కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక రికవరీపై సంశయాలతో మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నా, సోమవారం మొదలైన లాభాల స్వీకరణ మంగళవారం కూడా కొనసాగడంతో మన మార్కెట్లో నష్టాలు తప్పలేదు. సెన్సెక్స్ 34,000 పాయింట్లు, నిఫ్టీ 10,100 పాయింట్లు దిగువకు పడిపోయాయి. ఈ ఏడాది మహా మహా మాంద్యం తప్పదని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 414 పాయింట్ల నష్టంతో 33,957 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 121 పాయింట్లు నష్టపోయి 10,047 పాయింట్ల వద్ద ముగిశాయి. సూచీలకు గత 3 వారాల్లో ఇదే అతిపెద్ద పతనం.
930 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్
సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే మొదలైనా, అరగంటలోనే నష్టాల్లోకి జారిపోయాయి. మళ్లీ అరగంటలోనే లాభాల్లోకి వచ్చాయి. యూరప్ మార్కెట్లు బలహీనంగా మొదలవడంతో మన సూచీలు మళ్లీ నష్టాల్లోకి జారిపోయాయి. ఒక్క ఢిల్లీ నగరంలోనే జూలై చివరికల్లా కరోనా కేసులు 5.5 లక్షలకు చేరగలవని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా వ్యాఖ్యానించడంతో ట్రేడింగ్ చివర్లో అమ్మకాలు జోరుగా సాగాయి. ఒక దశలో 440 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ మరో దశలో 490 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 930 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 855 పాయింట్లు పతనమైంది. జపాన్ మినహా మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో మొదలై, నష్టాల్లోనే ముగిశాయి.
► ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ 3 శాతం నష్టంతో రూ.349 వద్ద ముగిసింది.
► సెకండరీ మార్కెట్ ద్వారా ప్రమోటర్లు మరిన్ని షేర్లను కొనుగోలు చేయనున్నారన్న వార్తల కారణంగా ఇండసఇండ్ బ్యాంక్ షేర్ 2.7 శాతం లాభంతో రూ. 464వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► దాదాపు 60కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లుపిన్, ముత్తూట్ ఫైనాన్స్, అదానీ గ్రీన్, సన్ ఫార్మా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment