
బస్సు టైర్లు.. పై నుంచి వెళ్లడంతో చిరిగిన జవాబు పత్రాల బ్యాగ్
ఖమ్మం బస్టాండులో బస్సు టైర్ల కింద పత్రాల పార్శిల్
సాక్షి, హైదరాబాద్/కారేపల్లి: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖద్వారంగా భావించే పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. అంతే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో శనివారం వెలుగు చూసిన ఘటన ఇందుకు అద్దం పడుతోంది..
ఏం జరిగిందంటే..: ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోమట్లగూడెం(గాం«దీనగర్)లోని హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 28న ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక జవాబు పత్రాలను కారేపల్లి పోస్టాఫీస్‌లో పార్శిల్ బుకింగ్ చేశారు. అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను మూడు పార్శిళ్లు చేసి బ్యాగులో సీల్ వేసి కారేపల్లి బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్ కండక్టర్‌కు అప్పగించారు. బస్సు ఖమ్మం పాత బస్టాండ్‌కు సాయంత్రం చేరుకుంది.
అక్కడి నుంచి ఆర్‌ఎంఎస్ (రైల్వే మెయిల్ సర్వీస్) క్యాంప్ ఆఫీస్‌కు పంపించి, ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరవేస్తారు. అయితే, శుక్రవారం సాయంత్రం జవాబుపత్రాల బ్యాగ్‌ను ఖమ్మం పాత బస్టాండ్‌లో బస్సు నుంచి కిందకి పడేయగా, డ్రైవర్ బస్సును కదిలించడంతో టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్లింది. దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్‌లో పరీక్ష రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు బయట పడ్డాయి. ఈ విషయం శనివారం బయటకురావడంతో కలకలం రేగింది.
జవాబు పత్రాలన్నీ భద్రం..
జవాబు పత్రాలు రోడ్డుపై పడిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో ఆర్‌ఎంఎస్ కార్యాలయానికి ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు, డీఈఓ సోమశేఖరశర్మ వెళ్లి ప్యాకేజీలను పరిశీలించారు. జవాబు పత్రాలన్నీ భద్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఈఓ తెలిపారు. ఇదే విషయమై కారేపల్లి పోస్ట్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మిబాయిని వివరణ కోరగా.. పార్సిల్ బుకింగ్ చేయడం, ప్యాకర్ ద్వారా బస్సులో వేయడమే తమ బాధ్యత అని చెప్పారు. ఖమ్మం బస్టాండ్‌లో ఆర్‌ఎంఎస్ వారికి బ్యాగ్ అప్పగించే వరకు కండక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోస్టల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఈ అంశంపై విద్యాశాఖకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ నివేదిక పంపారు.
మూడు గంటలు ఆలస్యంగా..
ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బయటకొచి్చన ఫొటోలను పరిశీలిస్తే బండిల్‌లోని పేపర్లు ఇప్పదీసి మళ్లీ పెట్టినట్టుగా ఉన్నాయి. ప్రతిరోజూ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ముగుస్తుంది. 1.30లకు జవాబు పత్రాలను పోస్టల్ శాఖకు అందజేయాలి. కారేపల్లి నుంచి ఖమ్మంకు రావడానికి గంట సమయం పడుతుంది. కానీ రాత్రి పొద్దుపోయాక ఖమ్మంకు జవాబు పత్రాలు వచి్చనట్టు తెలుస్తోంది. ఇంత ఆలస్యానికి కారణాలేంటి? ఈ ఒక్క కేంద్రమే కాదు.. జిల్లాలోని ప్రతీ పరీక్ష కేంద్రం నుంచి జవాబు పత్రాలు దాదాపు 3 గంటల ఆలస్యంగా వస్తున్నట్టు సమాచారం. ఆ మూడు గంటల్లో ఏం జరుగుతోంది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అన్ని కోణాల్లో దర్యాప్తు
ఘటనపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించాం. రవాణా వల్లే బండిల్ పగిలిందని కలెక్టర్ చెప్పారు. డీఈవో చేత విచారణ చేయిస్తున్నాం. ఎక్కడైనా అవకతవకలు జరిగాయా అన్న కోణంలోనూ విచారణ చేపట్టాలని ఆదేశించాం. పరీక్షలపై విశ్వాసం పెంచాల్సిన అవసరం ఉంది.
– ఈవీ నర్సింహా రెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్.