారు. వీరు పటమట, కృష్ణలంక, భగత్‌సింగ్‌నగర్, వించిపేట, కొత్తపేట, చిట్టినగర్, భవానీపురం ప్రాంతాల్లో ఉంటున్నట్లు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. వీరు దళారుల సాయంతో డీలర్ల నుంచి పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బందికి కూడా మామూళ్లు ఇస్తున్నట్లు సమాచారం. రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీ డ్రైవర్లు చాకచక్యంగా జిల్లాలోని చెక్‌పోస్టులు దాటించేందుకు క్వింటాకు రూ.7.50 చొప్పున ప్రత్యేకంగా చెల్లిస్తారు. కాకినాడ పోర్టుకు చేరిస్తే క్వింటాకు రూ.15లు ఇస్తున్నట్లు విజిలెన్స్ దాడుల్లో స్పష్టమైంది. భారీగా బ్లాక్‌మార్కెట్‌కు... జిల్లాలో సాధారణ తెల్లకార్డులు 10,83,413 ఉన్నాయి. అంత్యోదయ అన్న యోజన కార్డులు 70,153, అన్నపూర్ణ కార్డులు 636 ఉన్నాయి. అన్నీ కలిపి 11,54,202 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు పంపిణీ చేసేందుకు 20,150 రేషన్ షాపుల ద్వారా ప్రతి నెల 15వేల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. అధికారులు నిఘా పెట్టినా అక్రమాలు ఆగటం లేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూనట్లు వ్యవహరించడమే ఇందుకు కారణమే అరోపణలు ఉన్నాయి. -
మొహమాటపడ్డారో చిక్కినట్టే!
సాక్షి, హైదరాబాద్: ఫ్లాట్ అయినా ప్లాట్ అయినా కొనుగోలు చేసేటప్పుడు కొందరు మధ్యవర్తులు తొందర పెడుతుంటారు. త్వరగా తీసుకోమని పోరు పెడతారు. ఇంత కంటే తక్కువకు మరెక్కడా దొరకదని బుకాయిస్తారు. ఎంతోకొంత బయానా ఇస్తే ఇల్లు మనకే దక్కుతుందని హడావుడి చేస్తారు. వారు చేసే తొందర వల్ల మనం మోహమాటం పడ్డామంటే అంతే సంగతులు. వారి బుట్టలో పడ్డట్లే! మన కళ్ల ముందు జరిగే సంఘటనల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మోసపోతున్నామన్నా సందేహం కలుగుతుంది. అయినా మనకెందుకులే..తక్కువకు వస్తుంది కదా అని ఊరుకుంటాం. స్థిరాస్తి లావాదేవీల్లో మోసపోయిన వారిని గమనిస్తే ఇలాంటి వ్యవహారశైలి వల్ల కష్టార్జితాన్ని పోగొట్టుకున్నారని అర్థమవుతుంది. ప్రజలు ఎక్కువగా ఏయే సందర్భాల్లో మోసానికి గురయ్యారో తెలుసుకోవడానికి ‘సాక్షి రియల్టీ’ ఓ చెక్లిస్ట్ను రూపొందించింది. కాబట్టి స్థిరాస్తి కొనేవారెవ్వరైనా.. ఈ కింది అంశాల్లో ఏ ఒక్కటి మీకు అనుభవమైనా.. మోసం జరగడానికి అస్కారమెక్కువగా ఉందని అర్ధం చేసుకోవాలి. కొందరు మధ్యవర్తులు ఏం చేస్తారంటే.. అసలు పత్రాలు ఎక్కడో పోయాయని చెప్పి, సర్టిఫైడ్ కాపీలను చూపిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో తప్పకుండా అనుమానించాల్సిందే. పత్రాలు కలర్ జిరాక్స్లో ఉన్నా.. వాటిని ల్యామినేట్ చేసినట్లు కనిపించినట్లున్నా ఆలోచించాల్సిందే. సంతకాల్లో తేడా, ఒక్కో చోట ఒక్కో విధంగా ఉన్నప్పుడు. పత్రాలు సంబంధిత సమాచారంతో కాకుండా.. ఖాళీగా ఉండటం. పత్రాలను కేవలం నోటరీ చేసి ఉండటం. ఒప్పంద పత్రం అమలు సమయంలో అసలు విక్రయదారుడు సరైన సమయానికి రాకపోయినప్పుడు లేదా వాయిదా వేస్తున్నప్పుడు. క్రయపత్రాలు (సేల్‌డీడ్) పై నీలి రంగు పెన్నుతో సంతకం చేసి ఉందంటే అనుమానించాల్సిదే. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నల్లరంగుతో సంతకం చేయటమనేది నిబంధన అని గుర్తుంచుకోండి. పత్రాలపై అమ్మకందారు వేలిముద్రలు వేయడానికి నిరాకరించినా. విక్రయదారు అనుకున్న సమయానికి ముందే ఒత్తిడి చేయడం, యజమాని విదేశాలకు వెళుతున్నాడనే సాకు చూపుతూ తొందరపెట్టిన సందర్భాల్లో. మీరు ఏదైనా సందేహ నివృత్తికి ప్రశ్నలు వేసినప్పుడు అమ్మకందారు అసహనం వ్యక్తం చేసినా.. కలవరపడినా.. ఏదో మతలబు ఉన్నట్లే. కొందరు మధ్యవర్తులు కానీ అమ్మకందారులు కానీ తెలివిగా ఏం చేస్తారంటే మానసికంగా బ్లాక్మెయిల్ చేస్తుంటారు. ‘కొంటే కొనండి.. వద్దంటే ఇబ్బందేం లేదు. ఇంతకంటే తక్కువ అయితే ఎప్పటికీ రాదు. మీరు కాదంటే కొనడానికి వందల మంది సిద్ధంగా ఉన్నార’ని పరోక్షంగా బెదిరిస్తారు. ఇలా మీతో అన్నారంటే ఆ అమ్మకంలో ఏదో గోల్మాల్ ఉన్నట్లే లెక్క. పైన పేర్కొన్న ఎలాంటి సందర్భం మీకెదురైనా జాగ్రత్తగా అడుగేయండి. లేకపోతే మీ కష్టార్జితం బూడిదలో పోసిన పన్నీరవుతుంది. -
స్లాట్ బుకింగ్‌కు అందని ‘మీ-సేవ’
పని ఒత్తిడితో సేవలు నిల్ బుక్ చేసే కేంద్రాలు తెలియక ప్రజల పాట్లు విశాఖపట్నం: పాస్‌పోర్ట్ సేవలు ‘మీ-సేవ’ కేంద్రాలలో పొందవచ్చని అధికారులు ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి కేంద్రాలలో సేవలు ప్రారంభించారు. అయితే ‘మీ-సేవ’ కేంద్రాలలో ఈ సేవలు సంతృప్తికరంగా అందడం లేదు. బ్రోకర్లు, దళారీల వ్యవస్థ నియంత్రణకు సిద్ధపడ్డ పాస్‌పోర్ట్ అధికారులు తొలి విడతగా ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 200మంది ‘మీ-సేవ’ ప్రతినిధులకు ఈ ఏడాది జూలై 19న పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ బుకింగ్, దరఖాస్తులు పూరించడం, ఫీజులు చెల్లించడాన్ని నేర్పించారు. పాస్‌పోర్ట్ సేవలు గురించి అవగాహన కల్పించారు. మరో రెండు విడతలుగా శిక్షణ ఉంటుందని అధికారులు ప్రకటించారు. తర్వాత శిక్షణ ప్రస్తావన మరిచారు. ప్రతి జిల్లాలో 213 ‘మీ-సేవ’ కేంద్రాలు అందుబాటులో ఉండగా పది శాతం కేంద్రాలలో కూడా సేవలు లభించడం లేదు. గందరగోళంగా సేవలు... గ్రామీణ ప్రాంత ప్రజలకు పాస్‌పోర్ట్ సేవలు మరింత దగ్గర చేయాలన్న లక్ష్యంతో ‘మీ-సేవ’ కేంద్రాలలో సేవలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర సర్వీసులతో సంబంధం లేకుండా కేంద్ర సర్వీసులతో పాస్‌పోర్ట్ సేవలు అనుసంధానం చేశారు. ఆన్లైన్లో పాస్‌పోర్ట్ సేవలకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షణ ఉండేటట్టు చర్యలు చేపట్టారు. అయితే ఏ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభిస్తాయో ప్రజలకు అర్థం కావడం లేదు. రూ.100 చెల్లించి సేవలు పొందవచ్చని ఆశపడుతున్న ప్రజలకు నిరాశ తప్పడం లేదు. ‘మీ-సేవ’ కేంద్రంలో ఒక కౌంటరే పనిచేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంట్, విద్యుత్, ఇంటి పన్నులతోపాటు పాస్‌పోర్ట్ సేవల కోసం అభ్యర్థులు వేచి ఉంటున్నారు. రద్దీ సమయంలో పాస్‌పోర్ట్ సేవలు చేయలేమని కేంద్రాలలో చెబుతుండటంతో కంగుతింటున్నారు. అన్ని కేంద్రాలలో ప్రారంభించాలి... ప్రతి ‘మీ-సేవ’ కేంద్రంలో పాస్‌పోర్ట్ సేవలు లభించేటట్టు అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. పాస్‌పోర్ట్ సేవల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఆన్లైన్ సేవలలో అడ్డంకులు, విద్యుత్ సరఫరా అంతరాయంతో పనులు జరగడం లేదని వాపోతున్నారు. ప్రత్యేక మేళాలలో స్లాట్ బుకింగ్‌లు దొరకపోవడంతో నీరుగారుతున్నారు. మేళాలో పాల్గొనడానికి తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్లను ఆశ్రయిస్తున్నట్టు చెబుతున్నారు. చేపట్టాల్సిన చర్యలు ఆయా జిల్లా, మండలాలలో పాస్‌పోర్ట్ సేవలు లభించే ‘మీ-సేవ’ కేంద్రాల వివరాలు తెలియజేయాలి. ‘మీ-సేవ’ కేంద్రాలలో పనితీరును అధికారులు పర్యవేక్షించాలి, లోటుపాట్లను అధిగమించాలి. స్లాట్ బుకింగ్‌లు ప్రజలకు మరింత చేరువ చేయాలి. బ్రోకర్ల స్థావరాలపై ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలి. ప్రత్యేక మేళాల బుకింగ్‌లు జరుగుతున్న తీరుపై నిఘా ఉంచాలి. -
