Free Internet
-
ఎలాన్ మస్క్‌పై టంగ్ స్లిపయ్యాడు.. ఆ వెంటనే ఊహించని షాక్!
ప్రపంచ కుబేరుడు స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది సంచలనంగా మారుతుంది. అంతేనా ఆయన ట్వీట్లు కూడా నెట్టింట హల్ చేస్తుంటాయి. తాజాగా మస్క్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపడం గురించి ఇటీవల ఆయన చేసిన ట్వీట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు మస్క్‌ను తప్పుబట్టారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాయబారి ఆండ్రిజ్ మెల్నిక్ కూడా ఈ విషయంలో కాస్త నోటి దురుసును చూపించారు. అయితే ఈ వ్యాఖ్యలు అనంతరం ఆయన దేశానికి ఫ్రీ ఇంటర్నెట్ లేకుండా చేసిందని అనిపిస్తోంది. అసలు ఏం జరిగింది.. అనూహ్య పరిణామాల మధ్య ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఉక్రెయిన్‌కు ఉచితంగా ఇంటర్నెట్ ఇస్తూ అండగా నిలిచిన మస్క్‌పై ఇటీవల దుర్భాషలాడారు ఆండ్రిజ్ మెల్నిక్. దీని తర్వాత పరిణామంలో.. ఇకపై ఉక్రెయిన్‌కు స్టార్‌లింక్ ఉచిత ఇంటర్నెట్ ఇవ్వడంపై మస్క్ నిర్ణయం తీసుకున్నారు. ఫ్రీగా కొనసాగాలంటే మీరు ఫండింగ్ ఇవ్వండని ఆమెరికా ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. దీనికి సంబంధించి మస్క్ పెంటాగాన్కి ఓ ట్వీట్ చేశాడు. అందులో స్టార్‌లింక్ సర్వీస్ కోసం ఇకపై చెల్లింపు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. అదే ట్వీట్లో ఇలా కూడా ఉంది. మెల్నిక్ సూచించినదే తాను చేస్తున్నానని చెప్పారు మస్క్. ఖర్చు ఏక్కువైంది.. పేమెంట్ చేయగలరు! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ సేవలు పనిచేయాలంటే ఇప్పుడు దాదాపు $120 మిలియన్లు చెల్లించాలని స్పేస్ఎక్స్ తాజాగా పెంటగాన్‌ను కోరుతోంది. దీంతో పాటు, వచ్చే ఏడాదికి సంబంధించిన చెల్లింపులను కూడా కంపెనీ ముందుగానే కోరినట్లు సమాచారం. 2023కి పెంటగాన్ $400 మిలియన్లు చెల్లించాల్సి ఉంటుందని తమ అంచనాను కూడా ప్రభుత్వం ముందు ఉంచింది. ఉక్రెయిన్‌కు ఉచిత సేవలందించేందుకు స్టార్‌లింక్ టెర్మినల్స్‌పై స్పేస్ఎక్స్ $80 మిలియన్లు ఖర్చు చేసిందని, ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 100 మిలియన్ డాలర్లకు చేరుతుందని మస్క్ గతంలో ట్విట్టర్లో వెల్లడించారు. చదవండి: ఇది ఊహించలేదు.. యూజర్లకు భారీ షాకిచ్చిన జియో! -
Hyderabad: మెట్రో రైల్ ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని మెట్రో రైల్ ప్రయాణికులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. గురువారం అత్యధిక జనసాంద్రత కలిగిన మెట్రో స్టేషన్లతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ట్రైన్స్ అన్నింటా షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కనెక్టివిటీ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇంటర్నెట్కు వెన్నెముకగా నిలిచే హైపర్ లోకస్ ఎడ్జ్ క్లౌడ్ ఆధారిత సాంకేతికత రూపశిల్పి షుగర్ బాక్స్ నెట్వర్క్స్ ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌తో భాగస్వామ్యం చేసుకుని డిజిటల్ కనెక్టివిటీని మరింతగా మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలో దేశంలోనే తొలి ప్రజా రవాణా వ్యవస్థగా హైదరాబాద్ మెట్రో రైల్ తమ ప్రయాణికులకు కంటెంట్‌ను ఉచితంగా డౌన్లోడ్, స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా అందిస్తుంది. దీంతో వినోదం, విద్య, ఈ– కామర్స్, ఫిన్‌టెక్ విభాగాలలో కంటెంట్‌ను పొందవచ్చు. విమానాలలో ఏ విధంగా అయితే సేవలు లభ్యమవుతాయో అదే రీతిలో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల నగరంలో షుగర్ బాక్స్ నెట్వర్క్స్ నిర్వహించిన అధ్యయనంలో మెట్రో రైల్ ప్రయాణికులు ప్రయాణ సమయాన్ని దాదాపు 60 నిమిషాలు తమ ఫోన్లలోనే గడుపుతున్నట్టు వెల్లడైంది. నేపథ్యంలో షుగర్ బాక్స్ యాప్ ప్రయాణ సమయంలో రెండవ అత్యంత ప్రాధాన్యతా యాప్‌గా నిలిచింది. (చదవండి: ఐఐటీ హైదరాబాద్.. నియామకాల్లో జోరు) ప్రయాణికులకు వారి ప్రయాణ సమయంలో సౌకర్యవంతమైన సేవలను అందించగలుగుతున్నామని షుగర్ బాక్స్ నెట్వర్క్స్ కో ఫౌండర్, సీఈవో రోహిత్ పరాంజపీ చెప్పారు. హైదరాబాద్ స్మార్ట్ నగరంలో ఈ తరహా సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఓ అద్భుతమైన ఉదాహరణగా నిలుస్తుందని ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ, సీఈఓ కేవీబీరెడ్డి తెలిపారు. (చదవండి: అ‘ధర’హో.. గజం రూ.1.01 లక్షలు) -
ఇంటింటికీ ఇంటర్నెట్
ఉట్నూర్(ఖానాపూర్): రాబోయే రోజుల్లో జిల్లాలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2022 నాటికి టీ–ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైట్ ఆఫ్ వే అనుమతులు ఇవ్వడంతో ప్రతి ఇంటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు మమ్మురం చేసింది. ఆయా ప్రాంతాల్లో టీఫైబర్ ఏర్పాటు చేసే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పీవోపీ)లకు ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణాల కోసం ఉచితంగా స్థలం కేటాయించనుంది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఆధునిక సాంకేతికత అభివృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ గ్రీడ్ ద్వారా ఇంటింటా ఇంటర్నెట్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ కేబుల్ వేయనున్నారు. కేబుల్ వేసే బాధ్యతలను ఎల్అండ్టీ, స్టెరిలైట్ టెక్పాలజీస్ లిమిటెడ్‌లకు టెండర్ల ద్వారా అప్పగించారు. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలు కేబుల్స్‌ను భూగర్భం(అండర్ గ్రౌండ్)లో, స్తంబాల (ఏరియల్) ద్వారా విస్తరించనున్నారు. అవసరమైనచోట మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా వేసిన హై డెన్సిటీ పాలిఇథైలిన్ పైపుల ద్వారా కేబుల్ వేయనున్నారు. ఫైబర్ కేబుల్స్ పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనుంది. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్ ఆఫ్‌వే ఆదేశాలు జారీచేసింది. మొదట గ్రామ పంచాయతీలకు.. జిల్లాలో 18 మండలాలు, 468 గ్రామపంచాయతీలు, 508 రెవెన్యూ గ్రామాలు, 2,02,954 నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్లైన్లతో పాటు ఇంటర్నెట్కు సంబంధించిన ఫైబర్ కేబుల్ పైపులైన్ వేశారు. మొదటి విడతలో అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపిండ్ యార్డులు, నర్సరీలు, హరిత వనం, తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ పనులకు సంబందించిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పొందుపర్చాల్సి ఉంది. అదీకాక గ్రామాల్లో జనన, మరణ వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్లైన్ సేవలు అత్యవసరం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేక పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని మండల పరిషత్ కార్యాలయాలకు పంపిస్తే కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్లైన్లో రికార్డు చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అటు తర్వాత నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టింది. ఆదేశాలు రాగానే చర్యలు జీపీలకు ఇంటర్నెట్ సౌకర్యంపై పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే తగిన చర్యలు చేపడుతాం. ఇంటర్నెట్ వసతుల కల్పనకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉంటుంది. టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో కిందిస్థాయి నుంచి అధికారులు నిర్వహించే విధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఆన్లైన్ పనులు వేగంగా జరుగుతాయి. – శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి -
ఏడాది పాటు ఫ్రీ ఇంటర్నెట్ తో ఆ ఫోన్ విక్రయం
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ 2(2017) స్మార్ట్ ఫోన్... గతవారం హెడ్ లైన్స్ లో ఒకటిగా నిలిచింది. డేటా వాడకం పెరుగుతున్న తరుణంలో తమ ఫోన్ కొంటే ఏడాది పాటు ఉచితంగా ఎయిర్ టెల్ ఇంటర్నెట్ అందిస్తామంటూ మైక్రోమ్యాక్స్ ప్రకటించడంతో స్మార్ట్ ఫోన్ అభిమానులంతా ఈ ఫోన్ ఎప్పుడెప్పుడు విక్రయానికి వస్తుందా అని ఆసక్తి చూపారు. అద్భుతమైన బంపర్ ఆఫర్లతో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ నేటి నుంచే విక్రయానికి వస్తోంది. భారత్ లోని అన్ని రిటైల్ అవుట్ లెట్లలో బుధవారం నుంచి ఈ ఫోన్ విక్రయించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొంది. ఉచిత ఇంటర్నెట్ తో పాటు ఎయిర్ టెల్ నుంచి ఎయిర్ టెల్ కు ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్ ను కూడా ఫ్రీ అందించనున్నట్టు మైక్రోమ్యాక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎయిర్ టెల్ 4జీ సిమ్ కార్డు ప్రీలోడెడ్ తో ఇది మార్కెట్లోకి వస్తోంది. గురువారం లాంచ్ అయిన ఈ ఫోన్ ధర 11,999 రూపాయలు. ఈ ధరలో కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5ను ఆఫర్ చేయడం ఈ ఫోన్ కు ప్రత్యేక ఆకర్షణ. ఏడాదిలో స్క్రీన్ రీప్లేస్ మెంట్ ప్రామిస్ ను మైక్రోమ్యాక్స్ ఆఫర్ చేస్తోంది. డ్యూయల్ సిమ్ కాన్వాస్ 2 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో రన్ అవుతుంది. 5 అంగుళాల డిస్ ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 13 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, ఆటో ఫోకస్, 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 64జీబీ ఎక్స్ పాండబుల్ మెమరీ, 3050ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో మిగతా ఫీచర్లు. -
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
-
అందరికీ ఫ్రీ ఇంటర్నెట్ లక్ష్యం- గూగుల్
న్యూఢిల్లీ: భారత పర్యటనకు విచ్చేసిన ఇంటర్నెట్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చిన్న వ్యాపారస్తులకు ఆఫర్లను ప్రకటించారు. ఢిల్లీలో చిన్న మధ్య తరహా పరిశ్రమల సమావేశంలో బుధవారం పాల్గొన్న ఆయన గూగుల్ కంటే కూడా చిన్న వ్యాపారాల గురించి మాట్లాడానికి ఇక్కడికి వచ్చానని తెలిపారు. గూగుల్ ఆధ్వర్యంలో చిన్న వ్యాపారస్తులకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ సమాఖ్య కంపెనీ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న సుందర్ పిచాయి రాబో్యే మూడు సంవత్సరాలుగా భారతదేశంలో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్ లను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. భారతదేశ సమస్యల్ని అధిగమిస్తే ప్రపంచానికి పరిష్కారాలు చూపించినట్టేనని ఈ సందర్భంగా పిచాయ్ పేర్కొన్నారు. అందరికీ ఉచిత ఇంటర్నెట్ అందించడమే గూగుల్ లక్ష్యమన్నారు. దాదాపు ఇండియాలో దేశ వ్యాప్తంగా 100 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కృషిలో భాగంగా గడిచిన 18 ఏళ్ళలో మెజార్టీ ప్రజలకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పారు. ఇంటర్నెట్ ద్వారా ఏ వ్యాపారస్తుడైనా రిజిస్టర్ చేసుకొని శిక్షణ పొందొచ్చని తెలిపారు. అలాగే వారు ఉచితంగా సాధారణ వెబ్సైట్ సృష్టించుకోవచ్చన్నారు. దీనికోసం . వారు చేయవలసిందల్లా ఒక స్మార్ట్ ఫోన్ మరియు కొన్నినిమిషాల సమయాన్ని కేటాయింపు అని చెప్పారు. రిజిస్టర్ చేసుకున్న వారికి ఉచితంగా శిక్షణ సదుపాయాన్ని అందిస్తామని తెలిపారు. ముఖ్యాంశాలు చెన్నై లో చిన్నప్పుడు , నేను సమాచారం కోసం వెదుక్కున్నాను. నేడు చిన్న పిల్లవాడు వీలైనంత సమాచారాన్ని యాక్సెస్ చేయవచ్చు. భారతదేశం లో చాలా చిన్న వ్యాపారులు ఇంటర్నెట్ ప్రతి ఒక్కరిదీ అనుకోవాలి. కావాలనుకున్నవారందరికీ నాణ్యమైన డిజిటల్ శిక్షణ అందుబాటులో డిజిటల్ అన్‌లాక్ ప్రోగ్రామ్ గా దీన్ని పిలుస్తున్నాం. భారతదేశం లో 40 నగరాల్లో 5,000 వర్క్ షాప్స్ -
ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా వై-ఫై
తాము నడిపించే వోల్వో బస్సుల్లో ఉచితంగా వై-ఫై సేవలు అందించాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ అధికారులు శుక్రవారం తెలిపారు. ఎంపిక చేసిన రూట్లలో వెళ్లే ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఈ ఉచిత ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని అన్నారు. తొలిదశలో ఐదు బస్సులలో వై-ఫై సేవలు ప్రారంభించామని, రాబోయే 15 రోజుల్లో మరో 10 బస్సుల్లో కూడా ఇది వస్తుందని ఒక అధికారి చెప్పారు. ప్రస్తుతం లక్న్-ఢిల్లీ, లక్నో-బహరైచ్, లక్నో-అజ్మీర్ మార్గాలలో నడిచే బస్సులలో ఉచిత వై-ఫై ఉంది. ఇందుకోసం బస్సులలో ఒక డాంగిల్‌ను ఫిట్ చేస్తున్నారు. బస్సు సిబ్బంది అందించే పాస్వర్డ్ తీసుకుని ప్రయాణికులు తాము ప్రయాణం చేసినంత సేపు ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. -
ప్రపంచ రికార్డు నెలకొల్పిన జియో!
ఫ్రీ ఇంటర్నెట్ అంటూ రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మార్కెట్లో ప్రవేశపెట్టిన సిమ్ సర్వీస్ జియో. మార్కెట్లోకి విడుదల చేసిన కొన్ని రోజుల్లోనే జియో అంచనాలకు మించి యూజర్లను సంపాదించుకుంది. కేవలం నెలరోజుల్లోనే 16 మిలియన్ల(1.6 కోట్లు) మంది సబ్ స్క్రైబర్స్ (యూజర్లు)ను సొంతం చేసుకుని జియో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలో మరే ఇతర సిమ్ నెట్ వర్క్ కూడా ప్రవేశపెట్టిన నెలరోజుల్లో ఈ తరహాలో కస్టమర్లను నమోదు చేసుకోలేదు. ఫేస్ బుక్, వాట్సాప్, స్కైప్ లాంటి సోషల్ మీడియా నెట్ వర్క్స్ కూడా ఈ స్థాయిలో యూజర్లను తక్కువ సమయంలో నమోదు చేయలేకపోయాయని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ డాటా అందుబాటులోకి తీసుకురావడమే తమ ఉద్దేశమని ముఖేశ్ అంబానీ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుంచి భారీ స్పందన వచ్చిందని, కస్టమర్ల కోసం తాము అందిస్తున్న సేవలకు తగిన గుర్తింపు లభించిందని ఆయన హర్షం వ్యక్తంచేశారు. (చదవండీ: జియో.. యూజర్లకు పెద్ద తలనొప్పి!) జియో వెలకమ్ ఆఫర్ అంటూ మై జియో యాప్ ద్వారా ప్రోమోకోడ్ పొందిన కస్టమర్లు రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో జియో సిమ్స్ తీసుకోవచ్చు. డిసెంబర్ 31వరకూ వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, ఫ్రీ ఇంటర్ నెట్ బ్రౌజింగ్, డౌన్ లోడింగ్ సౌకర్యాలతో మార్కెట్లోకి వచ్చిన జియో సర్వీస్ కు కస్టమర్ల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. వాయిస్ కాల్స్ తో పాటు ఇతర సమస్యలు ఉన్నా జియోకు ఆదరణ మాత్రం తగ్గలేదు. ఆగస్టులోనే మార్కెట్లోకి ట్రయల్ వర్షన్ అంటూ జియో సిమ్ సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ముఖేష్ అంబానీ సెప్టెంబర్ 5నుంచి అధికారికంగా లాంచ్ చేశారు. 50 మిలియన్ల కస్టమర్లు లక్ష్యంగా పెట్టుకున్న జియో ప్రాజెక్టులో ఇప్పటికే 16 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతుంది. -
శాంసంగ్ యూజర్లకు జియో శుభవార్త!
న్యూఢిల్లీ : సంచలనం సృష్టిస్తున్న రిలయెన్స్ జియో ఆఫర్లు కేవలం లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే కాదట.. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కస్టమర్లు కూడా ఈ ఆఫర్లను పొందొచ్చట. రూ.200లతో సిమ్ కొనుకున్న వారికి 75జీబీ 4జీ డేటా.. 4500 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం వంటి ఊరించే ఆఫర్లతో ఈ ఆగస్టులోనే కమర్షియల్ గా వినియోగదారుల ముందుకు వచ్చేందుకు సిద్దమవుతున్న రిలయెన్స్ జియో, శాంసంగ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో జియో ప్రీవ్యూ ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ ను ఎంపికచేసుకునేలా శాంసంగ్ ఓనర్లకు రిలయెన్స్ అందుబాటులో ఉండనుంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే ఇప్పటివరకూ ఈ సిమ్ ఆఫర్ ప్రకటించిన రిలయెన్స్, మొదటిసారి ఒక స్మార్ట్ ఫోన్ తయారీదారితో తన భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఉచిత వాయిస్ సదుపాయంతో పాటు మూడు నెలల ఉచిత అన్ లిమిటెడ్ డేటా, ఎస్ఎమ్ఎస్ ఆఫర్లతో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ రిలయెన్స్ జియో సిమ్ ను పొందవచ్చు. అంతేకాక మూవీస్, బుక్స్, మ్యూజిక్ ను జియో యాప్స్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త శాంసంగ్ కస్టమర్లకూ.. ఈ ఆఫర్ తో కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మాత్రమేనని రిపోర్టులు తెలిపాయి. రిపోర్టుల ప్రకారం...శాంసంగ్ గెలాక్సీ ఏ5,ఏ7, ఏ8, నోట్ 4, నోట్ 5, నోట్ ఎడ్జ్, ఎస్6, ఎస్6 ఎడ్జ్, ఎస్6 ఎడ్జ్ ప్లస్, ఎస్7, ఎస్7 ఎడ్జ్ లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల యూజర్లు జియో ఆఫర్లను పొందాలనుకుంటే, మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియో కనెక్షన్ కోసం "గెట్ జియో సిమ్" ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ తో బార్ కోడ్ కలిగిన కూపన్ ను కస్టమర్లు పొందుతారు. చివరికి రిలయెన్స్ డిజిటల్ స్టోర్ లో ఫోన్ తో పాటు వెళ్లి, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ఈ సిమ్ ను తీసుకోవచ్చు. -
ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
- నెలాఖరుకు గ్రేటర్‌లోని 115 బస్సుల్లో అందుబాటులోకి - అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ - రెండు విడతలుగా గంట పాటు ఉచిత ఇంటర్నెట్ - రెండు రూట్లలో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన ఏసీ బస్సుల్లో పయనిస్తున్నారా.. అయితే ఇకపై మీరు వైఫై ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ను పొందవచ్చు. గంట పాటు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఆర్టీసీ మీకు కల్పించనుంది. అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్‌వర్క్‌తో కావలసిన డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో మాత్రమే ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించిన ఆర్టీసీ.. నగరంలో తిరుగుతున్న 115 ఏసీ బస్సులకు సైతం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, ఈసీఐఎల్ నుంచి వేవ్‌రాక్ వరకు నడిచే రెండు ఏసీ బస్సుల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏసీ బస్సులన్నింటికీ ఈ నెలాఖరు నాటికి ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. స్మార్ట్ఫోన్లు వినియోగించే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణించే సమయంలో అరగంట చొప్పున రెండు విడతలుగా 4జీ నెట్వర్క్ సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సుల్లో వైఫై రూటర్లను అమర్చనున్నారు. ప్రయాణికులు బస్సులోకి ప్రవేశించిన వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సిగ్నల్స్‌ను అందుకుంటారు. వైఫై సేవలను వినియోగించుకునేందుకు సిద్ధపడిన వారికి పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. మొదటి అరగంట ఉచితంగా నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలు ఆగిపోతాయి. మరో అరగంట కావాలనుకుంటే మరోసారి వైఫై నెట్వర్క్ ఓపెన్ చేయాలి లేదా తిరుగు ప్రయాణంలో మిగతా అరగంట వినియోగించుకోవచ్చు. ఐటీ వర్గాలకు ప్రయోజనం.. నగరంలోని ఉప్పల్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కోఠి, పటాన్చెరు, లింగంపల్లి, ఈసీఐఎల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్లకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్, జేఎన్టీయూ, పర్యాటక భవన్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోని 115 ఏసీ బస్సులకు ఈ ఉచిత వైఫైను అమలు చేస్తారు. దీనివల్ల నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ఐటీ నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. -
త్వరలో ఉచితంగా ఇంటర్నెట్!
న్యూఢిల్లీ: త్వరలో దేశమంతటా ఇంటర్నెట్ ఉచితంగా అందనుందా? తాజాగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) విడుదల చేసిన పత్రాల్లో ఈ విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది. గతంలో కొన్ని వెబ్ సైట్లను మాత్రమే ఉచితంగా అందించే విధంగా(ఫ్రీ బేసిక్స్) పద్ధతికి నో చెప్పిన ట్రాయ్ తాజాగా ఇచ్చిన స్టేట్ మెంట్ లో ఇంటర్నెట్ ను ఉచితంగా ఇచ్చే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. దీంతో ట్రాయ్ ను సంప్రదించిన కొన్ని కంపెనీలు వెబ్ సైట్ల నిర్వహణ సమస్యలను దృష్టికి తీసుకెళ్లారు. వీటిపై స్పందించిన ట్రాయ్ 'అండర్ కనెక్టెడ్' 'అన్ కనెక్ట్ డ్' ల కింద విభజించింది. వారికి ఏ రకమైన మోడల్ ను తీసుకోవాలో సూచనలను జూన్ 16లోగా ఈ-మెయిల్ చేయాలని తెలిపింది. ట్రాయ్ తాజాగా తీసుకున్న నిర్ణయంపై ఇంటర్నెట్ నిపుణుల హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
సర్కారు స్కూళ్లకు..... ఫ్రి ఇంటర్ నెట్
జిల్లాలో మలివిడతలో 75 పాఠశాలల ఎంపిక ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ పూర్తి పథకాల సమీక్షే ప్రధాన లక్ష్యం డీఈవో కార్యాలయంలో డేటా కార్డుల పంపిణీ విజయవాడ : అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం రెండో విడతలో జిల్లాలోని 75 పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటంతో పాటు విద్యార్థులకు ఇంటర్నెట్ వసతి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మానవ వనరుల శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ శిక్షణ (ఐసీటీ-5000) కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 150 పాఠశాలలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించారు. రెండో విడతలో ఐసీటీ-1300 కార్యక్రమంలో భాగంగా 75 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 3జీ సిమ్ కార్డులు, 3.6 ఎంబీపీస్ స్పీడ్ డేటా కార్డులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి జిల్లాలో ఎంపిక చేసిన 75 పాఠశాలలకు ఇంటర్నెట్ డేటా కార్డు, 3జీ సిమ్‌కార్డులు అందజేస్తున్నారు. విడతలవారీగా అన్ని పాఠశాలలకూ... జిల్లాలో 434 జెడ్పీ, విజయవాడ నగరంలో 28 కార్పొరేషన్ హైస్కూళ్లు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరంలో కలిపి మొత్తం 75 మున్సిపల్ హైస్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారుల అంచనాల ప్రకారం ఇప్పటికే అన్ని హైస్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దానిలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం విడతలవారీగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కల్పించనున్నట్లు చెబుతున్నారు. దీనిపై జిల్లాలోని టీచర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక్కొక్క టీచర్ ని ఎంపిక చేసి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్న కేంద్ర మానవ వనరుల విభాగం నేతృత్వంలో శిక్షణ చేపట్టారు. ఇంటర్నెట్ వాడకం, ఆన్లైన్లో రిపోర్టింగ్, మధ్యాహ్న భోజనం వివరాల అప్డేట్ చేయటం లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ మానిటరింగే కీలకం ప్రధానంగా ప్రభుత్వం పాఠశాలల్లో అమలుచేస్తున్న పథకాలను సమీక్షించటం కోసం ఇంటర్నెట్ను వినియోగించనున్నారు. దీనిలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రోజువారీ నివేదిక, స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం పర్యవేక్షణ, రిమోట్ ఎడ్యుకేషన్ పేరుతో కంప్యూటర్ క్లాసులు, ఆన్లైన్ క్లాసుల కోసం దీనిని వినియోగించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం పెంచటమనేది ప్రభుత్వ పాఠశాలలకు నిర్దేశించిన లక్ష్యం. ఈ క్రమంలో వార్షిక ప్లాన్‌తో ఉన్న కార్డులను అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో 75 పాఠశాలలకు గత నెల చివరి వారంలో డేటా కార్డులు అందజేశామని, అన్నింటిలో నెట్ వాడకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
టాక్సీలలో ఉచితంగా ఇంటర్నెట్!
ఉబెర్ క్యాబ్‌లలో వెళ్తున్నారా, అయితే ఇక మీ స్మార్ట్ఫోన్లలో ఉచితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఉబెర్ కంపెనీతో భారతి ఎయిర్టెల్ ఒక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఉచితంగా ఇంటర్నెట్ సేవలు పొందడంతో పాటు 'ఎయిర్టెల్ మనీ'ని ఉపయోగించి టాక్సీ చార్జీలు చెల్లించవచ్చు. ఈ విషయాన్ని ఉబెర్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ముందుగా ముంబై మహానగరంలో ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఎయిర్టెల్ 4జి అందించే హైస్పీడ్ ఇంటర్నెట్ను ఉబెర్ క్యాబ్‌లలో పూర్తి ఉచితంగా అందుకోవచ్చని తెలిపారు. త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ఉబెర్ క్యాబ్‌లలోనూ ఈ సదుపాయాన్ని కల్పిస్తారు. -
ఇంటింటా ఇంటర్నెట్!
రాష్ట్రవ్యాప్తంగా 78 వేల కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వాటర్‌గ్రిడ్ పైపులతో పాటే భూగర్భంలో కేబుల్స్ ఏర్పాటు భారీగా తగ్గిపోనున్న వ్యయం.. రూ. 507 కోట్లతోనే పూర్తి అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సర్కారు సంప్రదింపులు ‘డిజిటల్ ఇండియా’తో కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం భారీగా నిధులు రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం యత్నాలు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీకానున్న కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో ఇంటింటికీ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. వాటర్ గ్రిడ్ పథకంతో వచ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ప్రకటించిన సర్కారు.. అదే బాటలో డిజిటల్ రాష్ట్రాన్ని సాకారం చేయాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉచిత వైఫై సేవలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీన్ని రాష్ర్టవ్యాప్తంగా విస్తరించే ందుకు, మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సేవలను విస్తరించే బృహత్తర కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని డిజిటల్ తెలంగాణను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. ఇందుకోసం ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ఏర్పాటుపై పలు అంతర్జాతీయ ఐటీ సంస్థలతో సంప్రదింపులు కూడా మొదలయ్యాయి. వాటర్‌గ్రిడ్ కోసం రాష్ర్టవ్యాప్తంగా భూగర్భంలో వేసే పైపులతో పాటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను కూడా అమర్చాలని సర్కారు యోచిస్తోంది. దీనివల్ల లైన్ల తవ్వకానికి అయ్యే వ్యయం భారీగా ఆదా కానుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందరికీ ఉచితంగా కల్పించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.2,600 కోట్లు ఆదా.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుళ్ల ఏర్పాటుకు ప్రతి మీటరుకు రూ.465 ఖర్చవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఇందులో మీటర్ కేబుల్ ధర రూ.65 కాగా, భూగర్భంలో కేబుల్ వేసేందుకు(తవ్వకానికి) మీటరుకు రూ.400 ఖర్చవుతుం ది. రాష్ట్రంలో ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలంటే సుమారు 78 వేల కి.మీ. మేర భూగర్భం లో కేబుల్స్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం కేంద్రం అంచనా మేరకు దాదాపు రూ.3,120 కోట్లు ఖర్చు కానుంది. అయితే ఇప్పటికే చేపట్టిన వాటర్‌గ్రిడ్ పథకం కోసం రాష్ర్టవ్యాప్తంగా విస్తృతంగా పైప్లైన్లు వేయాలి. ఇందుకోసం తవ్వుతున్న లైన్లలోనే ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. దీంతో తవ్వకానికయ్యే ఖర్చు సుమారు రూ.2,613 కోట్లు ఆదా అవుతాయి. కేవలం రూ. 507 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ను అందించవచ్చునని ఐటీ విభాగం అధికారులు చెబుతున్నారు. నీటి సరఫరా నియంత్రణ కూడా.. వాటర్‌గ్రిడ్ పైపులైన్లతో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ కేబుళ్లను కూడా అమర్చడం ద్వారా నీటి సరఫరా నియంత్రణకు వీలు కలుగుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం చెబుతోంది. స్కాడా(సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్) టెక్నాలజీ ద్వారా నీటి సరఫరాపై పర్యవేక్షణతో పాటు నీటి చౌర్యాన్ని కూడా అరికట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రతి వ్యక్తికి 100 లీటర్ల చొప్పున నీటిని ఇవ్వాలన్న పరిమితి పెడితే.. స్కాడా టెక్నాలజీ ద్వారా ప్రతి కుటుంబం పరిమితికి మించి నీటిని తీసుకోకుండా ఎలక్ట్రానిక్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఇంటేక్ వెల్స్ నుంచి సరఫరా ట్రీట్మెంట్ ప్లాంట్లకు వస్తున్న నీరు, అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా జిల్లాలకు, పట్టణాలకు, గ్రామాలకు, పరిశ్రమలకు సరఫరా అవుతున్న నీటిని ఎప్పటికప్పుడు లెక్కగట్టవచ్చు. అలాగే ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి వస్తే దూరవిద్య విధానం ప్రజలకు మరింత చేరువకానుంది. ఆన్లైన్ సేవలు కూడా విస్తృతమవుతాయి. నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్ కేంద్రం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద రాష్ట్రంలో ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుకై నిధులు రాబట్టేందుకు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్‌తో కేటీఆర్ సమావేశం కానున్నారు. వాటర్‌గ్రిడ్‌తో పాటు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుపైనే ప్రధానంగా చర్చలు జరపనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రానికి వచ్చే నిధులను రాబట్టడమే కేటీఆర్ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. -
టీవీ సిగ్నళ్లతో వై-ఫై ఇంటర్నెట్!
ఇక మీదట ఇంటర్నెట్ మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి రానుంది. టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్వర్కులను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేఐటీలోని జర్మన్ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఉచితంగా అందుబాటులో ఉండే టీవీ సిగ్నళ్లను వై-ఫై సిగ్నళ్లు అందించడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. సాధారణంగా తక్కువ స్థాయిలో ఉండే టీవీ ఫ్రీక్వెన్సీలు గోడల్లాంటి అడ్డంకులను కూడా అధిగమించి వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి. దీనిద్వారా ఉచితంగా కమ్యూనికేషన్లను అందించవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది గనక పూర్తిగా సాధ్యమైతే, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు కూడా వైర్లెస్ ల్యాన్ అందుతుందని చెబుతున్నారు. పక్కన వీధిలో వెళ్తుండగా స్మార్ట్ఫోన్లు చేతిలో ఉంటే.. ఈ సిగ్నళ్లను హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిశోధన ఫలితంగా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఖరీదైన మొబైల్ కమ్యూనికేషన్ల గురించి బాధపడక్కర్లేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఆర్న్డ్ వెబర్ తెలిపారు. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న టీవీచానళ్ల ప్రసారాల ద్వారా ఈ సిగ్నల్స్‌ను అందించవచ్చని, లేదా వాటిని మొబైల్ టెలికం ప్రొవైడర్లకు అమ్ముకోవచ్చని ఆయన సూచించారు.