కరోనా మూడో దశ ముప్పుకు ఏపీ సర్కార్‌ చెక్‌.. | AP Govt Checks Corona Third Stage Threat | Sakshi
Sakshi News home page

కరోనా మూడో దశ ముప్పుకు ఏపీ సర్కార్‌ చెక్‌..

Published Thu, Feb 24 2022 5:54 PM | Last Updated on Thu, Feb 24 2022 6:13 PM

AP Govt Checks Corona Third Stage Threat - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ కట్టడికి ప్రభుత్వం రచించిన వ్యూహం ఫలించింది. గత డిసెంబర్‌ నుంచే ఫీవర్‌ సర్వేలు, యుద్ధప్రాతిపదికన తొలి డోసు టీకా పంపిణీ చేపట్టడం వంటి చర్యలతో ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ప్రాణనష్టం తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. దీంతో రెండో దశతో పోలిస్తే మూడో దశలో వైరస్‌ ఉధృతికి కళ్లెం పడింది. 

లక్ష్యాన్ని మించి టీకా పంపిణీ..
ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో జిల్లా కలెక్టర్‌లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ యుద్ధప్రాతిపదికన మొదటి డోసు కరోనా టీకా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసిన నాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 87.43 శాతం మందికి తొలి డోసు, 62.19 శాతం మందికి రెండో డోసు టీకా పంపిణీ పూర్తయింది. కట్‌ చేస్తే.. నెల తిరిగే లోపు కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఈ లక్ష్యాన్ని మించి 4.01 కోట్ల మందికి అంటే 101.49 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలి డోసు టీకా పంపిణీ చేసింది.

అదే విధంగా తొలి డోసు వేసుకున్న వారిలో 79.45 శాతం మందికి రెండో డోసు టీకా వేశారు. ఇలా ఇప్పటివరకు 4.05 కోట్ల మందికి తొలి డోసు, 3.80 కోట్ల మందికి రెండు డోసుల టీకా వేశారు. పిల్లలకు (15–18 ఏళ్లు) టీకా పంపిణీలోను ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలంలోనే ఛేదించింది. తద్వారా దేశంలోనే పిల్లలకు టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇప్పటివరకు 25.08 లక్షల మందికి తొలి డోసు, 15.18 లక్షల మంది పిల్లలకు రెండు డోసులు టీకా పంపిణీ పూర్తయింది.  

ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంపు
రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు దూకుడుగా టీకా పంపిణీ చేస్తూనే... మరోవైపు వైరస్‌ నియంత్రణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్, ఇతర వనరులు సమకూర్చడంపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రెండో దశలో ఆక్సిజన్, సాధారణ ఐసీయూ బెడ్స్‌ అన్నీ కలిపి 48,874 అందుబాటులో ఉండగా.. మూడో దశలో 55,649 బెడ్స్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆక్సిజన్‌ కొరత లేకుండా 133 ప్రభుత్వాస్పత్రుల్లో 1,13,708 ఎల్‌పీఎం సామర్థ్యంతో గాలి నుంచి మెడికల్‌ ఆక్సిజన్‌ తయారు చేసే 167 పీఎస్‌ఏ ప్లాంట్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో 24,419 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్‌ సరఫరాను పెంచింది.

ముందు నుంచే జాగ్రత్తలు
కరోనా కట్టడిలో కేంద్రం మార్గదర్శకాలు వెలువడటానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లలో వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో గత డిసెంబర్‌ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు పర్యాయాలు ఫీవర్‌ సర్వే చేపట్టింది. తొలి దశ నుంచి వైరస్‌ నియంత్రణకు ఫీవర్‌ సర్వే ఓ ప్రధాన ఆయుధంగా మారింది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గృహాలు సందర్శించి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టడం చేస్తున్నారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 38 విడతలు సర్వే చేపట్టారు. 

ముందస్తు సన్నద్ధత తోడ్పడింది
మూడో దశ వైరస్‌ వ్యాప్తి కట్టడికి ముందస్తు సన్నద్ధత తోడ్పడింది. రాష్ట్రంలో టీకా వేగవంతంగా పంపిణీ చేయడం కలిసొచ్చింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిపై ఒమిక్రాన్‌ ప్రభావం లేదు. వీరికి వైరస్‌ సోకినా ఆస్పత్రిలో చేరకుండానే సాధారణ, దగ్గు, జలుబు జ్వరం మాదిరి ఇంట్లోనే తగ్గిపోయింది. వైరస్‌ తగ్గినప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం. 
– డాక్టర్‌ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement