Agriculture Market Committee
-
మార్కెట్ కమిటీలు రద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కొత్త కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేసుకోవాలని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ఈ కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో మంగళవారం ఐదు ఉమ్మడి జిల్లాలకు చెందిన ఇన్చార్జ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పోస్టింగులు, బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. సమర్థులైన అధికారులను ప్రభుత్వమే గుర్తించి అవసరమైనచోట వారి సేవలు ఉపయోగించుకుంటుందన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎవరు తలదూర్చినా నిఘా యంత్రాంగం దృష్టి సారిస్తుందనే విషయాన్ని గుర్తించాలని మంత్రులు,ఎమ్మెల్యేలతో అన్నారు. గెలుపే లక్ష్యంగా పనిచేయాలి త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలు పునిచ్చారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని, త్వరలోనే ఇందిరమ్మ కమిటీలు నియమించి ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేస్తామన్నారు. అయితే నియోజకవర్గస్థాయిలో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని, అవినీతి అధికారులను ప్రోత్సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని హితవు పలికారు. ప్రతీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు ప్రత్యేక నిధిని కేటాయిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. నిధుల ప్రాథమ్యాలను నిర్ణయించే బాధ్యత ఉమ్మడి జిల్లాల ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తామన్నారు. ఇన్చార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, స్థానిక సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 లోక్‌సభ స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖతో పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు భేటీలో పాల్గొన్నారు. -
పొలం నుంచి మార్కెట్‌కు..
సాక్షి, అమరావతి: పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేందుకు రైతన్నలు పడుతున్న వెతలకు చెక్ పెట్టే లక్ష్యంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల పరిధిలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. మార్కెట్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయంలో ఏఏంసీల నిర్వహణ, సిబ్బంది జీతభత్యాల కోసం ఖర్చుచేయగా.. మిగిలిన కొద్దిపాటి సొమ్ములను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేసే వారు. దీంతో ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన ఏఎంసీలకు కొత్తరూపునివ్వడంతో పాటు.. రైతు క్షేత్రాల నుంచి మార్కెట్లకు అనుసంధానించే రోడ్లను నిర్మించాలని సంకల్పించింది. ఇదే లక్ష్యంతో మార్కెటింగ్ సెస్‌ను కాస్త సవరిస్తూ ధాన్యంపై 2శాతం, రొయ్యలపై 1 శాతం, చేపలపై రూ.0.50 శాతం, మిగిలిన అన్నిరకాల నోటిఫైడ్ వ్యవసాయ, లైవ్‌స్టాక్ ఉత్పత్తులపై ఒక శాతం చొప్పున సెస్ పెంపును ప్రతిపాదించింది. ధాన్యం మినహా ఇతర ఉత్పత్తులపై ప్రతిపాదించిన సెస్ వసూలుకు హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్గత రహదారులకు పెద్దపీట మరోవైపు వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను యార్డులు, మార్కెట్లకు తరలించుకునేందుకు వీలుగా రైతు క్షేత్రాల నుంచి ఏఏంసీలకు, ఏఎంసీల నుంచి మండల, నియోజకవర్గ కేంద్రాలను అనుసంధానిస్తూ అనుబంధ రహదారుల నిర్మాణం, ఏఎంసీలు, యార్డులు, మార్కెట్లు, చెక్ పోస్టులు, యార్డులు, రైతు బజార్లను ఆధునికీకరించడం, కొత్తగా ఏర్పడిన ఏఎంసీలకు భవనాలతో పాటు కొత్త జిల్లాలకు అనుగుణంగా కార్యాలయ భవనాలు నిర్మించాలని సంకల్పించారు. ఈ మేరకు ఏపీ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు(ఏపీఎంఐడీపీ)లో భాగంగా రూ.1072.93 కోట్లతో 11,088 కి.మీ. మేర అంతర్గత రహదారుల నిర్మాణం, మరో 9,123 కి.మీ.మేర రహదారుల మరమ్మతులు, రూ.527 కోట్లతో ఏఎంసీలు, యార్డులు, రైతు బజార్లలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ప్రభుత్వం పరిపాలనామోదం ఇచ్చింది. నాబార్డు ద్వారా రూ.1,003.94 కోట్ల రుణం మార్కెట్ సెస్ రూపంలో ఏటా రూ.550 కోట్ల ఆదాయం వస్తుండగా, ధాన్యంపై సెస్ పెంపు వల్ల గతేడాది రూ.648 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.708 కోట్లు వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.400 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోదన్న ఆలోచనతో ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందాలని నిర్ణయించింది. ఆ బా«ధ్యతలను నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు అప్పగించింది. ఇటీవలే ఈ ప్రాజెక్టు కోసం గిడ్డంగుల సంస్థకు నాబార్డు రూ.1,003.94 కోట్ల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తంలో రూ.861.53 కోట్లతో అనుబంధ రహదారుల నిర్మాణం, రూ.197.76 కోట్లతో మౌలిక వసతుల కల్పనకు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు కింద 2024–24 ఆర్థిక సంవత్సరంలో రూ.446.20 కోట్లు, 2025–26లో రూ.669.29 కోట్లతో చేపట్టనున్న ఈ పనులు పంచాయతీ రాజ్ శాఖకు అప్పగించారు. రైతు సంక్షేమం కోసమే.. పండించిన వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను కల్లాల నుంచి మార్కెట్లకు తరలించేందుకు అనువైన రహదారుల నిర్మాణంతో పాటు మార్కెట్ కమిటీల్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.1599.92 కోట్ల అంచనాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, ఇటీవలే నాబార్డు రూ.1003.94 కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధులతో 2024–26 ఆర్థిక సంవత్సరాల్లో చేపట్టనున్న పనులకు పరిపాలనామోదం ఇచ్చాం. త్వరలో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నాం. మౌలిక వసతుల కల్పన కోసం రుణం తీసుకుంటున్నామే తప్ప, ఈ రుణం కోసం రైతులపై పన్నుల భారం మోపుతున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదు. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
నేటితో ‘వరంగల్’ పదవీకాలం ముగింపు! తదుపరి మరెవరికీ?
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం పదవీకాలం నేటి (శుక్రవా రం)తో ముగియనుంది. తెలంగాణ ఏర్పాటయ్యాక ఉద్యమకారులకే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే డిమాండ్ రావడంతో అన్ని సామాజిక వర్గాలకు అవకాశం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం చైర్మన్ పదవికి రిజర్వేషన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఐదేళ్ల వరకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ డ్రా పద్ధతిలో చైర్మన్ల పదవీ కాలాన్ని నిర్ణయించారు. రిజర్వేషన్ ఇలా.. మొదటిసారి జనరల్, రెండోసారి బీసీ, మూడోసారి ఎస్సీ మహిళ, నాలుగో సారి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కాంగ్రెస్‌కు చెందిన మంద వినోద్‌కుమార్ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన 02–09–2013లో చైర్మన్‌గా నియమితులై 28.02.2015 వరకు కొనసాగారు. రిజర్వేషన్ అమల్లోకి రావడంతో తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్న మధుసూదనాచారి అనుయాయుడు పరకాల నియోజకవర్గానికి చెందిన కొంపెల్లి ధర్మరాజుకు వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి దక్కింది. ఆయన 15–10–2016 నుంచి 06–10–2018 వరకు పూర్తిగా రెండేళ్ల పాటు చైర్మన్‌గా పని చేశారు. మరోసారి పదవి పొడిగించుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారుడి కోటాలో అదే నియోజకవర్గానికి చెందిన చింతం సదానందం చైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఆయన 21 డిసెంబర్ 2019లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ మరో ఆరు నెలల పాటు పొడిగింపు పొందడంతో 19–06–2021వరకు ఏడాదిన్నర పాటు పదవిలో కొనసాగారు. మరో ఆరునెలలు పొడిగింపునకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ కార్పొరేషన్ మేయర్ పదవి దిడ్డి కుమారస్వామికి దక్కకపోవడంతో మార్కెట్ పదవి కావాలని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే పట్టుబట్టి దిడ్డి కుమారస్వామి సతీమణి భాగ్యలక్ష్మిని చైర్‌పర్సన్‌గా చేశారు. కాగా.. కాజీపేట, పరకాలకు చెందిన నాయకులకు చైర్మన్ పదవీ ఇవ్వాలని ఇతర పెద్ద నాయకులు ప్రయత్నించినప్పటికీ గ్రేటర్ రాజకీయాల వల్ల ఉద్యమకారులకు ద క్కకుండా పోయింది. దిడ్డి భాగ్యలక్ష్మి చైర్‌పర్సన్‌గా 19–08–2021నుంచి 18–07–2022 వరకు కొనసాగారు. మరో ఏడాది పాటు కమిటీ గడువు పెంచాలని తీవ్రంగా ప్రయత్నాలు చేసినా పొడిగించలేదు. ఈసమయంలోనే పరకాల నియోజకవర్గానికి చెందిన ఒక నాయకుడికి ఈ పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన మంత్రి తీవ్రంగా ప్రయత్నించడం వల్ల ఉన్న కమిటీ పొడిగింపులో జాప్యం జరిగింది. కొత్త చైర్మన్ నియామకానికి రిజర్వేషన్ అడ్డంకిగా మారడంతో చివరికి ఇదే కమిటీ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో దిడ్డి భాగ్యలక్ష్మి 18–08–2023 వరకు చైర్‌పర్సన్‌గా రెండేళ్ల పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. ఈసారైనా దక్కేనా? వరంగల్ మార్కెట్ కమిటీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆప్రాంతానికి చెందిన వారికి చైర్మన్ పదవి దక్కలేదు. గతంలో చైర్మన్ పదవి తన నియోజకవర్గానికే ఇవ్వాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ పట్టుబట్టినప్పటికీ వచ్చేసారి రిజర్వేషన్ అమలు అవుతున్నందున తప్పకుండా అవకాశం ఇస్తామని పార్టీ అధిష్టానం చెప్పడంతో ఆయన మిన్నకుండిపోయారు. అందువల్ల ఈసారి వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన వారికే పదవి అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఎన్నికల ముందు నూతన కమిటీ ఏర్పాటు చేసి తలనొప్పి ఎందుకు తెచ్చుకోవాలన్న ఆలోచన సైతం నాయకులు చేస్తున్నట్లు తెలిసింది. శుక్రవారంతో మార్కెట్ పాలకవర్గం పదవీకాలం పూర్తి అవుతున్నందున కొత్త కమిటీని నియమిస్తారా? ఎన్నికలు ముగిసే వరకు స్పెషల్ ఆఫీసర్‌తో పూర్తి చేస్తారా? అనేది వేచి చూడాలి. -
అద్దెకు మార్కెటింగ్ శాఖ గోడౌన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న గోదాములను అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయ వనరులను పెంచుకోవాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో 9,75,105 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 1,059 గోదాములు ఉన్నాయి. ఇప్పటివరకు ‘రైతుబంధు’ పథకం కింద రైతులు తాము పండించిన ఉత్పత్తులకు కనీస మద్దతు ధర వచ్చే వరకు ఈ గోదాముల్లో దాచుకునేవారు. మిగిలిన గోడౌన్లను ప్రభుత్వరంగ సంస్థలైన సివిల్ సప్లయిస్, రాష్ట్ర గోదాముల సంస్థకు అద్దెకు ఇచ్చేవారు. అయినప్పటికీ మరికొన్ని గోడౌన్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు కూడా వ్యవసాయ ఉత్పత్తులను వీటిలో నిల్వ చేసుకునే వెసులుబాటును మార్కెటింగ్ శాఖ కల్పిస్తోంది. తద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఏడాది నుంచి రెండేళ్ల కాలానికి వీటిని అద్దెకు ఇస్తారు. చదరపు అడుగుకు రూ.5పైగా అద్దె వస్తేనే.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2,53,639 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల 258 గోదాములను చదరపు అడుగు రూ.5కు మించి ఎవరు కోట్ చేస్తారో వారికి అద్దెకిచ్చేందుకు ఇటీవలే నోటిఫికేషన్ జారీ అయింది. అత్యధికంగా గుంటూరులో 44, అత్యల్పంగా విశాఖపట్నంలో 4 గోదాములు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు విజయ నగరంలో 1, పశ్చిమ గోదావరిలో 7, వైఎస్సార్ జిల్లాలో 6 గోడౌన్లను చదరపు అడుగుకు రూ.6 చొప్పున చెల్లించి అద్దెకు తీసుకునేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. మిగిలిన వాటిని కూడా ప్రైవేటు సంస్థలు లేదా వ్యక్తులకు లీజుకిచ్చేందుకు మరోసారి నోటిఫికేషన్ జారీ చేసేందుకు మార్కెటింగ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. -
మార్కెట్ కమిటీలు కళకళ
సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌తో గతేడాది ఆగస్టు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం తిరిగి మొదలయ్యా యి. దీంతో 8 నెలల పాటు ఆర్థిక ఇబ్బందులు పడి న మార్కెట్ కమిటీలు గాడిలో పడ్డాయి. మార్కెటింగ్ శాఖ అదీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 815 మంది రెగ్యులర్, 2,628 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతభత్యాల కింద ఏటా రూ.1. 22 కోట్లు ఖర్చవుతోంది. 2,478 మంది పింఛన్‌దారులు ఉండగా, వారికి ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ కమిటీలకు ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన నిధులతో మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. 1 శాతం సెస్ వసూలు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఆయా ఉత్పత్తుల విలువపై ఒక శాతం మొత్తాన్ని సెస్ రూపంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి. 2019–20లో రికార్డు స్థాయిలో 10,18,235.76 మెట్రిక్ టన్నుల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు మార్కెట్లోకి రాగా.. వాటి క్రయ విక్రయ లావాదేవీలపై మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.551.22 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ కారణంగా గతేడాది ఆగస్టు 20వ తేదీ నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 2019– 20తో పోల్చితే 2020–21లో ఏకంగా రూ.433.52 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ కోల్పోవాల్సి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం సాగడం తో సుప్రీంకోర్టు ఆ చట్టాల అమలుపై స్టే విధించిం ది. దీంతో సెస్ వసూళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 25నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు పునఃప్రారంభం కావడంతో రూ.వంద కోట్లకు పైగా సెస్ వసూలయినట్లు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులకు తెరపడింది దాదాపు 8 నెలల పాటు మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం సెస్ వసూళ్లు ప్రారంభించారు. సీజన్ మొదలవడంతో మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి. – పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
వ్యవసాయ మార్కెట్లోని సభలో పాల్గొన్న మంత్రి కొడాలి నాని
-
ఉల్లి రైతుల్లో ‘ధర’హాసం
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రైతుల పంట పండుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లి ధరలు పెరుగుతుండటంతో రైతుల ఆనందానికి అవధులు లేవు. గతంలో క్వింటాల్ ఉల్లికి అత్యధికంగా లభించిన ధర రూ.5,400 మాత్రమే. ప్రస్తుతం రూ.10,180 ధర పలకడం విశేషం. ఉల్లి పంటకు కర్నూలు జిల్లా పెట్టింది పేరు. తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి పేరు చెబితే కర్నూలు జిల్లా గుర్తొస్తుంది. దేశ వ్యాప్తంగా ఉల్లి కొరత ఏర్పడటంతో ఈ జిల్లాపై జాతీయ స్థాయి వ్యాపారుల దృష్టి పడింది. జిల్లాలో పండిన ఉల్లి ఎప్పటికప్పుడు అమ్ముడైపోతుండటంతో ధరలు ఎగిసి పడుతున్నాయి. రెండు, మూడేళ్లుగా ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు ధరలు పెరగడంతో వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆదివారం కర్నూలు మార్కెట్లో క్వింటాల్‌కు అత్యధిక ధర రూ.7,570 పలికింది. సోమవారం రూ.10,180కి ఎగబాకింది. రాష్ట్రంలో పండుతున్న ఉల్లిలో 95 శాతం కర్నూలు జిల్లాలోనే పండిస్తున్నారు. జిల్లాలో 2018–19లో 34,158 హెక్టార్లలో ఉల్లి సాగు చేయగా.. 7,85,634 టన్నుల దిగుబడి వచ్చింది. 2019–20లో 32 వేల హెక్టార్లలో పంట సాగు కాగా.. 7,04,000 టన్నులు ఉత్పత్తి అయ్యింది. గత ఏడాదితో పోలిస్తే సుమారు 2 వేల ఎకరాల్లో సాగు తగ్గగా.. ఉత్పత్తి 81,634 టన్నులు తగ్గింది. సబ్సిడీతో ఊరట ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రిటైల్ మార్కెట్లో ఉల్లి ధరలు షాక్ కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సబ్సిడీపై కిలో ఉల్లి రూ.25కే పంపిణీ చేస్తుండటం ఊరటనిస్తోంది. వినియోగదారుల కోసం ప్రభుత్వం కూడా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో రోజుకు 100 నుంచి 120 టన్నుల వరకు ఉల్లి కొనుగోలు చేస్తోంది. కిలో ఉల్లిపై ప్రభుత్వం రూ.50కి పైగా సబ్సిడీ రూపంలో భరిస్తోంది. -
మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ వెబ్ సైట్‌తో.. రికార్డుల పరంగా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే వెసులుబాటు ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన అగ్రికల్చర్ మిషన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అనంతరం అగ్రిమిషన్‌పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు రైతు భరోసా ద్వారా వచ్చే మే నెల నాటికి మరింత మందికి లబ్ధి చేకూరుతుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటివరకూ 45,20,616 మంది కుటుంబాలకు చెందిన రైతులు రైతు భరోసా కింద లబ్ధి పొందారని తెలిపారు. సుమారు రూ.5,185.35 కోట్ల పంపిణీ చేశామని వెల్లడించారు. డిసెంబర్ 15 వరకూ కౌలు రైతులకు అవకాశం ఉంటుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. దేవాలయాల భూములను సాగు చేసుకుంటున్న రైతులు, సొసైటీల పేరుతో సాగు చేసుకుంటున్న రైతులను కూడా రైతు భరోసా కింద పరిగణలోకి తీసుకోవాలని ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. గ్రామ సచివాలయాల పక్కన దుకాణాలు, వర్క్‌షాపుల ఏర్పాటుపై సమీక్షలో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతుల కోసం ఏర్పాటు చేసే దుకాణాల్లో దొరికే ప్రతి వస్తువుకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుందని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. వర్క్‌షాపులో రైతులకు ఏయే అంశాలకు శిక్షణ ఇవ్వాలన్నదానిపై ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. భూసార పరీక్షలు వర్క్‌షాపులోనే పెడుతున్నామని ఆయన తెలిపారు. నేచురల్ ఫార్మింగ్‌పై రైతులకు అవగాహన కల్పించి.. గ్రామ సచివాలయాల్లో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ల సేవలను బాగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేయదలచిన వర్క్‌షాపుల్లో వారి సేవలను వాడుకోవాలన్నారు. బయో ఫెస్టిసైడ్స్, బయో ఫెర్టిలైజర్స్ పేరిట జరుగుతున్న మోసాలను అరికట్టడానికి ఏపీ బయో ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ యాక్ట్ తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మార్కెట్ ఇంటెలిజెన్స్‌పై సమీక్ష నిర్వహించని ముఖ్యమంత్రి జగన్మోహన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. గోడౌన్ల నిర్మాణంపై మండలాలు, నియోజకవర్గాల వారిగా మ్యాపింగ్ చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రైతులు నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వేరుశెనగ, మొక్కొజొన్నల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. కనీస మద్దతు ధరలేని చిరుధాన్యాలను సాగుచేస్తున్న రైతులను ఆదుకోవడానికి.. సాగుకు అవుతున్న ఖర్చును పరిగణలోకి తీసుకుని ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వమే ధరలు ప్రకటింస్తుందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. చిరుధాన్యాల ధరల ప్రకటన త్వరలోనే చేయానున్నట్టు తెలిపారు. చీనీ రైతులకు మంచి ధర వచ్చేలా చూడటానికి అనుసరించాల్సిన మార్కెటింగ్ వ్యూహాలపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డుల్లో కనీస సదుపాయాలు ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మార్కెట్ యార్డులను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని తెలిపారు. పంటలకు వణ్యప్రాణుల నుంచి రక్షణ కల్పించడంపై సమగ్ర నివేదిక తయారుచేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కన్నబాబు, మోపిదేవి, బాలినేని పాల్గొన్నారు. -
ఆదోని మార్కెట్‌కు జాతీయ స్థాయి గుర్తింపు
సాక్షి, కర్నూలు: జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం(ఈ–నామ్) అమలులో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీకి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ప్రధానమంత్రి అవార్డు లభించే అవకాశం కూడా ఉంది. దేశంలోని 585 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఈ–నామ్ అమలు చేస్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ తత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు లావాదేవీలను వంద శాతం పారదర్శకంగా నిర్వహించడం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ఈ విధానం ముఖ్యోద్దేశం. ఈ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న మార్కెట్ కమిటీలకు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఒకటి కేంద్ర పాలిత ప్రాంతాలకు, మరొకటి ఈశాన్య రాష్ట్రాలకు, మిగిలినది ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఇస్తారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో ఆదోని వ్యవసాయ మార్కెట్ కమిటీ పోటీ పడుతోంది. ఇప్పటి వరకు నాలుగు దశల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా పైచేయి సాధించింది. ఆదోనితో పాటు మరో నాలుగైదు మార్కెట్లు మాత్రమే ఫైనల్ రేసులో నిలిచాయి. వీటి జాబితాను కేంద్ర వ్యవసాయ, రైతుల సహకార మంత్రిత్వ శాఖ ప్రధాని ముందు ఉంచింది. ఆయన నిర్ణయం రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. అన్నీ ఈ–నామ్ ద్వారానే.. ఆదోని మార్కెట్‌యార్డులో ప్రస్తుతం లావాదేవీలన్నీ ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాతీయ స్థాయి వ్యాపారులు పోటీలోకి రాకపోయినా.. ఉన్న వ్యాపారుల్లోనే పోటీ ఏర్పడుతుండటం వల్ల అన్ని రకాల ఉత్పత్తులకు మంచి ధరలే లభిస్తున్నాయి. కర్నూలు, ఎమ్మిగనూరు మార్కెట్లతో పాటు వివిధ జిల్లాల్లోని మార్కెట్లతో పోల్చితే ఆదోనిలో రైతులకు ఎక్కువ ధరలే లభిస్తుండటం గమనార్హం. పైగా మార్కెట్‌యార్డు మొత్తానికి మార్కెటింగ్ శాఖ ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. వ్యాపారులు తమ స్మార్ట్ ఫోన్లో ఈ–నామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఎవరికి వారు లాట్ ఐటీ స్లిప్‌లను బట్టి ధరను కోట్ చేయవచ్చు. ఎవరు ఏ ధర కోట్ చేశారో మిగతా వారికి తెలిసే అవకాశం ఉండదు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులో 32 కంప్యూటర్లతో ఈ–బిడ్డింగ్ హాలు ఏర్పాటు చేశారు. ఈ–నామ్ వల్ల వ్యాపారుల మధ్య పోటీ నెలకొంటోంది. ప్రతి లాట్‌కు తొమ్మిది మందికి తక్కువ కాకుండా.. గరిష్టంగా 35 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయి వ్యాపారులు కూడా పోటీలో పాల్గొంటే రైతులకు మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆదోని మార్కెట్లో వేరుశనగ, పత్తి ఇతర పంటలకు ఎక్కువ ధరలు లభిస్తున్నాయి. అవార్డు వస్తుందనే నమ్మకముంది ఆదోని మార్కెట్లో వంద శాతం లావాదేవీలు ఈ–నామ్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తున్నాం. ఇందుకోసం ఎంతో కృషి చేశాం. దేశంలో 585 మార్కెట్లు ఉండగా.. జాతీయ అవార్డు కోసం 200 దాకా పోటీ పడ్డాయి. ఇందులో భాగంగా నేను ఢిల్లీకి కూడా వెళ్లి.. ఈ–నామ్ అమలుపై పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చా. ఇది మొదటి దశ. ఇందులో విజయవంతమయ్యాం. రెండో దశలో 19 మార్కెట్లు మాత్రమే మిగిలాయి. ఇందులో రాష్ట్రం నుంచి ఆదోని మాత్రమే ఉంది. ఇప్పటిదాకా నాలుగు దశలను విజయవంతంగా ఎదుర్కొన్నాం. 5వ దశలో ప్రధానమంత్రిదే నిర్ణయం. ఆదోని మార్కెట్‌కు అవార్డు వస్తుందనే నమ్మకముంది. – సత్యనారాయణచౌదరి, సహాయ సంచాలకుడు, మార్కెటింగ్ శాఖ -
రైతుకు సెస్ పోటు
ఒంగోలు సబర్బన్: వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులు పండించిన పంట ఉత్పత్తులపై మార్కెట్ సెస్ పేరిట రైతును నిలువు దోపిడీ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జిల్లాలో వరుసగా ఐదేళ్లు కరువు కరాళనృత్యం చేసినా కనీసం రైతులపై కనికరం కూడా చూపని ప్రభుత్వం మార్కెట్ ఫీజు పేరిట ముక్కు పిండి వసూలు చేసింది. అసలే వర్షాలు లేక, అంతంత మాత్రంగా పండిన పంటలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రోడ్డెక్కితే ఆ పంట ఉత్పత్తులపై మార్కెట్ ఫీజు కింద కిలోకు రూపాయి చొప్పున వసూలు చేసింది. ఈ విధంగా జిల్లాలోని 15 వ్యవసాయ మార్కెట్ కమిటీల నుంచి ఒక్క 2018–19 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ.19.71 కోట్లు వసూలు చేసింది. అయితే విధించిన లక్ష్యాన్ని చేరుకోకపోయినా ఇంత మొత్తంలో కరువు పీడిస్తున్న సమయంలో రైతులు కట్టడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే ఇంత మొత్తంలో రైతుల నుంచి వసూలు చేసిన వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతు సంక్షేమం విషయంలో ఏమాత్రం ఆలోచించలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఒక్క రైతు బంధు పథకం మాత్రమే అమలులో ఉంది. అయితే ఆ పథకంలో కూడా అత్యల్పంగా 214 మంది రైతులకు జిల్లా వ్యాప్తంగా పండించిన పంటలను మార్కెట్ కమిటీ గోడౌన్లలో కుదువ ఉంచుకొని రుణాలు ఇచ్చారు. కేవలం రూ.2.87 కోట్లు మాత్రమే ఇచ్చి రైతులకు ఏదో చేశామని చెప్పుకుంటూ వచ్చారు. వరి ధాన్యం కుదువ పెట్టుకొని 217 మంది రైతులకు, వరిగలు కుదువ పెట్టుకొని 24 మంది రైతులకు మాత్రమే రుణంగా అందించారు. అది కూడా పచ్చ చొక్కా నేతలకే ఈ రుణాలు కూడా అందాయన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఈ ఐదేళ్లలో రైతుల నుంచి మార్కెట్ ఫీజు రూపంలో వసూలు చేసింది అక్షరాలా రూ.107.96 కోట్లు. ఆర్ధిక సంవత్సరం వసూలు చేసిన ఫీజు 2014–15 రూ.27.42 కోట్లు 2015–16 రూ.21.07 కోట్లు 2016–17 రూ.21.00 కోట్లు 2017–18 రూ.18.76 కోట్లు 2018–19 రూ.19.71 కోట్లు ఉచిత వైద్యశిబిరాలు కనుమరుగు: గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో రైతులకు, పశువులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి రైతుల ఆరోగ్యంతో పాటు పశువుల ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహించేవారు. అదేవిధంగా ఉచితంగా మందులు కూడా అందించేవారు. అలాంటిది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అసలు ఆ ఊసే మరిచిపోయారు. మార్కెట్ ఫీజు పేరిట వసూలు చేయటం మినహా ఎలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేదు. ఇకపోతే వ్యవసాయ మార్కెట్ పాలక కమిటీలను ఏర్పాటు చేసుకొని పదవులు మాత్రం అలంకరించారు. పాలక మండళ్లతో కమిటీలకు అదనపు భారం తప్ప ప్రయోజనం శూన్యంగా మారింది. పాలక మండలి కమిటీలు అలంకార ప్రాయంగానే మిగిలాయి. ఈ ఏడాది వసూలు చేసిన మార్కెట్ ఫీజు మార్కెట్ కమిటీలు వసూలు చేసిన ఫీజు ఒంగోలు రూ.1.62 కోట్లు కందుకూరు రూ.1.42 కోట్లు మార్టూరు రూ.1.32 కోట్లు పర్చూరు రూ.2.30 కోట్లు దర్శి రూ.1.01 కోట్లు అద్దంకి రూ.1.76 కోట్లు చీరాల రూ.2.00 కోట్లు కొండపి రూ.3.24 కోట్లు మద్దిపాడు రూ.1.42 కోట్లు మార్కాపురం రూ.0.68 కోట్లు గిద్దలూరు రూ.0.76 కోట్లు పొదిలి రూ.0.21 కోట్లు ఎర్రగొండపాలెం రూ.0.98 కోట్లు కంభం రూ.0.54 కోట్లు -
ఇదేం చిత్రం సారూ..!
ఇల్లందకుంట (హుజూరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ పథకం పనులు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇష్టారాజ్యంగా మారాయి. ఇప్పటి వరకు పట్టణంలో పనులు 60 శాతం కంటే ఎక్కువగా పూర్తి కాలేదు. దీనికి తోడు ఉన్న నిధులు పూర్తికావడంతో సదరు కాంట్రాక్టర్ పనులు చేయకుండా వదిలివేశారు. ఇదిలా ఉండగా పాత వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఆరు నెలల క్రితం పైపులు వేశారు. శనివారం వేరేచోట పైపులు తక్కువగా ఉన్నాయని ప్రొక్లెయిన్‌తో తీసివేశారు. దాదాపు 300 మీటర్లకుపైగా ఉన్న 30 పైపులను తీసివేశారు. ఆ మార్గంలో ఉన్న కాలనీవాసులు గతంలో వేసుకున్న మంచినీటి పైపులు, డ్రైనేజీ పైపులు ధ్వంసం కావడంతో అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
పత్తి.. పండలే..
ఖమ్మం వ్యవసాయం: పత్తి దిగుబడి జిల్లాలో గణనీయంగా తగ్గిపోయింది. సాగు విస్తీర్ణం ఎక్కువగానే ఉన్నా.. పంట ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. జిల్లావ్యాప్తంగా ఉన్న పంట భూమిలో దాదాపు 40 శాతం పత్తి పంట సాగు చేశారు. వర్షాధారంగా, నీటిపారుదల కింద పండే పంట కావడంతో ఇక్కడి రైతులు పత్తి పంటకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 2017–18లో 5,81,767.5 ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం కాగా.. 5,31,822.5 ఎకరాల్లో వివిధ రకాల పంటలను ఖరీఫ్‌లో సాగు చేశారు. మొత్తం విస్తీర్ణంలో అధికంగా 2,41,752.5 ఎకరాల్లో రైతులు పత్తి పంట వేశారు. ప్రతి ఏటా దాదాపు ఇంతే విస్తీర్ణంలో పత్తి సాగు చేస్తున్నారు. సాగు ఆరంభంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా.. పూత, కాత దశలో వాతావరణ ప్రభావంతో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. జూన్‌లో కురిసిన వర్షాలకు పంట విస్తారంగా సాగు చేశారు. జూలైలో వర్షం అనుకూలించలేదు. దీంతో పైరు ఆశాజనకంగా లేకుండా పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పైరుకు గులాబీ రంగు పురుగు ఆశించింది. ఇక ఆగస్టులో సాధారణానికి మించి కురిసిన వర్షాలు పంటను బాగా దెబ్బతీశాయి. వర్షాలకు పూత రాలిపోగా.. కాయ విచ్చుకునే దశలో నీరు లోనకు చేరి పనికి రాకుండా పోయింది. అరకొరగా చేతికొచ్చిన పంట కూడా నాణ్యతగా లేని పరిస్థితి. సెప్టెంబర్ చివరి నుంచి పంట తొలితీతను రైతులు ప్రారంభించారు. అక్టోబర్‌లో తొలితీత తీసిన తర్వాత రైతుల్లో పంటపై ఆశలు పూర్తిగా సన్నగిల్లాయి. సహజంగా పైరు నుంచి రెండు, మూడో తీతలు ఆశాజనకంగా ఉంటాయి. కానీ.. ఆగస్టు వర్షాలతో అందుకు భిన్నమైన పరిస్థితులు ఎదురయ్యాయి. దిగుబడులు లేకపోవడంతో విక్రయాలు లేక జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో గల యార్డులు వెలవెలబోతున్నాయి. పత్తి పంటకు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకోవడంతో రైతులు ఆ పంటను తొలగించి.. దాని స్థానంలో మొక్కజొన్న వేశారు. జిల్లాలో పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు. సాగు విస్తీర్ణం గణం.. దిగుబడి దారుణం జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణం గణనీయంగా ఉన్నా.. పంట దిగుబడి మాత్రం దారుణంగా పడిపోయింది. దాదాపు 2.41 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. నీటిపారుదల కింద ఎకరాకు 15 క్వింటాళ్లు, వర్షాధారంగా 10 క్వింటాళ్ల మేర దిగుబడులు వస్తాయి. ఈ లెక్కన జిల్లాలో సుమారు 25 లక్షల క్వింటాళ్ల మేర ఉత్పత్తి రావాల్సి ఉండగా.. కేవలం 5.5 లక్షల క్వింటాళ్ల ఉత్పత్తి మాత్రమే వచ్చింది. అంటే దాదాపు ఐదోవంతు పంట మాత్రమే పండింది. ఇంత దారుణమైన దిగుబడి ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదని రైతులు పేర్కొంటున్నారు. ఎకరాకు 2.50 క్వింటాళ్లకు మించలే.. ఈ ఏడాది ప్రతికూల పరిస్థితుల కారణంగా పత్తి ఎకరాకు సగటున 2.50 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాలేదు. తొలితీత ఎకరాకు క్వింటా, రెండో తీతలో క్వింటాన్నరకు మించి దిగుబడి రాలేదు. నీటిపారుదల, వర్షాధారంగా కూడా ఇవే రకమైన దిగుబడులు వచ్చాయి. ముంచిన తెగుళ్లు, వర్షాలు ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గేందుకు ప్రధాన కారణం వర్షాలు. దీనికి తోడు తెగుళ్లు. ఆగస్టులో కురిసిన అధిక వర్షాల ప్రభావం పంట దిగుబడులపై తీవ్రంగా ఉంది. ఆగస్టు రెండు, మూడు వారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దీంతో గాలి, నేలలో తేమశాతం విపరీతంగా పెరిగి పైరుకు ప్రతికూలంగా మారి.. పైరు పండుబారిపోయింది. తెగుళ్లు కూడా ఆశించాయి. ప్రధానంగా గులాబీ రంగు పురుగు ఆశించి నష్టం కలిగించింది. పల్లపు ప్రాంతంలో వేసిన పంట కనీసం పనికి రాలేదు. ఆ తర్వాత అరకొరగా ఉన్న పంటపై డిసెంబర్లో ‘పెథాయ్’ తుపాను మరోసారి నష్టం కలిగించింది. ఇక అరకొరగా పండిన పంట కూడా వర్షాల వల్ల రంగుమారి నాణ్యత లేకుండా పోయింది. వెలవెలబోయిన మార్కెట్లు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు విక్రయానికి వచ్చే పత్తి పంట దిగుబడులు లేకపోవడంతో ఆయా మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఖమ్మం, ఏన్కూరు, నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్లలో పత్తి కొనుగోళ్లు జరుగుతుంటాయి. సీజన్లో ఖమ్మం మార్కెట్లో నిత్యం సగటున 25వేల బస్తాలు విక్రయానికి వస్తుంటాయి. ఈ ఏడాది 5వేల నుంచి 6వేలకు మించి పత్తి బస్తాలు విక్రయానికి రాలేదు. దీంతో వ్యవసాయ మార్కెట్లు కళ తప్పాయి. అంతేకాక మార్కెట్లకు వచ్చే ఆదాయం కూడా తగ్గుతోంది. వ్యాపారులు కూడా పంట విక్రయాలకు రాకపోవడంతో నిరుత్సాహంగా ఉన్నారు. పత్తి స్థానంలో మొక్కజొన్న ఖరీఫ్‌లో సాగు చేసిన పత్తిని రైతులు తొలగించి.. నీటి వనరులున్న ప్రాంతాల్లో మొక్కజొన్న సాగు చేశారు. కొందరు రైతులు పత్తి పంటను వదిలేశారు. పత్తి స్థానంలో వేసిన మొక్కజొన్న పంట కూడా ఆశాజనకంగా లేదు. ఈ పంటకు కత్తెర పురుగు ఆశించింది. దీంతో ఈ పంట కూడా రైతులకు నిరాశ కలిగిస్తోంది. నాలుగెకరాల్లో 8 క్వింటాళ్లు.. నాలుగెకరాల్లో పత్తి పంట సాగు చేశా. తొలితీతలో ఎకరానికి క్వింటా చొప్పున 4 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రెండో తీతలో 4 క్వింటాళ్లు వచ్చింది. మొత్తం 8 క్వింటాళ్లు వచ్చింది. గత ఏడాది ఎకరాకు 7 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. – బొల్లి కృష్ణయ్య, రైతు, విశ్వనాథపల్లి, సింగరేణి మండలం ఆశించిన దిగుబడి రాలేదు.. ఈ ఏడాది పత్తి కనీస ఉత్పత్తి లేదు. వ్యవసాయ మార్కెట్లకు కనీసంగా కూడా పంట విక్రయానికి రావడం లేదు. నిత్యం సీజన్లో 30వేల నుంచి 40వేల బస్తాల పత్తి విక్రయానికి వచ్చేది. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కేవలం 10వేల నుంచి 15వేల బస్తాల పత్తి కూడా విక్రయానికి రావడం లేదు. మార్కెటింగ్ శాఖ ఆదాయంపై కూడా ప్రభావం పడింది. – రత్నం సంతోష్‌కుమార్, జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి -
అక్టోబర్ 1 నాటికే సిద్ధం చేయండి: హరీశ్
సాక్షి, హైదరాబాద్: పత్తి వ్యాపారం జరిగే 41 మార్కెట్ యార్డులను గతేడాదిలానే కొనుగోలు కేంద్రాలుగా వినియోగించాలని, అక్టోబర్ 1 నాటికి వాటిని సిద్ధంగా ఉంచాలని అధికారులను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. పత్తి కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని చెప్పా రు. పత్తి మద్దతు ధరను కేంద్రం రూ.5,450గా ప్రకటించిన దృష్ట్యా బుధవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గతేడాదిలానే జిల్లా కలెక్టర్లు ప్రకటిం చిన అన్ని కాటన్ జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేయాలన్నారు. మద్దతు ధర రూ.5,450గా నిర్ణయించినందున రైతులు ఎక్కువ శాతం భారత పత్తి సంస్థ (సీసీఐ)కు అమ్మడానికి ఇష్టపడతారని చెప్పారు. జిన్నింగ్ మిల్లులు, సీసీఐ లీజు విషయంలో ప్రతిష్టంభన రైతు ప్రయోజనాలకు ఇబ్బందిగా ఉంటుందని, కాబట్టి మిల్లుల అభ్యర్థనను లోతుగా పరిశీలించాలని కోరారు. జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో ముంబైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు. మార్కెటింగ్ శాఖ తరçఫున ఎంఎస్పీ ఆపరేషన్‌కు అవసరమైన సాఫ్ట్వేర్ పరికరాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, సీసీఐ చైర్మన్ అల్లిరాణి పాల్గొన్నారు. -
వ్యాపారులపై క్రిమినల్ కేసులు
ఖమ్మంవ్యవసాయం : ఎటువంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్న ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా, ‘కమీషన్ వ్యాపారులు’గా, ‘ఖరీదుదారులు’గా చలామణవుతూ రైతులను నిలువునా దోచుకుంటున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఫిర్యాదుతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీరంతా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో కొంతకాలం నుంచి అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు. మార్కెట్‌కు వచ్చిన రైతులకు మాయమాటలు చెప్పి, అధిక ధర పెట్టిస్తామంటూ బోల్తా కొట్టిస్తున్నారు. వారి పంటను కమీషన్ వ్యాపారుల ద్వారా ఖరీదుదారులకు చూపిస్తున్నారు. అడ్డగోలుగా కమీషన్లు దండుకుంటున్నారు. పంట విక్రయంలో వాస్తవానికి కమీషన్ వ్యాపారి మాత్రమే కమీషన్ తీసుకోవాలి. వీరు మాత్రం కమీషన్ వ్యాపారుల నుంచి, కొన్నిసార్లు ఖరీదుదారుల నుంచి కూడా (కమీషన్) దండుకుంటున్నారు. సాధారణంగా కమీషన్ రూపాయిన్నర నుంచి రెండ్రూపాయల వరకు ఉంది. వీరు మాత్రం రైతుల నుంచి ఐదారు రూపాయల కమీషన్ గుంజుతున్నారు. పంటను చూసినప్పుడు ఓ ధర నిర్ణయిస్తారు. కాంటాల సమయంలో తిరకాసు పెడతారు. సరుకు బాగా లేదంటారు. తేమ శాతం ఎక్కువగా ఉందంటారు. తక్కువ ధరకు అమ్మేందుకు రైతులు ఒప్పుకోకపోతే.. తమకు అసలు ఆ సరుకు అవసరమే లేదంటూ మధ్యలోనే వెళ్లిపోయేవారు. మరో వ్యాపారి అటువైపు రాకుండా, ఆ సురుకును చూడకుండా ప్రయత్నించేవారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ రైతులు... గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు అడిగిన రేటు/కమీషన్ ఇచ్చేవారు. రైతుల అనైకక్యత, వ్యాపారుల ఐక్యత/సిండికేట్ కారణంగా అధికారులు కూడా ఇన్నాళ్లూ ఏమీ చేయలేకపోయారు. గత ఏడాది ఈ మార్కెట్‌కు పర్సన్ ఇన్చార్జిగా అప్పటి జాయింట్ కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి (ప్రస్తుతం, జనగాం కలెక్టర్) బాధ్యతలు చేపట్టారు. కొద్ది రోజులకే ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఈ–నామ్ అమలయింది. తమ అక్రమాలకు ఇది అడ్డుగా ఉండడంతో కొందరు వ్యాపారులు వ్యతిరేకించారు. ఆ తరువాత, ఇందులోని లొసుగులను పట్టేసుకున్నారు. వాటి ద్వారా తమ అక్రమాలను కొనసాగించారు. మార్కెట్ ఫీజు చెల్లించని వ్యాపారులపై మార్కెటింగ్ శాఖ అధికారులు దృష్టి సారించారు. వినయ్‌కృష్ణారెడ్డి బదిలీతో పర్సన్ ఇన్చార్జిగా కలెక్టర్ డీఎస్ లోకేష్‌కుమార్ నియమితులయ్యారు. మార్కెట్లో అక్రమాలపై, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టింది. మార్కెట్‌కు దాదాపుగా 15లక్షల రూపాయల ఫీజు చెల్లించని ఇద్దరు వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అప్పటికీ ఫలితం లేకపోవడంతో అధికారులు మరో అడుగు ముందుకేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా వ్యాపారాలు సాగిస్తున్న వారిని గుర్తించే పనిలోకి దిగారు. ఈ క్రమంలోనే, లైసెన్సులకు సంబంధించి ఎటువంటి తాడు–బొంగరం లేని ఏడుగురు ‘వ్యాపారులు/ఖరీదుదారులు’ను గుర్తించారు. మార్కెట్ పర్సన్ ఇన్చార్జ్ (కలెక్టర్) లోకేష్‌కుమార్ ఆదేశాలతో ఆ ఏడుగురిపై ఖమ్మం మూడవ అదనపు మొదటి తరగతి జ్యూడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని గురువారం మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రత్నం సంతోష్‌కుమార్ తెలిపారు. వీరికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశముందని చెప్పారు. మార్కెట్లో రైతులను మోసగించే, పంట దొంగలపై నిఘా పెంచినట్టు చెప్పారు. -
వ్యవసాయ మార్కెట్లలో ఈ–సేవలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్లలో ఇక నుంచి ఆన్లైన్ ద్వారా ఈ–సేవలను అందించేందుకు మార్కెటింగ్‌శాఖ నడుం బిగించింది. మార్కెట్లలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం, వేగం పెంచేందుకు ఈ చర్య చేపడుతున్నట్లు మార్కెటింగ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఈ–సేవలకు సంబంధించి మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందికి హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చా రు. వ్యాపారులకు కూడా శిక్షణ ఇస్తున్నారు. యాప్ ద్వారానే లైసెన్స్... వ్యాపారులకు లైసెన్స్‌లు, ఎగుమతుల పర్మిట్ల జారీ కోసం మార్కెటింగ్ శాఖ ప్రత్యేకంగా ‘ఈ–సర్వీసెస్’ పేరుతో మొబైల్ యాప్‌ను రూపొందిస్తోంది. ఈ యాప్ ద్వారా రూ. 100 చెల్లిస్తే లైసెన్సు దరఖాస్తు తెరుచుకుంటుంది. దరఖాస్తును నింపి తిరిగి అప్లోడ్ చేసిన తర్వాత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఈ దరఖాస్తు సంబంధిత మార్కెట్ కమిటీ కార్యదర్శి వద్దకు వెళుతుంది. ఆయన పరిశీలించిన తర్వాత రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ డైరెక్టర్‌కు పంపుతారు. డైరెక్టర్ ఆమోదంతో మార్కెట్ కార్యదర్శి డిజిటల్ సంతకంతో కూడిన లైసెన్స్ సర్టిఫికేట్‌ను మంజూరు చేస్తారు. ఇలా ఆన్లైన్లోనే దరఖాస్తు ఆమోదం పొందటంతో సమయం, వ్యయం తగ్గుతుంది. అన్నీ ఆన్లైన్లోనే... కేవలం లైసెన్సులే కాకుండా కమీషన్ ఏజెంట్ లైసెన్సులు, మార్కెట్ ఫీజు వసూళ్లు, ఎగుమతుల పర్మిట్లు, రాస్తామాల్ వసూళ్లన్నీ ఆన్లైన్లోనే నమోదు చేసే వీలుంటుంది. వ్యాపారి ఖరీదులు ఎంతుంటాయో అంత సరుకుకే ఆన్లైన్ ద్వారా ఎగుమతుల పర్మిట్ లభిస్తుంది. ఈ సేవలు అమలైతే చెక్‌పోస్టుల వద్ద నగదు వసూళ్లన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. అలాగే క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎగుమతుల పర్మిట్లు, చెక్‌పోస్టు చెల్లింపుల రశీదులను జారీ చేస్తారు. దీని వల్ల నకిలీ రశీదులను సృష్టించే అవకాశమే ఉండదు. మార్కెట్లో నిత్యం జరిగే వ్యాపార లావాదేవీలన్నింటికీ తక్‌పట్టీల ద్వారా ఈ–సేవల్లో ఎప్పటికప్పుడు మార్కెట్ ఫీజు లెక్కిస్తారు. ప్రస్తుతం జారీ చేసే లైసెన్సులతో రాష్ట్రంలో ఏ మార్కెట్లోనైనా ఖరీదులు చేసే వీలుంది. ఏ మార్కెట్లో ఖరీదు చేసినా ఆన్లైన్లో ఎక్కడ ఫీజు చెల్లించినా సదరు వ్యాపారి పేరిట మార్కెట్ ఫీజు ఆయా మార్కెట్ కమిటీలకే వెళుతుంది. మార్కెట్లలో ఈ–సేవలు ప్రారంభమైతే పారదర్శకత పెరుగుతుందని మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి ‘సాక్షి’కి తెలిపారు. -
ఇక పంటల వారీ మార్కెట్ యార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డ్ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను 9 ఎకరాల్లో మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్‌శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్ ప్లా్లట్ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను నెలకొల్పారు. జగిత్యాలలో మామిడి మార్కెట్‌కు ఏర్పాట్లు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
చిరుద్యోగులపై వేటు
పులివెందుల : తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చేమాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను పెరికేసి వారి కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారు. పులివెందుల మార్కెట్ మార్డులో పదేళ్ల నుంచి పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్‌ను ఉన్న పళంగా తొలగించారు. వీరందరూ గత పదేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ జీతాలు పొందుతూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ బంధువులను, అనుచరులను నియమించుకునేందుకు మార్కెట్ యార్డు చైర్మన్ పావులు కదిపారు. అందులో భాగంగా సెక్యూరిటీ గార్డులు రైతులతో కుమ్మక్కై మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారని.. అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీకి సక్రమంగా హాజరు కావడంలేదని సాకు చూపి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి 5మందిని తొలగించమని చైర్మన్ లేఖ రాశారు. మరుసటి రోజే వారి స్థానంలో తమ బంధువుల పేర్లు, అనుచరుల పేర్లు పెట్టి వారి స్థానంలో వీరిని నియమించాలని మరో లేఖ ఏజెన్సీకి రాసి వారి స్థానంలో తమ అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించాడు. ఇంతకాలం పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు. కోర్టును ఆశ్రయించిన బాధితులు తాము ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, కేవలం చైర్మన్ తన అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు చేయని తప్పులను సాకుగా చూపి తమను తొలగించారని కంప్యూటర్ ఆపరేటర్ పవన్‌కుమార్, సెక్యూరిటీ గార్డులు మహేశ్వరరెడ్డి, మహబూబ్ బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆవేదనను విన్న కోర్టు వెంటనే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని కొనసాగించాలని అగ్రికల్చర్లో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు, పులివెందుల మార్కెట్ కమిటీ సెక్రటరీకి, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చారు. కోర్టు ఆదేశాలు బేఖాతర్.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మార్కెట్ కమిటీ చైర్మన్ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు. బాధితులు కోర్టు ఆర్డర్‌ను తీసుకుని మార్కెట్ కమిటీ సెక్రటరీని కలవగా.. నా చేతుల్లో ఏమీ లేదన్నారు. మీరు ఏదైనా ఉంటే చైర్మన్‌తో చూసుకోండని సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను బాధితులు కలవగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హుకుం జారీ చేశారని బాధితులు వాపోతున్నారు. మాజీ ఎంపీని కలిసిన బాధితులు :తమను అన్యాయంగా తొలగించడంపై బాధితులు గురువారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఉన్న ఫళంగా ఐదుగురిని తొలగించడం అన్యాయమన్నారు. వీరిని తొలగించడంతో వారి కుటుంబాల పోషణ కష్టతరమైందన్నారు. తన అనుచరులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు వీరి కుటుంబాలకు అన్యాయం చేయడం తగదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా ఇచ్చారు. సిబ్బంది తొలగింపుతో మాకు సంబంధంలేదు: మార్కెట్ కమిటీ సెక్రటరీ మార్కెట్ యార్డులో సిబ్బంది తొలగింపు విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నంరాజును వివరణ కోరగా వారి ఉద్యోగాల విషయంలో తమకు సంబంధం ఉండదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం పొందడంతో వారి వద్దే ఏదైనా ఉంటే చూసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తమ శాఖ తరపున హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. -
ధర తగ్గించడంపై భగ్గుమన్న రైతు
కేసముద్రం: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో పసుపు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ఎదుట పసుపును పోసి నిప్పంటించారు. మార్కెట్లో ఈ–నామ్ అమలవుతుండగా పుసుపునకు ఆన్లైన్లో టెండర్ల తర్వాత అధికారులు రైతులకు ధర తెలియజేయలేదు. ఆన్లైన్ టెండర్ వేసిన వ్యాపారుల్లో కొందరు కాంటాలు పెట్టుకోవడానికి వెళ్లలేదు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపుకాశారు. ఆ తర్వాత ఓ వ్యాపారి పసుపురాశుల వద్దకు వెళ్లి క్వింటాల్‌కు రూ.5 వేలు ధర పెడతానంటూ కొంతమంది రైతుల లాట్ నంబర్ చీటీలపై రాశాడు. ఆన్లైన్లో రూ.6 వేలు ధర పడగా రూ.వెయ్యి తగ్గించడంతో ఆగ్రహించారు. దీంతో వారు కొంత పసుపును మార్కెట్ ఎదుట పోసి నిప్పంటించి కాలబెట్టారు. -
మధుర ఫలంపై విష పంజా
నక్కపల్లి(పాయకరావుపేట): మధుర ఫలం మామిడిని ప్రాణాంతక రసాయనాలతో మగ్గించి విక్రయిస్తున్న నాలుగు యార్డులపై విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచే విజిలెన్స్ ఎస్పీ డి.కోటేశ్వరరావు ఆదేశాల మేరకు డీఎస్పీ సీఎం నాయడు, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న వేంపాడు, చినదొడ్డిగల్లు ప్రాంతాల్లో ఉన్న నాలుగు మామిడి యార్డుల్లో మెరుపు దాడులు నిర్వహించారు. శాంపిళ్లు సేకరించిన అధికారులు చినదొడ్డిగల్లు సమీపంలో దుర్గా మ్యాంగో సప్లయిర్స్, వీజీఆర్ ఫ్రూట్స్, వీఈఆర్ అండ్ కో, వెంకట దుర్గా ఫ్రూట్స్ నిర్వాహకులు ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేస్తున్న విషయం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జిల్లా కంట్రోలర్ తదితర అధికారులు కూడా మామిడి యార్డుల వద్దకు చేరుకున్నారు. స్ప్రే చేసిన మామిడి కాయల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం పంపిస్తున్నట్లు చెప్పారు. నివేదికలు వచ్చిన తర్వాత దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు హరించే ప్రమాదకర రసాయనాలు వినియోగించడం నేరమని ఎస్పీ కోటేశ్వరరావు తెలిపారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సుమారు రూ.8 లక్షల విలువ చేసే 25 టన్నుల మామిడి కాయలు స్వాధీనం చేసుకున్నామని... వీటిని విక్రయించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. యార్డుల్లో స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉంచిన రసాయనాల డబ్బాలు, స్రేయర్లను కూడా పరిశీలించారు. 24 గంటల్లోనేమగ్గించేసి... ఏటా మార్చి నుంచి జూన్ నెల చివరి వరకు మామిడి కాయల సీజన్ కావడంతో ఎంత ధర చెల్లించైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు వెనుకాడరు. ఆ బలహీనతనే అవకాశంగా తీసుకున్న వ్యాపారులు కాయలు మగ్గించేందకు నిషేధిత విషపూరిత రసాయనాలు వాడుతున్నారు. పక్వానికి రాకుండానే కోసేసి వాటిపై ప్రాణాంతకమైన ఎపికాన్, పోపాన్ వంటి రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. ఇలా నిబందనలకు విరుద్దంగా రసాయానాలను స్ప్రేచేసి మామిడి పండ్లను మగ్గిస్తున్న విషయం తెలుసుకున్న విజిలెన్స్ అ«ధికారులు దాడులు నిర్వహించారు. ఈ స్ప్రే చేసిన మామిడి కాయలను 24 గంటల్లోగా ప్యాకింగ్ చేసి ఎగుమతి చేయకపోతే పాడవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. వాస్తవానికి పక్వానికి వచ్చిన మామిడి కాయలను కోసి ఎండుగడ్డిలో వారం రోజులపాటు కావు వేస్తే అవి మగ్గుతాయి. ఇలా కృత్రిమంగా మగ్గించిన బంగినపల్లి టన్ను రూ.35 నుంచి రూ.37 వేలకు, సువర్ణరేఖ టన్ను రూ.33 వేలకు విక్రయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న దాదాపు 15 యార్డుల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే పది వేల టన్నుల మామిడి పండ్లు ఇతర రాస్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఇవన్నీ ప్రాణాంతకమైన రసాయనాలు స్ప్రే చేసి మగ్గించినవే కావడం విశేషం. రోజూ వంద టన్నులకుపైనే ఎగుమతి నక్కపల్లి మండంలలో వేంపాడు టోల్గేట్ పరిసరాల్లో సుమారు 15 మామిడి యార్డులు (కమీషన్ దుకాణాలు)ఉన్నాయి. ఇక్కడి వ్యాపారులు పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి పశ్చిమబెంగాల్, బీహార్, కలకత్తా, హైదరాబాద్, భువనేశ్వర్, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కటక్, ముంబయి తదిర పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. రోజూ సుమారు 100 టన్నులకు పైగా వివిధ రకాల మామిడి పండ్లు ఇక్కడి నుంచి ఎగుమతి చేస్తుంటారు. -
మార్క్ ఫెడ్ అధికారుల తీరుపై శిల్పాచక్రపాణి ఆగ్రహం
-
నాకు చావే గతి
కేసముద్రం (మహబూబాబాద్): మార్కెట్లో 10 రోజులుగా పడిగాపులు పడుతున్న ఓ మక్క రైతు ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బానోతు రాజ్యానాయక్ తను పండించిన 170 బస్తాల మక్కలను మార్కెట్‌కు తీసుకొచ్చాడు. 10 రోజులు గడుస్తున్నా మక్కలను కొనుగోలు చేయకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. శనివారం బలరాం నాయక్, జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బృందం మార్కెట్‌ను సందర్శించింది. యార్డులో రాశులను పరిశీలిస్తూ రైతు రాజ్యానాయక్ వద్దకు రాగా, అతడు ఒక్కసారిగా ఆవేదనకు లోనయ్యాడు. తనకు చావే గతి అంటూ కండువాను మెడకు బిగించుకోవడంతో ఊపిరాడక ఒక్కసారిగా స్పృహతప్పి మక్కలరాశిపైనే పడిపోయాడు. కంగుతిన్న కాంగ్రెస్ నేతలు, సిబ్బంది అతడి మెడకున్న కండువాను తొలగించి.. నీళ్లు చల్లి లేపారు. ఆ తర్వాత సీఈవో మల్లారెడ్డిని పిలిపించి ప్రశ్నించడంతో, ఆ మక్కలను ఎంపిక చేసి చిట్టీ ఇచ్చాడు. -
రాష్ట్రంలో ప్రచండ గాలుల బీభత్సం
సాక్షి నెట్వర్క్: పట్టపగలే కారుమబ్బులు.. వందల ఏళ్లనాటి వృక్షాలను కూకటివేళ్లతో కూల్చేసే ప్రచండ గాలులు.. ఉరుము లేని పిడుగులా కాలం కాని కాలంలో కుండపోత! గురువారం ఒక్కసారిగా కురిసిన అకాల వర్షం రాష్ట్రాన్ని ఆగమాగం చేసింది. అనేక జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలైంది. చాలాచోట్ల మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. మామిడి నేలరాలింది. గుడిసెలు, రేకుల ఇళ్లు, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి. వర్షం, పిడుగుల ధాటికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో ఇద్దరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. వరంగల్ అతలాకుతలం వర్షానికి వరంగల్ అతలాకుతలమైంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలుమార్లు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. 163 జాతీయ రహదారిపై చెట్లు కూలిపోవడంతో సుమారు గంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్లో కరెంటు వైర్లపై గాలికి కొట్టుకువచ్చిన రేకులు, ఫ్లెక్సీలు పడ్డాయి. దీంతో నిప్పులు చెలరేగాయి. చెట్టు కూలి పడడంతో స్టేషన్లో సిగ్నలింగ్ గది కూలిపోయింది. దీంతో గంటన్నర పాటు రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. వరంగల్, హన్మకొండ, కాజీపేట పరిధిలో సుమారు ఐదు వందల ఇళ్లు ధ్వంసమయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో టూరిస్టు బస్సుపై పిడుగు పడటంతో బస్సు అద్దాలు పగిలాయి. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలో రెండో షిప్టులో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రైతుల కష్టం వర్షార్పణం అకాల వర్షం రైతులను నిండా ముంచింది. పండించిన పంటను రైతులు వ్యవసాయ మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, జీసీసీ కేంద్రాలకు తెచ్చారు. కొనుగోలు ప్రక్రియ ఆశించినంత వేగంగా లేకపోవడంతో అన్నిచోట్ల ఆరు బయటే ధాన్యం ఆరబోశారు. చాలినన్ని టార్ఫాలిన్ కవర్లు లేవు. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం అంతా తడిసింది. చాలాచోట్ల వరదలో కొట్టుకుపోయింది. ఏనుమాముల మార్కెట్లో భారీ షెడ్డు కూలిపోవడంతో ఆరబోసిన మక్కలు తడిశాయి. పైకప్పు కూలే సమయంలో రైతులు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది. ఒక్క ఈ మార్కెట్లోనే పది వేల మిర్చి బస్తాలు తడిశాయి. పరకాల వ్యవసాయ మార్కెట్లో మక్కలు, వడ్లు కలిపి సుమారు రూ.కోటి వరకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మంచాల, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కేశంపేట, మాడ్గుల, షాబాద్ తదితర మండలాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. వికారాబాద్ జిల్లా పరిగి, కుల్కచర్ల, మోమిన్‌పేట, దౌల్తాబాద్, బొంరాస్‌పేట మండలాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. జగిత్యాల జిల్లావ్యాప్తంగా 3,500 హెక్టార్లలో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్లో ఆరపోసిన 10 వేల క్వింటాళ్ల మొక్కజొన్న తడిసిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండల మార్కెట్ యార్డులో ఎనిమిది వేల బస్తాల వరి ధాన్యం తడిసింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు తెచ్చిన ధాన్యం తడిసింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు, బెల్లంపల్లిలో మామిడి రైతులు నష్టపోయారు. నల్లగొండ మార్కెట్లో కాంటా వేసిన ధాన్యం తడిసిపోయింది. జనగామ జిల్లా వ్యాప్తంగా 55,000 వరి ధాన్యం బస్తాలు తడిశాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో గాలివాన ధాటికి కూలిన షెడ్ -
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితిని వాట్సాప్ ద్వారా సమీక్షించారు. తడిసిన ధాన్యంపై పలు సూచనలు చేస్తూ జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, వేర్‌హౌసింగ్ అధికారులను అప్రమత్తం చేశారు. జాయింట్ కలెక్టర్లు వెంటనే మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాలను సందర్శించి పరిస్థితులను సమీక్షిస్తూ చర్యలు తీసుకోవాలని చెప్పారు. టార్పాలిన్లను వెంటనే సమకూర్చాలని, తడవని ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. గాలి దుమారం, భారీ వర్షానికి పాడైన గోదాంలకు వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. -
వందల క్వింటాళ్లు వర్షార్పణం
బూర్గంపాడు/ఖమ్మం వ్యవసాయం/ కొత్తగూడ/సంగెం: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మంగళవారం గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వందల క్వింటాళ్ల ధాన్యం వర్షార్పణమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన ధాన్యం రాశులు అకాల వర్షానికి తడిశాయి. 100 లారీ ల ధాన్యాన్ని రైతులు విక్రయించేందుకు తేగా.. వర్షం కురిసే సమయంలో రైతులు కొంతమేర పట్టాలు కప్పి కాపాడుకున్నారు. మిగతా 60 లారీల లోడ్లకు సరిపోయే ఆరబోసిన ధాన్యం నీటి పాలైంది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు పడిన కష్టం ఫలితాన్ని ఇవ్వలేదు. నిమిషాల వ్యవధిలో వాన నీటిలో ధాన్యం కొట్టుకుపోతుంటే.. రైతులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు 20 బస్తాల ధాన్యం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిందని, వందల క్వింటాళ్ల ధాన్యం పనికిరాకుండా పోయిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, కొత్తగూడ, కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, సంగెం మండలాల్లో వర్షం కురిసింది. రైతులు అమ్మడానికి తీసుకొచ్చిన మక్కలు, పసుపు మార్కెట్లలో తడిసిపోయాయి. -
ఇదేం బంగారు తెలంగాణ ?
సత్తుపల్లి: ‘రైతే రాజు అంటారు.. రైతు లేనిదే ప్రభుత్వం లేదంటారు.. రైతు పంటలను కొనకుండా ఇబ్బంది పెడుతున్నారు.. ఇదెక్కడి బంగారు తెలంగాణ’ అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. స్థానిక మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఇతర మంత్రులు రాజుల కాలం తరహాలో మారువేషాలతో తిరిగితే రైతుల బాధలు ఏంటో తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కోట్లు ఖర్చు పెట్టి గోదాంలు నిర్మించింది రైతుల కోసం కాదా..? రైతుల పంటలను ఆరుబయట నిల్వ చేసుకోవాల్సి వస్తోంది.. పంట దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని మార్కెట్ కార్యదర్శిని నిలదీశారు. మొక్కజొన్న అమ్మిన తర్వాత కూడా బస్తాలకు కాపలా రైతులే ఉండాలని చెప్పడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుల తరబడి కాంటా వేయకపోతే రైతులు పడిగాపులు పడాల్సి వస్తోందని.. మంచినీరు, భోజన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించటంలో అధికారులు విఫలమయ్యారని, కొందరు అధికారులు అత్యుత్సాహంతో రైతులను అవమానించే రీతిలో మట్లాడుతున్నారని ఆరోపించారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ యార్డు దుస్థితిని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. సీఎం, సీఎండీకి ధన్యవాదాలు.. సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలోని పలు ఇళ్లకు బాంబ్ బ్లాస్టింగ్‌తో పగుళ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, సింగరేణి సీఎండీ శ్రీధర్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే చర్యలు చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సుధాకర్‌రెడ్డి అన్నారు. సింగరేణి నిధులను బాధిత గ్రామాలలో ఖర్చు చేయాలని, డిస్పెన్సరీ, సీసీరోడ్లు, మంచినీరు ఇవ్వాలని, పర్యావరణ సమతుల్యత కోసం చెట్లు పెంచాలని కోరారు. ఆయన వెంట కట్ల రంగారావు, రామిశెట్టి సుబ్బారావు ఉన్నారు. కడియం.. నీ బాగోతం బయటపెడతాం అవినీతి, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కడియం ఆ మాటలు చెప్పిన బహిరంగ సభలోనే.. అదే మండలానికి చెందిన ఎంపీటీసీ సభ్యులు చేసిన పనికి సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వెళితే ఖర్చు పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ ఎంపీటీసీ ఆత్మహత్యాయత్నం చేసిన విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సత్తుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్యాశాఖలో అక్రమాలు, కార్పొరేట్ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే తానే స్వయంగా వచ్చి అక్రమాలను సాక్ష్యాధారాలతో నిరూపిస్తానని, మంత్రి కడియం శ్రీహరి బాగోతాన్ని బయటపెడతానని సవాల్ విసిరారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న పనుల్లో మూడు శాతం పర్సంటేజీలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే అయిన కేటీఆర్ చెప్పినట్లు స్వయంగా మున్సిపల్ చైర్మన్ చెప్పిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దందా చేస్తోందని, పినపాకలో గోదావరిలోనే రోడ్డు వేశారంటే ఇసుక మాఫియా ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు.