
సాక్షి, హైదరాబాద్: కంది కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపడంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్లకుపైగా భారం పడిందని మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధ వారం శాసన మండలి ఆవరణలో ఆయన వ్యవసాయ మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. కందుల సేకరణలో కేంద్ర వైఖరి తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టకరమని హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కంది రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి లేఖలు రాసినా.. నేరుగా కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కలసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయిందన్నారు. రూ.410 కోట్ల విలువ చేసే 75,300 టన్నుల కంది సేకరణకే కేంద్రం అంగీకరించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5,450 చొప్పున 1.84 లక్షల టన్నుల కందులను కొనుగోలు చేసిందని తెలిపారు. దాంతో రాష్ట్రంపై రూ.వెయ్యి కోట్ల వరకు భారం పడిందని చెప్పారు. రైతులకు నాఫెడ్ నుంచి రూ.183.86 కోట్లు, మార్క్‌ఫెడ్, హాకా వంటి ఏజెన్సీల నుంచి రూ.52.46 కోట్లు రావాల్సి ఉందని.. ఈ బకాయిలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
శనగ కొనుగోళ్లు ముమ్మరం..
శనగ కొనుగోళ్లు, చెల్లింపులపైనా హరీశ్‌రావు సమీక్షించారు. 50 వేల టన్నుల శనగ సేకరణకు కేంద్రం అనుమతించిందని.. 28 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 26 వేల టన్నుల శనగలను నాఫెడ్ కొనుగోలు చేసిం దన్నారు. ఇందుకు రైతులకు చెల్లించాల్సిన రూ.111 కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ముఖ్య కార్యదర్శి పార్థసారథి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment