సర్కారు స్కూళ్లకు..... ఫ్రి ఇంటర్ నెట్
జిల్లాలో మలివిడతలో 75 పాఠశాలల ఎంపిక
ఉపాధ్యాయులకు ఒకరోజు శిక్షణ పూర్తి పథకాల సమీక్షే ప్రధాన లక్ష్యం
డీఈవో కార్యాలయంలో డేటా కార్డుల పంపిణీ
విజయవాడ : అన్ని ప్రభుత్వ హైస్కూళ్లలో ఉచిత ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం రెండో విడతలో జిల్లాలోని 75 పాఠశాలలను ఎంపిక చేసింది. విద్యా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవటంతో పాటు విద్యార్థులకు ఇంటర్‌నెట్ వసతి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర మానవ వనరుల శాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ఇంటిగ్రేటెడ్ కంప్యూటర్ శిక్షణ (ఐసీటీ-5000) కార్యక్రమంలో భాగంగా మొదటి విడతలో జిల్లాలో 150 పాఠశాలలకు ఇంటర్‌నెట్ సౌకర్యం కల్పించారు. రెండో విడతలో ఐసీటీ-1300 కార్యక్రమంలో భాగంగా 75 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం 3జీ సిమ్ కార్డులు, 3.6 ఎంబీపీస్ స్పీడ్ డేటా కార్డులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపారు. అక్కడి నుంచి జిల్లాలో ఎంపిక చేసిన 75 పాఠశాలలకు ఇంటర్‌నెట్ డేటా కార్డు, 3జీ సిమ్‌కార్డులు అందజేస్తున్నారు.
విడతలవారీగా అన్ని పాఠశాలలకూ...
జిల్లాలో 434 జెడ్పీ, విజయవాడ నగరంలో 28 కార్పొరేషన్ హైస్కూళ్లు ఉన్నాయి. మిగిలిన మున్సిపాలిటీలు, విజయవాడ నగరంలో కలిపి మొత్తం 75 మున్సిపల్ హైస్కూళ్లు ఉన్నాయి. జిల్లా విద్యాశాఖాధికారుల అంచనాల ప్రకారం ఇప్పటికే అన్ని హైస్కూళ్లలో కంప్యూటర్లు ఉన్నాయి. వాటిని పూర్తిస్థాయిలో వాడుకలోకి తీసుకురావాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. దానిలో భాగంగా అన్ని పాఠశాలల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం విడతలవారీగా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కల్పించనున్నట్లు చెబుతున్నారు. దీనిపై జిల్లాలోని టీచర్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని ఒక్కొక్క పాఠశాల నుంచి ఒక్కొక్క టీచర్ ని ఎంపిక చేసి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఉన్న కేంద్ర మానవ వనరుల విభాగం నేతృత్వంలో
శిక్షణ చేపట్టారు. ఇంటర్‌నెట్ వాడకం, ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్, మధ్యాహ్న భోజనం వివరాల అప్‌డేట్ చేయటం లాంటి అంశాల్లో ఈ శిక్షణ ఇచ్చారు.
ఆన్‌లైన్ మానిటరింగే కీలకం
ప్రధానంగా ప్రభుత్వం పాఠశాలల్లో అమలుచేస్తున్న పథకాలను సమీక్షించటం కోసం ఇంటర్‌నెట్‌ను వినియోగించనున్నారు. దీనిలో భాగంగా మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి రోజువారీ నివేదిక, స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టం పర్యవేక్షణ, రిమోట్ ఎడ్యుకేషన్ పేరుతో కంప్యూటర్ క్లాసులు, ఆన్‌లైన్ క్లాసుల కోసం దీనిని వినియోగించనున్నారు. తద్వారా విద్యార్థుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం పెంచటమనేది ప్రభుత్వ పాఠశాలలకు నిర్దేశించిన లక్ష్యం. ఈ క్రమంలో వార్షిక ప్లాన్‌తో ఉన్న కార్డులను అందజేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ జిల్లాలో 75 పాఠశాలలకు గత నెల చివరి వారంలో డేటా కార్డులు అందజేశామని, అన్నింటిలో నెట్ వాడకం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.