న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) 2020 జూన్‌లో భారీ క్షీణతను నమోదుచేసుకుంది. 2019 జూన్‌తో పోల్చుకుంటే, అసలు వృద్ధిలేకపోగా ఏకంగా మైనస్ 16.6 శాతం క్షీణతలోకి జారిపోయింది. తయారీ, మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మంగళవారం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను చూస్తే...
► మొత్తం సూచీలో దాదాపు 60 శాతంపైగా ప్రాతినిధ్యం వహించే తయారీ రంగంలో ఉత్పత్తి ఏకంగా 17.1% క్షీణతను నమోదుచేసుకుంది.
► మైనింగ్ రంగం మైనస్ 19.8 శాతం క్షీణ రేటును నమోదుచేసుకుంది
► ఇక విద్యుత్ ఉత్పత్తి మైనస్ 10 శాతం పడిపోయింది.
► రిఫ్రిజిరేటర్లు, స్పోర్ట్స్ పరికరాలు, బొమ్మలు వంటి కన్జూమర్ డ్యూరబుల్స్ ఏకంగా –35.5 శాతం క్షీణించాయి.
► త్వరిత వినియోగ వస్తువుల విభాగంలో (కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్) మాత్రం 14 శాతం వృద్ధి నమోదుకావడం గమనార్హం.
► భారీ యంత్ర పరికరాలకు సంబంధించిన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో ఈ క్షీణ రేటు ఏకంగా 36.9 శాతంగా ఉంది.
► మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో 40 శాతంపైగా వెయిటేజ్ ఉన్న ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్– జూన్‌లో (2019 జూన్‌తో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా మైనస్ 15 శాతం క్షీణించింది. ఎనిమిది రంగాల్లో ఏడు – బొగ్గు (–15.5 శాతం), క్రూడ్ ఆయిల్ (–6 శాతం) , సహజ వాయువు (–12 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (–8.9 శాతం), స్టీల్ (–33.8 శాతం) , సిమెంట్ (–6.9 శాతం), విద్యుత్ (–11 శాతం) ఉత్పత్తి క్షీణ రేటును నమోదుచేసుకోవడం గమనార్హం. ఒక్క ఎరువుల రంగం మాత్రం వృద్ధి ధోరణిని కనబరచింది.
నెలవారీగా మెరుగుపడిన ఇండెక్స్
కాగా, సాంప్రదాయకంగా గణాంకాలను వార్షికంగా పోల్చి చూసినా, కరోనా ప్రభావిత నెలల లెక్కలను అంతక్రితం లెక్కలతో పోల్చడం అంత సబబుకాదని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పేర్కొనడం గమనార్హం. వార్షికంగా క్షీణ రేట్లు కనబడినా, నెలవారీగా గణాంకాలు కొంత మెరుగుపడ్డం ఊరటనిచ్చే అంశం. ఏప్రిల్‌లో 53.6 వద్ద ఉన్న సూచీ, మేలో 89.5కు ఎగసింది. జూన్‌లో మరింతగా పెరిగి 107.8కి ఎగసింది.
క్యూ1లో 35.9 శాతం క్షీణత
ఇక ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో చూసినా కూడా పారిశ్రామిక ఉత్పత్తి మైనస్ 35.9 శాతం క్షీణతను నమోదు చేసుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3 శాతం వృద్ధి నమోదయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment