కొత్త మార్కెట్ చట్టాన్ని తీసుకువస్తున్నాం
శాసన మండలిలో మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: మార్కెట్ యార్డు బయట కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా చట్టబద్ధత కల్పించే విధంగా నూతన చట్టాన్ని అమల్లోకి తేబోతున్నామని, నల్సార్ యూనివర్సిటీ నిపుణుల సాయంతో ఈ చట్టాన్ని రూపొందిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గురువారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు మార్కెటింగ్ శాఖలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన రూ 920 కోట్ల నగదును వారి అకౌంట్లలోకి బదిలీ చేశామని మంత్రి వెల్లడించారు. కాగా, షాదీ ముబారక్ పథకం కింద 1.60 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని పతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా, హరీశ్‌రావు స్పందిస్తూ....ఈ పథకం కింద అర్హులైన వారందరికి డబ్బు అందిస్తామని, ఒకవేళ కేటాయించిన బడ్జెట్ సరిపోకపోతే అదనపు బడ్జెట్ కేటాయించైనా వారికి సాయం చేస్తామని చెప్పారు.