
ఈ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి
గత ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 1.20 లక్షల దరఖాస్తులు
ఈ ఏడాది 40 వేలు తగ్గి.. 80 వేలకే పరిమితం
వసతుల లేమి, ఫుడ్ పాయిజన్ ఘటనలతో తగ్గుతున్న ఆదరణ
23న అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటుకోసం కనీసం నలుగురు విద్యార్థులు పోడిపడగా, ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావటం, వసతుల లేమి కారణంగా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు వారి తల్లిదండ్రులు ఆసక్తి చూప టం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గతేడాది డిసెంబర్‌లో విడుదల కాగా, గడువు ముగిసేనాటికి దాదాపు 80 వేల మందే దరఖాస్తు చేసుకున్నారు.
సీట్లు 51 వేలు.. దరఖాస్తులు 80 వేలు
రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలున్నాయి. ఇందులో నాలుగు సొసైటీలు సంక్షేమ శాఖలకు అనుబంధంగా కొనసాగుతుండగా.. జనరల్ సొసైటీ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉంది. ప్రస్తుతం టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్), తెలంగాణ గురు కుల విద్యాసంస్థల సొసైటీ (టీఆర్‌ఈఐఎస్)లు ఐదోతరగతికి ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి.
మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతోంది. మైనార్టీ సొసైటీలోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీల్లోని 643 పాఠశాలల్లో ఐదోతరగతిలో 51,924 సీట్లు ఉన్నా యి. వీటిలో ఐదోతరగతి ప్రవేశాలకు గతేడాది డిసెంబర్ 21 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేలలోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ.
ఈ నెల 23వ తేదీన అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీపడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.