‘మూసీ’ కోసం ఏం చేస్తున్నారో చెప్పండి
♦ తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం
♦ తదుపరి విచారణ 21వ తేదీకివాయిదా
♦ కేంద్రాన్ని ప్రతివాదిగా చేర్చాలని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నిర్వహణ, సుందరీకరణకు ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారో వివరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సబర్మతీ నదిలా మూసీ నదిని శుభ్రపరిచి, నది నిర్వహణకు ఓ సంస్థను ఏర్పాటు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, మూసీ నది ప్రక్షాళన మొదటిదశ కార్యక్రమం విఫలమైందని తెలిపారు. కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. అయితే ఇప్పటి వరకు ఎటువంటి కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన దాఖలాలేమీ లేవన్నారు. మూసీ ప్రక్షాళనకు అయ్యే వ్యయంలో 70 శాతం నిధులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చిందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, మూసీ నది శుభ్రత జరుగుతోందా? అని ఆరా తీసింది. ఇటీవలే మంత్రి కె.తారకరామారావు సుందరీకరణ పనుల నిమిత్తం మూసీ నదిని పరిశీలించారని, ఈ మేరకు పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
రూ. 50 కోట్లతో హైకోర్టు ఎదుట మూసీ నదిలో రబ్బర్ డ్యామ్‌ను నిర్మించారని, దీని వల్ల ఎటువంటి ఉపయోగం లేదని ఆమె వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఇకపై మూసీ నిర్వహణ, సుందరీకరణను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేసింది.మూసీ నది నిర్వహణ, సుందరీకరణ కోసం ఏం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారో వివరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.