కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మొరపెట్టుకుంటున్న బాధితులు
పులివెందుల : తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంటికో ఉద్యోగం ఇచ్చేమాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలను పెరికేసి వారి కుటుంబాలను రోడ్డుకు ఈడుస్తున్నారు. పులివెందుల మార్కెట్ మార్డులో పదేళ్ల నుంచి పనిచేస్తున్న ముగ్గురు సెక్యూరిటీ గార్డులు ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఒక అటెండర్‌ను ఉన్న పళంగా తొలగించారు. వీరందరూ గత పదేళ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తూ జీతాలు పొందుతూ తమ కుటుంబాలను పోషించుకునేవారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ బంధువులను, అనుచరులను నియమించుకునేందుకు మార్కెట్ యార్డు చైర్మన్ పావులు కదిపారు. అందులో భాగంగా సెక్యూరిటీ గార్డులు రైతులతో కుమ్మక్కై మార్కెట్ యార్డు ఆదాయానికి గండికొడుతున్నారని.. అటెండర్, కంప్యూటర్ ఆపరేటర్లు డ్యూటీకి సక్రమంగా హాజరు కావడంలేదని సాకు చూపి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి 5మందిని తొలగించమని చైర్మన్ లేఖ రాశారు. మరుసటి రోజే వారి స్థానంలో తమ బంధువుల పేర్లు, అనుచరుల పేర్లు పెట్టి వారి స్థానంలో వీరిని నియమించాలని మరో లేఖ ఏజెన్సీకి రాసి వారి స్థానంలో తమ అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించాడు. ఇంతకాలం పనిచేస్తున్న తమను తొలగించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేసినా పట్టించుకోలేదు.
కోర్టును ఆశ్రయించిన బాధితులు
తాము ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా తమను తొలగించారని, కేవలం చైర్మన్ తన అనుచరులకు పోస్టింగ్‌లు ఇప్పించుకునేందుకు చేయని తప్పులను సాకుగా చూపి తమను తొలగించారని కంప్యూటర్ ఆపరేటర్ పవన్‌కుమార్, సెక్యూరిటీ గార్డులు మహేశ్వరరెడ్డి, మహబూబ్ బాషాలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి ఆవేదనను విన్న కోర్టు వెంటనే వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని కొనసాగించాలని అగ్రికల్చర్‌లో మార్కెటింగ్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి, పులివెందుల మార్కెట్ కమిటీ చైర్మన్‌కు, పులివెందుల మార్కెట్ కమిటీ సెక్రటరీకి, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి నోటీసులు ఇచ్చారు.
కోర్టు ఆదేశాలు బేఖాతర్..
హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా మార్కెట్ కమిటీ చైర్మన్ హైకోర్టు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తున్నారు. బాధితులు కోర్టు ఆర్డర్‌ను తీసుకుని మార్కెట్ కమిటీ సెక్రటరీని కలవగా.. నా చేతుల్లో ఏమీ లేదన్నారు. మీరు ఏదైనా ఉంటే చైర్మన్‌తో చూసుకోండని సమాధానమిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్‌ను బాధితులు కలవగా మీ ఇష్టం వచ్చింది చేసుకోండంటూ హుకుం జారీ చేశారని బాధితులు వాపోతున్నారు.
మాజీ ఎంపీని కలిసిన బాధితులు :తమను అన్యాయంగా తొలగించడంపై బాధితులు గురువారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఉన్న ఫళంగా ఐదుగురిని తొలగించడం అన్యాయమన్నారు. వీరిని తొలగించడంతో వారి కుటుంబాల పోషణ కష్టతరమైందన్నారు. తన అనుచరులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు వీరి కుటుంబాలకు అన్యాయం చేయడం తగదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేద్దామని వారికి భరోసా ఇచ్చారు.
సిబ్బంది తొలగింపుతో మాకు సంబంధంలేదు: మార్కెట్ కమిటీ సెక్రటరీ
మార్కెట్ యార్డులో సిబ్బంది తొలగింపు విషయమై మార్కెట్ కమిటీ సెక్రటరీ రత్నంరాజును వివరణ కోరగా వారి ఉద్యోగాల విషయంలో తమకు సంబంధం ఉండదని, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా నియామకం పొందడంతో వారి వద్దే ఏదైనా ఉంటే చూసుకోవాలన్నారు. కోర్టు ఉత్తర్వులకు సంబంధించి తమ శాఖ తరపున హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment