న్యూఢిల్లీ/ముంబై: అమెరికా కమోడిటీ ఎక్సే్ఛంజ్(నైమెక్స్)లో క్రూడ్ మే నెల కాంట్రాక్టు ధర మైనస్ 37 డాలర్లకు పడిపోయినప్పటికీ.. మన మార్కెట్(ఎంసీఎక్స్) మాత్రం సొంత నిర్ణయాలతో ట్రేడర్లకు తీరని నష్టం మిగిల్చింది. లాంగ్ పొజిషన్లు తీసుకున్న కొంత మంది బడా బ్రోకర్లకు నష్టాలను తగ్గించేందుకు ఎంసీఎక్స్ గోల్‌మాల్ చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా వెళ్లడంతో నియంత్రణ సంస్థ సెబీ రంగంలోకి దిగింది. వాస్తవానికి కరోనా లాక్‌డౌన్స్ నేపథ్యంలో ట్రేడింగ్ వేళలను కమోడిటీ ఎక్సే్ఛంజీలు సాయంత్రం 5 గంటల వరకు కుదించాయి. ఇక్కడ సోమవారం ఏప్రిల్ నెల కాంట్రాక్టు ధర రూ.965 వద్ద ముగిసింది. అయితే, సోమవారం రాత్రి అమెరికా మార్కెట్లో క్రూడ్ ధర మైనస్ 37.63 డాలర్ల వద్ద ముగిసింది.
దీనిప్రకారం చూస్తే మన మార్కెట్లో మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే సెటిల్‌మెంట్ ధర క్రితం ముగింపు, మైనస్ 37.63 డాలర్ల చొప్పున రూ.2,860 కలుపుకొని సుమారు రూ.3,825 డాలర్ల వద్ద సెటిల్ చేయాల్సింది. అయితే, ఎంసీఎక్స్ మాత్రం సెటిల్‌మెంట్ ధరను రూ.1గా నిర్దేశించింది. మంగళవారంతో గడువు ముగిసే ఈ ఏప్రిల్ కాంట్రాక్టులో 11,522 ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. ఒక్కో పొజిషన్ 100 బ్యారెల్స్ క్రూడ్‌కు సమానం. దీని ప్రకారం 11,52,200 బ్యారెల్స్ విక్రయించిన వారికి(షార్ట్ సెల్లర్స్) రూ.3,825 చొప్పున రూ.440 కోట్లు లాంగ్‌పొజిషన్ తీసుకున్న ట్రేడర్ల నుంచి సెటిల్‌మెంట్ చేయాల్సి వచ్చేంది. కానీ ఎంసీఎక్స్ రూపాయి ధరనే నిర్ణయించడంతో క్రితం ముగింపు రూ.965 చొప్పున షార్ట్ సెల్లర్స్‌కు లాభాలు రూ.110 కోట్లకు పరిమితమయ్యాయి. లాంగ్ పొజిషన్ తీసుకున్న ట్రేడర్లు రూ.440 కోట్ల నష్లాలను కేవలం రూ.110 కోట్లకు మాత్రమే పరిమితం చేసుకోగలిగారు. ఇలా ఇష్టానుసారం రూల్స్ మార్చేస్తే ఎలా అంటూ విమర్శలు చెలరేగడంతో సెబీ దీనిపై దృష్టిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment