తిరుమలలో ‘కొత్త’ దందా | VIP Darshan Tickets in brokers hands at Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో ‘కొత్త’ దందా

Published Sat, Dec 28 2013 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

తిరుమలలో ‘కొత్త’ దందా

తిరుమలలో ‘కొత్త’ దందా

జనవరి 1, వైకుంఠ ఏకాదశి దర్శనాలకు పైరవీలు
దళారుల గుప్పెట్లో వీఐపీ టికెట్లు
అడ్వాన్స్‌గా నగదు వసూళ్లు..
తిరుపతి కేంద్రంగా జోరందుకున్న వ్యాపారం
ముగ్గురు బోర్డు సభ్యుల బంధుగణం యమ బిజీ?


 సాక్షి, తిరుమల: కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు శ్రీవారి దర్శన దళారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కొత్త సంవత్సవం తొలిరోజే ఆరంభ దర్శనం, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం కోసం దళారులు రంగంలోకి దిగారు. టికెట్లు ఇప్పిస్తామంటూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ బేరసారాలు సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముగ్గురు బోర్డు సభ్యుల బంధుగణం బిజీగా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

 టీటీడీ ధర రూ.వెయ్యి..  దళారుల ధర  రూ. 20 వేలు

 కొత్త సంవత్సరం తొలిరోజు, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో శ్రీవారి దర్శనం కోసం టీటీడీ వీఐపీ టికెట్టు ధర రూ. 1000గా నిర్ణయించింది. ఈ సందర్భంగా 5 వేల నుంచి 8 వేల వరకు టికెట్లు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తోంది. టీటీడీ ధర్మకర్తల మండలి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు, న్యాయమూర్తులు, ఎంపీ, ఎంఎల్‌ఏ, అధికారులకు వీఐపీ టికెట్లను మూడు దశల్లో కేటాయించనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి పర్యవేక్షిస్తోంది. ముందు జాగ్రత్తగా రూ. 300 టికెట్లను రద్దు చేసింది. వేకువజామున 2 గంటల నుంచి ఉదయం 6 గంటల్లోపు వీఐపీ దర్శనం ముగించి సర్వదర్శనం ప్రారంభించాలని ఈవో, జేఈవో కసరత్తు చేస్తున్నారు. అయితే, దర్శన దళారులు మాత్రం తమవారికి ఇప్పటికే టికెట్లు ఖరారు చేసేశారు. ఇందుకోసం ముందస్తుగానే అడ్వాన్సుగా టికెట్ల సొమ్మును కూడా సేకరిస్తున్నారు. టీటీడీ ధర ప్రకారం ఒక టికెట్టు కేవలం రూ. 1000. అయితే, దర్శన దళారులు మాత్రం ఏకంగా రూ. 10వేల నుంచి రూ. 20వేల వరకు విక్రయిస్తుండటం గమనార్హం. తిరుపతిలోని స్టార్ హోటళ్లు, ట్రావెల్ సంస్థల కేంద్రంగా ఈ దర్శన వ్యాపారం జోరందుకుంది. దర్శనానికి వెళ్లే భక్తుడి ఊరు, పేరు, ఫొటో గుర్తింపు లేకుండానే ముందస్తుగానే టికెట్టు బుక్ చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, టీటీడీలోని కొందరు పెద్దల సహకారంతో ఈ దందా జోరందుకున్నట్టు ప్రచారం.

 ముగ్గురు బోర్డు సభ్యులు బిజీ?

 ఈ వీఐపీ దర్శన టికెట్ల కోసం ముగ్గురు బోర్డు సభ్యులు తమ సంబంధీకులతో ఇప్పటికే తిరుమలలో తిష్టవేసి టికెట్ల జాబితాతో సిద్ధమవుతున్నారు. ప్రధాన నగరాల్లోని బడా వ్యాపారవేత్తలను దర్శనానికి ఆహ్వానిస్తూ వారికి దర్శన టికెట్లు ఏర్పాటుచేయటంలో బిజిబిజీ అయిపోయారు. మరోవైపు తిరుపతి కేంద్రంగా పనిచేసే కొందరు దర్శన దళారులు ఆ ముగ్గురు బోర్డు సభ్యులకు నెలవారీగా సొమ్ము చెల్లిస్తున్నట్లు విమర్శలున్నాయి.

 టీటీడీ అధికారులపై తీవ్ర ఒత్తిడి

 ఒకటో తేదీ, వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో వీఐపీ దర్శనాల కోసం టీటీడీ ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ఇప్పటికే వేల సంఖ్యలో ప్రజాప్రతినిధులు, పలుకుబడి వర్గాల నుంచి సెల్‌ఫోన్ల ఆదేశాలు అందుతున్నాయి. ఎవరెవరికి ఎన్నెన్ని టికెట్లు ఇవ్వాలి? అనే విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎవరికి ఇచ్చినా? ఇవ్వకపోయినా ఏ పరిణామం చవిచూడాల్సి వస్తుందోనని ఆందోళనలో ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement