ఇంటింటా ఇంటర్నెట్! | telangana sarkar moves to free internet | Sakshi
Sakshi News home page

ఇంటింటా ఇంటర్నెట్!

Published Wed, Apr 29 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM

ఇంటింటా ఇంటర్నెట్!

ఇంటింటా ఇంటర్నెట్!

రాష్ట్రవ్యాప్తంగా 78 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్
 వాటర్‌గ్రిడ్ పైపులతో పాటే భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు
 భారీగా తగ్గిపోనున్న వ్యయం.. రూ. 507 కోట్లతోనే పూర్తి
 అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సర్కారు సంప్రదింపులు
 ‘డిజిటల్ ఇండియా’తో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం
 భారీగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు
 నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న కేటీఆర్
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఇంటింటికీ ఉచితంగా ఇంటర్‌నెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటర్ గ్రిడ్ పథకంతో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. అదే బాటలో డిజిటల్ రాష్ట్రాన్ని సాకారం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీన్ని రాష్ర్టవ్యాప్తంగా విస్తరించే ందుకు, మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్‌నెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్‌నెట్ సేవలను విస్తరించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని డిజిటల్ తెలంగాణను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ఏర్పాటుపై పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ర్టవ్యాప్తంగా భూగర్భంలో వేసే పైపులతో పాటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చాలని సర్కారు యోచిస్తోంది. దీనివల్ల లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా ఆదా కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్‌నెట్ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
 
 రూ.2,600 కోట్లు ఆదా..
 
 డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రతి మీటరుకు రూ.465 ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో మీటర్ కేబుల్ ధర రూ.65 కాగా, భూగర్భంలో కేబుల్ వేసేందుకు(తవ్వకానికి) మీటరుకు  రూ.400 ఖర్చవుతుం ది. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలంటే సుమారు 78 వేల కి.మీ. మేర భూగర్భం లో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్రం అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది. అయితే ఇప్పటికే చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం కోసం రాష్ర్టవ్యాప్తంగా విస్తృతంగా పైప్‌లైన్లు వేయాలి. ఇందుకోసం తవ్వుతున్న లైన్లలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. దీంతో తవ్వకానికయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు ఆదా అవుతాయి. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్‌నెట్‌ను అందించవచ్చునని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు.
 
 నీటి సరఫరా నియంత్రణ కూడా..
 
 వాటర్‌గ్రిడ్ పైపులైన్లతో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ కేబుళ్లను కూడా అమర్చడం ద్వారా నీటి సరఫరా నియంత్రణకు వీలు కలుగుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం చెబుతోంది. స్కాడా(సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) టెక్నాలజీ ద్వారా నీటి సరఫరాపై పర్యవేక్షణతో పాటు నీటి చౌర్యాన్ని కూడా అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున నీటిని ఇవ్వాలన్న పరిమితి పెడితే.. స్కాడా టెక్నాలజీ ద్వారా ప్రతి కుటుంబం పరిమితికి మించి నీటిని తీసుకోకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఇంటేక్ వెల్స్ నుంచి సరఫరా ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు వస్తున్న నీరు, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా జిల్లాలకు, పట్టణాలకు, గ్రామాలకు, పరిశ్రమలకు సరఫరా అవుతున్న నీటిని ఎప్పటికప్పుడు లెక్కగట్టవచ్చు. అలాగే ఇంటింటికీ ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తే దూరవిద్య విధానం ప్రజలకు మరింత చేరువకానుంది. ఆన్‌లైన్ సేవలు కూడా విస్తృతమవుతాయి.
 
 నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్
 
 కేంద్రం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటుకై నిధులు రాబట్టేందుకు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. వాటర్‌గ్రిడ్‌తో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులను రాబట్టడమే కేటీఆర్ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement