ఇక పంటల వారీ మార్కెట్‌ యార్డులు  | Unpredictable response from farmers | Sakshi
Sakshi News home page

ఇక పంటల వారీ మార్కెట్‌ యార్డులు 

Published Sat, Aug 11 2018 2:14 AM | Last Updated on Tue, Oct 9 2018 2:17 PM

Unpredictable response from farmers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్‌ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను మార్కెటింగ్‌ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్‌ యార్డ్‌ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది.  

నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు 
తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను 9 ఎకరాల్లో మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్‌శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్‌ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్‌ ప్లా్లట్‌ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్‌ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను నెలకొల్పారు.  

జగిత్యాలలో మామిడి మార్కెట్‌కు ఏర్పాట్లు  
జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్‌ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్‌ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement