Third Wave
-
వృద్ధికి కేంద్రం పెట్టుబడులు కొనసాగుతాయ్
ముంబై: మహమ్మారి కోవిడ్–19 మూడవ వేవ్ తర్వాత తిరిగి ఆర్థిక వృద్ధి ఊపందుకోవడానికి కేంద్ర మూలధన వ్యయాలు కొనసాగుతాయని, ఇందుకు కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ శుక్రవారం పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ కార్యక్రమంలో అన్నారు. పన్నులను తగ్గించడం, ప్రైవేటీకరణ కొనసాగింపు, మొండి బకాయిల సమస్య పరిష్కారానికి ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేయడం, వాటిని నిర్వహించడం, నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను వినియోగంలోకి తేవడం (మానిటైజేషన్ డ్రైవ్) వంటి అనేక చర్యలను ప్రభుత్వం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్యాంకింగ్– నాన్–బ్యాంకింగ్ నుంచి నిధుల సమీకరణ విషయంలో అనిశ్చితి, ప్రైవేట్ రంగ భాగస్వాముల స్పందనలో ఇంకా పురోగతి లేకపోవడం వంటి అంశాల నేపథ్యంలో వృద్ధి లక్ష్యంగా మరో మార్గంలో కేంద్రం మూలధన వ్యయం కొనసాగుతుందని అన్నారు. 2021–22లో కేంద్ర బడ్జెట్ మూలధన వ్యయాల విలువ రూ.6 లక్షల కోట్లయితే, ప్రభుత్వం రూ.5.92 లక్షల మేర ఖర్చు చేసిందని అనంత నాగేశ్వరన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.7.5 లక్షల కోట్లు ఖర్చుచేయగలిగితే ఇది ఎకానమీ పురోగతికి సంబంధించి పెద్ద విజయమే అవుతుందని ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురయినా ఎదుర్కొనడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఇతర దేశాలతో పోల్చితే, భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మెరుగైన స్థితిలో ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణం కట్టడికి (2–6 శాతం శ్రేణిలో) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)తో కలిసి ప్రభుత్వం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని నాగేశ్వరన్ పేర్కొన్నారు. ఎకానమీ పురోగతిలో బ్యాంకింగ్‌ది కీలక పాత్ర అని ఆయన పునరుద్ఘాటించారు. ఈ విషయంలో బ్యాంకింగ్ తగిన సమర్ధవంతనీయమైన పాత్ర పోషిస్తోందని తెలిపారు. రుణాలు మంజూరీలో బ్యాంకింగ్ కొంత అప్రమత్తత అవసరమేనని కూడా అన్నారు. -
దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట. 2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి. ► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ► 2021 ఏప్రిల్‌లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %. ► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్‌లో 10.80 శాతానికి ఎగసింది. ► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్‌లో మరో దఫా రేటు పెంపు! ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది. మేలోనూ పైపైనే... గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్. పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది. ► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం. ► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది. ► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. ►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది. 2021–22లో 8.4 శాతం పురోగతి కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. -
కరోనా మూడో దశ ముప్పుకు ఏపీ సర్కార్ చెక్..
సాక్షి, అమరావతి: కరోనా మూడో దశ కట్టడికి ప్రభుత్వం రచించిన వ్యూహం ఫలించింది. గత డిసెంబర్ నుంచే ఫీవర్ సర్వేలు, యుద్ధప్రాతిపదికన తొలి డోసు టీకా పంపిణీ చేపట్టడం వంటి చర్యలతో ప్రభుత్వం కరోనాను సమర్థంగా ఎదుర్కొంది. ప్రాణనష్టం తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. దీంతో రెండో దశతో పోలిస్తే మూడో దశలో వైరస్ ఉధృతికి కళ్లెం పడింది. లక్ష్యాన్ని మించి టీకా పంపిణీ.. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గతేడాది నవంబర్‌లో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ యుద్ధప్రాతిపదికన మొదటి డోసు కరోనా టీకా పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆదేశాలు జారీ చేసిన నాటికి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారిలో 87.43 శాతం మందికి తొలి డోసు, 62.19 శాతం మందికి రెండో డోసు టీకా పంపిణీ పూర్తయింది. కట్ చేస్తే.. నెల తిరిగే లోపు కేంద్ర ప్రభుత్వం 3.95 కోట్ల మందికి టీకాలు పంపిణీ చేయాలని లక్ష్యం నిర్దేశించగా.. ఈ లక్ష్యాన్ని మించి 4.01 కోట్ల మందికి అంటే 101.49 శాతం మందికి రాష్ట్ర ప్రభుత్వం తొలి డోసు టీకా పంపిణీ చేసింది. అదే విధంగా తొలి డోసు వేసుకున్న వారిలో 79.45 శాతం మందికి రెండో డోసు టీకా వేశారు. ఇలా ఇప్పటివరకు 4.05 కోట్ల మందికి తొలి డోసు, 3.80 కోట్ల మందికి రెండు డోసుల టీకా వేశారు. పిల్లలకు (15–18 ఏళ్లు) టీకా పంపిణీలోను ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. 24.41 లక్షల మందికి టీకా పంపిణీ చేయాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వల్పకాలంలోనే ఛేదించింది. తద్వారా దేశంలోనే పిల్లలకు టీకా పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా ఇప్పటివరకు 25.08 లక్షల మందికి తొలి డోసు, 15.18 లక్షల మంది పిల్లలకు రెండు డోసులు టీకా పంపిణీ పూర్తయింది. ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంపు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు దూకుడుగా టీకా పంపిణీ చేస్తూనే... మరోవైపు వైరస్ నియంత్రణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్, ఇతర వనరులు సమకూర్చడంపైన దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా రెండో దశలో ఆక్సిజన్, సాధారణ ఐసీయూ బెడ్స్ అన్నీ కలిపి 48,874 అందుబాటులో ఉండగా.. మూడో దశలో 55,649 బెడ్స్‌ను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఆక్సిజన్ కొరత లేకుండా 133 ప్రభుత్వాస్పత్రుల్లో 1,13,708 ఎల్పీఎం సామర్థ్యంతో గాలి నుంచి మెడికల్ ఆక్సిజన్ తయారు చేసే 167 పీఎస్ఏ ప్లాంట్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రభుత్వాస్పత్రుల్లో 24,419 పడకలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాను పెంచింది. ముందు నుంచే జాగ్రత్తలు కరోనా కట్టడిలో కేంద్రం మార్గదర్శకాలు వెలువడటానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సంబంధిత దేశాల నుంచి వచ్చిన వారికి విమానాశ్రయాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో వైద్య పరీక్షలు తప్పనిసరి చేసింది. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో గత డిసెంబర్ నుంచి వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు పర్యాయాలు ఫీవర్ సర్వే చేపట్టింది. తొలి దశ నుంచి వైరస్ నియంత్రణకు ఫీవర్ సర్వే ఓ ప్రధాన ఆయుధంగా మారింది. సర్వేలో భాగంగా వైద్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా అన్ని గృహాలు సందర్శించి అనుమానిత లక్షణాలున్న వారిని గుర్తించడం, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేపట్టడం చేస్తున్నారు. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 38 విడతలు సర్వే చేపట్టారు. ముందస్తు సన్నద్ధత తోడ్పడింది మూడో దశ వైరస్ వ్యాప్తి కట్టడికి ముందస్తు సన్నద్ధత తోడ్పడింది. రాష్ట్రంలో టీకా వేగవంతంగా పంపిణీ చేయడం కలిసొచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిపై ఒమిక్రాన్ ప్రభావం లేదు. వీరికి వైరస్ సోకినా ఆస్పత్రిలో చేరకుండానే సాధారణ, దగ్గు, జలుబు జ్వరం మాదిరి ఇంట్లోనే తగ్గిపోయింది. వైరస్ తగ్గినప్పటికీ అప్రమత్తంగానే ఉన్నాం. – డాక్టర్ హైమావతి, ప్రజారోగ్య సంచాలకులు -
కరోనా థర్డ్‌వేవ్: ఆరు వారాల్లోనే ఆగింది.. బాధితుల్లో ఆ వయసువారే అధికం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎవరూ ఊహించని పరిణామం. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సమయం. మొదటి వేవ్, సెకండ్ వేవ్‌ల తరహాలోనే విలయం సృష్టిస్తుందనుకున్న కరోనా థర్డ్ వేవ్ ఆరువారాల్లోనే చాప చుట్టేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, భారీగా నష్టం జరుగుతుందని వార్తలొచ్చాయి. కానీ, నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేదు. మూడో వేవ్ కేవలం 6 వారాల్లోనే అంతమైంది. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎంత ఉధృతంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు భారీగా చర్యలు చేపట్టడంతో నియంత్రణ సాధ్యమైంది. కేసులూ తక్కువే మొదటి, సెకండ్ వేవ్‌లతో పోలిస్తే మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్‌లో రమారమి 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. సెకండ్ వేవ్‌లో సైతం 8 లక్షల కేసులొచ్చాయి. థర్డ్‌వేవ్‌లో ఇప్పటివరకు 2 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో కేసులు అదుపులోకి రావడానికి 10 నెలలు పట్టింది. సెకండ్ వేవ్‌లోనూ నాలుగు మాసాలు పట్టింది. కానీ థర్డ్ వేవ్ ఆరు వారాల్లోనే అదుపులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం వల్లే కేసుల తీవ్రత తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. భయాందోళనలు లేవు థర్డ్ వేవ్‌లోనూ కుర్రాళ్లే ఎక్కువగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల్లో 21–30 ఏళ్ల మధ్య వయస్కులు 26.63 శాతం ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కుర్రాళ్లు థర్డ్‌వేవ్‌లో ఎదురొడ్డి నిలిచినట్టయ్యింది. పైగా ఈసారి భయాందోళనలు కూడా లేవు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో, దీన్నుంచి ఎలా బయట పడాలో అవగాహన ఉండటంతో సులభంగా గట్టెక్కారు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బాధితుల్లో మూడు శాతం మంది మాత్రమే ఆస్పత్రులకు వచ్చినట్టు తేలింది. అదే సెకండ్ వేవ్‌లో 17 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. -
థర్డ్‌వేవ్ నుంచి గట్టెక్కినట్టే
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ నుంచి గట్టెక్కినట్టేనని అధికారులతో పాటు వైద్యనిపుణులూ భావిస్తున్నారు. సెకండ్ వేవ్‌లో ఎంత ఉధృతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరిన వారితో పాటు మృతుల సంఖ్య ఎక్కువే. మొదటి, సెకండ్ వేవ్‌లలో తీవ్ర భయాందోళన సృష్టించిన కరోనా.. థర్డ్ వేవ్‌లో ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపించకపోవడంతో జిల్లాలో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొదటి వేవ్‌లో మొత్తం పాజిటివ్ కేసుల్లో 14.4 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. సెకండ్‌వేవ్‌లో ఈ సంఖ్య 17 శాతానికి పెరిగింది. థర్డ్‌వేవ్‌లో మూడు శాతం వరకు మాత్రమే వెళ్లింది. ఈ నెల మూడో తేదీ నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 9,095గా ఉంది. 12వ తేదీ నాటికి 610 కేసులు మాత్రమే. దీన్ని బట్టి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నదని చెప్పుకోవచ్చు. జిల్లాలో 15 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా శనివారం నాటికి ఒక్క అడ్మిషన్ కూడా కాలేదు. అయినా అప్రమత్తంగానే... మొదటి వేవ్, సెకండ్‌వేవ్‌లతో పోలిస్తే థర్డ్‌వేవ్ ప్రభావం నామమాత్రంగా కూడా లేదనేది తెలిసిందే. అయినా సరే ఏమరుపాటుగా ఉండకూడదని, మరికొన్ని రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రజల్లో కోవిడ్ భయం పోయిందని, వైరస్ ప్రభావం లేదు కదా అని ఇష్టారాజ్యంగా తిరగడం మంచిది కాదని, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు కోవిడ్ నియంత్రణలో భాగంగా హెల్త్‌కేర్ వర్కర్లకు ప్రికాషన్ డోస్, 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోస్, 15–18 ఏళ్లలోపు వారికి ప్రత్యేక టీకా డ్రైవ్ కొనసాగుతూనే ఉంది. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్‌కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
Anand Mahindra: మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది
సామాజిక అంశాలపై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈసారి వర్క్ ఫ్రం హోంపై స్పందించారు. 2020 మార్చి 24న లాక్డౌన్ విధించింది మొదలు వర్క్ కల్చర్ అంతా మారిపోయింది. ఒకాదిన వెంట ఒకటిగా కరోనా వేవ్స్ వస్తుండటంతో వర్క్ ఫ్రం హోంకి తెర పడలేదు. ఉద్యోగులు లేక ఆఫీసులు వెలవెలబోయాయి. తాజాగా ఒమిక్రాన్‌తో వచ్చిన థర్డ్ వేవ్‌తో మరోసారి ఉద్యోగులు ఆఫీసులకు రానక్కర్లేది ఇంటి నుంచి పని చేసుకోవచ్చంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. అయితే గతానికి కంటే భిన్నంగా ఈ సారి త్వరగా కోవిడ్ వేవ్ ముగిసి పోయింది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రావాలంటూ ప్రభుత్వాలు ఆదేశించాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులతో కళకళాడుతున్న కార్యాలయానికి సంబంధించి వార్తను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. మిమ్మల్ని ఇలా చూస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన. Hello normal life. It’s good to see you again… pic.twitter.com/OKgIfIAw7P — anand mahindra (@anandmahindra) February 7, 2022 -
అతి తెలివి: తొమ్మిదో తరగతి చదవకుండానే నేరుగా టెన్త్ క్లాస్
సాక్షి హైదరాబాద్: కోవిడ్ నేపథ్యంలో పదో తరగతి గండం నుంచి సునాయాసంగా గట్టెక్కించేందుకు కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పడరాని పాట్లు పడుతున్నారు. వరుసగా రెండు పర్యాయాలు పరీక్షలు నిర్వహించకుండానే పదో తరగతిలో మొత్తం విద్యార్థులను ప్రభుత్వం పాస్ చేసింది. ఈసారి కూడా థర్డ్‌వేవ్ నేపథ్యంలో పాత పరిస్థితులు పునరావృతం కావచ్చని తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి తమ పిల్లలను తొమ్మిదో తరగతి చదివించకుండానే పదో తరగతిలో కూర్చోబెట్టడంలో సఫలీకృతులయ్యారు. ఏకంగా పరీక్ష ఫీజులు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రైవేటు యాజమాన్యాల తోడ్పాటుకు కూడా కలిసివస్తోంది. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా సులభమైన ప్రశ్నలతో పాటు జవాబు పత్రాల మూల్యాంకనం కూడా అంతా కఠినంగా ఉండబోదన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. వయసు ఉంటేసరి... పదో తరగతి పరీక్షలకు 14 ఏళ్ల వయసు తప్పనిసరి. ఈ వయసు పిల్లలను ఏకంగా పదో తరగతిలో పరీక్షకు సిద్ధం చేయడం విస్మయానికి గురిచేస్తోంది. తల్లిదండ్రుల విజ్ఞప్తుల మేరకు కొన్ని పేరొందిన ప్రైవేటు పాఠశాలలు సైతం అక్రమ పదోన్నతులకు తెరలేపాయి. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీగానే వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. పాత రెగ్యులర్ విద్యార్థులను పదోన్నతులు కల్పించడమే కాకుండా ఇతర పాఠశాల విద్యార్థులను సైతం చేర్చుకొని పదో తరగతి పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. టెన్త్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల 14 వరకు ఉండగా ఇప్పటికే అక్రమంగా పదోన్నతి పొందిన విద్యార్థులు ఫీజులు చెల్లింపు ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంత వయసు తక్కువగా ఉన్న వారి పుట్టిన తేదీల్లో మార్పు చేసి పరీక్షల ఫీజులు చెల్లింపులకు చేస్తున్నట్లు సమాచారం. కాగా.. వచ్చే విద్యాసంవత్సరం నుంచి వయసులో మరో రెండేళ్ల సడలింపు అమలు కానుంది. సిలబస్ అంతంతే.. పదో తరగతి సిలబస్ అంతంత మాత్రంగా మారింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్‌లతో ప్రత్యక్ష తరగతులు ఆలస్యంగా మొదలవ్వడంతో సిలబస్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఇప్పటి వరకు 50 శాతం సిలబస్ మించలేదు. సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమైనా.. ప్రత్యక్ష బోధన అంతంతగా తయారైంది.సైన్స్, లెక్కలు, సోషల్ స్టడీస్‌లో ముఖ్యమైన చాప్టర్లతో పాటు రివిజన్ పూర్తయితేనే విద్యార్థులకు పరీక్షలు తేలికగా ఉంటాయి. జంపింగ్ చేసిన విద్యార్థులకు మాత్రం అంత సులభం కాదన్నట్లు సమాచారం. సుమారు 2.90 లక్షల మంది.. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు హైస్కూళ్లలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారు 2.90 లక్షల మంది పదో తరగతి చదువుతున్నట్లు అధికార లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో తొమ్మిదో తరగతి చదవకుండానే పదో తరగతి చదువుతున్న విద్యార్థులు 10 శాతం వరకు ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గత రెండు పర్యాయాల నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రద్దవుతూ వస్తున్నాయి. పరీక్షలు రాయకున్నా కేవలం పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ ఫార్మెటివ్ పరీక్షల ఆధారంగా పాస్ చేస్తూ వస్తున్నారు. ఈసారి కూడా కరోనా థర్డ్‌వేవ్ కొనసాగుతుండటంతో పాత పరిస్థితులకు అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నపత్రాలు సులభంగా వచ్చే అవకాశముందన్న ప్రచారం సాగుతోంది. దీంతో కరోనా కష్టకాలంలోనే తమ పిల్లలను టెన్త్ గట్టెక్కించాలన్న తల్లిదండ్రులు ప్రయత్నించడం ప్రైవేటు యాజమాన్యాలు తోడ్పాటు అందిస్తుండటంతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు తెలుస్తోంది. -
గేట్ పోస్ట్‌పోన్.. కుదరదు: సుప్రీం కోర్టు
గేట్ పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. పరీక్ష నిలుపుదలకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ.. యధాతధంగా పరీక్ష నిర్వహణ ఉంటుందని గురువారం తీర్పు వెలువరించింది. పరీక్షకు 48 గంటల ముందు గేట్ ఎగ్జామ్‌ను పోస్ట్‌పోన్ చేయడం ద్వారా విద్యార్థుల్లో ఆందోళన, అనిశ్చితి నెలకొంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది. దేశంలో ఇప్పుడు ప్రతీది తెరుచుకుంటోంది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే సాధారణం అవుతున్నాయి. ఇలాంటి టైంలో విద్యార్థుల కెరీర్‌తో ఆడుకోలేం. ఇది అకడమిక్ పాలసీకి సంబంధించింది. పర్యవేక్షించాల్సింది వాళ్లు.. మేం కాదు. ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించింది బెంచ్. కొవిడ్-19 థర్డ్‌వేవ్ తరుణంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా గేట్‌ను వాయిదా వేయాలంటూ అభ్యర్థనల మేర పిటిషన్ దాఖలు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రెండు పిటిషన్లు దాఖలు కాగా..అందులో ఒకటి అభ్యర్థుల తరపున దాఖలైంది. పిటిషనర్ల తరపున పల్లవ్ మోంగియా, సత్పల్ సింగ్ వాదనలు వినిపించారు. కాగా, సుప్రీం కోర్టు తాజా ఆదేశాలతో ఫిబ్రవరి 5, 6, 12, 13 తేదీల్లో యధాతధంగా గేట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. -
రోజుకు 250 టన్నుల ఆక్సిజన్
సాక్షి, అమరావతి: కరోనా థర్డ్‌వేవ్ వేగంగా విస్తరిస్తున్న వేళ తగినంత ఆక్సిజన్ అందుబాటులో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీసిటీలో నోవా ఎయిర్ మెడికల్ ఆక్సిజన్ యూనిట్ ఉత్పత్తికి సిద్ధమయ్యింది. త్వరలో దీనిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రికార్డు స్థాయిలో నిర్మాణం ప్రారంభించిన 12 నెలల్లోనే ఈ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాయువుల తయారీ కంపెనీ నోవా ఎయిర్ టెక్నాలజీ.. ఒకపక్క కోవిడ్ ఇబ్బందులు వెంటాడుతున్నప్పటికీ 2020 డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించి 2021 నవంబర్‌కి పూర్తిచేసింది. ప్రయోగ పరీక్షలు విజయవంతం కావడంతో వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. రోజుకు 250 టన్నుల మెడికల్ ఆక్సిజన్, లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్‌ను ఉత్పత్తి చేసేవిధంగా ఈ యూనిట్‌ను రూ.106 కోట్లతో ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా 150 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. హాంకాంగ్‌కు చెందిన అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పీఏజీ నోవా ఎయిర్ టెక్నాలజీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక వాయువులను ఉత్పత్తి చేస్తోంది. పీఏజీ నిర్వహిస్తున్న ఆస్తుల విలువ రూ.3,37,500 కోట్లకుపైగా ఉండగా, ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రూ.22,500 కోట్ల విలువైన పారిశ్రామిక వాయువుల వ్యాపారం చేస్తోంది. ఈ సంస్థ రాష్ట్రంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి 2020 జనవరి 24న ఒప్పందం కుదుర్చుకుంది. -
భారత్‌లో థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే.. కారణమిదే!
న్యూఢిల్లీ: గతేడాది దేశాన్ని కుదిపేసిన కరోనా సెకండ్‌వేవ్‌తో పోలిస్తే ప్రస్తుత థర్డ్ వేవ్ వల్ల మరణాలు, ఆస్పత్రిపాలవడం తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ అభిప్రాయపడింది. ప్రస్తుత వేవ్‌లో కేసులు పెరుగుతున్నా, వ్యాక్సినేషన్ కార్యక్రమం స్పీడందుకోవడంతో భారీగా అనారోగ్యాలపాలవడం, చావులు పెరగడం కనిపించడంలేదని తెలిపింది. ఈ మేరకు రెండు, మూడు వేవ్స్‌ను పోల్చిచెప్పే కీలక సూచీలను కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియా సమావేశంలో గురువారం ప్రదర్శించారు. దేశంలో 2021 ఏప్రిల్ చివరకు 3.86 లక్షల కొత్త కేసులు, 3,059 మరణాలు, 31.70 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఆ సమయంలో దేశంలో రెండు డోసుల టీకా తీసుకున్నవారి సంఖ్య మొత్తం జనాభాలో 2 శాతమని చెప్పారు. 2022 జనవరి 20న దేశంలో 3.17 లక్షల కొత్త కేసులు, 380 మరణాలు, 19.24 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని, ఈ సమయానికి పూర్తిడోసులందుకున్న వారి సంఖ్య 72 శాతానికి చేరిందని వివరించారు. టీకా కార్యక్రమం వల్ల థర్డ్ వేవ్‌లో మరణాలు తగ్గాయన్నారు. 18ఏళ్లకు పైబడినవారిలో 72 శాతం మంది రెండు డోసులు, 94 శాతం మంది తొలిడోసు అందుకున్నారని చెప్పారు. 15– 18 ఏళ్ల కేటగిరీ ప్రజల్లో 52 శాతం మంది తొలిడోసు టీకా తీసుకున్నారన్నారు. ఈ కేటగిరీలో టీకాలందుకున్నవారిలో ఏపీ టాప్‌లో ఉందని చెప్పారు. -
కరోనాపై ‘మూడో పోరు’కు సిద్ధం
గజ్వేల్: కరోనా మూడో వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల టెస్టింగ్ కిట్లు, కోటి హోం ఐసోలేషన్ కిట్లు అందుబాటులో ఉంచామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షల తీరు, సాధారణ ఓపీ సేవలు, ప్రసూతి సేవల తీరును పరిశీలించారు. ఆక్సిజన్ ప్లాంట్ వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరోనా సోకితే భయాందోళనకు గురికావద్దని, సబ్‌సెంటర్ స్థాయి నుంచి పీహెచ్‌సీలు, అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఎప్పటికప్పుడు పరీక్షలు చేయడంతోపాటు హోం ఐసోలేషన్ కిట్లు కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు. సిద్దిపేట మెడికల్ కళాశాలలో వంద పడకలతో కరోనా వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశామని, వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా సాగుతోందన్నారు. 60 ఏళ్లు పైబడినవారు బూస్టర్‌డోస్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కేసీఆర్ కిట్ కార్యక్రమంతో ప్రభుత్వాసుపత్రుల్లో 22 శాతం మేర ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో వైద్యసేవల తీరు బాగుందని ప్రశంసించారు. ఈ ఆస్పత్రిలో నెలకు 400కుపైగా డెలివరీలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ రోజాశర్మ ‘గడా’ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు అలర్ట్
అంతర్జాతీయ విమాన సర్వీసులపై తాజాగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కేసులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దును పొడిగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని Directorate General of Civil Aviation తెలిపింది. అయితే ఎయిర్ బబూల్ ఆరేంజ్మెంట్స్ విమానాలకు ఈ కొత్త రెగ్యులేషన్స్ వర్తించవు. డీజీసీఏ అప్రూవ్ చేసిన విమానాలకు, అంతర్జాతీయ కార్గో ఆపరేషన్లకు ఈ ఆంక్షలు వర్తించబోవని సివిల్ ఏవిషేయన్ జనరల్ డైరెక్టర్ నీరజ్ కుమార్ ఒక సర్క్యులర్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ నేపథ్యంలో 2021 డిసెంబర్ 9న అంతర్జాతీయ విమాన సర్వీసులపై డిసెంబర్ 31వ తేదీ వరకు డీజీసీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అంతకు ముందు మార్చి 29, 2020 కరోనా టైం నుంచి చాలావరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు చాలా వరకు రద్దు అయ్యాయి. కాకపోతే వందేమాతం మిషన్ లాంటి కొన్ని సర్వీసులను ‘ఎయిర్ బబూల్’ అరేంజ్మెంట్స్తో ఎంపిక చేసిన దేశాలకు జులై 2020 వరకు నడిపించారు. యూఎస్, యూకే, యూఏఈ, భూటాన్, ఫ్రాన్స్‌తో పాటు మొత్తం 32 దేశాలకు ఎయిర్బబూల్ అగ్రిమెంట్ ద్వారా విమానాలు నడిపిస్తోంది భారత్. pic.twitter.com/5KCcDlZHMX — DGCA (@DGCAIndia) January 19, 2022 పునరుద్ధరణపై వెనక్కి.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పెరగడం, కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో నవంబరు 26న సివిల్ ఏవియేషన్ శాఖ అంతర్జాతీయ విమానాలన్నింటిని పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించింది. కరోనాకు ముందు తరహాలోనే 2021 డిసెంబరు 15 నుంచి అన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. అయితే ఇంతలోనే వేరియెంట్లు, కేసులు పెరగడంతో ఆ నిర్ణయం వాయిదా వేసుకుంది. -
విజయవాడ రైల్వే డివిజన్లో కరోనా కలకలం
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): కరోనా మూడో వేవ్ విజయవాడ రైల్వే డివిజన్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఒక్క రోజులోనే 104 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో 50 మంది మెయిల్, ప్యాసింజర్, గూడ్స్ లోకో పైలట్లు, 49 మంది అసిస్టెంట్ లోకో పైలట్లు ఉన్నారు. కరోనా సోకిన వారిని అధికారులు క్వారంటైన్‌కు పంపారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో లోకో పైలట్లు, అసిస్టెంట్ పైలట్లు కరోనా బారిన పడటంతో సిబ్బంది కొరత ఏర్పడింది. దీంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పలు గూడ్స్, ప్యాసింజర్ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల రద్దు తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా మచిలీపట్నం–సికింద్రాబాద్‌ల మధ్య ప్రకటించిన ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మచిలీపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్ల(07577/07578)ను ఈ నెల 23, 30 తేదీల్లో రద్దు చేశారు. కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాకినాడ టౌన్–లింగంపల్లి మధ్య 8 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రత్యేక రైలు(07295) ఈ నెల 24, 26, 28, 31 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు కాకినాడ టౌన్లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07296) ఈ నెల 25, 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో సాయంత్రం 4.40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. రెండు మార్గాల్లో ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఆగుతాయి. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాదీ కష్టకాలమే
ముంబై: కరోనా వచ్చిన దగ్గర్నుంచి విమానయాన రంగం (ఎయిర్‌లైన్స్) కోలుకోకుండా ఉంది. కరోనా మూడో విడత రూపంలో విస్తరిస్తూ ఉండడం, పెరిగిన ఇంధన (ఏటీఎఫ్) ధరలు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొత్తం మీద ఎయిర్‌లైన్స్‌కు రూ.20,000 కోట్ల నష్టాలు రావచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2021–21)లోనూ ఎయిర్‌లైన్స్ సంస్థలు రూ.13,853 కోట్ల నష్టాలను మూటగట్టుకున్నాయి. వీటితో పోలిస్తే నష్టాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 44 శాతం మేర పెరగనున్నాయని క్రిసిల్ నివేదిక పేర్కొంది. దీంతో ఈ రంగం కోలుకోవడానికి మరింత సమయం పట్టొచ్చని అంచనా వేసింది. 2022–23 ఆర్థిక సంత్సరం తర్వాతే రికవరీ ఉండొచ్చని పేర్కొంది. దేశీయంగా 75 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ఇండియా గణాంకాల ఆధారంగా క్రిసిల్ ఈ నివేదికను రూపొందించింది. దేశీయ మార్కెట్ కోలుకుంది.. కరోనా మహమ్మారి దెబ్బకు 2020లో విమాన సర్వీసులు దేశీయంగా చాలా పరిమితంగా నడిచాయి. 2021 డిసెంబర్ నాటికి కానీ ప్రయాణికుల రద్దీ కోలుకోలేదు. కరోనా పూర్వపు నాటి గణాంకాలతో పోలిస్తే 86 శాతానికి పుంజుకుంది. కానీ మరో విడత కరోనా ఉధృతితో 2022 జనవరి మొదటి వారంలో 25 శాతం రద్దీ తగ్గిపోయినట్టు క్రిసిల్ తెలిపింది. కరోనా రెండో విడతలో 2021 ఏప్రిల్–మే నెలలోనూ ఇదే మాదిరి 25 శాతం మేర క్షీణత నమోదైనట్టు గుర్తు చేసింది. అంతర్జాతీయ రెగ్యులర్ విమాన సర్వీసులు ఈ ఏడాది జనవరి తర్వాతే ప్రారంభం కావచ్చని క్రిసిల్ పేర్కొంది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ (విమానంలో ప్రయాణికుల భర్తీ) 2021 మే నెలలో 50 శాతంగా ఉండగా.. 2021 డిసెంబర్ నాటికి 80 శాతానికి పెరిగింది. ఆరు నెలల్లో రూ.11,323 కోట్ల నష్టం ‘మూడు ప్రధాన ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే (2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) రూ.11,323 కోట్ల నష్టాలను నమోదు చేశాయి. కాకపోతే దేశీయ విమాన సర్వీసులు బాగా పుంజుకోవడంతో మూడో త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) మెరుగైన ఆదాయం కొంత వరకు నష్టాలను సర్దుబాటు చేసుకునేందుకు మద్దతుగా నిలిచాయి. కానీ, కరోనా మూడో విడత కారణంగా వచ్చిన ఆంక్షల ప్రభావంతో నాలుగో త్రైమాసికంలో (2021 జనవరి–మార్చి) నష్టాలు గణనీయంగా పెరగనున్నాయి. దీంతో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎయిర్‌లైన్స్ భారీ నష్టాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం’ అని క్రిసిల్ డైరెక్టర్ నితేశ్ జైన్ తెలిపారు. ఏటీఎఫ్ ధర 2021 నవంబర్‌లో లీటర్‌కు గరిష్టంగా రూ.83కు చేరింది. 2020–21లో సగటు ఏటీఎఫ్ ధర లీటర్‌కు రూ.44గానే ఉంది. ఇంధన ధరలు రెట్టింపు కావడం, ట్రాఫిక్ తగ్గడం నష్టాలు పెరిగేందుకు కారణంగా క్రిసిల్ వివరించింది. దీంతో ఎయిర్‌లైన్స్ రుణ భారం కూడా పెరిగిపోతుందని అంచనా వేసింది. -
దేశంలో కరోనా థర్డ్ వేవ్ టెన్షన్
-
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సీతారామన్ సన్నద్ధం!
ముంబై: కోవిడ్–19 మూడవ వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రానున్న వార్షిక బడ్జెట్లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ► కన్సాలిడేటెడ్ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో 11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు. ► 2022–23లో కన్సాలిటేడెడ్ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు. ► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది. ► కొత్త బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. ► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం. ► పన్ను, పన్ను యేతర ఆదాయాలు 2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్ లక్ష్యాలను అధిగమించే వీలుంది. ► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్ బేస్) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యలోటు ధోరణి ఇది... కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
కిరాణ సరుకుల అమ్మకాలపై భారీ దెబ్బ!
కరోనా కేసుల విజృంభణ భారత్‌లో మొదలైంది. థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. ఆంక్షలు, కర్ఫ్యూలు, వీకెండ్ లాక్డౌన్లతో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి చర్యలు మొదలయ్యాయి. ఈ తరుణంలో నిత్యావసరాల అమ్మకాలపై భారీ దెబ్బ పడుతోంది. వ్యాక్సినేషన్ ఉధృతంగా కొనసాగడం, మరోవైపు కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్న జోష్.. ప్రొడక్టివిటీ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది. దీంతో నిత్యావసర సరుకులతో పాటు డ్రై ఫ్రూట్స్ వ్యాపారం అద్భుతంగా జరగొచ్చని భావించారు. అక్టోబర్ నుంచి పెరిగిన కిరాణ వస్తువుల అమ్మకాలు.. డిసెంబర్ మధ్యకల్లా తారాస్థాయికి చేరింది. దీనికి తోడు పెళ్లి, పండుగ సీజనులు వస్తుండడంతో కలిసొస్తుందని వ్యాపారులు అనుకున్నారు. అయితే ఊహించని రీతిలో ఒమిక్రాన్ వేరియెంట్, కరోనా కేసుల పెరుగుదల దేశవ్యాప్తంగా నిత్యావసరాల అమ్మకాలను దెబ్బ కొడుతున్నాయి. నో సప్లయ్ నిత్యావసర దుకాణాల అమ్మకాల జోరుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కొవిడ్ ఆంక్షలతో హోల్ సేల్ నుంచి కిందిస్థాయి దుకాణాలకు, చిన్నచిన్న మార్ట్‌లకు సరుకులు చేరడం లేదు. మరోవైపు కఠిన ఆంక్షలతో వాహనాల రాక ఆలస్యమవుతోంది. హోల్‌సేల్ షాపుల నుంచి చిన్న చిన్న కిరాణ కొట్టుల దాకా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్ల నుంచి కిందిస్థాయి మార్కెట్లకు డిమాండ్‌కు తగ్గ సప్లయ్ ఉండడం లేదు. ఇంకోవైపు దుకాణాల ముందు జనాలు.. క్యూలు కట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిణామాలతో అధిక ధరలకు అమ్మకాలు కొనసాగుతున్నాయి చాలా చోట్ల. అయితే హోల్‌సేల్ రవాణాకు అనుమతులు లభించడం, ఆంక్షలపై స్వల్ఫ ఊరట ద్వారా ఈ సమస్య గట్టెక్కొచ్చని భావిస్తున్నారు. ఫ్రెష్ సరుకు రవాణాకి అంతరాయం ఏర్పడడంతో చాలాచోట్ల కొన్ని ఉత్పత్తుల మీద అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. అయితే కొందరు వ్యాపారులు మాత్రం ఎక్స్పెయిర్ అయిన ప్రొడక్టులను అలాగే అమ్మేస్తున్నారు. హోల్‌సేల్, చిన్ని చిన్న దుకాణాల్లో అయితే అవేం చూడకుండా కొనేస్తున్నారు వినియోగదారులు. కాబట్టి, జాగ్రత్తగా ఉండాలని, ఎక్స్‌పెయిరీ వగైరా వివరాల్ని ఒకసారి చెక్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ-కామర్స్ మినహాయింపు అయితే మెట్రో సిటీ, సిటీ, అర్బన్, టౌన్లలో ఆన్లైన్ షాపింగ్ పెరిగింది. ఈ-కామర్స్, ఆన్లైన్ గ్రాసరీ యాప్‌ల ద్వారా డోర్ డెలివరీలు నడుస్తున్నాయి. పనిలో పనిగా డెలివరీ ఛార్జీలపై అదనపు బాదుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరి దాకా ఇదే పరిస్థితి కొనసాగవచ్చనే అంచనా వేస్తున్నారు. సంబంధిత వార్త: షాపుల ముందు తగ్గుతున్న ‘క్యూ’లు.. జోరందుకున్న ఆన్లైన్ ఆర్డర్లు -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇక అవసరమైతేనే ఆఫీస్‌కి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్ ఫ్రమ్ హోమ్/డబ్ల్యూఎఫ్‌హెచ్) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అత్యవసరమైతేనే ఆఫీసుకు.. ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మాలిక్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్ వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. ప్రాంతాల వారీగా విధానం.. చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. హైదరాబాద్‌లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు. ఉద్యోగులకు టీకా క్యాంపులు ‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్ విధానంలో హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజేష్ ఉప్పల్ తెలిపారు. స్టార్టప్‌లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్ అయితే ఉద్యోగులకు హెల్త్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్‌లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించింది. సంబంధిత వార్త: డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
కరోనాని ఎదుర్కొనేందుకు అత్యధునిక టెక్నాలజీ
-
భారత్‌లో థర్డ్‌వేవ్.. మొదటి వారంలో ఆర్– వాల్యూ 4.. ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు
న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా వ్యాప్తిపై ఐఐటీ మద్రాస్ తాజాగా అధ్యయనం నిర్వహించింది. కరోనా వ్యాప్తికి సంకేతంగా నిలిచే ఆర్ నాట్ విలువ జనవరి మొదటి వారంలో 4కి చేరుకుందని తాము చేసిన ప్రాథమిక విశ్లేషణలో వెల్లడైందని తెలిపింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఫిబ్రవరి 1–15 మధ్య తారాస్థాయికి చేరుకుంటుందని అంచనా వేసింది. వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్ నాట్ వాల్యూ లేదంటే ఆర్ఒ అని పిలుస్తారు. ఈ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటేనే మనం సురక్షితంగా ఉన్నట్టు లెక్క. డెల్టా వేరియెంట్ ప్రబలి కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేసిన సమయంలో కూడా ఆర్ నాట్ వాల్యూ 1.69 దాటలేదు. అలాంటిది ఒమిక్రాన్ వేరియెంట్ విజృంభిస్తున్న వేళ డిసెంబర్ 25–31 తేదీల్లో ఆర్ నాట్ వాల్యూ 2.9 ఉంటే, జనవరి 1–6 తేదీల మధ్య అది ఏకంగా 4కి చేరుకోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కంప్యూటేషనల్ మోడల్లో ఐఐటీ మద్రాస్ కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని విశ్లేషించింది. ఈ వివరాలను డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జయంత్ ఝా శనివారం వెల్లడించారు. వైరస్ వ్యాప్తికి గల అవకాశం, కాంటాక్ట్ రేటు, వైరస్ సోకడానికి పట్టే సమయం వంటివన్నీ పరిగణనలోకి తీసుకొని ఆర్ నాట్ వాల్యూని అంచనా వేస్తారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు అమల్లోకి రావడంతో కాంటాక్ట్ రేటు తగ్గి ఆర్ఒ విలువ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని జయంత్ ఝా చెప్పారు. గత రెండు వారాల్లో కేసులు ప్రబలే తీరుపైనే తాము ప్రాథమికంగా విశ్లేషించామని, కోవిడ్‌ని అరికట్టడానికి తీసుకునే చర్యలను బట్టి ఆర్ వాల్యూ మారవచ్చునని జయంత్ తెలిపారు. ఫిబ్రవరి 1–15 మధ్య దేశంలో కేసులు ఉధృతరూపం దాలుస్తాయని, గతంలో కుదిపేసిన వేవ్‌ల కంటే ఈ సారి కేసులు భారీగా పెరుగుతాయని అంచనా వేసినట్టు వివరించారు. 2 కోట్ల మంది బాలలకు మొదటి డోసు టీకా ఈ నెల 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల గ్రూపు బాలబాలికలకు కోసం ప్రారంభించిన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పైగా టీకా వేసినట్లు కేంద్రం వెల్లడించింది. గత 24 గంటల్లో వేసిన 90,59,360 డోసులతో కలుపుకుని శనివారం రాత్రి 7 గంటల సమయానికి ఇప్పటి వరకు అర్హులందరికీ వేసిన మొత్తం డోసుల సంఖ్య 150.61 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ తెలిపారు. దేశంలోని అర్హులైన వారిలో 91% మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 66% మందికి టీకా రెండు డోసులూ పూర్తయినట్లు పేర్కొన్నారు. -
ఒమిక్రాన్‌పై పోరులో సహకరించండి: కేంద్రం విజ్ఞప్తి
న్యూఢిల్లీ: కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల ప్రతికూల ప్రభావాలకు గురయ్యే రంగాలకు చేయూతను అందించాలని ప్రభుత్వ రంగం బ్యాంకులకు (పీఎస్బీ) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకుల సీఎండీలు, ఎండీలతో ఆమె శుక్రవారం వర్చువల్‌గా ఒక అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కోవిడ్–19 ప్రభావాలను ఎదుర్కొనడంలో వారి సన్నద్ధతను సమీక్షించారు. సవాళ్లను ఎదుర్కొనే వ్యవసాయం, రిటైల్, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ)కు తగిన చేయూతను అందించాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేశారు. సమావేశానికి సంబంధించి ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► మహమ్మారిని ఎదుర్కొనడంలో ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న వివిధ చొరవలను అమలు చేయడంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు తీసుకున్న వివిధ చర్యలను ఆర్థికమంత్రి సమీక్షించారు. అలాగే భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనడంలో సన్నద్ధత గురించి చర్చించారు. ► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీసీ) వల్ల ఒనగూరిన ప్రయోజనాలను ఆమె ప్రస్తావిస్తూ, అయితే ఈ విజయాలపై ఆధారపడి విశ్రాంతి తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదని అన్నారు. కోవిడ్–19 మహమ్మారి నిరంతర దాడి కారణంగా అంతరాయాన్ని ఎదుర్కొంటున్న రంగాలకు మద్దతిచ్చే దిశగా సమష్టి కృషి కొనసాగాలని పిలుపునిచ్చారు. ► అంతర్జాతీయ ప్రతికూలతలు, ఒమిక్రాన్ వ్యాప్తి వంటి అంశాలు ఉన్నప్పటికీ దేశంలో వ్యాపార దృక్పథం క్రమంగా మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ► రిటైల్ రంగంలో వృద్ధి, మొత్తం స్థూల ఆర్థిక అవకాశాల మెరుగుదల, రుణగ్రహీతల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటం వంటి కారణాల నేపథ్యంలో రుణ డిమాండ్ పెరుగుతుందని చెప్పారు. ► 2021 అక్టోబర్‌లో ప్రారంభించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమం కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.61,268 కోట్ల రుణ మంజూరీలు జరిపాయి. ఇక 2020 మేలో ప్రారంభించిన రూ. 4.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం ద్వారా నవంబర్ 2021 నాటికి రూ.2.9 లక్షల కోట్ల (కేటాయింపు నిధుల మొత్తంలో 64.4 శాతం) మంజూరీలు జరిగాయి. ప్రత్యేకించి ఎంఎస్ఎంఈ రంగం ఈ పథకం వల్ల ప్రయోజనం పొందిందన్న గణాంకాలు వెలువడుతున్నాయి. ఈ పథకం వల్ల 13.5 లక్షల చిన్న పరిశ్రమలు ప్రయోజనం పొందాయని, రూ.1.8 లక్షల కోట్ల రుణాలు మొండిబకాయిలుగా మారకుండా రక్షణ పొందాయని, దాదాపు ఆరు కోట్ల మంది కుటుంబాలకు జీవనోపాధి లభించిందని ఆర్థికశాఖ పేర్కొంది. ►ఈసీఎల్జీఎస్ వల్ల ఎకానమీకి భారీ ప్రయోజనాలు కలిగినట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పరిశోధనా నివేదిక తెలిపింది. ఈ పథకం వల్ల దాదాపు 13.5 లక్షల సంస్థలు దివాలా చర్యల నుంచి రక్షణ పొందాయని, ఫలితంగా 1.5 కోట్ల మంది ఉద్యోగాలకు రక్షణ లభించిందని విశ్లేషించింది. ఒక్కొ క్కరి కుటుంబ సభ్యుల సంఖ్య నలుగురిగా భావిస్తే, ఆరు కోట్ల జీవిత అవసరాలకు రుణ హామీ పథకం రక్షణ కల్పించిం దని తెలిపింది. ఈ పథకం వల్ల లబ్ధి పొం దిన రాష్ట్రాల్లో తొలుత గుజరాత్ ఉంది. -
ట్విటర్ ట్రెండ్: డోలో 650 మేనియా
Dolo 650 Twitter Trending: ‘సొంత వైద్యం’.. కరోనా టైంలో ఎక్కువ చర్చకు వచ్చిన అంశం. అయితే ఆరోగ్యానికి అంత మంచిది కాదనే వైద్య నిపుణుల సలహాలను పాటించిన వాళ్లు కొందరైతే.. తమకు తోచింది చేసుకుంటూ పోయినవాళ్లు మరికొందరు!. వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమో, మరేయితర కారణాల వల్లనో ఇంటి వైద్యానికే ఎక్కువ ప్రాధాన్యం లభించింది ఫస్ట్ వేవ్ టైంలో. అదే సమయంలో అల్లోపతి మందులకు ఫుల్ డిమాండ్ నడిచిన విషయమూ చూశాం. మూడో వేవ్ ముప్పు తరుణంలో మళ్లీ ఇప్పుడా పరిస్థితి నెలకొంది. అసలే ఫ్లూ సీజన్. ఆపై కరోనా ఉధృతి. తాజాగా లక్షాయాభై వేలకు కొత్త కేసులు చేరువైన వైనం. కేసులు ఒక్కసారిగా పెరిపోతుండడంతో జనాల్లోనూ ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో జ్వరం, ఇతర ట్యాబెట్లు, సిరప్‌ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. డోలో మాత్రపై ట్విటర్లో సరదా-సీరియస్ కోణంలో కొనసాగుతున్న ట్రెండ్ ఇందుకు నిదర్శనం. డోలో 650 మేనియా.. అవును ఇప్పుడిది ట్విటర్‌ను షేక్ చేస్తోంది. ప్రమోషనో లేదంటే ట్విటర్ యూజర్ల అత్యుత్సాహామో తెలియదుగానీ నిన్నటి నుంచి ట్విటర్లో పోస్టులు పడుతూనే ఉన్నాయి. జలుబు, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, ఒళ్లు నొప్పులు.. ఎలాంటి లక్షణం కనిపించినా డోలో మాత్ర వేసుకుంటే సరిపోతుందని భ్రమలో మునిగిపోయారు చాలామంది. కొవిడ్ టెస్టులకువెళ్లకుండానే ఈ మాత్రతో తగ్గిపోతుందనే ఉద్దేశంతో ఏదో చాక్లెట్ చప్పరించినట్లు డోలో మాత్రల్ని వేసుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. విచ్చిల విడిగా వాడడం మంచిదికాదని.. వాడితే తగ్గిపోతుందని ఎవరికి తోచిన ట్వీట్లు వాళ్లు చేసుకున్నారు. ఈ దెబ్బతో ట్విటర్ టాప్ ట్రెండింగ్‌లో #Dolo650 నడుస్తోంది. అందులో కొన్ని పోస్టులు.. Every Indian during Covid 3rd wave👇😂 Taking Dolo 650#Dolo650 pic.twitter.com/ygNploDihV — சிட்டுகுருவி (@save_sparrow2) January 7, 2022 Dolo 650 has become a joke in this country. I see random people behaving like medical experts & popping pills of Dolo 650 like vitamin tablets. Understand. Medicines have a composition & dosage for a reason. Consult a doctor, before becoming a pseudo doctor yourself.🤦🏻♀️#COVID19 — Santwona Patnaik (@SantwonaPatnaik) January 8, 2022 Indian patient when the doctor doesn't prescribe Dolo 650 😂🤣😂#dolo650 pic.twitter.com/QCFMdA9q0V — JITESH JAIN (@Jitesh_Jain) January 8, 2022 I don't no about theories, but it has zero side effects and cure 100%. Biggest medical Mafia is going on be careful my friend. It's time help people. Homeopathy will cure from roots. And You should have a good doctor. Do you know how paracitamol or dolo 650 damage liver ? — Dr.Venkat (@KiteTrades) January 8, 2022 When chemist gives only one Dolo 650.... Indian nibba : pic.twitter.com/zeRC53hDei — Arush Chaudhary (@ArushGzp) January 7, 2022 ప్రొడక్షన్ పెరిగింది ఫ్లూ సీజన్లో సాధారణంగా ట్యాబెట్లు వాడే జనం, కరోనా ఫియర్‌తో ఈసారి అడ్డగోలుగా మందుల్ని వేసుకుంటున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ టైంలో జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ మాత్రలకు ఫుల్ గిరాకీ నడిచిన విషయం తెలిసిందే. అయితే రెండో వేవ్ సమయానికి వ్యాక్సిన్ రావడంతో ఆ వ్యవహారం కొద్దిగా తగ్గిపోయింది. ఇప్పుడు వ్యాక్సినేషన్ పూర్తైనా కరోనా బారిన పడుతున్నారనే అంశం కలవరపాటుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పాత చిట్కాలను పాటించడంతో పాటు మెడిసిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెరిగిన ఈ డిమాండ్‌ను పసిగట్టి మరోవైపు మందుల కంపెనీలు సైతం ప్రొడక్షన్‌ను పెంచుతున్నాయి. "Dolo 650" i.e. acetaminophen/ paracetamol. Liver injury induced by paracetamol. .. pic.twitter.com/IqXfUiwBYI — Amit 🗨️ (@newindia_in) January 8, 2022 వైద్యుల కీలక ప్రకటన అయితే ‘అన్నింటికి ఒకే మందు’ అంటూ సోషల్ మీడియాలో సాగుతున్న ఈ వ్యవహారాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం ఉన్నప్పుడు.. అవసరం మేరకే వాడాలి. అంతేకానీ ముందు జాగ్రత్త, సొంత ట్రీట్మెంట్ పేరుతో వాడితే సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పైగా అవసరం లేకున్నా వాడడం వల్ల బాడీలో ‘డ్రగ్ రెసిస్టెన్స్’ పెరిగి.. అవసరమైనప్పుడు మందులు పనిచేయకుండా పోతాయని చెప్తున్నారు. ►ఒమిక్రాన్కానీ, ఇంకేదైనా వేరియెంట్‌గానీ కరోనా వైరస్‌ను తేలికగా తీసుకోవద్దు. ►కరోనా అవునో కాదో తెలియకుండా ట్యాబ్లెట్లు వేసుకోవడం మంచిదికాదు. ►ఎవరో ఒకరిద్దరికి తగ్గిందనే భ్రమతో వైద్యుల పర్యవేక్షణ లేకుండా మందులు వాడడం ప్రాణాల మీదకు తెస్తుంది. ►సోషల్ మీడియా ప్రచారాన్ని అస్సలు నమ్మొద్దు.. వైద్యులను నమ్మండి ►లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా కావాలి. జాగ్రత్తలు పాటించాలి. ఆకలి లేకపోవడం, ఛాతీ నొప్పి, ఊపిరి తీసుకోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే టెస్టులు చేయించుకోవడం, ఆసుపత్రికి వెళ్లడం లేదంటే డాక్టర్ సలహాను తీసుకోవడం మంచిది. ►కరోనా సోకినా భయపడాల్సిన అవసరం లేదు. చికిత్సకు మనోధైర్యం తోడైతే కొవిడ్-19 వ్యాధిని అధిగమించొచ్చు. ►అవసరమైతే టెలికాన్సల్టేషన్ ద్వారా కూడా డాక్టర్‌ను సంప్రదించొచ్చు. ►టీకాలతో ఏం ఒరగట్లేదనే ఆలోచన మంచిది కాదు. అవి వ్యాధులనుంచి రక్షణ కలిగిస్తాయి. రోగ నిరోధకశక్తిపై దీర్ఘకాలం పనిచేస్తాయి. కాబట్టి, వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండకూడదు. ►అనుమానంతో పదేపదే కరోనా టెస్టులు చేయించుకుంటూ ఇబ్బంది పడొద్దు. కుటుంబ సభ్యులను కూడా ఇబ్బందులకు గురిచేయొద్దు. ►అన్నింటికి మించి మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శుభ్రత తదితర జాగ్రత్తలతో కరోనాను జయించొచ్చు. -
థర్డ్‌వేవ్ ముంగిట!.. ఊపందుకున్న ఈ-కామర్స్
లక్ష కొత్త కేసుల నమోదుతో భారత్ కరోనా మూడో వేవ్‌లోకి ప్రవేశించిందన్న సంకేతాలు మొదలయ్యాయి. భారీగా పెరిగిపోతున్న కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ భయాందోళనలు, టైం పరిమితుల నడుమ ఫిజికల్ స్టోర్ల ముందు క్యూ కట్టే జనం తగ్గిపోతున్నారు. ఈ క్రమంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో నిత్యావసరాల అమ్మకాలు గత వారం రోజులుగా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచే ఒమిక్రాన్ ఫియర్‌తో పాటు ప్రభుత్వ ఆంక్షలు, వారాంతపు కర్ఫ్యూ-లాక్డౌన్ల నేపథ్యంలో ప్రజలు షాపుల ముందు క్యూ కట్టేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఈ క్రమంలో నిత్యావసరాలు, ప్యాకేజ్డ్ ఫుడ్, సబ్బుల ఇతరత్రాల అమ్మకాలు ఆన్లైన్ ఆర్డర్ల రూపంలో పెరిగిపోతున్నాయి. మరోసారి ప్రభుత్వాల ఆంక్షలతో ఫిజికల్ ఎకానమీ యాక్టివిటీకి అవాంతరం ఎదురుకాగా.. ఈ నష్టాన్ని భర్తీ చేసేందుకు మళ్లీ ఈ-కామర్స్ ఛానెల్స్ ముందుకు వచ్చాయి. అమెజాన్ ఇండియాతో పాటు బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లలో డిమాండ్ ఇప్పటికే మొదలైంది. కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆస్కారం ఉందన్న అనుమానంతో నిల్వలకు సిద్ధపడుతున్నారు మరికొందరు. గత వారంలోనే 10 నుంచి 15 శాతం పెరుగుదల కనిపిస్తోందని ఆయా ప్లాట్‌ఫామ్స్ ప్రకటించుకున్నాయి. ఇక ఈ వారం వ్యవధిలో దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఎక్కువగా డిమాండ్ ఉంటున్న ఉత్పత్తులు చాక్లెట్, శీతల పానీయాలకు సంబంధించినవి కావడం విశేషం. హైజీన్ ఉత్పత్తులు కూడా రెండో వేవ్ ఉధృతి తగ్గాక ఊసే లేకుండా పోయిన హైజీన్ ఉత్పత్తులకు మళ్లీ టైం మొదలైంది. శానిటైజర్లు, హ్యాండ్ వాష్‌లు, క్లీనింగ్ లిక్విడ్స్, డిస్ఇన్ఫెక్టెడ్ సొల్యూషన్స్, ఎన్95 మాస్కులు, ఇతర మాస్కులకు డిమాండ్ మొదలైంది. ఒమిక్రాన్ ఎఫెక్ట్‌తోనే ఈ ఊపు వస్తోందని తయారీ కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లు సప్లయి కోసం ప్రయత్నాలు ప్రారంభించాయి. మెట్రో సిటీ, సిటీ, టౌన్లలో ఆన్లైన్ ఆర్డర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలను, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోకుండా ఈ నివేదికను ఈ-కామర్స్ పోర్టల్స్ వెల్లడించాయని గమనించగలరు. -
ఎకానమీపై ‘థర్డ్‌వేవ్’ ఎఫెక్ట్.. వృద్ధికి గొడ్డలిపెట్టు
ముంబై: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి రేటులో 10 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) ఒమిక్రాన్ వల్ల హరించుకునిపోయే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. జనవరి–మార్చి మధ్య ఈ ప్రతికూలత 0.40 శాతం మేర ఉండే వీలుందని పేర్కొంది. క్యూ4కు సంబంధించి ఇక్రా రేటింగ్స్ అంచనాలకు అనుగుణంగా ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనాలు ఉండడం గమనార్హం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అంచనాలు ఈ విషయంలో 0.3 శాతంగా ఉంది. ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. - మార్కెట్, మార్కెట్ కాంప్లెక్స్‌ల సామర్థ్యాన్ని తగ్గించడం, రవాణా, ప్రయాణ ఆంక్షలు, రాత్రి–వారాంతపు కర్ఫ్యూలు వంటి వివిధ రూపాల్లో నియంత్రణలు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. ఇవి ఆర్థిక కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి. - క్యూ4లో తొలి అంచనాలు 6.1 శాతంకాగా, దీనిని 40 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నాం. దీనితో జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ది 5.7 శాతానికి పరిమితం కానుంది. ఇక 2 0 2 1–22 ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాలను 9.4 శాతం నుంచి 9.3 శాతానికి తగ్గిస్తున్నాం. - కొత్త కేసుల్లో ఎక్కువ భాగం కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్‌గా అనుమానాలు ఉన్నాయి. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. - అయితే ప్రభుత్వాలు, వ్యాపార సంస్థల ముందస్తు చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాల నేపథ్యంలో మొదటి రెండు వేవ్‌లంత తీవ్రత మూడవ వేవ్‌లో ఉండదని భావిస్తున్నాం. బ్యాంకుల రుణ నాణ్యతకు దెబ్బ! - రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విశ్లేషణ - పునర్ వ్యవస్థీకరించిన రుణాలపై ప్రభావం తీవ్రమని అంచనా బ్యాంకుల రుణ నాణ్యతపై కోవిడ్–19 థర్డ్‌వేవ్ ప్రతికూల ప్రభావం పడనుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ– ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. ప్రత్యేకించి ఇప్పటికే పునర్వ్యవస్థీకరించిన రుణాలపై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని విశ్లేషించింది. నివేదికలోని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. మొండిబకాయిలతోపాటు కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ఇబ్బందుల కారణంగా రుణదాతలు లాభదాయకత, దివాలా సంబంధిత సవాళ్లను ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రుణ పునర్ వ్యవస్థీకరణలకు దరఖాస్తులు తక్షణం పరిణామాల ప్రాతిపదిక చూస్తే, 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల మేర (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు 12 నెలల వరకు మారటోరియంతో చాలా వరకూ రుణాలను పునర్వ్యవస్థీకరించాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత మారటోరియం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ4 (జనవరి–మార్చి) నుంచి 2022–23 మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) వరకూ కొనసాగే వీలుంది. మహమ్మారి రెండు వేవ్‌ల సమయంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణగ్రహీతలకు, బ్యాంకులకు ఉపశమనం కలిగించడానికి రిజల్యూషన్ ఫ్రేమ్‌వర్క్ 1.0, 2.0లను ప్రకటించింది. కోవిడ్ 2.0 పథకం కింద పెరిగిన రుణ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2021 సెప్టెంబర్ 30 నాటికి బ్యాంకుల మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ అడ్వాన్స్‌లో (రుణాల్లో) 2.9 శాతానికి పెరిగింది. 2021 జూన్ 30 నాటికి ఇది కేవలం 2 శాతం మాత్రమే కావడం గమనార్హం. తాజా పునర్వ్యవస్థీకరణల అవకాశాల నేపథ్యంలో మొత్తం స్టాండర్డ్ రీస్ట్రక్చర్డ్ లోన్ బుక్ స్టాండర్డ్ రుణాల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్బీఐ ద్రవ్య విధానం మరికొంత కాలం ఇంతే.! - సాధారణ స్థితికి వెంటనే తీసుకురాకపోవచ్చు - కరోనా ఒమిక్రాన్‌తో ఆంక్షల వల్ల అనిశ్చితి - ఆర్థికవేత్తల అంచనా కరోనా మహమ్మారి ప్రవేశించిన తర్వాత ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని ఎంతో సులభతరం చేసి, వ్యవస్థలో లిక్విడిటీ పెంపునకు చర్యలు తీసుకుంది. వృద్ధికి మద్దతే తమ మొదటి ప్రాధాన్యమని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఇప్పటి వరకు చెబుతూ వస్తున్నారు. గత ఆరు నెలల్లో ఆర్థిక పరిస్థితులు పుంజకుంటూ ఉండడం, అంతర్జాతీయంగానూ ఫెడ్, యూరోపియన్ బ్యాంకు తదితర సెంట్రల్ బ్యాంకులు సులభ ద్రవ్య విధానాలను కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ కూడా తన విధానాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుందన్న అంచనాలున్నాయి. కానీ, కరోనా ఒమిక్రాన్ రూపంలో మరో విడత విజృంభిస్తుండడం, లాక్డౌన్లు, పలు రాష్ట్రాల్లో ఆంక్షల అమలు వృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో వృద్ధికి ప్రాధాన్యం ఇచ్చే ఆర్బీఐ పాలసీ సాధారణీకరణను ఇప్పుడప్పుడే చేపట్టకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 50,000ను దాటిపోవడం తెలిసిందే. ఆర్బీఐ సమీప కాలంలో ద్రవ్య విధానాన్ని సాధారణ స్థితికి తీసుకురాకపోవచ్చని హెచ్డీఎఫ్సీ బ్యాంకు ముఖ్య ఆర్థికవేత్త అభిషేక్ బారువా అన్నారు. కనీసం ఫిబ్రవరి సమీక్ష వరకైనా ఇది ఉండకపోవచ్చన్నారు. వృద్ధిపై ప్రభావం పడుతుంది కనుక కీలక రేట్ల పెంపుపై అనిశ్చితి నెలకొందన్నారు. ‘‘ఒమిక్రాన్ కారణంగా ఏర్పడే రిస్క్‌ల నేపథ్యంలో సమీప కాలానికి అనిశ్చితి కొనసాగుతుంది. కనుక ఆర్బీఐ ఎంపీసీ వేచి చూసే విధానాన్ని అనుసరించొచ్చు’’ అని యూబీఎస్ సెక్యూరిటీస్ ముఖ్య ఆర్థికవేత్త తన్వీ గుప్తాజైన్ పేర్కొన్నారు. పెరిగే రిస్క్‌లు వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తాయని, దీంతో ఆర్బీఐ యథాతథ స్థితినే కొనసాగించొచ్చని ఇక్రా రేటింగ్స్ ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ అభిప్రాయపడ్డారు. జనవరి–మార్చి త్రైమాసికంలో వృద్ధి అంచనాలను 0.40 శాతం తగ్గిస్తున్నట్టు (4.5–5శాతం) చెప్పారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి 9 శాతం వృద్ధి రేటునే ఇక్రా కొనసాగించింది. కేంద్రం, రాష్ట్రాల సమన్వయ చర్యలు అవసరం - సీఐఐ సూచన కరోనా ఒమిక్రాన్ రకంతో సాధారణ వ్యాపార కార్యకలాపాలకు విఘాతం కలుగుతుందన్న ఆందోళనల నేపథ్యంలో.. కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సీఐఐ కేంద్రానికి సూచించింది. ‘‘ఒమిక్రాన్‌పై కచ్చితంగానే ఆందోళన ఉంది. అయితే, ఇది వేగంగా విస్తరిస్తున్నా కానీ, ఆరోగ్యంపై ప్రభావం స్వల్పంగానే ఉంటున్న అభిప్రాయం ఉంది’’అని సీఐఐ అధ్యక్షుడు టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు. కనుక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టి చర్యలతో కరోనా వైరస్ మూడో విడత ప్రభావాన్ని తగ్గించొచ్చని అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 2021లో చాలా రంగాలు కోలుకున్నట్టు ఆయన చెప్పారు. ఆతిథ్యం, ప్రయాణం, ఎంఎస్ఎంఈ, కొన్ని సేవల రంగాలు వైరస్ రెండు విడతలతో తీవ్రంగా ప్రభావితమైనట్టు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 9.5 శాతం మేర వృద్ధి సాధిస్తుందని, తదుపరి ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం నమోదు కావచ్చన్నారు. సాగుచట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవడంపై ఎదురైన ప్రశ్నకు నరేంద్రన్ స్పందిస్తూ.. కొన్ని సమయాల్లో కొద్ది కాలం పాటు విరామం ప్రకటించాల్సి రావచ్చని, ప్రభుత్వ చర్య కూడా ఇదే అయి ఉండొచ్చన్నారు. మొత్తం మీద సంస్కరణల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. చదవండి:ఓమిక్రాన్ దెబ్బతో జీడీపీ ఢమాల్..?