గిద్దలూరు, న్యూస్‌లైన్: అన్నదాతకు అండే లేకుండా పోతోంది. వ్యాపారులు, దళారులు దోపిడీ చేస్తున్నారు. దీంతో రైతుకు శ్రమకు తగ్గ ఫలం లభించడం లేదు. అధికారులు సైతం భరోసా కల్పించలేకపోతున్నారు. గిద్దలూరు, కంభం మండలాల్లో మార్కెట్ యార్డులున్నా కొన్నేళ్లుగా ఎలాంటి కొనుగోళ్లు చేపట్టడం లేదు. దీంతో మార్కెట్ యార్డులు అలంకార ప్రాయంగా మారాయి.
30 వేల ఎకరాల్లో పత్తి సాగు:
నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. రాచర్లలో 5 వేలు, గిద్దలూరులో 10 వేలు, కొమరోలులో 6 వేలు, బేస్తవారిపేటలో 5 వేలు, కంభం మండలంలో 4 వేలు, అర్ధవీడులో 5 వేల ఎకరాల్లో పత్తి సాగులో ఉంది. తద్వారా 2.40 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉంది.
మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు విధిలేని పరిస్థితుల్లో దళారులకు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. దీంతో మద్దతు ధర రాక తీవ్రంగా నష్టపోతున్నారు. నియోజకవర్గంలో పప్పు శనగ, మిరప, పొగాకులాంటి వ్యాపార పంటలను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ పంటలకు రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదు. వ్యాపారులు, దళారుల మోసాలకు వారు బలైపోతున్నారు.
నిరుపయోగంగా మారిన మార్కెట్ యార్డులు:
గిద్దలూరు, కంభం మండల కేంద్రాల్లో ఉన్న మార్కెట్ యార్డులు కొనుగోళ్లు చేపట్టక నిరుపయోగంగా ఉన్నాయి. గిద్దలూరులో టమోటా విక్రయించేందుకు, గేదెల సంత కోసం మాత్రమే మార్కెట్ యార్డు ఉంది. అదీ దళారుల కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. ధాన్యం నిల్వ చేసేందుకు నిర్మించిన గోడౌన్లను సివిల్ సప్లైస్ వారికి అద్దెకిచ్చి చేతులు దులుపుకున్నారు.
దీంతో రైతులు ధాన్యం నిల్వ చేసే అవకాశం లేకుండా పోయింది. రైతులు పండించే ధాన్యం, పత్తి వంటి వాటిని విక్రయించేందుకు ట్రేడర్లను నియమించలేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ మార్కెట్ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది సెస్‌ల వసూళ్లకే పరిమితమయ్యారు తప్ప రైతులకు ప్రయోజనాలు చేకూర్చే పనులు చేపట్టడం లేదు.
వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో దళారులదే రాజ్యం:
రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తే వారు లాభపడే అవకాశం ఉంటుంది. నియోజకవర్గంలో సరైన మార్కెట్ అవకాశాలు లేకపోవడంతో దళారులు రాజ్యమేలుతున్నారు. తేమ శాతం సాకుగా చూపి ధర తగ్గించి, తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. దళారులకు కాకుండా జిన్నింగ్ మిల్లులకు వెళ్తే అక్కడ డబ్బులు ఆలస్యంగా ఇస్తున్నారు.
సీసీఐ కేంద్రం కానీ, ట్రేడింగ్ విధానాన్ని కానీ అమలు పరిస్తే లాభపడే అవకాశముందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ మార్కెట్‌యార్డ్ అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో రైతులు తాము పండించిన పంటను అమ్ముకునేందుకు దళారులు, జిన్నింగ్ మిల్లులను ఆశ్రయించాల్సి వస్తోంది. నూతనంగా ఏర్పాటవుతున్న కమిటీ వారైనా రైతులకు ప్రయోజనం కలిగే దిశగా మార్కెట్ యార్డులో వ్యాపారం జరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
రాచర్ల, గిద్దలూరు, కొమరోలు మండలాల్లో అధిక విస్తీర్ణంలో పత్తి సాగులో ఉందని సీసీఐ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టరుకు గతంలో లేఖ ఇచ్చాం. గిద్దలూరుకు మంజూరు కాలేదు. నేను ఇటీవలే కార్యదర్శిగా వచ్చాను. పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. వ్యాపారులు వినియోగిస్తున్న కాటాలను, రాళ్లను పరిశీలించి మోసాలకు పాల్పడకుండా చూస్తాం. - వీ ఆంజనేయులు, మార్కెట్ యార్డు కార్యదర్శి, గిద్దలూరు
గిట్టుపాట్లే!
Published Wed, Feb 12 2014 5:31 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM
Advertisement
Advertisement