Telangana Sarkar
-
కరెంట్ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'
సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు అనుమతి లేకున్నా అక్రమంగా వాటాకు మించి నీటిని వినియోగించి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ.. నాగార్జునసాగర్‌కు తరలిస్తోంది. సాగర్ ఎడమ కాలువ రెగ్యులేటర్‌తోపాటు ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ రెగ్యులేటర్‌ను తన అధీనంలో ఉంచుకుంది. ఏపీకి హక్కుగా దక్కాల్సిన వాటా జలాలను దక్కినివ్వకుండా అడ్డుకుంటోంది. గత తొమ్మిదేళ్లుగా ఇదే రీతిలో తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను హరిస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు’ అని ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు పరిధి నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డుకు అప్పగించడానికి ఒప్పుకున్నామని గుర్తు చేశారు. విభజన చట్టం, కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ.. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను ఆ రాష్ట్ర సీఈ 2014 నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందని చెబుతూ.. దాన్ని తన అధీనంలోకి తీసుకుని తెలంగాణ సర్కార్ స్వేచ్ఛగా నిర్వహిస్తూ, అక్రమంగా నీటిని తరలిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తన భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను గురువారం ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై చర్చించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం రెండు రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌కు విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఆ రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌కు గైర్హాజరయ్యారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్‌లోనే తెలంగాణ సీఎస్ శాంతికుమారికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఫోన్ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనుండటం వల్ల.. ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని, దాని వల్లే వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాలేకపోతున్నామని ఆ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి తెలిపారు. సమావేశాన్ని 5కు వాయిదా వేస్తే హాజరవుతామన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్‌లు, జల వనరుల శాఖ అధికారులు హాజరుకావాలని కోరారు. ఇందుకు రెండు రాష్ట్రాల సీఎస్‌లు అంగీకరించారు. తెలంగాణ సీఎస్ హాజరుకాలేని నేపథ్యంలో ఏపీ సీఎస్, అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తాజా పరిస్థితిని సమీక్షించారు. మా హక్కులను కాపాడుకోడానికే.. ‘తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుతూ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం లేదు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం నెలకొందని.. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి కోసమే వాడుకోవాలని అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సు మేరకు శ్రీశైలంలో 30 టీఎంసీలు, సాగర్‌లో 15 టీఎంసీలు ఏపీకి.. రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయిస్తూ అక్టోబర్ 9న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ.. సాగర్‌కు తెలంగాణ నీటిని తరలించింది’ అని ఏపీ సీఎస్ జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల.. కృష్ణా బోర్డు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని, మిగతా 17 టీఎంసీలు కోల్పోవాల్సి వచ్చిందని.. దీనికి తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరి, కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర వహించడమే కారణమని తెలిపారు. సాగర్‌లో కుడి కాలువకు కేటాయించిన 15 టీఎంసీలను ఇదే రీతిలో తెలంగాణ దక్కకుండా చేస్తుందేమోననే ఆందోళన ప్రజల్లో మొదలైందని.. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుండటంతో.. మా హక్కులను కాపాడుకోవడం ద్వారా దాన్ని నివారించడానికే మా భూభాగంలో ఉన్న సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేశామని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు. ఏపీ అధీనంలో స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో సాగర్ నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించాం కాబట్టి.. ఇక అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ఏపీ సీఎస్‌కు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాగర్‌లో సీఆర్పీఎఫ్ బలగాల మొహరింపుపై ఆ విభాగం అడిషనల్ డీజీ చారుసిన్హాను ఆరా తీశారు. సాగర్ స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలంగాణ పోలీసులు వెనక్కి వెళ్లారని, అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించామని చారుసిన్హా చెప్పారు. ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర భూభాగంలోని స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నారని.. పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఏపీ వైపు స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్‌ను సీఆర్పీఎఫ్కు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి చేసిన సూచనను ఏపీ సీఎస్ సున్నితంగా తోసిపుచ్చారు. కుడి కాలువ కింద తమ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముడిపడి ఉన్నాయని.. ఈ నేపథ్యంలో వాటిని తమ స్వాధీనంలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి లేవనెత్తిన అంశాలపై కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వివరణ కోరారు. సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపకుండానే.. నీటిని విడుదల చేసుకున్నారని కృష్ణా బోర్డు ఛైర్మన్ చెప్పారు. కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని ప్రతిపాదన పంపామని ఏపీ సీఎస్ చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి.. ఈనెల 4లోగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కృష్ణా బోర్డు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే వరకూ అంటే 4వ తేదీ వరకు కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని ఆమె చేసిన సూచనకు ఏపీ సీఎస్ అంగీకరించారు. కృష్ణా జలాల వివాదంపై ఈనెల 6న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్)తో సమావేశం నిర్వహిస్తామని.. అప్పటిదాకా సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాలకు ముఖర్జీ సూచించారు. విభజన చట్టం మేరకు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి.. రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్‌నందన్‌కుమార్, సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరాలు పాల్గొన్నారు. రెండు గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల మాచర్ల / విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 13 క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్ స్వాధీన పర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి హక్కు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా శనివారం సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు విడుదల కొనసాగించారు. మూడు రోజులుగా ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా 5వ గేటు నుంచి 2వేల క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1300 మొత్తం 3300 క్యూసెక్కుల నీటిని బుగ్గవాగు రిజర్వాయర్‌కు పంపుతున్నారు. తద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, గుంటూరు రేంజి ఐజీ పాల్‌రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో సాయంత్రం నుంచి నీటి విడుదలను 2,550 క్యూసెక్కులకు తగ్గించారు. నాగార్జునసాగర్ డ్యాం ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న తెలంగాణ స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ పోలీస్ గార్డ్ రూమ్ పేరును తొలగించి, ఆంధ్రప్రదేశ్ పోలీస్‌గార్డ్ రూమ్‌గా మార్చారు. కాగా, వివాదం నేపథ్యంలో శనివారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు ఎస్ఈ అశోక్‌కుమార్, ఈఈ రఘునా««థ్, సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్‌రావు డ్యామ్‌ను సందర్శించారు. -
ఆంధ్రా పాలనలోనే ఆర్టిస్టులకు గౌరవం: ఎక్కా యాదగిరి
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఆర్టిస్టులు.. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్టిస్టులు కన్పించట్లేదు. ఆంధ్రోళ్ల పాలనలోనే గౌరవ, మర్యాదలు ఉండేవి’ అని అమరవీరుల స్తూపం రూపశిల్పి ఎక్కా యాదగిరి తీవ్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శుక్రవారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పాలకుల పాలనలో అవార్డులు, ప్రోత్సాహకాలు ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ సర్కారు ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా శిల్పులకు, చిత్రకారులకు ఏం చేసిందని ప్రశ్నించారు. తమకు నిలువ నీడలేదని, పెద్ద పెద్ద ఆర్టిస్టులను కూడా పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. ఆర్టిస్టులంతా చెట్టుకొకరం.. పుట్టకొకరం అయ్యామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ కల్పించుకొని పెద్దలు సంయమనం వహించాలని కోరారు. మీ సూచనలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. లలితకళల అకాడమీ ఏర్పాటు కావాల్సి ఉందని భవిష్యత్తులో ఏర్పడి తీరుతుందని ఆయన అన్నారు. -
ఇక పంటల వారీ మార్కెట్ యార్డులు
సాక్షి, హైదరాబాద్: ప్రతి ప్రధాన పంటకు ఒక మార్కెట్ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తుంది. మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ఆలోచనల మేరకు ఆ శాఖ అధికారులు వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్, నల్లగొండలో బత్తాయి మార్కెట్, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసింది. అయితే వీటి ఏర్పాటుతో రైతుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో మున్ముందు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. గతంలో నల్లగొండ జిల్లా రైతులు బత్తాయి పంటను అమ్ముకునేందుకు హైదరాబాద్‌లోని గడ్డి అన్నారం మార్కెట్‌కు తీసుకొచ్చేవారు. దీంతో రవాణా ఖర్చుల భారం, తూకాలలో మోసం వంటివి రైతుల్ని ఇబ్బందులు పెట్టేవి. కొందరు రైతులు తోటల వద్దే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. నల్లగొండలో బత్తాయి మార్కెట్ యార్డ్ రాకతో వీటన్నింటికీ అడ్డుకట్ట పడింది. నిమ్మ, పచ్చిమిర్చికీ మార్కెట్లు తెలంగాణలో మొదటిసారిగా నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌ను 9 ఎకరాల్లో మార్కెటింగ్‌శాఖ ఏర్పాటు చేసింది. మార్కెటింగ్‌శాఖ రూ. 3.07 కోట్లు కేటాయించింది. మార్కెట్లో 25 ట్రేడర్ షాపులు నిర్మించడంతోపాటుగా ఆక్షన్ ప్లా్లట్ఫాంను నెలకొల్పింది. గతంలో నిమ్మ రైతులు సరుకును తోటలవద్దే దళారుల వద్ద అమ్ముకునేవారు. ఈ మార్కెట్ రాకతో జిల్లాలో నిమ్మరైతుల పరిస్థితి కాస్త ఆశాజనకంగా ఉంది. మున్ముందు ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో పచ్చిమిర్చి మార్కెట్‌ను నెలకొల్పారు. జగిత్యాలలో మామిడి మార్కెట్‌కు ఏర్పాట్లు జగిత్యాలలో మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. జగిత్యాల మామిడి నాణ్యత, రుచిలో చాలా ప్రాముఖ్యం పొందటంతో ఈ మామిడికి ‘జగిత్యాల మామిడి‘గా ఒక బ్రాండ్ ఏర్పాటు చేసేందుకు మార్కెటింగ్‌శాఖ పూనుకుంది. మామిడి మార్కెట్ అభివృద్ధి కోసం రూ. 5.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం కేటాయించిన 23.19 ఎకరాల స్థలంతో పాటు అదనంగా మరో 10 ఎకరాల స్థలాన్ని రైతుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించడానికి సంప్రదింపులు జరుపుతున్నారు. -
పార్క్‌హయత్ పక్కన పేలుళ్లపై వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నం.2లో వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరపడంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వంశీరాం బిల్డర్స్ పేలుళ్లు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పార్క్‌హయత్ హోటల్ జనరల్ మేనేజర్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ ఆరోపణలపై వివరాలు అందజేయాలని సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రతివాదులైన హోంశాఖ కార్యదర్శి, హైదరాబాద్ కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేశారు. పేలుళ్ల వల్ల హోటల్లో బసచేసే వారికే కాకుండా చుట్టుపక్కల వారికీ ప్రమాదం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రభాకర్ వాదించారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన న్యాయమూర్తి తదుపరి విచారణను వాయిదా వేశారు. -
వెయిటేజీ మార్కులపై స్టేకు నో
సాక్షి, హైదరాబాద్: వైద్య శాఖ, ట్రాన్స్‌కోల్లో ఔట్సోర్సింగ్(పొరుగు సేవలు), కాంట్రాక్టు (ఒప్పంద సేవలు) పద్ధతుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఉద్యోగాల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలను నిలుపుదల చేయడంవల్ల ప్రయోజనం ఉండబోదని, ఈ దశలో స్టే మంజూరు అవసరం లేదని సోమవారం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మి లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతుల్లో చేసే ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలనే నిర్ణయాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. మరో సింగిల్ జడ్జి.. పరీక్షలో సమాన మార్కులు వచ్చినప్పుడు మాత్రమే కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ ఇవ్వాలని అందుకు విరుద్ధమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఈ వివాదం ధర్మాస నం ముందుకు వచ్చింది. ఔట్సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతుల్లో సేవలందించే వారికి వెయి టేజీ ఇవ్వాలన్న సర్కార్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను ధర్మాసనం విచా రిస్తూ.. ఉద్యోగ భర్తీకి నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే అభ్యర్థులందరికీ ఒకే తరహా పశ్నపత్రం ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోటీ పరీక్షల తేదీ సమీపిస్తున్నందున ఈ కేసులను వీలైనంత త్వర గా విచారణ జరుపుతామని ప్రకటించింది. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు చేసేవారికి వెయిటేజీ మార్కులు ఇవ్వడం చట్ట వ్యతిరేకమని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు ఇవ్వాలని కోరా రు. దీనిపై అడ్వొకేట్ జనరల్ దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి స్పందిస్తూ.. ఇప్పటికిప్పుడే పరీక్షలు జరిపేసి అర్హుల్ని వెంటనే ఉద్యోగాల్లో చేర్చేసుకోవడం లేదు కాబట్టి పరీక్షల్ని వాయి దా వేయాల్సిన అవసరం లేదన్నారు. వాదనల అనంతరం విచారణ వచ్చేవారానికి వాయిదా పడింది. -
రమ్మీ జూదం కాదు.. స్కిల్ గేమ్!
- తెలంగాణ సర్కార్‌పై ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం - బుధవారం కూడా కొనసాగనున్న విచారణ సాక్షి, హైదరాబాద్: పేక ముక్కలతో ఆడే రమ్మీ జూదం కాదు.. నైపుణ్యాన్ని వెలికితీసే క్రీడ.. అని ఉమ్మడి హైకోర్టులో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ వాదించారు. ఆన్లైన్ రమ్మీని నిషేధిస్తూ తెలంగాణ సర్కార్ ఈనెల 17న ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిని ముంబైకి చెందిన పలు రమ్మీ క్రీడా నిర్వహణ సంస్థలు వ్యతిరేకిస్తూ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. వాటిని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది. ధర్మాసనం ఎదుట గంగూలీ వాదిస్తూ.. రమ్మీ ఆట జూదం కాదని, నైపుణ్యాన్ని వెలికి తీసే క్రీడ అని పేర్కొన్నారు. పైగా, సుప్రీంకోర్టు కూడా ఇతర కేసుల్లో రమ్మీ జూదం కాదని గతంలో తీర్పు చెప్పిందని ఆయన గుర్తు చేశారు. ఈ కేసుల్లో వాదనలు అసంపూర్తిగా జరగడంతో బుధవారం కూడా విచారణ కొనసాగిస్తామని ధర్మాసనం ప్రకటించింది. -
వేగం 100 కి.మి దాటితే ఇక జైలుకే
-
కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై హైకోర్టు నిలదీత
- నాటేది రెండు మూడడుగుల మొక్కలు.. - కూల్చేది 20,30 ఏళ్ల నాటి చెట్లనా? - తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు - తదుపరి విచారణ 18కి వాయిదా సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి(కేబీఆర్) పార్కులో భారీస్థాయిలో చెట్ల నరికివేత విషయమై హైకోర్టు బుధవారం తెలంగాణ సర్కార్‌ను నిలదీసింది. ఒకవైపు హరితహారం పేరుతో రెండు, మూడు అడుగుల మొక్కలు నాటుతూ మరోవైపు 20-30 ఏళ్ల నాటి చెట్లను నరికేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించింది. ఇది సరైన పద్ధతి కాదని స్పష్టం చేసింది. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు(ఎస్ఆర్డీపీ) కింద చేపట్టిన బహుళ అంతస్తుల ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం కేబీఆర్ పార్క్‌లోని చెట్లను పెద్దసంఖ్యలో నరికివేస్తుండటంపై ఓ దినపత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా, దానిని ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)గా పరిగణించింది. దీనిని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) ఎ.సంజీవ్‌కుమార్ స్పందిస్తూ పిటిషనర్ తన లేఖలో 3100 చెట్లను కొట్టివేస్తున్నట్లు పేర్కొన్నారని, ఇది నిజం కాదని అన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ‘మీరు ఒకపక్క హరితహారం అంటారు. ఇందులో రెండు, మూడు అడుగులున్న చిన్న మొక్కలు నాటుతారు. మరోవైపు అభివృద్ధి అంటూ 20-30 ఏళ్ల నాటి భారీ చెట్లను నరికివేస్తారు. ఇది ఎంత వరకు సబబో మీరే చెప్పాలి.’ అని ప్రశ్నించింది. పిటిషనర్ చెప్పిన లెక్కల్లో తేడాలునప్పటికీ చెట్లు కొట్టేస్తున్నది నిజమా.. కాదా.. అని నిలదీసింది. ఈ కేసులో కోర్టు సహాయకారిగా(అమికస్ క్యూరీ) సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్‌ను నియమించిన ధర్మాసనం, ఇదే అంశానికి సంబంధించి ఇప్పటికే దాఖలైన వ్యాజ్యంతో దీనిని కూడా జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. -
‘మూసీ’ కోసం ఏం చేస్తున్నారో చెప్పండి
♦ తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం ♦ తదుపరి విచారణ 21వ తేదీకివాయిదా ♦ కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: మూసీ నది నిర్వహణ, సుందరీకరణకు ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతీ నదిలా మూసీ నదిని శుభ్రపరిచి, నది నిర్వహణకు ఓ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, మూసీ నది ప్రక్షాళన మొదటిదశ కార్యక్రమం విఫలమైందని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన దాఖలాలేమీ లేవన్నారు. మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయంలో 70 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, మూసీ నది శుభ్రత జరుగుతోందా? అని ఆరా తీసింది. ఇటీవలే మంత్రి కె.తారకరామారావు సుందరీకరణ పనుల నిమిత్తం మూసీ నదిని పరిశీలించారని, ఈ మేరకు పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. రూ. 50 కోట్లతో హైకోర్టు ఎదుట మూసీ నదిలో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారని, దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆమె వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఇకపై మూసీ నిర్వహణ, సుందరీకరణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.మూసీ నది నిర్వహణ, సుందరీకరణ కోసం ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. -
లక్షల్లో ఫీజు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారు?
ఆ పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారు? తెలంగాణ సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్ : ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. ‘వన్‌టైం స్పెషల్ యాక్టివిటీ ఫీ’ పేరుతో లక్షలు వసూలు చేస్తున్న పాఠశాలలపై ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందులో భాగంగా ప్రభుత్వంతో పాటు పలు పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలలు వన్‌టైం స్పెషల్ ఫీజు అంటూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయని, ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధమంటూ హెచ్ఎస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్.రవికుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. -
టీచర్ పోస్టులన్నింటినీ భర్తీ చేశాం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టామని టీ సర్కార్ హైకోర్టుకు నివేదించింది. ఈ ఏడాది జూలై 31 నాటికి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను విద్యా వాలంటీర్ల ద్వారా భర్తీ చేశామని తెలిపింది. రాష్ట్రం లోని పాఠశాలల్లో ఓ తీరులేని విధానం ఉన్న ట్లు గుర్తించామని, కొన్ని స్కూళ్లలో టీచర్లు ఎక్కువ ఉంటే విద్యార్థులు తక్కువగా ఉండటం, కొన్ని చోట్ల టీచర్లు తక్కువగా ఉండి, విద్యార్థులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి, దాన్ని సరిచేశామని వివరించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ ప్రజా ప్రయోజనాన్ని హైకోర్టు విచారిస్తుందో, ఆ లక్ష్యాన్ని తాము పూర్తి చేశామని, అందువల్ల ఈ వ్యాజ్యాన్ని మూసివేయాలని కోరింది. తమ పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు లేరని, దీంతో తాము సరైన విద్యను పొందలేకపోతున్నామంటూ మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజ మండలాల పరిధిలోని బొయ్యలగూడెం, మాచర్ల, కేశవరం, చింతలకుంట, మిట్టదొడ్డి, యల్లందొడ్డి, చాగదొన, అరగిడ్డ గ్రామాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తికి దాదాపు 1700కు పైగా లేఖలు రాశారు. ఈ లేఖలన్నింటినీ పరిశీలించిన ఆయన వీటిని ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా మలచాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ ఆ లేఖలను పిల్‌గా మలిచి విచారణ నిమిత్తం ధర్మాసనం ముందుంచింది. ఈ వ్యాజ్యాలను పలుమార్లు విచారించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల మరోసారి విచారించి, అసలు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ టి.చిరంజీవులు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 26050 పాఠశాలలున్నాయని, వీటికి మొత్తం 112692 టీచర్ పోస్టులను కేటాయించామని (పీఈటీ, హెడ్మాస్టర్లు మినహాయించి) ఆయన తెలిపారు. ఇందులో 101731 మంది ప్రస్తుతం పనిచేస్తున్నారని, మిగిలిన 10961 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. తీసుకున్న చర్యలు... ►పాఠశాలల్లో ఓ క్రమపద్ధతిలో లేని విధానాన్ని సవరించి, ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్దీకరణ కోసం ఈ ఏడాది జూన్ 16న జీవో 11 జారీ చేశాం. ►జీవో 11కు సమాంతరంగా ఉపాధ్యాయుల బదిలీల నిమిత్తం జీవో 12 జారీ చేశాం. దీనికి అనుగుణంగా హేతుబద్ధీకరణను పూర్తి చేసి, బదిలీల కౌన్సెలింగ్ ప్రారంభించాం. జూలై 7 నుంచి 31 వరకు కౌన్సెలింగ్ నిర్వహించాం. ►బదిలీ కౌన్సిలింగ్ సమయంలోనే కొన్ని పాఠశాలలకు అసలు టీచర్లే లేరన్న విషయాన్ని గుర్తించాం. ►దీనిని అధిగమించేందుకు విద్యాశాఖ ఈ ఏడాది జూలై 13న ప్రొసీడింగ్స్ జారీ చేసింది. ఉపాధ్యాయుల్లో జూనియర్ అయిన వ్యక్తి తను ఏ పాఠశాలలో పనిచేసి, బదిలీపై మరో చోటుకు వెళ్లాడో అతను తిరిగి తను పనిచేసిన పాఠశాలలోనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వరకు పనిచేయాలని ఉత్తర్వులు జారీ చేశాం. ►ఖాళీలను విద్యా వలంటీర్ల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించాం. భర్తీ ప్రక్రియను గత నెల 21కల్లా పూర్తి చేశాం. ►ఇక మహబూబ్‌నగర్ జిల్లా, గట్టు, ఐజా మండల్లాలోని ఏడు పాఠశాలల విషయానికొస్తే, ఈ 7 పాఠశాలల్లో మొత్తం 1960 మంది విద్యార్థులుంటే, 41 టీచర్ పోస్టులను కేటాయించాం. ఇందులో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు 11 మంది, విద్యా వలంటీర్లు 11 మంది ఉన్నారు. 27.8.15న మరో 20 ఉపాధ్యాయులను ఈ పాఠశాలల్లో నియమించాం. -
జూన్ 2 నుంచే ఎక్స్ గ్రేషియా
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రకటించిన ఎక్స్ గ్రేషియాను 2.6.2014 నుంచే అమలు చేయాలని తెలంగాణ సర్కార్ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంతకు ముందు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. -
'టీ సర్కారుది కోర్టు ధిక్కారం'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చట్టాన్ని, కోర్టును కూడా ధిక్కరిస్తూ ఎటువంటి ప్రణాళిక, ప్రజాభిప్రాయం లేకుండా హుస్సేన్ సాగర్‌ను అశాస్త్రీయంగా ఖాళీ చేయిస్తోందని సేవ్ అవర్ అర్బన్ లేక్స్ (సోల్) ప్రతినిధులు ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సోల్ కో- కన్వినర్ లుబ్నా సర్వత్, వ్యవస్థాపక సభ్యులు బి.వి. సుబ్బారావు, పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తమ్ రెడ్డి తదితరులు మాట్లాడారు. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన విషయమై పూర్తి వివరాలు కావాలని తాము జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పీసీబీకి సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేసుకోగా వారు తమవద్ద ఎలాంటి సమాచారం లేదని జవాబిచ్చారని తెలిపారు. దీంతో తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేసినట్లు తెలిపారు. ట్రిబ్యునల్ ఈ నెల 22 లోపు హుస్సేన్‌సాగర్‌ను ఖాళీ చేసే విషయమై పూర్తి వివరాలు అందించాలని, అప్పటివరకూ ఎలాంటి పనులూ చేయవద్దని నీటిని ఎక్కడకూ తరలించరాదని ఆదేశించిందని తెలిపారు. అయితే, ట్రిబ్యునల్ ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతారు చేస్తూ తిరిగి నీటిని మళ్లిస్తోందన్నారు. ప్రభుత్వం కోర్టు ధిక్కారంపై సోమవారం మరోసారి కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. ప్రమాదకర కలుషిత నీటిని హుస్సేన్‌సాగర్ నుంచి మూసీకి తరలించడం ద్వారా మూసీ చుట్టుప్రక్కన నివసిస్తున్న వారికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. -
ఇంటింటా ఇంటర్నెట్!
రాష్ట్రవ్యాప్తంగా 78 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వాటర్‌గ్రిడ్ పైపులతో పాటే భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు భారీగా తగ్గిపోనున్న వ్యయం.. రూ. 507 కోట్లతోనే పూర్తి అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సర్కారు సంప్రదింపులు ‘డిజిటల్ ఇండియా’తో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం భారీగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఇంటింటికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటర్ గ్రిడ్ పథకంతో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. అదే బాటలో డిజిటల్ రాష్ట్రాన్ని సాకారం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీన్ని రాష్ర్టవ్యాప్తంగా విస్తరించే ందుకు, మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలను విస్తరించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని డిజిటల్ తెలంగాణను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటుపై పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ర్టవ్యాప్తంగా భూగర్భంలో వేసే పైపులతో పాటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చాలని సర్కారు యోచిస్తోంది. దీనివల్ల లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా ఆదా కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.2,600 కోట్లు ఆదా.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రతి మీటరుకు రూ.465 ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో మీటర్ కేబుల్ ధర రూ.65 కాగా, భూగర్భంలో కేబుల్ వేసేందుకు(తవ్వకానికి) మీటరుకు రూ.400 ఖర్చవుతుం ది. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలంటే సుమారు 78 వేల కి.మీ. మేర భూగర్భం లో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్రం అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది. అయితే ఇప్పటికే చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం కోసం రాష్ర్టవ్యాప్తంగా విస్తృతంగా పైప్లైన్లు వేయాలి. ఇందుకోసం తవ్వుతున్న లైన్లలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. దీంతో తవ్వకానికయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు ఆదా అవుతాయి. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ను అందించవచ్చునని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా నియంత్రణ కూడా.. వాటర్‌గ్రిడ్ పైపులైన్లతో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుళ్లను కూడా అమర్చడం ద్వారా నీటి సరఫరా నియంత్రణకు వీలు కలుగుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం చెబుతోంది. స్కాడా(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) టెక్నాలజీ ద్వారా నీటి సరఫరాపై పర్యవేక్షణతో పాటు నీటి చౌర్యాన్ని కూడా అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున నీటిని ఇవ్వాలన్న పరిమితి పెడితే.. స్కాడా టెక్నాలజీ ద్వారా ప్రతి కుటుంబం పరిమితికి మించి నీటిని తీసుకోకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఇంటేక్ వెల్స్ నుంచి సరఫరా ట్రీట్మెంట్ ప్లాంట్లకు వస్తున్న నీరు, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా జిల్లాలకు, పట్టణాలకు, గ్రామాలకు, పరిశ్రమలకు సరఫరా అవుతున్న నీటిని ఎప్పటికప్పుడు లెక్కగట్టవచ్చు. అలాగే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తే దూరవిద్య విధానం ప్రజలకు మరింత చేరువకానుంది. ఆన్లైన్ సేవలు కూడా విస్తృతమవుతాయి. నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్ కేంద్రం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుకై నిధులు రాబట్టేందుకు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. వాటర్‌గ్రిడ్‌తో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులను రాబట్టడమే కేటీఆర్ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. -
ఆపరేషన్ హుస్సేన్‌సాగర్
హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హుస్సేన్‌సాగర్... జంటనగరాలను కలిపే వారధి సాగరే... భాగ్యనగరం పేరు వినగానే చార్మినార్‌తో పాటు గుర్తొచ్చే మరోపేరు హుస్సేన్‌సాగర్.. ఒకవైపు ట్యాంక్‌బండ్‌పై తెలుగువెలుగుల మూర్తులు.. మరోవైపు సాగర్ నడుమ తథాగతుడు.. ఎంత అద్భుత దృశ్యకావ్యమిది. ఇంతటి ప్రశస్తి కలిగిన ఈ సాగర్ తన గర్భంలో ఎన్నెన్నో విషవాయువుల్ని ఇముడ్చుకోవడం మరో విషాదం. ఏళ్ల పూర్వం మంచినీటి సరస్సుగా అలరారిన సాగర్.. ఇప్పుడు మురికికూపంగా మారిపోయింది. ములు మూసుకుపోయినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నిజాం హయాం నాటి నిర్వహణ నేడు లేదనేందుకు ఇదో నిదర్శనంగా మిగిలింది. గతం గతః అంటూ ఎట్టకేలకు సాగర్‌కు పునరుజ్జీవం తేవాలని సర్కారు సంకల్పించింది. విషతుల్యమైన ప్రస్తుత జలాల్ని ప్రక్షాళన చేసి.. స్వచ్ఛమైన నీటితో సాగర్‌కు కొత్తకళను తేవాలని భావించింది. ఇందులో భాగంగా అనధికారికంగా సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. అధికారికంగా వెల్లడించకపోయినా ప్రక్షాళన పనులు వేగంగా సాగిపోతున్నాయి. -
రాష్ట్రంలో దగాకోరు పాలన: భట్టి విక్రమార్క
ఖమ్మం: ‘ప్రజలను మోసం చేయడం.. ఆచరణకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం.. అడ్డుగా ఉన్న వారిని బెదిరించడం.. అన్ని తన కుటుం బానికే అందాలని చూడటం ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పని’ అని... ఇలా రాష్ట్రంలో దగాకోరు పాలన సాగుతోందని టీ-పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన తర్వాత తొలిసారి సోమవా రం జిల్లాకు వచ్చిన భట్టి విక్రమార్కను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సన్మానించారు. అధికారంలోకి వచ్చిన పదినెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ఖ్యాతి సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. తాను, తన కుటుంబం చక్కగా ఉంటే సరిపోతుందనే ఆలోచనతో పాలిస్తున్న కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన తరుణం ఆసన్నమవుతోందన్నారు. నూతన ప్రభుత్వం అయినందున పది నెలల గడువు ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రాన్ని రక్షించే బాధ్యత కూడా కాంగ్రెస్‌దే అని అన్నారు. -
జేబులు గుల్ల!
ఆదాయం పెంపుపై రాష్ట్ర సర్కారు దృష్టి వస్త్రాలు, బంగారం, సిగరెట్లపైనా వ్యాట్ మోత విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం బడ్జెట్ తర్వాత పెంచాలని సర్కారు యోచన వసూళ్లను మరింత కట్టుదిట్టం చేయాలని నిర్ణయం కార్పొరేట్ ఆస్పత్రులు, ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టి వచ్చే ఏడాది వాణిజ్య శాఖకు రూ. 39,000 కోట్ల లక్ష్యం నిరుటి కంటే రూ. 15,000 కోట్లు అదనం.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై పన్ను పోటుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆదాయం పెంచుకునే మార్గాన్వేషణలో పడిన టీఆర్ఎస్ సర్కారు.. వస్త్ర పరిశ్రమ, బంగారం, సిగరెట్లతో పాటు విలాస వస్తువులు, సేవలపై పన్నుల భారం మోపాలని యోచిస్తోంది. ప్రస్తుతం వస్త్ర పరిశ్రమపై పన్నుల భారమేమీ లేదు. గతంలో వ్యాట్ విధించినా.. వస్త్ర వ్యాపారుల ఆందోళనతో రాష్ట్ర విభజనకు ముందే కాంగ్రెస్ సర్కారు ఎత్తివేసింది. అయితే ఇప్పుడు వస్త్ర పరిశ్రమపై ఐదు శాతం పన్ను విధించాలని సర్కారు భావిస్తోంది. దీంతో పాటు బంగారంపై ఉన్న ఒక శాతం పన్నును ఐదు శాతానికి పెంచాలని, సిగరెట్లపై ఇరవై శాతం ఉన్న పన్నును మరింతగా పెంచాలని యోచిస్తోంది. ఇక రెస్టారెంట్లు, స్పాలు, షాపింగ్ మాల్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, మెగా స్టోర్లపై పన్ను మరింత పెంచాలని భావిస్తోంది. అంతేగాకుండా పన్నుల వసూలును మరింత కట్టుదిట్టం చేసే చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యసేవలకు ఇబ్బడి ముబ్బడి చార్జీలు వసూలు చేస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు పన్నుల ఎగవేతలో మొదటి స్థానంలో ఉన్నాయని.. వీటి నుంచి పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్కారు యోచిస్తోంది. ఆ తర్వాతే.. ఎంతమేరకు పన్ను పెంచాలి, ఏయే వస్తువులు, సేవలపై పెంచాలనే విషయంలో స్పష్టత లేకున్నా.... పన్నులు పెంచటం ఖాయమని వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఇప్పటికే వెల్లడించారు. ఆయన సారథ్యంలో ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వివిధ రాష్ట్రాల్లో పన్నుల తీరుపై అధ్యయనం చేస్తోంది. అయితే ఈ నెల 11న ప్రవేశపెట్టే బడ్జెట్లో కొత్త పన్నుల విషయాన్ని ప్రస్తావించకుండా... తర్వాతే పన్ను పోటు వేయాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చే సిఫారసుల ఆధారంగా పన్నుల పెంపు, సవరణ ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పేదలపై పన్నుల భారం పడకుండా, సంపన్న, వ్యాపార వర్గాలను లక్ష్యంగా ఎంచుకొని కొంత మేర పన్నులు పెంచడం తప్పనిసరని అసెంబ్లీ సమావేశాలకు ముందు నిర్వహించిన కేబినెట్ భేటీలో తీర్మానించినట్లు సమాచారం. పెంచక తప్పని పరిస్థితి.. గత ఏడాది ఆదాయ వ్యయాల స్థితిగతుల్లోని డొల్లతనం ఈ సారి బడ్జెట్ తయారీ సమయంలో బయటపడింది. దీంతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. కేంద్రం నుంచి ఆశించినన్ని నిధులు రాకపోవటం, తెలంగాణను ఆర్థిక సంఘం మిగులు రాష్ట్రంగా గుర్తించటం, అదనంగా రుణ పరిమితి పెరగకపోవటం, గత ఏడాది భూముల అమ్మకంపై ఆశించిన ఆదాయం రాకపోవటం వంటి అంశాల నేపథ్యంలో రాష్ట్ర సర్కారు ఇరకాటంలో పడింది. మిగులు రాష్ట్రమని సంబురపడాలో, అంచనాలకు తగినట్లుగా ఆదాయం లేదని చింతించాలో తెలియని సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది. గాడిలో పెట్టాల్సిందే.. ఆదాయం తెచ్చే మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యయాన్ని నియంత్రించే చర్యలు చేపడితే తప్ప రాష్ట్ర ఆర్థిక పురోగతి గాడిలో పడే పరిస్థితి లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే సర్కారును అప్రమత్తం చేసింది. దీంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పది నెలల వ్యవధిలోనే ఆశల పల్లకీ నుంచి దిగివచ్చి, ఆర్థిక వ్యవహారాల్లో వాస్తవాలను గుర్తించింది. ఆదాయం తెచ్చి పెట్టాల్సిన విభాగాలు ఆశించిన లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై ఇటీవల వివిధ శాఖలతో చర్చల సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల విభాగం ద్వారా 2014-15లో మొత్తం రూ. 27,777 కోట్ల ఆదాయం వస్తుందని గత బడ్జెట్లో ప్రభుత్వం అంచనా వేసింది. కానీ జనవరి నెలాఖరు వరకు కేవలం రూ. 18,500 కోట్ల ఆదాయం వచ్చింది. ఫిబ్రవరి, మార్చి రెండు నెలల వ్యవధిలో కనీసం మరో రూ. 6,000 కోట్లు ఆదాయం రాబట్టాలని ఆర్థిక శాఖ సూచించింది. ఈ లెక్కన చూసినా మొత్తంగా రూ. 24,000 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. భారీ అంచనా ‘మోత’కేనా? సర్కారు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా వచ్చే ఏడాది రూ. 39,000 కోట్ల ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది వాస్తవ రాబడి అయిన 24,000 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు రూ. 15 వేల కోట్లు ఎక్కువ. సాధారణ వృద్ధి రేటు ప్రకారం ఏటా పది నుంచి ఇరవై శాతం వరకు పన్నుల ఆదాయం పెరుగుతుందనేది వాణిజ్య పన్నుల శాఖ అంచనా. ప్రభుత్వం ఎంచుకున్న ఆదాయ లక్ష్యాన్ని చూస్తే.. సాధారణంగా పెరిగేది పోను మరో రూ. 8 వేల కోట్లు అదనంగా సంపాదించాలనేది సర్కారు ధ్యేయంగా కనిపిస్తోంది. -
పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యత
చర్చలతో జలవివాదాల పరిష్కారానికి టీ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలపై పొరుగు రాష్ట్రాలతో మరింత సఖ్యతతో మెలగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వివాదం నెలకొన్న ప్రాజెక్టుల పరిధిలో సర్దుబాటు ధోరణితో వ్యవహరించి, భవిష్యత్ బంధాలు పటిష్టం చేసుకునే దిశగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటి విడుదల విషయంలో ఏపీతో తలెత్తిన వివాదంతోపాటు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్రతో జరిపిన చర్చలు ఫలప్రదమైన నేపథ్యంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు విషయంలో ఛత్తీస్‌గఢ్‌తోనూ, పాలమూరు ఎత్తిపోతల, జూరాల-పాకాల ప్రాజెక్టుల విషయంలో కర్ణాటకతోనూ చర్చించి సయోధ్య చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏపీ, తెలంగాణ జల జగడం కొలిక్కి..: తెలంగాణ, ఏపీల మధ్య 3 నెలలుగా నలిగిన కృష్ణా నదీ జలాల వివాదం ఇటీవల చర్చల ద్వారానే కొలిక్కి వచ్చింది. వాస్తవ వాటాలను మించి అదనంగా 43 టీఎంసీల మేర నీటిని ఏపీ వినియోగించుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలనే ఉద్దేశంతో కృష్ణాలోని 63 టీఎంసీల లభ్యత నీటిని అవసరాల మేరకు పంచుకునేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించడం తెలిసిందే. అలాగే ప్రాణహిత-చేవెళ్ల, లెండి, పెన్‌గంగల విషయంలో మహారాష్ట్రతోనూ సర్కారు ఇదే ధోరణితో వ్యవహరించింది. ప్రాణహిత బ్యారేజీ ఎత్తు పెంపుతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూ ప్రాంతానికి ఆ రాష్ట్ర చట్టాలకు లోబడి నష్టపరిహారం చెల్లించడంతోపాటు పెన్‌గంగ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రయోజనాలకు కట్టుబడి పనులను ముందుకు తీసుకెళ్లే తదితర అంశాలపై జరిపిన చర్చలు ఫలవంతం అయ్యాయి. త్వరలోనే కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లతో చర్చలు: ఇచ్చంపల్లిపై ఇప్పటికే మహారాష్ట్రతో చర్చలు ప్రారంభించిన రాష్ట్రం త్వరలోనే దీనిపై ఛత్తీస్‌గఢ్‌తోనూ చర్చలు జరుపాలనే నిర్ణయానికి వచ్చింది. గతంలో జరిగిన ఒప్పందాలు, ఉన్నత స్థాయి కమిటీ, కేంద్ర జల సంఘం సూచన మేరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టు ఎత్తును 112.77 మీటర్ల నుంచి 95 మీటర్లకు తగ్గించుకునేందుకు సమ్మతిస్తున్నందున ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ను కోరాలని రాష్ట్రం నిశ్చయించింది. ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీరు: తుంగభద్ర నది నుంచి రాజోలిండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) ద్వారా మహబూబ్‌నగర్‌కు సాగునీరు అందించే కాల్వల మరమ్మతు పనులు వేగిరం చేయడం, జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల పథకాలకు ఆల్మట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే అవకాశాలపై కర్ణాటకతో సంప్రదింపులు జరపాలన్నది ప్రభుత్వ యోచనగా ఉంది. -
'ఓటమి పాలవుతామనే ఎన్నికలకు వెనుకంజ'
హైదరాబాద్:కోర్టులు తప్పుబడుతున్నా తెలంగాణ సర్కారు సర్కారు తీరులో మార్పు రావడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ఓటమి పాలవుతామనే ఆందోళనతో కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికలకు వెనుకాడుతుందని ఎద్దేవా చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన తెలిపారు. దీంతో పాటు పెండింగ్ లో ఉన్న ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లకు కూడా ఎన్నికలు జరపాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను ఉన్న పళంగా బర్తరఫ్ చేసిన సర్కారు.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే రాజీనామాను ఎందుకు ఆమోదించడం లేదని సంపత్ కుమార్ ప్రశ్నించారు. -
జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం
-
జీహెచ్ఎంసీ ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఇప్పటికే జరగాల్సి ఉండగా తెలంగాణ సర్కారు ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టింది. ఎప్పటిలోగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థల ఎన్నికల పట్ల నిర్లక్ష్యం తగదని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై దాఖలైన పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలని టీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. -
‘షాదీ’.. పరేషానీ
‘షాదీ హోగయేతో...బోజ్ ఉతర్ జాయేగా’ పేదింట ఆడపిల్ల పెళ్లి... నెత్తి మీద భారమే. ఖార్కానాల్లో...సైకిల్ పంక్ఛర్ దుకాణాల్లో రోజు కూలీతో గుట్టుగా సంసారం వెళ్లదీసుకునే నిరుపేద ముస్లింల పరిస్థితి మరీ అధ్వాన్నం. ఎదిగిన ఆడపిల్లకు సంబంధాలు తీసుకురాలేక, అరబ్ షేక్‌లకు ‘నిఖా’ చేసి పంపుతున్న సంఘటనలు ఇటీవల అనేకం వెలుగులోకి వచ్చాయి. అందువల్లే సీఎం కేసీఆర్ నిరుపేద ముస్లింల కోసం కోసం అందించిన అద్భుత వరం ‘షాదీ ముబారక్’. కానీ అధికారుల అలసత్వం, కుల ధ్రువీకరణ పత్రం, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు ‘షాదీ’కి అడ్డం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిరుపేద ముస్లిం యువతు ల వివాహం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకానికి ఇప్పటి వరకు జిల్లాలో 148 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2014-15 సంవత్సరానికి గాను మైనార్టీ కార్పొరేషన్ కింద సామూహిక వివాహాలు చేసేందుకు కోసం 6.51 లక్షల నిధులు విడుదల కాగా, ఈ నిధుల నుంచే ముగ్గురు ‘షాదీ ముబారక్ లబ్ధిదారులను ఎంపిక చేసి.. ఒక్కొక్కరికి రూ.51 వేల చొప్పున పంపిణీ చేశారు. వాస్తవానికి నిరుపేదలైన మైనార్టీలకు ఈ పథకం పెద్ద ఊరటనిచ్చింది. అందుకే దళిత, గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన ‘కల్యాణ లక్ష్మి’ పథకం కంటే షాదీ ముబారక్ పథకానికేఎక్కువ స్పందన లభించింది. పథకం నిబంధనల మేరకు వివాహానికి 15 రోజులు ముందుగానే డబ్బులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ, నిఖా జరిగి నెలలు గడిచినా నిధులు ఇంతవరకూ మంజూరు కాలేదు. దరఖాస్తులో సగమే పరిశీలన షాదీముబారక్ పథకానికి జిల్లాలో148 మంది దరఖాస్తు చేసుకుంటే అధికారులు ప్రాథమిక పరిశీలనలో 65 దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ధ్రువీకరణ పత్రాలు (డాక్యుమెంటేషన్) సరిగా లేవనే కారణంతో మిగిలిన వాటిని పక్కన పెట్టారు. ఈ 65 దరఖాస్తుల్లోనూ 41 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. వారికి పథకం ముంజూరు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. మంజూరు సర్టిఫికెట్ ఇచ్చిన 41 మంది లబ్ధిదారుల్లోని 17 మందికి సంబంధించిన డబ్బును మాత్రమే జిల్లా కోశాధికారి కార్యాలయానికి పంపారు. కానీ జనవరి 13వ తేదీ వరకు ఏ ఒక్కరి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. సమస్యగా మారిన కుల ధ్రువీకరణ పత్రం రెవెన్యూ చట్టం ప్రకారం షేక్‌లకు బీసీ-ఈ సర్టిఫికెట్, పఠాన్లు, సయ్యద్‌లకు ఓసీ సర్టిఫికెట్లు జారీ చేయాల్సి ఉంటుంది. అయితే పఠాన్లను, షేక్‌లను సయ్యద్‌లను గుర్తించడం కష్టంతో కూడుకున్న పని కావడంతో కుల ధ్రువీకరణ పత్రాల జారీలో తహశీల్దార్లకు కొన్ని ఇబ్బందులు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్ని ముస్లిం మైనార్టీలు మంత్రి హరీష్‌రావు దృష్టికి, తహశీల్దార్లు జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా దృష్టికి తీసుకెళ్లారు. సమస్య నుంచి తక్షణం గట్టెక్కడం కోసం కమ్యూనిటీ పత్రాలు జారీ చేయాలని సూచించారు. అంటే షాదీ ముబారక్ పథకం కోసం కుల ధ్రువీకరణ పత్రం కావాలనుకున్న వారికి ధ్రువీకరణ పత్రంలో ఓసీ, బీసీ-ఈ అనే వర్గీకరణ లేకుండా కేవలం ముస్లిం మైనార్టీ అని మాత్రమే ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని సూచించారు. అయితే కలెక్టర్ సూచించినట్టుగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. కానీ ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి తహశీల్దార్లు వెనుకంజ వేస్తున్నారు. రెండు, మూడు రోజుల్లో డీడీలు అందిస్తాం డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడంతో 83 దరఖాస్తులు పక్కన పెట్టాం. మరో 24 దరఖాస్తులు అధికారుల పరిశీలనలోనే ఉన్నాయి. షాదీ ముబారక్ లబ్ధిదారులకు రెండు రోజుల్లో డీడీలు అందిస్తాం. ఇప్పటికే 17 మంది లబ్ధిదారుల డబ్బును ట్రెజరీకి జమ చేశాం, కానీ ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలె త్తడంతో వారి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. -మధు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి, -
తీరనున్న గూడు గోడు
సాక్షి, సంగారెడ్డి: ఇందిరమ్మ గృహనిర్మాణ లబ్ధిదారులపై ప్రభుత్వం ఎట్టకేలకు కరుణ చూపింది. సుమారు ఏడాదికాలంగా నిలిచిన ఇందిరమ్మ బిల్లులను చెల్లించేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావటంతో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. అయితే ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉండగానే సాధారణ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. ఎన్నికల అనంతరం కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం గూడులేని పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ఇందిరమ్మ లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. ఇందిరమ్మ బిల్లులు చెల్లించి తమను ఆదుకోవాలంటూ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను కోరుతూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇందిరమ్మ బిల్లుల చెల్లింపులపై గత ఆరుమాసాలుగా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తాజాగా ప్రభుత్వం ఇందిరమ్మ లబ్ధిదారులపై ఇక్కట్లు గమనించి బిల్లుల చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది. దశలవారీగా బిల్లుల చెల్లింపులు సర్కార్ తాజా నిర్ణయంతో అధికారులు ఇందిరమ్మ బిల్లుల చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇందిరమ్మ, ఇతర పథకాల ఎంపికైన ఇళ్లను గుర్తించే పనిని హౌసింగ్ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం గ్రామాల వారీగా సర్వే పనులు ప్రారంభించారు. హౌసింగ్ డీఈల ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వద్దకు వెళ్లి వారు నిర్మించిన ఇళ్లు ఏ దశలో ఉన్నాయో రికార్డు చేయనున్నారు. బేస్మెంట్, లింటల్ లెవల్, రూఫ్‌లెవల్ ఇలా వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలను గుర్తించి దశల వారీగా లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయనున్నారు. 49వేల ఇళ్లకు బిల్లులు చెల్లించే అవకాశం జిల్లాలో 49 వేలకు పైగా ఇందిరమ్మ ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. అధికారులు ఆయా ఇళ్ల నిర్మాణం పనులకు సంబంధించి సర్వే జరిపి దశల వారిగా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించనున్నారు. జిల్లాకు 2,38,122 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. వీటిలో 1,88,440 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, 49,682 ఇళ్ల నిర్మాణం పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ప్రస్తుతం హౌసింగ్ అధికారులు 49,682 గృహాలను సర్వే చేసి దాని ఆధారంగా బిల్లులు చెల్లించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందిరమ్మ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ. లక్ష, బీసీ లబ్ధిదారులకు రూ.70 వేలు చెల్లిస్తారు. దీంతో ప్రస్తుతం వివిధదశల్లో 49 వేల ఇళ్లకు సుమారు రూ.300 కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి వస్తుందని అంచనా. అనర్హులుగా తేలితే ఇళ్లు రద్దు? ఇందిరమ్మ గృహ నిర్మాణం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఇప్పటికే చర్యలు తీసుకున్న సర్కార్, ఇళ్ల బిల్లుల చెల్లింపుకోసం చేపట్టనున్న సర్వేలో సైతం లబ్ధిదారులు అనర్హులుగా తేలిన పక్షంలో ఇంటిని రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. -
కల్యాణ ‘లక్షి’ ఏదీ?
డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా.. సామాన్యుడి ఆవేదన చెందినా అధికారులు మాత్రం ఏమాత్రం లెక్కచేయడం లేదు. అందువల్లే సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యా ణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలు జిల్లా దయనీయంగా ఉంది. పథకం ప్రారంభించి మూడు నెలలైనా జిల్లాలో ఏ ఒక్కరూ లబ్ధిపొందలేకపోయారంటే మన అధికారుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. * జిల్లాలో అమలుకాని పథకం * అయోమయంలో దరఖాస్తుదారులు * డిప్యూటీ స్పీకర్ ఆగ్రహించినా స్పందించని అధికారులు ‘నలుగురు నిరుపేద ముస్లింల దరఖాస్తులను నేనే స్వయంగా నింపాను..పెళ్లికి నెల రోజుల ముందే వాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. పెళ్లి రోజు నాటికి పథకం డబ్బు అందేలా చూడాలని జేఏసీ మూర్తికి నేను ఫోన్ చేసి మరీ చెప్పాను. పెళ్లి అయిపోయింది కానీ పథకం సర్కార్ సాయం మాత్రం అందలేదు. తీరా నేను వచ్చి చూస్తే దరఖాస్తుల వివరాలను కూడా రికార్డుల్లో పొందుపరచలేదు. మీరు (అధికారులు) అనుసరిస్తున్న తీరు ఆందోళనకరం’ -నవంబర్ 15న సంక్షేమ పథకాల సమీక్షలో అధికారులపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఆగ్రహం ‘‘సర్కార్ పైసలిస్తుందన్న ధీమాతో అప్పుజేసి పిల్ల పెండ్లి జేసిన. రోజులు గడుస్తుండటంతో అప్పులొళ్లు రోజూ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేనుకూడా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా, నా ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది. సర్కారు పెట్టిన కల్యాణ లక్ష్మి వెక్కిరిస్తోంది’’ ‘కల్యాణ లక్ష్మి’కి దరఖాస్తు చేసుకున్న దుబ్బాక మండలం చెల్లాపూర్‌కు చెందిన పరశురాములు ఆవేదన ఇది సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలంగాణ సర్కార్ కల్యాణ ‘లక్ష్మి’ పథకం ప్రారంభించి మూడు మాసాలు కావొస్తున్నా ఇంకా బాలారిష్టాలు మాత్రం దాటలేదు. ఎస్సీ, ఎస్టీ, యువతులకు వివాహాలకు ఆర్థిక తోడ్పాటుకు ‘కల్యాణ లక్ష్మి’, మైనార్టీ యువతుల కోసం షాదీ కోసం ‘షాదీముబారక్’ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. రూ. 10 కోట్లు బడ్జెట్లో ప్రవేశపెట్టి, అక్టోబర్ 21న ఉత్తర్వులు జారీ చేసినా.. జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్కరికి కూడా పథకం అందలేదు. డబ్బులొస్తాయన్న నమ్మకంతోనే కానుకలు ఇచ్చేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం... ఇంతవరకూ సర్కార్ సాయం అందకపోవడంతో బంగారు తల్లులకు మెట్టినింట్లో తిప్పలు తప్పడం లేదు. దీంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా, అధికారులు నుంచి ‘రేపు రాపో... మాపు రాపో’ అన్న సమాధానం తప్ప మరొక్కటి రావటం లేదని వినోద ఆవేదన వ్యక్తం చేశారు. షాదీముబారక్ పథకం కింద 117 మంది, కల్యాణ లక్ష్మి పథకం కింద 11 మంది గిరిజన మహిళలు, 25 దళిత యువతులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 90 శాతంపెళ్లిళ్లు కూడా జరిగిపోయాయి. కానీ పథకం కింద అందాల్సిన సొమ్ములు మాత్రం ఇంతవరకు అందలేదు. జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా ఇటీవల విలేకరులతో మాట్లాడుతూ, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. కానీ ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. వరం ఊరిస్తోంది... నిజానికి పేద కుటుంబాలకు రూ.51 వేల ఆర్థిక సహాయం అనేది పెద్ద వరం. వధువు తల్లిదండ్రులు ఇప్పుడు పెళ్లి పనుల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కూడా ఓ ముఖ్య తంతుగా పెట్టుకున్నారు. ప్రభుత్వం కోరినట్టు నెల రోజుల ముందుగానే అన్ని ఆధారాలతో, అధికారులు కోరిన సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటున్నారు. కానీ పెళ్లి ముగిసిపోయి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు పథకం మాత్రం అందకపోవడం గమనార్హం. ఇటీవలే కూతురు పెళ్లి చేసిన జహీరాబాద్ మండలం గౌసాబాద్ తండాకు చెందిన జాబిబాయి, తిస్రాం పవార్ల దంపతులను పలకరిస్తే...‘పథకం ఉంటదని టీవీ చేప్తే బిడ్డ పెళ్లి పెట్టుకున్న. రూ.51 వేలు సిన్న మాట కాదు. 2014 డిసెంబర్ 3న లగ్గం పెట్టుకున్నాం. నా బిడ్డపేరు అంజన. అల్లుని పేరు మిథున్ రాథోడ్. ఆయనది బీదర్ దగ్గర చించోళి తాలూకా సూర్యానాయక్ తాండ. పెండ్లికి నెల ముందే దరఖాస్తు చేసినం...పెండ్లి అయిపోయి నెల దాటుతోంది. డబ్బులు మాత్రం రాలేదు. రూ.2 లక్షలకు పైగా అప్పుజేసిన. నా బిడ్డ పెండ్లికి నేను అప్పు చేసుకున్న కానీ ప్రభుత్వం చెప్పినట్టు రూ. 51 వేలు ఇస్తే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అయినట్టు ఉండేది’. అని చెప్పారు. మంజూరితోనే సరి.... కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో రెండు గిరిజన కుటుంబాలు కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. సీతారాం తండాకు చెందిన ధర్మవ్వ తన కూతురు రమావత్ మీన వివాహం గత డిసెంబర్ 18న చేసింది. నవంబర్ నెలలో కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రం ఇచ్చారు. డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని అధికారులు చెప్పారట. ఎకౌంట్ తీసి 20 రోజులు దాటినా ఇప్పటి వరకు డబ్బులు మాత్రం జమ కాలేదంటోంది ధర్మవ్వ. ఇదే గ్రామ పంచాయతీ పరిధిలోని చందర్‌తండాలో నాన్గోత్ బద్య, మంగమ్మకు ఇద్దరు కూతుళ్లు. అందులో మొదటి కూతురు మంజూలకు డిసెంబర్ 12న పెళ్లి చేశారు. నానా తంటాలు పడి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి వివాహానికి 15 రోజుల ముందే పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 31న పథకం మంజూరు పత్రాలను అందజేసిన అధికారులు డబ్బు మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇంటి లక్ష్మి వెళ్లిపోయింది.. దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెందిన వనమ కనకవ్వ, పరుశురాములు ఏకైక కూతురు చంద్రకళ. చంద్రకళను చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన సుల్తాన్ మల్లయ్య కుమారుడు కనకరాజుకిచ్చి డిసెంబర్ 17న వివాహం జరిపించారు. నవంబర్ మాసంలోనే పరుశురాములు తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. పథకం మీద నమ్మకంతో అయినోళ్ల దగ్గర డబ్బు చేబదులు తీసుకొచ్చి పెళ్లి తంతు ముగించారు. కానీ ఇంతవరకూ పరుశురాములు సర్కార్ సాయం అందలేదు. గజ్వేల్‌లోనూ గదే తీరు గజ్వేల్...సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం. అందుకే ఇప్పుడు ఉన్నత, అత్యున్నత స్థాయి అధికార గణం అంతా గజ్వేల్ నియోజకవర్గంలోనే చెక్కర్లు కొడుతోంది. కనీసం ఇక్కడైనా పథకం అమలు తీరు అద్భుతంగా ఉంటుందేమోనని పరిశీలిస్తే... అక్కడ కూడా ఇదే పరిస్థితి. నియోజకవర్గంలోని గజ్వేల్ మండలంలో కల్యాణ లక్ష్మి పథకానికి 2, షాదీ ముబారక్ పథకానికి మరో రెండు, తూప్రాన్‌లోనూ రెండు పథకాలకు రెండు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. ములుగులో రెండు పథకాలకు కలుపుకొని 11, వర్గల్లో రెండు, జగదేవ్‌పూర్ మండలంలో మూడు దరఖాస్తులు మాత్రమే అందాయి. జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడప గ్రామంలో కల్యాణ లక్ష్మి పథకం అమలు తీరుపై పరిశీలన జరపగా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలనే నిబంధన ఎన్నో ఇబ్బందులు పడ్డామని గ్రామానికి చెందిన బొమ్మల లింగయ్య తెలిపారు. సంక్రాంతి తర్వాత పెళ్లి చేయాలనుకుంటున్నా...ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది అధికారులు చెప్పలేదని లింగయ్య వాపోయాడు. చేబర్తి గ్రామానికి తెడ్డు కిష్టయ్య,కిష్టమ్మ దంపతులు కూతురు అరుణ పెండ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. డిసెంబర్ 12న ఆరుణ పెళ్లి చేసినా, ఇంత వరకు డబ్బులు రాలేదని చెప్పారు. ‘‘అప్పులు జేసి పెండ్లి జేసినం.. సర్కార్ సాయం అందుతదనుకుంటే ఇంకా అందకపాయే’’ అంటూ లింగయ్య అందోళన చెందారు. -
'కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయింది'
హైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ సర్కారు గొప్పలకు పోయే రూ. లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. బడ్జెట్ ను భారీగా ప్రవేశపెట్టినా.. ఇప్పటి వరకూ విడుదల చేసింది మాత్రం రూ.21 వేల కోట్లేనని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. వచ్చే మూడు నెలల కాలంలో మిగిలిన రూ. 80 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తార్ కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో నిధులకు కోత పెట్టే అవకాశం ఉందని షబ్బీర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులున్నా.. ఇంకా కరువు మండలాలను ప్రకటించలేదన్నారు. -
కనిష్ట స్థాయికి చేరిన నీటిమట్టం
శ్రీశైలం ప్రాజెక్టు : శ్రీశైల జలాశయంలో నీటిమట్టం శనివారం సాయంత్రానికి కనిష్ట స్థాయికి (854 అడుగులకు) చేరింది. జలాశయంలో నీటినిల్వలు తరిగిపోతున్నప్పటికీ తెలంగాణ సర్కార్ శనివారం వరకు విద్యుత్ ఉత్పాదన చేపట్టింది. రాయలసీమ ప్రాంతంలోని ఎస్ఆర్బీసీ, తెలుగుగంగ తదితర ప్రాంతాల నుంచి వివిధ కాల్వలకు నీటిని సరఫరా చేయాలంటే శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 854 అడుగుల కనీస నీటిమట్టాన్ని శ్రీశైలంలో ఉంచాలని రైతులు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. శుక్రవారం నుంచి శనివారం వరకు తెలంగాణ జెన్కో జలాశయంలోని 9,863 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని 5.061 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 700 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజలస్రవంతికి 1350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. డిమాండ్‌ను అనుసరించి శనివారం ఉదయం తెలంగాణ జెన్కో 3 గంటల పాటు రెండు జనరేటర్లతో విద్యుత్ ఉత్పాదన చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జలాశయంలో 89.2900 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్‌లో నీటిమట్టం రాయలసీమ వ్యవసాయ అవసరాల కనిష్టస్థాయి నీటిమట్టం 854 అడుగులకు చేరింది. -
పకడ్బందీగా సర్వే చేయండి
సంగారెడ్డి డివిజన్ : తెలంగాణ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈనెల 19న నిర్వహించనున్న ఇంటింటి సర్వేలో మెతుకుసీమను అగ్రస్థానంలో నిలబెట్టాలని మంత్రి హరీష్‌రావు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. సర్వే పేరుతో పింఛన్లు, ఇళ్లు రద్దు చేస్తారంటూ కొంతమంది గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని, సర్వే వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. సర్వేను విజయవంతం చేసి అధికారులు, ప్రజాప్రతినిధులు విష ప్రచారాన్ని తిప్పికొట్టాలన్నారు. ఉద్యోగం, విద్య కోసం విదేశాలకు వెళ్లిన వారి పాస్‌పోర్టు జిరాక్స్ పత్రులు తీసుకుని వారి వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించారు. శనివారం సంగారెడ్డిలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటింటి సర్వేపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్‌చార్జికలెక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన సదస్సులో మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రాజమణి, ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, సర్వే సందర్భంగా ఉత్తమ ఫలితాలను కనబర్చే అధికారులను సీఎం చేతుల మీదుగా సత్కరిస్తామన్నారు. ముగ్గురు ఉత్తమ అధికారులను ఎంపిక చేసి వారికి రూ.10వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. సర్వేలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేశంలో మరెక్కడా నిర్వహించని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్ల కాలంలో చేపట్టాల్సిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటే స్పష్టమైన సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిన అవసరం ఉందన్నారు. దీనికితోడు అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు దరి చేరాలంటే కుటుంబాల వివరాలు ఉండాలన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఈ నెల 19నఇంటింటి సర్వేకు శ్రీకారం చుడుతున్నట్లు వివరించారు. సర్వే రోజున ప్రజలంతా ఇళ్లలోనే ఉండి తమ వద్దకు వచ్చే ఎన్యుమరేటర్లకు కుటుంబ వివరాలను సమగ్రంగా తెలియజేయాలన్నారు. సర్వే జరిగే రోజున తాను కూడా ఇంట్లోనే ఉంటానని, వివరాల సేకరణ పూర్తయ్యాక ఉద్యోగుల వెన్నంటి ఉంటానని తెలిపారు. సర్వే జరిగే రోజున వైన్స్ దుకాణాలను మూసివేసే అంశంపై సీఎంతో మాట్లాడతానని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరవేయాలన్న ఉద్దేశంతోనే ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 32 మందితో సర్వే: ఇన్చార్జి కలెక్టర్ శరత్ జిల్లాలోని 8.25 లక్షల కుటుంబాలను సర్వే చేసేందుకు 32 వేల మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు వివరించారు. నిబంధనలకు అనుగుణంగా సర్వే చేయాలని, ఉద్యోగులు ఎక్కడైనా పొరపాట్లు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విదేశాల్లో పూర్తిస్థాయిలో స్థిరపడిన వారి వివరాలను సేకరించాల్సిన అవసరం లేదన్నారు. ఉపాధి, విద్య కోసం విదేశాలకు వెళ్లిన వివరాలను నమోదు చేసుకోవాలన్నారు. 19న నిర్వహించనున్న సర్వేకు ముందు 17న ప్రీ సర్వే ఉంటుందని అధికారులు, ఎన్యుమరేటర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. సర్వే నిర్వహించే 19వ తేదీన పరిశ్రమలకు సెలవు ప్రకటించాలని యాజమాన్యాలకు సూచించినట్లు చెప్పారు. అనంతరం డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి సర్వే నిర్వహించాల్సిన తీరు, పాటించాల్సిన నిబంధన ల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి సర్వే ఫాం ఎలా పూర్తి చేయాలో ఉద్యోగులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సదస్సులో భాగంగా మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి ఇంటింటి సర్వే పోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే సర్వేపై ప్రచారం కోసం ఏర్పాటు చేసిన ప్రచార రథాలను మంత్రి హరీష్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. సదస్సులో టీఎన్జీఓ అధ్యక్షులు రాజేందర్, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకాలు
మోర్తాడ్ : కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కార్ నిర్వాకం వల్ల దాదాపు పది నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న భూ యజమానులకు ఊరట లభించింది. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో జారీ కాకుండా ఉన్న ‘ఈ’ పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ల స్థానంలో సాధారణ (మాన్యువల్) పద్ధతిలోనే పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా... వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వీరికి 45 రోజుల వ్యవధి తర్వాత తహశీల్దార్ కార్యాలయం ద్వారా పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీచేస్తారు. గతంలో సాధారణ పద్ధతిలోనే పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్లు జారీ అయ్యేవి. అయితే సాధారణ పద్ధతి ద్వారా బోగస్ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్లు జారీ అవుతున్నాయని భావించిన ప్రభుత్వం, బోగస్ పత్రాల జారీకి చెక్ పెట్టడం కోసం ఈ టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూ యజమానులకు ఆన్లైన్ ద్వారానే పట్టా పాసుపుస్తకాలు, టైటిల్ డీడ్లను జారీ చేయాలని భావించింది. ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాలను ప్రచురించి ఆన్లైన్ ద్వారా జారీ చేయడానికి ఒక కార్పొరేట్ సంస్థకు కిరణ్ సర్కార్ కాంట్రాక్టు ఇచ్చింది. కాంట్రాక్టు తీసుకున్న కార్పొరేట్ సంస్థ సాంకేతిక సమస్యలను పరిష్కరించడంలో దృష్టిసారించలేదు. 2013 ఆగస్టులో కిరణ్ సర్కార్ ఈ పాసు పుస్తకాలు, టైటిల్ డీడ్ల జారీకి నిర్ణయం తీసుకుంది. కాగా ఇదే సంవత్సరం అక్టోబర్ నుంచి ఆన్లైన్ పట్టా పాసుపుస్తకాలు జారీ అయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఆన్లైన్లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారికి ఇంత వరకు ఈ టైటిల్ డీడ్, ఈ పట్టా పాసుపుస్తకాల జారీ కాలేదు. దీనిపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, నిజమైన హక్కు పట్టా పాసుపుస్తకం, టైటిల్ డీడ్ జారీతోనే లభిస్తుంది. నెలల తరబడి పట్టా పాసుపుస్తకాల జారీ నిలచిపోవడంతో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగివేసారి పోయారు. దీనిపై రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు ప్రభుత్వంకు స్పష్టం చేయడంతో సాధారణ పద్ధతిలోనే టైటిల్ డీడ్, పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా పహాణీ, ప్రొసిడింగ్‌లను మాత్రం ఆన్లైన్ విధానంలో జారీ చేయాలని నిర్ణయించారు. దాదాపు 10 నెలలుగా నిలిచిన టైటిల్ డీడ్, పట్టా పాసుపుస్తకాలను మాన్యువల్ పద్ధతిలో జారీ చేయడానికి రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులకు పెద్ద బాధ తప్పింది. -
తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాజెక్టుల అనుమతుల విషయంలో పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఫుల్స్టాప్ పెట్టేలా తెలంగాణ సర్కార్ ప్రత్యేక వెబ్‌సైట్‌ను త్వరలో పరిచయం చేయనుంది. కంపెనీ, పెట్టుబడి, ఉపాధి వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనను వెబ్సైట్ ద్వారా పంపిస్తే చాలు. సీఎం కార్యాలయంలోని ఛేజింగ్ సెల్ ఈ దరఖాస్తును పరిశీలించి కంపెనీ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానిస్తుంది. విశ్వసనీయ ప్రతిపాదన అయితే రెండు వారాల్లో అన్ని అనుమతులను ప్రభుత్వమే దగ్గరుండి చూసుకుంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే తిరిగి కంపెనీ ప్రతినిధులను పిలిచి అనుమతి పత్రాలను అందజేస్తుంది. ఈ వ్యవహారాన్నంతా తానే స్వయంగా పర్యవేక్షిస్తానని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు తెలిపారు. కొత్త పారిశ్రామిక విధానం రూపకల్పనపై చేస్తున్న కసరత్తులో భాగంగా మంగళవారమిక్కడ పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా టెన్నిస్ క్రీడాకారిని సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించారు. రూ.1 కోటి చెక్కు, నియామక పత్రాన్ని ఆమెకు అందజేశారు. సానియా ప్రపంచ నంబర్ 1 ర్యాంకుకు ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. చిన్న పరిశ్రమలకు.. సీఎం సమావేశంలో 45 పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు హాజరై పలు సూచనలు చేశారు. వ్యాట్ ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రీన్ కేటగిరీ కిందకు వచ్చే కంపెనీలు అనుమతుల కోసం ఇక నుంచి పీసీబీకి దరఖాస్తు చేసే అవసరం లేదని ప్రకటించారు. పరిశ్రమలకు రావాల్సిన రూ.700 కోట్ల సబ్సిడీలో కొంతైనా విడుదలకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాటన్‌తోపాటు మరో పరిశ్రమ నుంచి పీక్ అవర్ పెనాల్టీ సుమారు రూ.50 కోట్లను ప్రస్తుతానికి వసూలు చేయొద్దని అధికారులకు ఆదేశించారు. కాగా, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి సీఎం ఏమన్నారంటే.. ప్రతి అంగుళం స్థలం..: తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 20 లక్షల ఎకరాలు సాగుకు పనికిరాదు. దీన్ని పరిశ్రమలకు మల్చవచ్చు. వెంటనే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన 3 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇందులో అధికభాగం హైదరాబాద్‌కు 110 కిలోమీటర్ల పరిధిలో ఉంది. భారీగా స్థలం తీసుకుని కార్యకలాపాలు ప్రారంభించని కంపెనీలు చాలానే ఉన్నాయి. ఇక నుంచి ఒక్క అంగుళం కూడా వృథాగా పోకూడదు. కంపెనీ కోసం నిపుణులను ఎక్కడి నుంచి తెచ్చుకున్నా స్థానికులక ఉపాధి కల్పించండి. ప్లగ్ అండ్ ప్లే ..: తయారీ రంగంలో చైనా అంతర్జాతీయ స్థాయిలో దూసుకెళ్తోంది. అక్కడి మాదిరిగా తెలంగాణలోనూ ప్లగ్ అండ్ ప్లే మౌలిక వసతులను కల్పిస్తాం. పారిశ్రామికవేత్త 25-36 అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అందుకే కాలుష్య నియంత్రణ మండలి మినహా అన్ని అనుమతులను ఒకేచోట ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సింగపూర్‌ను మించిన అసలైన సింగిల్ విండో విధానం రానుంది. పరిశ్రమలకు 10% నీటిని కేటాయిస్తాం. ఇప్పటికే ఉన్న కంపెనీలను దృఢపరుస్తాం. మరో హైదరాబాద్..: రియల్ ఎస్టేట్ హైదరాబాద్‌లో పెద్ద పరిశ్రమ. పరిశ్రమలను ప్రోత్సహిస్తే ఇప్పుడున్న హైదరాబాద్‌కు మరో హైదరాబాద్ తోడవుతుంది. జనాభా 2 కోట్లను మించిపోతుంది. పారిశ్రామిక ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు రియల్ ఎస్టేట్ ప్రతినిధులతో మాట్లాడతాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్‌కు ఉపక్రమించాం. నాగరికత, ప్రశాంత వాతావరణం కోసం హైదరాబాద్ నగరాన్ని క్రమబద్దీకరించాల్సిందే. తెలంగాణ బాగుపడాలి..: తెలంగాణ రాష్ట్రం బాగుపడాలన్నది నా ఆశ. బీసీ, ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే వీరికి తోడ్పాటు అందించనుంది. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ(డిక్కీ) నుంచి 100 మంది పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. వీరికి రూ.100 కోట్లవరకూ సహాయం చేసేందుకు రెడీ. ఫీజు రీఇంబర్స్మెంట్ పెద్ద మోసం.. ఫీజు రీఇంబర్స్మెంట్ పెద్ద మోసం. పిల్లలు లేకున్నా బ్రోకర్లను ప్రోత్సహించి రీఇంబర్స్మెంట్ మొత్తాలను కొన్ని కళాశాలలు ప్రభుత్వం నుంచి తీసుకున్నాయి. పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు రావాలంటే మన పిల్లల్లో నైపుణ్యం ఉండాలి. వసతులు లేని కళాశాలల్లో చదవడం వల్లే పిల్లల్లో నైపుణ్యం లోపించిందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు పారిశ్రామిక సంఘాల సూచనలు ఇవీ.. కేసీఆర్ సమావేశంలో పారిశ్రామిక ప్రతినిధులు పలు సూచనలు చేశారు. స్టార్టప్‌లకు ప్రోత్సహించాలని నాస్కామ్ వైస్ చైర్మన్, సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి కోరారు. ఎలక్ట్రానిక్స్ తయారీలో అపార అవకాశాలున్నాయని, క్లస్టర్లకు పూర్తి సహకారం అందించాలన్నారు. కొత్త కంపెనీలే 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. తెలంగాణకు మీరే బ్రాండ్ అంబాసిడర్ అంటూ కేసీఆర్‌ను ఉద్ధేశించి అన్నారు. వ్యాపారానికి అనువైన, నిపుణులకు నెలవైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సీఐఐ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ సురేష్ చిట్టూరి కోరారు. మౌలిక సదుపాయాలపై పెద్ద ఎత్తున వ్యయం చేయాలన్నారు. ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ చైర్ పర్సన్, అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రంగాలను వృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం నుంచి సీడ్ ఫండ్ సమకూర్చాలని విన్నవించారు. పన్ను విధానాల్లో సంస్కరణలు తేవాలని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శివ్‌కుమార్ రుంగ్టా సూచించారు. రాయితీలు కాదని, తాము కోరేది పెద్ద కంపెనీలతో అనుసంధానమని డిక్కీ ప్రతినిధి నర్రా రవి కుమార్ పేర్కొన్నారు. ఫార్మా కంపెనీలకు పీసీబీ పెద్ద సమస్యగా పరిణమించిందని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ ప్రెసిడెంట్, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ఎఫ్‌ఎస్‌ఎంఈ ప్రెసిడెంట్ ఏపీకే రెడ్డి మాట్లాడుతూ కంపెనీల రుణాలను పునర్వ్యవస్థీకరించాలని కోరారు. సూక్ష్మ, చిన్నతరహా కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ కార్యదర్శి గోపాల్ రావు పేర్కొన్నారు. మహిళలకు తగు ప్రోత్సాహం ఇచ్చేలా పారిశ్రామిక విధానం ఉండాలని కోవె ప్రెసిడెంట్ సౌదామిని సీఎంను కోరారు. ఎస్ఎల్బీసీ సమావేశంలో సూక్ష్మ, చిన్న కంపెనీల సమస్యలపై చర్చించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ స్మాల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు సీఎంకు విన్నవించారు.