ముంబై: కరోనా కేసులు, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలు మరోసారి తెరపైకి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్ మూడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. భారత్‌తో సహా పలు దేశాల్లో కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ విజృంభిస్తున్నట్లు నివేదికలు తెలపడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్ సన్నగిల్లింది. అంతర్జాతీయంగా నెలకొన్న ద్రవ్యోల్బణం భయాలు కూడా ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు క్షీణించి 74.88 వద్ద ముగిసింది. గత వారాంతాన కార్పొరేట్లు వెల్లడించిన తొలి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయాయి. సూచీలు జీవితకాల రికార్డు స్థాయిల వద్ద ట్రేడ్ అవుతున్న తరుణంలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది.
ఈ ప్రతికూలతలతో సోమవారం సెన్సెక్స్ 587 పాయింట్లను కోల్పోయి 53 వేల స్థాయి దిగువన 52,553 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 171 పాయింట్లు పతనమై 15,752 వద్ద నిలిచింది. ఏప్రిల్ 30 తేదీ తర్వాత ఇరు సూచీలకు ఇదే అతిపెద్ద నష్టం. ఫార్మా, రియల్టీ షేర్లకు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్‌లోని 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,199 కోట్ల షేర్లను అమ్మగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,048 కోట్లను కొన్నారు. ఇటీవల రాణిస్తున్న మధ్య, చిన్న తరహా షేర్ల అమ్మకాలు తలెత్తడంతో బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం క్షీణించాయి. సూచీలు ఒకశాతం పతనంతో ఇన్వెస్టర్లు రూ.1.16 లక్షల కోట్లను కోల్పోయారు. దీంతో ఇన్వెస్టర్లు సంపద భావించే బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల విలువ రూ.234.46 లక్షల కోట్లకు దిగివచ్చింది.
తొలి నుంచీ తుది దాకా అమ్మకాలే...
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మార్కెట్ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 53 వేల దిగువును 533 పాయింట్ల నష్టంతో 52,607 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల నష్టంతో 15,754 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గత శనివారం క్యూ1 ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. రెండో దశ కరోనాతో ఆస్తుల నాణ్యత క్షీణించినట్లు ప్రకటించింది. ఈ ప్రతికూల ప్రభావం బ్యాంకులతోపాటు ఎన్‌బీఎఫ్‌సీ రంగాలకు విస్తరించి ఉండొచ్చనే అంచనాలతో సంబంధిత రంగాలైన ఆర్థిక, బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. కరోనా, ద్రవ్యోల్బణ భయాలతో మెటల్, ఆటో షేర్లు నష్టపోయాయి. గతవారంలో రాణించిన ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఒక దశలో సెన్సెక్స్ 734 పాయింట్లను కోల్పోయి 52,406 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు నష్టపోయి 15,707 స్థాయిల వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి.
అమెరికా, యూరప్ సూచీలు 2% పైగా డౌన్
కోవిడ్ డెల్టా వేరియంట్ కేసులు విజృంభణతో ప్రపంచ మార్కెట్లు వారం ప్రారంభంలోనే భారీ నష్టాలను చవిచూశాయి. ద్రవ్యోల్బణ భయాలు ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. కేసుల కట్టడికి స్థానిక ప్రభుత్వాలు ఆంక్షలు విధింపుతో ఆర్థిక వృద్ధి నీరసిస్తుందనే అంచనాలతో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆసియాలో చైనా మినహా అన్ని దేశాల స్టాక్ సూచీలు రెండుశాతం నష్టంతో ముగిశాయి. అత్యధికంగా హాంకాంగ్ సూచీ రెండు శాతం నష్టపోయింది. అలాగే యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాల మార్కెట్లు రెండు నుంచి మూడు శాతం క్షీణించాయి. ఇక అమెరికాకు చెందిన డౌజోన్స్ సూచీ ఈ ఏడాదిలో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. సోమవారం రాత్రి వార్త రాసే సమయానికి 850 పాయింట్లు(రెండున్నర శాతం) నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఎస్‌అండ్‌పీ సూచీ కూడా రెండు శాతం, నాస్‌డాక్ ఇండెక్స్ ఒక శాతం పతనంతో కదలాడుతున్నాయి.
మార్కెట్లో మరిన్ని సంగతులు
n తొలి త్రైమాసిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరు మూడుశాతానికి పైగా నష్టపోయి రూ.1,471 వద్ద ముగిసింది. నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏలు), రీస్ట్రక్చరల్ రుణాలు పెరగడంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది.
n రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు మెజారిటీ వాటాను విక్రయించడంతో జస్ట్ డయల్ కంపెనీ షేరు ఐదుశాతం నష్టంతో రూ.1025 వద్ద స్థిరపడింది.
n క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించినా ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ హోల్డింగ్ షేరు నాలుగు శాతం నష్టంతో రూ.91 వద్ద నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment