సాక్షి, అమరావతి: వ్యవసాయ మార్కెట్ కమిటీలు మళ్లీ కళకళలాడుతున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్‌తో గతేడాది ఆగస్టు నుంచి వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లపై మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోగా.. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం తిరిగి మొదలయ్యా యి. దీంతో 8 నెలల పాటు ఆర్థిక ఇబ్బందులు పడి న మార్కెట్ కమిటీలు గాడిలో పడ్డాయి. మార్కెటింగ్ శాఖ అదీనంలో 216 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటిలో 815 మంది రెగ్యులర్, 2,628 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి జీతభత్యాల కింద ఏటా రూ.1. 22 కోట్లు ఖర్చవుతోంది. 2,478 మంది పింఛన్‌దారులు ఉండగా, వారికి ఏటా రూ.100 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తోంది. మార్కెట్ సెస్ ద్వారా మార్కెట్ కమిటీలకు ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది. జీతభత్యాలు, రోజువారీ ఖర్చులు పోగా మిగిలిన నిధులతో మార్కెట్ కమిటీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
1 శాతం సెస్ వసూలు
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లకు సంబంధించి ఆయా ఉత్పత్తుల విలువపై ఒక శాతం మొత్తాన్ని సెస్ రూపంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు వసూలు చేస్తాయి. 2019–20లో రికార్డు స్థాయిలో 10,18,235.76 మెట్రిక్ టన్నుల వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులు మార్కెట్‌లోకి రాగా.. వాటి క్రయ విక్రయ లావాదేవీలపై మార్కెటింగ్ శాఖకు సెస్ రూపంలో రూ.551.22 కోట్ల ఆదాయం లభించింది. వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ కారణంగా గతేడాది ఆగస్టు 20వ తేదీ నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా 2019– 20తో పోల్చితే 2020–21లో ఏకంగా రూ.433.52 కోట్ల ఆదాయాన్ని మార్కెటింగ్ శాఖ కోల్పోవాల్సి వచ్చింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పెద్దఎత్తున ఉద్యమం సాగడం తో సుప్రీంకోర్టు ఆ చట్టాల అమలుపై స్టే విధించిం ది. దీంతో సెస్ వసూళ్లకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది మార్చి 25నుంచి మార్కెట్ సెస్ వసూళ్లు పునఃప్రారంభం కావడంతో రూ.వంద కోట్లకు పైగా సెస్ వసూలయినట్లు చెబుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులకు తెరపడింది
దాదాపు 8 నెలల పాటు మార్కెట్ సెస్ వసూళ్లు నిలిచిపోవడంతో మార్కెట్ కమిటీలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో నెల రోజుల క్రితం సెస్ వసూళ్లు ప్రారంభించారు. సీజన్ మొదలవడంతో మార్కెట్ కమిటీల్లో క్రయవిక్రయాలు జోరందుకుంటున్నాయి.
– పీఎస్ ప్రద్యుమ్న, కమిషనర్, మార్కెటింగ్ శాఖ
Comments
Please login to add a commentAdd a comment