ఉట్నూర్(ఖానాపూర్): రాబోయే రోజుల్లో జిల్లాలో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. 2022 నాటికి టీ–ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం రైట్ ఆఫ్ వే అనుమతులు ఇవ్వడంతో ప్రతి ఇంటికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామ పంచాయతీకి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు మమ్మురం చేసింది. ఆయా ప్రాంతాల్లో టీఫైబర్ ఏర్పాటు చేసే పాయింట్ ఆఫ్ ప్రెసెన్స్(పీవోపీ)లకు ప్రభుత్వం కార్యాలయాల నిర్మాణాల కోసం ఉచితంగా స్థలం కేటాయించనుంది.
తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ద్వారా
ఆధునిక సాంకేతికత అభివృద్ధి, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యక్తి జీవితంలో ఇంటర్నెట్ సేవలు కీలకంగా మారాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ గ్రీడ్ ద్వారా ఇంటింటా ఇంటర్నెట్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా రాష్ట్ర హెడ్ క్వార్టర్ నుంచి జిల్లాలు, మండలాలు, గ్రామ పంచాయతీలు, గ్రామాలు, వ్యక్తిగత గృహాలు, ఇతర వ్యాపార సముదాయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఫైబర్ కేబుల్ వేయనున్నారు. కేబుల్ వేసే బాధ్యతలను ఎల్‌అండ్‌టీ, స్టెరిలైట్ టెక్పాలజీస్ లిమిటెడ్‌లకు టెండర్ల ద్వారా అప్పగించారు. ఈ పనులను 2022 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థలు కేబుల్స్‌ను భూగర్భం(అండర్ గ్రౌండ్)లో, స్తంబాల (ఏరియల్) ద్వారా విస్తరించనున్నారు. అవసరమైనచోట మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా వేసిన హై డెన్సిటీ పాలిఇథైలిన్ పైపుల ద్వారా కేబుల్ వేయనున్నారు. ఫైబర్ కేబుల్స్ పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఇవ్వనుంది. ఇందుకోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల నుంచి ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం రైట్ ఆఫ్‌వే ఆదేశాలు జారీచేసింది.
మొదట గ్రామ పంచాయతీలకు..
జిల్లాలో 18 మండలాలు, 468 గ్రామపంచాయతీలు, 508 రెవెన్యూ గ్రామాలు, 2,02,954 నివాస సముదాయాలు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్ భగీరథ పైప్‌లైన్‌లతో పాటు ఇంటర్నెట్‌కు సంబంధించిన ఫైబర్ కేబుల్ పైపులైన్ వేశారు. మొదటి విడతలో అన్ని గ్రామపంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభించింది. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపిండ్ యార్డులు, నర్సరీలు, హరిత వనం, తదితర అభివృద్ధి పనులను వేగవంతం చేసింది. ఈ పనులకు సంబందించిన నివేదికలను పంచాయతీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ ద్వారా పొందుపర్చాల్సి ఉంది. అదీకాక గ్రామాల్లో జనన, మరణ వివరాలు, ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం ఆన్‌లైన్ సేవలు అత్యవసరం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం సరిగాలేక పంచాయతీ కార్యదర్శులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని మండల పరిషత్ కార్యాలయాలకు పంపిస్తే కంప్యూటర్ ఆపరేటర్లు ఆన్‌లైన్‌లో రికార్డు చేస్తున్నారు. ఇన్ని ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం టీ ఫైబర్ ద్వారా మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాలకు అటు తర్వాత నివాసాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టింది.
ఆదేశాలు రాగానే చర్యలు
జీపీలకు ఇంటర్నెట్ సౌకర్యంపై పూర్తిస్థాయిలో ఆదేశాలు రాగానే తగిన చర్యలు చేపడుతాం. ఇంటర్నెట్ వసతుల కల్పనకు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో పనులు చేయాల్సి ఉంటుంది. టీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రభుత్వం ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో కిందిస్థాయి నుంచి అధికారులు నిర్వహించే విధుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ఆన్‌లైన్ పనులు వేగంగా జరుగుతాయి.
– శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి
Comments
Please login to add a commentAdd a comment