హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమెరికాలో జనరిక్స్ వ్యాపారంపై ధరలపరమైన ఒత్తిళ్లు తగ్గడం, నాణ్యతపరమైన వివాదాలు పరిష్కారమవుతుండటం తదితర అంశాల నేపథ్యంలో ఫార్మా రంగం ఆశావహంగా కనిపిస్తున్నట్లు యూటీఐ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ అమిత్ ప్రేమ్‌చందాని వెల్లడించారు. తమ పోర్ట్‌ఫోలియోలో దీనిపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నట్లు వివరించారు. గడిచిన రెండేళ్లుగా ఆటోమొబైల్ రంగం క్షీణత నమోదు చేసినప్పటికీ ..పరిస్థితి మెరుగై డిమాండ్ పెరిగే కొద్దీ ఈ పరిశ్రమ కూడా కోలుకోగలదని వివరించారు. ఆటో రంగంలో చాలా మటుకు కంపెనీల దగ్గర పుష్కలంగా నిధులున్నందున ప్రస్తుత సంక్షోభం నుంచి బైటపడగలవని, వేల్యుయేషన్లు సముచిత స్థాయిలో ఉన్నాయని అమిత్ తెలిపారు. మరోవైపు, కరోనా వైరస్ పరిణామాల కారణంగా ఆర్థిక సంస్థలకు రుణాల వసూళ్లు దెబ్బతింటున్న దాఖలాలు కనిపిస్తున్నాయ న్నారు. రిజర్వ్ బ్యాంక్ కొంత తోడ్పాటు ఇస్తున్నప్పటికీ, మందగమన మూల్యాన్ని ఆర్థిక సంస్థలు కూడా ఎంతో కొంత చెల్లించుకోవాల్సి రా వచ్చన్నారు. ఫైనాన్షియల్ రంగం మరింత జాప్యం తర్వాత కోలుకోవచ్చని అమిత్ పేర్కొన్నారు.
క్రమంగా అనిశ్చితి తగ్గవచ్చు..: కరోనా భయాలతో మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతోందని, లాక్‌డౌన్ ఎత్తివేతను బట్టి క్రమంగా అనిశ్చితి తగ్గవచ్చని అమిత్ తెలిపారు. వచ్చే కొన్ని నెలల పాటు వెలువడే ఆర్థిక గణాంకాలు బలహీనంగానే ఉండొచ్చని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయన్నారు. కరెక్షన్ అనంతరం షేర్లు సముచితంగా, చౌకైన వేల్యుయేషన్‌తో లభ్యమవుతున్నాయని అమిత్ వివరించారు. ఇన్వెస్టర్లు తమ రిస్కు సామర్థ్యాన్ని బట్టి మళ్లీ క్రమంగా పెట్టుబడులు పెట్టవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment