Tenth public examination
-
Telangana: త్వరలో టెన్త్ మోడల్ పేపర్
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన నేపథ్యంలో విద్యాశాఖ కొత్త మోడల్ పేపర్ వెలువరించనుంది. వీలైనంత త్వరగా దీన్ని విడుదల చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ముందుగా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చి, ఆ తర్వాత పాఠశాలలకు పంపుతామని అధికారులు తెలిపారు. వ్యాస రూప, సూక్ష్మ రూప ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు తెచ్చారు. అయితే కొద్దిరోజుల క్రితమే టెన్త్ సిలబస్, పరీక్ష విధానాన్ని వెల్లడించి మోడల్ పేపర్‌ను కూడా విడుదల చేసిన విద్యాశాఖ, ఇప్పుడు దీన్ని పూర్తిగా మార్చి కొత్తది విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. అదేవిధంగా పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులను తెలియజేసే బ్లూ ప్రింట్‌ను కూడా విడుదల చేయాల్సి ఉంటుంది. ఎస్సీఈఆర్టీ ఈ ప్రక్రియను చేపడుతుంది. త్వరలో పేపర్ రూపకల్పన వాస్తవానికి జనవరి మొదటి వారంలోనే ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టాల్సి ఉంది. దీని కోసం వివిధ ప్రాంతాల నుంచి సబ్జెక్టు నిపుణులను రప్పించి, అత్యంత గోప్యత పాటిస్తూ మొత్తం 12 సెట్ల ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. ఇందులోంచి మూడింటిని ఎంపిక చేస్తారు. అయితే పేపర్లో మార్పులు చేపట్టాల్సి ఉండటంతో ఈ ప్రక్రియ ఇంతవరకు చేపట్టలేదు. చాయిస్ పెంచడంతో పాటు వ్యాస రూప ప్రశ్నల సంఖ్యను కుదించడంతో ఈ మేరకు పేపర్ల రూపకల్పన చేపట్టనున్నారు. ఫిబ్రవరి కల్లా ముద్రణకు.. పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి జరగనున్నాయి. పరీక్షలకు ఎంపిక చేసే మూడు సెట్ల ప్రశ్నపత్రాలను ఫిబ్రవరి నెలాఖరుకల్లా ప్రింటింగ్‌కు పంపాలని అధికారులు భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత ప్రశ్నపత్రాల రూపకల్పన చేపట్టి, ఫిబ్రవరి మొదటి వారం కల్లా ఒక్కో సబ్జెక్టులో 12 సెట్ల నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. వీటిని ఫిబ్రవరి నెలాఖరుకు ఎంపిక చేసిన ప్రింటింగ్ ప్రెస్‌కు పంపనున్నారు. మార్చి మొదటి వారం కల్లా పేపర్ ముద్రణ పూర్తి చేసే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. హెచ్‌ఎంలూ అప్రమత్తంకండి టెన్త్ పరీక్షల విషయంలో ప్రధానోపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, మార్పుల విషయంలో విద్యార్థులు గందరగోళానికి గురికాకుండా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ ఏడాది ఆరు పేపర్లతో టెన్త్ పరీక్ష నిర్వహిస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఎస్ఏ–1 పరీక్ష పేపర్ల ముద్రణ పూర్తయ్యాక ఈ నిర్ణయం రావడంతో పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. దీంతో ఎస్ఏ –1 వరకు 11 పేపర్లతో పరీక్ష పెట్టారు. ఫైనల్ పరీక్ష మాత్రం 6 పేపర్లతోనే నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నారు. తర్వాత ప్రశ్నపత్రాల్లో మార్పులతో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కల్పించాలని ఉన్నతాధికారులు సూచించారు. -
అతి తెలివి: తొమ్మిదో తరగతి చదవకుండానే నేరుగా టెన్త్ క్లాస్
సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్‌వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వయసు ఉంటేసరి... పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది. సిలబస్ అంతంతే.. పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం. సుమారు 2.90 లక్షల మంది.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి. పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
రేపు టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్
విడుదల చేయనున్న మంత్రి గంటా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్ పరీక్షలను మార్చి 1వ తేదీనుంచి టెన్త్ పరీక్షలను మార్చి 14వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు షెడ్యూళ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా రెండు రాష్ట్రాల్లో ఒకేసారి పరీక్షలు జరిగేలానే ఏపీలోనూ షెడ్యూల్ ఉంటుందని అధికారవర్గాలు పేర్కొంటున్నారుు. మరోవైపు ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్‌ను జంబ్లింగ్‌లో నిర్వహించాలని ప్రభుత్వం ముందు భావించినా ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌లో నియమించాలని భావిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ప్రాక్టికల్స్ జంబ్లింగ్‌లో ఉంటాయని ఇంటర్ బోర్డు ఉత్తర్వులిచ్చింది.