ప్రత్యేక పరిస్థితుల వల్లే ఓటమి: సబిత
హైదరాబాద్: గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఊహించని ఫలితాలు వచ్చాయని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మోడీ ప్రభావం, సెటిలర్ల అంశం, జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల పార్టీ ఓటమి పాలైందని తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మారని ఈ సందర్భంగా సబిత అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లలేదన్నారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం తమ బాధ్యతని, కానీ టీఆర్ఎస్ తమపై ఎదురుదాడి చేయగం తగదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతి ఉంటే విచారణ జరిపించాలని, కానీ పేదలకు అన్యాయం చేయొద్దని సబిత కోరారు. -
'బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు'
హైదరాబాద్: గాంధీభవన్ చుట్టూ తిరిగే బ్రోకర్లకే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. మధ్య దళారుల వ్యవస్థే పార్టీని ముంచిందని ఆయన అన్నారు. ఇకనైన పార్టీ కోసం కష్టపడేవారికే టికెట్లు ఇవ్వాలని, లేదంటే కాంగ్రెస్‌కు భవిష్యత్ ఉండదని హెచ్చరించారు. గ్రూపు రాజకీయాలే వల్లే కొన్ని గెలిచే సీట్లు ఓడిపోయామని వాపోయారు. ఈ సమీక్ష వాస్తవాలన్ని సోనియా గాంధీకి పొన్నాల లక్ష్మయ్య వివరించాలని సూచించారు. గాంధీభవన్ లో రంగారెడ్డి జిల్లా నేతలతో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష, పార్టీ భవిష్యత్ ప్రణాళికపై ఈ సమావేశంలో చర్చించారు. -
ఇసిగెత్తిపోతున్న ఇమానాల మంత్రి!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : అధికారులా... బ్రోకర్లా!: గతంలో మాదిరి గా వ్యవహరించొద్దు. షాడో నేతను గుర్తుకు తెచ్చేలా నడవొద్దు. అధికారులై ఉండి బ్రోకర్లుగా ఒక రాజకీయ నాయకుడు ఇంటికి వెళ్లడం సిగ్గు అన్పించలేదా? అటువంటివి జరిగితే సహించను. ఏం మీరు బొట్టుపెట్టలేరా?: రామతీర్థంలో రాములవారిని దర్శించుకున్న అనంతరం బొట్టు పెట్టుకోమని అర్చకులు కుంకుమ భరిణి అందించినప్పుడు అసహనంతో చిందులు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఉత్తర రాజగోపురం వద్దకు వచ్చేటప్పటికీ బేడాలో దేవస్థానానికి చెందిన సామాన్లు అడ్డుగా ఉండడాన్ని చూసి ఆలయ అధికారులపై శివాలు. మున్సిపల్ ఇంజనీరా...మంగలి వాడా!: ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లో క్లోరినేషన్ చేయాల్సి ఉన్నప్పటికీ ట్యాంక్‌లలో క్లోరినేషన్ చేయడం శాస్త్రీయం కాదు. ఇదే తరహాలో ముషిడిపల్లి రక్షిత మంచినీటి పథకం వద్ద ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే కనీసం పట్టించుకోలేదు. ఇదేనా ప్రజాప్రతినిధుల మాటలకిచ్చే గౌరవం అంటూ మండిపాటుపునరావృతమైతే సహించను: ఆదివారం ఉదయం 7.30గంటలకు ప్రొగ్రామ్ ఉందని ముందుగా చెప్పినా అధికారులు ప్రోటోకాల్ వాహనం ఏర్పాటు చేయలేదు. ఆగ్రహాన్ని ఆపుకోలేక తానే స్వయంగా డ్రైవ్ చేసుకుని సొంతవాహనంలో విశాఖపట్నం ప్రయాణం. అసలు విషయం తెలుసుకుని ఆర్డీఓ హుటాహుటిన వచ్చి ఎంత విజ్ఞప్తి చేసినా ప్రభుత్వ వాహనాన్ని స్వీకరించేందుకు ససేమిరా.... ఆయనపైనా ధ్వజం. కలెక్టర్, ఎస్పీకి ఫోన్ చేసి ఆగ్రహం. పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరిక.ఇలా ఒక వైపు జిల్లా అధికారులను, మరో వైపు పార్టీ నేతలను హడలెత్తిస్తూ...అసహనాన్ని వెళ్లగక్కుతూ ఇంతగా మండిపడుతున్న ఆ ప్రజాప్రతినిధి ఎవరో తెలుసా.... ఇంతవరకూ అధికార ఆర్భాటాలకు, నీచ రాజకీయాలకు దూరంగా ఉంటారని, చిన్న చిన్న విషయాలను అసలు పట్టించుకోరని పేరున్న అశోక్ గజపతిరాజు. కేంద్ర మంత్రి అయిన తరువాత మారిన తీరు గత పదేళ్లు అధికారంలో లేమన్న అక్కసో, గత ప్రభుత్వంలో అధికారులు తమను పట్టించుకోలేదన్న ఆక్రోశమో తెలియదు గానీ కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అధికారులపై చిర్రెత్తుతున్నారు. గతాన్ని గుర్తు చేసుకుని చిన్నదానికే శివతాండవం చేస్తున్నారు. ఇన్నాళ్లూ అణుచుకున్న ఆగ్రహంతో ఇప్పుడు శివాలెత్తుతున్నారు. అనుమానిస్తూ మాట్లాడుతున్నారు. తప్పు చేసినవాళ్లూ, చేయని వాళ్లపై ఒకేలా మండి పడుతున్నారు. అత్తమీద కోపం దుత్తమీద చూపిస్తున్నట్టు ప్రతి విషయంలో షాడో నేతను గుర్తు చేయడంతో అధికారులు వ్యక్తిగతంగా వివరణ ఇచ్చుకుంటున్నారు. తామెవరమూ ఆ నేతను కలవలేదని, ఆయన ఇంటికి వెళ్లలేదని ఒట్టేసే విధంగా చెప్పుకుంటున్నారు. అశోక్ పర్యటన అంటేనే వణికిపోతున్నారు. ఆయనొస్తే ఎలాంటి మాటలు విసిరేస్తారోనని అభద్రతాభావానికి లోనవుతున్నారు. పార్టీ నేతలపైనా.... అధికారులపైనా, పాలనా వ్యవస్థపైనా ఉన్న కోపాన్ని చివరికి తమ పార్టీ నేతలపైనే చూపిస్తున్నారు. పార్టీజెండాను మోసి, తన గెలుపును భుజానకెత్తుకున్న నాయకులని కూడా చూడకుండా మండి పడుతున్నారు. తన వెంటే ఉండి, కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన నాయకులపైనా శివాలెత్తుతున్నారు. ఆదివారం రాత్రి అదే జరిగింది. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరుతూ అశోక్ బంగ్లాలో సుమారు 400మంది నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీకి అందించిన సేవల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవి ఇస్తే గుర్తింపు ఇచ్చినట్టు అవుతుందని నాయకులంతా ఒక అభిప్రాయానికొచ్చారు. ఇదే విషయాన్ని అశోక్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఇంకేముంది ఆయన చిర్రెత్తిపోయారు. ‘పార్టీకి క్రమశిక్షణ ఉందని, పార్టీలో పద్ధతులున్నాయని, ఎవరికి పడితే వారికి ఇచ్చేయడానికి కుదరదని, ఐవీపీరాజుకి మంచి చేస్తున్నారో, చెడ్డ చేస్తున్నారో తెలియడం లేదు’ అంటూ విసుక్కున్నారు. పార్టీ పరమైన విషయాలను వదిలేసి వీటికోసం మాట్లాడడమేంటని మండిపడ్డారు. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని గట్టిగా కసురుకున్నారు. దీంతో సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు, నాయకులు అవమాన భారంతో బయటికొచ్చి, ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మాట్లాడుకున్నారు. కష్టపడిన వారికి పదవులు అక్కర్లేదా అని ప్రశ్నించుకోవడమే కాకుండా, ఐవీపీ రాజుకిచ్చిన గౌరవమిదేనా అని గుసగుసలాడుకుంటున్నారు. అందరి మధ్య ఐవీపీ రాజు గురించి ఇలా మాట్లాడితే రానున్న రోజుల్లో ఆయనకు ఎవరు గౌరవిమిస్తారని చర్చించుకున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలంతా అశోక్ తీరుతో నిర్వేదం చెందుతున్నారు. ఈ విధంగా అటు అధికారులతోను, ఇటు పార్టీ నాయకులతోను అశోక్ కోపావేశంతో మాట్లాడడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏదో చేస్తారనుకుంటే ప్రతికూలంగా వ్యవహరిస్తున్నారని మధనపడుతున్నారు. -
దళారుల గుప్పిట్లో కాలేజీ సీట్లు
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్ర విద్యావ్యవస్థ దళారులతో భ్రష్టుపట్టింది. అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకునేకంటే దళారులను ఆశ్రరుుస్తే ఇట్టే పనైపోతోంది. దీంతో ప్రతిభ కలిగిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు మామూళ్లు తీసుకుంటూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నెల 2వ తేదీన దాదాపు అన్ని విద్యాసంస్థలను తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు. తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరిన చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలంటే రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరిచయాలను ఁక్యాష్* చేసుకుంటున్నారు. యాజమాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా బ్రోకర్లు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారంతా బ్రోకర్లని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు ఆమె పేర్కొంది. డీపీఐలోనూ బ్రోకర్లదే పెత్తనం విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారులు హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫార్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగిపోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే బ్రోకర్లకే అధికారులు ప్రాధాన్యతనిస్తున్నారు. బ్రోకర్ల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ఁనలుగురితోపాటు నారాయణ* అనే మంత్రాన్ని జపిస్తూ బ్రోకర్లకు సహకరిస్తున్నారు. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తెరిచారు. అరుునప్పటికీ పాఠశాలలు, కళాశాలల్లో తమ పిల్లలకు అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులు విద్యాసంస్థల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. ఎల్కేజీ నుంచి ప్లస్ టూ వరకు కనీస విద్యార్హతను తమ పిల్లకు కలిగించాలని అధిక శాతం మంది ఆశ పడుతున్నారు. తమ ఆశలు ఆశయాలకు అనుగుణంగా విద్యా సంస్థను ఎంచుకుని సీటు కోసం దరఖాస్తు చేసుకుంటే అక్కడ దళారులు ప్రత్యక్షమవుతున్నారు. కోరి న చోట, కోరిన విద్యాసంస్థల్లో సీటు కావాలం టే రూ.50 వేల నుంచి రూ.2 లక్షలు ఇవ్వాలని బహిరంగంగా చెబుతున్నారు. టిప్ టాప్ డ్రస్సుతో కారుల్లో తిరిగే దళారులు విద్యాసంస్థల యాజమాన్యం, అధికారులతో ఉన్న పరి చయాలను క్యాష్ చేసుకుంటున్నారు. యాజ మాన్య, అధికారుల వాటా కోసం బ్రోకర్లే వారధిగా నిలుస్తున్నారు. సీట్ల కోసం విద్యాసంస్థల కార్యాలయాల ముందు తల్లిదండ్రులు పడిగాపులు పడుతుండగా దళారులు మాత్రం ఎటువంటి ముందస్తు అనుమతి లేకుండా రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. యాజమాన్యాలతో వారి చొరవచూసి విద్యాసంస్థ ఉద్యోగిగా భ్రమపడిన తల్లిదండ్రులు వారు దళారులని తెలుసుకుని ఖిన్నులవుతున్నారు. తన బిడ్డ ప్లస్‌టూ 94 శాతం మార్కులతో పాసైంది, సీటు కోసం కాలేజీకి వెళితే రూ.2 లక్షలు తెమ్మన్నారని ప్లాట్‌ఫాంపై పూలమ్ముకునే మహిళ వాపోయింది. తమ వంటి పేదలకు లక్షలు ఎక్కడి నుంచి వస్తారుు, ఉన్నత చదువులు పెద్దలకేనా, పేదలకు లేవా అని ఆవేదన వ్యక్తం చేసింది. సచివాలయంలో సీఎం ప్రత్యేక ఫిర్యాదుల విభాగంలో లిఖిత పూర్వక ఫిర్యాదును ఇస్తున్నట్లు పేర్కొంది. డీపీఐలోనూ దళారుల పెత్తనం: విద్యాసంస్థల్లో అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్ (డీపీఐ) కార్యాలయంలోనూ దళారుల హవా కొనసాగుతోంది. వారు దర్జాగా లోనికి ప్రవేశించడం, సీటు కోసం సంబంధిత అధికారి నుంచి సిఫా ర్సు లెటర్‌ను తీసుకోవడం నిమిషాల్లో జరిగి పోతోంది. పనుల నిమిత్తం నిజాయితీగా వచ్చేవారికంటే దళారులకే అధికారులు ప్రాధాన్యంనిస్తున్నారు. దళారుల పెత్తనాన్ని కొందరు అధికారులు సహించలేకున్నా ‘నలుగురితోపాటు నారాయణ’ అనే మంత్రాన్ని జపించాల్సి వస్తోంది. దీంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసికంగా వేదనకు గురవుతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
గిట్టుపాట్లే!
గిద్దలూరు, న్యూస్‌లైన్: అన్నదాతకు అండే లేకుండా పోతోంది. వ్యాపారులు, దళారులు దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతుకు శ్రమకు తగ్గ ఫలం లభించడం లేదు. అధికారులు సైతం భరోసా కల్పించలేకపోతున్నారు. గిద్దలూరు, కంభం మండలాల్లో మార్కెట్ యార్డులున్నా కొన్నేళ్లుగా ఎలాంటి కొనుగోళ్లు చేపట్టడం లేదు. దీంతో మార్కెట్ యార్డులు అలంకార ప్రాయంగా మారాయి. 30 వేల ఎకరాల్లో పత్తి సాగు: నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. రాచర్లలో 5 వేలు, గిద్దలూరులో 10 వేలు, కొమరోలులో 6 వేలు, బేస్తవారిపేటలో 5 వేలు, కంభం మండలంలో 4 వేలు, అర్ధవీడులో 5 వేల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది. తద్వారా 2.40 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గంలో పప్పు శనగ, మిరప, పొగాకులాంటి వ్యాపార పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. వ్యాపారులు, దళారుల మోసాలకు వారు బలైపోతున్నారు. నిరుపయోగంగా మారిన మార్కెట్ యార్డులు: గిద్దలూరు, కంభం మండల కేంద్రాల్లో ఉన్న మార్కెట్ యార్డులు కొనుగోళ్లు చేపట్టక నిరుపయోగంగా ఉన్నాయి. గిద్దలూరులో టమోటా విక్రయించేందుకు, గేదెల సంత కోసం మాత్రమే మార్కెట్ యార్డు ఉంది. అదీ దళారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోడౌన్లను సివిల్ సప్లైస్ వారికి అద్దెకిచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో రైతులు ధాన్యం నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. రైతులు పండించే ధాన్యం, పత్తి వంటి వాటిని విక్రయించేందుకు ట్రేడర్లను నియమించలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది సెస్‌ల వసూళ్లకే పరిమితమయ్యారు తప్ప రైతులకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేపట్టడం లేదు. వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో దళారులదే రాజ్యం: రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తే వారు లాభపడే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో సరైన మార్కెట్ అవకాశాలు లేకపోవడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. తేమ శాతం సాకుగా చూపి ధర తగ్గించి, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దళారులకు కాకుండా జిన్నింగ్ మిల్లులకు వెళ్తే అక్కడ డబ్బులు ఆలస్యంగా ఇస్తున్నారు. సీసీఐ కేంద్రం కానీ, ట్రేడింగ్ విధానాన్ని కానీ అమలు పరిస్తే లాభపడే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో ట్రేడింగ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ మార్కెట్‌యార్డ్ అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు దళారులు, జిన్నింగ్ మిల్లులను ఆశ్రయించాల్సి వస్తోంది. నూతనంగా ఏర్పాటవుతున్న కమిటీ వారైనా రైతులకు ప్రయోజనం కలిగే దిశగా మార్కెట్ యార్డులో వ్యాపారం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం రాచర్ల, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగులో ఉందని సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరుకు గతంలో లేఖ ఇచ్చాం. గిద్దలూరుకు మంజూరు కాలేదు. నేను ఇటీవలే కార్యదర్శిగా వచ్చాను. పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. వ్యాపారులు వినియోగిస్తున్న కాటాలను, రాళ్లను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా చూస్తాం. - వీ ఆంజనేయులు, మార్కెట్ యార్డు కార్యదర్శి, గిద్దలూరు -
చేయి తడిపితేనే.. ‘పంట’
ఆదోని, న్యూస్‌లైన్: అరకొర దిగుబడులతో నష్టాలు మూటగట్టుకున్న వేరుశెనగ రైతులను కొంతైనా ఆదుకునే ఉద్దేశంతో ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద కూడా దళారులు చేతివాటం చూపుతున్నారు. రైతుల పేరుతో ఉత్పత్తులను ఆయిల్ ఫెడ్‌కు తరలించి అక్కడి సిబ్బంది సహకారంతో సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దారిన కాకుండా సొంతంగా ఉత్పత్తులు తీసుకెళ్లిన రైతులకు వద్ద నిరీక్షణ తప్పడం లేదు. వేరుశెనగకు గిట్టుబాటు లేకపోవడాన్ని దృష్టిలో ప్రభుత్వం ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించింది. ఆదోని, కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. అయితే కేంద్రంలోని కొందరు సిబ్బందితో చేతులు కలిపి మాకింత, మీకింత ఒప్పందంతో దళారులు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. మామూళ్లు ఇచ్చిన వారికే ఫలితాలు ఆదోనిలో దళారీల సిఫారస్‌తో వచ్చిన వారి ఉత్పత్తుల కొనుగోళ్ల చురుగ్గా సాగిపోతున్నాయి. కొందరు కమీషన్ ఏజెంట్లు రైతులతో ఓ ధరకు మాట్లాడుకుని ఉత్పత్తులను మార్క్‌ఫెడ్ కేంద్రానికి తరలిస్తున్నారు. పట్టాదార్ పాస్‌పుస్తకం, తహశీల్దారు ధృవీకరణ పత్రాలను రైతులే తెస్తున్నారు. రూ. 3400కులోపుగా మాట్లాడుకుని వెంటనే డబ్బులు ఇస్తున్నారు. తర్వాత వాటిని అయిల్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడి సబ్బంది సహకారంతో రూ.4వేలకు అమ్ముకుంటున్నారు. ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని అనధికార సిబ్బందికి రూ.150 నుంచి రూ.200 వరకు ముట్టజెబుతున్నట్లు సమాచారం. ఇలా ఆదివారం కొందరు ఏజెంట్లు 200 క్వింటాళ్ల వరకు ఆయిల్‌ఫెడ్ కేంద్రంలో అమ్మినట్లు తెలిసింది. రోజుల తరబడి నిరీక్షించినా... వేరుశనగసాగుతో మూట కట్టుకున్న నష్టాలను ఆయిల్ ఫెడ్ కేంద్రంలో అమ్ముకుని కొంతైనా పూడ్చుకుందామన్న ఆశతో వచ్చిన రైతులకు రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. వీఆర్ఓ, తహశీల్దారు ధృవీకరణ పత్రాల కోసం రెండు, మూడు రోజులు తిరగాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో శాంపిల్స్ చూపించి తెచ్చే తేదీని నిర్ణయించేందుకు మరో రోజు పడుతోంది. తెచ్చిన తర్వాత మూడు రోజులకు కూడా అమ్మక ం కావడం లేదు. అదే దళారీల ద్వారా వెళ్తే సులువుగా కొనుగోళ్లు సాగిపోతున్నాయి. ఎందుకీ పరిస్థితి.. మార్కెట్లో క్వింటా ధర రూ. 3500 మించి పలుకడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మద్దతుధర(రూ.4వేలు)తో 1.50 లక్షల క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యంగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయితే ఈ నెల చివరి వరకు మాత్రమే గడువు విధించడంతో రైతులు అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. ఆదోనిలో సోమవారం వెయ్యి క్వింటాళ్ల వరకు రైతులు కొనుగోలుకు ఉంచినట్లు అంచనా. -
తిరుమలలో ‘కొత్త’ దందా
జనవరి 1, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పైరవీలు దళారుల గుప్పెట్లో వీఐపీ టికెట్లు అడ్వాన్స్‌గా నగదు వసూళ్లు.. తిరుపతి కేంద్రంగా జోరందుకున్న వ్యాపారం ముగ్గురు బోర్డు సభ్యుల బంధుగణం యమ బిజీ? సాక్షి, తిరుమల: కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు శ్రీవారి దర్శన దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొత్త సంవత్సవం తొలిరోజే ఆరంభ దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం కోసం దళారులు రంగంలోకి దిగారు. టికెట్లు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ బేరసారాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు బోర్డు సభ్యుల బంధుగణం బిజీగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీటీడీ ధర రూ.వెయ్యి.. దళారుల ధర రూ. 20 వేలు కొత్త సంవత్సరం తొలిరోజు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ వీఐపీ టికెట్టు ధర రూ. 1000గా నిర్ణయించింది. ఈ సందర్భంగా 5 వేల నుంచి 8 వేల వరకు టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీ, ఎంఎల్ఏ, అధికారులకు వీఐపీ టికెట్లను మూడు దశల్లో కేటాయించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి పర్యవేక్షిస్తోంది. ముందు జాగ్రత్తగా రూ. 300 టికెట్లను రద్దు చేసింది. వేకువజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోపు వీఐపీ దర్శనం ముగించి సర్వదర్శనం ప్రారంభించాలని ఈవో, జేఈవో కసరత్తు చేస్తున్నారు. అయితే, దర్శన దళారులు మాత్రం తమవారికి ఇప్పటికే టికెట్లు ఖరారు చేసేశారు. ఇందుకోసం ముందస్తుగానే అడ్వాన్సుగా టికెట్ల సొమ్మును కూడా సేకరిస్తున్నారు. టీటీడీ ధర ప్రకారం ఒక టికెట్టు కేవలం రూ. 1000. అయితే, దర్శన దళారులు మాత్రం ఏకంగా రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు విక్రయిస్తుండటం గమనార్హం. తిరుపతిలోని స్టార్ హోటళ్లు, ట్రావెల్ సంస్థల కేంద్రంగా ఈ దర్శన వ్యాపారం జోరందుకుంది. దర్శనానికి వెళ్లే భక్తుడి ఊరు, పేరు, ఫొటో గుర్తింపు లేకుండానే ముందస్తుగానే టికెట్టు బుక్ చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, టీటీడీలోని కొందరు పెద్దల సహకారంతో ఈ దందా జోరందుకున్నట్టు ప్రచారం. ముగ్గురు బోర్డు సభ్యులు బిజీ? ఈ వీఐపీ దర్శన టికెట్ల కోసం ముగ్గురు బోర్డు సభ్యులు తమ సంబంధీకులతో ఇప్పటికే తిరుమలలో తిష్టవేసి టికెట్ల జాబితాతో సిద్ధమవుతున్నారు. ప్రధాన నగరాల్లోని బడా వ్యాపారవేత్తలను దర్శనానికి ఆహ్వానిస్తూ వారికి దర్శన టికెట్లు ఏర్పాటుచేయటంలో బిజిబిజీ అయిపోయారు. మరోవైపు తిరుపతి కేంద్రంగా పనిచేసే కొందరు దర్శన దళారులు ఆ ముగ్గురు బోర్డు సభ్యులకు నెలవారీగా సొమ్ము చెల్లిస్తున్నట్లు విమర్శలున్నాయి. టీటీడీ అధికారులపై తీవ్ర ఒత్తిడి ఒకటో తేదీ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వీఐపీ దర్శనాల కోసం టీటీడీ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పలుకుబడి వర్గాల నుంచి సెల్ఫోన్ల ఆదేశాలు అందుతున్నాయి. ఎవరెవరికి ఎన్నెన్ని టికెట్లు ఇవ్వాలి? అనే విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి ఇచ్చినా? ఇవ్వకపోయినా ఏ పరిణామం చవిచూడాల్సి వస్తుందోనని ఆందోళనలో ఉన్నారు. -
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి లొల్లి
గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉల్లి ధర బెదరగొడుతోంది. విని యోగదారులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. దీనికంతటికీ కారణంతగ్గిన దిగుబడులు కొంతయితే.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత తోడయింది. రెండు నెలల క్రితం పరిగి మార్కెట్లో క్వింటాల్ ఉల్లి రూ.800 నుంచి రూ.1000 పలికితే ప్రస్తుతం ఈ ధర రూ.ఐదు వేలకు చేరిందంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఒక్కో రైతు క్వింటాలుకు రూ.నాలుగు వేల వరకు నష్టపోవాల్సి వచ్చింది. ఇదే సమయంలో రైతు నుంచి కొనుగోలు చేసి రెండు నెలలు నిల్వచేసిన దళారులు క్వింటాలుకు రూ.నాలుగు వేలు లాభపడుతున్నారు. ఆరు నెలలు కష్టపడి పండించిన రైతుకు ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.35 వేలు రాగా అదే రెండు నెలలు నిల్వచేసిన దళారులు 25 నుంచి 30 క్వింటాళ్లకు రూ.లక్ష వరకు లాభపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. తగ్గిన సాగు విస్తీర్ణం.. దళారులు సృష్టిస్తున్న కృత్రిమ కొరత.. ఏటా తగ్గుతున్న ఉల్లిసాగు విస్తీర్ణం.. పెరుగుతున్న వినియోగం కూడా ఉల్లి ధరలు ఆకాశాన్నంటడానికి కారణాలుగా చెప్పవచ్చు. పరిగి మండల పరిధిలో ఐదారేళ్లుగా ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఇదే సమయంలో సీజన్లో రైతుల నుంచి ఉల్లిగడ్డలు కొనుగోలు చేస్తున్న దళారులు అక్రమంగా నిల్వచేస్తూ కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో 312 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 241 హెక్టార్లలో పంట సాగవుతుందని అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వినియోగం పెరుగుతున్న క్రమంలో సాగును ప్రోత్సహించాల్సిన అధికారులు ఆ విషయం పట్టించుకోవటమే మరిచారు. జిల్లాలో యేటా మర్పల్లి మండలం పంచలింగాల, పట్లూర్, సిరిపురం, వీర్లపల్లి, ఘనాపూర్, మర్పల్లి, కొత్లాపూర్, నర్సాపూర్ గ్రామాల్లో రబీలో 500 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేసేవారు. రెండేళ్లుగా ఉల్లికి సరైన ధర పలకపోవటం.. కరెంటు కోతలు, వాతావరణం అనుకూలించక పంట దిగుబడు లు తగ్గి రైతులు పెద్ద మొత్తంలో నష్టాలు చవిచూశారు. ఈ సీజ న్లో రోజుకూ 800 క్వింటాళ్ల ఉల్లిగడ్డ శంకర్పల్లి మార్కెట్ వస్తుండగా... ఇప్పుడు మాత్రం కేవలం 10 క్వింటాళ్లు మాత్రమే బీట్ అవుతున్నాయి. 2011-12లో ఉల్లి పంట సాగుచేసి నష్టపోయిన రైతులకు ఇంత వరకూ పరిహారం డబ్బులు అందకపోవటంతో పత్తి, మొక్కజొన్న, కంది పంటల సాగుపై దృష్టి సారించారు. దీంతో ఉల్లి సాగు గణనీయంగా పడిపోయింది. నిలిచిపోయిన దిగుమతులు.. హైదరాబాద్ నగరానికి చుట్టు ప్రక్కల జిల్లా ఉండటంతో ఉల్లిగడ్డలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిత్యం సుమారు 400 నుంచి 500 మెట్రిక్ టన్నుల మేర ఉల్లిగడ్డలు అవసరం ఉంటుందని ఉద్యాన శాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు జిల్లాలో దిగుబడులు లేకపోవటంతో ఉల్లికి ధరలు పెరగడం మరో కారణంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో ప్రతి యేటా అహ్మదాబాద్, పుణేలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి పెద్ద మొత్తంలో దిగుబడులు దిగుమతి జరిగేవి. కానీ అక్కడ కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినటం, దిగుబడులు అంతంత మాత్రంగా ఉండటంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. వారం రోజులుగా కర్నూలు నుంచి దిగుమతి చేసుకొనే ఉల్లిగడ్డకు సమైక్యాంధ్ర ఉద్యమంతో రవాణా స్తంభించింది. దీంతో దిగుమతులు నిలిచిపోయాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.80 పలుకుతోంది. ధరల అదుపులో విఫలమైన ప్రభుత్వం పేదలకు రూ.185కే తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులను అందిస్తున్నామంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఉల్లి ధరలకు కళ్లెం వేయలేకపోతోంది. దీంతోపాటు ఇతర కూరగాయల ధరలను అదుపు చేయడంలోనూ విఫలమవుతోంది.