ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి | TSLPRB SI Hall Ticket 2022, PG Entrance, TS EAMCET 2022, Gurukul Admission | Sakshi
Sakshi News home page

ఎస్సై పరీక్ష.. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండి

Published Sat, Jul 30 2022 3:04 PM | Last Updated on Sat, Jul 30 2022 3:04 PM

TSLPRB SI Hall Ticket 2022, PG Entrance, TS EAMCET 2022, Gurukul Admission - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నేతృత్వంలో జరుగుతున్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్సై), తదితర సమాన పోస్టుల ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించి అభ్యర్థులు శనివారం నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 7, ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు జరిగే పరీక్ష కోసం ఆగస్టు 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని ఆయన వెల్లడించారు. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అభ్యర్థులు వారి ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అయి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ను ప్రింట్‌ తీసుకోవాలని ఫొటోతో పాటు సెంటర్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని 35 పట్టణ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు శ్రీనివాసరావు తెలిపారు. ప్రింట్‌ తీసుకున్న హాల్‌టికెట్‌ మొదటి పేజీలో ఎడమ భాగంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను అతికించాలని, అలా అతికించిన హాల్‌టికెట్‌తో వచ్చిన వారినే పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని స్పష్టంచేశారు. పరీక్ష నిబంధనలు ఏమాత్రం ఉల్లంఘించినా అభ్యర్థి పరీక్ష చెల్లదని హెచ్చరించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్‌–తెలుగు, ఇంగ్లిష్‌–ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంటుందని శ్రీనివాసరావు తెలిపారు.   

11 నుంచి పీజీ ‘ఎంట్రెన్స్‌’
ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11 నుంచి 22 వరకు ప్రవేశ పరీక్షలను నిర్వహించనున్నట్లు టీఎస్‌సీపీగేట్‌–2022 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండురంగారెడ్డి శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఎంఏ అరబిక్, కన్నడ, మరాఠీ, పర్షియన్, థియేటర్‌ ఆర్ట్స్‌ కోర్సులకు సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు తక్కువ వచ్చినందున నేరుగా ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. టైంటెబుల్, ఇతర వివరాలను ఉస్మానియా.ఏసీ.ఇన్‌ వెబ్‌సైట్లో చూడవచ్చు.   

గెస్ట్‌ లెక్చరర్ల వేతనం పెంపు 
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకుల వేతనాలను ప్రభుత్వం పెంచింది. దీంతో ఒక్కో అధ్యాకుడికి నెలకు రూ.6,480 అదనంగా లభి స్తుంది. ఈమేరకు ప్రభుత్వ కార్యదర్శి రోనాల్డ్‌ రోస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో 1,654 మంది గెస్ట్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటి వరకు ఒక్కో పీరియడ్‌కు రూ.300 చొప్పున, నెలకు 72 పీరియడ్లకు (గ రిష్టంగా) రూ.21,600 వేతనం వచ్చేది. ఇప్పు డు 30% పెంచడంతో పీరియడ్‌కు రూ.390 చొప్పున 72 పీరియడ్లకు రూ.28,080 రానుంది. ఈ పెంపును ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల గెస్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ నేతలు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్, ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి నేతలు మాచర్ల రామకృష్ణ, కొప్పిశెట్టి సురేశ్, పోలూరి మురళి స్వాగతించారు.  

గురుకుల ఐదో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు 
సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 1వ తేదీలోగా నిర్దేశించిన పాఠశాలలో రిపోర్టు చేయాలని గురుకుల సెట్‌ కన్వీనర్‌ రోనాల్డ్‌రాస్‌ శుక్రవా రం ప్రకటనలో కోరారు. ఈనెల 29వ తేదీతో రిపోర్ట్‌ చేయాలని ముందుగా గడువు విధించినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల వినతులను పరిగణించి గడువు తేదీని ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు ఆయన స్పష్టం చేశారు.  

31న సబ్‌ ఇంజనీర్‌ పోస్టులకు పరీక్ష 
సాక్షి, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) లో 201 సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి పరీక్షను ఈనెల 31న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు సంస్థ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు.  

నేడు, రేపు అగ్రి ఎంసెట్‌ 
సాక్షి, హైదరాబాద్‌: వర్షాల కారణంగా వాయి దాపడిన మెడికల్, అగ్రికల్చర్‌ ఎంసెట్‌ శని, ఆదివారాల్లో జరగనుంది. పరీక్షకు మొత్తం 94 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో 68, ఏపీలో 18.. మొత్తం 86 పరీక్ష కేంద్రాలను ఎంసెట్‌ కోసం ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రోజుకు 2 విభాగాలుగా జరుగుతుందని, ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక విడత, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు రెండో విడత ఉంటుందని ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్థన్‌ తెలిపారు. వాస్తవానికి ఈ ఎంసెట్‌ ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పరీక్షను ఒకరోజు ముందు వాయిదావేశారు. అగ్రికల్చర్‌ ఎంసెట్‌ ప్రశ్నపత్రం ‘కీ’ని రెండు రోజుల్లో విడుదల చేస్తామని కన్వీనర్‌ తెలిపారు. 

నేడు ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ‘కీ’విడుదల 
ఈ నెల 18 నుంచి 20 వరకూ జరిగిన ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ప్రశ్నపత్రం ‘కీ’ని శనివారం విడుదల చేస్తామని ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్ధన్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఆగస్టు రెండోవారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ విభాగాల ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement