సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్‌వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది.
వయసు ఉంటేసరి...
పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది.
సిలబస్ అంతంతే..
పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం.
సుమారు 2.90 లక్షల మంది..
గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి.
పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment